Search Here

Jul 26, 2022

David Wilkerson | డేవిడ్ విల్కర్సన్

డేవిడ్ విల్కర్సన్   గారి జీవిత చరిత్ర



  • జననం: 19-05-1931
  • మహిమ ప్రవేశం: 27-04-2011
  • స్వస్థలం: పెన్సిల్వేనియా
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: అమెరికా సంయుక్త రాష్ట్రాలు


పెన్సిల్వేనియాలోని పెంతెకొస్తు బోధకుల కుటుంబములో జన్మించారు డేవిడ్ రే విల్కర్సన్. చాలా చిన్న వయస్సులోనే బాప్తిస్మము తీసుకున్న విల్కర్సన్, పదునాలుగేళ్ళ వయసులోనే దేవుని వాక్యమును ప్రకటించడం ప్రారంభించారు. 1952వ సంll లో సేవ చేయుటకు నియామక అభిషేకం పొందిన పిమ్మట అతను పెన్సిల్వేనియాలోని స్కాట్స్ డేల్ మరియు ఫిలిప్స్‌బర్గ్ అనే ప్రాంతములలో పాదిరిగా పరిచర్య చేశారు. 


1958వ సంll లో, న్యూయార్క్‌లో యవ్వనస్థులతో కూడిన ఒక ముఠా పాల్పడిన హత్య కేసు గురించి చదివిన విల్కర్సన్, ఆ నగరంలో అటువంటి ముఠాలలో ఉన్నవారికి మరియు మాదకద్రవ్యాలకు బానిసలైనవారికి సహాయం చేయవలెనని దేవుడు తనకు పిలుపునిస్తున్నట్లు భావించారు. కాగా 28 సంll ల వయస్సులో అతను క్రైస్తవ సంఘములో సేవలందిస్తూ ఎంతో సౌకర్యవంతముగా సాగిపోతున్న జీవితమును విడిచిపెట్టి న్యూయార్క్ నగరమునకు వెళ్ళారు. అక్కడ అతను వీధులలో ప్రసంగించారు, కూడికలను, సభలను నిర్వహించారు మరియు మాదకద్రవ్యాల నుండి బయటపడుటకు యవ్వనస్థులు ఆశ్రయించులాగున ఒక గృహమును ఏర్పాటుచేశారు. అతని పరిచర్య మూలముగా ఎంతో మంది ముఠా సభ్యులు బైబిలు కొరకు తమ ఆయుధములను ఇచ్చివేశారు మరియు క్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించుటకు ముందుకు వచ్చారు. అటువంటి వారిలో ఒకరు ‘మౌ మౌ’ ముఠా నాయకుడైన నిక్కీ క్రూజ్.


ఒక రోజున విల్కర్సన్ నిక్కీని కలుసుకొని అతనితో సువార్తను పంచుకొనగా, నిక్కీ అతని ముఖముపై ఉమ్మివేసి, మరెప్పుడైనా తన దగ్గరికి వస్తే చంపుతానని బెదిరించారు. అందుకు విల్కర్సన్ “మీరు నన్ను వెయ్యి ముక్కలుగా చేసి వీధిలో పారవేసినా, ప్రతియొక్క ముక్క కూడా మిమ్ములను ప్రేమిస్తుంది” అని అతనికి బదులిచ్చారు. ఆ మాటలు నిక్కీని ఎంతోకాలం వెంటాడాయి. చివరికి విల్కర్సన్ యొక్క ఒక కూడికలో నిక్కీ తన జీవితమును యేసు క్రీస్తు ప్రభువుకు సమర్పించారు. అటు పిమ్మట తన ముఠా సభ్యులలో అనేకమందిని క్రీస్తు వద్దకు నడిపించారు నిక్కీ.


యవ్వనస్థుల మరియు పెద్దవారి యొక్క భౌతిక మరియు ఆత్మీయ శ్రేయస్సు కొరకు అమెరికా, ఐరోపా మరియు ఆసియాలలో అనేక మిషన్లను స్థాపించి తన పరిచర్యను విస్తరింపజేశారు విల్కర్సన్. 1967వ సంll లో “యూత్ క్రూసేడ్స్‌” అను పరిచర్యను కూడా స్థాపించారు. ఇది ప్రధానంగా మాదకద్రవ్యాలు, మద్యం మరియు హింసాత్మక కార్యకలాపాల వైపుకు జారిపోకుండా యవ్వనస్థులను నిరోధించుటకు పనిచేసింది.


అంతేకాదు, విల్కర్సన్ ‘టైమ్స్ స్క్వేర్ చర్చి’ యొక్క స్థాపకులు కూడా. ఆ సంఘములో అతను నీతిగలిగి జీవించుటకును మరియు దేవునిపై పూర్తిగా ఆధారపడుటకును ప్రోత్సహించేటటువంటి కొన్ని శక్తివంతమైన దైవ వాక్య సందేశములను ఇచ్చారు. నిర్భయుడైన సువార్తికునిగాను, దయాకనికరములు గల పాదిరిగాను మరియు జ్వలించుచున్న నిప్పువంటి బోధకునిగాను కనిపించే డేవిడ్ విల్కర్సన్, 2011వ సంll లో పరమందు తన ప్రభువును చేరుకొన ఇహలోకమును విడిచివెళ్ళారు.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, ఇతరుల ఆత్మీయ అవసరతలను సంధించుటకు మీరు ఎంతటి దయాకనికరములు కలిగిన హృదయమును కలిగియున్నారు? 


ప్రార్థన :

"ప్రభువా, ప్రపంచ నలుమూలలకూ సువార్తను విస్తరింపజేయుటకు విశ్వాసముతో నేను ముందుకు అడుగువేయగలుగునట్లు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • No comments:

    Post a Comment