Search Here

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

May 13, 2023

Antony of Egypt | ఈజిప్టుకు చెందిన ఆంటోనీ

ఈజిప్టుకు చెందిన ఆంటోనీ గారి జీవిత చరిత్ర



  • జననం : క్రీ.శ. 251
  • మరణం : క్రీ.శ. 356
  • స్వస్థలం : కోమ
  • దేశం : ఈజిప్ట్
  • దర్శన స్థలము : -


ఆరంభకాల క్రైస్తవులలో అనేకమంది క్రీస్తుతో మరింత లోతైన సహవాసాన్ని కలిగియుండవలెనని వారి ప్రాపంచిక జీవితాన్ని త్యజించి క్రైస్తవ సన్యాసాన్ని స్వీకరించారు. తీవ్ర స్థాయిలో స్వీయాన్ని తృణీకరించుటను సాధన చేస్తూ వారు తమ ఆత్మీయ జీవితములో ముందుకు సాగిపోయారు. వేరుపరచబడిన జీవితమును, స్వీయ తృణీకరణను మరియు ప్రార్థన జీవితమును కలిగియుండి, దైవభక్తి గల జీవితము జీవించుటకు ఎంతోమందికి ప్రేరణనిచ్చిన సెయింట్ ఆంటోనీ అటువంటి ఆరంభకాల క్రైస్తవ సన్యాసులలో ఒకరు.


ఈజిప్టుకు చెందిన ఒక సంపన్న కుటుంబములో జన్మించిన ఆంటోనీ, తన తల్లిదండ్రుల మరణం కారణంగా యుక్త వయస్సులోనే వారసత్వపు ఆస్తులను పొందారు. అదే సమయంలో "నీవు పరిపూర్ణుడవగుటకు కోరినయెడల, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము" అని యేసు క్రీస్తు ఒక ధనవంతుడైన యవ్వనస్థునికి చెబుతున్న మత్తయి సువార్తలోని లేఖన భాగము చదువబడుచుండగా ఆంటోనీ వినడం జరిగింది. కాగా తానే ఆ ధనవంతుడైన యవ్వనస్థుడని నమ్మిన ఆంటోనీ, వెంటనే ఆ లేఖనభాగములోని యౌవనుడికి యేసు సూచించిన ప్రకారం చేశారు.


తదుపరి అతను తన ఇంటిని మరియు స్వగ్రామమును విడిచిపెట్టి, ఒక మారుమూల ప్రాంతములో ఉండి, ప్రార్థన మరియు ఉపవాసములతో నిద్రలేని రాత్రులను గడిపారు. తన ఆత్మ క్రీస్తునందు బలపడవలెనని అతను శారీరక ఆశలను, సుఖభోగములను తృణీకరించారు. అంధకార శక్తులు అతనిపై నిరంతరం దాడిచేస్తుండటంతో అతను ఎల్లప్పుడూ ఆత్మలో పోరాడుతూనే ఉండేవారు. అతని ఆత్మపైన మరియు దేహముపైన అపవాది చేస్తున్న భయంకరమైన దాడులను అతను సహిస్తూ, వాటిని ఎదిరించి పోరాడుతూ, ఆత్మీయ జీవితములో జయశీలునిగా నిలబడ్డారు. తత్ఫలితముగా దేవుని యొక్క జ్ఞానముతోను మరియు శక్తితోను నింపబడిన ఆంటోనీ, ఆత్మీయ జయజీవితము యొక్క రహస్యమును గురించి ప్రజలకు తెలియజేయుటకు ప్రారంభించారు. అంతేకాక, తనవలె క్రైస్తవ సన్యాసి జీవితమును జీవించుటకు పలువురికి శిక్షణ కూడా ఇచ్చారు.


రోమా సామ్రాజ్య చక్రవర్తియైన డయోక్లేషియన్ క్రీ.శ. 303 లో ఈజిప్టులోని క్రైస్తవులను హింసించుచున్న సమయంలో ఆంటోనీ ఈజిప్టులోని అలెగ్జాండ్రియాకు వెళ్లి బంధింపబడిన క్రైస్తవ కుటుంబములకు ఆదరణనిచ్చారు. వారి మధ్య సేవ చేసి సువార్తను ప్రకటించిన అతను, ఈ ప్రపంచంలో ఉన్నవాటన్నింటికీ మించి క్రీస్తును ప్రేమించవలెనని వారికి పిలుపునిచ్చారు. అతని పరిచర్య మూలముగా అనేకమంది క్రీస్తును అంగీకరించి, లోకము నుండి వేరుపరచబడిన ఒంటరి జీవితమును స్వీకరించారు. తండ్రియైన దేవుని ద్వారా క్రీస్తుకు దైవత్వం ఇవ్వబడినదే గానీ, ఆయన తండ్రితో సరిసమానుడు కాడని తప్పుగా బోధిస్తూ ఈజిప్టులోని అనేకమంది ఆరంభకాల క్రైస్తవులను తప్పుదారి పట్టించిన "అరియానిజం" అనే సిద్ధాంతము యొక్క బోధనలను వ్యతిరేకించి, సత్యమును తెలియపరచుటలో కూడా ఆంటోనీ కీలక పాత్ర పోషించారు. 

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీ హృదయము దేనిని అపేక్షిస్తున్నది? ఈ లోకములో ఉన్న ఆనందములనా లేక పరలోకపు తండ్రితో సహవాసమును కలిగియుండుటనా? 

ప్రార్థన :

"ప్రభువా, ఆత్మీయ పోరాటములో విజయోత్సాహముతో నిలువబడుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!" 

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Jun 19, 2022

    Archibald Forder Biography

    ఆర్చుబాల్డ్ ఫోర్డర్ జీవిత చరిత్ర

    జననం: 1863
    మహిమ ప్రవేశం: ~1920
    స్వదేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    దర్శన స్థలము: అరబ్బు దేశాలు 

     ఆర్చుబాల్డ్ ఫోర్డర్ మధ్యప్రాచ్య ప్రాంతంలో (మిడిల్ ఈస్ట్) 13 సంవత్సరాల పాటు సేవచేసిన ఒక అమెరికన్ మిషనరీ. ఆ ప్రాంతంలో అతను ప్రధానంగా పాలస్తీనాలోని అల్-కారాక్ (కెరాక్) అనే ప్రదేశంలో పరిచర్య చేశారు. ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు అతను ఒక మిషనరీ కూడికకు హాజరవ్వగా, అందులో ఆఫ్రికాలో మిషనరీ సేవ చేయుటలో ఒక మార్గదర్శక మిషనరీగా నిలిచిన రాబర్ట్ మోఫాట్ తన అనుభవాలను పంచుకున్నారు. ఆ రోజున అతని హృదయంలో జ్వలించిన మిషనరీ సేవ కొరకైన జ్వాలలు ఏనాడూ ఆరిపోలేదు. కొద్ది రోజుల తరువాత చైనాకు చెందిన ఒక మిషనరీ ఫోర్డర్ హాజరైన ప్రార్థనా మందిరమును సందర్శించి, మిషనరీలుగా చైనాకు రమ్మని యువకులను ప్రోత్సహించారు. తత్ఫలితంగా, మిషనరీ కావాలన్న ఫోర్డర్ యొక్క వాంఛ మరింతగా బలపడింది.

     1888వ సంll లో అతను ఒక మిషనరీ పత్రికలో అల్-కారాక్‌లోని మిషనరీ పరిచర్యను గురించి చదవడం జరిగింది. అతను చదువుతున్నప్పుడు, “అది నీ కొరకే” అనే ఒక స్వరం అతని అంతరంగములో ధ్వనించింది. కాగా కొన్ని నెలల పాటు వైద్యములో శిక్షణ పొందిన పిమ్మట, అతను తన భార్యతో కలిసి కెరాక్‌కు పయనమయ్యారు. కౄరమైన అనాగరిక ప్రజల వలన కలిగే ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ, అతను వారితో ఎంతో యుక్తిగా వ్యవహరించారు. అతను రోగులను వారి గృహాలలో సందర్శించి వైద్య సహాయం అందించారు. తద్వారా సువార్తకు ద్వారములు తెరువబడ్డాయి. 1892వ సంll లో అతని భార్య మరణించినప్పటికీ, 1896వ సంll వరకు కూడా ఫోర్డర్ పాలస్తీనా ప్రజల మధ్య సేవను కొనసాగించి అనేక ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించారు.

      కెరాక్‌లో ఐదున్నర సంవత్సరాల పాటు పరిచర్య చేసిన ఫోర్డర్, తదుపరి మధ్య అరేబియా ప్రాంతమునకు సువార్తను మోసుకువెళ్ళవలెనని తలంచారు. కాగా 1900వ సంll లో అతను మోయాబు మరియు ఎదోము ప్రాంతాలకు ఆవల ఉన్న ప్రాంతములను చేరుకొనవలెనని అరేబియా ఎడారి గుండా ఎంతో ప్రమాదకరమైన ప్రయాణమును ప్రారంభించారు. అరబ్బులు క్రైస్తవులను ద్వేషిస్తారని, మధ్య అరేబియాకు వెళ్తే ఖచ్చితముగా అతనికి మరణమే సంభవిస్తుందని ఫోర్డర్ హెచ్చరించబడ్డారు. అయినప్పటికీ ఏమాత్రం జడియక, నిరుత్సాహపడక ముందుకు సాగిపోయిన ఫోర్డర్, అరేబియాలోని ముఖ్య పట్టణాలలో సువార్తను ప్రకటించారు. వాటిలో కాఫ్ మరియు జోఫ్ పట్టణములు కూడా ఉన్నాయి. ముస్లింలు మరియు అనాగరికమైన ప్రజల గుంపు అనేక సార్లు అతనిపై దాడి చేశారు. కానీ, ప్రతిసారీ అతను మరణం నుండి తప్పించుకున్నారు. అతను ఎడారిలో వేల మైళ్ళ కొలది ప్రయాణించి అరబ్బు భాషలోని సువార్తలను మరియు కీర్తనలను పంచిపెట్టి, వందలాది మందిని అంధకారం నుండి ఆశ్చర్యకరమైన సువార్త వెలుగులోనికి నడిపించారు.

    ప్రియమైనవారలారా, సువార్తను ప్రకటించుటకై మీ తలుపు తడుతున్న అవకాశములకు మీరు స్పందిస్తున్నారా?

    "ప్రభువా, మిమ్మును ద్వేషించే ప్రజలకు సువార్తను తీసుకువెళ్ళే ధైర్యమును నాకు దయచేయుము. ఆమేన్!"


    దేవునికే మహిమ కలుగునుగాక
  • WhatsApp
  • Jan 26, 2022

    Ann Wilkins Life History

    ఆన్ విల్కిన్స్  గారి జీవిత చరిత్ర





    • జననం: 30-06-1830
    • మహిమ ప్రవేశం: 13-11-1857
    • స్వస్థలం: హడ్సన్ వ్యాలీ
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: లైబేరియా

    మెథడిస్టు మిషనరీ సొసైటీ యొక్క కార్యదర్శియైన (సెక్రటరీ) నాథన్ బ్యాంగ్స్ ఒక చిన్న ఉత్తరమును అందుకున్నారు. అందులో ఈ విధంగా వ్రాసియుంది, “కొద్దిపాటి డబ్బును కలిగియున్న ఒక సహోదరి, ఆ కొంచెం డబ్బునే ఉత్సాహముగా పరిచర్య కొరకు ఇస్తుంది. అవసరమైతే తాను ఒక మిషనరీ ఉపాధ్యాయురాలిగా సేవ చేయుటకు తన జీవితమును సమర్పించుటకు ఆమె సిద్ధంగా ఉంది." ఈ గొప్ప మాటలను నాథన్‌కు వ్రాసినవారు ఆన్ విల్కిన్స్.

    క్రైస్తవ కుటుంబంలో జన్మించిన ఆన్ విల్కిన్స్ పద్నాలుగేళ్ళ వయసులో క్రీస్తును తన రక్షకునిగా అంగీకరించారు. పంతొమ్మిది సంవత్సరాల వయస్సులో న్యూయార్క్ నగరంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి బోధించడం ప్రారంభించిన ఆమె, మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చిలో ఆదివారపు బైబిలు పాఠశాలను (సండే స్కూల్‌ను) కూడా నడిపించేవారు. ఆ సమయంలో ఆమెకు మిషనరీ సేవ పట్ల ఆసక్తి ఏర్పడింది. కాగా తన కోరిక గురించి తెలియపరచుచూ ఆమె మిషనరీ సొసైటీకి లేఖను వ్రాశారు. మిషనరీ సంస్థ నుండి తనకు ఆహ్వానం అందకపోయినప్పటికీ, ఆమె మిషనరీ సేవ కొరకు తనకు ద్వారము తెరువబడుటకు ప్రార్థనాపూర్వకంగా వేచియున్నారు.

    1836వ సంll లో, లైబేరియాలో సేవ చేస్తున్న జాన్ సేస్ అనే మిషనరీ ఆఫ్రికాలో జరుగుతున్న మిషనరీ పనిలో తనతో చేరమని ప్రజలను అభ్యర్థించడం ఆన్ వినడం జరిగింది. కాగా దేవుని పరిచర్య చేయుటకు తనకున్న సుముఖతను తెలియపరుస్తూ తిరిగి మిషనరీ సొసైటీకి ఆమె లేఖను వ్రాయగా, ఈసారి ఆమె లైబేరియాలో సేవ చేయుటకు అంగీకరించబడ్డారు.

    1837వ సంll లో మరికొంతమందితో కలిసి లైబేరియాకు చేరుకున్న ఆన్, వెంటనే మన్రోవియాలో విద్యా సంబంధమైన పనిని ప్రారంభించారు. ఆమె ఎంతో ఉత్సాహము కలిగిన ఒక ఉపాధ్యాయురాలు. అక్కడి కఠినమైన వాతావరణం తన శరీరానికి సరిపడక పోయినప్పటికీ, ఆమె ఉత్సాహంగా గ్రామాలలో తిరుగుతూ పిల్లలకు మరియు మహిళలకు విద్యను అందించారు మరియు సువార్తను బోధించారు. తరువాత ఆమె కాల్డ్‌వెల్‌లో ఒక పాఠశాలను మరియు మోంట్‌సెరాడో కౌంటీలో ఒక మహిళా బోర్డింగ్ పాఠశాలను స్థాపించారు.

    లైబేరియాలో తన పరిచర్య ప్రారంభించిన నాటి నుండి భయంకరమైన జ్వరాల బారినపడుతూనే ఉన్నారు ఆన్. ఒకసారి ఆమె మరణపుటంచులలో ఉండగా, కోలుకొనుటకుగాను అమెరికాకు తిరిగివెళ్ళుటకు ఆమెను ఆమె స్నేహితులు బలవంతం చేశారు. కోలుకొనిన తరువాత కూడా ఆమె ఆరోగ్యం బలహీనంగా ఉన్న కారణంగా ఆమెను తిరిగి ఆఫ్రికాకు పంపుటకు మెథడిస్టు మిషన్ సిద్ధంగా లేదు. కానీ, ఆమె దృఢ సంకల్పం ఆమెను వెనక్కు తగ్గనివ్వలేదు. కాగా పరిచర్యను కొనసాగించుటకు మరో ముగ్గురు మిషనరీలతో కలిసి 1854వ సంll లో ఆమె లైబేరియాకు తిరిగి వచ్చారు.

    అయితే ఆమె దేహం వెంటనే కృశించిపోవడం మొదలైంది. కావున 1857వ సంll ఏప్రిల్ మాసంలో అమెరికాకు తిరిగి వచ్చిన ఆన్ విల్కిన్స్, అదే సంవత్సరం నవంబరు మాసంలో తుది శ్వాస విడిచారు.

    ప్రియమైనవారలారా, భౌతిక సంబంధమైన అర్పణలే కాక, మిషనరీ పని కొరకు మీ జీవితమును సమర్పించుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?

    ప్రభువా, నేను నా జీవితమును మీకు సమర్పిస్తున్నాను. మీ మహిమార్థమై నన్ను వాడుకొనుము. ఆమేన్!

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Oct 11, 2021

    Alice Marval | ఆలిస్ మార్వాల్

    ఆలిస్ మార్వాల్  | Alice Marval


    • జననం: 26-01-1865
    • మహిమ ప్రవేశం: 05-01-1904
    • స్వదేశం: ఇంగ్లాండు
    • దర్శనము: కాన్పూర్, భారతదేశం

     1857వ సంవత్సరపు సిపాయిల తిరుగుబాటు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఒక ప్రసిద్ధ సంఘటన. ఇరు వైపులా వందలాది మంది అమాయకులు మరణించారు. పేష్వా నానా సాహెబ్ వందలాది మంది బ్రిటిష్ మహిళలను కాన్పూర్‌లో బీబీఘర్ అని పిలువబడే ఒక పెద్ద ప్రాంగణంలో బంధించి, కనికరం లేకుండా వారిని చంపుటకు తన సిపాయిలకు ఆదేశాలను జారీ చేశాడు. ఆ మారణకాండ ముగిసిన తరువాత అక్కడికి చేరుకున్న బ్రిటిష్ సైన్యం చేయగలిగింది ఆ ప్రాంగణములో మోకాళ్ళ లోతు రక్తంలో తేలియాడుతున్న మృతదేహాలను చూడటమే!

     తరువాత బ్రిటిష్ వారు ప్రతీకారం తీర్చుకున్నప్పటికీ, “సొసైటీ ఫర్ ప్రొపెగేషన్ ఆఫ్ గోస్పెల్ ఇన్ ఫారిన్ పార్ట్స్” (ఎస్.పి.జి.) సంస్థ కూడా మరణించిన వారి కొరకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది. అయితే అది హింసా మార్గంలో కాదు. అందుకొరకుగాను ఆ సంస్థ వందలాది మంది బ్రిటిష్ మహిళలు చంపబడిన అదే ప్రదేశంలో మహిళల కొరకు ఒక ఆసుపత్రిని స్థాపించుటకై ఆలిస్ మార్వాల్‌ను పంపింది.

     ఆలిస్ తన యవ్వనం నుండి కూడా ఎంతో శ్రద్ధాసక్తులు కలిగిన క్రైస్తవురాలిగా ఉన్నారు. తన విద్యాపరమైన ప్రయత్నాల వలన తన ఆత్మీయ అనుభవాలు మందగించకుండునట్లు ఆమె చూసుకున్నారు. మంచి జ్ఞానమును కలిగియున్న ఆమె తన తోటివారికి చదువులో సహాయపడుతూ, ఆ అవకాశాలను వారితో క్రీస్తు ప్రేమను పంచుకొనుటకు ఉపయోగించేవారు. తన చదువు వలన తాను పొందే పరిజ్ఞానం తన కొరకు ఉపయోగించుకొనుటకు కాదు గానీ, క్రీస్తు యొక్క పరిచర్య కొరకు వాడవలెను అనేది ఆమె ఎల్లప్పుడూ తన మనసులో ఉంచుకునేవారు. కావున, తాను పట్టభద్రురాలైన తరువాత, ఒక మిషనరీగా సేవ చేయవలెనని ఆమె ఎస్.పి.జి. సంస్థలో చేరగా, ఆ సంస్థ ఆమెను కాన్పూర్‌కు పంపింది.

     కాన్పూర్ యొక్క పరిస్థితిని మరియు ఒక బ్రిటిష్ మిషనరీగా తనకు కలిగే అపాయమును బాగుగా ఎరిగియున్న ఆలిస్, 1899వ సంll లో ధైర్యముగా అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఆమె స్థానిక మహిళలకు వైద్యం అందించుటకు “సెయింట్ కేథరీన్స్ హాస్పిటల్‌” ను స్థాపించారు. ప్రారంభంలో ఆమె వైద్యశాలను నిర్మించడంలోను మరియు స్థానికులకు వైద్య సంరక్షణ అందించడంలోను నిమగ్నమయ్యారు. అయితే, త్వరలోనే కాన్పూర్‌లో తెగులు విజృంభించింది.

     తెగులు కారణంగా రోగులతో నిండిపోయిన ఆసుపత్రిలో పగలంతా నిర్విరామంగా పనిచేసినప్పటికీ, బయటికి వచ్చుటకు అనుమతించబడని మహిళలకు సేవలందించుటకు రాత్రి వేళల్లో ఆమె ఇంటింటికీ వెళ్ళేవారు. ఆమె నిద్రలేని రాత్రులు గడిపి, ఆ ప్రాణాంతక వ్యాధి నుండి కోలుకొనుటకు అనేక మందికి సహాయపడ్డారు. అయితే, సున్నితమైన ఆమె శరీరం అధికమైన ఒత్తిడిని తట్టుకొనలేకపోయింది. పైగా ఆ తెగులు ఆమెపై కూడా దాడి చేసింది.

     1904వ సంll జనవరి 5న అది తన అంతమని గ్రహించిన ఆలిస్ మార్వాల్, శారీరకంగా ఒకవైపు ఎంతో బాధననుభవిస్తూ కూడా “నేను ఇక్కడ ఉన్నంత కాలం చాలా సంతోషంగా ఉన్నాను” అని పలికి ఈ లోకములో తన పరుగును కడముట్టించారు.

    ప్రియమైనవారలారా, మీ జ్ఞాన పరిజ్ఞానములు క్రీస్తు యొక్క ఉద్దేశ్యములు నెరవేర్చబడుటకు వాడబడవలెనని మీరు గుర్తుంచుకుంటున్నారా?

    "ప్రభువా, మీ ప్రేమను విస్తరింపజేయుటకు నా తలాంతులను వాడగలిగే అవకాశములను చూడగలుగునట్లు నా కన్నులు తెరువుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Oct 10, 2021

    Arthur Neve | ఆర్థర్ నీవ్

    ఆర్థర్ నీవ్ | Arthur Neve



    • జననం: 24-12-1859
    • మహిమ ప్రవేశం: 05-09-1919
    • స్వస్థలం: బ్రైటన్
    • దేశం: ఇంగ్లాండు
    • దర్శన స్థలము: పూర్వపు కాశ్మీర్

     ఆంగ్లేయుడైన ఆర్థర్ నీవ్ కాశ్మీర్‌లో తాను చేసిన సేవకు పేరుగాంచిన ఒక వైద్య మిషనరీ. తన బాల్యం నుండి కూడా అతను యేసుక్రీస్తు యొక్క స్వస్థ పరిచే పరిచర్య పట్ల ఆకర్షితులయ్యారు. అతను కేవలం ఒక వైద్యుడు అవ్వాలని కోరుకొనక శరీరాత్మలను రెండింటినీ స్వస్థపరచగల వైద్య మిషనరీ కావాలని వాంఛించారు. కాగా, ఈడెన్‌బర్గ్ విశ్వవిద్యాలయం నుండి వైద్య శాస్త్రంలో పట్టభద్రులైన అతను, మిషనరీ సేవ చేయుటకు ఉగాండాకు వెళ్ళవలెనని కోరుకున్నారు.

     అయితే, కాశ్మీర్ మిషన్‌లో అత్యవసరంగా సహాయం కావలెనని అతనికి పిలుపు వచ్చింది. కావున, భారతదేశానికి పయనమైన అతను, 1882వ సంll లో శ్రీనగర్‌కు చేరుకున్నారు. ముస్లింలు మరియు హిందువులకు ఆశ్రయమిస్తున్న కాశ్మీర్ ఉద్రిక్తతతో నిడుకొనియున్న ఒక ప్రదేశం మరియు అందులో క్రైస్తవులకు చోటు లేదు. ఈనాటికి కూడా కాశ్మీర్‌లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొనియుంది. తాను ఒక ఆంగ్లేయుడు కావడంతో స్థానికుల యొక్క నమ్మకమును పొందడం నీవ్‌కు మరింత కష్టతరమైన విషయం. అయితే, తన ప్రేమపూర్వక పనులతో అతను సమాజంలోని అన్ని వర్గాలలోను స్నేహితులను సంపాదించుకొనగలిగారు. త్వరలోనే అతని సోదరుడు ఎర్నెస్ట్ నీవ్ కూడా అతనితో చేరగా, వారిరువురు కలిసి కాశ్మీర్ ప్రజల సంక్షేమం కొరకు వారి చెమటోడ్చి శ్రమించారు.

     ఒక వైద్యునిగా నీవ్ పోరాడుతున్నది కేవలం వ్యాధులతో కాదు, ప్రజల యొక్క మూఢనమ్మకాలు మరియు అజ్ఞానములతో కూడా. నీవ్ ఇచ్చిన మందులు వాడితే అవి వారి మనస్సుపై పనిచేసి వారిని క్రైస్తవులుగా మారుస్తాయని స్థానికులు భావించారు. కొన్నిసార్లు రోగులకు శస్త్రచికిత్స చేయుటకు వారికి అపస్మారక స్థితిని కలుగజేసినప్పుడు, వైద్యుడు రోగిని చంపారనుకొని ప్రజలు అతనిపై కర్రలతో దాడి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. తన పిలుపులో నమ్మకముగా నిలబడుటకు ఆ శ్రమలన్నింటినీ సహనముతో భరించారు నీవ్.

     క్రమక్రమంగా మిషన్ అభివృద్ధి చెంది, ఉత్తర భారతదేశమంతటి నుండి వేలాది మంది రోగులు ఆ ఆసుపత్రికి రావడం ప్రారంభమయ్యింది. రోగులకు వైద్య సహాయమందించుటకు నీవ్ చేసే సంప్రదింపులు ఎల్లప్పుడు కూడా వారి ఆత్మలకు కూడా సువార్త అనే ఔషధమును ఇచ్చేవిగా ఉంటాయి. నిర్విరామంగా ఉండే అతని పని మధ్య కూడా అతను సువార్త సేవకు ఏనాడూ ఆటంకం కలిగించలేదు. ప్రతి రోగిని దర్శించి, వారికి దేవుని వాక్యము ద్వారా ఆదరణను కలిగించుటకు అతను పాదిరులను నియమించారు. అంతేకాకుండా, అతను తరచుగా కొండలను ఎక్కి అక్కడ ఉండే గ్రామాలలో వైద్య శిబిరాలను నిర్వహించేవారు. యేసు క్రీస్తు తన గ్రామంలోని ప్రజలను మాత్రమే స్వస్థపరచలేదు గానీ, ఆయన దేశమంతటా ప్రయాణించారు అని నీవ్ తరచూ చెప్పేవారు. 

     “డాక్టర్ సాహిబ్” అని తనను ప్రేమగా గుర్తుంచుకునే కాశ్మీరీ ప్రజలకు కరువులు, తెగుళ్ళు, భూకంపాలు మరియు యుద్ధాల మధ్య కూడా వెనుకంజవేయక చివరి వరకూ సేవలందించారు ఆర్థర్ నీవ్.

    ప్రియమైనవారలారా, కాశ్మీర్‌లో నశించుచున్న ఆత్మల కొరకు మీకు భారం ఉందా?

    "ప్రభువా, కాశ్మీర్‌లో సమాధాన సువార్త కొరకు ద్వారము తెరువుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Aug 2, 2021

    Arthur Margoschis | ఆర్థర్ మార్గోస్చిస్

    ఆర్థర్ మార్గోస్చిస్ | Arthur Margoschis

    జననం : 24-12-1852
    మరణం : 27-04-1908
    స్వస్థలం : లీమింగ్టన్
    దేశం : ఇంగ్లాడు
    దర్శన స్థలము : భారత దేశం
    బెంజమిన్ హెన్రీ ఆర్థర్ మార్గోస్చిస్ విదేశాలలో సువార్త ప్రచారం చేయు సమాజం - సొసైటీ ఫర్ ద ప్రోపగేషన్ అఫ్ ద గాస్పెల్ ఇన్ ఫారిన్ పార్ట్స్ ( ఎస్ పి జి ) తరుపున భారత దేశానికి వచ్చిన సంస్కరణోద్యమ మిషనరీ. ఆర్థర్ తన వైద్య డిగ్రీ యొక్క చివరి సంవత్సరం అభ్యసిస్తున్నప్పుడు, రాబర్ట్ కాల్డ్వెల్ భారతదేశంలో పరిచేర్య చేయుటకు గాను యువకుల అత్యావశ్యకత గురించి మాట్లాడటం వినిన వెంటనే అతను భారతదేశంలో మిషనరీగా పని చేయుటకు తనను తాను సమర్పించుకున్నారు. ఆర్థర్ కుటుంబసభ్యులు మరియు స్నేహితులు తొందరపడి నిర్ణయం తీసుకొనవద్దని మొదట డిగ్రీ పూర్తి చేయమని సలహా ఇచ్చినప్పుడు "ఇది నా స్వంత సౌలభ్యం కొరకు నేను చేయగలిగే పని కాదు" అని చెప్పారు. ఆర్థర్ 1875 వ సం|| లో తమిళనాడు చేరుకొని, తమిళంలో నైపుణ్యం సంపాదించేవరకు కాల్డ్వెల్ తో కలిసి ఉన్నారు. తరువాత 1876 వ సం|| లో తిరునెల్వేలి జిల్లాలోని నజరేతు అను ఒక కుగ్రామానికి పంపబడ్డారు.
    ఆర్థర్ తన మిషనరీ పని లో ఎంతో ఉత్సాహంతో కొనసాగుతున్నప్పుడు, నిస్సహాయ మరియు పేదరికంతో బాధపడుతున్న ప్రజల బాధలను తొలగించడానికి తాను ఎంతో చేయవలిసియున్నదని గ్రహించారు. అందుకు గాను త్వరలోనే ఆర్థర్ నజరేతు గ్రామములో మరియు చుట్టు ప్రక్కల గ్రామాలలో క్షేత్ర స్థాయి సువార్త ప్రచారాన్ని ప్రారంభించారు. తత్ఫలితముగా చాలా మంది క్రీస్తు యొద్దకు నడిపించబడ్డారు. ఆ ప్రాంతంలో ఆర్థర్ చేసిన వైద్య సేవలు వెలకట్టలేనివి. ముఖ్యంగా, 1902 వ సం|| లో ఘోరమైన కలరా వ్యాధి తో నగరం వినాశనం అవుతున్నపుడు, ఆర్థర్ గుర్రపు స్వారీచేస్తూ ప్రజలను సందర్శించి వారికి వైద్య సహాయం అందించారు. దుఃఖిస్తున్న ప్రజలను ఓదార్చుట మరియు వారికున్న భయాన్ని తొలగించుట తన కర్తవ్యముగా భావించిన ఆర్థర్, ప్రజలను ధైర్యపరచి ఆదరించుటకు దాదాపు ప్రతిరోజూ సమాజ సేవ నిర్వహించారు.
    వెనుకబడిన మరియు గుర్తింపులేని కుగ్రామమైన నజరేతు ఆర్థర్ ప్రారంభించిన సంస్కరణాత్మక కార్యకలాపాల వలన అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారింది. నజరేతులో ఆస్పత్రులు, విద్యా సౌకర్యాలు, అనాథాశ్రమాలు మరియు ఇతర ముఖ్యమైన మౌలిక సదుపాయాలను స్థాపించడంలో ఆర్థర్ చేసిన ప్రయత్నాలు స్థానిక ప్రజల సామాజిక స్థితిని మార్చాయి. ఈ ప్రయత్నాలన్నింటిలోనూ, తన ప్రజల ఆధ్యాతిక వికాసం ఆర్థర్ కు ఎంతో ప్రాముఖ్యమైనది. 1890 వ సం|| లో ఆర్థర్ స్థాపించిన వేదాంత శిక్షణా సంస్థ దినదినాభివృద్ధి చెంది చాల మంది దైవసేవకులను లేవనెత్తింది. ఆర్థర్ కేవలం మిషనరీ గా మాత్రమే కాకుండా అక్కడి ప్రజలకు వైద్యునిగా, విద్యావేత్తగా, స్నేహితునిగా మరియు మార్గదర్శిగా ఉండుట ద్వారా ఇతర మిషనరీలకు ఒక మాదిరిగా ఉన్నారు.

    🚸 * పియ్రమైనవారలారా, మీరు అవసరానికి అనుగుణంగానా లేక మీ సౌలభ్యం ప్రకారం దేవుని సేవ చేస్తున్నారా?*🚸 🛐 *"ప్రభువా, మీ సేవ చేయుటకు నా సౌలభ్యం మరియు సౌకర్యాన్ని విడిచిపెట్టుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"* 🛐
    🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏
  • WhatsApp