Search Here

Showing posts with label W. Show all posts
Showing posts with label W. Show all posts

May 14, 2023

William Goudie | విలియం గౌడీ

విలియం గౌడీ గారి జీవిత చరిత్ర

  • జననం : 06-05-1857 
  • మరణం : 09-04-1922
  • స్వస్థలం : చానర్‌విక్
  • దేశం : స్కాట్లాండ్
  • దర్శన స్థలము : భారతదేశం

క్రైస్తవ తల్లిదండ్రులకు జన్మించిన విలియం గౌడీ తన చిన్ననాటి నుండే దేవుని వాక్యమునందు ఎంతో ఆనందించెడివారు. ఆత్మను ప్రజ్వలింపజేసే విధముగా ఉండే డి. ఎల్. మూడీ మరియు సాంకీ వంటి గొప్ప ప్రసంగికుల ఉపన్యాసములు  లేతప్రాయములో ఉన్న గౌడీపై ఎంతో ప్రభావమును చూపాయి. తత్ఫలితముగా తాను కూడా దేవుని ప్రేమాసందేశమును ప్రపంచములోని మారుమూల ప్రాంతములకు తీసుకువెళ్ళవలెనని నిర్ణయించుకున్నారు గౌడీ. ఒకరోజు సాయంత్రం ఒక ఉజ్జీవ కూడికలో అతను తన జీవితమును యేసు క్రీస్తు ప్రభువుకు సమర్పించుకున్నారు. దేవుని పిలుపును వెన్నంటి ముందుకు సాగిపోవుటకుగాను అతను 1879వ సంll లో రిచ్‌మండ్ బైబిలు కళాశాలలో చేరారు. లండన్‌లో సేవ కొరకైన నియామక అభిషేకం పొందిన తరువాత భారతదేశంలో మిషనరీ సేవ చేయుటకైన అవకాశము తలుపు తట్టగా అతను సంతోషముతో దానిని అంగీకరించారు.


1882వ సంll లో భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న చెన్నై నగరములో అడుగుపెట్టారు గౌడీ. మొదటిగా అక్కడి జార్జ్ టౌన్ ప్రాంతములో తన పరిచర్యను ప్రారంభించిన అతను, తరువాత సెయింట్ థామస్ మౌంట్ లోని ఇంగ్లీష్ వెస్లీ సంఘములో సేవలందించారు. అతను స్థానిక భాషను నేర్చుకొని, స్థానికులకు వారి మాతృభాషలో పరిచర్య చేశారు. 1883వ సంll లో తిరువల్లూర్ అనే పట్టణమునకు వెళ్ళిన అతను, పలు విధములుగా అణగారిన స్థితిలో ఉన్న వారి మధ్య సేవ చేశారు. పేదలు మరియు అంటరానివారి పట్ల అతను చూపిన కనికరము క్రీస్తు ప్రేమను మరియు ఆయన పరిచర్యను ప్రతిబింబిస్తుంది. అతను కేవలం వారి ఆత్మీయ జీవితమును గురించి మాత్రమే కాకుండా వారి ఆర్థిక మరియు సామాజిక సంక్షేమమును గురించి కూడా చింత కలిగియుండేవారు.


అంటరానివారికి, తక్కువ కులాలకు చెందిన అట్టడుగు వర్గాల వారికి మద్దతుగా అతను నిలువబడినప్పుడు, ఉన్నత కులాలవారు అతనికి వ్యతిరేకముగా లేచి, అతనిపై రాళ్ళను, పాడైపోయిన ఆహారపదార్థములను విసిరివేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ, గౌడీ తాను కలిగియున్న దైవభక్తికి అనుగుణముగా స్పందించి, “మీరు నాపై రాళ్ళు కురిపించారు, అయితే దేవుడు మీపై ఆహారమును కురిపిస్తాడు” అని వారిని ఆశీర్వదించారు. ఏలయనగా ఆ సమయములో ఆ ప్రాంత ప్రజలు కరువు వలన బాధపడుతున్నారు. 1889-91 మధ్య కాలంలో గొప్ప కరువు మరియు భయంకరమైన కలరా వ్యాధి సంభవించిన సమయములో అతను పేదల కొరకు ఎంతో శ్రమించారు మరియు వారికి ఆహారమును అందించుటకు తన శక్తికొలది సకల విధములుగా ప్రయత్నించారు. ఈ సేవలు మాత్రమే కాదు, పేదవారికి మరియు అవసరతలలో ఉన్నవారికి సహాయమందించుటకుగాను ఈక్కాడు మరియు తిరువల్లూర్ ప్రాంతములలోను మరియు వాటి పరిసర ప్రాంతములలోను అతను పాఠశాలలు, ఆసుపత్రులు, కుట్టు పని నేర్పించే సంస్థ మరియు  లేసులు తయారుచేసే ఒక పరిశ్రమను స్థాపించారు.


భారతదేశంలో 25 సంవత్సరాల పాటు అలుపులేకుండా సేవ చేసిన పిమ్మట ఇంగ్లాండు దేశానికి తిరిగి వెళ్ళిన అతను, 65 ఏళ్ళ వయసులో తుది శ్వాస విడిచారు. ‘ఈక్కాడు యొక్క నిజమైన అపొస్తలుడు’ అని సరియైన విధముగానే ప్రశంసలు అందుకున్న విలియం గౌడీ, తన జీవితమంతా క్రీస్తుకు నమ్మకమైన రాయబారిగా జీవించారు.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీ శత్రువులు మరియు పేదవారి యెడల మీరు ఎటువంటి ప్రేమాకనికరములను కలిగియున్నారు? 

ప్రార్థన :

"ప్రభువా, నాలో నుండి ఇతరులకు ప్రేమాధారలు ప్రవహించునట్లు మీ ప్రేమతో నన్ను నింపుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • May 13, 2023

    William Hunter | విలియం హంటర్

    విలియం హంటర్ గారి జీవిత చరిత్ర

    The burning of William Hunter as depicted in the 15870 edition of
    Source: Wikipedia

    • జననం : 1536
    • మరణం : 27-03-1555
    • స్వస్థలం : బ్రెంట్‌వుడ్
    • దేశం : ఇంగ్లాండు 
    • దర్శన స్థలము : -


    దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ... హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది (హెబ్రీ 4:12).

    ... దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది (2 తిమోతి 3:16,17).


    అటువంటి శక్తి గల వాక్యము ఒకప్పుడు ఆదియందున్న దేవుని యొద్ద ఉండెను, మరియు "వాక్యము దేవుడై యుండెను“ అని బైబిలు చెబుతుంది. దేవుని వాక్యమైన బైబిలు సత్యములను తప్పుదోవ పట్టించుటకు ప్రయత్నించిన అధికారులను మరియు ప్రతికూల పరిస్థితులను అనేకమంది దైవజనులు ధైర్యముగా ఎదిరించి నిలబడ్డారు. అటువంటి వారిలో ఒకరే విలియం హంటర్.


    సనాతన భక్తిగల కుటుంబములో జన్మించిన విలియం హంటర్‌కు అతని తల్లి బైబిలును ఘనమైనదిగా ఎంచవలెనని నేర్పించారు. తన బాల్యం నుండే దేవుని వాక్యమును ధ్యానించడంలో అతను మిగుల ఆనందించెడివారు. క్రమంగా లేఖనములలోని సత్యాన్ని అర్థం చేసుకున్న అతను, అప్పటి కాథలిక్ సంఘములో ప్రబలమైయున్న తప్పుడు సిద్ధాంతాలను గ్రహించగలిగారు. ఎప్పుడైతే అతను తప్పుడు బోధలను తిరస్కరించారో అతను బెదిరింపులను ఎదుర్కొనడమేకాక, ఉద్యోగం నుండి కూడా తొలగించబడ్డారు.


    ఆ రోజులలో పాదిరులు మాత్రమే బైబిలును చదువుటకు వీలు ఉండేది. అయితే ఒక రోజు విలియం ప్రార్థనా మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ బల్ల మీద ఒక బైబిలు ఉండగా, అతను దానిని తీసుకొని చదవడం ప్రారంభించారు. ఒక సామాన్యుడు బైబిలును చదవటం చూసిన పాదిరి కోపోద్రేకుడై విలియంను మందలించి, నీవే స్వయంగా బైబిలును అర్థం చేసుకొనగలవా యని అతనికి సవాలు చేశారు. అందుకు విలియం అది దేవుని పుస్తకమని, దాని ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతాడు అని వినయముతో సమాధానం చెప్పగా, అది ఆ పాదిరికి మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. తత్ఫలితముగా ఆ పాదిరికి మరియు పంతొమ్మిదేళ్ల విలియంకు మధ్య నిజమైన మరియు తప్పుడు సిద్ధాంతాలను గురించిన వాదన ఏర్పడింది. చివరకు ఆ పాదిరి విలియం కలిగియున్న విశ్వాసాలు సరియైనవి కావని నిందించి, అతను తప్పుడు బోధనలను కలిగియున్నాడని అధికారులకు నివేదించాడు.


    తత్ఫలితముగా వారు విలియంను బంధించి ప్రశ్నించగా, అతను తన నమ్మకాలను విడిచిపెట్టుటకు నిరాకరించారు. తొమ్మిది నెలల పాటు చెరసాలలో బంధించబడి దారుణముగా చిత్రవధ చేయబడినప్పటికీ, అతను తన విశ్వాసము నుండి ఏ మాత్రం కదిలించబడలేదు. కాగా చివరకు అతను దహించే స్థంభము వద్ద సజీవదహనం చేయబడవలెనని ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ధైర్యముగా ఆ స్థంభమును సమీపించిన విలియం, ఆకాశము వైపు చేతులెత్తి, “దేవా, దేవా, దేవా, నా ఆత్మను చేర్చుకొనుము" అని పలికి సత్యము కొరకు తన ప్రాణమును అర్పించారు.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీ ప్రాణము కంటే దేవుని వాక్యము మీకు విలువైనదిగా ఉన్నదా? 

    ప్రార్థన :

    "ప్రభువా, నేను జయజీవితమును కలిగియుండులాగున మీలోను మరియు మీ వాక్యములోను నేను నిలిచియుండునట్లు నాకు నేర్పుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Apr 9, 2022

    William Goodell | విలియం గూడెల్

    విలియం గూడెల్ జీవిత చరిత్ర



    • జననం : 14-02-1792
    • మరణం : ఫిబ్రవరి, 1867
    • స్వస్థలం : టెంపుల్టన్, మసాచుసెట్స్
    • దేశం : యునైటెడ్ స్టేట్స్
    • దర్శన స్థలము : కాన్‌స్టాంటినోపుల్ మరియు బీరూట్


    సిలువ మార్గం శ్రమల మార్గం. దీనిని ఒక మిషనరీ జీవితం మరింత స్పష్టంగా మనకు కనుపరుస్తుంది. యుద్ధకాలంలో ప్రాణాలను దక్కించుకొనుటకు పారిపోవడం, తెగుళ్ళు మరియు విపత్తుల మధ్య నివసించడం, ఎదురయ్యే వ్యతిరేకతను మరియు హింసలను దీర్ఘశాంతముతో సహించడం, అనారోగ్యం, ప్రియమైన వారిని కోల్పోవడం, నిరంతరాయంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారడం, నలభై సంవత్సరాలు తనదుకాని పరదేశంలో... – కానీ ఏనాడూ వెనుకంజవేయలేదు! “నేను మీకు సొంతం, మీ వాడను నేను... మీకు చిత్తమైన స్థలమునకు నన్ను పంపుము; క్రైస్తవ ధైర్యమనెడి కవచమును నాకు ధరింపజేయుము, మీ రక్షణను గూర్చి ప్రకటించుటకు మిక్కిలి సంతోషముగా నేను భూదిగంతముల వరకు వెళ్తాను!; నా సేవ మీకు అవసరం లేదు. అయితే, మీకు సేవ చేసే భాగ్యమును నాకు దయచేయుమని వేడుకుంటున్నాను." అను మాటలు శ్రమల మధ్య కూడా ప్రభువును సేవించాలనే తన సమర్పణ నుండి ఎన్నడూ తొణకని విలియం గూడెల్ యొక్క ప్రార్థనలు.


    అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ ఫర్ ఫారిన్ మిషన్స్ యొక్క మిషనరీయైన గూడెల్, 1823వ సంll జనవరి మాసంలో తన భార్య అబిగయేల్ మరియు ఇతర మిషనరీలతో కలిసి మాల్టా అనే దీవికి చేరుకున్నారు. అక్కడ వారు కొన్ని నెలల పాటు తూర్పు ప్రజల భాషలను అధ్యయనం చేస్తూ గడిపారు. పిమ్మట నవంబరు మాసం నాటికి వారు బీరూట్‌కు వెళ్ళి, అక్కడ నివసిస్తున్న అరబ్బులు, టర్కులు, యూదులు, గ్రీకులు, మెరోనైట్లు, ఫ్రాంక్‌లు మొదలైన వారి మధ్యలో సేవ చేశారు. కాబట్టి, వివిధ భాషలను అభ్యసించడం వారి దినచర్యగా మారింది. కాథలిక్ చర్చి నుండి నిరంతర వ్యతిరేకత, యుద్ధాలు మరియు తెగుళ్ళ మధ్య వారు 1828వ సంll వరకు అక్కడ సేవ చేశారు. తత్ఫలితంగా సిరియాలో మిషనరీ కార్యకలాపాలకు బీరూట్ ప్రధాన కార్యాలయంగా మారింది.


    మాల్టాకు తిరిగి వచ్చిన తరువాత, 1830వ సంll నాటికి గూడెల్ క్రొత్త నిబంధనను అర్మేనో-టర్కిష్ భాషలోనికి అనువదించుటను పూర్తి చేశారు. తదుపరి 1831వ సంll లో కాన్‌స్టాంటినోపుల్‌కు వెళ్ళి అక్కడ ఒక మిషన్ ప్రారంభించుటకు అతను నియమించబడ్డారు. విపత్తులు, తెగుళ్ళు, యుద్ధాలు, గ్రీకులు మరియు కాథలిక్కుల నుండి వ్యతిరేకత, హింస మొదలగునవి కూడా వారి వెంటే వచ్చాయి. ఒకసారి జరిగిన అగ్ని ప్రమాదంలో వారు కలిగియున్నదంతా కోల్పోయారు. 1841వ సంll లో అతని కుమారుడు టైఫాయిడ్‌తో మరణించాడు. అదే సంవత్సరం గూడెల్ మొత్తం బైబిలు‌ను అర్మేనో-టర్కిష్‌ భాషలోకి అనువదించడం పూర్తిచేశారు. తదుపరి దానిని సవరించుటలో ఇరవై ఏళ్ళకు పైగా శ్రమించి 1863వ సంll లో సంపూర్తి చేశారు. అతను అక్కడ సేవ చేసిన కాలములోనే ప్రొటెస్టంట్ సంస్కరణ ఉద్యమాన్ని టర్కీ రుచి చూసింది. తాను సేవ చేసిన స్థలములలో అనేక పాఠశాలలను స్థాపించుటలో కూడా గూడెల్ ముఖ్యపాత్ర పోషించారు.


    టర్కీ సామ్రాజ్యంలో 1823-51 వరకు, తిరిగి 1853-65 వరకు, నలభై సంవత్సరాల పాటు ఫలవంతమైన పరిచర్యను చేసిన తరువాత, 1865వ సంll లో అమెరికాకు తిరిగి వెళ్ళిన విలియం గూడెల్, తన తుది శ్వాస వరకూ దేవుని సేవలో సాగిపోయారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, సర్వశక్తిమంతుడైన దేవునికి సేవ చేసే భాగ్యమును మీరు కోరుకుంటున్నారా?

    ప్రార్థన :

    "ప్రభువా, నేను మీ వాడను/దానను, మీకు చిత్తమైన స్థలమునకు నన్ను పంపుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Feb 19, 2022

    Wilfred Grenfell Life History

    విల్‌ఫ్రెడ్ గ్రెన్‌ఫెల్ జీవిత చరిత్ర



    Credit: Corbis via Getty Images/Historical

    • జననం: 28-02-1865
    • మహిమ ప్రవేశం: 09-10-1940
    • స్వస్థలం: పార్క్‌గేట్
    • దేశం: ఇంగ్లాండు
    • దర్శన స్థలము: లాబ్రడార్
    లాబ్రడార్‌లోని ఒక చిన్న గృహములో యువకుడైన ఒక వైద్యుడు తన భార్యాబిడ్డలతో కలిసి రాత్రి భోజనం చేస్తున్నారు. అకస్మాత్తుగా ఒక ఎస్కిమో (మంచు ప్రాంతములలో నివసించెడివారు) అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న తన చిన్న కుమారుడిని రక్షించమని ఆ వైద్యుడిని కోరారు. ఆ ఎస్కిమో యొక్క ఇల్లు అక్కడికి 50 మైళ్ల దూరంలో ఉంది. దానిని చేరుకొనవలెనంటే ఆ ప్రాంతంలో కదులుతున్న మంచు దిబ్బలను దాటుకొని వెళ్ళాలి. అయితే ఆ వైద్యుడు తన కుటుంబమును ఒంటరిగా విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు, పైగా కదులుతున్న మంచు దిబ్బలపై ప్రయాణించడం అత్యంత ప్రమాదకరం. అది అతని మరణానికి కూడా దారితీయవచ్చు. అయితే ఏదీ నిశ్చయించుకోలేక సతమతమవుతున్న అతని స్థితిని చూసి, ధైర్యవంతురాలైన అతని భార్య మెల్లని స్వరముతో ఇలా చెప్పారు "విల్ఫ్రెడ్, తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కు వగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు" (మత్తయి 10:37). వెంటనే ఆ వైద్యుడు "ప్రభువా, నా ప్రియులైన వారిని రక్షించు" అని ప్రార్థించి, వైద్య సహాయమును అందించుటకు మంచు మీద ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. లాబ్రడార్‌లో విల్‌ఫ్రెడ్ గ్రెన్‌ఫెల్ యొక్క త్యాగపూరితమైన సేవా జీవితం అటువంటిది.

    విల్‌ఫ్రెడ్ థామస్ గ్రెన్‌ఫెల్ ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో తాను చేసిన సేవకు పేరుగాంచిన ఒక గొప్ప వైద్య మిషనరీ. వైద్య కళాశాలలో చదువుకుంటున్న సమయంలో అతను డి.ఎల్. మూడీ యొక్క ఒక ఉజ్జీవ కూడికలో క్రీస్తును అంగీకరించారు. త్వరలోనే పరిచర్యలో పాలుపంచుకొనడం ప్రారంభించిన అతను, ఆదివారపు బైబిలు పాఠశాలకు (సండే స్కూల్‌కు) నాయకత్వం వహించడం ప్రారంభించారు. పట్టభద్రులైన తరువాత అతను ఒక మిషనరీ నుండి లాబ్రడార్‌లోని మత్స్యకారుల దుర్భరమైన జీవితముల గురించి విన్నారు గ్రెన్‌ఫెల్.

    ఏడాదిలో ఎనిమిది నెలల పాటు శీతాకాలం ఉండే ప్రమాదకరమైన ప్రదేశం లాబ్రడార్. కానీ గ్రెన్‌ఫెల్ దానిని ఒక సవాలుగా తీసుకుని ఉత్సాహంగా అక్కడ పని ప్రారంభించారు. మత్స్యకారుల మధ్య సేవచేసే 'ది రాయల్ నేషనల్ మిషన్ టు డీప్ సీ ఫిషర్‌మెన్' అనే సంస్థ యొక్క మద్దతు పొందిన అతను, 1892వ సంll లో ఒక ఓడను అద్దెకు తీసుకుని లాబ్రడార్ తీరం వెంబడి వైద్య సేవలను అందించడం ప్రారంభించారు. త్వరలోనే అతను పాఠశాలలు, అనాథాశ్రమాలు మరియు ఆసుపత్రులను అభివృద్ధి చేయడం ద్వారా ఆ మిషన్‌ను విస్తరింపజేయడం ప్రారంభించారు. అతని ద్వారా ప్రధాన భూభాగంలో నివసించే ప్రజలే కాకుండా అనేక మంది ఆదిమవాసులు కూడా క్రీస్తు ప్రేమను అనుభవించారు. అతని వలెనే ధైర్యవంతురాలైన గ్రెన్‌ఫెల్ యొక్క భార్య అన్నే పరిచర్యలో అతనికి ఆదరణను, ప్రోత్సాహమును ఇచ్చి పరిచర్యను మెరుగుపరచుటలో తోడ్పాటునందించారు. 1938వ సంll లో తాను మరణించే వరకు కూడా ఆమె తన భర్త ఏవిధంగానూ నిరుత్సాహమొందకూడదని తన శారీరక బలహీనతలను అతనికి మరుగుపరచి ఉంచారు.

    యాభై సంవత్సరాలకు పైగా ఇతరులకు ప్రేరణ కలిగించేటటువంటి మాదిరికరమైన పరిచర్య చేసిన గ్రెన్‌ఫెల్ కూడా దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా 1940వ సంll లో తనువు చాలించి పరమవాస స్థలమును చేరుకున్నారు.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీరు మీ కుటుంబం కంటే క్రీస్తును అధికముగా ప్రేమిస్తున్నారా?

    ప్రార్థన :
    ప్రభువా, మీరు నా కుటుంబమును నా కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నందుకు వందనములు. మీకు తగినట్లు నేను జీవించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్ !

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Feb 12, 2022

    William Butler Life History

    విలియం బట్లర్ జీవిత చరిత్ర




    • జననం: 30-01-1818
    • మహిమ ప్రవేశం: 18-08-1899
    • స్వస్థలం: డబ్లిన్
    • దేశం: ఐర్లాండ్
    • దర్శన స్థలము: భారతదేశం మరియు మెక్సికో

    ఐర్లాండుకు చెందిన మెథడిస్టు మిషనరీయైన విలియం బట్లర్ భారతదేశం మరియు మెక్సికోలలో తాను చేసిన పరిచర్యకు పేరుగాంచారు. చిన్నతనం నుండి కూడా అతను తాను కలిగియున్న ఆత్మీయ జ్ఞానమునకై వారి క్రైస్తవ సంఘముచే మంచి ప్రశంసల నందుకొనెడివారు. అయితే, ఒక రోజు అతను ఒక మెథడిస్టు సంఘమును దర్శించడం జరుగగా, అక్కడ తన ఆత్మీయ జ్ఞానం తనను పరలోకమునకు తీసుకువెళ్ళదని అతను గ్రహించారు. ఆ రోజున అతను తన పాపముల గురించి పశ్చాత్తాపపడి క్రీస్తును తన హృదయములోకి చేర్చుకున్నారు. వెనువెంటనే, సేవ కొరకైన దేవుని పిలుపుకు అతను విధేయత చూపి, ఒక మెథడిస్టు సంఘములో పరిచర్య చేయుటకు 1850వ సంll లో బోస్టన్ నగరమునకు వెళ్ళారు.


    అతను అక్కడ ఉన్న సమయంలో డాll డర్బిన్ అనే వ్యక్తి భారతదేశంలో పరిచర్య చేయమని విలియంను కోరారు. కాగా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడినవారై 1855వ సంll లో తన భార్యయైన క్లెమెంటినా రోవ్‌తో కలిసి కలకత్తా చేరుకున్నారు విలియం. కలకత్తాలో కాళీపూజ వైభవంగా జరుగుతున్న సమయం అది. భయంకరమైన విగ్రహారాధన యొక్క ఆ దృశ్యం అతనిలో భారతీయుల కొరకు మరింత భారమును కలిగించింది. ఆ సమయంలో చెలరేగుతున్న సిపాయిల తిరుగుబాటు గురించి అవగాహనలేని విలియం, బరేలీలో ఒక మిషన్ కేంద్రమును స్థాపించవలెననే ఉద్దేశ్యంతో కలకత్తా నుండి ఉత్తర భారతదేశానికి వెళ్ళారు.


    బరేలీలో బ్రిటిష్ సైన్యం అతనికి చెప్పినదేమంటే ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ మిషనరీ సేవ చేయుటకు ప్రయత్నించడం పిచ్చిపని అని. కానీ, ధైర్యసాహసాలతో కూడుకొనిన ఈ మిషనరీ, “ప్రసంగించడం నా బాధ్యత అయ్యా; నా ప్రాణము గురించి నా యజమాని చూసుకుంటాడు.” అని బదులిచ్చారు. జోయెల్ అనే వ్యాఖ్యాత సహాయంతో బరేలీ మరియు లక్నోలలో మిషనరీ పనిని ప్రారంభించారు విలియం. అయితే, పదేపదే హెచ్చరికలు మరియు ఆదేశాలు రావడంతో, విశ్వాసుల భద్రత నిమిత్తమై విలియం అక్కడినుండి నైనితాల్‌కు వెళ్ళారు.


    సిపాయిల తిరుగుబాటు అణచివేయబడిన పిమ్మట తిరిగి బరేలీకి వచ్చిన విలియం, 1865వ సంll వరకు అక్కడ మిషనరీ పరిచర్యను కొనసాగించారు. తరువాత అనారోగ్యం కారణంగా బట్లర్ దంపతులు అమెరికాకు తిరిగివెళ్ళవలసి వచ్చింది. అక్కడ వారు విదేశాలలో మిషనరీ సేవను ఎంతగానో ప్రోత్సహించారు. 1873వ సంll లో ఒక మెథడిస్టు మిషన్‌ను స్థాపించుటకు మెక్సికోకు వెళ్ళారు విలియం. తరువాత అతని కుమారుడు జాన్ బట్లర్ దానిని తదుపరి నలభై సంవత్సరాలు కొనసాగించారు.

    భారతీయుల కొరకు అతను కలిగియున్న భారం 1883వ సంll లో అతను తిరిగి భారతదేశానికి వచ్చేలా చేసింది. అయితే ఆరోగ్యం క్షీణిస్తుండడంతో అతను కొన్ని సంవత్సరాలు మాత్రమే అక్కడ ఉండగలిగారు. దాదాపు యాభై సంవత్సరాల పాటు అలుపెరుగక దేవునిని సేవించిన పిమ్మట 1899వ సంll లో పరమందు ప్రభు సన్నిధానమును చేరుకున్నారు విలియం బట్లర్.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 


    ప్రియమైనవారలారా, సువార్తను ప్రకటించుట అనే మీ బాధ్యతను నెరవేర్చుటలో మీరు నమ్మకంగా ఉన్నారా?

    ప్రార్థన :


    ప్రభువా, సువార్త ప్రకటించుటకు సమయమందును అసమయమందును నేను సిద్ధముగా ఉండునట్లు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!

    దేవునికే మహిమ కలుగునుగాక!



  • WhatsApp
  • Sep 6, 2021

    William Buck Bagby | విలియం బక్ బాగ్బీ

    విలియం బక్ బాగ్బీ | William Buck Bagby

    • జననం: 05-011-1855
    • మహిమ ప్రవేశం: 05-08-1939
    • స్వస్థలం: కొరియెల్ కౌంటీ
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: బ్రెజిల్


     1884వ సంll లో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో ఒక మిషనరీ దంపతులు కాథలిక్కుల నుండి తీవ్రమైన వ్యతిరేకత నెలకొనియున్న పరిస్థితుల మధ్య దేవుని పరిచర్యను ప్రారంభించారు. ఆ మిషనరీలకు అది ఎంతో నిరాశాజనకమైన ఆరంభముగా ఉంది. ఏలయనగా వారు నిర్వహించే ఆరాధనా కూడికలకు ఎవరూ వచ్చేవారుకాదు. కావున వారు ఆలయమునకు వెలుపల వాయిద్యములను వాయించుచూ పాడటం ప్రారంభించారు. అది చూచిన కొంతమంది ఆసక్తిగలవారు అక్కడ గుమిగూడడం ప్రారంభించినప్పుడు కొంతమంది గుంపుగా వచ్చి దాడిచేసి, అక్కడి సామగ్రిని ధ్వంసం చేశారు. వారిలో ఒకరు బోధకునిపై రాయి విసరగా అతని తలకు గాయమై స్పృహ తప్పి పడిపోయారు. కానీ కొన్ని నిమిషముల తరువాత అతనికి స్పృహ వచ్చినప్పుడు అతను తిరిగి లేచి నిలబడి బోధించడం కొనసాగించారు. ఆ బోధకుడు మరెవరో కాదు, బ్రెజిల్‌లో ప్రారంభక బాప్తిస్టు మిషనరీలలో ఒకరిగాను మార్గదర్శకులుగాను నిలిచిన విలియం బక్ బాగ్బీ.


     వాకో విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన విలియం, పిమ్మట ఒక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. యవ్వనదశలో ఉన్నప్పుడు దక్షిణ అమెరికాలో మిషనరీల కొరకు ఉన్న అవసరతను గురించి వినిన అతనిలో అందుకొరకైన భారం కలిగింది. అతను అన్నే లూథర్‌ను వివాహం చేసుకున్నప్పుడు దక్షిణ అమెరికాలో మిషనరీ సేవ పట్ల అతను కలిగియున్న ఆసక్తి కార్యరూపం దాల్చుటకు పునాదులు పడ్డాయి. అన్నే కూడా మిషనరీ పరిచర్య పట్ల సమర్పణను కలిగియున్నవారు. మరి ముఖ్యముగా దక్షిణ అమెరికాలో సేవ పట్ల అతని వలెనే ఆసక్తిని కలిగియున్నారు. కాగా, మరికొంత మంది ప్రోత్సాహంతో 1880వ సంll లో రియో డి జనీరోలో అడుగుపెట్టారు బాగ్బీ దంపతులు. తరువాత అక్కడ ప్రభుత్వాన్ని నడపడంలో కాథలిక్ సంఘం పాలుపంచుకుంది. అక్కడి కాథలిక్కులు ప్రొటెస్టెంట్ క్రైస్తవుల పట్ల అసహనమును కలిగియుండేవారు. కాగా, పరిచర్య యొక్క ప్రారంభ దశలలో బాగ్బీ అక్కడ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అతను అనేకమార్లు శారీరకముగా దాడి చేయబడ్డారు కూడా. అయినప్పటికీ, ధైర్యవంతుడైన ఈ మిషనరీ కష్టాలు శ్రమల మధ్యలో మరింతగా బలమొందారు. త్వరలోనే, రెండు సంవత్సరాల కాలంలో రియోలో రెండు బాప్తిస్టు సంఘములు ఏర్పరచబడ్డాయి.


     బాగ్బీ తన పరిచర్యను రియో సరిహద్దులను దాటి విస్తరింపచేశారు. అతను బ్రెజిల్ దేశమంతటా పర్యటించి, అన్ని ప్రధాన నగరాలలో క్రైస్తవ సంఘములను స్థాపించారు. బ్రెజిల్‌లో ప్రతిచోటా అతను స్థాపించిన సంఘములు, నిర్మించిన పాఠశాలలు, క్రీస్తు కొరకు అతను సంపాదించిన గొప్ప క్రైస్తవ నాయకులు మరియు వేలాది మంది విశ్వాసుల రూపంలో బాగ్బీ యొక్క పరిచర్య ప్రభావం కనిపిస్తుంది. అతని జీవిత భాగస్వామియైన అన్నే లూథర్ పరిచర్యలో కూడా అతనికి సరిసమానమైన భాగస్వామిగా ఉన్నారు. దేవుని ఆశీర్వాదముతో వారికి తొమ్మిది మంది సంతానము కలుగగా, వారిలో ఐదుగురు దక్షిణ అమెరికాకు మిషనరీలుగా తమ జీవితములను సమర్పించుకున్నారు.


     58 సంవత్సరాల పాటు ఎంతో తీవ్రముగా పరిచర్య జరిగించిన పిమ్మట, తన సేవా ఫలమైన 694 సంఘములను మరియు 53,000 మంది విశ్వాసులను విడిచిపెట్టి 1934వ సంll లో పరమందు తన ప్రభువును చేరుకొన ఇహలోకమును విడిచి వెళ్ళారు విలియం బక్ బాగ్బీ. 


    🚸 *ప్రియమైనవారలారా, కష్టాలు, శ్రమల మధ్యలో మరింతగా దేవునికి సేవ చేయుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?* 🚸


    🛐 *"ప్రభువా, అననుకూల పరిస్థితుల దాడులకు నేను గురై పడిపోయిన ప్రతిసారీ తిరిగి మీ కొరకు నిలబడగలుగునట్లు నన్ను లేవనెత్తుము. ఆమేన్!"* 🛐


    🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏


  • WhatsApp
  • William Elmslie | విలియం ఎల్మ్ స్లీ

    విలియం ఎల్మ్ స్లీ | William Elmslie

    • జననం: 29-06-1832
    • మహిమ ప్రవేశం: 18-11-1872
    • స్వస్థలం: అబెర్డీన్
    • దేశం: స్కాట్లాండు
    • దర్శన స్థలము: భారతదేశం


     ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో భారతదేశంలో కాశ్మీర్ ఒక రాచరిక రాష్ట్రముగా ఉండేది. ఆనాటి మహారాజులు మిషనరీ కార్యకలాపాలను ఏమాత్రం సహించేవారు కాదు. అయితే రణబీర్ సింగ్ మహారాజు సింహాసనాన్ని అధిరోహించిన తరువాత తన ప్రజలకు ఆధునిక వైద్యం అవసరమని భావించి, వేసవికాలములో మిషనరీలు అక్కడికి వచ్చుటకు అనుమతించారు. ఆ విధముగా కాశ్మీర్‌లో సేవ చేయుటకు వచ్చిన మొట్టమొదటి మిషనరీలలో జాక్సన్ ఎల్మ్ స్లీ ఒకరు. 


     ఈడెన్‌బర్గ్ విశ్వవిద్యాలయం నుండి వైద్యశాస్త్రములో పట్టా పొందారు ఎల్మ్ స్లీ. ‘చర్చి మిషనరీ సొసైటీ’ యొక్క అభ్యర్థన మేరకు అతను వెంటనే భారతదేశంలో సేవ చేయుటకు పయనమయ్యారు. 1864వ సంll లో కాశ్మీర్ చేరుకొనిన అతను, అక్కడి సాధారణ ప్రజల పరిస్థితి చూసి ఆందోళన చెందారు. ఏలయనగా కాశ్మీర్ తన ప్రకృతి సౌందర్యానికి ఎంతో ప్రసిద్ధి చెందినప్పటికీ, పేదరికం మరియు భయంకరమైన వ్యాధులలో చిక్కుకొనియుంది. అంతగా శ్రమ లేకుండానే, ఎల్మ్ స్లీ వెంటనే స్థానిక ప్రజల కొరకు ఒక ఔషధశాలను తెరిచి వారికి చికిత్స చేయడం ప్రారంభించారు. పాశ్చాత్య ఔషధములను వాడుటకు ప్రజలు మొదటిలో సంకోచించినప్పటికీ, త్వరలోనే వందలాది మంది వైద్యసహాయం కొరకు ఆసుపత్రికి రావడం ప్రారంభించారు. పరిస్థితులకు తగినట్లుగానే ఎల్మ్ స్లీ కూడా కొన్ని ముఖ్యమైన వైద్య పరిశోధనలు చేసి, మరణాంతకమైన ‘కాశ్మీర్ క్యాన్సర్‌’ వ్యాధిని గుర్తించారు.


     తాను వేసవిలో మాత్రమే పని చేయుటకు అనుమతించబడినందున శీతాకాలంలో అతను తన స్వదేశానికి తిరిగి వెళ్ళారు. అయితే పట్టువదలని ఈ మిషనరీ వైద్యుడు మరుసటి వేసవిలో మరలా కాశ్మీర్‌కు వచ్చారు. ఆ విధంగా అతను 1872వ సంll వరకు కాశ్మీర్‌లో సేవలందించుటను కొనసాగించారు. అందునుబట్టి ఎల్మ్ స్లీ కాశ్మీర్ ప్రజలకు చెప్పినది ఏమంటే అతను మళ్ళీ మళ్ళీ అక్కడికి వచ్చుటకు కారణం యేసు క్రీస్తు ప్రభువని. అతను సువార్తను ప్రకటించి అనేకమంది కాశ్మీర్‌ ప్రజలను క్రీస్తు కొరకు సంపాదించగలిగారు. కాగా మతమార్పిడుల గురించి తెలుసుకొనిన మహారాజు అతని పనిని నిలిపివేయవలెనని ఎల్మ్ స్లీని బెదిరించారు. అతను తన మిషనరీ పనిని ఆపివేసి కేవలం వైద్య సేవలనందించుటపై మాత్రమే దృష్టి నిలిపినట్లయితే ధనమిస్తానని ఒకసారి రాజు అతనికి ఆశ చూపారు కూడా. అటువంటి పరిస్థితులన్నింటి మధ్యలో కూడా అతను ఏనాడూ వైద్య సేవలను సువార్త నుండి వేరుపరచలేదు. అక్కడి స్థానికులు ఆప్యాయంగా అతనిని “పాద్రి డాక్టర్ సాహెబ్” అని పిలిచేవారు. 


     1872వ సంll లో తన భార్యతో కలిసి ఎల్మ్ స్లీ శ్రీనగర్ నుండి ఆలస్యంగా బయలుదేరగా, వారు మంచులో చిక్కుకుపోయారు. అతనిని కాపాడుటకు అతని భార్య ఎంతగానో పోరాడినప్పటికీ, అప్పటికే అనారోగ్యంతో ఉన్న అతని శరీరం ఆ చలిని తట్టుకొనలేకపోయింది. 1872వ సంll నవంబరు మాసంలో దేవునికి నమ్మకమైన ఈ పరిచారకుడు మహిమలోకి ప్రవేశించగా, అతని భార్య మార్గరెట్ అతను విడిచిపెట్టిన ఆ మంచి పనిని 1878వ సంll వరకు కొనసాగించారు.


    🚸 *ప్రియమైనవారలారా, అన్యజనుల కొరకు పనిచేయుటకు క్రీస్తు ప్రేమ మిమ్ములను బలవంతం చేయుచున్నదా?* 🚸


    🛐 *"ప్రభువా, నా వ్యక్తిగత జీవితములో నిరాశలు ఎదురైనప్పటికీ, మిమ్ములను సేవించుటలో ఎల్లప్పుడూ ఆనందించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"* 🛐

    ******

    🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏


  • WhatsApp
  • Aug 4, 2021

    Willam Thomas Morris Clewes | విల్లం థామస్ మోరిస్ క్లూవ్స్

    విల్లం థామస్ మోరిస్ క్లూవ్స్  | Willam Thomas Morris Clewes

    • జననం: 17-10-1891
    • మహిమ ప్రవేశం: 30-05-1984 
    • స్వస్థలం: లై
    • దేశం: ఇంగ్లాండు 
    • దర్శన స్థలము: భారతదేశం

    ఏకీకృతం చేసి దృఢపరచడం అనే పరిచర్య క్రైస్తవ మతం యొక్క అభివృద్ధికి కీలకమైనది. ఇది నూతన విశ్వాసులు పరిపక్వత నొందుటకు ముందుకు సాగిపోతూ తిరిగి వారి పాత పాపపు బ్రతుకులలోనికి జారిపోకుండా ఉండునట్లు వారి మధ్యలో జరిగే పరిచర్య లోతుగా వేరుపారినదై దృఢపరచబడగలుగునట్లు చేసే ప్రక్రియ. కొంతమంది మిషనరీలు మిషనరీ పనిని ప్రారంభించిన మార్గదర్శకులుగా నిలిస్తే, మరికొందరు ఆ పనికి నీరు పోసి, అది జీవముతో ఉండి ఎదుగునట్లు చూసుకున్నారు. రెవ. విల్లం థామస్ మోరిస్ క్లూవ్స్ రెండవ కోవకు చెందిన మిషనరీలలో ఒకరు. 

    ‘క్లూవ్స్ దొరై’ అని అభిమానంతో పిలువబడే రెవ. విల్లం థామస్ మోరిస్ క్లూవ్స్, లండన్ మిషనరీ సొసైటీ (ఎల్.ఎమ్.ఎస్.) ద్వారా భారతదేశానికి వచ్చి సేవ చేసిన ఒక మిషనరీ. తమిళనాడులోని ఈరోడ్‌ అనే ప్రాంతమునకు వచ్చిన అతను, అక్కడ రెవ. ఎ. డబ్ల్యూ. బ్రోవ్ మరియు రెవ. హెచ్. ఎ. పోప్లే అను వారిచే స్థాపించబడిన మిషన్ స్థావరంలో పనిచేశారు. తన భార్యయైన ఎడ్నా జేన్ బేకర్‌తో కలిసి ఆ మిషన్ అభివృద్ధి చెందుటకును మరియు ఈరోడ్ మరియు చుట్టుప్రక్కల ప్రాంతాలలో సువార్త విస్తరించుటకును అతను ఎంతో శ్రమించారు. 

    1923వ సంll లో లండన్ మిషనరీ సొసైటీ ద్వారా స్థాపించబడిన పాఠశాలలు ఇంచుమించు 94 వరకూ ఉన్నాయి. ఇంకా క్రొత్త పాఠశాలలను స్థాపించుటకు బదులుగా, అప్పటికే స్థాపించబడియున్న పాఠశాలలను దృఢపరచి, ఏకీకృతం చేశారు క్లూవ్స్. పాఠశాలలు కేవలం నామకరణ భవనాలు మాత్రమే కాకుండా స్థానికులకు ఉపయోగకరంగా ఉండేలా అతను చూసుకున్నారు. ఈరోడ్ డైయోసిస్‌లోను (ఈరోడ్ సంఘ పరిథి ప్రాంతములోను) మరియు చుట్టుప్రక్కల ప్రాంతములలోను విద్యాభ్యాసం పురోగతి సాధించుటలో కీలక పాత్ర పోషించారు. విద్యాభ్యాసం అంధత్వముతో కూడిన ప్రజల మూఢ నమ్మకాలను తొలగించడమే కాకుండా ఆత్మీయ అంధత్వము నుండి కూడా అనేక మంది విడుదలనొందుటకు తోడ్పడింది.

    తన భార్య ఎడ్నాతో కలిసి ఈరోడ్ సి.ఎస్.ఐ. ఆసుపత్రిని స్థాపించడంలో క్లూవ్స్ కీలక పాత్ర పోషించారు. ఈ ఆసుపత్రి ఈరోడ్ మరియు చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఉన్న అనేక మంది ప్రజలకు ఈ నాటికీ వైద్య సేవలను అందిస్తుంది. అతను పుంగంబడి గ్రామంలో ప్రజలు కూడుకొని ఆరాధించుటకుగాను 'సి.ఎస్.ఐ. గుడ్ సమరిటన్ చర్చి' అనే చర్చిని కూడా స్థాపించారు.

    ఈరోడ్‌లో 1923-49 వరకు దాదాపు 26 సంవత్సరాల పాటు దేవుని సేవలో ముందుకు సాగిపోయిన క్లూవ్స్, ప్రజలకు సేవలందించి వారికి మేలు చేయడంలో ఏనాడూ అలసిపోలేదు. అపొస్తలుడైన పౌలు చేసిన పరిచర్యకు నీరు పోసిన అపోల్లో వలె క్లూవ్స్ కూడా తమిళనాడులో తనకు ముందున్న మిషనరీలు చేసిన పనులకు నీరు పోసి వాటిని దృఢపరిచారు.

    🚸 ప్రియమైనవారలారా, మునుపు స్థాపించబడిన పరిచర్యకు తదుపరి పరిచర్యను కొనసాగించుటలో మీరు నమ్మకంగా ఉన్నారా? 🚸

    🛐 "ప్రభువా, పరిచర్య ప్రారంభకులుగా మార్గదర్శకులుగా నిలిచినవారు చేసిన సేవను వారు కలిగియున్న దర్శనమునే కలిగియుండి దృఢపరచగలుగునట్లు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!" 🛐

    🙏🙏 దేవునికే మహిమ కలుగునుగాక! 🙏🙏


  • WhatsApp
  • Aug 2, 2021

    Wellesley Bailey | వెల్లెస్లీ బెయిలీ

     వెల్లెస్లీ బెయిలీ| Wellesley Bailey జీవిత చరిత్ర

    జననం : 28.04.1846
    మరణం : 1937
    స్వస్థలం : -
    దేశం : ఐర్లాండ్
    దర్శన స్థలము : భారత దేశం మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలు
    వెల్లెస్లీ బెయిలీ అనే ఒక ఐరిష్ యువకుడు తనకు జీవనోపాధి దొరుకుతుందనే ఆశతో 1869 వ సం|| లో భారత దేశానికి పయనవమైనారు. వెల్లెస్లీ భారత దేశంలో ఉపాధ్యాయుడిగా శిక్షణ పొందుతున్నప్పుడు కుష్ఠు వ్యాధి యొక్క విధ్వంసకరమైన దుష్ప్రభావాలను మొదటిసారిగా చూశాడు. అప్పటి వరకు, వెల్లెస్లీ కుష్ఠు వ్యాధి మరియు కుష్ఠు రోగాల గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిలు కథల నుండి మాత్రమే విన్నాడు. కుష్ఠు రోగుల యొక్క భయంకరమైన జీవన పరిస్థితులు మరియు సామాజిక ఒంటరి తనం వెల్లెస్లీని ఎంతో కలచివేసింది. వెల్లెస్లీ తన హృదయ వాంఛను వివరిస్తూ, "ప్రపంచం లో క్రీస్తును పోలిన పని ఏదైన ఉంది అంటే అది ఈ పేద బాధితుల మధ్యకు వెళ్లి వారికి సువార్త ద్వారా ఓదార్పునివ్వడమే" అని వ్రాశాడు.
    వెల్లెస్లీ కాలంలో, కుష్ఠు వ్యాధికి ఎటువంటి చికిత్స లేదు. భారత దేశంలో కడు పేదరికంలో మరియు సమాజం చేత తృణీకరించబడిన జీవితాలు జీవిస్తున్న కుష్ఠు వ్యాధి బాధితులను గూర్చి వివరించుట ద్వారా అవగాహన కల్పించుటకు వెల్లెస్లీ, తన భార్య అయిన ఆలిస్ తో కలిసి ఐర్లాండ్ తిరిగి వెళ్లారు. అక్కడి ప్రజలు ప్రార్థనలు మరియు ఆర్థిక సహాయం ద్వారా తమ మద్దతును అందించడంతో వెల్లెస్లీ దంపతులు భారత దేశంలో కుష్ఠు వ్యాధి బాధితుల సహాయార్థం 1874 వ సం|| లో "ది మిషన్ టు లెపర్స్"(ఇప్పుడు లెప్రసీ మిషన్ అని పిలుస్తారు) ను ప్రారంభించారు. 1870 వ సం|| చివరి నాటికి, కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న 100 మందికి ఈ ప్రత్యేక బృందం(మిషన్) మద్దతు ఇచ్చింది. వెల్లెస్లీ కుష్టువ్యాధిగ్రస్తుల మధ్య పని చేస్తున్న ఇతర మిషనరీలను కూడా సందర్శించి వారికి పరిపాలనాపరంగా మరియు ఆర్ధికంగా సహకారాలందించారు. త్వరలోనే, వెల్లెస్లీ సహాయం కోరుతూ ఇతర దేశాల నుండి లేఖలు వచ్చాయి. అందువలన వెల్లెస్లీ తన పరిచర్యను చైనా, న్యూజిలాండ్, మరియు ఆస్ట్రేలియా లాంటి దేశాలకు విస్తరించారు.

    ప్రపంచవ్యాప్తంగా కుష్ఠు వ్యాధి బారిన పడిన వారికి వైద్యం, సమాజంలో చేరిక మరియు గౌరవాన్ని తీసుకువచ్చిన ఈ సంస్థ ఆవిర్భావమునకు వెల్లెస్లీ యొక్క కరుణయే కారణము. కుష్ఠు రోగుల మధ్య అవసరమైన పరిచర్య చేయునట్లు క్రైస్తవులలో మరియు మిషనరీలలో అవగాహన కలిగించుటకు వెల్లెస్లీ అనేక దేశాలలో పర్యటించారు. స్వయానా ప్రార్థనాపరుడైన వెల్లెస్లీ, తన పరిచర్య ప్రార్థన ద్వారానే అభివృద్ధి చెందిందని, ప్రతి విజయానికి కారణం ఈ ప్రార్ధనలే అని విశ్వసిస్తారు. కుష్ఠు రోగుల యెడల శ్రద్ధ వహిస్తూ వారికి పరిచర్య చేయుట జీవితాశయంగా కలిగిన వెల్లెస్లీని "కుష్టురోగుల పితామహుడు" అని అభివర్ణించారు.
    🚸 *"ప్రియమైనవారలారా, మీరు మీ సమాజంలోని బహిష్కృతులకు దేవుని ప్రేమను చూపించగలరా?"*🚸 🛐 *"ప్రభువా, ఈ సమాజముచే బహిష్కరించబడిన మరియు నిర్లక్ష్యం చేయబడిన వారికి సేవ చేయడానికి నన్ను బలపరచుము. ఆమెన్!"* 🛐
    "🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏
  • WhatsApp