Search Here

Jul 26, 2022

Elekana | ఎలెకానా

 ఎలెకానా గారి జీవిత చరిత్ర

Pictures shown are for illustration purpose only



  • జననం: 19 వ శతాబ్దం
  • మహిమ ప్రవేశం: 19 వ శతాబ్దం
  • స్వస్థలం: మాణిహీకీ
  • దేశం: కుక్ దీవులు
  • దర్శన స్థలము: తువాలు దీవులు


పసిఫిక్ మహాసముద్రంలోని తువాలు ద్వీపాల ప్రజలకు క్రైస్తవ్యమును పరిచయం చేసిన ఘనత ‘తువాలు యొక్క అపొస్తలుడు’ అని పిలువబడే ఎలెకానాకు దక్కుతుంది. కుక్ దీవులలోని మాణిహీకీలో లండన్ మిషనరీ సొసైటీ యొక్క సహాయక పరిచారకునిగా (డీకనుగా) ఉన్న అతను, ఆ దీవులలో జరుగు పరిచర్యకు నాయకత్వం వహించారు. ఒకసారి ఎలెకానా మరియు మరో ఆరుగురు మిషనరీలు పరిచర్య నిమిత్తం సమీపంలోని రాకాహంగా ద్వీపమునకు వెళ్ళుచుండగా, వారు ప్రయాణించుచున్న పడవ తుఫానులో చిక్కుకుంది. కాగా ఎనిమిది వారాల పాటు సముద్రములో కొట్టుకొనిపోయిన వారు, చివరికి వారి గమ్యమునకు 2700 కి.మీ. దూరంలో ఉన్న తువాలు దీవులలోని ఒక దీవికి చేరుకున్నారు.


క్రొత్తగా తమ దీవిలో అడుగుపెడుతున్నవారిని చూచుటకై సముద్రపు ఒడ్డుకు పరుగెత్తి వచ్చిన తువాలు ప్రజలు వారిని నిండు హృదయముతో స్వాగతించారు. వారు నివసించుటకై ఆ ప్రజలు గుడిసెలు మరియు గుడారాలను కూడా ఏర్పాటు చేశారు. ఎలెకానా యొక్క గమ్యస్థానం మారినప్పటికీ, అతని లక్ష్యం మాత్రం మారలేదు. అదేమనగా, క్రీస్తు ప్రేమను ప్రకటించడం! కాగా అతను తన చుట్టూ ఉన్న ప్రజలను పోగుచేసి, యేసు క్రీస్తు యొక్క ప్రేమను గురించియు మరియు దేవుడు దయచేసే కాపుదల మరియు భద్రతలను గురించియు వారికి చెప్పడం ప్రారంభించారు. అతను ప్రకటించునది వారికి వింతగా అనిపించినప్పటికీ, ఎంతో ఆసక్తిగా విన్నారు. త్వరలోనే నిజమైన దేవుడు ఎవరనునది అక్కడి స్థానికులు గ్రహించారు. తత్ఫలితముగా వారు తమ పూర్వీకుల కొరకు కట్టిన మందిరములను పడగొట్టి, ఎలెకానా యొక్క నడిపింపులో నిజమైన దేవునిని ఆరాధించడం ప్రారంభించారు. ఈ సంగతులన్నీ కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే జరిగాయంటే ఆశ్చర్యమే!


తదుపరి ఎలెకానా మరలా తిరిగి వచ్చెదనని వారికి మాట ఇచ్చి ఆ తువాలు దీవికి వీడ్కోలు పలికారు. అటు పిమ్మట సమోవాలో కొన్ని సంవత్సరాల పాటు శిక్షణ పొంది, పరిచర్య చేసిన తరువాత, తాను ఇచ్చిన మాట చొప్పున తువాలు దీవులకు తిరిగివెళ్ళారు ఎలెకానా. అయితే ఈసారి అతను మరొక మిషనరీని వెంటబెట్టుకొని, అనేక సువార్త రచనలను తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడి స్థానికులలో అనేకమంది పురుషులు చెరపట్టబడి బానిసలుగా పెరూ దేశమునకు కొనిపోబడ్డారని అతను తెలుసుకున్నారు. అయినప్పటికీ, ఆ దీవులలో సువార్త సేవను కొనసాగించారు ఎలెకానా.


పిమ్మట మిషనరీ సేవ చేయుటకై ఆస్ట్రేలియాకు వెళ్ళిన అతను, తన చివరి రోజులను కుక్ దీవులలో గడిపారు. అతని కుమారుడు కూడా మిషనరీగా మారి సేవ చేయుచున్నప్పుడు, పాపువా దీవులలో అతను చంపబడగా, ఎలెకానా వృద్ధాప్యములో ఉన్నప్పటికీ, ఆ ప్రదేశానికి తన కుమారుని స్థానములో మిషనరీగా వెళ్ళుటకు ముందుకు వచ్చారు. దేవుని పట్ల మరియు నశించిపోవుచున్న ఆత్మల పట్ల ఎలెకానాకు ఉన్న ప్రేమ అటువంటిది!


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, దేవుడు మిమ్ములను ఎక్కడికి తీసుకువెళ్ళెదరో ఆ చోటికి వెళ్ళి సేవ చేయుటకు మీరు అంగీకరించెదరా? 


ప్రార్థన :

"ప్రభువా, మీరు నన్ను ఎక్కడ ఉంచెదరో ఆ స్థలములో మీకు నమ్మకముగా సేవ చేయుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • No comments:

    Post a Comment