మేరీ లూయిసా క్లార్క్ | Mary Louisa Clarke
- జననం: -
- మహిమ ప్రవేశం: -
- స్వదేశం: ఇంగ్లాండు
- దర్శన స్థలము: భారతదేశం
ఇంగ్లాండులోని ఒక పెద్ద కుటుంబంలో జ్యేష్టురాలిగా జన్మించిన మేరీ లూయిసా క్లార్క్ పైనే కుటుంబ పోషణా భారం ఉండేది. ఇతరులు తమ యవ్వన కాలంలో లోకేచ్ఛలను అనుసరిస్తూ ప్రాపంచిక సుఖాలను అనుభవిస్తూ సంతోషిస్తుండగా, క్లార్క్ మాత్రం భారతదేశంలో మిషనరీ సేవ చేయుట కొరకు తన జీవితమును సమర్పించుకున్నారు. భారతదేశంలో సేవలందిస్తున్న అమెరికా మిషనరీయైన డాll మేరీ మెక్‌గవ్రాన్‌కు సహాయమందించుటకుగాను 1900వ సంll లో ‘డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్’ (క్రీస్తుని శిష్యులు) అనే సంస్థ ఆమెను భారతదేశానికి పంపింది. మునుపు మేరీ ఎటువంటి వైద్యపరమైన శిక్షణను పొందియుండక పోయినప్పటికీ ఆ పనిని ఆమె త్వరగా నేర్చుకొనగలిగారు మరియు వైద్యపరమైన సేవలను అందించుటలో ప్రావీణ్యం సంపాదించారు.
మేరీ క్లార్క్ దామో ప్రాంతంలో హిందూ మరియు ముస్లిం మహిళల మధ్య పరిచర్య చేశారు. ఆమె భారతీయ మహిళల సంస్కృతిని క్షుణ్ణముగా అర్థంచేసుకున్నవారై, తదనుగుణంగా వారి జీవన పరిస్థితులను మెరుగుపరచుకొనుటకు వారికి నేర్పించారు. పిమ్మట కుల్పహార్‌కు వెళ్ళిన ఆమె, అక్కడ స్త్రీలు మరియు పిల్లల కొరకు ఏర్పరచబడిన ఒక స్వచ్ఛంద గృహము యొక్క బాధ్యతలు చేపట్టారు. అక్కడ నిర్లక్ష్యం చేయబడిన మహిళలు మరియు శిశువుల విచ్ఛిన్నమైన బ్రతుకులను ఉద్ధరించుటకు ఆమె పలు ప్రయత్నాలు చేశారు. పరిస్థితులకు అనుగుణంగా ఆమె నడుచుకునే విధానం మరియు ఆమెకున్న కార్యనిర్వహణా సామర్ధ్యం విడిచిపెట్టబడిన అనేకమంది మహిళలకు నిరీక్షణతో కూడుకొనిన నూతన జీవితాలను అందించుటకు తోడ్పడ్డాయి. పిల్లలకు ఆమె ఒక తల్లిగాను మరియు స్త్రీలకు ప్రేమగల సహోదరిగాను మరియు సన్నిహిత స్నేహితురాలిగాను మారారు మేరీ.
1923వ సంll లో ఝాన్సీ అనే ప్రదేశానికి వెళ్ళిన మేరీ, అక్కడ ‘బైబిల్ ఉమెన్’ (బైబిలు మహిళలు) అనే బృందముతో కలిసి పనిచేశారు. ఈ మహిళా బృందం బహిరంగంగా కనిపించుటకు అనుమతించబడని వందలాది మంది భారతీయ మహిళలను సంధించి, వారికి సువార్తను అందించారు. పిమ్మట ఆమె పాఠశాల కార్యకలాపాలను నిర్వహించుటకుగాను తిరిగి దామోకు వెళ్ళవలసి వచ్చింది. పాఠశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యత వహించిన ఆమె, నిధులు తక్కువగా ఉన్నప్పుడు కూడా పాఠశాలలను సమర్ధవంతంగా నిర్వహించారు. ఆమె నాయకత్వంలో బాలబాలికలకు అనుభవపూర్వకముగా శిక్షణను నిచ్చుటకు తరగతులు ప్రారంభించబడ్డాయి.
ఆతిథ్యమిచ్చు విషయంలో ఖ్యాతిని పొందిన మిషనరీలలో ఒకరిగా చోటు సంపాదించుకున్నారు మేరీ. ఆమె సేవలో కనిపించే అత్యుత్తమ లక్షణం ఏమిటంటే ప్రశాంతతతో కూడిన ఆమె విశ్వసనీయత. తనకు ఏ పని అప్పగింపబడినా దానిని క్షుణ్ణముగా సంపూర్తి చేసేవారు మేరీ లూయిసా క్లార్క్.
🚸 ప్రియమైనవారలారా, మీకు అప్పగించబడిన పనిలో మీరు నమ్మకముగా ఉన్నారా? 🚸
🛐 "ప్రభువా, పరిచర్యలో నాకు అప్పగింపబడిన పనులను శ్రద్ధగా జరిగించుటకు నాకు జ్ఞానమును మరియు శక్తిని దయచేయుము. ఆమేన్!" 🛐
🙏🙏 దేవునికే మహిమ కలుగునుగాక! 🙏🙏
No comments:
Post a Comment