ఇసాబెల్లా థోబర్న్ గారి జీవిత చరిత్ర
- జననం : 29-03-1840
- మరణం : 01-09-1901
- స్వస్థలం : ఓహియో
- దేశం : అమెరికా సంయుక్త రాష్ట్రాలు
- దర్శన స్థలము : లక్నో (భారతదేశం)
అమెరికాకు చెందిన ఇసాబెల్లా థోబర్న్, ఒంటరిగా మిషనరీ సేవలోకి అడుగుపెట్టిన స్త్రీలకు ఒక ఉదాహరణగా నిలుస్తారు. క్రైస్తవ కుటుంబములో పుట్టిన ఆమె, మంచి విశ్వాసులైన తల్లిదండ్రులను కలిగియుండి, దేవుని యందలి భయభక్తులతో పెంచబడ్డారు. 'మనము ఈ భూమిపై ఉన్నది సేవ చేయుటకే గానీ సేవ చేయించుకొనుటకు కాదు' అనే ఆమె తల్లి యొక్క బోధన ఆమె జీవితముపై ఎంతో ప్రభావాన్ని చూపించింది. వర్జీనియాలోని 'వీలింగ్ ఫిమేల్ సెమినరీ' అనే వేదాంత కళాశాల నుండి పట్టభద్రురాలైన ఆమె, తదుపరి చాలా సంవత్సరాల పాటు ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. అయితే, ఆమె సోదరుడైన జేమ్స్ థోబర్న్ వ్రాసిన లేఖ ఇసాబెల్లా జీవితంలో ఒక గొప్ప మలుపును తీసుకువచ్చింది.
మెథడిస్ట్ ఎపిస్కోపల్ సంఘమునకు చెందిన మిషనరీగా భారతదేశంలో సేవ చేస్తున్న జేమ్స్ థోబర్న్, తన సువార్త పనిలో స్త్రీపురుషులనే లింగ సంబంధిత అడ్డంకులను ఎదుర్కొన్నారు. కాబట్టి, తనతో చేతులు కలిపి ఆ సేవలో తనకు సహకారమందించమని జేమ్స్ తన సోదరి యొక్క సహాయమును కోరగా, ఇసాబెల్లా వెంటనే అందుకు అంగీకరించారు. నిరుత్సాహకరమైన పరిస్థితులు, నిధుల కొరతను వంటి అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ, చివరికి మెథడిస్టు సంఘము యొక్క ఉమెన్స్ ఫారిన్ మిషనరీ సొసైటీ (డబ్ల్యుఎఫ్ఎంఎస్) ద్వారా 1870వ సంll జనవరి 20వ తారీఖున మరొక ఒంటరి మహిళా మిషనరీ అయిన క్లారా స్వైన్‌తో కలిసి భారతదేశానికి చేరుకున్నారు ఇసాబెల్లా.
భారతదేశంలో ఆమె తన సోదరుడైన జేమ్స్‌తో పాటు నివాసం ఏర్పరచుకున్నారు. అక్కడ భారతీయ మహిళలకు విద్యను అందించడం ద్వారా తన మిషనరీ పనిని ప్రారంభించారు ఇసాబెల్లా. ఆడపిల్ల పుట్టనే వద్దని తమ పుట్టుకనుండే తృణీకారముతో నిండుకొనిన పరిస్థితులను ఎదుర్కొంటున్న భారతీయ మహిళల దుస్థితిని చూసిన ఇసాబెల్లా, అటువంటి సమాజములో మార్పు తీసుకొని రావలెనంటే అది విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని గ్రహించారు. ఆమె భారతీయ మహిళలను వారి గృహముల యొద్ద దర్శించి, వారికి విద్యను మరియు సువార్తను అందించారు. స్థానిక హిందుమత పూజారుల నుండి విమర్శలను, వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, ఆమె సమాజంలోని నిర్లక్ష్యం చేయబడిన మరియు తిరస్కరించబడిన మహిళలను చేరుకొని, తమ జీవితములకు ఒక ఉద్దేశ్యమును కలిగియుండి అర్ధవంతముగా జీవించుటకు వారికి సహాయపడ్డారు.
డబ్ల్యుఎఫ్‌ఎంఎస్ అందించిన ఆర్థిక సహాయంతో ఆమె ఒక బాలికల పాఠశాలను మరియు లక్నోలో ఒక మహిళా కళాశాలను ప్రారంభించారు. ఈ కళాశాల ఆసియా ఖండములోనే మహిళల కొరకు ఏర్పరచబడిన క్రైస్తవ కళాశాలలలో మొదటిది. కేవలం జ్ఞానమును సంపాదించుటకు మాత్రమే కాకుండా, వారి ప్రభువుకు మరియు సమాజమునకు వారు సేవ చేయవలెననే దృక్పథంతో బాలికలకు విద్య అందించబడింది. వారు ఆత్మీయముగా ఎదుగుట కొరకు ఆదివారం సాయంత్రం ప్రార్థన కూడికలు జరిగేవి. ప్రజల ఆత్మీయ కన్నులు తెరుచుటయే కాక, నైతిక విలువలను కూడా వారిలో పెంపొందిస్తూ 31 సంll ల పాటు లక్నోలో నిర్విరామంగా సేవ చేసిన పిమ్మట, ఆరు పదుల వయసులో తన ప్రభువు నందు విశ్రమించారు ఇసాబెల్లా థోబర్న్.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, 'మనము ఈ భూమిపై ఉన్నది సేవ చేయుటకే గానీ సేవ చేయించుకొనుటకు కాదు' అని మీరు గ్రహించారా?
ప్రార్థన :
"ప్రభువా, ఇతరుల భౌతిక, నైతిక మరియు ఆత్మీయ అవసరతలను సంధించునట్లు నన్ను బలపరచుము. ఆమేన్!
దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !
No comments:
Post a Comment