Search Here

May 14, 2023

Saint Cyprian | సెయింట్ సైప్రియన్

సెయింట్ సైప్రియన్ గారి జీవిత చరిత్ర


  • జననం : ~ 200-210
  • మరణం : 14-09-258
  • స్వస్థలం : కార్తేజ్, రోమా సామ్రాజ్యం
  • దర్శన స్థలము : కార్తేజ్, రోమా సామ్రాజ్యం


సైప్రియన్ లేదా థాస్సియస్ సిసిలియానస్ సైప్రియానస్ అప్పటిలో రోమా సామ్రాజ్యం క్రింద ఉన్న ఆఫ్రికా ప్రాంతంలో ఒక సంపన్న కుటుంబములో జన్మించారు. వారు అన్యజనులు. కార్తేజ్‌లోని న్యాయవృత్తికి సంబంధించిన వారిలో మంచి మేథస్సు కలిగినవానిగా ఉన్న అతను, ఉపాధ్యాయునిగా మరియు నిర్వాహకునిగా గౌరవప్రదమైన పదవిని కలిగియున్నారు. అయినప్పటికీ, అతను తన యవ్వన జీవితమును వ్యర్థపరచి హృదయ శాంతి కొరకు ఎంతో పరితపించారు. కాగా తనకు సహాయము చేయుమని అతను ఒక పాదిరిని కోరగా, ఆ పాదిరి అతనిని క్రీస్తు నొద్దకు నడిపించి, తద్వారా రక్షణ మార్గములోనికి నడిపించారు. బాప్తిస్మము పొందిన తరువాత అతను తన ఆస్తి అంతటినీ అమ్మి బీదలకు పంచిపెట్టి, పవిత్ర జీవితము జీవించుటకు ఎంచుకున్నారు.


అపారమైన లేఖన జ్ఞానం మరియు అద్భుతమైన వక్తృత్వ నైపుణ్యాలను కలిగియున్న సైప్రియన్, మారుమనస్సు పొందిన రెండేళ్ళ వ్యవధిలోనే పాదిరిగా నియమించబడ్డారు. తదుపరి అతను కార్తేజ్ సంఘమునకు బిషప్పు‌గా అభిషేకం చేయబడ్డారు. ఆ సంఘములో మంచి పేరుపొందిన అతను, పేదల యొక్క అభిమానమును చూరగొన్నారు. అది అక్కడి సమాజము యొక్క ఆత్మీయ అభివృద్ధికి దారితీసింది. క్రైస్తవ సంఘములోను, వివిధ క్రైస్తవ సంఘముల మధ్యను, అదేవిధముగా బిషప్పుల మధ్యను ఐక్యత ఉండవలెనని అతను బలముగా విశ్వసించేవారు. అతను వివిధ సంఘముల దిద్దుబాటు, ఆత్మీయ అభివృద్ధి మరియు ఏకీకరణ కొరకు క్రైస్తవ సంఘము యొక్క రాజ్యాంగ సిద్ధాంతమును అభివృద్ధి చేశారు.


డెసియస్ చక్రవర్తి పాలనలో క్రైస్తవులకు గొప్ప హింస కలుగగా, సైప్రియన్ హతసాక్షిగా మరణించే ఆ మహిమకరమైన భాగ్యమును ఎంచుకొనక, దాగుకొని, తన మందను రహస్యముగా నడిపించుటకు ఎంచుకున్నారు. అయితే, వలేరియన్ చక్రవర్తి పాలనలో మరలా క్రైస్తవులకు హింస కలుగినప్పుడు, అన్యదేవతలకు బలి ఇచ్చుటకు సైప్రియన్ బలవంతపెట్టబడ్డారు. అందుకు అతను నిరాకరించి క్రీస్తు మాత్రమే రక్షకుడని దృఢముగా తెలియపరచినందువలన అతను కురుబిస్‌ పట్టణముకు బహిష్కరించబడ్డారు. అక్కడ నుండి లేఖల ద్వారా విశ్వాసులకు ఆదరణ కలిగించుటకు తన సామర్థ్యం మేరకు అతను ప్రయత్నించారు. శ్రమలలో ఐక్యతను, నిరీక్షణను మరియు దీర్ఘశాంతమును కలిగియుండవలెనని అతను సంఘమును వేడుకున్నారు.


రోమా దేవతలకు బలి ఇచ్చి విడుదల పొందుటకు అతనికి ఇవ్వబడిన మరొక అవకాశమును కూడా అతను తిరస్కరించగా, అతనిని శిరచ్ఛేదనం చేయవలెలని ఆజ్ఞాపించబడింది. ఎంతో ప్రశాంతతతో ప్రార్థన చేయుటకు సైప్రియన్ మోకరిల్లినప్పుడు, ఖడ్గము అతని తలను ఛేదించింది.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, కష్ట సమయములలో క్రీస్తునందున్న మీ సహోదరసహోదరీలను మీరు ఆదరించుచున్నారా? 

ప్రార్థన :

"ప్రభువా, కష్ట సమయములలో నిరీక్షణ కలిగియుండుటకును మరియు క్రీస్తునందు సహోదరసహోదరీలను ఆదరించుటకు యోగ్యమైన పాత్రగా ఉండుటకును నాకు సహాయము చేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • No comments:

    Post a Comment