Search Here

May 13, 2023

Richard Allen | రిచర్డ్ అలెన్

రిచర్డ్ అలెన్ గారి జీవిత చరిత్ర


  • జననం : 14-02-1760
  • మరణం : 26-03-1831
  • స్వదేశం : అమెరికా సంయుక్త రాష్ట్రాలు 
  • దర్శన స్థలము : అమెరికా సంయుక్త రాష్ట్రాలు


ఒక బానిసయై యుండి తన యజమానిని క్రీస్తు వద్దకు నడిపించిన రిచర్డ్ అలెన్, తదుపరి 'ఆఫ్రికన్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చి' స్థాపకులు అయ్యారు. బానిసత్వములో జన్మించిన అతను, డెలావేర్ తోట యజమానికి సేవకునిగా పనిచేశారు. ఇతర యజమానులు తమ క్రింద ఉన్న బానిసలను క్రైస్తవ ఆలయమునకు వెళ్ళుటకు అనుమతించకపోయినప్పటికీ, అలెన్ యొక్క యజమాని మాత్రం స్థానిక మెథడిస్ట్ సంఘముకు వెళ్ళుటకు అతనిని ప్రోత్సహించారు. కాగా, అతను క్రీస్తు నందు విశ్వాసములో ఎదిగేకొద్దీ, అతని యొక్క భక్తి జీవితం అతని క్రియలలో కార్యరూపం దాల్చింది. అది అతని యజమానిని మాత్రమే కాదు, ఇతర బానిసల యజమానులను కూడా ఆకట్టుకుంది. 


అలెన్ యొక్క నిజాయితీ, చేసే పనిలో కనుపరిచే నైతిక విలువలు మరియు సత్ప్రవర్తన క్రీస్తుపై అతనికున్న విశ్వాసమునకు నిదర్శనంగా నిలిచాయి. చివరికి అది అతని యజమాని కూడా మారుమనస్సు పొందుటకు కారణమయ్యింది. 22 సంll ల వయస్సులో బానిసత్వము నుండి విడుదల కొరకై క్రయము చెల్లించి స్వేచ్ఛను పొందిన అలెన్, ప్రారంభములో తన కుటుంబమును పోషించుటకై కొన్ని చిన్నపాటి ఉద్యోగాలు చేశారు. అదేసమయంలో మరొకప్రక్క ఒక సంచార మిషనరీగా దేవుని సేవ చేయడం కూడా ప్రారంభించారు. కాగా అతను దక్షిణ కెరొలినా, న్యూయార్క్, పెన్సిల్వేనియా, డెలావేర్ మరియు మేరీల్యాండ్ ప్రదేశములందంతటా పర్యటించి, శ్వేతజాతీయులుకాని ప్రజలకు సువార్తను ప్రకటించారు. అతి త్వరలోనే అతను 'సెయింట్ జార్జ్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చి' లో పరిచర్య చేయడం ప్రారంభించారు. అయితే, నల్లజాతికి చెందిన విశ్వాసులపై క్రైస్తవ సంఘము విధించే ఆంక్షలు మరియు ఆరాధన కూడికలలో కూడా అక్కడ నెలకొన్న జాతి వివక్ష కారణముగా ఒక ఆఫ్రికన్-అమెరికన్ సంఘమును స్థాపించుటకు అలెన్ ప్రేరేపించబడ్డారు. ఈ సంఘము తరువాతి కాలంలో 'ఆఫ్రికన్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చి' గా అభివృద్ధి చెందింది. ప్రమాదకరమైన పరిస్థితులను మరియు చట్టపరమైన సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, అలెన్ యొక్క దర్శనాత్మకమైన పరిచర్యను బట్టి ఆ సంఘము బహుగా విస్తరించింది. కాగా ఈ నాడు ఈ సంఘము 6,000 క్రైస్తవ సంఘములను, 20 లక్షలకు పైగా సంఘ సభ్యులను కలిగి ఉంది.


బానిసత్వ నిర్మూలన కార్యకర్త కూడా అయిన అలెన్, తోటి మానవులను బానిసలుగా చేయడం పాపమని లేఖనభాగములను చూపించి ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. ఇతరులను ఒప్పించగలిగే రీతిలో ఉండే అతని ప్రసంగాలు క్రియాశీలక క్రైస్తవ జీవితాన్ని కలిగియుండుటకు ప్రజలకు సహాయపడేవి. తన భార్యయైన శారా సహకారంతో పారిపోయిన అనేక మంది బానిసలను అలెన్ కాపాడగా, వారు క్రమంగా క్రీస్తులో తమ నిజమైన ఆశ్రయమును కనుగొనగలిగారు. 

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

 ప్రియమైనవారలారా, మీరు పాపపు బానిసత్వం నుండి విముక్తి పొందియుండగా, సువార్తను ప్రకటించడం ద్వారా ఇతరులను కూడా ఆ పాపపు బానిసత్వం నుండి విడిపించవలసిన బాధ్యతను మీరు కలిగియున్నారు కారా? 

ప్రార్థన :

"ప్రభువా, సువార్తను తెలియజేయుట ద్వారా ఇతరులకు విడుదల కలిగించే సాధనముగా ఉండునట్లు నన్ను బలపరచి వాడుకొనుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • No comments:

    Post a Comment