మారియా డయ్యర్ టేలర్ గారి జీవిత చరిత్ర
- జననం: 16-01-1837
- మహిమ ప్రవేశం: 23-07-1870
- స్వస్థలం: పెనాంగ్
- దేశం: మలేషియా
- దర్శన స్థలము: చైనా
యాంగ్జౌలోని హడ్సన్ టేలర్ ఇంటిలోనికి గుంపుగా కొంతమంది జనులు చొరబడ్డారు. అక్కడ అనేక మంది మిషనరీలైన యువతులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ప్రాణభయంతో పరుగెత్తగా, ఆరు నెలల గర్భిణిగా ఉన్న ఒక స్త్రీ మాత్రం ఎంతో శాంతియుతంగా ఆ అల్లరి గుంపులో ఉన్నవారితో మాట్లాడడం ద్వారా వారిని ఆపగలిగారు. ఆ విధముగా ఆ రోజున చాలా మంది యువతులను ఆ జనుల గుంపు చేతులలో శ్రమనొంది మరణించకుండా కాపాడిన ఆమె మరెవరో కాదు మారియా జేన్ (డయ్యర్) టేలర్.
మారియా లండన్ మిషనరీ సొసైటీ యొక్క మిషనరీ అయిన శామ్యూల్ డయ్యర్ యొక్క చివరి కుమార్తె. పదేళ్ళ వయస్సులో తల్లిదండ్రులను కోల్పోయిన ఆమె ఇంగ్లాండులో తన తల్లి యొక్క సోదరుని వద్ద పెరిగారు. తల్లిదండ్రుల ద్వారా ప్రేరణ పొందిన మారియాకు కూడా మిషనరీ పని వైపు మొగ్గు ఉన్నప్పటికీ, ఆమె క్రైస్తవ భక్తి కేవలం లాంఛనప్రాయమైనది. అయితే ఆమెకు 16 సంll ల వయసు ఉన్నప్పుడు చైనా దేశంలోని నింగ్బోలో ఉన్న ఒక బాలికల మిషనరీ పాఠశాలలో పనిచేసే అవకాశం లభించింది. కాగా చైనాకు వెళ్ళే ఆ ప్రయాణంలోనే ఆమె పాపము నుండి విమోచించే రక్షకునిగా క్రీస్తునందు విశ్వాసముంచి, దేవుని సేవ కొరకై తన జీవితాన్ని సమర్పించుకున్నారు.
చైనా చేరిన తరువాత ఆమె అతి త్వరలోనే చైనా భాషను నేర్చుకుని, నింగ్బో మాండలికంలో నిష్ణాతులుగా మారారు. కాగా తన విద్యార్థులు మంచి గ్రహింపును కలిగి పాఠ్యభాగములను అర్థం చేసుకొనవలెనని ఆమె ఆంగ్లంలో ఉన్న పాఠ్యపుస్తకములను చైనా భాషలోనికి అనువదించారు. తదుపరి 1858వ సంll లో హడ్సన్ టేలర్‌ను వివాహం చేసుకుని, అతనికి ఒక అమూల్యమైన సహచరిణిగాను, మంచి భాగస్వామిగాను మారారు. హడ్సన్ టేలర్ చైనా ఇన్‌లాండ్ మిషన్‌ను స్థాపించినప్పుడు మారియా ఆ సేవలో కీలక వ్యక్తి అయ్యారు. ప్రార్థన, విశ్వాసాలతో నిండుకొనిన ఆమె యొక్క జీవితం కష్ట సమయాలలో తన భర్తను బలపరిచేదిగా నిలిచింది. ఆమె ఆచరణాత్మక దృక్పథం పరిచర్య మొత్తాన్ని కలిపివుంచే తీగవంటిది. వారి పరిచర్య అభివృద్ధి చెందుతున్నప్పుడు చైనావారి సంస్కృతిని అవలంబించుటకు మిషనరీలైన యువతులకు ఆమె శిక్షణనిచ్చారు.
ఒకవైపు పరిచర్య ఎంతో తీవ్రముగా కొనసాగుతుంది. అయితే ఆమె తన యొక్క ఎనిమిది మంది పిల్లలలో నలుగురిని కోల్పోయారు. పైగా ఆరోగ్యపరంగా కూడా ఆమె బాగా బలహీనపడ్డారు. అయినప్పటికీ క్రీస్తు సేవ చేయాలనే ఆమె దృఢ నిశ్చయాన్ని ఏదీ కూడా కదల్చలేకపోయింది. మారియా తన పిల్లలలో కూడా మిషనరీ విలువలను ప్రోత్సహించగా, అది వారు కూడా చైనాలో మిషనరీలుగా మారుటకు దారితీసింది. 33 సంవత్సరాల వయస్సులో కలరా వ్యాధితో బాధపడిన మారియా టేలర్ చైనా భూమిలో ఒక గోధుమ గింజ వలె మరణించారు.
ప్రియమైనవారలారా, మిషనరీలను మరియు వారు చేయు పనిని ప్రోత్సహించుటలో మీ పాత్ర ఏమిటి?
"ప్రభువా, తరువాతి తరం మిషనరీలను సిద్ధపరచుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment