Search Here

May 14, 2023

David Livingstone | డేవిడ్ లివింగ్‌స్టన్

డేవిడ్ లివింగ్‌స్టన్ గారి జీవిత చరిత్ర

  • జననం : 19-03-1813
  • మరణం : 01-05-1873
  • స్వదేశం : స్కాట్లాండ్
  • దర్శన స్థలము : ఆఫ్రికా

స్కాట్లాండుకు చెందిన డేవిడ్ లివింగ్‌స్టన్ ఒక వైద్యుడు, ఆఫ్రికా అన్వేషకుడు మరియు మిషనరీ. అతను బాల్యంలో ప్రత్తి మిల్లులలో కష్టపడి పనిచేస్తూ, సాయంకాలపు పాఠశాలలకు హాజరయ్యేవారు. అతను చదివిన మిషనరీ కథలు మరియు అతని సండే స్కూల్ (ఆదివారపు బైబిలు పాఠశాల) ఉపాధ్యాయుని బోధనలు యవ్వనస్థుడైన లివింగ్‌స్టన్‌పై తీవ్ర ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపాయి. చైనాకు వైద్య మిషనరీలు అవసరమని చేసిన విజ్ఞాపనతో ఆకర్షింపబడిన అతను, గ్లాస్గోలో వైద్య మరియు వేదాంతశాస్త్రములను అభ్యసించారు. అయితే, ఆఫ్రికాలోని మరొక మార్గదర్శక మిషనరీ అయిన రాబర్ట్ మోఫాట్‌ను ఒకసారి అతను సంధించడం జరుగగా, అది ఆఫ్రికాలోని పరిచర్యకు అతను సమర్పించుకొనుటకు కారణమయ్యింది. కాగా లండన్ నగరంలో సేవ చేయుటకు అర్హులుగా నియమింపబడిన పిమ్మట 1841వ సంll లో అతను  ఆఫ్రికాలోని కేప్ టౌన్ నగరమునకు పయనమయ్యారు.


మొదటిలో రాబర్ట్ మోఫాట్ ఆధ్వర్యంలో ష్వానా ప్రాంతంలో కొంతకాలం సేవ చేసిన లివింగ్‌స్టన్, తరువాత జాంబియా మరియు మొజాంబిక్ వంటి ప్రదేశాలకు సువార్తను తీసుకువెళ్ళవలెనని ఉత్తర దిశగా ప్రయాణించారు. పిమ్మట బ్రిటన్ లో కొంతకాలం గడిపిన తరువాత, తిరిగి అతను సువార్తను జాంబేజీ నది మరియు మాలావి సరస్సు భూములకు తీసుకువెళ్ళుటకు తన మిషనరీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సమయంలోనే అతను తన ప్రియమైన జీవిత భాగస్వామియైన మేరీ మోఫాట్‌ను కోల్పోవడం జరిగింది. అయినప్పటికీ, అతను తన పరిచర్యను కొనసాగించారు. అతని జీవిత ప్రాధాన్యత ఏమిటంటే బయటి ప్రపంచమునకు మరుగైయున్న చీకటి ఖండమైన ఆఫ్రికాలోని అంతర్గత ప్రదేశాలకు సువార్త వెలుగును కనుపరచి "క్రైస్తవ్యము మరియు నాగరికత" లను అందుబాటులోనికి తీసుకురాగలుగునట్లు అతను "దేవుని రహదారి" అని పిలిచే ఒక  "మిషనరీ రోడ్డు" తెరువబడవలెననునదే.


లివింగ్‌స్టన్ వివిధ ప్రాంతాలను అన్వేషిస్తూ, తీరాలను చేరుకుంటూ, ఉపన్యాసాలు, ప్రసంగాలు, బోధలు మరియు వైద్యం చేస్తూ సంచరించేవారు. దర్శించిన ప్రతి స్థలము యొక్క భౌగోళిక లక్షణములను జాగ్రత్తగా పరిశీలించేవారు. నేటి మిషనరీ అన్వేషకులకు సూచనగా ఉండుటకై అతను అనేక దేశముల పటములను మళ్ళీ మళ్ళీ చిత్రీకరించారు. ఆ ఖండములోని బహు అంతర్గత ప్రాంతములలో నివసిస్తున్న ప్రజలకు క్రైస్తవ్యమును పరిచయం చేయుటకు అతను నరమాంసభక్షకులను, కౄరులను మరియు అక్కడ నెలకొనియున్న బానిసత్వం వంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, అతను సహనముతో అన్నింటినీ భరించారు మరియు అనేక కలవరపరిచే పరిస్థితులలో 'విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన' క్రీస్తు నుండి తన దృష్టిని ఎన్నడూ మళ్ళించలేదు. స్థానిక తెగల వారికి సువార్తను ప్రకటించుటకును మరియు ఆఫ్రికాలో బానిస వ్యాపారాన్ని నిర్మూలము చేయుటకును తన జీవితంలో ముప్పై సంవత్సరాల పాటు నిర్విరామంగా శ్రమించిన తరువాత 1873వ సంll లో దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించారు డేవిడ్ లివింగ్‌స్టన్.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, తెలియని ప్రదేశములకు వెళ్ళమని దేవుడు మిమ్ములను అడిగితే సాహసోపేతముగా ముందుకు వెళ్ళుటకు మీరు అంగీకరించెదరా? 

ప్రార్థన : "ప్రభువా, మీరు నన్ను ఎక్కడ నిలువబెట్టెదరో అక్కడ మీ పని చేయునట్లు నన్ను బలపరచుము. ఆమేన్!" 


దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Saint Athanasius | అథనాసియస్

    అథనాసియస్ గారి జీవిత చరిత్ర

    • జననం : ~ క్రీ.శ. 293
    • మరణం : క్రీ.శ. 373
    • స్వస్థలం : అలెగ్జాండ్రియా
    • దేశం : ఈజిప్ట్
    • దర్శన స్థలము : ఈజిప్ట్

    అరియానిజం. తండ్రియైన దేవుని ద్వారా క్రీస్తుకు దైవత్వం ఇవ్వబడినదే గానీ, ఆయన తండ్రితో సరిసమానుడు కాడు, క్రీస్తు యొక్క సారూప్యం తండ్రియైన దేవుని వంటిది కాదు మొదలగు తప్పుడు సిద్ధాంతములతో కూడిన బోధలతో ప్రారంభ శతాబ్దములలో క్రైస్తవ సంఘములోకి చొరబడి సంఘమును సత్యము నుండి మళ్ళించి తప్పు త్రోవ పట్టించుటకు ప్రయత్నించిన ఒక తప్పుడు బోధన. 4 వ శతాబ్దంలో అరియానిజానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో క్రైస్తవ మూల సిద్దాంతములను సమర్థిస్తూ వాటిని పరిరక్షించుటకు నిలబడినవారిలో ప్రధానమైనవారే ఈ అథనాసియస్. అతను అలెగ్జాండ్రియాలో తత్వ మరియు వేదాంతశాస్త్రములను అభ్యసించారు. అప్పటి అలెగ్జాండ్రియా బిషప్పు అయిన అలెగ్జాండర్ మరణం తరువాత, అథనాసియస్ అలెగ్జాండ్రియా యొక్క బిషప్పుగా నియమించబడ్డారు. క్రీస్తు యొక్క దైవత్వమును గురించిన సిద్ధాంతమును సమర్థించినందుకుగాను నలుగురు రోమా సామ్రాజ్య చక్రవర్తులచే ఐదుసార్లు బహిష్కరించబడ్డారు అథనాసియస్. కాగా అతను అలెగ్జాండ్రియా యొక్క బిషప్పుగా సేవలందించిన నలభైయైదు సంవత్సరాలలో పదిహేడు సంవత్సరాలు బహిష్కరణలోనే గడిపారు.


    అరియానిజం ఆవిర్భావానికి కారకులైన అరియస్‌కు వ్యతిరేకంగా క్రీస్తు యొక్క సంపూర్ణ దైవత్వమును వేదాంతపరముగా సమర్థిస్తూ అథనాసియస్ నిలబడడంతో అది ప్రజలలో క్రైస్తవ విశ్వాసం పెంపొందించబడుటకు సహాయపడింది. అరియానిజానికి వ్యతిరేకంగా సంకల్పించిన ఈ పోరాటంలో విజయం సులభంగా లభిస్తుందని అథనాసియస్ ప్రారంభంలో భావించినప్పటికీ, పరిస్థితి బహు క్లిష్టమైనదిగా నిర్ధారితమైంది. తూరు పట్టణ ఆలోచన సభ (కౌన్సిల్ ఆఫ్ తైర్) వివిధ కారణాల వలన పిలువబడింది మరియు కాన్‌స్టాంటైన్ చక్రవర్తి అథనాసియస్‌ను ఉత్తర గౌల్‌కు బహిష్కరించాడు. అపొస్తలుడైన పౌలు జీవితమును జ్ఞప్తికి తీసుకువచ్చే అథనాసియస్‌ యొక్క ప్రయాణాలు మరియు అతను ఎదుర్కొనిన బహిష్కరణలలో ఈ బహిష్కరణ మొదటిది.


    కాన్‌స్టాంటైన్ మరణం తరువాత అతని కుమారుడు అథనాసియస్‌ను తిరిగి బిషప్పుగా నియమించాడు. అయితే ఇది కేవలం ఒక సంవత్సరం మాత్రమే నిలిచింది. ఏలయనగా అరియానిజంను సమర్ధించే బిషప్పుల కూటమి చేత అథనాసియస్‌ తిరిగి పదవి నుండి తొలగింపబడ్డారు. బహిష్కరణలో ఉన్నప్పుడు అతను రచనలను చేస్తూ తన సమయమును గడిపారు. అతను వ్రాసిన రచనలలో అధిక భాగం క్రైస్తవ సనాతన లేదా మూల సిద్ధాంతములను సమర్థించేవిగా ఉన్నాయి. చివరిగా అతను తిరిగి అలెగ్జాండ్రియాకు వచ్చినప్పుడు శ్రమదినములు మరియు ఈస్టర్ వంటి ముఖ్యమైన పండుగల తేదీలను నిర్ణయించుటకు బిషప్పుగా తన పరిధిలో ఉన్న క్రైస్తవ సంఘములకు లేఖలు వ్రాశారు. ఈ లేఖల ద్వారా క్రొత్త నిబంధనలో ఉండవలసిన పుస్తకములని తాను ఏ పుస్తకములను విశ్వసిస్తున్నారో అది కూడా అతను తెలియచేశారు. మతపరమైన సిద్ధాంతములను సమర్ధిస్తూ, వాటిని నిరూపిస్తూ చేసే రచనలైన అపోలొజెటిక్స్ రచనలకు సంబంధించి రెండు భాగాల రచనలను కూడా అతను ప్రచురించారు. అవేమనగా "ఎగైనెస్ట్ ది హీథన్" (అన్యజనులకు వ్యతిరేకముగా) మరియు "ది ఇంకార్నేషన్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్" (దేవుని వాక్యము యొక్క శరీరధారణ). అతని రచనలు అరియానిజం యొక్క ప్రతి అంశాన్ని వ్యతిరేకించేవిగా ఉన్నాయి.


    క్రైస్తవ విశ్వాసమును గురించి మరియు సంఘము కలిగియున్న స్వాతంత్య్రమును గురించి తాను కలిగియున్న అవగాహనను బట్టి విశ్వసించినదానిని పరిరక్షించుటకు అథనాసియస్ తన సంపూర్ణ శక్తిని ఉపయోగించి అలసిపోక చేసిన పోరాటం క్రైస్తవ సంఘ చరిత్రలో అతనికి ప్రముఖ స్థానాన్ని సంపాదించింది.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీ విశ్వాసమునకు నమ్మకముగా నిలిచియుండవలెననే పిలుపుకు మీరు ఏ విధముగా స్పందిస్తున్నారు?

    ప్రార్థన : "ప్రభువా, అధిగమించుటకు అసాధ్యమనిపించే వ్యతిరేకతను ఎదుర్కొనే సమయాలలో కూడా నా విశ్వాసంలో స్థిరముగా నిలబడుటకు నాకు మీ కృపను అనుగ్రహించుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !

    ప్రార్థన :

  • WhatsApp
  • John Dreisbach | జాన్ డ్రెయిస్‌బాక్

    జాన్ డ్రెయిస్‌బాక్ గారి జీవిత చరిత్ర

    • జననం : 1921
    • మరణం : 2009
    • స్వస్థలం : వాయువ్య ఓహియో
    • దేశం : అమెరికా సంయుక్త రాష్ట్రాలు 
    • దర్శన స్థలము : నైజీరియా

    దైవభక్తిగల ఒక వ్యవసాయ కుటుంబములో జన్మించిన జాన్ డ్రెయిస్‌బాక్, వారి కుటుంబములోని ముగ్గురు సంతానంలో ఆఖరివాడు. అతని తండ్రి ఆదివారపు బైబిలు పాఠశాల (సండే స్కూల్) యొక్క నిర్వాహకులు. అతని తల్లి 'ఉమెన్స్ మిషనరీ సొసైటీ' (మహిళా మిషనరీ సంస్థ) లో క్రియాశీల సభ్యురాలు మరియు ఆదివారపు బైబిలు పాఠశాల యొక్క ఉపాధ్యాయురాలు. కాగా విదేశాలలో మిషనరీ సేవ పట్ల మిగుల ఆసక్తి కలిగియున్న అతని తల్లిదండ్రులు తమకు పిల్లలు కలుగక మునుపే వారిని ప్రభువు సేవ కొరకై సమర్పించారు. జాన్ కు 12 సంll ల వయసు ఉన్నప్పుడు వారి సంఘములో జరిగిన ఒక ఉజ్జీవ కూడికలో తన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపమొంది, వాటిని ఒప్పుకొని రక్షణ కొరకై దేవుని సన్నిధిలో వేడుకొనగా, అతను తిరిగి జన్మించిన అనుభవమును పొందారు. మిషనరీల జీవిత చరిత్రలను చదివే అతని తల్లి, వాటిని చదువుటకు జాన్ ను కూడా ప్రోత్సహించారు. ఇది ఆఫ్రికాలో మిషనరీ సేవ చేయుట కొరకైన అతని పిలుపును నిశ్చయపరచుటలో కీలక పాత్ర పోషించింది.


    వైద్య కళాశాల నుండి పట్టా పొందిన తరువాత 1948వ సంll లో తన జీవిత భాగస్వామియైన బెట్టీతో కలిసి పశ్చిమ ఆఫ్రికాలోని నైజీరియాకు మిషనరీగా వెళ్ళారు జాన్. అక్కడ అతను ఉత్తర నైజీరియాలోని మూడు పెద్ద కుష్ఠురోగుల ఆసుపత్రులను పర్యవేక్షించే నిర్వాహకులుగా పనిచేశారు. ఈ ప్రాంతం ప్రధానంగా ముస్లిం ప్రజలచే ఆక్రమించబడినందున వారు చేస్తున్న సేవలో ప్రధానముగా సువార్త ప్రకటనపై వారి దృష్టి కేంద్రీకరించబడింది. అంతేకాకుండా దేవుని వాక్య జ్ఞానములో ఎదుగులాగున ప్రజలను ప్రోత్సహించుటకుగాను మరియు పురుషులకు పాదిరులుగా శిక్షణనిచ్చుటకుగాను వారు బైబిలు పాఠశాలలను కూడా నిర్వహించారు.


    సెలవు దినములలో అతను ఆఫ్రికా నుండి వచ్చినప్పుడు సువార్త సేవ చేసే విశ్వవిద్యాలయమైన దక్షిణ కెరోలినాలోని బాబ్ జోన్స్ విశ్వవిద్యాలయం వారు వైద్యపరమైన మిషనరీ సేవ కొరకు పాఠ్యాంశాలను అభివృద్ధి చేయుటకై జాన్ ను నియమించారు. దానిని గురించి అతను దృఢముగా విశ్వసించినది ఏమంటే వైద్య మిషనరీ శిక్షణలో అనుభవపూర్వకమైన శిక్షణ ఎంతో ముఖ్యమైన అంశమని. కాగా అతను ‘ప్రాజెక్ట్ కంపాషన్’ (కరుణా పరియోజన) అనుదానిని ప్రవేశపెట్టారు. దీని ద్వారా అనేకమంది విద్యార్థులు నిజముగా జరుగుతున్న సేవాకార్యక్రమాలలో పాల్గొని అనుభవపూర్వక శిక్షణ పొందారు. అతను ఆ విశ్వవిద్యాలయము యొక్క ఒక ఉద్యోగిగానే పరిగణింపబడినప్పటికీ, జాన్ దంపతులు తమ అధిక సమయమును వైద్యపరమైన వివిధ సేవా కార్యకలాపాలలో సేవలందించుటకు వెచ్చించి స్వతంత్ర మిషనరీలుగా దేవుని సేవలో ముందుకు సాగిపోయారు.


    అంతేకాకుండా, తన జీవితములో చెప్పుకోదగినంత కాలం పాటు విదేశాలలో మిషనరీ సేవ చేయుటను గురించి కళాశాల విద్యార్థులకు ఆలోచన చెబుతూ, అందుకు వారిని ప్రోత్సహించుచూ కూడా జాన్ సేవలందించారు. జాన్ ప్రపంచ నలుమూలలా సువార్త ప్రకటించబడుటను గురించి ఎల్లప్పుడూ యవ్వనస్థులను సవాలు చేసేవారు. అది ఎంతో ఫలభరితమైనదనుటకు అతని ద్వారా ప్రోత్సహించబడి ప్రపంచమంతటా విదేశీ మిషనరీ పరిచర్యలలో తమ సేవలనందించుచున్న యవ్వనస్థులు సాక్ష్యముగా నిలుస్తారు. 


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, ఇంతకు మునుపెన్నడూ సువార్త విననివారికి సాక్ష్యమిచ్చే అవకాశం మీరు కూడా కలిగియున్నారని మీరు గ్రహించగలుగుతున్నారా? 

    ప్రార్థన :   

    "ప్రభువా, నా స్వార్థపూరితమైన జీవితమును విడిచిపెట్టి, విమోచననిచ్చే కృపా సందేశము యొక్క అవసరతలో ఉన్నవారికి ఆ సందేశమును చేరవేయుటకు నన్ను నేను సమర్పించుకొనెదను. ఆమేన్!"   

    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp