Search Here

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Mar 21, 2022

Shi Meiyu | షి మేయు

షి మేయు జీవిత చరిత్ర



  • జననం: 01-05-1873
  • మహిమ ప్రవేశం: 30-12-1954
  • స్వస్థలం: జియుజియాంగ్
  • దేశం: చైనా
  • దర్శన స్థలము: చైనా


మేరీ స్టోన్ అని కూడా పిలువబడే షి మేయు చైనాలోని ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఒక మెథడిస్టు పాదిరిగారు మరియు ఆమె తల్లి ఒక క్రైస్తవ పాఠశాల యొక్క ప్రిన్సిపాల్. అమెరికాకు చెందిన ఒక వైద్య మిషనరీయైన డాll కాథరిన్ బుష్నెల్ యొక్క సేవను చూసి ఆకర్షితులైన మేయు యొక్క  తండ్రి, మేయు కూడా ఒక వైద్యురాలు కావాలని కోరుకున్నారు. ఆ అవకాశం మేయు యొక్క పాఠశాల ఉపాధ్యాయురాలు గెర్ట్రూడ్ హోవే ద్వారా లభించింది. ఏలయనగా అమెరికాకు చెందిన మిషనరీయైన గెర్ట్రూడ్ తన యొక్క ఉత్తమ విద్యార్థులలో ఐదుగురిని మిచిగాన్ విశ్వవిద్యాలయానికి తీసుకువెళ్ళవలెనని నిర్ణయించుకొనగా, ఆ ఐదుగురిలో షి మేయు మరియు ఆమె స్నేహితురాలు కాంగ్ చెంగ్ ఉన్నారు. ఒక అమెరికా విశ్వవిద్యాలయం నుండి వైద్య పట్టా పొందిన మొదటి ఇద్దరు చైనా మహిళలు వీరు.


1896వ సంll లో వైద్య పట్టా పొందిన తర్వాత మేయు మరియు కాంగ్ మెథడిస్టు ఎపిస్కోపల్ చర్చి యొక్క ఉమెన్స్ ఫారిన్ మిషనరీ సొసైటీ తరఫున వైద్య మిషనరీలుగా చైనాకు తిరిగి వచ్చారు. పిమ్మట జియుజియాంగ్‌లో వారు ఒక గదిలో ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. వారు ఎలిజబెత్ స్కెల్టన్ డాన్‌ఫోర్త్ మెమోరియల్ హాస్పిటల్ పేరుతో ఒక క్రొత్త ఆసుపత్రిని నిర్మిస్తున్నప్పుడు 1900వ సంll లో చైనాలో క్రైస్తవులు మరియు మిషనరీలకు వ్యతిరేకంగా బాక్సర్ తిరుగుబాటు లేచింది. ఆ తిరుగుబాటు సమయంలో మేయు తన తండ్రిని కోల్పోయారు మరియు ఆమె మరియు కాంగ్ చైనాను విడిచిపెట్టి జపాన్‌లో ఆశ్రయం పొందవలసి వచ్చింది. 1901వ సంll లో చైనాకు తిరిగి వచ్చిన తర్వాత వారు ఆసుపత్రిని ప్రారంభించారు.


ఆ ఆసుపత్రి నిత్యం రోగులతో కిటకిటలాడుతూ ఉండేది. మరోవైపు, ఆమె చైనా నర్సులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు, పాశ్చాత్య వైద్య పాఠ్యపుస్తకాలు మరియు నర్సుల శిక్షణా నియమ సంపుటి పుస్తకములను (ట్రైనింగ్ మాన్యువల్‌) అనువదించారు మరియు నర్సుల కొరకు బైబిలు పఠనములను నిర్వహించారు. తన వృత్తిపరమైన సేవయే కాక ఆమె నలుగురు కుమారులను కూడా దత్తత తీసుకున్నారు.


‘చైనీస్ హోమ్ మిషనరీ సొసైటీ’ అనే సంస్థ యొక్క వ్యవస్థాపకులలో మేయు ఒకరు. ఏ క్రైస్తవ వర్గమునకు చెందని దేశీయ మిషన్ అయిన ఈ సంస్థ నైరుతి చైనా ప్రాంతములకు సువార్తను అందించే లక్ష్యముతో స్థాపించబడింది. తరువాత కొంత కాలంపాటు పై చదువుల కొరకు అమెరికా వెళ్ళారు మేయు. చైనాకు తిరిగి వచ్చిన తర్వాత ఆమె మెథడిస్ట్ మిషనరీ సొసైటీని విడిచిపెట్టి, 1920వ సంll లో షాంఘైలో బేతెల్ మిషన్‌ను స్థాపించారు. ఈ మిషన్‌ 17 సంవత్సరాలలో పాఠశాలలు, ఒక ఆసుపత్రి మరియు నర్సింగ్ పాఠశాల, ఒక సెమినరీ (బైబిలు వేదాంతశాస్త్ర శిక్షణాలయం), ఒక అనాథాశ్రమం మరియు ఒక ఆరాధనాలయమును స్థాపించింది. మరొకవైపు నర్సుల కొరకైన తన శిక్షణా కార్యక్రమాన్ని కొనసాగించారు మేయు. దాని ద్వారా చైనీయులకు నర్సులుగా శిక్షణ ఇవ్వడమే కాకుండా వారిని క్రీస్తు వద్దకు నడిపించుటకును మరియు వారిని నర్స్-సువార్తికులుగా మార్చుటకును ఉద్దేశించారు మేయు. తరువాతి సంవత్సరాలలో కాలిఫోర్నియాకు వెళ్ళిన షి మేయు, తన మరణం వరకు అక్కడే నివసించారు.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీ వృత్తిపరమైన జీవితమును ఇతరులను క్రీస్తు వైపుకు నడిపించుటకును మరియు వారికి సువార్తికులుగా శిక్షణనిచ్చుటకును మీరు ఉపయోగిస్తున్నారా?


ప్రార్థన :

"ప్రభువా, ఒక సువార్తికుని హృదయమును మరియు ఇతరులకు సువార్తికులుగా శిక్షణనివ్వవలెననే లోతైన వాంఛను నాలో కలిగించుము. ఆమేన్!" 


దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Feb 12, 2022

    Sherwood Eddy Life History

    షెర్వుడ్ ఎడ్డీ జీవిత చరిత్ర




    • జననం: 19-01-1871
    • మహిమ ప్రవేశం: 04-03-1963
    • స్వస్థలం: కాన్సాస్
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: భారతదేశం మరియు చైనా

     అమెరికాకు చెందిన మిషనరీయైన జార్జ్ షెర్వుడ్ ఎడ్డీ, తాను భారతదేశం మరియు చైనా దేశాలలో అలుపెరుగక జరిగించిన సంచార పరిచర్యకు పేరుగాంచినవారు. 1889వ సంll లో ఒక క్రైస్తవ కూడికలో అతను తిరిగి జన్మించగా, అప్పటి నుండి నశించుచున్న ఆత్మలను రక్షించుటకు లోతైన భారము అతనిలో ఏర్పడింది. తన తండ్రి మరణం తరువాత గొప్ప సంపదను అతను వారసత్వంగా పొందినప్పటికీ, దానిపట్ల అతను పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇంజనీరింగ్ చదువు పూర్తిచేసుకొనిన పిమ్మట అతను "ఈ తరంలో ప్రపంచానికి సువార్త ప్రకటించాలి" అనే దర్శనముతో 'యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్' (వై.ఎమ్.సి.ఎ. - క్రైస్తవ యువకుల సంఘము) అనే సంస్థలో చేరారు.

    అమెరికాలో చురుకుగా పరిచర్య చేస్తున్న సమయములో అతను తన స్నేహితుడు జాన్ మోట్ భారతదేశం మరియు శ్రీలంకలలో 'స్టూడెంట్ వాలంటీర్ మూవ్‌మెంట్' (ఎస్.వి.ఎమ్. - విద్యార్థి స్వచ్ఛంద విప్లవం) అను దానిని నడిపించుటను గురించి వినడం జరిగింది. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికను బట్టి భారతదేశములో పరిచర్య చేయుట కొరకు అతను వై.ఎమ్.సి.ఎ. వారి అంతర్జాతీయ కమిటీచే ఎంపిక చేయబడినవారై 1896వ సంll లో భారతదేశము లోని బొంబాయికి చేరుకున్నారు.

    అతను అక్కడికి వచ్చిన సమయంలో బుబోనిక్ ప్లేగు విజృంభిస్తుండుట వలన బొంబాయి నగరం అల్లాడిపోతున్నది. కాగా అతను వెంటనే బ్రిటిషువారి బృందముతో కలిసి ప్రజలకు వైద్య సంరక్షణ అందించుటకును మరియు వారిని రక్షించుటకును ప్రారంభించారు. అటుపిమ్మట అతను భారతదేశంలోని అనేక నగరాలలో తీవ్రమైన సంచార పరిచర్యను ప్రారంభించారు. ఒక దేశమును క్రైస్తవ దేశముగా మార్చుటకు ప్రధాన ద్వారం క్రీస్తు కొరకు యవ్వనస్థులను సంపాదించుటయేయని ఎడ్డీ విశ్వసించారు. ప్రారంభములో అతను సువార్తను బోధించుటకు వాదనలు మరియు విమర్శలతో కూడిన విధానమును అనుసరించారు. అయితే, దాని ద్వారా వచ్చిన సత్ఫలితాలు చాలా తక్కువ. ఒకానొక సమయంలో అతను స్వామి వివేకానంద మరియు మహాత్మా గాంధీలతో కూడా వాదించారు. అయితే తరువాత అతను "మనము వాదనలలో గెలుచుటకు కాదు గానీ, ప్రజలను గెలవడానికి పంపబడ్డాము" అని గ్రహించారు. తత్ఫలితముగా అతను స్థానికుల అవసరతలకు తగినట్లు సందర్భోచితంగా సువార్తను చెప్పడం ప్రారంభించి, వారి జీవితములలో క్రీస్తు నిజముగా అవసరమని వారు విశ్వసించేలా చేశారు.

    1900వ సంll లో తమిళనాడులో సేవ చేయడం ప్రారంభించారు ఎడ్డీ. అనేక వర్గాలతో విభజించబడియున్న క్రైస్తవ్యం దేవుని రాజ్యానికి ఆటంకం కలుగజేస్తుందే గానీ, దానిని విస్తరింపజేయదు అని అతను భావించారు. అందువలన అతను వి.ఎస్. అజర్యాతో కలిసి 1903వ సంll లో తిన్నెవెల్లికి చెందిన 'ఇండియన్ మిషన్ సొసైటీ' ని స్థాపించారు మరియు అన్ని క్రైస్తవ వర్గాలను, వివిధ క్రైస్తవ సమూహాలను సువార్త ప్రకటన అనే ఒకే గురివైపు మళ్ళించవలెననే భారంతో 1905వ సంll లో 'నేషనల్ మిషనరీ సొసైటీ ఆఫ్ ఇండియా' అనే సంస్థను స్థాపించారు. 

    భారతదేశములో చేసిన పరిచర్య నుండి పొందిన అనుభవముతో మరియు నేర్చుకొనిన పాఠాలతో అతను 1911వ సంll నుండి ఆసియాలోని అనేక దేశాలను పర్యటిస్తూ, ప్రభావవంతమైన సువార్త పరిచర్యను చేయడం ప్రారంభించారు. 1931వ సంll లో పదవీ విరమణ పొందిన తరువాత కూడా ప్రపంచవ్యాప్తంగా మిషన్‌లను జరిగించుటలో చురుకైన పాలిభాగస్థులుగా చివరి వరకు ప్రభు సేవలో సాగిపోయారు జార్జ్ షెర్వుడ్ ఎడ్డీ. 

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీరు వాదనలలో గెలుపును సాధిస్తున్నారా లేక ఆత్మలను గెలుస్తున్నారా?

    ప్రార్థన :


    ప్రభువా, మీ మహిమార్థమై ఫలభరితమైన పరిచర్యను చేయుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Aug 26, 2021

    Shomolekae l షోమోలేకే

    షోమోలేకే  | Shomolekae

    • జననం: -
    • మహిమ ప్రవేశం: -
    • స్వస్థలం: ఆఫ్రికా
    • దర్శన స్థలము: ఆఫ్రికా

    కురుమన్‌లోని జాన్ మెకెంజీ అనే మిషనరీకి చెందిన పండ్ల తోటకు షోమోలేకే అనే బాలుడు సంరక్షకునిగా ఉండేవాడు. అతనికి ఆ మిషనరీ అంటే మక్కువ. అతని బోధనలు కూడా ఆ బాలుడు ఇష్టపడేవాడు. ఒకసారి ఆ తోటలోని తోటమాలి కొన్ని దొంగిలించబడిన పండ్లను షోమోలేకేకి తినమని ఇచ్చాడు. అయితే, దొంగతనం చేయడం తప్పు అని ఎరిగియున్న ఆ బాలుడు వెంటనే వాటిని తిరస్కరించాడు. ఆ సంఘటన వలన అతను ఆ మిషనరీ యొక్క నమ్మకాన్ని గెలుచుకోగలిగాడు. తదుపరి ఆ మిషనరీ అతనిని తన సంరక్షణలోకి తీసుకున్నారు.

    మిషనరీ సేవలో తనకు సహాయపడుటకు షోమోలేకేని ఉత్తర ఆఫ్రికాలోని షోషాంగ్‌కు తీసుకొనివెళ్ళారు మెకెంజీ. ధైర్యవంతుడైన యువకుడైన షోమోలేకే మెకెంజీ యొక్క మిషనరీ ప్రయాణాలలో అతని ఎద్దుల బండిని నడిపించేవారు. అది అంత సులభమైన పని కాదు. అతను ఒకేసారి పదహారు ఎద్దులను నిర్వహించవలసి ఉండేది మరియు అతను వాటిని తిన్నగా వంకర లేకుండా వెళ్ళేలా నడిపించాలి. షోషాంగ్‌లో విశ్వాసులు కూడుకొని దేవునిని ఆరాధించుటకుగాను ఒక క్రైస్తవాలయమును నిర్మించుటలో మెకెంజీకి సహకారమందించారు షోమోలేకే.

    కొంతకాలం తరువాత కురుమన్‌లో ఒక పాఠశాలను నిర్మించుటలో మెకెంజీకి తోడ్పడిన షోమోలేకే తాను కూడా ఆ పాఠశాలలో విద్యార్ధిగా చేరారు. అక్కడ అతను తన స్వజనులకు బోధకునిగా మరియు ఉపాధ్యాయునిగా ఉండునట్లు శిక్షణ పొందారు. శిక్షణ పూర్తయిన తరువాత అతను పిత్సాని అనే ప్రదేశంలో పరిచర్య చేశారు. అక్కడి ప్రజలకు అతను యేసు క్రీస్తును గురించి బోధించి లేఖనములను చదవడమును నేర్పించారు. అడవి మృగాల నుండి కలిగే ప్రమాదాలను లెక్కచేయకుండా ప్రమాదకరమైన నదులు మరియు సరస్సుల వెంట ప్రయాణిస్తూ, సువార్త ప్రకటించుటకు ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్ళేవారు షోమోలేకే. అలుపెరుగక ఎడతెగక చేసిన అతని పరిచర్య ద్వారా ఎంతోమంది స్త్రీ పురుషులు క్రీస్తు వైపుకు నడిపించబడ్డారు.

    షోమోలేకే తన ప్రజల ఆత్మీయ అభివృద్ధి కొరకు మాత్రమే కాదు, వారి సామాజిక అభ్యున్నతి గురించి కూడా భారమును కలిగియుండేవారు. అతను గిరిజనులకు మంచి సంస్కృతిని నేర్పించారు మరియు నీతినిజాయితీలతో డబ్బు సంపాదించుకొనవలెనని వారిని ప్రోత్సహించేవారు. స్థానిక భాషలో అతను ఒక కీర్తనల పుస్తకమును కూడా వ్రాశారు మరియు దేవునికి స్తుతిగీతములను పాడటను వారికి నేర్పించారు. ఆ పాటలను అక్కడి ప్రజలు బాగుగా నేర్చుకున్నారు. మహిళలు పొలాలలో పని చేస్తున్నప్పుడు కావచ్చు లేదా చిన్నపిల్లలు తమ పడవలలో వెళ్తూ తెడ్డు వేస్తున్నప్పుడు కావచ్చు లేదా పురుషులు చిత్తడి నీటిలో చేపలు పడుతున్నప్పుడు కావచ్చు, ఏ పని చేస్తున్నా వారు సంతోషంగా ఆ పాటలు పాడటం వినబడుతుంది. ఆ గ్రామం మొత్తం క్రీస్తులో నిజమైన సంతోషాన్ని కనుగొంది! ఎంత అద్భుతమది!

    🚸 *ప్రియమైనవారలారా, ఒక క్రైస్తవునిగా మీరు చేస్తున్న పనిని మీరు నిజాయితీగా చేస్తున్నారా?* 🚸

    🛐 *"ప్రభువా, నేను వెళ్ళే స్థలములన్నింటిలో నిజాయితీగల క్రైస్తవ జీవితమును కలిగియుండుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"* 🛐

    🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏

  • WhatsApp