ఐజాక్ మాసన్ | Isaac Mason
© quakerstrongrooms |
- జననం: 1870
- మహిమ ప్రవేశం: 1939
- స్వస్థలం: లీడ్స్
- దేశం: ఇంగ్లాండు
- దర్శన స్థలము: చైనా
జార్జ్ ఫాక్స్ ప్రారంభించిన ‘రిలిజియస్ సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్’ అనే సంస్థ యొక్క సభ్యుడు ఐజాక్ మాసన్. యవ్వనదశలో ఉన్నప్పుడు ఒక తలబిరుసు వ్యక్తిగా ఉండే ఐజాక్‌తో సంయమనం కలిగియుండటం కష్టమైన విషయముగా ఉండేది. అయితే కరోలిన్ సౌతాల్ వంటి ‘రిలిజియస్ సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్’ లోని తన తోటి సభ్యుల ప్రభావంతో అతను దీనత్వము కలిగిన నమ్మకమైన వ్యక్తిగా మారారు. అతను ఇంగ్లాండులోని లీడ్స్‌లో ఇనుప లోహమును అచ్చుపోయుటకు అచ్చులు తయారుచేసేవానిగా (ఐరన్ మోల్డర్) పనిచేస్తూ, సమయము దొరికినప్పుడు తన విద్యాభ్యాసమును పూర్తి చేసుకునేవారు. కరోలిన్ సౌతాల్ మరియు మరికొంతమంది స్ఫూర్తితో ఐజాక్ మాసన్ ‘ఫ్రెండ్స్ ఫారిన్ మిషనరీ అసోసియేషన్’ (ఎఫ్.ఎఫ్.ఎమ్.ఎ.) తో కలిసి చైనాలో పరిచర్య జరిగించుటకు తనను సమర్పించుకున్నారు.
ఎస్తేర్ బెక్‌విత్‌తో అతనికి వివాహం జరిగిన తరువాత, ఆ దంపతులిరువురూ 1894వ సంll లో చైనాకు వెళ్ళారు. అక్కడ వారు చెక్వాన్ ప్రావిన్స్‌లో స్థిరపడి, షె హాంగ్ మరియు సుయినింగ్ ప్రాంతాలలో మిషనరీ సేవకు తొలి పునాదులను వేశారు. పరిచర్యలోకి వచ్చిన కొద్ది సంవత్సరాలలోనే విదేశీయులకు వ్యతిరేకముగా చెలరేగిన బాక్సర్ తిరుగుబాటు యొక్క అల్లర్లను మాసన్ ఎదుర్కొనవలసి వచ్చింది. ఆ సమయంలో చాలా మంది మిషనరీలు తమ మిషన్ స్థావరాల నుండి పారిపోయి, తాత్కాలికంగా ఇతర దేశాలలో ఆశ్రయం పొందారు. అయితే మాసన్ మరియు అతని భార్య ఎస్తేర్ మాత్రం భయంకరమైన బాక్సర్ తిరుగుబాటును మాత్రమే కాదు, జిన్హాయ్ విప్లవాన్ని కూడా సహనంతో ఎదుర్కొన్నారు.
చైనా భాషను శీఘ్రముగా నేర్చుకొనిన మాసన్, సువార్తను ప్రకటించుటకై ఎంతగానో ప్రయాణించారు. చైనా ముస్లింల జీవితాలపై ప్రత్యేకమైన ఆసక్తిని కలిగియున్న అతను, అతని ప్రయాణాలలో వారి జీవితములను గురించిన సమాచారమును వివరముగా సమకూర్చి భద్రపరిచారు. అది పరిచర్యకు సంసిద్ధమగుటకు తదుపరి మిషనరీలకు ముఖ్యమైన ఉపకరణముగా మారింది. అతను అనేక క్రైస్తవ రచనలను చైనా భాషలోకి కన్ఫ్యూషియన్ నైతిక శైలిని అనుసరించి అనువదించారు. క్రైస్తవ విలువలు గుప్తమైయున్న షేక్స్పియర్ కథలను తీసుకొని, వాటిలో కరుణ, క్షమాపణ మరియు న్యాయం వంటి క్రైస్తవ నైతిక విలువలకు సంబంధించిన మూలాంశములను నొక్కి చూపుతూ ఆ కథలను తిరిగి వ్రాశారు ఐజాక్. ఆ విధముగా పరోక్షముగా క్రైస్తవ ఆలోచనలను ప్రచారం చేసే విధానం చైనా ప్రజల జీవితాలలోకి ఫలప్రదమైన బాటను వేసింది.
పశ్చిమ చైనాలో 22 సంవత్సరాల పాటు ఉన్న మాసన్, తరువాత షాంఘై వెళ్ళి తన అనువాద రచనలను ప్రచురించడంపై దృష్టి పెట్టారు. అతను డజన్ల కొద్దీ క్రైస్తవ పుస్తకాలను మరియు కరపత్రాలను ప్రచురించారు. అంతేకాకుండా, చైనా భాషలో బైబిలు యొక్క నిఘంటువును సంకలనం చేయడంలో కూడా సహకారమందించారు.
మిషనరీగాను మరియు అనువాదకుడిగాను ఈ లోకములో ఒక మనోహరమైన ప్రయాణమును సాగించిన ఐజాక్ మాసన్, 1939వ సంll లో మహిమనందు ప్రవేశించారు.
ప్రియమైనవారలారా, మీరు చేసే సేవలో ఈ లోకం క్రీస్తు ప్రేమను చూడగలుగుతుందా?
"ప్రభువా, దయ, క్షమాపణ మరియు న్యాయం వంటి క్రైస్తవ విలువలను సరైన విధముగా సమాజమునకు బోధించుటకు నాకు జ్ఞానమును దయచేయుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment