Stanley Dale | స్టాన్లీ డేల్
జననం: -
మహిమ ప్రవేశం: 1968
స్వస్థలం: ఆస్ట్రేలియా
దర్శన స్థలము: పాపువా, ఇండోనేషియా
న్యూ గినియాలోని పర్వతాలు ఆ ప్రాంతంలోని అత్యంత భయానకమైన తెగలలో ఒకటైన ‘యాలి’ అనే తెగకు నిలయంగా ఉన్నాయి. మూఢనమ్మకాలతో నిండియున్న ఈ తెగవారు నరమాంస భక్షకులు మరియు నరబలిని ఆచరించేవారు. వారిని కలిసినవారిలో అతి కొద్దిమంది మాత్రమే సజీవంగా బయటకు రాగలిగారు. ఇవన్నీ తెలుసుకున్న స్టాన్లీ డేల్ స్నేహపూర్వక స్వభావం లేని ఆ తెగలకు సిలువ సందేశమును తీసుకువెళ్ళవలెనని నిర్ణయించుకున్నారు.
ఆస్ట్రేలియాకు చెందిన మిషనరీయైన స్టాన్లీ డేల్ మునుపు సైనికుడిగా పనిచేశారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మొట్టమొదటి సారిగా న్యూ గినియా యొక్క ఎత్తైన పర్వత శ్రేణులను చూసిన అతను, ఏదో ఒక రోజు తిరిగి వచ్చి అక్కడి యాలి ప్రజలకు దేవుని ప్రేమాసందేశమును అందించవలెనని నిశ్చయించుకున్నారు. కాగా 1961వ సంll లో తన స్నేహితుడు బ్రూనో డి లీయుతో కలిసి ఆ ప్రజలను చేరుకొనుటకు సుదీర్ఘమైన మరియు అతి క్లిష్టమైన ప్రయాణమును ప్రారంభించారు స్టాన్లీ. మొదటిగా వారు ఒకరితో ఒకరు పోరాడుతున్న యాబీ మరియు కోబాక్ తెగలను కలుసుకున్నారు. ఒకరోజు స్టాన్లీ మరియు బ్రూనో ఆ ఇరుతెగలవారి మధ్య జరుగుతున్న పోరాటంలో చిక్కుకున్నారు. ఇరుతెగలవారు కూడా ఆ వ్యక్తులు తమ శతృ తెగకు చెందినవారని భావించి వారిని చంపుటకు ఆయుధములతో వారి యొద్దకు పరిగెత్తారు. అయితే, అక్కడి పరిస్థితిని శాంతింపజేయుటకు ప్రయత్నిస్తున్న స్టాన్లీ యొక్క ధైర్యమును చూసి ఆ గిరిజనులు ఆశ్చర్యపోయారు. దేవుడు దయచేసిన జ్ఞానముతో ఆ తెగల మధ్య శాంతిని నెలకొల్పారు స్టాన్లీ. ఒకరినొకరు చంపుకొనుటకు సిద్ధముగా ఉన్న ఆ ప్రజలు చివరకు క్షమాపణా భావముతో ఒకరినొకరు కౌగిలించుకున్నారు.
ఎంతో క్లిష్టమైన అన్వేషణ తరువాత చివరకు స్టాన్లీ మరియు బ్రూనో యాలి తెగలను చేరుకొనగలిగారు. అయితే వారు ఆ తెగవారి భూభాగములో అడుగు పెట్టిన మరుక్షణం బాణాలు వారి పైకి దూసుకువచ్చాయి. తత్ఫలితముగా వారు తిరుగుముఖం పట్టవలసి వచ్చింది. ఏదేమైనప్పటికీ, యాలి ప్రజల జీవితములకు యేసు క్రీస్తు ప్రభువు అవసరమని విశ్వసించిన స్టాన్లీ, 1963వ సంll లో మరికొంతమందితో కలిసి ఆ ప్రాంతమునకు తిరిగి వెళ్ళారు. వారు యాలి భూభాగమును చేరుకున్నప్పుడు ఆ గిరిజనులు తమ గుడిసెలలో నుండి బయటకు వచ్చి, తమ బాణములను ఊపుతూ వారిని భయపెట్టారు. తన సహచరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని భద్రతా స్థలమునకు తిరిగివెళ్ళవలెనని స్టాన్లీ వెనుదిరిగారు. అయితే వారు వెనుకకు తిరుగినప్పుడు వందలాది బాణాలు దూసుకువచ్చాయి. ఆ మొత్తం మిషనరీ బృందం తమ ప్రాణాలను కోల్పోయారు.
కొన్ని సంవత్సరాల తరువాత స్టాన్లీ రక్తం చిందించిన ఆ భూభాగములోనే సువార్త కూడా వ్యాపించింది. స్టాన్లీ యొక్క కుమారుడు వెస్లీతో సహా ఇతర మిషనరీలు ధైర్యముగా ముందుకు అడుగులువేసి యాలి తెగను చేరుకుని, క్రీస్తు కొరకు వారిని సంపాదించగలిగారు. ఒకప్పుడు భయానకమైన తెగగా ఉన్న యాలి ప్రజలు ఇప్పుడు శాంతిని ప్రేమించే క్రైస్తవ సమాజముగా మారారు!
🚸 *ప్రియమైనవారలారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి ప్రభువు కార్యాభివృద్ధియందు మీరు ఆసక్తులై యుంటున్నారా?* 🚸
🛐 *"ప్రభువా, అపాయకరమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చినా సువార్తను ప్రకటించుటకు ముందుకు సాగిపోవుటకు నాకు ధైర్యము దయచేయుము. ఆమేన్!"* 🛐
*******
🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏
No comments:
Post a Comment