మార్టిన్ బర్న్‌హామ్ మరియు గ్రేషియా | Martin Burnham and Gracia
- స్వదేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
- దర్శన స్థలము: ఫిలిప్పైన్స్
మార్టిన్ మరియు గ్రేషియా బర్న్‌హామ్ దంపతులు ఫిలిప్పైన్స్‌లో 17 సంll ల పాటు మిషనరీలుగా సేవ చేశారు. వారి వివాహం తరువాత, వారు అడవి ప్రాంతాలలో సేవ చేయడానికి తమను తాము సిద్ధపరచుకొనుటకుగాను అడవులలో కఠినమైన శిక్షణ పొందారు. ఒక విమానచోదక మిషనరీ (పైలట్ మిషనరీ) అయిన మార్టిన్, అడవులలో గిరిజనుల మధ్య పనిచేస్తున్న ఇతర మిషనరీలకు సహాయకునిగా సేవలందించారు. అతను మిషనరీలు మరియు గిరిజనులకు సరుకులను మరియు మందులను పంపిణీ చేసేవారు మరియు అనారోగ్యంతో ఉన్నవారు చికిత్స పొందుటకుగాను వారిని వైద్య సదుపాయాలు ఉన్న స్థలమునకు తీసుకువెళ్ళేవారు. అతను గిరిజనులు మరియు మిషనరీల పట్ల విశాల హృదయమును కలిగియున్నారు. గ్రేషియా అతనికి పనిలో మంచి సహకారిగా నిలిచారు.
మే 29, 2001. మార్టిన్ వేరొక దేశంలో పనిని నిర్వర్తించి రాగా, దంపతులిరువురు ఒక రిసార్ట్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు అబూ సయాఫ్ గ్రూప్ అనే ముస్లిం మతోన్మాద బృందం ఆ రిసార్ట్ మీద దాడి చేసి, ధనము కొరకు మిషనరీ దంపతులను మరియు మరికొందరిని బంధించి తీసుకువెళ్ళారు. వారి యొద్ద మిషనరీలు ఒక సంవత్సరానికి పైగా బందీలుగా ఉన్నారు.
ఆ సంవత్సర కాలంలో మిషనరీ దంపతులు భయంకరమైన అనుభవాలను ఎదుర్కొన్నారు. వారు ఆకలి, నిద్రలేమి మరియు అనారోగ్యంతో బాధపడ్డారు, మతోన్మాదుల దురాగతాలను చూశారు మరియు మతోన్మాదులకు మరియు సైన్యానికి మధ్య జరిగే కాల్పుల మధ్య ప్రాణ భయముతో జీవించారు. అటువంటి కష్టాలు, బాధల మధ్య దేవుడే వారికి నిరీక్షణ మరియు బలం. ఒకానొక సమయంలో గ్రేషియా నిరాశానిస్పృహలతో కృంగిపోయారు. క్రీస్తు తన కొరకు చనిపోయాడని ఆమె విశ్వసిస్తున్నప్పటికీ, దేవుడు తనను ప్రేమించుటలేదనే భావన ఆమెలో ప్రారంభమయ్యింది. అప్పుడు మార్టిన్ ఆమెతో “నమ్మితే నీవు సమస్తమునూ నమ్ము లేదా అసలు దేనినీ నమ్మకు” అని చెప్పారు. అటువంటి పరిస్థితులలో విశ్వాసములో స్థిరముగా నిలబడుటకు వారు ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు.
చివరికి, 2002వ సంll జూన్ 7వ తారీఖున ఫిలిప్పైన్స్ సైన్యం వారిని రక్షించుటకు చేపట్టిన ప్రయత్నంలో గాయపడిన గ్రేషియా రక్షించబడ్డారు. అయితే, ఆ ప్రయత్నములో జరిగిన కాల్పులలో 42 ఏళ్ళ మార్టిన్ ప్రాణాలు కోల్పోయారు. తరువాత గ్రేషియా అమెరికాకు తిరిగి వెళ్ళి తన పిల్లలను చేరుకున్నారు.
తన బాధాకరమైన అనుభవాలు తనను నిరుత్సాహపరిచి, దేవుని నుండి తాను దూరమయ్యేలా చేయుటకు గ్రేషియా అనుమతించలేదు. అయితే, కష్టాలను, శ్రమలను ఎదుర్కొంటున్న ఇతరులను ప్రోత్సహించుటకు ఆమె ఆ అనుభవాలను ఉపయోగించారు. ఆమె “మార్టిన్ అండ్ గ్రేషియా బర్న్‌హామ్ ఫౌండేషన్” ను స్థాపించారు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వైమానిక మిషనరీ సేవలు మరియు గిరిజనుల మధ్య పరిచర్యకు మద్దతునిస్తుంది. అంతేకాకుండా, ముస్లింల మధ్య జరిగే పరిచర్య పై కూడా ఇది దృష్టి నిలుపేదిగా ఉంది. గ్రేషియా తమను అపహరించిన ఆ ఉగ్రవాదులను క్షమించారు. ఆమె వారిని చెరసాలలో దర్శించి, వారితో క్రీస్తు ప్రేమను పంచుకున్నారు. కాగా, వారిలో కొందరు క్రీస్తును అంగీకరించారు కూడా. తాము పొందిన శ్రమ వెనుక దేవుడు కలిగియున్న గొప్ప ఉద్దేశ్యం ఇదేనేమోనని గ్రేషియా విశ్వసిస్తారు.
ప్రియమైనవారలారా, మీరు అనుభవించే కష్టాలు శ్రమల వెనుక ఉన్న దేవుని గొప్ప ఉద్దేశ్యములను మీరు చూడగలుగుతున్నారా?
ప్రభువా, నేను అనుభవించే కష్టాలు, శ్రమలు నా విశ్వాసమును అధిగమించకుండునట్లు నేను స్థిరముగా నిలబడగలుగుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment