విలియం హంటర్ గారి జీవిత చరిత్ర
- జననం : 1536
- మరణం : 27-03-1555
- స్వస్థలం : బ్రెంట్‌వుడ్
- దేశం : ఇంగ్లాండు
- దర్శన స్థలము : -
దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ... హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది (హెబ్రీ 4:12).
... దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది (2 తిమోతి 3:16,17).
అటువంటి శక్తి గల వాక్యము ఒకప్పుడు ఆదియందున్న దేవుని యొద్ద ఉండెను, మరియు "వాక్యము దేవుడై యుండెను“ అని బైబిలు చెబుతుంది. దేవుని వాక్యమైన బైబిలు సత్యములను తప్పుదోవ పట్టించుటకు ప్రయత్నించిన అధికారులను మరియు ప్రతికూల పరిస్థితులను అనేకమంది దైవజనులు ధైర్యముగా ఎదిరించి నిలబడ్డారు. అటువంటి వారిలో ఒకరే విలియం హంటర్.
సనాతన భక్తిగల కుటుంబములో జన్మించిన విలియం హంటర్‌కు అతని తల్లి బైబిలును ఘనమైనదిగా ఎంచవలెనని నేర్పించారు. తన బాల్యం నుండే దేవుని వాక్యమును ధ్యానించడంలో అతను మిగుల ఆనందించెడివారు. క్రమంగా లేఖనములలోని సత్యాన్ని అర్థం చేసుకున్న అతను, అప్పటి కాథలిక్ సంఘములో ప్రబలమైయున్న తప్పుడు సిద్ధాంతాలను గ్రహించగలిగారు. ఎప్పుడైతే అతను తప్పుడు బోధలను తిరస్కరించారో అతను బెదిరింపులను ఎదుర్కొనడమేకాక, ఉద్యోగం నుండి కూడా తొలగించబడ్డారు.
ఆ రోజులలో పాదిరులు మాత్రమే బైబిలును చదువుటకు వీలు ఉండేది. అయితే ఒక రోజు విలియం ప్రార్థనా మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ బల్ల మీద ఒక బైబిలు ఉండగా, అతను దానిని తీసుకొని చదవడం ప్రారంభించారు. ఒక సామాన్యుడు బైబిలును చదవటం చూసిన పాదిరి కోపోద్రేకుడై విలియంను మందలించి, నీవే స్వయంగా బైబిలును అర్థం చేసుకొనగలవా యని అతనికి సవాలు చేశారు. అందుకు విలియం అది దేవుని పుస్తకమని, దాని ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతాడు అని వినయముతో సమాధానం చెప్పగా, అది ఆ పాదిరికి మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. తత్ఫలితముగా ఆ పాదిరికి మరియు పంతొమ్మిదేళ్ల విలియంకు మధ్య నిజమైన మరియు తప్పుడు సిద్ధాంతాలను గురించిన వాదన ఏర్పడింది. చివరకు ఆ పాదిరి విలియం కలిగియున్న విశ్వాసాలు సరియైనవి కావని నిందించి, అతను తప్పుడు బోధనలను కలిగియున్నాడని అధికారులకు నివేదించాడు.
తత్ఫలితముగా వారు విలియంను బంధించి ప్రశ్నించగా, అతను తన నమ్మకాలను విడిచిపెట్టుటకు నిరాకరించారు. తొమ్మిది నెలల పాటు చెరసాలలో బంధించబడి దారుణముగా చిత్రవధ చేయబడినప్పటికీ, అతను తన విశ్వాసము నుండి ఏ మాత్రం కదిలించబడలేదు. కాగా చివరకు అతను దహించే స్థంభము వద్ద సజీవదహనం చేయబడవలెనని ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ధైర్యముగా ఆ స్థంభమును సమీపించిన విలియం, ఆకాశము వైపు చేతులెత్తి, “దేవా, దేవా, దేవా, నా ఆత్మను చేర్చుకొనుము" అని పలికి సత్యము కొరకు తన ప్రాణమును అర్పించారు.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, మీ ప్రాణము కంటే దేవుని వాక్యము మీకు విలువైనదిగా ఉన్నదా?
ప్రార్థన :
"ప్రభువా, నేను జయజీవితమును కలిగియుండులాగున మీలోను మరియు మీ వాక్యములోను నేను నిలిచియుండునట్లు నాకు నేర్పుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !
No comments:
Post a Comment