బర్నబాస్ షా | Barnabas Shaw
- జననం: 12-04-1788
- మహిమ ప్రవేశం: 21-06-1857
- స్వస్థలం: ఎల్లోటన్
- దేశం: ఇంగ్లాండు
- దర్శన స్థలము: నమక్వాలాండ్, దక్షిణాఫ్రికా
బర్నబాస్ షా దక్షిణాఫ్రికాలో సేవ చేసిన ఒక మార్గదర్శక మిషనరీ. నమక్వా తెగల మధ్య తాను చేసిన పరిచర్యకు అతను పేరుగాంచారు. అతను తన తండ్రి యొక్క వ్యవసాయ క్షేత్రంలో గొర్రెలను పెంచుతూ పెరిగారు. ఆదివారపు బైబిలు పాఠశాలలో (సండే స్కూల్) క్రీస్తును తన రక్షకునిగా అంగీకరించిన అతను, ఇరవై ఏళ్ళ వయస్సు వచ్చేసరికి బహిరంగంగా ప్రసంగించడం మొదలుపెట్టారు. 1814వ సంll లో జరిగిన ఒక మెథడిస్టు కూడికలో మిషనరీ సేవ కొరకై దేవుడు తనకు ఇచ్చిన ఖచ్చితమైన పిలుపుకు విధేయులయ్యారు బర్నబాస్. భారతదేశంలో సేవ చేయుటకు అతను తనను సిద్ధపరచుకుంటున్నప్పటికీ, వెస్లియన్ మిషనరీ సొసైటీ అతనిని దక్షిణాఫ్రికాలో సేవ చేయుటకు పంపింది.
ఎంతో ఉత్సాహంతో కేప్ టౌన్‌కు వచ్చారు బర్నబాస్. కానీ, ఆ ప్రదేశం నుండి అందుకున్న ఆహ్వానం ఏదైనా అతని వద్ద ఉంటే తప్ప అక్కడికి వచ్చి సేవ చేయుటకు అనుమతించబడదని ఆ నగర గవర్నర్ అతనిని నిరాకరించారు. ఇప్పుడు ఏమి చేయాలని సందిగ్దములో ఉండిపోయిన బర్నబాస్, తాత్కాలికంగా రెండు ఆంగ్ల సైనిక స్థావరాలలో పరిచర్య చేశారు. అయినా అతను సంతృప్తి చెందలేదు. ఏలయనగా తాను అన్యులైన స్థానిక తెగల మధ్య సేవ చేయుటకు పిలువబడ్డాడని అతను తన హృదయములో ఎరిగియున్నారు. అక్కడి తెగలను కలుసుకొనుటకు అతను చేసిన ప్రయత్నాలన్నీ విఫలయత్నాలుగానే మిగిలిపోయాయి. అయితే, దేవుడు ఎంతో ఆసక్తికరమైన రీతిలో అతనికి మార్గమును తెరిచాడు.
ఒక రోజు అతను కేప్ టౌన్ వైపుగా బండిలో ప్రయాణిస్తున్నారు. దారిలో అతను అలసిపోయి ఉన్న ఒక ప్రజల గుంపును చూశారు. వారు దక్షిణాఫ్రికాలో ఒక జాతియైన నమక్వా అనే సమూహానికి చెందినవారు. వారిని అతను విచారించగా, వారి నాయకుడు “మేము ‘దేవుని వాక్యం’ గురించి విన్నాము. కాబట్టి, దానిని మాకు వివరించగల వ్యక్తి కొరకు మేము వెతుకుతున్నాము.” అని చెప్పారు. ఆహా! బర్నబాస్ ఆనందంతో బండి నుండి బయటకు దుమికి, యేసు క్రీస్తు ప్రభువు గురించి తాను వారికి బోధించెదనని చెప్పి వెంటనే ముందుకువచ్చారు. వివిధ వ్యక్తుల కోరికలను దేవుడు ఎంత అద్భుతంగా తీర్చగలడు!
నమక్వా తెగలవారు నాగరికత లేని జనాంగం అయినప్పటికీ, వారు అమాయక ప్రజలు. బర్నబాస్ వారికి ‘దేవుని వాక్యం’ బోధించుటకు ఎంతో సంతోషంగా శ్రమించారు మరియు వారికి నాగరికత కూడా నేర్పించారు. అతను విత్తిన ఆ మంచి విత్తనం సమృద్ధిగా ఫలములను ఇచ్చింది. అతని అభ్యర్థన మేరకు ఇంగ్లాండ్ నుండి మరి ఎక్కువ మంది మిషనరీలు వచ్చారు మరియు వారి పరిచర్య దక్షిణాఫ్రికాలోని అన్ని దిక్కులకు వ్యాపించింది.
నమక్వా ప్రజల మధ్య 10 సంవత్సరాల పాటు తీవ్రముగా పరిచర్య జరిగించిన తరువాత, ఎంతగానో అలసిపోయి నీరసించిపోయిన బర్నబాస్ ఆ తీవ్రమైన అలసట, బలహీనతల నుండి కోలుకొనుటకు ఇంగ్లాండుకు తిరిగి వచ్చారు. నమక్వాలాండ్‌కు తిరిగి వెళ్ళాలని అతను ఎంతగానో వాంఛించినప్పటికీ, అనారోగ్య కారణాల వల్ల వెళ్ళలేకపోయారు. ఏదేమైతేనేమి, 1857వ సంll లో తాను మరణించే వరకు కూడా ఇంగ్లాండులో పరిచర్య చేస్తూ దేవుని సేవలో ముందుకు సాగిపోయారు బర్నబాస్ షా.
ప్రియమైనవారలారా, క్రీస్తును గురించి మరింతగా తెలుసుకోవాలని మీ ఆత్మ వాంఛిస్తున్నదా? అన్యులకు క్రీస్తును తెలియజేయుటకు అది తృష్ణ కలిగియున్నదా?
ప్రభువా, మీ గురించి మరింతగా తెలుసుకొనుటకును మరియు మీ గురించి మరింతగా బోధించుటకును నాకు సహాయము దయచేయుము. ఆమేన్!
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment