లూథర్ రైస్ గారి జీవిత చరిత్ర
- జననం : 25-03-1783
- మరణం : 25-09-1836
- స్వస్థలం : నార్త్‌బరో
- దేశం : అమెరికా సంయుక్త రాష్ట్రాలు
- దర్శన స్థలము : అమెరికా సంయుక్త రాష్ట్రాలు
కొంతమంది సువార్తను ప్రకటించుటకు మిషనరీలుగా వెళ్తే, మరికొంతమంది లోకమును సువార్త వెలుగుతో నింపుతున్న వారి సేవకు సహకారమందించుటకు తెర వెనుక ఉండి కృషి చేస్తారు. వారు అందుకున్న పిలుపులో వ్యత్యాసము ఉన్నప్పటికీ, వారందరు కూడా తమ పరలోక యజమానునికి సంపూర్ణ సమర్పణతో సేవ చేశారు. మిషనరీ సేవ కొరకైన బూర శబ్దమును ధ్వనింపజేసి, బాప్తిస్టు సంఘమును మేల్కొల్పిన లూథర్ రైస్, పైన చెప్పబడిన రెండు వర్గాలలో రెండవ కోవకు చెందినవారు. విలియం కేరీ ఆధునిక మిషనరీ ఉద్యమాన్ని ఆవిర్భవింపజేసినప్పుడు, ప్రపంచవ్యాప్తముగా మిషనరీ సేవకు సహకారమందించుటకు తమ స్వరములనెత్తి నిలువబడిన అనేకమందిలో రైస్ కూడా ఒకరు.
జాన్ న్యూటన్ యొక్క సాక్ష్యంతో ప్రేరణ పొందిన రైస్, చాలా చిన్న వయస్సులోనే మిషనరీ పని వైపు ఆకర్షితులయ్యారు. కాగా సేవ చేయుటకు తగిన సిద్ధపాటు కొరకై విలియమ్స్ కళాశాలలో చేరిన అతను, మిషన్ సొసైటీలో క్రియాశీల సభ్యులయ్యారు. కాంగ్రిగేషనలిస్టులు, అనగా క్రైస్తవ సంఘములో నిర్ధిష్టమైన పదవీక్రమాన్ని అనుసరించకుండా సమాజముగా కూడుకునేవారి యొక్క సహకారంతో రైస్, అడోనిరామ్ జడ్సన్ మరియు మరికొందరు భారతదేశానికి పయనమయ్యారు. అక్కడ వారు విలియం కేరీని కలుసుకోవడం జరిగింది. అయితే, కాంగ్రిగేషనలిస్ట్ బోర్డు నుండి తగినంత ఆర్థిక సహకారం లేకపోవడంతో వారు భారతదేశంలో తమ సేవను విరమించుకొనవలసి వచ్చింది. కాగా, ప్రపంచవ్యాప్తముగా సువార్త సేవ జరుగుటలో పాలుపంపులు కలిగియుండవలసిన బాధ్యతను కలిగియున్నామని క్రైస్తవ సంఘముకు గుర్తుచేయవలెనన్న దర్శనముతో అమెరికాకు తిరిగివెళ్ళాలని నిర్ణయించుకున్నారు లూథర్ రైస్.
తన స్వదేశాన్ని చేరుకున్న అతను, మిషనరీ పరిచర్యకు సహకారమందించమని బాప్తిస్టు సంఘములను అభ్యర్థిస్తూ గుఱ్ఱము పై లేదా గుఱ్ఱపు బండిపై వేలకొలది మైళ్ళు ప్రయాణించారు. మిషనరీ సేవ పట్ల ఆసక్తి కనుపరిచిన సంఘములను అతను ఏకీకృతం చేశారు. తత్ఫలితముగా 'జనరల్ మిషనరీ కన్వెన్షన్' లేదా 'ట్రైయెన్నియల్ కన్వెన్షన్' అని పిలువబడే క్రైస్తవ సంఘ వర్గము ఏర్పడింది. ఈ కన్వెన్షన్ విదేశాలలో జరిగే మిషనరీ సేవకు సహకారమందించడమే కాకుండా, దేశీయ మరియు విదేశీ సువార్త సేవకై మిషనరీలను కూడా పంపుతుంది. అంతేకాకుండా, మిషన్ సంస్థలను, సండే స్కూళ్ళను (ఆదివారపు బైబిలు పాఠశాలలు) మరియు బైబిలు సంస్థలను కూడా స్థాపించిన సంచార మిషనరీ లూథర్ రైస్, క్రైస్తవ విద్యాభ్యాసము మరియు సేవ కొరకైన శిక్షణ యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పారు.
రైస్ తన పరిచర్యలో బాధలను మరియు వ్యతిరేకతను కూడా ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, మిషనరీ సేవ కొరకైన ఆవశ్యకతను బట్టి సహకారమందించుటకు అతను కలిగియున్న శ్రద్ధాసక్తులు భారతదేశంతో సహా ఆసియా ఖండములోని అనేక దేశాలలో మిషనరీ సేవ యొక్క ద్వారములు తెరువబడుటకు తోడ్పాటునందించాయి. అమెరికాలో బాప్తిస్టు సంఘముల మధ్య ఇరవై మూడు సంవత్సరాల పాటు అతను చేసిన ఫలవంతమైన పరిచర్య ఫలితముగా ఒక నిర్దిష్ఠ క్రమము లేకుండా దేశమంతటా అస్తవ్యస్తముగా ఉన్న సంఘములు ఏకమై సరియైన క్రమములో ఒక క్రైస్తవ సంఘ వర్గముగా ఏర్పడ్డాయి.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, సువార్త పరిచర్యలో పాలుపంపులు కలిగియుండుటకు ఇతరులను మీరు ఏ విధముగా ప్రోత్సహిస్తున్నారు?
ప్రార్థన :
"ప్రభువా, మిషనరీ సేవ పట్ల శ్రద్ధాసక్తులు కలిగియుండునట్లు మా సంఘమును మరియు కుటుంబమును ప్రేరేపించుటకు నన్ను వాడుకొనుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !
No comments:
Post a Comment