Search Here

May 13, 2023

John Berchmans | జాన్ బెర్చ్‌మన్స్

జాన్ బెర్చ్‌మన్స్ గారి జీవిత చరిత్ర



  • జననం : 13-03-1599
  • మరణం : 13-08-1621
  • స్వస్థలం : డైస్ట్
  • దేశం : బెల్జియం
  • దర్శన స్థలము : -


బెల్జియంలోని డైస్ట్‌లో ఒక దైవభక్తి గల కుటుంబములో జన్మించారు జాన్ బెర్చ్‌మన్స్. చిన్నతనంలోనే అతను కలిగియున్న అతి పెద్ద కోరిక తాను ఒక పాదిరి అవ్వాలని. అది భక్తి కలిగిన జీవితాన్ని జీవించుటకు అతనికి ప్రేరణగా నిలిచింది. వేకువనే లేచి కూడికలను నిర్వహించుటలో అక్కడి పాదిరులకు సహాయమందించి తదుపరి పాఠశాలకు వెళ్ళడం ఒక అలవాటుగా అతను అలవరచుకున్నారు. అతని కుటుంబం యొక్క ఆర్ధిక పరిస్థితుల వలన అతను జీతగానిగా పని చేస్తూ తన చదువు కొరకు ధనాన్ని సమకూర్చుకునేవారు.


ఏదేమైనప్పటికీ, 1615వ సంll లో బెల్జియంలోని మాలైన్స్‌లో ఒక జెస్యూట్స్ కళాశాల ప్రారంభించబడగా మతపరమైన విద్యను అభ్యసించుటకు అతనికి అవకాశం కలిగింది. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత అతను పనిచేసి సంపాదించి కుటుంబమును ఆర్థికముగా ఆదుకొనవలెననే తన తండ్రి కోరికకు విరుద్ధముగా 1616వ సంll లో జాన్ 'సొసైటీ ఆఫ్ జీసస్' లో చేరారు. కాగా అతని తండ్రి అతనితో ఇకపై ఒక్క పైసా కూడా నేను నీకు ఇవ్వను అని చెప్పినప్పుడు, “చూడండి తండ్రీ, నేను ధరించిన బట్టలు గనుక నన్ను వెనుకకు లాగుతున్నట్లైతే నేను వాటిని తీసివేసి క్రీస్తును వెంబడిస్తాను...” అని జాన్ సమాధానమిచ్చారు.


1618వ సంll లో సేవచేయుటకు అర్హత పొందిన తరువాత, అతను భక్తి జీవితాన్ని స్వీకరించారు. తదుపరి తత్వశాస్త్రం అధ్యయనం చేయుటకుగాను ఆంట్వెర్ప్ మరియు రోమ్‌లకు వెళ్ళిన అతను, అక్కడ సంఘ పరిచర్యలోనే ఎక్కువ సమయం గడిపేవారు. క్రైస్తవ సంఘములో ఇతరులు చేయుటకు ఇష్టపడని ఎటువంటి సాధారణమైన లేదా చిన్న పని అయినా చేయుటకు జాన్ సిద్ధ మనస్సును కలిగియుండేవారు. "ఒక పనిలోని గొప్పతనం ఆ పని ఎంత గొప్పదని కాదుగానీ, అప్పగింపబడిన పని ఎంత ఉత్తమముగా సంపూర్తి చేయబడినది అనునది" అని అతను చెప్పేవారు.


దయ, దీనత్వం మరియు స్నేహపూర్వక స్వభావం కలిగిన జాన్, కలుపుగోలుగా ఉండే వ్యక్తిత్వంతో ఇతరులకు ప్రియమైనవానిగా అయ్యారు. అతను ఒక ఉత్తమ విద్యార్ధి కావడంతో, బహిరంగ చర్చలో తత్వశాస్త్రమునకు అనుకూలముగా మాటలాడుటకు వక్తగా రోమన్ కళాశాల జాన్‌ను ఎంపిక చేసింది. గ్రీక్ కళాశాలలో జరిగిన మరొక చర్చలో కూడా వక్తగా రోమన్ కళాశాలకు ప్రాతినిధ్యం వహించాలని అతనిని కోరారు. ఈ బహిరంగ చర్చల కొరకు సిద్ధపడుటలో అతని ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. ఆరోగ్యపరంగా రోజురోజుకు క్షీణించిపోయిన అతను, చివరికి 'రోమన్ ఫీవర్' అనే జ్వరం బారిన పడ్డారు. తద్వారా అతని ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. తన చివరి రాత్రిని ప్రార్థనలో గడిపిన జాన్ బెర్చ్‌మన్స్, 22 సంll ల యుక్త వయస్సులో మరణించారు. ప్రేమ నిండిన హృదయముతో సాధారణమైన పనులను చేయడం ద్వారా కూడా ఏవిధముగా దేవునికి సేవ చేయవచ్చునో అతని జీవితం చూపిస్తుంది.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీరు దేవుని కొరకు సాధారణమైన చిన్న పనులను చేయుటలో నమ్మకముగా ఉన్నారా?

ప్రార్థన :

"ప్రభువా, సాధారణమైన చిన్న పనులను కూడా మీ కొరకు అధికమైన ప్రేమతో చేయుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!" 

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • No comments:

    Post a Comment