ఎలియాస్ రిగ్స్ గారి జీవిత చరిత్ర
- జననం: 19-11-1810
- మహిమ ప్రవేశం: 17-01-1901
- స్వస్థలం: న్యూజెర్సీ
- దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
- దర్శన స్థలము: గ్రీసు
మొదటి నుండి కూడా ప్రతి స్థలములో ఉన్న మనుష్యులందరికీ సువార్తను సమర్థవంతముగా అందించడం అనునది క్రైస్తవ పరిచర్యను ముందుకు నడిపించే శక్తిగా ఉంది. ఈ విషయంలో భాషావేత్తలు ప్రాముఖ్యమైన పాత్రను పోషించారు. వారు తాము కలిగియున్న తలాంతులను దేవుని రాజ్య విస్తరణ కొరకు ఉపయోగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటువంటి అనేకమంది భాషావేత్తలలో ‘అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ ఫర్ ఫారిన్ మిషన్స్’ (ఎబిసిఎఫ్ఎమ్) అనే సంస్థకు చెందినవారైన ఎలియాస్ రిగ్స్ ఒకరు.
దేవునియందు భయభక్తులు కలిగిన ఒక క్రైస్తవ కుటుంబములో జన్మించారు రిగ్స్. అతనికి 13 సంll ల వయస్సు వచ్చేటప్పటికి అతను హెబ్రీ మరియు గ్రీకు భాషలలో నిష్ణాతులయ్యారు. తదుపరి అమ్హెర్స్ట్ కళాశాలలో చేరిన అతను, అక్కడ చదువుకునే సమయంలో ‘ఫ్రెండ్స్’ అనే సంస్థతో చేరారు. ఒక రహస్య సంస్థయైన ఈ సంస్థ విద్యార్థులలో మిషనరీ సేవ పట్ల ఆసక్తిని రేకెత్తించుటకై పనిచేసేది. అటు పిమ్మట ‘ఆండోవర్ థియోలాజికల్ సెమినరీ’ అనే బైబిలు వేదాంత కళాశాల నుండి పట్టభద్రులైన అతను, విస్తృతమైన తన మిషనరీ పరిచర్యను ప్రారంభించారు.
22 సంll ల వయస్సులో సేవ చేయుటకు నియామక అభిషేకం పొందిన తరువాత, రిగ్స్ తన భార్యయైన మార్తా జేన్ డాల్జెల్‌ను తీసుకొని గ్రీసు దేశమునకు పయనమయ్యారు. మొదట ఏథెన్స్ నగరములో స్థిరపడిన అతను, అరామిక్ భాషలో వ్రాయబడిన బైబిలులోని భాగములను గ్రీకు భాషలోకి అనువదించుటలో తన సమయమును వెచ్చించారు. అటు పిమ్మట అతను సువార్తను ప్రకటించుచూ, కరపత్రములను పంచుతూ, మరి ముఖ్యముగా అనువాద పరిచర్యలో సహాయం చేస్తూ గ్రీసు దేశములోని అనేక ప్రాంతములను పర్యటించారు. అతను ఏడు పురాతన మరియు 14 ఆధునిక భాషలను నేర్చుకొని, ఆ భాషలలోని అనువాద పనిలో భాగస్థులయ్యారు. వాటిలో అర్మేనియా, బల్గేరియా మరియు టర్కీ భాషలు కూడా ఉన్నాయి. అతను బైబిలును అనువదించే పరిచర్య చేసిన అనువాదకులు మాత్రమే కాదు, వేదాంత శాస్త్రమును బోధించే బోధకులు, ప్రసంగికులు మరియు అనేక ఆత్మీయ పుస్తకములను సవరించినవారు కూడా. అంతేకాకుండా తన భార్యతో కలిసి అర్గోస్‌లో ఒక బాలికల పాఠశాలను కూడా నడిపించారు మరియు పిల్లల మధ్యలో పరిచర్యను జరిగించారు రిగ్స్.
మిషనరీగా ఎలియాస్ రిగ్స్ యొక్క పరిచర్య 68 సంll ల పాటు జరిగింది. అన్ని సంవత్సరాల కాలంలో అతను ఎటువంటి పనిలేకుండా ఉన్న సందర్భాలు చాలా అరుదు. ఎదురువచ్చిన అడ్డంకులను, కష్టములను సహించిన అతను, తాను కలిగియున్న తలాంతులను దేవుని మహిమార్థమై ఉపయోగించవలెననిన దృఢ నిశ్చయముతో ముందుకు సాగిపోయారు. అతని కుటుంబ సభ్యులు అతని పరిచర్య యొక్క వారసత్వమును కొనసాగించగా, అతని పిల్లలలో ముగ్గురు కుమారులు దైవసేవకులు అయ్యారు మరియు పదిమంది మనుమలు మనుమరాండ్రు మిషనరీలయ్యారు.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, దేవుడు మీకు దయచేసిన తలాంతులను మరియు సామర్ధ్యములను మీరు ఆయన కొరకు ఉపయోగించెదరా?
ప్రార్థన :
"ప్రభువా, నాకున్న తలాంతులు మరియు సామర్ధ్యములన్నింటినీ మీ మహిమ కొరకును మరియు మీ రాజ్య విస్తరణ కొరకును ఉపయోగించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !
No comments:
Post a Comment