Search Here

Sep 22, 2021

Jonathan Edwards | జోనాతాన్ ఎడ్వర్డ్స్

 Jonathan Edwards | జోనాతాన్ ఎడ్వర్డ్స్




  • జననం: 05-10-1703
  • మహిమ ప్రవేశం: 22-03-1758
  • స్వస్థలం: కనెక్టికట్
  • దేశం: అమెరికా 
  • దర్శన స్థలము: అమెరికా 

అమెరికాకు చెందిన జోనాతాన్ ఎడ్వర్డ్స్ అత్యంత ప్రసిద్ధి చెందిన వేదాంతవేత్తలలో ఒకరు మరియు అతను ఆత్మీయ ఉజ్జీవాన్ని నెలకొల్పిన బోధకులు . పాదిరులు మరియు దైవ సేవకులతో నిండిన వంశంలో జన్మించిన ఎడ్వర్డ్స్ , బాల్యము నుండీ దైవభక్తిగల జీవితాన్ని కలిగియున్నారు . అతని సమకాలీనులు ప్రకృతి సంబంధమైన విజ్ఞాన శాస్త్రం వలన ' డీయిజం ' ( దేవుడు ఉన్నాడని ప్రకృతి ద్వారా నిరూపించబడుతుంది , అందుకు ప్రవచనం అవసరం లేదు అని చెప్పే తత్వ సిద్ధాంతం ) వైపుకు మొగ్గుచూపుతున్న పరిస్థితులలో , ప్రకృతి దేవుని యొక్క అద్భుతమైన సృష్టికి సాక్ష్యమిస్తున్నట్లు ఎడ్వర్డ్స్ గ్రహించారు . కాగా కళాశాలలో చదువుకుంటున్న రోజులలో అతను తరచుగా వనారణ్యాలలోకి వెళ్ళి దేవునిని ప్రార్థించి ఆరాధించేవారు . భక్తిగల జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ , తన హృదయము ఖాళీగా ఉండుటను గమనించిన జోనాతాన్ , తన నీతిక్రియలు ఏవీ కూడా తనను రక్షించలేవని గ్రహించారు .

1721 వ సం ll లో క్రీస్తు యొక్క విమోచనా కార్యం అతని హృదయములో క్రియ చేయడం ప్రారంభమైంది మరియు క్రీస్తుని రాజ్యము కొరకు అతనిలో జ్వాలలు ప్రారంభమయ్యాయి . పంతొమ్మిదేళ్ళ వయసులో అతను న్యూయార్క్ లోని " ఫస్ట్ ప్రెస్బిటేరియన్ చర్చ్ " లో బోధించడం ప్రారంభించారు . పిమ్మట కనెక్టికట్ లో తన తండ్రితో కలిసి పరిచర్య చేసిన అతను , 1729 వ సం ll లో నార్తాంప్టన్లోని సంఘముకు కాపరిగా సేవలందించుటకు బాధ్యతలను చేపట్టారు . అతని భార్య సారా పియర్రెపాంట్ యొక్క సమర్థవంతమైన సహకారముతో నార్తాంప్టన్లో ఎడ్వర్డ్స్ ఎంతో శ్రద్ధాసక్తులు కలిగి బోధించారు మరియు మిగుల సంతోషముతో పరిచర్య చేశారు .

ఎంతో ఆసక్తి మరియు నెమ్మది కలిగిన బోధకుడైన అతని ప్రసంగాలు అధికముగా ' రక్షణను దయచేసే దేవుని కృప ' అనే అంశముపై కేంద్రీకృతమై యుండేవి . అతని పరిచర్య మూలముగా 1733-35 కాలంలో గొప్ప ఉజ్జీవం కలుగగా , వందలాది మంది , ముఖ్యముగా యవ్వనస్థులు క్రీస్తును అంగీకరించారు . ప్రజలతో కిక్కిరిసిపోయిన ప్రార్థనా కూడికలు సర్వసాధారణ దృశ్యంగా మారాయి . తన సంఘమును కాచుటతో పాటు ఇతర ప్రదేశాలలో కూడా బోధించుటకు ఎడ్వర్డ్స్ విస్తృతంగా ప్రయాణించారు . కాగా ఆ ఉజ్జీవం కనెక్టికట్ రివర్ వ్యాలీ ప్రాంతమంతటా విస్తరించడమే గాక , న్యూజెర్సీ వరకు వ్యాపించింది .

కొన్ని ఎదురుదెబ్బలు , క్రైస్తవ వర్గాల విమర్శలు మరియు వ్యక్తిగతముగా నిరాశాజనక పరిస్థితు ఎదురైనప్పటికీ , అననుకూలమైన కష్ట సమయాలలో అతను దేవునియందు విశ్వాసమే అతని ఆధారమయ్యింది . సత్యపు వెలుగులో దేవుని వాక్యాన్ని విశ్వసించిన వ్యక్తి ఎడ్వర్డ్స్ . అంతేకానీ , ప్రజల అంగీకారాన్ని పొంది బాగా ప్రబలమైన అభిప్రాయాలు లేదా సిద్ధాంతాలను అతను లెక్కచేయలేదు . మన గమ్యము ముందుగానే నిర్ణయించబడియుండుట , బాప్తిస్మము మరియు ప్రభు భోజనము అను విషయములను గురించిన అతని వేదంతపరమైన అభిప్రాయాలు అప్పటిలో క్రైస్తవ సంఘములో ఉన్న పారంపర్యాచారములకు వ్యతిరేకముగా ఉండడంతో అతను సంఘ పాదిరిగా తొలగించబడ్డారు . ఊహించని పరిణామాలను అతను అంగీకారయుతముగా ఆహ్వానించి , ఎటువంటి ఆర్థిక సహాయము లేకపోయినప్పటికీ , మరింత స్వేచ్ఛతో గ్రామాలలో తన ప్రభువును సేవిస్తూ చివరి వరకూ ముందుకు సాగిపోయారు జోనాతాన్ ఎడ్వర్డ్స్ . ప్రియమైనవారలారా , క్రీస్తు రాజ్యము యొక్క విస్తరణ కొరకు మీ హృదయములో జ్వాలలు మండుచున్నాయా ?
" ప్రభువా , మీ యొక్క కృపను బట్టి మీ పరిశుద్ధాత్మ యొక్క జ్వాలలతో నన్ను ప్రజ్వలింపజేయుము . ఆమేన్ ! "
  • WhatsApp
  • No comments:

    Post a Comment