Search Here

Showing posts with label F. Show all posts
Showing posts with label F. Show all posts

May 14, 2023

Francis Asbury | ఫ్రాన్సిస్ ఆస్బరీ

ఫ్రాన్సిస్ ఆస్బరీ గారి జీవిత చరిత్ర

  • జననం : 20-08-1745
  • మరణం : 31-03-1816
  • స్వదేశం : ఇంగ్లాండు
  • దర్శన స్థలము : అమెరికా


అమెరికన్ మెథడిజమునకు (అమెరికాలో మెథడిస్టు సంఘములకు మరియు సేవకు) పితామహుడు అయిన ఫ్రాన్సిస్ ఆస్బరీ, శ్రామిక తరగతికి చెందిన ఒక ఆంగ్లేయ కుటుంబములో జన్మించారు. చిన్నతనంలో అతను బిడియముగా ఉండేవారు మరియు ఆత్మపరిశీలనా స్వభావాన్ని కలిగియున్నారు. కాగా ఇతర విద్యార్థులు అతనిని గేలిచేస్తూ, ఆటపట్టిస్తుండేవారు. చివరికి అతను 12 సంll ల వయసులో చదువు మానివేసి, ఒక కమ్మరి యొద్ద సహాయకునిగా పనిచేశారు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకూడదనే భయమును అతనిలో బలముగా నాటిన అతని తల్లి, అతనిలో విశ్వాసానికి మొదటిగా పునాదులు వేశారు. పదునాలుగేళ్ళ వయసులో క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించిన ఆస్బరీ, అటు తరువాత దేవునిని సేవించుటకు తన జీవితమును సమర్పించుకున్నారు.


ఒకప్పుడు బిడియస్థునిగా ఉన్న అతను, ఇప్పుడు మెథడిస్టు సంఘములలో దేవుని వాక్యమును బోధించే మంచి బోధకులయ్యారు. ఇంగ్లాండులో సంచార బోధకునిగా కూడా సేవలందించిన అతను, సువార్త ప్రకటించుటకు గుఱ్ఱముపై అనేక మైళ్ళు ప్రయాణించేవారు. అమెరికాలో సేవ చేయుటకు జాన్ వెస్లీ నుండి పిలుపును అందుకొనిన ఆస్బరీ, 1771వ సంll లో ఉత్తర అమెరికాకు వెళ్ళారు. మొదట అతను ఫిలడెల్ఫియాలో ఉండి దేవుని వాక్యమును ఎంతో విరివిగా బోధించారు. యేసుక్రీస్తుపై విశ్వాసముంచుట ద్వారా రక్షణ కలుగుతుందనే సత్యమును ప్రతి ఒక్కరికీ తెలియచెప్పడం తనకు దేవుడు నియమించిన బాధ్యత అని అతను భావించారు. అతను ప్రతి ఒక్కరినీ, అనగా స్త్రీ పురుషులను, అన్ని వయసులవారిని, అన్ని జాతులవారిని మరియు వివిధ నేపథ్యాలు కలిగినవారిని, సంధించవలెనని వాంఛించారు. అతను అక్కడ 45 సంllల పాటు చేసిన సేవ ద్వారా అమెరికాలో మెథడిస్టు సంఘములు ఎంతో వేగముగా విస్తరించాయి.


మిషనరీ సేవలో ఆస్బరీ అనుసరించిన పద్ధతి యేసుక్రీస్తు యొక్క శిష్యుల మాదిరిని పోలియున్నది. అతనికి ఇల్లు లేదు, ఒక కార్యాలయం లేదు, సిబ్బంది లేరు, ఎటువంటి సామాను లేదు. అతను కలిగియున్నదంతా కొన్ని పుస్తకములు మరియు అమెరికాలో వేలాది మైళ్ళు ప్రయాణించుటకు అతను ఉపయోగించే ఒక గుఱ్ఱము మాత్రమే. అప్పుడప్పుడు అనారోగ్యం పాలవుతూ ఉన్నప్పటికీ, అతను 16,000 కంటే ఎక్కువ ఉపన్యాసాలు ప్రసంగించారు. అతను సంఘములలో ఒక క్రమమును ఏర్పరిచారు. ఒక సంఘము నుండి మరొక సంఘమునకు ప్రయాణిస్తూ పరిచర్య చేయుటకు, మరి ముఖ్యముగా గ్రామీణ ప్రాంతాలలో ఆ విధముగా పరిచర్య చేయుటకు  సర్క్యూట్ రైడర్స్ బోధకులను కూడా నియమించారు. అంతేకాకుండా పిల్లలకు దేవుని వాక్యమును బోధించుటకుగాను సండే స్కూళ్ళను (ఆదివారపు బైబిలు పాఠశాలలను) మరియు వారికి చదవుటను, వ్రాయుటను నేర్పుటకు ఇతర పాఠశాలలను కూడా అతను ప్రారంభించారు.


1816వ సంll లో పరమ విశ్రాంతిలోకి ప్రవేశించేవరకు వృద్ధాప్యమందు కూడా కష్టతరమైన తన మిషనరీ ప్రయాణములను కొనసాగించారు ఫ్రాన్సిస్ ఆస్బరీ.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీ స్నేహితులతో సువార్తను పంచుకొనుటకు మీ బిడియమును, సిగ్గును మీరు అధిగమించారా? 

ప్రార్థన :

"ప్రభువా, ఈ ప్రాపంచిక భారములను విడిచిపెట్టి, మీ యొక్క నిజమైన శిష్యునిగా నేను ఎదుగునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Jul 26, 2022

    Francis Le Jau | ఫ్రాన్సిస్ లే జౌ

    ఫ్రాన్సిస్ లే జౌ  గారి జీవిత చరిత్ర



    • జననం: 1665
    • మహిమ ప్రవేశం: 10-09-1717
    • స్వస్థలం: యాంజియర్స్
    • దేశం: ఫ్రాన్స్
    • దర్శన స్థలము: సౌత్ కరోలినా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు


    'సొసైటీ ఫర్ ది గాస్పెల్ ఇన్ ఫారిన్ పార్ట్స్' (ఎస్.పి.జి. - విదేశీ ప్రాంతాలలో సువార్త సేవ కొరకైన సంస్థ) అనే సంస్థ తరపున దక్షిణ కరోలినాలో సేవ చేసిన తొలి మిషనరీలలో ఫ్రాన్సిస్ లే జౌ ఒకరు. అతను దైవభక్తి కలిగిన ఒక ఫ్రెంచ్ హుగెనాట్ కుటుంబములో జన్మించారు. హుగెనాట్ క్రైస్తవులు అనగా 16, 17వ శతాబ్దములలోని ఫ్రెంచ్ ప్రొటెస్టంట్లకు చెందిన ఒక క్రైస్తవ సమూహం. 16 వ శతాబ్దం చివరిలో హుగెనాట్లకు తీవ్రమైన హింస కలిగినప్పుడు, ఫ్రాన్సిస్ ఇంగ్లాండుకు పారిపోయారు. డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజీ నుండి పట్టా పొందిన పిమ్మట అతను క్రిస్టఫర్ దీవులకు పంపబడ్డారు. స్వల్పకాలం అతను అక్కడి స్థానిక తెగల మధ్య పరిచర్య జరిగించారు.


    1706వ సంll లో మిషనరీ సేవ చేయుటకై దక్షిణ కరోలినాకు పంపబడ్డారు లే జౌ. అక్కడ గూస్ క్రీక్ అనే ప్రాంతములో స్థిరపడిన అతను,  అక్కడి క్రైస్తవ సంఘము అబద్దపు ప్రవక్తలచే తీవ్రముగా తప్పుదారి పట్టించబడినట్లు గ్రహించారు. అంతేకాక, ఆ ప్రాంతమునకు వచ్చి స్థిరపడి నాయకత్వమును చేజిక్కించుకొనినవారు తాము క్రైస్తవులమని  చెప్పుకుంటున్నప్పటికీ, ఏ విధముగానూ వారు క్రీస్తు ప్రేమకు మాదిరిగా జీవించకపోగా కౄరమైన బానిస వ్యాపారములో పాలిభాగస్థులుగా ఉన్నారు. అందువలన అణగారిన స్థానిక అమెరికన్లలో సువార్త ప్రకటించడం ఫ్రాన్సిస్ యొక్క మొదటి ప్రాధాన్యతగా మారింది. అతను కౄరత్వముతో నిండియున్న బానిసల యజమానులకు వ్యతిరేకముగా అలుపెరుగక పని చేశారు మరియు వారి సామాజిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ సువార్తను ప్రకటించారు. తన స్వజనుల నుండే అనేక ఎదురుదెబ్బలను మరియు అవరోధాలను ఎదుర్కొన్నప్పటికీ, వెనుకంజవేయక క్రైస్తవ సంఘము లోపటను వెలుపలను కూడా సమానత్వమును కలిగియుండవలెనని బోధించుటయే కాక దానిని అనుసరించి నడిచే క్రైస్తవ సంఘములను స్థాపించుటకు సమర్పణ కలిగి ముందుకు సాగిపోయారు ఫ్రాన్సిస్.


    క్రియలలో విశ్వాసం కనబడితేనే గాని ఒకనిని క్రైస్తవునిగా పిలవవలెనని ఫ్రాన్సిస్ విశ్వసించారు. ఇతర దైవసేవకులు తమ సంఘముల గురించి స్వయంతృప్తిని కలిగియున్నప్పటికీ, ఫ్రాన్సిస్ మాత్రం తన సంఘము సామాజిక బాధ్యతను స్వీకరించులాగున చేసి, పేదలు మరియు రోగులకు సహాయమును అందించారు. పలు యుద్ధములు నెలకొన్నప్పటికీ కూడా, ఆ క్లిష్ట పరిస్థితులన్నింటి మధ్యలో అతను మిషనరీ సేవ కొరకైన తన పిలుపులో స్థిరముగా నిలబడినవారై, నీగ్రో బానిసల ఆత్మీయ మరియు భౌతిక సంక్షేమం కొరకు శ్రమించారు.


    తన మిషనరీ పరిచర్య ప్రారంభం నుండి కూడా అతను పలుమార్లు మలేరియా బారినపడ్డారు. అందువలన క్రమేపీ అతని శరీరము బలహీనపడింది. దేవుని కొరకు ఎంతో గొప్ప ఆసక్తిని కలిగియుండి, ఎన్నో విజయాలను సాధించిన ఫ్రాన్సిస్ లే జౌ, 1717వ సంll లో తీవ్రమైన మలేరియా జ్వరముతో బాధపడిన తరువాత తన ప్రభువును చేరుకొనుటకు ఈ లోకము విడిచి వెళ్ళారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, కష్టాలు మరియు అననుకూల పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుని సేవించుటకు మీరు సిద్ధమేనా? 

    ప్రార్థన :

    "ప్రభువా, మీ ప్రేమను ఇతరులతో పంచుకునేటప్పుడు భౌతిక పరిస్థితులకు అతీతముగా నేను దూరదృష్టి కలిగియుండగలుగునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Fidelia Fisk | ఫిడేలియా ఫిస్క్

    ఫిడేలియా ఫిస్క్  గారి జీవిత చరిత్ర



    • జననం: 01-05-1816
    • మహిమ ప్రవేశం: 09-08-1864
    • స్వస్థలం: షెల్‌బర్న్, మసాచుసెట్స్
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: ఇరాన్ (పర్షియా)


    పర్షియాలోని ఉర్మియా నగర ప్రజలను “ఫిడేలియా ఫిస్క్ ఎలాంటి వ్యక్తి?” అని అడిగినట్లయితే వారి నుండి వచ్చే సర్వసాధారణమైన సమాధానం “ఆమె యేసును పోలినవారు” అనునదే! పెండ్లికాని యువతిగా అమెరికా నుండి వచ్చి పర్షియాలో పరిచర్య చేసిన మొట్టమొదటి మిషనరీలలో ఒకరు ఫిడేలియా ఫిస్క్. అక్కడ ఆమె పొందిన సాక్ష్యం అటువంటిది.


    మంచి మేధోశ్చక్తి మరియు దైవభక్తి కలిగిన బాలికయైన ఫిడేలియా, చిన్న వయస్సులోనే ఆత్మీయ విషయములపై ఆసక్తిని కనుపరిచారు. పదిహేడేళ్ళ వయసులో ఆమె క్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించారు. 1842వ సంll లో ‘మౌంట్ హోలీక్ సెమినరీ’ అనే బైబిలు వేదాంత కళాశాల నుండి పట్టభద్రురాలైన పిమ్మట, ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ఆమె, తన విద్యార్థులను క్రీస్తు నొద్దకు నడిపించువారిగా పేరొందారు. తన తండ్రి సోదరుడైన ప్లినీ ఫిస్క్ చేసిన మిషనరీ సేవ ద్వారా ప్రభావితమైన ఆమె, ‘అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ ఫర్ ఫారిన్ మిషన్స్’ (ఎబిసిఎఫ్ఎమ్) అనే సంస్థ యొక్క ఆహ్వానమును అంగీకరించి, 1843వ సంll లో పర్షియాకు మిషనరీగా వెళ్ళారు.


    పర్షియా దేశం క్రైస్తవులకు, మరిముఖ్యముగా స్త్రీలకు జీవించుటకు కష్టతరమైన ప్రదేశమై యున్నది. అక్కడి స్థానిక సంస్కృతిపరంగా బాలికలు చదువుకొనుట అవమానకరం. కాగా తల్లిదండ్రులు తమ కుమార్తెలు పాఠశాలకు వెళ్ళవలెనని కోరుకునేవారుకాదు. అయినప్పటికీ, పర్షియాలో మహిళల సామాజిక ప్రమాణాలను మార్చుటకై ఫిడేలియా ఎంతో శ్రమించారు. చిన్న వయసులోనే వివాహం చేయటం మరియు విద్యను నిర్లక్ష్యం చేయటం వంటి వాటికి వ్యతిరేకంగా ఆమె ఎంతో జ్ఞానయుక్తముగా పోరాడారు. దయాహృదయులైన వ్యక్తుల సహాయంతో ఆమె చివరికి బాలికల కొరకు ఒక బోర్డింగ్ పాఠశాలను నిర్మించగలిగారు. క్రమక్రమంగా పర్షియాలోని వివిధ సమాజములవారు తమ కుమార్తెలు చదువుకొనవలసిన ఆవశ్యకతను గ్రహించగా ఆ పాఠశాల అభివృద్ధిని చూరగొంది.


    తన 15 సంవత్సరాల సేవలో తన విద్యార్థులకు తల్లివలె వ్యవహరించిన ఫిడేలియా, ఆ విద్యార్థులలో మూడింట రెండు వంతుల మందిని క్రైస్తవ మార్గములోనికి నడిపించారు. పాఠశాల సెలవు దినములలో ఆమె తన పూర్వపు విద్యార్థుల గృహములకు వెళ్ళి వారిని దర్శించి, స్త్రీల కూడికలను నిర్వహించేవారు. ఆమె రోగులకు సేవలను  అందించారు మరియు తన మిషనరీ పనిని గ్రామీణ ప్రాంతాలకు మరియు కొండ జాతులవారి మధ్యకు విస్తరింపచేశారు. ఆమె పరిచర్య ద్వారా కుర్దిష్ తెగల నాయకులతో సహా ఎంతోమంది ప్రమాదకరమైన వ్యక్తులు క్రీస్తు నొద్దకు నడిపించబడ్డారు.


    అయితే అనేక సంవత్సరాలు ఎడతెగక శ్రమించినందు వలన క్షీణించిపోయారు ఫిడేలియా. కాగా 1858వ సంll లో అనారోగ్యం కారణంగా ఆమె మసాచుసెట్స్‌కు తిరిగివెళ్ళారు. అయినప్పటికీ తిరిగి కోలుకొనలేకపోయిన ఫిడేలియా ఫిస్క్ 1864వ సంll లో పరమందు తన ప్రభువును చేరుకొన ఈ లోకము విడిచివెళ్ళారు. ఆమె మరణించడంతో ఎంతో కృంగిపోయిన ఒక పర్షియా బాలిక ఎబిసిఎఫ్ఎమ్ సంస్థకు ఈ విధంగా లేఖ వ్రాసింది – "మీ దేశంలో మరో మిస్ ఫిస్క్ ఉన్నారా?"


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, ఈ లోకములో మీరు యేసు క్రీస్తు ప్రభుని జీవితమును మీ జీవితము ద్వారా కనుబరచుచున్నారా? 


    ప్రార్థన :

    "ప్రభువా, మీ పోలికలోనికి నన్ను మార్చుము. ఆమేన్!" 


    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Apr 7, 2022

    Frederick Douglass | ఫ్రెడరిక్ డగ్లస్

    ఫ్రెడరిక్ డగ్లస్ జీవిత చరిత్ర



    • జననం : 14-02-1818
    • మరణం : 20-02-1895
    • స్వస్థలం : మేరీల్యాండ్
    • దేశం  : అమెరికా
    • దర్శన స్థలము : అమెరికా


    దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ప్రతి ఒక్కరినీ సమానంగా ప్రేమిస్తున్నాడన్న సత్యాన్ని సువార్త సందేశం తెలియజేస్తుంది. ఈ లోకములో జాతి, లింగం లేదా సామాజిక స్థితులలో బేధాలు ఉన్నప్పటికీ, క్రీస్తులో అందరూ సమానమే. "ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు." అని గలతీ 3:28లో దేవుని వాక్యం చెబుతుంది. అయితే, కొంతమంది క్రైస్తవులమని చెప్పుకుంటున్నవారు కూడా ఈ సత్యాన్ని గ్రహించడంలో విఫలమయ్యారు. ఇతరులకన్నా తాము గొప్పవారని భావించి బానిసత్వాన్ని ప్రోత్సహించారు. క్రైస్తవ సంఘములో ఉన్న ఈ వేషధారితనమును సరిదిద్దుటకు దేవుడు కొంతమందిని ఎన్నుకున్నాడు. అటువంటి వారిలో ఫ్రెడరిక్ డగ్లస్ ఒకరు.

    ఫ్రెడరిక్ డగ్లస్ 1818వ సంll లో మేరీల్యాండ్‌లోని టాల్బోట్‌లో జన్మించారు. బానిసత్వంలో పుట్టిన అతను బాల్యంలోనే తన తల్లి నుండి వేరుచేయబడి, ఒక బానిసగానే ఉన్న తన అమ్మమ్మ బెట్సీ బెయిలీతో కలిసి జీవించుటకు బలవంతం చేయబడ్డారు. 6 సంll ల వయస్సులో అతను తన తాతయ్య అమ్మమ్మల నుండి కూడా వేరుచేయబడి, హ్యూ మరియు సోఫియా  ఆల్డ్‌లకు ఇవ్వబడ్డారు. అక్కడ అతను సోఫియా బైబిలు చదవడం వినేవారు మరియు చర్చికి వెళ్ళుటకు కూడా కొన్నిసార్లు అతనికి అవకాశాలు లభించాయి. కాగా దేనివలననో అతను దేవునిలో తనకు ఒక స్నేహితుడు దొరికినట్లు భావించారు. బైబిలు చదవడం మరియు ప్రార్థన చేయడం నేర్చుకున్న అతను, ఎంత ఎక్కువగా ప్రార్థించారో, అంత ఎక్కువగా పాపం వలన తాను ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో గ్రహించారు. తత్ఫలితంగా అతను తన హృదయాన్ని క్రీస్తుకు సమర్పించి, తన చింతలన్నింటినీ ఆయనపైనే విడిచి పెట్టారు.


    విలియం ఫ్రీలాండ్ అనే వ్యక్తి కొరకు పని చేయుటకు నియమించబడినప్పుడు, డగ్లస్ ఇతర బానిసలకు బైబిలు చదవడం నేర్పించారు. వారి కొరకు అతను ప్రతి వారం కూడికలను కూడా నిర్వహించేవారు. అయితే 1838వ సంll లో అతను తన యజమాని నుండి తప్పించుకొని మసాచుసెట్స్‌లోని న్యూ బెడ్‌ఫోర్డ్‌కు పారిపోయారు. అక్కడ స్థానిక సంఘ సహవాసములో చేరిన అతను, ‘క్రీస్తు యొక్క క్రైస్తవ్యము’ మరియు ‘క్రైస్తవుల యొక్క క్రైస్తవ్యము’ మధ్య ఉన్న గొప్ప వ్యత్యాసాన్ని చూశారు. కాగా దేవుని వాక్యం చెబుతున్నదాని పట్ల అతను కలిగియున్న అవగాహన, సమాజములోను మరియు క్రెస్తవ సంఘములోనూ రంగు మరియు జాతి తారతమ్యాలు లేకుండా సమానత్వాన్ని పెంపొందించుటకు అతను పోరాడునట్లు చేసింది. బానిసత్వానికి మద్దతు ఇస్తున్న క్రైస్తవులను దేవుని వాక్యాన్ని చూపిస్తూ అతను తీవ్రంగా విమర్శించారు. బానిసత్వాన్ని నిర్మూలించాలన్న పోరాటానికి బైబిలు అతనికి మార్గనిర్దేశం చేసింది. దేవునిపై అతనికున్న దృఢమైన విశ్వాసం ద్వారా డగ్లస్ బానిసత్వ బంధకాలలో ఉన్న ప్రజలను విడిపించడమే కాకుండా క్రైస్తవ సంఘమును కూడా వేషధారితనము నుండి విడిపించారు.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ మీరు సమానత్వ భావముతో చూస్తున్నారా?


    ప్రార్థన :

    "ప్రభువా, సమాజంలో సమానత్వాన్ని పెంపొందించుటకు నన్ను ఒక సాధనముగా వాడుకొనుము. ఆమేన్!" 

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Oct 22, 2021

    Florence Young | ఫ్లోరెన్స్ యంగ్

    ఫ్లోరెన్స్ యంగ్ |  Florence Young జీవిత చరిత్ర





    • జననం: 10-10-1856
    • మహిమ ప్రవేశం: 28-05-1940
    • జన్మస్థలం: మోటుయేకా
    • దేశం: న్యూజిలాండ్
    • దర్శనము: సొలొమోన్ ద్వీపవాసులు


    ఫ్లోరెన్స్ సెలీనా హ్యారియెట్ యంగ్ న్యూజిలాండ్‌లోని మోటుయేకాలో జన్మించారు. వ్యవసాయదారుడైన ఆమె తండ్రి ఒక ఆంగ్లేయుడు. ఇంటిలోనే చదువుకున్న ఫ్లోరెన్స్, రెండు సంవత్సరాలు మాత్రం ఇంగ్లాండ్‌లోని బోర్డింగ్ పాఠశాలలో చదువుకున్నారు. ఆమెకు 18సంll ల వయసు ఉన్నప్పుడు ఒక ప్రార్థనా కూడికలో దేవుడు యెషయా 43:25 ద్వారా ఆమెతో మాట్లాడగా, తన పాపములను క్షమించుటకు దేవుడు కలిగియున్న శక్తిని ఆమె అనుభవించారు.


    తన తల్లిదండ్రుల మరణం తరువాత, 1882వ సంll లో తన సోదరులు చెరకు తోటను కలిగియున్న క్వీన్స్‌లాండ్‌లోని ఫెయిరీమీడ్‌కు వెళ్ళారు ఫ్లోరెన్స్. అక్కడ ఆమె మొక్కల పెంపకదారుల కుటుంబముల కొరకు ప్రార్థనా కూడికలు నిర్వహించడం ప్రారంభించగా, తరువాత అది ‘యంగ్ పీపుల్స్ స్క్రిప్చరల్ యూనియన్‌’ గా మారింది. క్రమేణా ఆమె దృష్టి తోటలలో పనిచేసే సొలొమోన్ ద్వీపవాసుల వైపు మళ్ళింది. వారిని ‘కనకాలు’ అని పిలిచేవారు. వారికి నేర్పించడము గానీ లేదా వారిని మార్చడం గానీ సాధ్యం కాని పని అని పలువురు ఆమెకు చెప్పేవారు. అయితే, ఫ్లోరెన్స్ పిడ్జిన్ ఆంగ్లములో వారికి తరగతులు నిర్వహించడం ప్రారంభించారు మరియు చిత్రాలు మరియు ప్రకృతిలోని సహజ దృష్టాంతాలను ఉపయోగించి బైబిలు సత్యాలను బోధించారు. చివరికి 1886వ సంll లో ఫెయిరీమీడ్‌లో ‘క్వీన్స్‌ల్యాండ్ కనకా మిషన్’ (క్యూ.కే.ఎమ్.) ను  స్థాపించారు ఫ్లోరెన్స్. ఇది ఏ క్రైస్తవ వర్గమునకు చెందనిది మరియు సువార్తను ప్రకటించే క్రైస్తవ సంఘం. ‘విద్య లేదా నాగరికతకు ముందు రక్షణ బోధించబడాలి’ అని ఈ మిషన్ నొక్కి చెప్పేది. 1904-1905 సంll ల మధ్య కాలంలో 19 మంది మిషనరీలు మరియు 118 మంది స్థానిక ఉపాధ్యాయులను కలిగియున్న క్యూ.కే.ఎమ్. మిషన్ ద్వారా 2,000 కంటే ఎక్కువ మంది మారుమనస్సు పొందారు.


    1891వ సంll నుండి 1900వ సంll మధ్య కాలంలో ఆరు సంవత్సరాల పాటు ‘చైనా ఇన్‌ల్యాండ్ మిషన్‌’ లో పనిచేశారు ఫ్లోరెన్స్. ఈ అనుభవం ద్వీపవాసులతో కలిసి మిషనరీ సేవ కొరకు ప్రణాళికలను సిద్ధపరచుటకు ఆమెకు సహాయపడింది. ఆమె ద్వారా మారుమనస్సు పొందిన వారిలో ఒకరైన పీటర్ అంబుఫా అనే వ్యక్తి మరియు ఇతరులు తమ స్వంత స్థలములలో తమ స్వంత సంఘములకు బోధించుటకు తమకు సహాయం చేయమని కోరారు. వారు చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా, 1904వ సంll లో సొలొమోన్ దీవులలోని మలైటాలో క్యూ.కే.ఎమ్. యొక్క శాఖగా ‘సౌత్ సీ ఇవాంజెలికల్ మిషన్’ (ఎస్.ఎస్.ఇ.ఎమ్.) స్థాపించబడింది. ఆ దీవులలో నూతనముగా స్థాపించబడిన క్రైస్తవ సంఘములకు ఆత్మీయ ఆహారమును అందించుటకుగాను ఆ సంవత్సరం ఫ్లోరెన్స్ ఒక మిషనరీల బృందమును సొలొమోన్ దీవులకు నడిపించారు. ఆమె 1926వ సంll వరకు కూడా ఆ దీవులకు ప్రతి ఏడూ సుదీర్ఘ సందర్శనలను చేపట్టారు. 1940వ సంll లో ఆమె మరణించే సమయానికి ఎస్.ఎస్.ఇ.ఎమ్. లో నమోదు చేయబడిన మారుమనస్సు పొందినవారి సంఖ్య 7900 పైగా ఉంది.


    ఒక యువతిగా ఫ్లోరెన్స్ బిడియముతోనే ప్రార్థనా కూడికలను నిర్వహించడం ప్రారంభించారు. ఆమె తన ప్రభువును మరియు ఆయన వాక్యమును ప్రేమించారు. ఆమె తన పరిచర్యలో అడ్డంకులను ఎదుర్కొన్నారు, మానసిక అనారోగ్యానికి గురైయ్యారు మరియు కష్టతరమైన, ప్రమాదకరమైన ప్రయాణాలను చేపట్టారు. అయినప్పటికీ, ఎన్నడూ వెనుకంజ వేయక, వేలాది మంది జీవితాలలో వెలుగును తీసుకువచ్చారు ఫ్లోరెన్స్ యంగ్.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం: 


    ప్రియమైనవారలారా, మీ జీవితములో దేవుని కొరకు మీరు ఏమి సాధించారు?


    ప్రార్థన :

    "ప్రభువా, ఈ దినాన నా జీవితమును మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నా జీవితములో మీ కొరకు ఏదైనా చేయుటకు నాకు సహాయము  చేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Sep 28, 2021

    Fortunatus Henri Caumont | ఫార్చ్యూనాటస్ హెన్రీ కామన్ట్

    ఫార్చ్యూనాటస్ హెన్రీ కామన్ట్ |  Fortunatus Henri Caumont


    • జననం: 10-12-1871
    • మహిమ ప్రవేశం: 04-04-1930
    • స్వస్థలం: టూర్స్
    • దేశం: ఫ్రాన్స్
    • దర్శనము: భారతదేశం

     ఫార్చ్యూనాటస్ హెన్రీ కామన్ట్ భారతదేశంలోని రాజస్థాన్‌ రాష్ట్రంలో సేవ చేసిన ఒక ఫ్రెంచ్ మిషనరీ. మొదటి నుండి దేవునియందలి భయభక్తులతో పెరిగిన ఫార్చ్యూనాటస్, తన బాల్యం నుండే దేవునికి సేవ చేయాలనే లోతైన వాంఛను కలిగియున్నారు. అయితే చాలా చిన్న వయస్సులోనే తన తండ్రిని కోల్పోవడంతో కుటుంబాన్ని పోషించే బాధ్యతను తాను చేపట్టవలసి వచ్చింది. కాగా అతను ఎంతో కష్టపడి పనిచేశారు, కష్టాల మధ్య కూడా ప్రశాంతంగా ఉండి, తన కుటుంబానికి మంచి ఆధారంగా నిలిచారు. అయితే, ఒకానొక దశలో అతను దేవునికి సేవ చేయాలని తనలో అంతర్గతముగా ఉన్న తీవ్రమైన వాంఛను ఏ మాత్రం ఇక అణచివేయలేక సేవ కొరకైన శిక్షణ పొందుటకు వెళ్ళారు. 1896వ సంll లో అతను నియామక అభిషేకం పొంది, మరుసటి సంవత్సరం భారతదేశంలోని రాజ్‌పుతానా మిషన్‌లో సేవ చేయుటకు పంపబడ్డారు.

     రాజస్థానీ ప్రజలు ఆత్మీయముగాను మరియు భౌతికముగాను బీడు పడిపోయియున్న దుస్థితిని చూసిన హెన్రీ కనికరముతో చలించిపోయారు. తల్లి ఉత్తమ గురువు అని మరియు తల్లులందరూ తమ పిల్లలకు నిజమైన దేవుని గురించి బోధించగలిగినట్లయితే తరువాతి తరము యొక్క ఆత్మీయ స్థితి సురక్షితంగా ఉంటుందని అతను విశ్వసించారు. కావున, అతను ప్రధానంగా మహిళలకు సువార్తను అందించడంపై దృష్టి నిలిపారు. అయితే, భారతదేశంలో ప్రబలంగా ఉన్న పర్దా వ్యవస్థ వలన పురుషులు స్త్రీలతో మాట్లాడుటకు అనుమతించబడని కారణముగా అతనికి గొప్ప ఆటంకము ఏర్పడింది. కాగా, మహిళలు మాత్రమే ఇతర మహిళలను సంప్రదించగలరని గ్రహించిన హెన్రీ, 1906వ సంll లో అజ్మీర్‌లో ‘ప్రభుదాసి సిస్టర్స్’ (ప్రభువు యొక్క మహిళా పరిచారకులు) అనే సంఘమును ప్రారంభించారు. ఈ సంఘం రాజస్థాన్‌లోనే కాకుండా ఉత్తర భారతదేశం యొక్క ఇతర ప్రాంతాలలో కూడా సువార్త ప్రకటించుటకు ఒక సమర్థవంతమైన సాధనంగా మారింది.

     రాజపుత్ర వంశమునకు చెందిన పురుషులకు విద్యను పొందుటకు మంచి అవకాశాలు ఉన్నాయి గానీ, మహిళలకు కాదు. కావున, రాజస్థాన్ బాలికలకు విద్యను అందించవలెనని పూనుకొనిన హెన్రీ, ‘మిషన్ సిస్టర్స్ ఆఫ్ అజ్మీర్’ అనే సంఘమును స్థాపించి, ఆ సంఘం ద్వారా అనేక పాఠశాలలను స్థాపించారు. ఆ పాఠశాలలు నేడు రాజస్థాన్‌లో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలుగా నిలిచియున్నాయి.

     హెన్రీ దేవుని కొరకు ఎంతో రోషము కలిగిన మిషనరీగా ఉన్నారు. తన ఆరోగ్యమును కూడా లెక్క చేయకుండా అతను సువార్తను ప్రకటించుటకు ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉండేవారు. ఆ విధంగా ఒకసారి మధ్యప్రదేశ్‌లోని ఝాబువాకు వెళ్ళినప్పుడు అతను ఎంతో బలహీనమయ్యారు. “యేసూ, ఎటువంటి ఆక్షేపణలు లేకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆమేన్!” అని పలుకుతూ, 1930వ సంll ఏప్రిల్ మాసం 4వ తారీఖున తన తుది శ్వాస విడిచారు ఫార్చ్యూనాటస్ హెన్రీ కామన్ట్.

    ప్రియమైనవారలారా, ఎలాంటి ఆక్షేపణలు లేకుండా మీరు క్రీస్తును ప్రేమిస్తున్నారా?

    "ప్రభువా, నీవు నన్ను ప్రేమించినంతగా నేను కూడా ఇతరులను పేమించునట్లు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Sep 22, 2021

    Frances Crosby | ఫ్రాన్సిస్ క్రాస్బీ

    Frances Crosby |  ఫ్రాన్సిస్ క్రాస్బీ


    • జననం: 24-03-1820
    • మహిమ ప్రవేశం: 12-02-1915
    • స్వస్థలం: బ్రూస్టర్ 
    • దేశం: యునైటెడ్ స్టేట్స్ 
    • దర్శన స్థలము: యునైటెడ్ స్టేట్స్ 

    " ఫేన్నీ క్రాస్బీ ' అని కూడా పేర్కొనబడే ఫ్రాన్సిస్ జేన్ క్రాస్బీ ఒక బాప్తిస్టు మిషనరీ , బోధకురాలు మరియు 9000 కన్నా ఎక్కువ పాటలను వ్రాసిన గొప్ప పాటల రచయిత . ఆమె వ్రాసిన పాటలు ఈ నాటికీ మంచి ప్రాచుర్యాన్ని పొందుతూ అనేక క్రైస్తవ సంఘములలో పాడబడుచున్నాయి . ఆమె వ్రాసిన పాటలలో " బ్లెస్సెడ్ అస్యూరన్స్ " ( " యేసు నావాడని నమ్ముదున్ " ) , " ప్రెయిజ్ హిమ్ ప్రెయిజ్ హిమ్ " ( " యేసు దివ్య రక్షకుని స్తుతించు " ) , " పాస్ మి నాట్ , ఓ జెంటిల్ సేవియర్ " ( ' రక్షకా , నన్ మర్వబోకు " ) మరియు " టు గాడ్ బిద గ్లోరీ " ( దేవునికే మహిమ కలుగును గాక ) వంటి ఎన్నో పాటలు ఎంతో ప్రసిద్ధి చెందినవి . కనుచూపు లేకనే ఆమె ఈ పాటలన్నింటినీ వ్రాసారంటే మీరు నమ్మగలరా ?


    పసిబిడ్డగా ఉన్నప్పటి నుండే అంధురాలిగా ఉన్న క్రాసీ , ఆరు నెలల వయసులో ఉన్నప్పుడే తన తండ్రిని కూడా కోల్పోయారు . కాగా ఆమె తల్లియైన మెర్సీ క్రాస్బీ మరియు అమ్మమ్మయైన యునిస్ క్రాస్బీ యొక్క పెంపకంలో ఆమె పెరిగారు . ఆమె క్రైస్తవ విలువలతో పెరుగుటలో ముఖ్యమైన పాత్ర పోషించిన ఆమె యొక్క అమ్మమ్మ , సుదీర్ఘమైన లేఖన భాగములను కంఠస్థ పెట్టుటకు కూడా ఆమెకు ఎంతో సహాయపడ్డారు . ప్రార్థన ద్వారా దేవునితో లోతైన సహవాసాన్ని కలిగియున్న క్రాస్టీ , తన అంధత్వం గురించి ఏనాడూ చేదైన అభిప్రాయాన్ని కలిగియుండలేదు గానీ , దాని వలన తాను మరియు ఈ ప్రపంచమును చూడలేకపోయానని దానిని ఒక గర్వకారణముగా ఎంచి , క్రీస్తు నిమిత్తం తాను కలిగియున్న లోపమందు ఎంతో సంతోషించేవారు .

    “ నా జీవితమంతా నేను అంధురాలిగా ఉండవలెననునది దేవుని యొక్క ఆశీర్వాదకరమైన ఉద్దేశ్యం అయినట్లు ఉన్నది . ఆయన ప్రణాళికలను బట్టి నేను ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను . నా గురించిన అందమైన మరియు ఆసక్తికరమైన విషయముల తట్టు నా మనస్సు మళ్ళించబడినట్లయితే నేను దేవుని కొరకు స్తుతి గీతములను పాడలేకపోయి ఉండేదానినేమో " అన్న ఆమె మాటలలో తన పరలోక యజమానుని పట్ల ఆమె కలిగియున్న భక్తి ప్రతిబింబిస్తుంది , మరియు “ నేను పరలోకమును చేరుకున్నప్పుడు నా కన్నులను ఆనందింపజేసే మొదటి ముఖం నా రక్షకునిది అవుతుంది ” అనే మాటలు దేవుని పట్ల ఆమెకున్న ప్రేమను వెల్లడిపరుస్తాయి .

    లక్షలాది మందిని ఆయన తట్టు త్రిప్పుటకు దేవుని చేత వాడబడవలెనన్న ఆమె ఆకాంక్ష తాను వ్రాసిన పాటల ద్వారా నెరవేరింది . ఒక పాటల రచయితగా మాత్రమే కాకుండా పేదలకు మరియు రోగులకు దేవుని ప్రేమ ద్వారా చేయూతనిచ్చే " రెస్క్యూ మిషన్ " అనే సేవా ఉద్యమంలో కూడా క్రాస్టీ చురుకుగా సేవలందించారు . వలస వచ్చిన ప్రజలు మరియు పేద పిల్లల అభ్యున్నతి కొరకు ఆమె ఎంతో శ్రద్ధాసక్తులతో పనిచేశారు . నగరంలో కలరా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఆమె నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళుటకు నిరాకరించి , వ్యాధిగ్రస్తులకు సేవలందించుటకై అక్కడే ఉండిపోయారు .

    అంధత్వము కలిగిన ఒక వ్యక్తి తన సృష్టికర్త కొరకు ఇంత సాధించగలిగితే , మరి మన సంగతి ఏమిటి ?

    ప్రియమైన వారలారా , మీరు కలిగియున్న బలహీనతలను బట్టి దేవునిని స్తుతించి , వాటిని ఆయన మహిమార్థమై ఉపయోగించుటకు మిమ్ములను మీరు ప్రోత్సహించుకొనగలుగుతున్నారా ?
    " ప్రభువా , క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలో నేను సంతోషించెదను : ఎందుకంటే మీ కొరకు గొప్ప కార్యములను సాధించుటకు నేనెప్పుడు బలహీనుడనో / బలహీనురాలినో అప్పుడే బలవంతుడను / బలవంతురాలను . ఆమేన్ ! "
  • WhatsApp
  • Frederick William Savidge | ఫ్రెడరిక్ విలియం సావిడ్జ్

    ఫ్రెడరిక్ విలియం సావిడ్జ్  | Frederick William 


    • జననం: 1862
    • మహిమ ప్రవేశం: 28-09-1935
    • స్వస్థలం: కేంబ్రిడ్జ్‌షైర్
    • దేశం: ఇంగ్లాండు
    • దర్శన స్థలము: ఈశాన్య భారతదేశం

     మిజోరాంలోని మిజో తెగలు ఒకప్పుడు నిరాశాజనకమైన కౄరులుగా పేరుగాంచారు. ఆంగ్లేయులు కూడా లుషాయ్ కొండలలోకి వెళ్ళుటకు సాహసించలేదు. రాక్షసులకు బలులను అర్పించే ఆ తెగలు నిరంతరం ఒకరితో ఒకరు పోరాడుతూ ఉండేవారు. అయితే, నేడు మిజోలలో 87 శాతం మంది క్రైస్తవులు అని చెబితే మీరు నమ్మగలరా? అవును, వారు దేవుని దృష్టిలో నిరాశాజనకమైన ప్రజలు కారు. వారు కూడా పాప బంధకముల నుండి విమోచన పొందుటకు ఆయన తన సేవకులను పంపాడు.

     మిజో తెగల మధ్య సేవ చేసిన మొదటి మిషనరీలలో ఒకరు ఫ్రెడరిక్ విలియం సావిడ్జ్. డాక్టరేటు పట్టాను కలిగియున్న అతను, లండన్‌లో పాఠశాల ఉపాధ్యాయునిగా పని చేసేవారు. అక్కడ అతను ఈశాన్య భారతదేశంలో మిషనరీల కొరకు ఉన్న అవసరం గురించి తెలుసుకున్నారు. వెంటనే అతను తన ఉద్యోగానికి రాజీనామా చేసి, 1891వ సం లో బెంగాల్ చేరుకున్నారు. కానీ, మిజోరాం చేరుకొనుటకు అతనికి దాదాపు మరో మూడు సంవత్సరాలు పట్టింది. క్రీస్తు యొక్క శాంతి సందేశాన్ని వ్యాపింప చేయుటకు అతను తన స్నేహితుడైన జేమ్స్ హెర్బర్ట్ లోరైన్‌తో కలిసి ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభించారు.

     మొదట అతను త్రిపురలో మిషనరీ పనిని ప్రారంభించాల్సి ఉంది గానీ స్థానిక మహారాజు తన భూభాగంలోకి అడుగుపెట్టుటకు అతనిని అనుమతించలేదు. కాబట్టి, అతను చిట్టగాంగ్‌కు వెళ్ళి మిజోరామ్‌లోకి ప్రవేశించుటకు అనుమతి కొరకు వేచి యున్నారు. అయితే లుషాయ్ తెగలు నిరంతరం పోరాడుతూ ఉన్నందున ఆ భూభాగంలోకి ప్రవేశించలేకపోయిన అతను సమీపంలోని కసలాంగ్ గ్రామంలో స్థిరపడాల్సి వచ్చింది. అక్కడ అతను ఆకలి బాధను, అరణ్యము యొక్క భయానక పరిస్థితులను మరియు తీవ్రమైన అనారోగ్యమును అనుభవించారు. అతని ఆరోగ్యం దృష్ట్యా అతను ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళడం మంచిదని ఇతరులు సూచించినప్పటికీ వెనుకంజ వేయని ఈ మిషనరీ అక్కడే ఉండుటకు నిర్ణయించుకున్నారు. చివరికి 1894వ సంll జనవరి మాసంలో వారు మిజోరాంలోని ఐజ్వాల్‌కు వచ్చారు.

     సావిడ్జ్ వెంటనే విద్యకు సంబంధించిన పనులను చేపట్టారు. అతని మొదటి ప్రాధాన్యత మిజో భాషకు అక్షరమాలను తయారుచేయడం. 1894వ సంll ఏప్రిల్ నాటికి స్థానికులకు విద్యను నేర్పించుటకు ఒక చిన్న పాఠశాలను ప్రారంభించారు సావిడ్జ్. తరువాత కొద్దికాలం అతను అరుణాచల్ ప్రదేశ్‌లో సేవ చేసి, తిరిగి దక్షిణ మిజోరాంకు వచ్చారు. అక్కడ తీవ్రమైన సువార్త సేవతో పాటు అతను అలుపెరుగకుండా పాఠశాలలను నడిపించారు, సామాజిక సేవలను అందించారు మరియు చిన్నపాటి ఔషధ వైద్యశాలలను నడిపారు. దేవుని రాజ్యము అభివృద్ధి చెందుటతో పాటు ఆ ప్రాంతము అన్ని విధాలా అభివృద్ధిని సంతరించుకుంది.

     35 సంవత్సరాల పాటు తీవ్రమైన పరిచర్య జరిగించిన తరువాత 1925వ సంll లో పదవీ విరమణ పొందిన ఫ్రెడరిక్ విలియం సావిడ్జ్, 1935వ సంll లో పరమందు తన ప్రభువును చేరుకొన ఇహలోకము విడిచి వెళ్ళారు.

    ప్రియమైనవారలారా, దేవుని సేవించుటకుగాను మీ విలువైన మరియు ఉన్నతమైన విద్యార్హతలను వదులుకొనుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?

    ప్రభువా, మిషనరీ సేవ చేయుటకు ఎదురుపడిన అవకాశములను నేను ఉపయోగించుకొనునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Sep 21, 2021

    Faye Edgerton | ఫేయ్ ఎడ్జర్టన్

     ఫేయ్ ఎడ్జర్టన్ | Faye Edgerton


    • జననం: 26-03-1889
    • మహిమ ప్రవేశం: 04-03-1968
    • స్వస్థలం: నెబ్రాస్కా
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శనము: నవాజో మరియు అపాచీ ప్రజలు


     ఫేయ్ ఎడ్జర్టన్ ఒక మిషనరీ మరియు బైబిలు అనువాదకురాలు. ఆమె పాఠశాలలో చదువుకునే రోజులలో లోకానుసారమైన జీవితమును జీవించారు. అయితే, 12వ తరగతి పూర్తయిన తరువాత, ఆమె స్కార్లెట్ ఫీవర్‌తో తీవ్రంగా బాధపడ్డారు మరియు తాత్కాలికంగా చెవిటితనం కూడా ఆమెకు కలిగింది. అనారోగ్యం నుంచి కోలుకొనిన తరువాత ఆమె తాను లోకానుసారమైన జీవితమును విడిచిపెట్టి, ఒక విదేశీ మిషనరీగా మారాలని నిర్ణయించుకున్నారు. కాగా, చికాగోలోని మూడీ బైబిల్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు ఫేయ్. అక్కడ నుండి పట్టా పొందిన తరువాత ఆమె భాషా శిక్షణను కూడా చేపట్టారు.


     తదుపరి ఆమె అమెరికా ప్రెస్బిటేరియన్ మిషన్‌లో చేరి కొరియాకు వెళ్ళారు. అయితే, దాదాపు నాలుగు సంll ల పాటు అక్కడ సేవ చేసిన తరువాత అనారోగ్యం కారణంగా ఆమె స్వదేశానికి తిరిగిరావాల్సి వచ్చింది. తరువాత ఆమె అరిజోనాలోని నవాజో తెగ స్థావరం వద్ద ఒక పాఠశాలలో పని చేయుటకు నియమించబడ్డారు. పాఠశాలలో పిల్లలు ఆంగ్లము మాత్రమే మాట్లాడుటకు అనుమతించబడేవారు, నవాజో భాష అక్కడ నిషేధించబడింది. అయితే, నవాజో ప్రజలకు బోధించేటప్పుడు వారికి దేవుని వాక్యమును నవాజో భాషలోనే అందించవలసిన ఆవశ్యకతను గ్రహించారు ఫేయ్. కాగా, ఆమె తానే స్వయంగా ఆ భాషను నేర్చుకోవడం ప్రారంభించారు.


     చివరకు తాను ఏమి చేయాలని దేవుడు సంకల్పించాడో అది చేయుటకు తనకు మార్గమును తెరుస్తున్నాడని చూచిన ఆమె, 1944వ సంll లో క్రొత్త నిబంధనను నవాజో భాషలోకి అనువదించుటకు 'విక్లిఫ్ బైబిలు అనువాదకుల' లో చేరారు. జెరోనిమో మార్టిన్ అనే నవాజో తెగకు చెందిన ఒక అంధుడు మరియు రోజర్ డీల్ అనే మరొక అనువాదకుని సహాయంతో ఆమె క్రొత్త నిబంధనను అనువదించడం ప్రారంభించారు. ప్రజలు చదవలేకపోతే అనువదించిన బైబిలు నిష్ప్రయోజనమని ఎరిగియున్న ఫేయ్, అనువదించుటకును మరియు నవాజో ప్రజలకు చదువు నేర్పించుటకును తన సమయమును విభజించారు. 10 సంll ల పాటు తీవ్రంగా చేసిన కృషి ఫలితముగా చివరికి 1956వ సంll లో నవాజో భాషలో క్రొత్త నిబంధన గ్రంథం ప్రచురించబడింది. తదుపరి ఆమె పాత నిబంధనలోని కొన్ని పుస్తకాల నవాజో అనువాదాలను కూడా సవరించారు.


     పిమ్మట అరిజోనాలోని శాన్ కార్లోస్ వద్దనున్న అపాచీ తెగ స్థావరమునకు వెళ్ళి, అపాచీ భాషను నేర్చుకోవడం ప్రారంభించారు ఫేయ్. మరొక అనువాదకురాలైన ఫెయిత్ హిల్ సహాయంతో ఆమె క్రొత్త నిబంధనను అపాచీ భాషలోకి అనువదించారు. అది మరో పది సంవత్సరాల నిరంతర కృషి. 70 ఏళ్ళు పైబడిన వృద్ధాప్యంలో కూడా ఆమె హోపి మరియు ఇనుపియాట్ భాషలలో క్రొత్త నిబంధన యొక్క అనువాదంలో సహాయపడ్డారు మరియు నవాజో క్రొత్త నిబంధనను సవరించారు. తన చివరి శ్వాస వరకు కూడా ఏనాడూ దేవుని వాక్యమును అనువదించుటను ఆపని అలుపెరుగని దేవుని సేవకురాలు ఫేయ్ ఎడ్జర్టన్.


    ప్రియమైనవారలారా, మీ తలాంతులు దేవుని సేవలో వాడబడుటకు మార్గములను మీరు వెతుకుతున్నారా?

    "ప్రభువా, మీ సేవలో వాడబడులాగున నాకున్న తలాంతులను వృద్ధి పరచుకొనుటకు నేను కృషి చేసెదను. ఆమేన్!"

    🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏


  • WhatsApp
  • Sep 20, 2021

    Frederick Booth-Tucker | ఫ్రెడరిక్ బూత్-టక్కర్

    ఫ్రెడరిక్ బూత్-టక్కర్ |  Frederick Booth-Tucker



    • జననం: 21-03-1853
    • మహిమ ప్రవేశం: 17-07-1929
    • స్వదేశం: యునైటెడ్ కింగ్‌డమ్
    • దర్శన స్థలము: భారతదేశం

      ఫ్రెడరిక్ బూత్-టక్కర్ భారతదేశంలో జన్మించారు. అక్కడ అతని తండ్రి విలియం థోర్న్‌హిల్ టక్కర్ ‘భారత పౌర సేవలు’ (ఇండియన్ సివిల్ సర్వీస్ -ఐ.సి.ఎస్.) లో డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నారు. ఫ్రెడరిక్ ఒక క్రైస్తవ కుటుంబములో జన్మించినప్పటికీ, అతనిలో ఆత్మీయ సంబంధమైన లోతైన మార్పు 1875వ సంll లో డి. ఎల్. మూడీ మరియు సాంకీ యొక్క లండన్ మహాసభల మూలముగా కలిగింది. ఇంగ్లాండులో తన విద్యాభ్యాసమును పూర్తి చేసుకొనిన పిమ్మట అతను కూడా ఐ.సి.ఎస్.లో అసిస్టెంట్ కమిషనర్‌గా చేరారు.

    ఐ.సి.ఎస్.లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఫ్రెడరిక్ కేవలం తన సహోద్యోగుల మధ్య సువార్త ప్రకటించడమే కాదు, తన పై అధికారులు మందలించినప్పటికీ భారతీయులకు కూడా సువార్త చెప్పేవారు. భారతదేశంలో అప్పుడు ఉన్న మిషనరీ కార్యకలాపాలు మరియు క్రైస్తవ మతం యొక్క పురోగతి అతనికి అసంతృప్తికరంగా ఉన్నాయి. కాగా, లండన్‌లో 'రక్షణ సైన్యం' ('సాల్వేషన్ ఆర్మీ') యొక్క కార్యకలాపాల గురించి తెలుసుకొనిన ఫ్రెడరిక్, సాల్వేషన్ ఆర్మీ యొక్క వ్యవస్థాపకుడైన విలియం బూత్‌ను కలవడానికి ఇంగ్లాండుకు వెళ్ళారు.

    అతను తన ఉన్నత సామాజిక హోదాను వదిలి సాల్వేషన్ ఆర్మీలో చేరుటను అతని కుటుంబం వ్యతిరేకించింది. మరోవైపు, అతని సమర్పణ ఎంత వరకు అని చూచుటకు విలియం బూత్ అతని విషయములో తన నిర్ణయమును ఆలస్యం చేశారు. ఏదేమైనప్పటికీ, వెనుకంజవేయని ఈ దేవుని సేవకుడు చివరకు 1882వ సంll లో సాల్వేషన్ ఆర్మీ తరపున భారతదేశానికి వచ్చారు. భారతదేశంలో కుల వ్యవస్థ ప్రధాన అడ్డంకియని గ్రహించిన ఫ్రెడరిక్, మొదట అట్టడుగు వర్గాల ప్రజలను చేరుకొనవలెనని నిశ్చయించుకున్నారు. అందుకుగాను అతను తన పరిచర్యలో స్థానిక సంస్కృతిని మరియు సంగీతమును మిళితం చేశారు. తాను కూడా కాషాయ వస్త్రాలను ధరించి, 'ఫకీర్ సింగ్' అని పేరు మార్చుకున్నారు. అదే సమయంలో, అతను ఉన్నత వర్గాలకు చెందిన భారతీయులతో కూడా సత్సంబంధాలను కలిగియుండుటకు ప్రయత్నించారు. సమానత్వం మరియు రక్షణ గురించిన ఫ్రెడరిక్ యొక్క బోధన క్రీస్తు కొరకు అనేక ఆత్మలను గెలుచుకుంది.

    అతని భార్యయైన ఎమ్మా అనారోగ్యం పాలవడంతో 1891వ సంll లో బూత్-టక్కర్ లండన్‌కు తిరిగి వెళ్ళారు. తరువాత, వారు అమెరికాకు వెళ్ళి, అమెరికాలోని సాల్వేషన్ ఆర్మీని పునరుజ్జీవింపజేశారు. 1907వ సంll లో అతను తిరిగి భారతదేశం మరియు సిలోన్‌లలోని పరిచర్య యొక్క బాధ్యతలను చేపట్టుటకు నియమించబడ్డారు. కాగా 1919వ సంll లో ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళే వరకు కూడా భారతదేశంలోని నేర వృత్తి కలిగిన తెగల మధ్య పరిచర్య చేశారు బూత్-టక్కర్.

    1924వ సంll లో అతను సాల్వేషన్ ఆర్మీలో తన సేవ నుండి పదవీ విరమణ పొందినప్పటికీ, ఐరోపాలో సభలను నిర్వహిస్తూ దేవుని సేవను కొనసాగించారు. అతను అనేక పాటలను మరియు పుస్తకాలను కూడా వ్రాశారు. భారతదేశంలో సాల్వేషన్ ఆర్మీ స్థాపించబడుటకు కారణభూతుడుగా ఉన్న ఈ అలుపెరుగని దైవజనుడు, 1929వ సంll లో తన పరలోకపు వాస స్థలమును చేరుకొనుటకు ఇహలోకము విడిచి వెళ్ళారు.

    ప్రియమైనవారలారా, మీ దేవుని సేవించుటకుగాను సౌకర్యవంతమైన జీవితమును విడిచిపెట్టుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?

    ప్రభువా, మీ నిమిత్తము నేను సమస్తమును నష్టముగా ఎంచుకొనుటకు నాకు కృపననుగ్రహించుము. ఆమేన్!

    🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏
    *******

  • WhatsApp
  • Sep 6, 2021

    William Buck Bagby | విలియం బక్ బాగ్బీ

    విలియం బక్ బాగ్బీ | William Buck Bagby

    • జననం: 05-011-1855
    • మహిమ ప్రవేశం: 05-08-1939
    • స్వస్థలం: కొరియెల్ కౌంటీ
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: బ్రెజిల్


     1884వ సంll లో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో ఒక మిషనరీ దంపతులు కాథలిక్కుల నుండి తీవ్రమైన వ్యతిరేకత నెలకొనియున్న పరిస్థితుల మధ్య దేవుని పరిచర్యను ప్రారంభించారు. ఆ మిషనరీలకు అది ఎంతో నిరాశాజనకమైన ఆరంభముగా ఉంది. ఏలయనగా వారు నిర్వహించే ఆరాధనా కూడికలకు ఎవరూ వచ్చేవారుకాదు. కావున వారు ఆలయమునకు వెలుపల వాయిద్యములను వాయించుచూ పాడటం ప్రారంభించారు. అది చూచిన కొంతమంది ఆసక్తిగలవారు అక్కడ గుమిగూడడం ప్రారంభించినప్పుడు కొంతమంది గుంపుగా వచ్చి దాడిచేసి, అక్కడి సామగ్రిని ధ్వంసం చేశారు. వారిలో ఒకరు బోధకునిపై రాయి విసరగా అతని తలకు గాయమై స్పృహ తప్పి పడిపోయారు. కానీ కొన్ని నిమిషముల తరువాత అతనికి స్పృహ వచ్చినప్పుడు అతను తిరిగి లేచి నిలబడి బోధించడం కొనసాగించారు. ఆ బోధకుడు మరెవరో కాదు, బ్రెజిల్‌లో ప్రారంభక బాప్తిస్టు మిషనరీలలో ఒకరిగాను మార్గదర్శకులుగాను నిలిచిన విలియం బక్ బాగ్బీ.


     వాకో విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన విలియం, పిమ్మట ఒక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. యవ్వనదశలో ఉన్నప్పుడు దక్షిణ అమెరికాలో మిషనరీల కొరకు ఉన్న అవసరతను గురించి వినిన అతనిలో అందుకొరకైన భారం కలిగింది. అతను అన్నే లూథర్‌ను వివాహం చేసుకున్నప్పుడు దక్షిణ అమెరికాలో మిషనరీ సేవ పట్ల అతను కలిగియున్న ఆసక్తి కార్యరూపం దాల్చుటకు పునాదులు పడ్డాయి. అన్నే కూడా మిషనరీ పరిచర్య పట్ల సమర్పణను కలిగియున్నవారు. మరి ముఖ్యముగా దక్షిణ అమెరికాలో సేవ పట్ల అతని వలెనే ఆసక్తిని కలిగియున్నారు. కాగా, మరికొంత మంది ప్రోత్సాహంతో 1880వ సంll లో రియో డి జనీరోలో అడుగుపెట్టారు బాగ్బీ దంపతులు. తరువాత అక్కడ ప్రభుత్వాన్ని నడపడంలో కాథలిక్ సంఘం పాలుపంచుకుంది. అక్కడి కాథలిక్కులు ప్రొటెస్టెంట్ క్రైస్తవుల పట్ల అసహనమును కలిగియుండేవారు. కాగా, పరిచర్య యొక్క ప్రారంభ దశలలో బాగ్బీ అక్కడ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అతను అనేకమార్లు శారీరకముగా దాడి చేయబడ్డారు కూడా. అయినప్పటికీ, ధైర్యవంతుడైన ఈ మిషనరీ కష్టాలు శ్రమల మధ్యలో మరింతగా బలమొందారు. త్వరలోనే, రెండు సంవత్సరాల కాలంలో రియోలో రెండు బాప్తిస్టు సంఘములు ఏర్పరచబడ్డాయి.


     బాగ్బీ తన పరిచర్యను రియో సరిహద్దులను దాటి విస్తరింపచేశారు. అతను బ్రెజిల్ దేశమంతటా పర్యటించి, అన్ని ప్రధాన నగరాలలో క్రైస్తవ సంఘములను స్థాపించారు. బ్రెజిల్‌లో ప్రతిచోటా అతను స్థాపించిన సంఘములు, నిర్మించిన పాఠశాలలు, క్రీస్తు కొరకు అతను సంపాదించిన గొప్ప క్రైస్తవ నాయకులు మరియు వేలాది మంది విశ్వాసుల రూపంలో బాగ్బీ యొక్క పరిచర్య ప్రభావం కనిపిస్తుంది. అతని జీవిత భాగస్వామియైన అన్నే లూథర్ పరిచర్యలో కూడా అతనికి సరిసమానమైన భాగస్వామిగా ఉన్నారు. దేవుని ఆశీర్వాదముతో వారికి తొమ్మిది మంది సంతానము కలుగగా, వారిలో ఐదుగురు దక్షిణ అమెరికాకు మిషనరీలుగా తమ జీవితములను సమర్పించుకున్నారు.


     58 సంవత్సరాల పాటు ఎంతో తీవ్రముగా పరిచర్య జరిగించిన పిమ్మట, తన సేవా ఫలమైన 694 సంఘములను మరియు 53,000 మంది విశ్వాసులను విడిచిపెట్టి 1934వ సంll లో పరమందు తన ప్రభువును చేరుకొన ఇహలోకమును విడిచి వెళ్ళారు విలియం బక్ బాగ్బీ. 


    🚸 *ప్రియమైనవారలారా, కష్టాలు, శ్రమల మధ్యలో మరింతగా దేవునికి సేవ చేయుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?* 🚸


    🛐 *"ప్రభువా, అననుకూల పరిస్థితుల దాడులకు నేను గురై పడిపోయిన ప్రతిసారీ తిరిగి మీ కొరకు నిలబడగలుగునట్లు నన్ను లేవనెత్తుము. ఆమేన్!"* 🛐


    🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏


  • WhatsApp