Search Here

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Apr 9, 2022

Theodore Leighton Pennell | థియోడర్ లైటన్ పెన్నెల్

థియోడర్ లైటన్ పెన్నెల్ జీవిత చరిత్ర




  • జననం : 07-10-1867
  • మరణం : 23-03-1912
  • జన్మస్థలం : క్లిఫ్టన్
  • దేశం   : ఇంగ్లాండు
  • దర్శన స్థలము : బన్నూ, పాక్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు


పఠాన్ దుస్తులు ధరించిన ఒక వ్యక్తి సైకిలు మీద పంజాబు వీధుల గుండా వెళ్తున్నాడు. తమ సౌకర్యవంతమైన నివాసాలలో ఉంటూ, ప్రజలలోకి వెళ్ళకుండా, ప్రజలే తమ వద్దకు రావలెనని ఆశిస్తూ నిశ్చింతగా ఉన్న మిషనరీల స్థితిని చూచి అతని హృదయం భారంతో నిండిపోయింది. ఆ వ్యక్తి థియోడర్ లైటన్ పెన్నెల్. అతను ముస్లింలతో కలిసి వారిలో ఒకనిగా జీవించుటకై పఠాన్ యొక్క వస్త్రధారణను అవలంబించారు, హిందువులు తనతో కలిసి తినుటకు వీలు కలుగునట్లు శాకాహారిగా మారారు, గ్రామాలను దర్శించారు, ప్రజలలోకి వెళ్ళారు, వారిని సంధించారు, వారితో కలిసి నివసించారు, వారి యొక్క నమ్మకాన్ని గెలుచుకోవడానికి ప్రయత్నించారు, వారికి భౌతికపరమైన వైద్య సేవలను అందిస్తూ వారి హృదయములను స్వస్థపరచగల పరమ వైద్యుడిని వారికి పరిచయం చేశారు!


వైద్యశాస్త్ర విద్యాభ్యాసములో బంగారు పతకాన్ని పొందినటువంటి థియోడర్ పెన్నెల్, తన ముందున్న ఉజ్వలమైన భవిష్యత్తును విడిచిపెట్టి, చర్చి మిషనరీ సొసైటీ (సిఎంఎస్) కు తన సేవలను అందించుటకు సమర్పించుకున్నారు. తద్వారా అతను ఆంగ్లేయులు పరిపాలిస్తున్న కాలములో భారతదేశమునకు మిషనరీగా నియమించబడ్డారు. అప్పటిలో పాకిస్తాన్ కూడా భారతదేశంలో భాగంగా ఉంది. తన జీవితము ద్వారా ప్రజలకు సేవ చేయవలెనని ప్రేరణ కలిగిస్తూ అతనిని పెంచిన అతని తల్లియైన ఎలిజబెత్ కూడా అతనితో పాటు భారతదేశానికి ప్రయాణమయ్యారు. 1892వ సంll లో పాకిస్తాన్ భూభాగములోని డేరా ఇస్మాయిల్ ఖాన్ వద్ద తన సేవను ప్రారంభించిన పెన్నెల్, 1893వ సంll నాటికి పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వద్ద ఉన్న బన్నూ అనే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఆఫ్ఘనిస్తానుకు వెళుతున్న లేదా అక్కడి నుండి వస్తున్న ప్రయాణికుల మధ్య అతను సువార్త సేవ జరిగించారు. బన్నూలో అతను ఒక పాఠశాలను మరియు ప్రతి సంవత్సరం వేలాది మంది రోగులకు సేవలందించిన ఒక ఆసుపత్రిని స్థాపించారు. అతను ఒకవైపు వైద్య సేవలను అందిస్తూనే, మరొకవైపు బన్నూ మరియు పరిసర గ్రామాలలో బహిరంగముగా సువార్తను ప్రకటించేవారు. అతని పరిచర్య యొక్క మొదటి ఫలమైన జహాన్ ఖాన్, విదేశాలకు మిషనరీగా వెళ్ళిన ఆఫ్ఘనిస్తానుకు చెందిన మొదటి వ్యక్తి. అతను గల్ఫ్ మరియు తూర్పు ఆఫ్రికాలకు వెళ్ళి సేవ చేశారు.


అయితే ఇస్లాం నాయకుల నుండి వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. వారు పెన్నెల్ ఇచ్చే మందులను వాడవద్దని ప్రజలను హెచ్చరించారు. క్రైస్తవులుగా మారినవారు పలు శ్రమలను ఎదుర్కొన్నారు. పెన్నెల్ సేవచేసినది కోపోద్రేకులు, సాధుస్వభావం లేని తెగలకు చెందినవారై తమ మతమంటే ఎంతో అంకితభావం గలవారైన ఇస్లాంవాదుల మధ్య. కానీ, అతను ఏనాడూ భయపడలేదు. పైగా ఏదైనా ప్రదేశం సువార్త సేవకు ప్రమాదకరమైనదిగా కనిపిస్తే, దానిలోకి ప్రవేశించుటకు అతను ప్రేరేపించబడేవారు. ఆఫ్ఘనిస్తాన్ దేశము పట్ల అతను ఎంతో భారము కలిగియుండేవారు. కాగా మిషనరీలు ప్రవేశించుటకు అనుమతించని ఆ దేశమునకు వెళ్ళుటకు అతను నిరీక్షించారు. 


భారతదేశంలో సంఘసేవ చేసినందుకుగాను గౌరవార్థముగా ఇచ్చే ‘కైసర్-ఇ-హింద్’ పతకాన్ని అందుకున్న టి. ఎల్. పెన్నెల్, అంటు వ్యాధి ఉన్న ఒక వ్యక్తికి చికిత్స చేస్తుండగా తాను కూడా ఆ వ్యాధి బారిన పడి, 45 సంll ల వయసులో మరణించారు.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీ సౌకర్యవంతమైన స్థితిని విడిచిపెట్టి, ప్రజలలోకి వెళ్ళి వారితో సువార్తను పంచుకొనుటకు  మీరు ముందుకు వచ్చెదరా?


ప్రార్థన :

"ప్రభువా, ఎటువంటి భయమూ లేకుండా ధైర్యము కలిగి మీ సువార్తను ప్రకటించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!" 

దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Mar 21, 2022

    Thomas Walker | థామస్ వాకర్

    థామస్ వాకర్ జీవిత చరిత్ర





    • జననం : 09-02-1859
    • మరణం : 24-08-1912
    • స్వస్థలం : డెర్బీషైర్
    • దేశం : ఇంగ్లాండు 
    • దర్శన స్థలము : తిరునెల్వేలి (భారతదేశం)


    థామస్ వాకర్ దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తిన్నెవెల్లి (తిరునెల్వేలి) ప్రాంతానికి మిషనరీగా వచ్చిన ఆంగ్లేయుడు. భక్తిగల క్రైస్తవ కుటుంబంలో జన్మించిన అతను చిన్నప్పటి నుండీ దేవుని యందలి భయభక్తులతో పెరిగారు. పదిహేడేళ్ళ వయసులో అతను ఒక బైబిలు తరగతికి హాజరవ్వగా, అక్కడ అతను వినిన 'బండ మీద కట్టువాడు మరియు ఇసుక మీద కట్టువాడు' అనే ఉపమానం అతని హృదయాన్ని బలంగా తాకింది. వెంటనే అతను తనను తాను దేవునికి సమర్పించుకున్నారు. గణిత శాస్త్రమును అభ్యసించుటకు కేంబ్రిడ్జ్ లోని సెయింట్ జాన్ కళాశాలలో చేరిన వాకర్ అక్కడ భక్తి, ప్రార్థన మరియు క్రమబద్ధమైన వాక్య ధ్యానం కలిగిన జీవితమును అభివృద్ధి పరచుకున్నారు. అవి అతని భవిష్యత్తు జీవితమునకు మరియు సేవకు పునాది వేశాయి. అతను వ్యాపారం చేయాలని అతని తండ్రి కోరుకున్నారు గానీ, అతని హృదయం మాత్రం మిషనరీ సేవ చేయాలనే వాంఛతో నిండుకొనియుంది. అతను దేవుని వాక్యమును ధ్యానించే కొద్దీ 'మనుష్యులను పట్టు జాలరిగా' మారవలెననే నిశ్చయత అతనిలో మరింతగా బలపడుతూ వచ్చింది. తత్ఫలితంగా అతను ‘చర్చి మిషనరీ సొసైటీలో చేరగా, 1885వ సంll లో తిన్నెవెల్లికి పంపించబడ్డారు.


    తిన్నెవెల్లికి చేరుకున్న తరువాత తమిళ భాషలో ప్రావీణ్యం సంపాదించిన వాకర్, అనేక ఆంగ్ల కీర్తనలను తమిళ భాషలోకి అనువదించే ఒక గొప్ప పద్ధతిని అలవరిచారు. తిన్నెవెల్లి మరియు చుట్టుప్రక్కల వివిధ ప్రాంతాలకు కాలినడకన మరియు ఎద్దుల బండి పై వెళ్ళి సువార్తను ప్రకటించిన శక్తివంతమైన బోధకుడు వాకర్. ఆ విధంగా అతని నిర్విరామ సేవల వలన క్రీస్తు యొక్క వెలుగును చూసిన ప్రదేశాలలో పన్నైవిళై ఒకటి. హిందువుల నుండి అతను వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, క్రీస్తు కొరకు అనేక ఆత్మలను రక్షించడంలో విజయవంతులయ్యారు. అంతేకాకుండా, దేవదాసీ బాలికల మధ్య సేవచేస్తున్న తన తోటి మిషనరీ అయిన ఎమీ కార్‌మైఖేల్‌కు కూడా ఆమె చేస్తున్న సేవలో ప్రోత్సాహమందించారు వాకర్. కాగా వారిరువురూ కలిసి డోనావూర్ వద్ద ఒక పాఠశాలను మరియు "డోనావూర్ ఫెలోషిప్" అనే సంస్థను స్థాపించారు. వీటి ద్వారా ఆ ప్రదేశం ఒక క్రైస్తవ సమాజంగా మారింది మరియు యువతులకు సురక్షితమైన ఆశ్రయమయ్యింది.


    వాకర్ అసాధారణమైన చిత్తశుద్ధి మరియు ఆత్మీయ విషయముల పట్ల ఎంతో శ్రద్ధ గలిగిన వ్యక్తి. మార్మన్ కన్వెన్షన్‌లో అతను చేసిన ప్రసంగాలు కేరళ రాష్ట్రంలోని క్రైస్తవ సంఘములలో ఉజ్జీవాన్ని తీసుకువచ్చాయి. అతని సేవ ఫలితంగా అప్పటి దైవ సేవకులు సువార్తను ప్రకటించవలెనన్న తీవ్రమైన వాంఛ మరియు ఆసక్తులతో నింపబడ్డారు. తత్ఫలితంగా ఎంతోమంది దేవుని యొక్క మందలో చేర్చబడ్డారు. అనేకమంది మిషనరీలకు ప్రేరణగా నిలిచిన 'వాకర్ ఆఫ్ తిన్నెవెల్లి’ అని పిలువబడే థామస్ వాకర్, దేవుని కొరకు మనుష్యులను పట్టే జాలరిగా ఈ లోకములో తన పనిని విజయవంతముగా ముగించి, 1912వ సంll లో పరలోకపు వాసస్థలమునకు పయనమయ్యారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీరు దేవుని కొరకు మనుష్యులను పట్టు జాలర్లుగా ఉన్నారా?


    దేవునికే మహిమ కలుగునుగాక!

    "ప్రభువా, ఇహలోక ఆశలను, సుఖభోగములను విడిచి మీ కొరకు మనుష్యులను పట్టు జాలరిగా ఉండునట్లు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!


    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Nov 30, 2021

    Thomas Jones Life History

    థామస్ జోన్స్ గారి జీవిత చరిత్ర



    • జననం: 24-12-1810
    • మహిమ ప్రవేశం: 16-09-1849
    • స్వస్థలం: బెర్రీవ్
    • దేశం: యునైటెడ్ కింగ్‌డమ్
    • దర్శన స్థలము: ఈశాన్య భారతదేశం

     ఇంగ్లాండుకు చెందిన థామస్ జోన్స్ భారతదేశంలోని అస్సాం మరియు మేఘాలయ రాష్ట్రాలలో ఉన్న ఖాసీ అనే తెగలవారి మధ్య మొదటిగా జరిగించిన పరిచర్యకు పేరుగాంచిన మిషనరీ. బాల్యం నుండి అతను తమ కుటుంబ పోషణ కొరకై తన తండ్రి యొక్క వడ్రంగి పనిలో సహకారిగా ఉండేవారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా అతను అధికారికంగా విద్యను అభ్యసించలేకపోయారు. అయినప్పటికీ, వారి క్రైస్తవ సంఘ కార్యకలాపాలలో చాలా చురుకుగా ఉండే అతను, 25 సంవత్సరాల వయస్సులోనే బోధించడం ప్రారంభించారు.

     అతను లండన్ మిషనరీ సొసైటీ (ఎల్.ఎమ్.ఎస్.) తరఫున మిషనరీ సేవ చేయుటకు ముందుకువచ్చారు గానీ, ఆరోగ్యపరంగా అతని యొక్క బలహీన స్థితిని బట్టి ఆ సంస్థవారు అతనిని మిషనరీగా పంపుటకు నిరాకరించారు. అయినప్పటికీ దేవుని పిలుపును గురించి దృఢమైన నిశ్చయం కలిగియున్న జోన్స్ 1840వ సంll లో ‘కాల్వినిస్టిక్-మెథడిస్ట్స్ ఫారిన్ మిషనరీ సొసైటీ’ (సి.ఎమ్.ఎఫ్.ఎమ్.ఎస్.) అనే సంస్థను స్థాపించారు. ఎక్కడికి వెళ్ళవలెనని అతను ప్రార్థనాపూర్వకంగా వివిధ ప్రదేశాలను పరిగణలోకి తీసుకొని యోచిస్తుండగా, దేవుడు ఈశాన్య భారతదేశంలో పరిచర్య చేయుట కొరకు అతనికి ద్వారము తెరిచాడు.

     తన జీవిత భాగస్వామి అన్నేతో కలిసి 1841వ సంll ఏప్రిల్ మాసములో భారతదేశంలోని కలకత్తా నగరమును చేరుకున్నారు జోన్స్. అక్కడి నుండి అతను ఖాసీ కొండలలోని ప్రజలను చేరుకొనుటకై పయనమయ్యారు. సహాయం చేయుటకు ఎటువంటి స్నేహితులు వారికి లేరు. ఆ మిషనరీ దంపతులు ప్రయాణంలో అధిక భాగం కాలినడకనే కొండలను ఎక్కుతూ 4000 అడుగుల ఎత్తులో ఉన్న చిరపుంజి ఊరికి చేరుకున్నారు. స్థానికులతో సంబంధాలు ఏర్పరచుకొనుటకు జోన్స్‌కు కొంత సమయం పట్టింది. అతను సువార్తతో వారిని సంధించుటకు తన వడ్రంగి మరియు వ్యవసాయ సంబంధిత నైపుణ్యములను ఉపయోగించారు.

     జోన్స్ స్థానిక భాషను నేర్చుకుని దానికి లిపిని కల్పించారు. అతను మత్తయి సువార్తను ఖాసీ భాషలోకి అనువదించారు మరియు ఖాసీ నిఘంటువును కూడా ప్రచురించారు. విశ్రాంతి, విరామం లేకుండా ఖాసీ-జైన్తియా కొండల అంతటా సువార్త ప్రకటించుచూ ప్రయాణించిన అతను, అనేక మిషన్ కేంద్రములను స్థాపించారు. అంతేకాదు, అస్సాం మరియు మేఘాలయలలో సామాజిక, ఆత్మీయ, సాహిత్య మరియు ఆర్థిక పునరుజ్జీవనానికి నాయకునిగా మారారు జోన్స్.

     ఈ పరిచర్య అంతటినీ అనేక పరీక్షలను, శ్రమలను అధిగమించి జరిగించారు జోన్స్. భారతదేశమునకు వచ్చిన నాలుగేళ్ళలోనే తన బిడ్డను మరియు భార్యను అతను కోల్పోయారు. ఉష్ణమండల వాతావరణం మరియు సువార్త ప్రకటించుటకు అలుపెరుగక తాను చేసిన ప్రయాణాల వలన అతని దేహము కూడా బాగా దెబ్బతిన్నది. మలేరియా బారినపడిన అతను, 39 సంll ల తక్కువ వయస్సులోనే ఈ లోక యాత్రను ముగించి ప్రభు సన్నిధానమును చేరుకున్నారు.

     దేవుడు తన సేవకుని ఘనపరిచాడు. మేఘాలయ ప్రజలు అతను అక్కడికి వచ్చిన జూన్ 22వ రోజును “రెవ. థామస్ జోన్స్ డే” గా జరుపుకుంటారు మరియు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రోజును సెలవుదినముగా ప్రకటించింది. అక్కడ అతను చూపిన ప్రభావం అటువంటిది!


    ప్రియమైనవారలారా, ఇతరులు అంగీకరించని కారణంగా మీరు మీ పరిచర్యలో నిరాశ చెందియున్నారా? 
    దేవుడు మీ కొరకు నిశ్చయముగా వేరొక ద్వారమును తెరుస్తాడు

    ప్రభువా, మీ అంగీకారమునకే గానీ మనుష్యుల ఆమోదమునకై నేను ఎదురుచూడకయుండునట్లు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Oct 27, 2021

    Theodore Maxwell | థియోడర్ మాక్స్వెల్

    థియోడర్ మాక్స్వెల్  | Theodore Maxwell


    • జననం: 1847
    • మహిమ ప్రవేశం: 13-02-1914
    • స్వదేశం: ఇంగ్లాండు
    • దర్శన స్థలము: జమ్మూ మరియు కాశ్మీర్, భారతదేశం

     స్కాట్లాండుకు చెందిన వైద్య మిషనరీ అయిన డాll విలియం ఎల్మ్ స్లీ ప్రారంభించిన కాశ్మీర్ మిషన్ హాస్పిటల్ యొక్క కార్యకలాపాలు అతని మరణం తరువాత నిలిచిపోయాయి. సవాలుగా నిలిచే కాశ్మీర్ యొక్క భౌగోళిక పరిస్థితులు మరియు అక్కడ క్రైస్తవ మిషనరీలు ఎదుర్కొనే శ్రమల కారణంగా ఎల్మ్ స్లీ స్థానంలో మరొక మిషనరీని నియమించడం చర్చి మిషనరీ సొసైటీకి చాలా కష్టమైంది. అయితే ఆ సంస్థ వారు తమ అభ్యర్థనకు ఆసక్తిగా ప్రతిస్పందించిన ఒక యవ్వన వైద్య మిషనరీని పొందగలిగారు. అతనే డాll థియోడర్ మాక్స్‌వెల్.

    దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక క్రైస్తవ కుటుంబములో జన్మించారు థియోడర్. ఉన్నత విద్యావంతులైన అతను, సైన్స్, ఆర్ట్స్ మరియు వైద్య రంగాలలో పట్టాలను కలిగియున్నారు. తాను ఇంగ్లాండులో వైద్యునిగా పనిచేస్తున్న సమయంలో అతనికి వైద్య మిషనరీ సేవ పట్ల ఆసక్తి కలిగింది. తన మేనమామ ఢిల్లీలో యుద్ధంలో మరణించినప్పటికీ, భారతదేశానికి వెళ్ళి సేవ చేయుటకు అతను ఏ మాత్రం సంకోచించలేదు. అతను 1873వ సంll చివరిలో ఎలిజబెత్ ఐర్ ఆష్లీని వివాహం చేసుకుని, 1874వ సంll ప్రారంభంలో కాశ్మీర్‌కు పయనమయ్యారు.

    దాదాపు రెండు సంవత్సరాల పాటు నిలిచిపోయిన కాశ్మీర్‌లోని వైద్య మిషన్‌ను పునఃప్రారంభించారు మాక్స్‌వెల్. 1874వ సంll మే మాసములో అక్కడ ఒక చిన్న వైద్యశాలను ప్రారంభించిన అతను, ప్రతిరోజూ వందలాది మంది స్థానిక ప్రజలకు చికిత్స అందించేవారు. మంచి ప్రవర్తన మరియు అపారమైన వైద్య సేవలతో అతను ఒకప్పుడు ఎల్మ్ స్లీని హింసించిన అదే మహారాజు యొక్క దయను పొందగలిగారు. కాగా, ఆ మహారాజు ద్రుగ్జన్‌లో ఆసుపత్రిని నిర్మించుటకు అతనికి స్థలమును మరియు అందుకు అవసరమైన ధనమును కూడా ఇచ్చారు.

    దేవుని నడిపింపు ద్వారా, ప్రార్ధనాపూర్వకముగా కాశ్మీర్ మిషన్ ఆసుపత్రిని ప్రజల సంక్షేమం కొరకు అంకితం చేశారు మాక్స్వెల్. అతను తన శక్తికి మించి రెండేళ్ళ పాటు కాశ్మీర్ ప్రజల మధ్య జ్ఞానముతోను, సాత్వికముతోను సేవ చేశారు. మహారాజుతో అతను కలిగియున్న సత్సంబంధాలు కాశ్మీర్‌లో పరిచర్య చేయుటకు ఇతర మిషనరీలకు కూడా మార్గము తెరిచాయి. దేనికీ తగనివారుగా పరిగణించబడే స్థానిక వైద్యులను పాశ్చాత్య వైద్య సేవలను ఉపయోగించేవారిగా తీర్చిదిద్దడంలో అతను కీలకపాత్ర పోషించారు. ఎంతో గ్రహింపు, వివేచన కలిగిన తత్వముతో అతను వైద్య సేవను సువార్తను వ్యాపింపజేసేందుకు ఒక మాధ్యమముగా ఉపయోగించారు. 

    ఆ రెండు సంవత్సరాల పరిచర్య అతని ఆరోగ్యంపై తీవ్ర ప్రభావమును చూపగా, అతను ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ కూడా తన వైద్య జ్ఞానమును ఉపయోగించి, తన చివరి శ్వాస వరకు కూడా దేవునికి మరియు మానవాళికి సేవ చేయుటను కొనసాగించారు థియోడర్ మాక్స్వెల్.

    ప్రియమైనవారలారా, మీ మంచి ప్రవర్తన సువార్తకు ఎంతో ప్రభావము గలిగిన ద్వారం కాగలదని మీరు ఎరిగియున్నారా?

    ప్రభువా, క్రీస్తు సువార్తకు తగిన రీతిలో నా ప్రవర్తనను దిద్దుకొనుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Oct 22, 2021

    Thomas Valpy French | థామస్ వాల్పీ ఫ్రెంచ్

    థామస్ వాల్పీ ఫ్రెంచ్ |  Thomas Valpy French



    • జననం: 01-01-1825
    • మహిమ ప్రవేశం: 14-05-1891
    • స్వస్థలం: బర్టన్-ఆన్-ట్రెంట్
    • దేశం: ఇంగ్లాండు
    • దర్శన స్థలము: బ్రిటిష్ కాల భారతదేశం మరియు మస్కట్

     మస్కట్ సమీపంలోని సముద్రతీరంలో ఒక సమాధి మీద “లాహోర్ యొక్క మొదటి బిషప్ మరియు మస్కట్‌కు వచ్చిన మొదటి మిషనరీ” అనియు, దాని క్రింద యోహాను 12:24 వాక్యము వ్రాయబడియుంటుంది. ఇది ఒక మిషనరీ యొక్క సమాధి. అతను బ్రిటీష్ కాలంలోని భారతదేశంలోను మరియు ముస్లింల మధ్యను కఠినముగా పరిచర్య చేసి, ఆరోగ్య పరిస్థితి క్షీణించినా అరేబియాకు వెళ్ళి, చివరికి మస్కట్ నేలపై రాలిపోయిన ఒక గోధుమ గింజ.

     థామస్ వాల్పీ ఫ్రెంచ్ ఆంగ్లికన్ సంఘములో ఒక మతాధికారి యొక్క జ్యేష్ఠ కుమారుడు. తన చిన్నతనంలో అతను మిషనరీలను సందర్శించడం వలన విదేశాలలో పరిచర్యపై అతనికి ఆసక్తి ఏర్పడింది మరియు అతను తన తోడబుట్టినవారితో కలిసి వారి కొరకు ప్రార్థించేవారు. అతను తెలివైనవారు మరియు ఉన్నత విద్యావంతులు. భారతదేశంలో మిషనరీ అయిన హెచ్‌. డబ్ల్యూ. ఫాక్స్ యొక్క అభ్యర్థన మరియు బిషప్ శామ్యూల్ విల్బర్‌ఫోర్స్ యొక్క ఒక ప్రసంగం అతను తన జీవితమును మిషనరీ సేవకు సమర్పించుకొనుటకు కారణమయ్యాయి. కాగా “చర్చి మిషనరీ సొసైటీ” (సి.ఎమ్.ఎస్.) లో చేరిన అతను, 1850వ సంll లో భారతదేశానికి పయనమయ్యారు.

     1851వ సంll లో థామస్ భారతదేశంలోని ఆగ్రాలో సెయింట్ జాన్స్ కళాశాలను స్థాపించారు. కళాశాల యొక్క నిర్వాహక పనులతో విరామం లేకుండా ఉన్నప్పటికీ, అతను ఎల్లప్పుడూ సువార్తను ప్రకటించుటకు సమయం కేటాయించారు. అతను స్థానిక అంగడి ప్రాంతాలలో సువార్తను ప్రకటించేవారు, ఆగ్రా చుట్టుప్రక్కల ప్రాంతాలలో సువార్త ప్రకటన పర్యటనలను చేపట్టారు మరియు ఎల్లప్పుడూ వ్యక్తిగతముగా సువార్తను ప్రకటించుటకు సమయం గడిపేవారు. ఏడు భారతీయ భాషలు నేర్చుకున్న అతను, “ఏడు భాషల వ్యక్తి” అని పిలువబడేవారు. 1862వ సంll లో అతను మరొక మిషనరీతో కలిసి పాకిస్థాన్ ప్రాంతంలో డేరాజత్ మిషన్‌ను స్థాపించారు. కానీ, అటు వెంటనే అధిక పనిభారం కారణంగా అతని ఆరోగ్యం క్షీణించడంతో అతను ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది.

     భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత అతను 1869వ సంll లో లాహోర్‌లో సెయింట్ జాన్స్ డివినిటీ స్కూల్‌ను స్థాపించారు. ఇది పరిచర్య చేయుటకు మరియు వివిధ వృత్తిపరమైన రంగాలలో సాక్షులుగా ఉండుటకును శిక్షణనిస్తుంది. విద్యావంతులైన క్రైస్తవులు ప్రతి రంగములోను ఉద్యోగాలలో ప్రవేశించి, అక్కడ సాక్షులుగా నిలబడవలెనని థామస్ విశ్వసించారు. 1877వ సంll లో అతను లాహోర్ డైయోసెస్ యొక్క మొదటి ఆంగ్లికన్ సంఘ బిషప్‌గా నియమించబడ్డారు. స్థానిక సంస్కృతికి తగిన విధముగా స్వదేశీ సంఘమును అభివృద్ధి చేయుటకు అతను శ్రమించారు. అయితే ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో అతను మరలా 1887వ సంll లో ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళారు. అయితే, 1891వ సంll లో అరేబియాలో స్వచ్ఛందముగా సేవ చేసేవారి కొరకు సి.ఎమ్.ఎస్. సంస్థవారు ఇచ్చిన పిలుపుకు స్పందించారు థామస్. అరవై ఆరేళ్ల వయసులో అతను మస్కట్‌లో అడుగు పెట్టారు. కానీ, అలుపెరుగక చేసిన సేవతో సొమ్మసిల్లిపోయిన థామస్ వాల్పీ ఫ్రెంచ్, తీవ్రమైన అలసటతోను మరియు జ్వరముతోను బాధపడి, మూడు నెలల తరువాత అక్కడ ప్రాణం విడిచారు.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం: 

     ప్రియమైనవారలారా, మీరు ఏ రంగంలో పనిచేస్తున్నారో అక్కడ మీరు సాక్షిగా నిలుస్తున్నారా?

    ప్రార్థన : 

    "ప్రభువా, నా శారీరక బలం క్షీణించిపోయినప్పటికీ మిమ్మును సేవించవలెననే వాంఛను మరియు ఆసక్తిని కలిగియుండుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Aug 30, 2021

    Thomas Burchell | థామస్ బర్చెల్

    థామస్ బర్చెల్ | Thomas Burchell


    • జననం: 25-12-1799
    • మహిమ ప్రవేశం: 16-05-1846
    • స్వస్థలం: యునైటెడ్ కింగ్‌డమ్
    • దర్శన స్థలము: జమైకా


     ఒక బాప్తిస్టు మిషనరీయైన థామస్ బర్చెల్ జమైకాలో బానిసల స్వేచ్ఛ కొరకు బలమైన మద్దతునిచ్చినవారిలో ఒకరు. యవ్వనదశలో అతను క్రైస్తవ వీరుల సాక్ష్యములను చదువుటను ఎంతో ఇష్టపడేవారు. అతను తన రక్షణ అనుభవమును “పాప బానిసత్వం యొక్క బంధకముల నుండి స్వేచ్ఛను పొందడం” గా వర్ణించారు. పాపము యొక్క బానిసత్వం నుండి స్వేచ్ఛను పొందిన వ్యక్తిగా జమైకన్ల ఆత్మీయ మరియు భౌతికపరమైన స్వేచ్ఛ కొరకు కృషిచేశారు థామస్.


     నెయిల్‌స్వర్త్‌లో బట్టల తయారీదారునిగా శిక్షణ పొందుతున్న సమయంలో బర్చెల్ “షార్ట్‌వుడ్ బాప్టిస్ట్ చర్చ్” సంఘము వలన ఎంతో ప్రభావితులయ్యారు. అప్పటి నుండి కూడా అతని ఆలోచనలు మిషనరీ సేవ వైపుకు త్రిప్పబడ్డాయి. అదే సంఘము నుండి మిషనరీలుగా వెళ్ళినవారి అడుగుజాడలను అనుసరించిన థామస్ కూడా మిషనరీగా జమైకాలో సేవ చేయుటకు తనను తాను సమర్పించుకున్నారు. కాగా 1822వ సంll లో జమైకాలోని మాంటెగో బేకు చేరుకున్న అతను, ఇరవై రెండు సంవత్సరాల పాటు ఆ దేశములో సేవచేశారు.


     జమైకాలో ప్రబలంగా ఉన్న బానిసత్వమును చూసి ఎంతగానో బాధపడిన థామస్, అలాంటి సమాజమును మార్చవలెనని హృదయపూర్వకంగా ఆకాంక్షించారు. బానిసత్వం అనేది వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు మాత్రమే కాకుండా మతపరమైన స్వేచ్ఛకు కూడా ఒక అడ్డంకిగా ఉన్నదని అతను భావించారు. కాగా బానిసత్వం వలన అక్కడ నెలకొనియున్న కఠినమైన పరిస్థితుల గురించి అతను తన కుటుంబమునకు, స్నేహితులకు మరియు ఇంగ్లాండులోని మిషనరీ సొసైటీకి లేఖలు వ్రాశారు. 1827వ సంll లో అతను వ్రాసిన ఉత్తరాలలో ఒకటి ప్రముఖ బ్రిటిష్ పత్రికలో ప్రచురించబడగా, అది జమైకా అధికారుల దృష్టికి వచ్చింది. వెంటనే విద్రోహానికి పాల్పడ్డారన్న కారణంతో థామస్‌ను అరెస్టు చేశారు. ఒకవైపు అతను బానిసలచే ప్రశంసించబడినప్పటికీ, బానిసత్వమును వ్యతిరేకించే భావాలను కలిగియుండుట వలన అతని పట్ల బానిస యజమానులు ఏహ్యభావమును కలిగినవారై అతనిని ద్వేషించారు. కాగా 1831వ సంll లో జరిగిన ఒక గొప్ప బానిస తిరుగుబాటు సమయంలో ఆధిపత్యమును కోరుకునే శ్వేతజాతీయులచే థామస్ యొక్క అనేక క్రైస్తవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. బర్చెల్ కట్టిన క్రైస్తవ సంఘములలో అతను ప్రజలలోను మరియు పరిచర్యలోను సమానత్వం ఉండేలా చూశారు. అతని మొట్టమొదటి సంఘము యొక్క మొదటి డీకన్ (పరిచారకులు) పూర్వము బానిసగా ఉన్న వ్యక్తి.


      పిమ్మట బ్రిటన్‌లో కొద్దికాలం పనిచేసిన థామస్, 1833వ సంll లో జమైకాకు తిరిగి వచ్చి, అక్కడ ‘స్వేచ్ఛా గ్రామాలను’ (‘ఫ్రీ విలేజెస్’) స్థాపించుటకు కృషి చేయడం ప్రారంభించారు. అందుకొరకుగాను అతను విస్తారమైన భూమిని కొనుగోలు చేసి, వాటిని చిన్న చిన్న విభాగాలుగా విభజించి, వాటిని మాజీ బానిసలకు ఇచ్చారు. తద్వారా బానిసలు తమను తాము యజమానులుగా మార్చుకునేందుకు వీలు కల్పించారు థామస్. శాండీ బే, బెథెల్ టౌన్ మరియు మౌంట్ కారీ స్వేచ్ఛా గ్రామాలు థామస్ బర్చెల్ చేసిన కృషి యొక్క ఫలితాలు.


    🚸 *ప్రియమైనవారలారా, పాపము యొక్క బానిసత్వం నుండి మీరు స్వేచ్ఛను పొందారా?* 🚸


     *"ప్రభువా, ఇతరుల ఆత్మీయ జీవితము కొరకు నేను శ్రమించునట్లు నాకు ఆత్మ భారమును దయచేయుము. ఆమేన్!"* 

    🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏

    *******


  • WhatsApp
  • Thomas Mayhew Sr | థామస్ మేహ్యూ సీనియర్

    థామస్ మేహ్యూ సీనియర్  | Thomas Mayhew Sr

    • జననం: 31-03-1593
    • మహిమ ప్రవేశం: 25-03-1682
    • స్వస్థలం: టిస్‌బరీ
    • దేశం: యునైటెడ్ కింగ్‌డమ్
    • దర్శన స్థలము: మార్తాస్ వైన్‌యార్డ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు


     థామస్ మేహ్యూ సీనియర్ మిషనరీ వీరుల జాబితాలో చేర్చబడవలసినంత ధైర్యవంతుడు. డెబ్భై ఏళ్ళు పై బడితే సేవ చేయవలసిన తమ సమయం ముగిసిందని కొంతమంది తలంచుతారు. అయితే థామస్ మేహ్యూ అలా కాదు. దాదాపు డెబ్భై ఏళ్ళ వయస్సులో సేవను ప్రారంభించిన అతని మిషనరీ పరిచర్య ప్రారంభమునకు వెనుక ఎంతో ఆసక్తికరమైన నేపథ్యం ఉంది.


     1631వ సంll లో అమెరికాకు వెళ్ళి స్థిరపడిన థామస్ సీనియర్, మసాచుసెట్స్‌లో వ్యాపారిగాను మరియు భూస్వామిగాను ఉన్నారు. త్వరలోనే అతను ఎలిజబెత్ దీవులలో భాగమైన మార్తాస్ వైన్‌యార్డుకు గవర్నర్ అయ్యారు. అతని అధికారంలో ఆ దీవులు భౌతిక విషయములలోను మరియు ఆత్మీయపరంగా కూడా అభివృద్ధిని సంతరించుకున్నాయి. థామస్ సీనియర్ అక్కడి వ్యాపార కార్యకలాపాలలో నిమగ్నమవ్వగా, అతని కుమారుడు థామస్ జూనియర్ ఆ దీవులలో నివసిస్తున్న ఆదివాసుల రక్షణ గురించిన చింతను కలిగియుండెడివారు. కాగా అతను స్థానిక తెగల మధ్య ఒక సువార్త మిషన్‌ను ప్రారంభించారు మరియు ఒక చిన్న ఆంగ్లికన్ సంఘమును స్థాపించారు. ఆ మిషన్ వృద్ధి చెందగా త్వరలోనే అక్కడ రెండు వందల ఎనభై రెండు మంది విశ్వాసులు సమకూర్చబడ్డారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు పరిచర్య చేసిన తరువాత థామస్ జూనియర్ మిషనరీ సేవ కొరకు నిధులను సేకరించుటకై ఇంగ్లాండుకు పయనమయ్యారు. అయితే అతను ప్రయాణిస్తున్న ఓడ సముద్రములో మునిగిపోగా, థామస్ జూనియర్ కూడా దానితోనే కనుమరుగయ్యారు.


     తన కుమారుడి మరణంతో తీవ్ర మనస్థాపానికి గురైన థామస్ సీనియర్, తన కుమారుడు వదిలిపెట్టిన పరిచర్యను కొనసాగించగల వ్యక్తులను కనుగొనుట కొరకు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఏ క్రైస్తవ పరిచారకునికి కూడా అక్కడి స్థానిక భాష తెలియలేదు సరికదా అటువంటి క్లిష్ట పరిస్థితులలోకి అడుగుపెట్టుటకు ఎవరూ ఇష్టపడలేదు. కాగా, దాదాపు డెబ్భై ఏళ్ళ వయస్సున్న థామస్ సీనియర్ తానే తన కుమారుడి స్థానంలో నిలబడుటకు నిశ్చయించుకున్నారు. కావున అతను స్థానిక భాషను నేర్చుకోవడం ప్రారంభించారు. అతను ప్రతి వారం పలు తోట ప్రాంతాలలో బోధించడం ప్రారంభించారు. స్థానిక తెగల క్రైస్తవ సంఘములను చేరుకొనుటకు కొన్నిసార్లు అడవి ప్రాంతము గుండా ఇరవై మైళ్ళ దూరం కాలినడకన వెళ్ళేవారు థామస్. తరువాతి ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఎంతో మంది జీవితములను తాకిన అతను, అనేక మంది ఆదివాసులను క్రీస్తు వద్దకు నడిపించారు. అతను పరిచర్య జరిగించిన కాలంలో దాదాపు 3000 ఆత్మలు క్రైస్తవ సంఘములో చేర్చబడి దేవుని రాజ్యము విస్తరించింది.


     తన తొంభై మూడేళ్ళ మంచి వృద్ధాప్యమందు మహిమలోనికి పిలవబడే వరకు కూడా అలయక తన మిషనరీ సేవను నిరంతరాయంగా కొనసాగించారు థామస్ మేహ్యూ సీనియర్.


    🚸 *ప్రియమైనవారలారా, ప్రభువు సేవ చేయడంలో విఫలమైనందుకు మీరు ఏమి సాకులను చూపిస్తున్నారు?* 🚸


    *"ప్రభువా, నాకు ఎంత వయస్సు పైబడినప్పటికీ నా జీవితమంతా కూడా నేను మీ సేవ చేయుటకే అర్పిస్తున్నాను. ఆమేన్!"* 

    🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏


  • WhatsApp