Search Here

Oct 1, 2021

Mary Longdon | మేరీ లాంగ్‌డన్

మేరీ లాంగ్‌డన్ | Mary Longdon

  • జననం: -
  • మహిమ ప్రవేశం: -
  • స్వస్థలం: పెన్సిల్వేనియా
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: భారతదేశం


ఎంతో సమర్పణా అంకింతభావములతో భారతదేశంలో సేవలందించిన మిషనరీ మహిళా వైద్యులలో ఒకరిగా లెక్కించబడుతారు డాll మేరీ లాంగ్‌డన్. పెన్సిల్వేనియా మహిళా వైద్య కళాశాల నుండి పట్టభద్రురాలైన తరువాత వైద్యురాలిగా అక్కడే పనిచేసిన మేరీకి ఆ అనుభవం భారతదేశంలో ఆమె చేసిన సేవలో ఎంతో ఉపకరించింది. తదుపరి పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువును కొనసాగించారు మేరీ. తన వైద్య శిక్షణను పూర్తిచేసుకొనిన పిమ్మట భారతదేశంలో సేవ చేయుట కొరకు సమర్పించుకొనిన మేరీ, 1899వ సంll డిసెంబరు మాసంలో భారతదేశానికి పయనమయ్యారు.


భారతదేశంలో మొట్టమొదట ఆమె దేవగఢ్‌లో స్థిరపడ్డారు. అక్కడ ఆమె దాదాపు పన్నెండు సంవత్సరాలు ఉన్నారు. ఆమె తరువాత బిలాస్‌పూర్‌లో ఐదు సంవత్సరాలు, పిమ్మట పెంద్రా రోడ్‌లో పదేళ్లపాటు సేవలందించారు. తన సేవ చివరిలో కొన్ని సంవత్సరాల పాటు ఆమె యునైటెడ్ ప్రావిన్స్‌లోని హమీర్‌పూర్ జిల్లా యొక్క అన్ని వైద్యపరమైన సేవలను పర్యవేక్షించారు. ఆ సమయంలో ఆమె అందించిన సేవలలో కుల్‌పహార్‌లోని మిషన్ గృహాలలోని పిల్లలు మరియు మహిళల సంరక్షణా బాధ్యతలను నిర్వహించడం కూడా ఒకటి. ఎంతో క్లిష్టమైన భౌగోళిక మరియు వాతావరణ పరిస్థితుల గుండా ఆమె మహోబా మరియు రథ్ ప్రాంతాలకు తరచుగా ప్రయాణించేవారు. అది ఎంతో అలసటతో కూడుకున్న పని.



మేరీ అందించిన సేవలలో అత్యంత ముఖ్యమైనది ఏమంటే పెండ్రా రోడ్ యొక్క క్షయవ్యాధి ఆరోగ్య కేంద్రమును ఏర్పాటుచేయడం. క్షయవ్యాధి కొరకు భారతదేశంలోని ఆ ప్రాంతంలో ఉన్న ఏకైక వైద్యసంస్థ అది. అక్కడ కులమత బేధాలు, స్త్రీ పురుషులనే తారతమ్యాలు లేకుండా అందరికీ సేవలందించబడుతాయి. తన మంచిమర్యాదలు మరియు దయగల స్వభావము ద్వారా ఉన్నత వర్గాలకు చెందిన అనేక మంది భారతీయ స్నేహితులను సంపాదించుకొనగలిగారు మేరీ. అటువంటి స్నేహబంధాల ద్వారానే ఆమె ఆ ఆరోగ్య కేంద్రమును నిర్మించుటకు ఒక హిందూ కుటుంబం నుండి మొదటి సహాయమును పొందారు. దానిని నిర్మించుటకు తగిన స్థలమును గుర్తించుటకు ఎంతో ప్రయాసపడిన మేరీ చివరకు పెంద్రా రోడ్డును అందుకొరకు ఎంచుకున్నారు. తరువాతి కాలంలో ఈ ఆరోగ్య కేంద్రం ఒక యూనియన్ క్రైస్తవ సంస్థగా మారింది.



తాను చేయవలసిన పనిని గురించి ముందుగానే బహు జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవడం మరియు నమ్మకముగా ఆమె చేసిన సేవ ఎంతో మందికి శారీరక మరియు ఆత్మీయ స్వస్థతను చేకూర్చాయి. 38 సంll ల పాటు నమ్మకముగా సేవలందించిన పిమ్మట భారతదేశంలో వైద్య మిషనరీగా తన బాధ్యతల నుండి 1937వ సంll లో పదవీవిరమణ పొందారు మేరీ లాంగ్‌డన్.



ప్రియమైనవారలారా, మీ కుటుంబము, ఉద్యోగము మరియు క్రైస్తవ సంఘములలో మీరు నిర్వర్తించవలసిన బాధ్యతలలో మీరు నమ్మకముగా ఉంటున్నారా?



"ప్రభువా, నేను నా బాధ్యతలను నమ్మకముగాను మరియు స్థిరముగాను నెరవేర్చగలుగునట్లు నా పాదములను బండమీద నిలిపి నా అడుగులను స్థిరపరుచుము అని వేడుకుంటున్నాను. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • No comments:

    Post a Comment