మేరీ గోబాట్ | Mary Gobat
- జననం: 09-11-1813
- మహిమ ప్రవేశం: 01-08-1879
- స్వదేశం: స్విట్జర్లాండు
- దర్శన స్థలము: అబిస్సీనియా, మాల్టా మరియు యెరూషలేము
మేరీ గోబాట్ స్విట్జర్లాండుకు చెందిన మిషనరీ మరియు యెరూషలేము యొక్క ఆంగ్లికన్ మిషనరీ బిషప్‌గా అనేక సంవత్సరముల పాటు సేవలందించిన రెవ. శామ్యూల్ గోబాట్ యొక్క జీవిత భాగస్వామి. 1834వ సంll లో వారిరువురికి వివాహం జరిగింది. అప్పటి నుండి అబిస్సీనియా, మాల్టా మరియు యెరూషలేములలో తన భర్త జరిగించిన పరిచర్యకు ఆమె మద్దతునిచ్చుటకు అన్ని విధాలా ప్రయత్నించారు. దయగల ఆమె ఆతిథ్యానికి పేరుగాంచిన మేరీ, శామ్యూల్ పర్యవేక్షణలో ఉన్న పాఠశాలలోని 1,400 మంది విద్యార్థులలో అనేకమందికి తన ప్రేమాప్యాయతలను కనుపరిచారు.
మేరీ గోబాట్ తన భర్త చేసే పరిచర్యలో శ్రద్ధాసక్తులు కలిగి పూర్ణహృదయముతో పాలుపంచుకున్నారు. ఒకవైపు గృహములో అనేక విధులను మరియు చిన్న పిల్లలను కలిగియున్న తన కుటుంబ బాధ్యతలను నెరవేర్చవలసియున్నప్పటికీ, అబిస్సీనియా మరియు యెరూషలేములలో పరిచర్య యొక్క ప్రారంభ సంవత్సరాలలో ఆమె తన ప్రేమపూర్వక పరిచర్యలో ఎడతెగక మరియు అలుపెరుగక ముందుకు సాగిపోయారు. తన భర్త ప్రారంభించిన అన్ని పాఠశాలలు మరియు మిషన్‌లపై నిరంతరమూ ఆసక్తిని కనుబరుచుచూ మరియు ఆ సేవలలో తోడ్పాటునందిస్తూ ఆమె ప్రతి విషయంలోనూ తన భర్తకు గొప్ప సహకారిగా నిలిచారు. సాధారణమైనదిగా కనిపించే ఆమె యొక్క విశ్వాసం, చిన్నపిల్లలవలె దేవునిపై కలిగియున్న నమ్మిక మరియు యేసు క్రీస్తు ప్రభువు యెడల ఉన్న హృదయపూర్వక ప్రేమ అనునవి ఆమె జీవిత ప్రారంభ కాలంలో ఆమెను గురించి తెలియపరిచే లక్షణాలుగా ఉండేవి. అవి ఎన్నడూ ఆమెలో నుండి తొలగిపోలేదు. అబిస్సీనియాలో కష్టాలు, బాధల మధ్య అయినా, యెరూషలేములో విజయవంతమైన పరిచర్య మధ్య అయినా, చివరి వరకు కూడా ఒకే విధమైన శ్రద్ధాసక్తులతో, దయాహృదయముతో మరియు దీనత్వముతో నిలిచారు మేరీ.
ఆ మిషనరీ దంపతులు అనారోగ్యమును, తమ బిడ్డల మరణాలను మరియు కష్టతరమైన ప్రయాణ పరిస్థితులను అనుభవించవలసి వచ్చినప్పటికీ దేవుని పిలుపుకు నమ్మకముగా జీవించారు. అన్ని విషయాలలో ఆమెకు మార్గనిర్దేశం చేసిన నియమం ప్రేమా నియమం; బాధలో ఉన్నవారికి సహాయం చేయకుండా ఆమె ముఖం చాటుచేసుకొనలేదు; దుఃఖించువారితో దుఃఖించకుండా ఆమె దాటిపోలేదు; ఎవరైనా పాపం చేసినట్లు లేదా వెనుదిరిగి జారిపోయినట్లు తెలిస్తే వారి యొద్దకు వెళ్ళి వారి కొరకు ప్రార్థించకుండా తన అడుగులను వెనుకతీయలేదు. ఒకవేళ తాను ఎవరికైనా అన్యాయం చేసియుండవచ్చుననో లేదా అనుకోకుండా ఏ వ్యక్తి మనసునైనా నొప్పించినట్లు భావిస్తే, వారి యొద్దకు వెళ్ళి క్షమాపణ అడిగే వరకు కూడా ఆమెకు మనశ్శాంతి ఉండేది కాదు.
తన జీవితపు ఆఖరి సంవత్సరాలలో బలహీనత మరియు వృద్ధాప్యం కారణంగా కొద్దిపాటి పనినే చేయగలిగినప్పుడు కూడా దుఃఖించువారిని ఓదార్చుటకు, అవసరతలలో ఉన్నవారికి సహాయం చేయుటకు మరియు తప్పిపోతున్న వారిని సరైన మార్గము వైపుకు మళ్ళించుటకు ఏనాడూ తన ప్రయత్నములను విరమించుకోలేదు మేరీ గోబాట్.
🚸 ప్రియమైనవారలారా, క్రైస్తవుని యొక్క నిజమైన సద్గుణములను మనము ఏవిధంగా కనుపరచగలము? 🚸
"ప్రభువా, మిమ్ములను మరియు మీలో నిత్యజీవమును నేను సంపూర్ణముగా కనుగొనేంత వరకూ నేను సొమ్మసిల్లిపోక ప్రార్థనా పోరాటములను కొనసాగించుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!
🙏🙏 దేవునికే మహిమ కలుగునుగాక! 🙏🙏
No comments:
Post a Comment