Search Here

May 13, 2023

Antony of Egypt | ఈజిప్టుకు చెందిన ఆంటోనీ

ఈజిప్టుకు చెందిన ఆంటోనీ గారి జీవిత చరిత్ర



  • జననం : క్రీ.శ. 251
  • మరణం : క్రీ.శ. 356
  • స్వస్థలం : కోమ
  • దేశం : ఈజిప్ట్
  • దర్శన స్థలము : -


ఆరంభకాల క్రైస్తవులలో అనేకమంది క్రీస్తుతో మరింత లోతైన సహవాసాన్ని కలిగియుండవలెనని వారి ప్రాపంచిక జీవితాన్ని త్యజించి క్రైస్తవ సన్యాసాన్ని స్వీకరించారు. తీవ్ర స్థాయిలో స్వీయాన్ని తృణీకరించుటను సాధన చేస్తూ వారు తమ ఆత్మీయ జీవితములో ముందుకు సాగిపోయారు. వేరుపరచబడిన జీవితమును, స్వీయ తృణీకరణను మరియు ప్రార్థన జీవితమును కలిగియుండి, దైవభక్తి గల జీవితము జీవించుటకు ఎంతోమందికి ప్రేరణనిచ్చిన సెయింట్ ఆంటోనీ అటువంటి ఆరంభకాల క్రైస్తవ సన్యాసులలో ఒకరు.


ఈజిప్టుకు చెందిన ఒక సంపన్న కుటుంబములో జన్మించిన ఆంటోనీ, తన తల్లిదండ్రుల మరణం కారణంగా యుక్త వయస్సులోనే వారసత్వపు ఆస్తులను పొందారు. అదే సమయంలో "నీవు పరిపూర్ణుడవగుటకు కోరినయెడల, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము" అని యేసు క్రీస్తు ఒక ధనవంతుడైన యవ్వనస్థునికి చెబుతున్న మత్తయి సువార్తలోని లేఖన భాగము చదువబడుచుండగా ఆంటోనీ వినడం జరిగింది. కాగా తానే ఆ ధనవంతుడైన యవ్వనస్థుడని నమ్మిన ఆంటోనీ, వెంటనే ఆ లేఖనభాగములోని యౌవనుడికి యేసు సూచించిన ప్రకారం చేశారు.


తదుపరి అతను తన ఇంటిని మరియు స్వగ్రామమును విడిచిపెట్టి, ఒక మారుమూల ప్రాంతములో ఉండి, ప్రార్థన మరియు ఉపవాసములతో నిద్రలేని రాత్రులను గడిపారు. తన ఆత్మ క్రీస్తునందు బలపడవలెనని అతను శారీరక ఆశలను, సుఖభోగములను తృణీకరించారు. అంధకార శక్తులు అతనిపై నిరంతరం దాడిచేస్తుండటంతో అతను ఎల్లప్పుడూ ఆత్మలో పోరాడుతూనే ఉండేవారు. అతని ఆత్మపైన మరియు దేహముపైన అపవాది చేస్తున్న భయంకరమైన దాడులను అతను సహిస్తూ, వాటిని ఎదిరించి పోరాడుతూ, ఆత్మీయ జీవితములో జయశీలునిగా నిలబడ్డారు. తత్ఫలితముగా దేవుని యొక్క జ్ఞానముతోను మరియు శక్తితోను నింపబడిన ఆంటోనీ, ఆత్మీయ జయజీవితము యొక్క రహస్యమును గురించి ప్రజలకు తెలియజేయుటకు ప్రారంభించారు. అంతేకాక, తనవలె క్రైస్తవ సన్యాసి జీవితమును జీవించుటకు పలువురికి శిక్షణ కూడా ఇచ్చారు.


రోమా సామ్రాజ్య చక్రవర్తియైన డయోక్లేషియన్ క్రీ.శ. 303 లో ఈజిప్టులోని క్రైస్తవులను హింసించుచున్న సమయంలో ఆంటోనీ ఈజిప్టులోని అలెగ్జాండ్రియాకు వెళ్లి బంధింపబడిన క్రైస్తవ కుటుంబములకు ఆదరణనిచ్చారు. వారి మధ్య సేవ చేసి సువార్తను ప్రకటించిన అతను, ఈ ప్రపంచంలో ఉన్నవాటన్నింటికీ మించి క్రీస్తును ప్రేమించవలెనని వారికి పిలుపునిచ్చారు. అతని పరిచర్య మూలముగా అనేకమంది క్రీస్తును అంగీకరించి, లోకము నుండి వేరుపరచబడిన ఒంటరి జీవితమును స్వీకరించారు. తండ్రియైన దేవుని ద్వారా క్రీస్తుకు దైవత్వం ఇవ్వబడినదే గానీ, ఆయన తండ్రితో సరిసమానుడు కాడని తప్పుగా బోధిస్తూ ఈజిప్టులోని అనేకమంది ఆరంభకాల క్రైస్తవులను తప్పుదారి పట్టించిన "అరియానిజం" అనే సిద్ధాంతము యొక్క బోధనలను వ్యతిరేకించి, సత్యమును తెలియపరచుటలో కూడా ఆంటోనీ కీలక పాత్ర పోషించారు. 

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీ హృదయము దేనిని అపేక్షిస్తున్నది? ఈ లోకములో ఉన్న ఆనందములనా లేక పరలోకపు తండ్రితో సహవాసమును కలిగియుండుటనా? 

ప్రార్థన :

"ప్రభువా, ఆత్మీయ పోరాటములో విజయోత్సాహముతో నిలువబడుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!" 

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • No comments:

    Post a Comment