క్లైడ్ డాట్సన్ గారి జీవిత చరిత్ర
- జననం: 29-07-1905
- మహిమ ప్రవేశం: 30-09-1982
- స్వస్థలం: అలబామా
- దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
- దర్శన స్థలము: రోడేషియా (జింబాబ్వే)
1954వ సంవత్సరం, జనవరి మాసం. ఒకరోజు రాత్రి ఎక్కడో గోక్వే లోయలో (ప్రస్తుత జింబాబ్వే) విశ్రాంతి తీసుకొనుటకు గ్రామంలో స్థలం దొరకని ఒక మిషనరీ మోపనే చెట్టుకి (సీతాకోకచిలుక చెట్టు) ఊయలవేసి, దోమతెరను కట్టుకొంటున్నారు. అతను సువార్త బోధిస్తూ సైకిల్‌పై ప్రయాణించినందున అతను ఆ రోజు చాలా అలసిపోయి ఉన్నారు. అంతలో కొంతమంది గ్రామస్థులు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ఏనుగులు దాడి చేస్తాయని అతనిని హెచ్చరించారు. అప్పుడు ఆ మిషనరీ, “నా దేవుడు ఏనుగుల కంటే పెద్దవాడు. ఆయన నన్ను కాపాడుతాడు” అని సమాధానం ఇచ్చారు. అది రోడేషియా తెగల మధ్య క్లైడ్ డాట్సన్ యొక్క మిషనరీ ప్రయాణ ప్రారంభం.
అలబామాలో పాదిరిగా పనిచేస్తున్న సమయంలో క్లైడ్‌కు ఆఫ్రికాలో మిషనరీగా సేవ చేసే అవకాశం లభించింది. కాగా 21 సంll ల వయస్సులో అతను తన ఇంటిని విడిచిపెట్టి, చిమనీమణి జిల్లాలోని రుసితు మిషన్‌లో పనిచేయుటకు దక్షిణాఫ్రికా మిషన్ బోర్డ్‌లో చేరారు. అక్కడి సమాజంలో పాతుకుపోయి ఉన్న మూఢ నమ్మకాలు మరియు క్రైస్తవ సంఘములలో ప్రబలంగా ఉన్న జాతి వివక్షను చూసినప్పుడు అతని గుండె పగిలిపోయింది. అతనికి దేవుడు తప్ప మరే మద్దతు లేకపోయినప్పటికీ, రోడేషియాలోని అన్యజనులలో ఆత్మీయ మార్పు తీసుకురావాలని అతను ధృఢనిశ్చయముతో ముందుకుసాగారు.
పోర్చుగీసు తూర్పు ఆఫ్రికా (ప్రస్తుతం మొజాంబిక్)లోని మారుమూల గ్రామాలలో సువార్తను ప్రకటించుటకును మరియు ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించుటకును కొండ ప్రాంతాల గుండా క్లైడ్ చాలా దూరం కాలినడకన ప్రయాణించారు. గ్రామాలలో రాత్రి పూట విడిది చేసి, వస్తుమార్పిడి ద్వారా గ్రామస్థుల నుండి ఆహారమును పొందారు. ఒకసారి అతను సన్యాతి తెగవారికి ఇవ్వబడిన ప్రాంతములో మూడు నెలలు విడిది చేయగా, అది చివరికి సన్యాతి మిషన్ ప్రారంభానికి దారితీసింది.
అతని మిషనరీ జీవితంలో ఎక్కువ భాగం విద్యుత్తు సదుపాయంలేకుండా గడ్డితో కప్పబడి, మట్టితో నిర్మించబడినటువంటి పూరిళ్ళలోనే అతని నివాసం సాగింది. స్నానం కొరకు 18 మైళ్ళు, త్రాగునీరు తెచ్చుకొనుటకు 100 మైళ్ళు అతను నడిచేవారు. అటువంటి కష్టతరమైన పరిస్థితులలో కూడా అతను దేవుని ప్రేమను ప్రకటిస్తూ 40 సంవత్సరాల పాటు ఆఫ్రికాలోనే ఉన్నారు. ఆ కాలపరిథిలో అతను 26 క్రైస్తవాలయములను నిర్మించారు మరియు 126 మందికి పైగా ప్రజలకు బాప్తిస్మము ఇచ్చారు.
ఆరోగ్యం బాగా క్షీణిస్తుండటంతో 1972వ సంll లో అతను అలబామాకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది. అయినప్పటికీ 1982వ సంll లో తాను మహిమలోకి పిలువబడే వరకు కూడా అలబామాలో దేవుని పరిచర్యను కొనసాగించారు క్లైడ్ డాట్సన్.
ప్రియమైనవారలారా, మన దేవుని యొక్క శక్తిపై మీకున్న విశ్వాసం ఆయన కొరకు శక్తివంతమైన కార్యములను చేయుటకు మిమ్ములను పురికొల్పెడిదిగా ఉన్నదా?
ప్రభువా, నీవు అన్నింటికన్నా శక్తిమంతుడవు అన్న విశ్వాసముతో ఈ లోకంలో భయాలను అధిగమించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment