సిలాస్ మీడ్ | Silas Mead
- జననం: 16-08-1834
- మహిమ ప్రవేశం: 13-09-1909
- స్వస్థలం: సోమర్‌సెట్
- దేశం: ఇంగ్లాండు
- దర్శన స్థలము: ఆస్ట్రేలియా
ఆంగ్లేయుడైన సిలాస్ మీడ్ ఆస్ట్రేలియాలో సేవ చేసిన ఒక బాప్తిస్టు మిషనరీ. ఒక వ్యవసాయ కుటుంబములో జన్మించిన మీడ్ పారంపర్యంగా వస్తున్న వ్యవసాయమును కొనసాగించుట కంటే దైవిక జీవితము పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగియుండేవారు. 15 సంll ల వయస్సులో బాప్తిస్మం పొందిన అతను, త్వరలోనే వారి నగరంలో సువార్త ప్రకటించడం మరియు క్రైస్తవాలయంలో బోధించడం ప్రారంభించారు. అతను బైబిలు వేదాంతశాస్త్రంలో పట్టా పొందుటకుగాను రీజెంట్స్ పార్క్ కళాశాలలో చేరగా, అక్కడి కళాశాల ప్రిన్సిపాల్ అయిన జోసెఫ్ యాంగస్ పరిచర్య యెడల మీడ్ కలిగియున్న అవగాహనా దృష్టిని విస్తరింపచేశారు.
పట్టభద్రులైన పిమ్మట ‘బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ’ లో చేరుటకు దరఖాస్తు పెట్టుకున్నారు మీడ్. కానీ అతని అభ్యర్థన అంగీకరించబడలేదు. అయితే, ఆస్ట్రేలియాకు చెందిన విశ్వాసుల బృందం వారి మధ్య సేవ చేయుటకు ఒక పాదిరి వారికి కావలెనని కోరినప్పుడు సేవ చేయుటకు అవకాశం అతని తలుపు తట్టింది. యాంగస్ ప్రోత్సాహంతో, మీడ్ వెంటనే ఆ ఆహ్వానమును అంగీకరించి, 1861వ సంll లో ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరమునకు చేరుకున్నారు. అతను బాగా ఆకట్టుకునే బోధకునిగా కనిపించకపోయినప్పటికీ, సువార్త ప్రకటన పట్ల ఎంతో ఆసక్తి ఉత్సాహములతో అతను నిండుకొనియుండెడివారు. స్థానిక ప్రజలను క్రీస్తు వద్దకు తీసుకువచ్చుటకు తన భార్యతో పాటు అతను ఎంతో శ్రమించారు. త్వరలోనే అతను ‘ఫ్లిండర్ స్ట్రీట్ బాప్టిస్ట్ చర్చి’ ని నిర్మించగా, 5 సంll ల లోగానే ఆ సంఘములో 263 మంది సభ్యులు సమకూడారు.
ఒకవైపు పరిచర్య అభివృద్ధి చెందుతుండగా, మరొకవైపు మీడ్‌కు వ్యక్తిగత జీవితములో నిరాశలు ఎదురయ్యాయి. టైఫాయిడ్ జ్వరం కారణంగా అతని భార్య మరణించగా అతను హృదయ వేదనతో కృంగిపోయారు. ఐదుగురు పిల్లలను పెంచవలసిన బాధ్యత మరియు ఎదుగుతున్న సంఘ బాధ్యత అతని భుజాల పైనే పడింది. అయినప్పటికీ ఏనాడూ వెనుకంజ వేయక పరిచర్యను అడిలైడ్ హద్దులను మీరు విస్తరింపజేయుచూ ముందుకు సాగిపోయారు మీడ్. బాప్తిస్టు మిషన్‌ను ఐక్యపరిచి, ఉజ్జీవింపజేసి విస్తరింపజేయుటకుగాను అతను ‘సౌత్ ఆస్ట్రేలియా బాప్టిస్ట్ అసోసియేషన్’ ను స్థాపించి నడిపించారు. క్రైస్తవ్యములో ఐక్యత లేకపోవడమే సువార్త వ్యాప్తికి తీవ్రమైన అవరోధముగా ఉన్నదని అతను విశ్వసించారు. ఆత్మీయముగా ఎదిగిన విశ్వాసులు తమ క్రైస్తవ సంఘములను విడిచి మారుమూల ప్రాంతములకు వెళ్ళి నూతన సంఘములను స్థాపించవలెనని వారిని ప్రోత్సహించేవారు.
భారతదేశంలో కూడా ‘సౌత్ ఆస్ట్రేలియా బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ’ స్థాపించబడటం మరియు ‘ఫ్యూరిడ్‌పోర్ మిషన్’ ప్రారంభించబడటం వెనుక మీడ్ క్రియాశీలక వ్యక్తిగా ఉన్నారు. తరువాతి కాలంలో అతని కుమారుడు సిసిల్ మీడ్ అదే మిషన్‌లో సేవ చేయుటకు భారతదేశానికి వచ్చారు. తన వృద్ధాప్యంలో కూడా అలుపెరుగక సేవలో ముందుకు సాగిపోయిన సిలాస్ మీడ్, 1909వ సంll లో మహిమలోకి పిలువబడే వరకు కూడా అనేక క్రైస్తవ సంస్థలను నడిపిస్తూ, సలహాలనిస్తూ దేవునికి నమ్మకమైన దాసునిగా జీవించారు.
ప్రియమైనవారలారా, మీరు చేసే సేవలో ఈ లోకం క్రీస్తు ప్రేమను చూడగలుగుతుందా?
"ప్రభువా, నా వ్యక్తిగత జీవితములో నిరాశలు ఎదురైనప్పటికీ, మిమ్ములను సేవించుటలో ఎల్లప్పుడూ ఆనందించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment