Search Here

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

May 14, 2023

John Dreisbach | జాన్ డ్రెయిస్‌బాక్

జాన్ డ్రెయిస్‌బాక్ గారి జీవిత చరిత్ర

  • జననం : 1921
  • మరణం : 2009
  • స్వస్థలం : వాయువ్య ఓహియో
  • దేశం : అమెరికా సంయుక్త రాష్ట్రాలు 
  • దర్శన స్థలము : నైజీరియా

దైవభక్తిగల ఒక వ్యవసాయ కుటుంబములో జన్మించిన జాన్ డ్రెయిస్‌బాక్, వారి కుటుంబములోని ముగ్గురు సంతానంలో ఆఖరివాడు. అతని తండ్రి ఆదివారపు బైబిలు పాఠశాల (సండే స్కూల్) యొక్క నిర్వాహకులు. అతని తల్లి 'ఉమెన్స్ మిషనరీ సొసైటీ' (మహిళా మిషనరీ సంస్థ) లో క్రియాశీల సభ్యురాలు మరియు ఆదివారపు బైబిలు పాఠశాల యొక్క ఉపాధ్యాయురాలు. కాగా విదేశాలలో మిషనరీ సేవ పట్ల మిగుల ఆసక్తి కలిగియున్న అతని తల్లిదండ్రులు తమకు పిల్లలు కలుగక మునుపే వారిని ప్రభువు సేవ కొరకై సమర్పించారు. జాన్ కు 12 సంll ల వయసు ఉన్నప్పుడు వారి సంఘములో జరిగిన ఒక ఉజ్జీవ కూడికలో తన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపమొంది, వాటిని ఒప్పుకొని రక్షణ కొరకై దేవుని సన్నిధిలో వేడుకొనగా, అతను తిరిగి జన్మించిన అనుభవమును పొందారు. మిషనరీల జీవిత చరిత్రలను చదివే అతని తల్లి, వాటిని చదువుటకు జాన్ ను కూడా ప్రోత్సహించారు. ఇది ఆఫ్రికాలో మిషనరీ సేవ చేయుట కొరకైన అతని పిలుపును నిశ్చయపరచుటలో కీలక పాత్ర పోషించింది.


వైద్య కళాశాల నుండి పట్టా పొందిన తరువాత 1948వ సంll లో తన జీవిత భాగస్వామియైన బెట్టీతో కలిసి పశ్చిమ ఆఫ్రికాలోని నైజీరియాకు మిషనరీగా వెళ్ళారు జాన్. అక్కడ అతను ఉత్తర నైజీరియాలోని మూడు పెద్ద కుష్ఠురోగుల ఆసుపత్రులను పర్యవేక్షించే నిర్వాహకులుగా పనిచేశారు. ఈ ప్రాంతం ప్రధానంగా ముస్లిం ప్రజలచే ఆక్రమించబడినందున వారు చేస్తున్న సేవలో ప్రధానముగా సువార్త ప్రకటనపై వారి దృష్టి కేంద్రీకరించబడింది. అంతేకాకుండా దేవుని వాక్య జ్ఞానములో ఎదుగులాగున ప్రజలను ప్రోత్సహించుటకుగాను మరియు పురుషులకు పాదిరులుగా శిక్షణనిచ్చుటకుగాను వారు బైబిలు పాఠశాలలను కూడా నిర్వహించారు.


సెలవు దినములలో అతను ఆఫ్రికా నుండి వచ్చినప్పుడు సువార్త సేవ చేసే విశ్వవిద్యాలయమైన దక్షిణ కెరోలినాలోని బాబ్ జోన్స్ విశ్వవిద్యాలయం వారు వైద్యపరమైన మిషనరీ సేవ కొరకు పాఠ్యాంశాలను అభివృద్ధి చేయుటకై జాన్ ను నియమించారు. దానిని గురించి అతను దృఢముగా విశ్వసించినది ఏమంటే వైద్య మిషనరీ శిక్షణలో అనుభవపూర్వకమైన శిక్షణ ఎంతో ముఖ్యమైన అంశమని. కాగా అతను ‘ప్రాజెక్ట్ కంపాషన్’ (కరుణా పరియోజన) అనుదానిని ప్రవేశపెట్టారు. దీని ద్వారా అనేకమంది విద్యార్థులు నిజముగా జరుగుతున్న సేవాకార్యక్రమాలలో పాల్గొని అనుభవపూర్వక శిక్షణ పొందారు. అతను ఆ విశ్వవిద్యాలయము యొక్క ఒక ఉద్యోగిగానే పరిగణింపబడినప్పటికీ, జాన్ దంపతులు తమ అధిక సమయమును వైద్యపరమైన వివిధ సేవా కార్యకలాపాలలో సేవలందించుటకు వెచ్చించి స్వతంత్ర మిషనరీలుగా దేవుని సేవలో ముందుకు సాగిపోయారు.


అంతేకాకుండా, తన జీవితములో చెప్పుకోదగినంత కాలం పాటు విదేశాలలో మిషనరీ సేవ చేయుటను గురించి కళాశాల విద్యార్థులకు ఆలోచన చెబుతూ, అందుకు వారిని ప్రోత్సహించుచూ కూడా జాన్ సేవలందించారు. జాన్ ప్రపంచ నలుమూలలా సువార్త ప్రకటించబడుటను గురించి ఎల్లప్పుడూ యవ్వనస్థులను సవాలు చేసేవారు. అది ఎంతో ఫలభరితమైనదనుటకు అతని ద్వారా ప్రోత్సహించబడి ప్రపంచమంతటా విదేశీ మిషనరీ పరిచర్యలలో తమ సేవలనందించుచున్న యవ్వనస్థులు సాక్ష్యముగా నిలుస్తారు. 


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, ఇంతకు మునుపెన్నడూ సువార్త విననివారికి సాక్ష్యమిచ్చే అవకాశం మీరు కూడా కలిగియున్నారని మీరు గ్రహించగలుగుతున్నారా? 

ప్రార్థన :   

"ప్రభువా, నా స్వార్థపూరితమైన జీవితమును విడిచిపెట్టి, విమోచననిచ్చే కృపా సందేశము యొక్క అవసరతలో ఉన్నవారికి ఆ సందేశమును చేరవేయుటకు నన్ను నేను సమర్పించుకొనెదను. ఆమేన్!"   

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • May 13, 2023

    John Berchmans | జాన్ బెర్చ్‌మన్స్

    జాన్ బెర్చ్‌మన్స్ గారి జీవిత చరిత్ర



    • జననం : 13-03-1599
    • మరణం : 13-08-1621
    • స్వస్థలం : డైస్ట్
    • దేశం : బెల్జియం
    • దర్శన స్థలము : -


    బెల్జియంలోని డైస్ట్‌లో ఒక దైవభక్తి గల కుటుంబములో జన్మించారు జాన్ బెర్చ్‌మన్స్. చిన్నతనంలోనే అతను కలిగియున్న అతి పెద్ద కోరిక తాను ఒక పాదిరి అవ్వాలని. అది భక్తి కలిగిన జీవితాన్ని జీవించుటకు అతనికి ప్రేరణగా నిలిచింది. వేకువనే లేచి కూడికలను నిర్వహించుటలో అక్కడి పాదిరులకు సహాయమందించి తదుపరి పాఠశాలకు వెళ్ళడం ఒక అలవాటుగా అతను అలవరచుకున్నారు. అతని కుటుంబం యొక్క ఆర్ధిక పరిస్థితుల వలన అతను జీతగానిగా పని చేస్తూ తన చదువు కొరకు ధనాన్ని సమకూర్చుకునేవారు.


    ఏదేమైనప్పటికీ, 1615వ సంll లో బెల్జియంలోని మాలైన్స్‌లో ఒక జెస్యూట్స్ కళాశాల ప్రారంభించబడగా మతపరమైన విద్యను అభ్యసించుటకు అతనికి అవకాశం కలిగింది. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత అతను పనిచేసి సంపాదించి కుటుంబమును ఆర్థికముగా ఆదుకొనవలెననే తన తండ్రి కోరికకు విరుద్ధముగా 1616వ సంll లో జాన్ 'సొసైటీ ఆఫ్ జీసస్' లో చేరారు. కాగా అతని తండ్రి అతనితో ఇకపై ఒక్క పైసా కూడా నేను నీకు ఇవ్వను అని చెప్పినప్పుడు, “చూడండి తండ్రీ, నేను ధరించిన బట్టలు గనుక నన్ను వెనుకకు లాగుతున్నట్లైతే నేను వాటిని తీసివేసి క్రీస్తును వెంబడిస్తాను...” అని జాన్ సమాధానమిచ్చారు.


    1618వ సంll లో సేవచేయుటకు అర్హత పొందిన తరువాత, అతను భక్తి జీవితాన్ని స్వీకరించారు. తదుపరి తత్వశాస్త్రం అధ్యయనం చేయుటకుగాను ఆంట్వెర్ప్ మరియు రోమ్‌లకు వెళ్ళిన అతను, అక్కడ సంఘ పరిచర్యలోనే ఎక్కువ సమయం గడిపేవారు. క్రైస్తవ సంఘములో ఇతరులు చేయుటకు ఇష్టపడని ఎటువంటి సాధారణమైన లేదా చిన్న పని అయినా చేయుటకు జాన్ సిద్ధ మనస్సును కలిగియుండేవారు. "ఒక పనిలోని గొప్పతనం ఆ పని ఎంత గొప్పదని కాదుగానీ, అప్పగింపబడిన పని ఎంత ఉత్తమముగా సంపూర్తి చేయబడినది అనునది" అని అతను చెప్పేవారు.


    దయ, దీనత్వం మరియు స్నేహపూర్వక స్వభావం కలిగిన జాన్, కలుపుగోలుగా ఉండే వ్యక్తిత్వంతో ఇతరులకు ప్రియమైనవానిగా అయ్యారు. అతను ఒక ఉత్తమ విద్యార్ధి కావడంతో, బహిరంగ చర్చలో తత్వశాస్త్రమునకు అనుకూలముగా మాటలాడుటకు వక్తగా రోమన్ కళాశాల జాన్‌ను ఎంపిక చేసింది. గ్రీక్ కళాశాలలో జరిగిన మరొక చర్చలో కూడా వక్తగా రోమన్ కళాశాలకు ప్రాతినిధ్యం వహించాలని అతనిని కోరారు. ఈ బహిరంగ చర్చల కొరకు సిద్ధపడుటలో అతని ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. ఆరోగ్యపరంగా రోజురోజుకు క్షీణించిపోయిన అతను, చివరికి 'రోమన్ ఫీవర్' అనే జ్వరం బారిన పడ్డారు. తద్వారా అతని ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. తన చివరి రాత్రిని ప్రార్థనలో గడిపిన జాన్ బెర్చ్‌మన్స్, 22 సంll ల యుక్త వయస్సులో మరణించారు. ప్రేమ నిండిన హృదయముతో సాధారణమైన పనులను చేయడం ద్వారా కూడా ఏవిధముగా దేవునికి సేవ చేయవచ్చునో అతని జీవితం చూపిస్తుంది.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీరు దేవుని కొరకు సాధారణమైన చిన్న పనులను చేయుటలో నమ్మకముగా ఉన్నారా?

    ప్రార్థన :

    "ప్రభువా, సాధారణమైన చిన్న పనులను కూడా మీ కొరకు అధికమైన ప్రేమతో చేయుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!" 

    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • James Renwick | జేమ్స్ రెన్విక్

    జేమ్స్ రెన్విక్ గారి జీవిత చరిత్ర


    Credits: Wikipedia
    Statue of James Renwick, Valley Cemetery,


    • జననం : 15-02-1662
    • మరణం : 17-02-1688
    • స్వస్థలం : మోనియైవ్
    • దేశం : స్కాట్లాండ్
    • దర్శన స్థలము : స్కాట్లాండ్


    జేమ్స్ రెన్విక్ ప్రెస్బిటేరియన్ సంఘములో పరిచర్య చేసిన ఒక దైవ సేవకులు. అతను దేవుని వాక్యానికి అమితమైన విధేయత చూపిన కారణముగా హతసాక్షిగా మరణించారు. స్కాట్లాండుకు చెందిన ఒక భక్తిగల కుటుంబములో జన్మించిన రెన్విక్‌, చాలా చిన్న వయస్సు నుండే క్రైస్తవ సంఘ కార్యకలాపాలతో బలమైన అనుబంధమును కలిగియున్నారు. కాగా పదమూడేళ్ళ వయసులో ఈడెన్‌బర్గ్ విశ్వవిద్యాలయములో చేరిన అతను, అక్కడ మతమును మరియు వేదాంతశాస్త్రమును అభ్యసించారు. అక్కడ చదువుకుంటున్న సమయములో స్కాట్లాండ్ చర్చిపై అధికారమును బిషప్పులకు ఇచ్చుట ద్వారా క్రైస్తవ సంఘమును తన చేతులలో ఉంచుకొనుటకు ప్రయత్నిస్తున్న రెండవ చార్లెస్ రాజును ప్రతిఘటించినందుకుగాను చంపబడిన రిచర్డ్ కామెరూన్ యొక్క బోధనల వైపు అతను ఆకర్షితులయ్యారు. తదుపరి వేదాంతములో శిక్షణ కొరకై నెదర్లాండ్సుకు వెళ్ళిన రెన్విక్, అక్కడ సంఘ సేవకులుగా నియమించబడ్డారు.


    రెన్విక్ 1683వ సంll లో స్కాట్లాండుకు తిరిగి వచ్చారు. క్రైస్తవ సంఘమును తమ అధికారము క్రింద నియంత్రించుటకు ప్రయత్నిస్తున్న రాజును ఎదిరిస్తున్నందుకుగాను ఒక ప్రక్క ప్రెస్బిటేరియన్లు చంపబడుతున్న పరిస్థితులలో రెన్విక్ ధైర్యముగా సేవ చేయడం ప్రారంభించారు. అతని పరిచర్య యొక్క మొదటి సంవత్సరంలో ఐదు వందల మందికి పైగా క్రీస్తు వద్దకు నడిపించబడ్డారు. తరువాతి ఐదు సంవత్సరములు అతను స్కాట్లాండు దేశమంతటా పర్యటించి, వినుటకు చెవియొగ్గిన ప్రతియొక్కరికీ లేఖన సత్యములను బోధించారు. తత్ఫలితముగా అతను ఒక తిరుగుబాటుదారుడని ప్రకటించి, అధికారులు అతనిని నిత్యము వెంటాడారు. అతను వెనుకకు మళ్ళకపోతే బంధింపబడే ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ, వెనుకంజ వేయక సేవను కొనసాగించారు రెన్విక్. అతను ఎక్కడ ఉన్నా, ఆపద వస్తే వేగంగా తప్పించుకొనులాగున ఎల్లప్పుడూ ఒక గుఱ్ఱం సిద్ధపరచబడి, సన్నద్ధమై ఉండేది.


    పలుమార్లు మరణచ్ఛాయల నుండి కొద్దిలో తప్పించుకున్న రెన్విక్, చివరికి 1688వ సంll ప్రారంభంలో పట్టుబడ్డారు. విచారణలో రాజద్రోహానికి పాల్పడ్డారని మరియు దేవుని దూషించారని అతనిపై ఆరోపణలు చేసి అతనికి మరణశిక్ష విధించారు. కొంతమట్టుకైనా రాజు యొక్క అధికారమునకు అంగీకరించమని అనేక మంది అతనిని ఒప్పించుటకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. "లేదు, దేవుని వాక్యమునకు అనుగుణముగా నియమనిబంధనలు మరియు పరిమితులను కలిగియున్న అధికారమునే నేను అంగీకరిస్తాను" అని చెప్పి వారి విజ్ఞాపనలనన్నింటినీ నిరాకరించారు రెన్విక్. సున్నితమైన శరీర దారుఢ్యమును కలిగి, మంచి యవ్వనంలో ఉండి ధైర్యముగా ఉరికంబము వైపుకు అడుగులు వేస్తున్న రెన్విక్‌ను చూసి ఆశ్చర్యపోయిన సైన్యాధిపతి, 'దేశమును అంతగా కలవరపరచినది రెన్విక్ అనే ఈ పడుచువాడా?' అని పలికారు. రెన్విక్‌ ఉరితీయబడినప్పుడు అతని వయస్సు ఎంతో మీకు తెలుసా? ఇరవై ఆరు! కరపత్రాలుగా ప్రచురించబడిన రెన్విక్ యొక్క ఉపన్యాసాలు మరియు లేఖలు ఈనాటికీ మనకు ప్రేరణను కలిగించేవిగా ఉన్నాయి.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీ యవ్వనం ప్రభువుకు ఉపయోగకరమైనదిగా ఉన్నదా?

    ప్రార్థన :

     "ప్రభువా, నా యవ్వనమును మీకు యోగ్యముగా ఉపయోగించుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • John Mark | మార్కు అనబడు యోహాను

    మార్కు అనబడు యోహాను గారి జీవిత చరిత్ర


    Pictures shown are for illustration purpose only


    • జననం : -
    • మరణం : 1 వ శతాబ్దం
    • స్వస్థలం :
    • దేశం : -
    • దర్శన స్థలము : -


    మొదటి శతాబ్దంలో యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినది. ఆ శ్రమలు కొనసాగుతున్నప్పుడు, అపొస్తలుడైన యాకోబును చంపించిన హేరోదు రాజు, పేతురును కూడా పట్టుకొని చెరసాలలో వేయించాడు. అయితే దేవుని దూత ద్వారా పేతురు ఆశ్చర్యకరమైన రీతిలో చెరసాలలో నుండి విడిపించబడగా, అతను మార్కు అను మారు పేరుగల యోహాను తల్లియైన మరియ ఇంటికి వచ్చారు. ఆ సమయంలో విశ్వాసులు అక్కడ కూడుకొని ప్రార్థన చేయుచున్నారు. మార్కు గురించి బైబిలులో మొదటిసారిగా ఈ సందర్భంలో ప్రస్తావించబడింది. అతనిని గురించి బైబిలులో కొన్ని సార్లు మాత్రమే చెప్పబడినప్పటికీ, దేవుని దృష్టిలో ఎవరూ అల్పులు కారు.


    బర్నబాకు బంధువు అయిన ఈ మార్కు, పౌలు మరియు బర్నబాల‌ యొక్క మిషనరీ ప్రయాణంలో వారితో పాటు కలిసికొని వారికి ఉపచారము చేయువానిగా ఉన్నారు. అయితే వారు పంఫూలియాలోనున్న పెర్గేకు వచ్చినప్పుడు, మార్కు వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిపోయారు. ఈ చర్య పౌలును ఎంతో నిరాశపరిచింది. కాగా, వారి తదుపరి మిషనరీ ప్రయాణంలో మార్కు‌ను కూడా వెంట తీసుకువెళ్ళవలెనని బర్నబా తలంచగా, పౌలు అందుకు నిరాకరించారు. తత్ఫలితముగా చివరికి పౌలు మరియు బర్నబాలు ఒకరిని విడిచి ఒకరు వేరైపోయారు. కాగా, బర్నబా మార్కును వెంటబెట్టుకొని కుప్రకు వెళ్ళారు. అప్పుడు మార్కు ప్రభువుకు నమ్మకంగా సేవ చేసిన దానిని బట్టి తదుపరి పౌలు కూడా మార్కు‌ను తన జతపనివానిగా పేర్కొన్నారు. పౌలు చెరసాలలో ఉన్నప్పుడు తిమోతికి లేఖను వ్రాస్తూ, "మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు" అని చెప్పారు. అంతేకాకుండా కొలస్సీ సంఘమునకు మార్కు వచ్చినయెడల అతనిని చేర్చుకొనమని సూచించారు. ఒకప్పుడు సేవలో వెనుకంజ వేసిన మార్కు, తిరిగి సేవలో అంత స్థిరముగా నిలబడ్డారు.


    అపొస్తలుడైన పేతురుకు కూడా పరిచర్యలో మార్కు సహకారిగా ఉన్నారు. కాగా పేతురు తాను వ్రాసిన పత్రికలో ‘నా కుమారుడు’ అని మార్కును గూర్చి పేర్కొన్నారు. తదుపరి మార్కు ఐగుప్తుకు వెళ్ళి, ఆఫ్రికాలో క్రైస్తవ సంఘములను స్థాపించిన మొదటి వ్యక్తి అయినట్లుగా చెప్పబడుతుంది. అతను అలెగ్జాండ్రియాలో సంఘమును స్థాపించి, అక్కడ పరిచర్య చేశారు. బైబిలు గ్రంథములో చేర్చబడిన "మార్కు సువార్త"ను వ్రాసింది ఈ మార్కేనని అధిక శాతం బైబిలు పండితులు భావిస్తారు. యేసు క్రీస్తును దేవుని కుమారునిగా తెలియపరిచే ఈ  సువార్త పుస్తకం, పశ్చాత్తాపపడి మారుమనస్సు పొందుమని అవిశ్వాసులకు మరియు 'సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి' అని దేవుడు ఇచ్చిన ఆ గొప్ప ఆజ్ఞకు విధేయులుకమ్మని విశ్వాసులకు పిలుపునిచ్చేదిగా ఉంది.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీరు విఫలమైనప్పుడు, మీరు తిరిగి విశ్వాస మార్గంలో కొనసాగుటకు మీ కొరకై ఎల్లప్పుడూ ఒక తెరువబడిన ద్వారం ఉన్నదని జ్ఞాపకము చేసికొనుము. 

    ప్రార్థన :

    "ప్రభువా, మీ సేవ కొరకు మా ఇంటి ద్వారములను ఎల్లప్పుడూ తెరిచియుంచునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • George Muller | జార్జ్ ముల్లర్

    జార్జ్ ముల్లర్ గారి జీవిత చరిత్ర



    • జననం : 27-09-1805
    • మరణం : 10-03-1898
    • స్వస్థలం : క్రోపెన్‌స్టేడ్ట్, ప్రసియా (ప్రస్తుత జర్మనీలో)
    • దర్శన స్థలము : ప్రపంచ నలుమూలలు


    దేవుని సేవ నిమిత్తం ఒక దైవజనుడు అట్లాంటిక్ మహాసముద్రముగుండా ప్రయాణిస్తున్నారు. అయితే, దట్టమైన పొగమంచు కారణంగా ముందుకు సాగలేక ఆ ఓడను మధ్యలో నిలిపివేశారు. కాగా అతను ఓడ కెప్టెన్‌ వద్దకు వెళ్ళి మరుసటి రోజు మధ్యాహ్నం తాను ఖచ్చితముగా క్యూబెక్‌లో ఉండవలసిన అవసరం ఉందని చెప్పారు. అయితే అటువంటి అననుకూల పరిస్థితులలో ప్రయాణాన్ని కొనసాగించలేమని కెప్టెన్ నిక్కచ్చిగా సమాధానమిచ్చారు. అప్పుడు ఆ దైవజనుడు కెప్టెన్‌తో తాను ప్రార్థిస్తానని, ఖచ్చితముగా దేవుడు ఒక మార్గం తెరుస్తాడని చెప్పారు. అది నమ్మలేని కెప్టెన్ అతనితో పాటు ఒక గదిలోకి వెళ్ళగా, అక్కడ ఆ దైవజనుడు పొగమంచును తొలగించమని అడుగుతూ సాధారణమైన మాటలలోనే విశ్వాసముతో  ప్రార్థించారు. ప్రార్థన ముగించిన తరువాత అతను కెప్టెన్‌తో  “నా ప్రభువును నేను యాభై సంవత్సరాలకు పైగా ఎరిగియున్నాను. రాజులకు రాజైన ఆయనను సంధించినప్పుడు ఏ ఒక్క సందర్భములో కూడా నేను విఫలము కాలేదు. లేచి వెళ్ళండి, పొగమంచు పోయింది. వెళ్ళి చూడండి, మీరే తెలుసుకుంటారు.” అని చెప్పారు. కెప్టెన్ ఓడ యొక్క వంతెన వద్దకు తిరిగి వచ్చి చూసినప్పుడు పొగమంచు తొలగిపోయి ఉంది. అటువంటి విశ్వాసవీరుడు మరియు ప్రార్థనాయోధుడు జార్జ్ ముల్లర్.


    జార్జ్ ముల్లర్ ఒకప్పుడు ఇహలోక ఆనందాలలో మునిగిపోయి పాపాత్మకమైన జీవితాన్ని జీవించారు. అయితే అది అతనికి తృప్తిని ఇవ్వకపోగా, అతనిలో అపరాధ భావాన్ని కలిగిస్తుండేది. కాగా తన జీవితాన్ని మార్చుకొనవలెనని అతను ఎంతగా ప్రయత్నించినప్పటికీ బయటికి రాలేకపోయారు. అయితే 1825వ సంll నవంబరు మాసంలో అతను ఒక చిన్న క్రైస్తవ కూడికకు హాజరవ్వగా, ఎటువంటివారినైనా మార్చగలిగే క్రీస్తు ప్రేమ అతనిని మార్చివేసింది. అప్పటినుండి దేవుని మహిమ కొరకు మాత్రమే జీవించాలని అతను వాంఛించారు. 1826వ సంll లో హాలీ విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందిన తరువాత అతను యూదుల మధ్యలో సువార్త సేవ చేసే ఇంగ్లాండులోని 'లండన్ సొసైటీ ఫర్ ప్రమోటింగ్ క్రిస్టియానిటీ అమోంగెస్ట్ ది జ్యూస్' అనే సంస్థలో చేరారు. తదుపరి అతను బ్రిస్టల్‌కు వెళ్ళి తరువాతి కాలంలో ‘ప్లైమౌత్ బ్రదరన్’ అని పిలువబడిన బెతెస్థ మరియు గిడియన్ వద్ద ఉన్న క్రైస్తవ సంఘములలో జీతం లేకుండానే సేవ చేశారు.


    ప్రధానంగా అనాధ పిల్లల సంరక్షణ కొరకు సేవ చేయుటకు తనను సమర్పించుకున్న ముల్లర్, వారి కొరకు అనాథాశ్రమాలను ఏర్పరిచారు. ఈ అనాథాశ్రమాలు కేవలం విశ్వాసము ద్వారా దేవుని పైనే ఆధారపడి నడిపించబడేవి. డెబ్బై సంవత్సరాల వయస్సులో అతను పదిహేడు మిషనరీ యాత్రలను చేపట్టి, నలభై రెండు దేశాలకు వెళ్ళి దేవుని సేవ చేశారు. ‘దేవునిలో ఉండే నిజమైన నమ్మకం పరిస్థితులకు మరియు దృశ్యమైన సంగతులకు అతీతమైనది’ అని తన జీవితము ద్వారా ఎంతో బలముగా ధృవీకరించిన జార్జ్ ముల్లర్, చివరి శ్వాస విడిచే వరకు కూడా తన యజమానుని ద్రాక్షతోటలో నమ్మకమైన సేవకునిగా పని చేశారు.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, స్థితిగతులన్నింటికీ పైన దేవుడు ఉన్నాడన్న దృఢ విశ్వాసమును మీరు కలిగియున్నారా? 

    ప్రార్థన :

    "ప్రభువా, నా అవసరతలన్నింటి కొరకు మీ పైనే ఆధారపడునట్లు నా విశ్వాసాన్ని బలపరుచుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Jul 26, 2022

    George Grenfell | జార్జ్ గ్రెన్‌ఫెల్

    జార్జ్ గ్రెన్‌ఫెల్ జీవిత చరిత్ర



    • జననం: 21-08-1849
    • మహిమ ప్రవేశం: 01-07-1906
    • స్వస్థలం: సాన్‌క్రీడ్
    • దేశం: ఇంగ్లాండు
    • దర్శన స్థలము: ఆఫ్రికా


    బానిసలైన ఇద్దరు బాలికలు ఒక చెట్టుకు కట్టబడి, తెగ నాయకునిచే హింసించబడబోతున్నారు. ఆ సమయంలో ఒక మిషనరీ అక్కడికి వచ్చి విమోచనా క్రయమును చెల్లించి వారిని రక్షించాడు. అతను వారి గ్రామానికి ఆ అమ్మాయిలను తీసుకువస్తుండగా, ఆ గ్రామస్థులు ఆ అమ్మాయిలను అపహరించిన వ్యక్తి మిషనరీయే అని భావించారు. కాగా అతనిని చంపుటకు ఆ గ్రామం మొత్తం ఈటెలు పట్టుకొని రాగా, ఆ బాలికలలో ఒకరు తన గ్రామస్థులను ఆపి, ఆ మిషనరీ క్రయం చెల్లించి ఎలా వారిని విడిపించి రక్షించారో వారికి వివరించి చెప్పింది. వెంటనే మిషనరీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని, పాపపు బానిసత్వం నుండి వారిని రక్షించుటకు యేసు క్రీస్తు తన ప్రాణాన్నే విమోచన క్రయధనముగా ఎలా చెల్లించారో వారికి తెలియపరిచారు. ఆ రోజున ఆ గ్రామస్థులలో అనేకమంది పాపాంధకారంలో ఉన్న తమ జీవితాలలో సువార్త వెలుగును చూశారు. క్రీస్తుకు ఉన్నటువంటి హృదయమును కలిగియున్న ఆ మిషనరీ మరెవరో కాదు, చీకటిలో ఉన్న ఆఫ్రికాలో సువార్త వెలుగును ప్రసరింపజేసిన జార్జ్ గ్రెన్‌ఫెల్.


    స్థానికులచే ‘టాటా’ (తండ్రి) అని ఆప్యాయంగా పిలువబడిన గ్రెన్‌ఫెల్, మధ్య ఆఫ్రికా యొక్క అన్వేషకునిగా కూడా పేరొందిన ఒక బాప్తిస్టు మిషనరీ. ఒక కంటిని కోల్పోయినప్పటికీ, అతను 24 సంll ల వయస్సులో మిషనరీగా సేవ చేయవలెననిన దేవుని పిలుపుకు విధేయులై 1874వ సంll లో ఆఫ్రికాలోని కామెరూన్‌కు వచ్చారు. అక్కడ అనేక అన్వేషణాత్మక ప్రయాణాలను చేపట్టిన అతను, మిషనరీ సేవ కొరకు విస్తారమైన కాంగో ప్రాంతము యొక్క ద్వారములను తెరిచారు. అప్పటి ఆఫ్రికా ప్రజలలో నిండుకొనియున్న నీచమైన భ్రష్టత్వమును చూసి అతను బాధపడినప్పటికీ, అంధకారం, కౄరత్వం మరియు మరణముతో నిండియున్న ప్రదేశములకు సువార్త వెలుగును తీసుకువెళ్ళడంలో గొప్ప సంతోషమును కనుగొన్నారు. 


    తన పెద్ద కుమార్తెను కోల్పోవడం మరియు అనేక ఇతర భయంకరమైన అనుభవాలను ఎదుర్కొనిన పరిస్థితులలో కూడా, నిజమైన దేవునిని కనుగొన్న ఆఫ్రికా ప్రజలను చూచి అతను ఓదార్పును మరియు సంతృప్తిని పొందారు. వారి ప్రాణాత్మలను ఎలా శుభ్రపరచుకొనవలెనో వారికి నేర్పించుటయే కాక, వారి భౌతిక జీవితాలలో కూడా నాగరికతను తీసుకువచ్చుటకు ప్రయత్నించారు గ్రెన్‌ఫెల్. నరమాంస భక్షకులు, హంతకులు, బానిస వ్యాపారులు మరియు మాంత్రికవిద్యలను అభ్యసించే ఆ ప్రజల జీవితాలను మార్చుటకు దేవుడు అతనిని ఒక శక్తివంతమైన సాధనముగా ఉపయోగించుకున్నాడు.


    మండుచున్న క్రొవ్వొత్తి తాను ప్రకాశిస్తున్న అదే సమయంలో కరుగుతుంది కూడా! అయినప్పటికీ, రక్షణ సువార్త యొక్క వెలుగును అంధకారమయమైన కాంగోలోకి తీసుకువెళ్ళుటకు, ప్రకాశించుచున్న క్రొవ్వొత్తి వలె గ్రెన్‌ఫెల్ కూడా తన సమస్తమునూ క్రీస్తుకు సమర్పించి, తాను కరిగిపోయారు. బ్లాక్ ఫీవర్ అనే జ్వరముతో తీవ్రముగా బాధింపబడిన తరువాత, 1906వ సంll లో తన ప్రభువు సన్నిధానమునకు చేరుకున్నారు జార్జ్ గ్రెన్‌ఫెల్.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, అంధకారమయమైన ఈ లోకములో మీరు మండుచూ ప్రకాశించుచున్న వెలుగువలె నున్నారా? 

    ప్రార్థన :

    "ప్రభువా, నన్ను విరుగగొట్టుము, కరిగించుము, మీ మహిమ నిమిత్తం నన్ను మలుచుము. ఆమేన్!" 

    దేవునికే మహిమ కలుగునుగాక! ఆమేన్ !


  • WhatsApp
  • Jul 25, 2022

    Johannes Theodorus van der Kemp | జోహన్నెస్ థియోడోరస్ వాన్ డెర్ కెంప్

    జోహన్నెస్ థియోడోరస్ వాన్ డెర్ కెంప్  జీవిత చరిత్ర


    • జననం: 17-05-1747
    • మహిమ ప్రవేశం: 15-12-1811
    • స్వస్థలం: రోటర్‌డామ్
    • దేశం: నెదర్లాండ్స్
    • దర్శన స్థలము: దక్షిణాఫ్రికా




    కర్తవ్యం పిలుపునిస్తే, మరి ముఖ్యముగా ఆ పిలుపు దేవుని నుండి వచ్చినదయితే, ఎప్పుడైనాసరే నూతన ప్రారంభమును కలిగియుండుటకు అది ఆలస్యం కానేరదు. పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో వైద్య మిషనరీగా ఆఫ్రికాకు వెళ్ళిన జోహన్నెస్ థియోడోరస్ మునుపు ఒక ప్రముఖ పండితుడు, సైనికుడు మరియు వైద్యునిగా ఉన్నారు. అయితే తన జీవితపు చివరి భాగములో దేవుని పిలుపును అందుకొన్నవారై నూతన లక్ష్యముతో ముందడుగు వేశారు.



    థియోడోరస్ యొక్క తండ్రి డచ్ రిఫార్మ్డ్ చర్చిలో సేవ చేసేవారు. లైడెన్ విశ్వవిద్యాలయములో వైద్యశాస్త్రమును అభ్యసించిన థియోడోరస్, 1763వ సంll లో పట్టభద్రులైన పిమ్మట పదహారు సంవత్సరాల పాటు సైన్యములో పనిచేశారు. అక్కడ పరాక్రమము గలిగిన ఒక సైనికునిగా ఉన్న అతను, సైన్యాన్ని విడిచిపెట్టిన తరువాత ఆధునిక భాషలు మరియు సామాన్యశాస్త్రములను అభ్యసించుటకు ఈడెన్‌బర్గ్ వెళ్ళారు. తదుపరి అతను హాలాండుకు తిరిగి వచ్చి వైద్యము చేయడం ప్రారంభించి అందులో సఫలులయ్యారు. అయితే అనుకోని విధంగా ఒక ప్రమాదంలో అతని భార్యాబిడ్డలు మరణించడంతో అతను గొప్ప శోక సంద్రములో మునిగిపోయారు. ఈ అనుభవం అతనిని క్రీస్తు నొద్దకు నడిపించింది. కాగా యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించిన అతను, తన మిగిలిన జీవితమును ఆయన సేవ చేయుటకు ఉపయోగించారు.



    తత్ఫలితముగా అతను లండన్ మిషనరీ సొసైటీలో చేరగా, ఆ సంస్థ ద్వారా అతను దక్షిణాఫ్రికాకు పంపించబడ్డారు. తద్వారా యాభై ఏళ్ళు పైబడిన థియోడోరస్, 1798వ సంll లో నేరస్థులను తీసుకువెళుతున్న ఒక ఓడలో దక్షిణాఫ్రికాకు పయనమయ్యారు. తన ప్రయాణమంతటిలో కూడా నేరస్థుల యొక్క ఆత్మీయ మరియు భౌతికపరమైన అవసరతలను తీర్చుటకు అతను నిర్విరామంగా పనిచేశారు.



    దక్షిణాఫ్రికాలో అతను వివిధ ప్రదేశాలలో పరిచర్య చేశారు. అక్కడి రాజు ఆ ప్రాంతమును విడిచి వెళ్ళిపొమ్మని అతనిని ఆదేశించిన పిమ్మట అతను దక్షిణాఫ్రికా యొక్క సంచార ప్రజలైన హాటెంటాట్ అనే తెగవారి కొరకు ఒక ప్రత్యేకమైన సేవను ప్రారంభించారు. 1803వ సంll లో అతను అల్గోవా బే సమీపంలో బెథెల్స్‌డోర్ప్ అనే మిషన్ స్టేషన్‌ను స్థాపించారు. దాని ద్వారా అతను హాటెంటాట్ ప్రజలకు సువార్తను ప్రకటించారు, నాగరికతను నేర్పించారు మరియు వారిని ఒక సమాజముగా తీర్చిదిద్దారు. ఏడు సంవత్సరాల వ్యవధిలో అక్కడ ఆరాధన కూడిక కొరకు సమకూడే వారి సంఖ్య వెయ్యి లెక్కకు చేరుకుంది.



    అక్కడ ప్రబలముగా ఉన్న బానిస వ్యాపారం యొక్క క్రూరత్వం మంచి మనసుగల ఈ వైద్యుడికి ఎంతో బాధను కలిగించింది. కాగా, అతను బీదలైన బందీలను విడిపించుటకు తనకు కలిగినదంతటినీ వెచ్చించారు. చివరికి అతని ప్రయత్నాల వలన ఇతరులు సహకారమందించగా హాటెంటాట్ ప్రజలు స్వేచ్ఛను పొందారు. 1811వ సంll లో ఈ లోకమును విడిచి ప్రభు సన్నిధానమును చేరుకున్న అతని పరిచర్య ఎక్కువ కాలవ్యవధిని కలిగియుండకపోయినప్పటికీ, అతను ఆది సంఘము యొక్క అపొస్తలుల వంటి ఒక అద్భుతమైన దైవసేవకులు అని చెప్పబడుతుంది.



    ధైర్యవంతులైన ఈ గొప్ప మిషనరీ ఒక గొప్ప సమాజం నుండి వచినవారైనప్పటికీ అత్యల్పులైనవారితో కలిసియుండి వస్త్రధారణ కూడా ఎరుగని పేద హాటెన్‌టాట్‌ ప్రజల జీవితములలో వెలుగును నింపుటకు అన్నింటినీ విడిచి వచ్చారు. ఏలయనగా వారు కూడా దేవుని ప్రేమను తెలుసుకొనుటకు అర్హులని థియోడోరస్ బాగుగా ఎరిగియున్నారు!


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, దేవుని ప్రేమను పంచుకొనుటకై మీరు ఎవరిని వెతుకుతూ వెళుతున్నారు? 

    ప్రార్థన :

    "ప్రభువా, థియోడోరస్ వలె ధైర్యముతోను మరియు నమ్మకముగాను మిమ్ములను సేవించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • జాన్ లివింగ్‌స్టన్ నెవియస్ | John Livingston Nevius

    జాన్ లివింగ్‌స్టన్ నెవియస్ జీవిత చరిత్ర



    • జననం: 04-03-1829
    • మహిమ ప్రవేశం: 19-10-1893
    • స్వస్థలం: సెనెకా కౌంటీ
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: చైనా




    అమెరికాకు చెందిన జాన్ లివింగ్‌స్టన్ నెవియస్ చైనాలో నలభై సంవత్సరాల పాటు దేవుని సేవ చేసిన మిషనరీ. అతని పరిచర్య మరియు దేశీయ క్రైస్తవ సంఘ స్థాపన పై అతను చేసిన రచనలు చైనా మరియు కొరియా దేశాలలోని మిషనరీలను అతను జీవించియున్న కాలములోనే కాక అతని మరణానంతరం కూడా ఎంతో ప్రభావితం చేసినవిగా ఉన్నాయి.




    న్యూయార్క్‌లోని యూనియన్ కాలేజీలో చదువు పూర్తిచేసుకొనిన పిమ్మట నెవియస్ వేదాంతశాస్త్రమును అభ్యసించుటకుగాను ప్రిన్స్టన్ సెమినరీలో చేరారు. అక్కడ చదువుతున్న సమయంలో మిషనరీ సేవకైన తన పిలుపును గ్రహించిన అతను దానిని గొప్ప భాగ్యముగా ఎంచారు. కాగా అతను ‘ప్రెస్బిటేరియన్ బోర్డ్ ఆఫ్ మిషన్స్’ సంస్థకు దరఖాస్తు పెట్టుకొనగా, ఆ సంస్థ అతనిని చైనాలోని నింగ్పోలో సేవ చేయుటకు నియమించింది. తద్వారా తన భార్యయైన హెలెన్‌తో కలిసి 1853వ సంll లో చైనాకు పయనమైన అతను, ఆరు నెలల తరువాత నింగ్‌పోకు చేరుకున్నారు.




    చైనాలో అతను ఏడాదిలో అధిక భాగం సంచార బోధకునిగా సేవ చేస్తూ, మిగిలిన సమయంలో మిగుల తీవ్రముగా యేసుక్రీస్తుని శిష్యులుగా మారుటకు శిక్షణనిచ్చేవారు. పరిచర్య నిమిత్తం అతను చేసే ప్రయాణాలు ఎంతో కష్టతరమైనవి. ఆ ప్రయాణాలు అధికశాతం గుర్రంపై చేసే ప్రయాణాలుగా ఉండేవి. నెవియస్ ప్రధానముగా స్వయం ఆధారిత సంఘములను స్థాపించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పేవారు. మిషనరీలు ఇతర దేశాల నుండి జీతాలు పొందే విధానమునకు వ్యతిరిక్తులైన నెవియస్, అందుకు బదులుగా విశ్వాసము పై ఆధారపడి సేవ చేయమని తన సహపరిచారకులను ప్రోత్సహించేవారు. మిషన్ యొక్క నిధులతో అధికారిక చర్చి భవనాలను మరియు ఉపకరణములను నిర్మించే విధానమును అతను విశ్వసించలేదు. అయితే విశ్వాసులు తాము ఆశీర్వదింపబడులాగున వారు ఎంత అల్పులైనా ఆరాధనా కూడికలు నిర్వహించుట కొరకు కావలసిన ఏర్పాట్లను తామే స్వయంగా సిద్ధపరచుకొనవలెనని అతను వేడుకొనేవారు. అతని పరిచర్య పద్ధతులు స్థానిక సంఘ కార్యకలాపాలపై పాశ్చాత్య ప్రభావాన్ని తగ్గించాయి మరియు సంఘమునకు దేశీయతను చేకూర్చాయి. అయితే విదేశీ నిధులపైనే అధికముగా ఆధారపడియున్న అతని స్వంత సహచరులే అతని పద్ధతులను తీవ్రంగా విమర్శించారు.




    1877వ సంll లో చైనాలో తీవ్రమైన కరువు సంభవించినప్పుడు సహాయక చర్యలలో తోడ్పాటునందించిన నెవియస్, దాని మూలముగా అనేకమందికి సువార్తను అందించగలిగారు. పరిశుద్ధాత్మ దేవుడు వారికి లేఖనముల రహస్యములను బయలుపరుచునట్లు అన్యజనులకు మొదట యేసు క్రీస్తును తెలియపరచిన తరువాతనే బైబిలును ఇవ్వవలెనని అతను నిర్ధిష్టముగా చెప్పేవారు.




    చైనా మరియు కొరియాలలో అభివృద్ధి చెందుతున్న క్రైస్తవ సంఘ స్థాపనకు కారణమైన ఈ అలుపెరుగని దేవుని పరిచారకుడు 1893వ సంll లో తన పరలోకపు వాసస్థలమును చేరుకున్నారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 


    ప్రియమైనవారలారా, విశ్వాసముపైనే ఆధారపడి దేవుని సేవచేసేవారిగా మీరు ఉన్నారా?


    ప్రార్థన :


    "ప్రభువా, ఎల్లప్పుడూ నిలిచియుండగలిగే ఆత్మీయ ఫలములను ఫలించుటకు నేను మీ పైనే ఆధారపడునట్లు చేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • జాన్ వాన్ ఎస్ | John van Ess

    జాన్ వాన్ ఎస్  జీవిత చరిత్ర





    • జననం: 1879
    • మహిమ ప్రవేశం: 1949
    • స్వస్థలం: న్యూ హాలండ్
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: మధ్య తూర్పు ప్రాంతము




    బైబిలు గ్రంథములో పేర్కొనబడిన దానియేలు మొదట బబులోను రాజ్యములో చెరపట్టబడిన యూదునిగా ఉన్నాడు. అయితే దేవుడు బబులోను సంస్థానమంతటి మీద అధిపతిగా అతనిని హెచ్చించాడు. ఆ విధంగానే కొన్నిసార్లు ఒక దేశం యొక్క రాజకీయ స్థితిగతులలో మార్పును తీసుకువచ్చుటకు దేవుడు తన ప్రజలను వాడుకుంటాడు. అటువంటి దైవ సేవకులలో మధ్య తూర్పు (మధ్యప్రాచ్యం) ప్రాంతములో సేవ చేసిన ‘ది డిప్లొమాటిక్ మిషనరీ’ అని పిలువబడే జాన్ వాన్ ఎస్ కూడా ఒకరు.




    ప్రిన్స్‌టన్ సెమినరీ నుండి పట్టభద్రులైన తరువాత అరబిక్ భాషను అభ్యసించుటకు మొదట బహ్రెయిన్‌కు పంపబడిన జాన్, తదుపరి ఇరాక్‌లోని బస్రాలో సేవ చేయుటకు నియమించబడ్డారు. ఆరంభములో కొన్ని సంవత్సరాల పాటు అతను ఇరాక్‌లో ఎడారులలో నివసించే వివిధ తెగలవారి మధ్య సంచరిస్తూ సువార్తను ప్రకటించారు మరియు వారికి వైద్య సంరక్షణను అందించారు. అయితే వారి ఆసక్తి కేవలం భౌతిక ప్రయోజనాలపై మాత్రమే గానీ సువార్త పై ఉండేది కాదు. అయినప్పటికీ అతను తన ప్రయత్నములను విరమించుకొనక, తన పరిచర్య యొక్క దృష్టిని పెద్దల నుండి పిల్లల వైపుకు మళ్లించారు. తన భార్య డోరతీతో కలిసి అతను 1912వ సంll లో బస్రాలో “హై హోప్ ఫర్ బాయ్స్” మరియు “ది స్కూల్ ఆఫ్ ఉమెన్స్ హోప్” అనే రెండు పాఠశాలలను స్థాపించారు. ఆ పాఠశాలల ద్వారా అరబ్బులను సువార్త వెలుగులోనికి తీసుకువచ్చుటకు అతను ఎంతో శ్రమించారు.




    జాన్ వాన్ ఎస్ వివిధ దేశాల మధ్య చర్చలను నడిపించగలిగే తన దౌత్య నైపుణ్యాలకు పేరుగాంచారు. ఆ నైపుణ్యముతో అతను ఒకరితో ఒకరు పోరాడుతున్న అరబ్బుల మధ్య శాంతిని నెలకొల్పారు. అతను టర్కీ మరియు ఇరాక్ దేశాల మధ్య నెలకొనియున్న అనేక విభేదాలను పరిష్కరించారు మరియు పలు యుద్ధాలను నివారించడంలో కీలకపాత్ర పోషించారు. ఒకసారి అతను టర్కీ ప్రభుత్వానికి మరియు ఈజిప్టు తెగకు మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించుటకు వెళ్ళగా, అక్కడ ఈజిప్టువారు అతను టర్కీ యొక్క గూఢాచారి అని అతనిన అభియోగాలు మోపారు. తద్వారా అతను అనేక వారాల పాటు జైలు శిక్షను అనుభవించారు మరియు దాదాపు చంపబడ్డారు కూడా. అతను చనిపోయాడని భావించి టర్కీ ప్రభుత్వం అతని పై ఆశలు వదులుకుంది. అయితే ధైర్యవంతుడైన ఈ మిషనరీ చివరికి ఖైదు నుండి బయటకు వచ్చి ఈజిప్షియన్లకు మరియు టర్కులకు మధ్య స్నేహబంధాన్ని ఏర్పరిచారు. క్రీస్తు యొక్క ప్రేమాసహనములను వారికి చూపించడం ద్వారా శత్రు వర్గాల మధ్య శాంతిని నెలకొల్పుటకు అతను కలిగియున్న సమర్పణ అటువంటిది!




    ఒక గొప్ప బోధకుడు, కనికరముగల స్నేహితుడు మరియు ఆశీర్వదించబడిన శాంతిదూత అయిన జాన్ వాన్ ఎస్, 1949వ సంll లో మరణమొందేంత వరకు కూడా దేవుని పిలుపుకు విధేయులుగా జీవించారు.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 


    ప్రియమైనవారలారా, మీరు శాంతిని నెలకొల్పే జీవితమును కలిగియున్నారా?


    ప్రార్థన :


    "ప్రభువా, దయాకనికరములు లేని ఈ హింసాత్మక ప్రపంచంలో నన్ను ఒక శాంతి సాధనముగా చేసుకొనుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Apr 9, 2022

    James Calvert | జేమ్స్ కాల్వర్ట్

    జేమ్స్ కాల్వర్ట్ జీవిత చరిత్ర



    • జననం : 03-01-1813
    • మరణం : 08-03-1892
    • స్వస్థలం : పికరింగ్, యార్క్‌షైర్
    • దేశం       : ఇంగ్లాండు 
    • దర్శన స్థలము : ఫిజి దీవులు మరియు దక్షిణాఫ్రికా


    యార్క్‌షైర్‌కు చెందిన మెథడిస్టు మిషనరీయైన జేమ్స్ కాల్వర్ట్, ఫిజీ దీవులలో చేసిన సేవకు పేరుగాంచారు. అతనికి పదునాలుగు ఏళ్ళ వయస్సు ఉన్నపుడు అచ్చువేసి, పుస్తకాలను బైండ్ చేసే ఒక వ్యక్తి వద్ద సహాయకునిగా చేరి, ఏడు సంll ల పాటు అక్కడ పనిచేశారు. ముద్రణ మరియు పుస్తకాల తయారీలో అప్పుడు అతను సంపాదించిన నైపుణ్యం తరువాతి కాలంలో అతను చేసిన పరిచర్యలో విస్తృతంగా ఉపయోగించబడింది. 1837వ సంll లో అతను 'హొక్స్టన్ థియోలాజికల్ కాలేజీ' లో చేరారు. కానీ మిషనరీలైన జాన్ హంట్ మరియు థామస్ జాగర్లతో అతనిని కూడా ఫిజి దీవులకు పంపినందు వలన అతని వేదాంత విద్యాభ్యాసం మధ్యలోనే నిలిపివేయబడింది. వారందరూ 1838వ సంll డిసెంబరు మాసంలో ఫిజి ద్వీపమైన లకెంబాకు చేరుకున్నారు.


    అక్కడి స్థానిక భాషలో కాల్వర్ట్ చాలా త్వరగా ప్రావీణ్యం సంపాదించారు. నరమాంస భక్షకుల మధ్య జీవించడం మరియు దేవుని ప్రేమతో వారికి సేవ చేయడం అంత సులభమైన కార్యం కాదు. అంతేకాకుండా, స్వదేశం నుండి పంపబడవలసిన సరుకులు సక్రమంగా సరఫరా చేయబడేవికావు, పైగా ఆరోగ్య సమస్యలు. వాటన్నింటిలోనూ అతని భార్యయైన మేరీ ఫౌలర్ ఒక గొప్ప సహకారిగా అతని వెనువెంట నిలిచి, పరిచర్యలో అమూల్యమైన సేవలను అందించారు.


    1848వ సంll లో ఫిజీలోని మరొక ద్వీపమైన వివా ద్వీపములో సేవ చేయుటకు కాల్వర్ట్‌ నియమించబడ్డారు. అతని పరిచర్యలో పేర్కొనదగిన ఒక విషయం ఏమిటంటే ఫిజి సంయుక్త ద్వీపాల రాజైన రతు సెరు థకోంబౌ మారుమనస్సు పొంది క్రైస్తవునిగా మారడం. ఫిజీ ద్వీపాలలో రెండు విభాగాలలో అతను అందించిన సేవలు ప్రత్యేకమైనవిగాను, ముఖ్యమైనవిగాను పేర్కొనవచ్చు. ఒకటి ఫిజి ప్రజలకు బైబిలును అందించడం, రెండవది స్థానిక యుద్ధాలలో మరియు అక్కడ స్థిరపడిన విదేశీయులకు మరియు స్థానికులకు మధ్య తలెత్తే విభేదాలలో మధ్యవర్తి పాత్రను పోషించడం. ఫిజి భాషలోకి డేవిడ్ హాజిల్‌వుడ్ అనువదించిన పాత నిబంధన యొక్క ప్రతులను తీసుకొని 1855వ సంll లో అతను ఇంగ్లాండు‌కు తిరిగి వెళ్ళారు. అక్కడ ఫిజి భాషలోని క్రొత్త నిబంధన యొక్క 10,000 కాపీలను మరియు ఫిజి బైబిలు యొక్క 5000 కాపీలను ఉత్పత్తి చేయుటలో సహకారమందించారు. తదుపరి 1861వ సంll లో తిరిగి ఫిజికి వచ్చిన కాల్వర్ట్‌, 1865వ సంll జనవరి మాసం వరకు అక్కడ సేవ చేశారు.


    1872వ సంll లో దక్షిణాఫ్రికాలో పనిచేయడానికి నాయకత్వ నైపుణ్యాలు కలిగిన మిషనరీ అవసరమని తెలుసుకొనిన కాల్వర్ట్, ఆ అవసరతను తీర్చుటకై స్వచ్చందంగా ముందుకు వచ్చారు. అక్కడి క్రైస్తవ సంఘములలో శ్వేతజాతీయులు ఆరాధన కూడికలో ఆఫ్రికావారితో కలిసి కూడుకొనుటకు అంగీకరించేవారు కాదు. అటువంటి అసమానతలతో నిండియున్న సంఘములో కాల్వర్ట్ ప్రేమా సహనములతో పరిచర్య చేశారు. కొన్ని సంవత్సరాల పాటు దక్షిణాఫ్రికాలో సేవ చేసిన తరువాత 1881వ సంll లో అతను స్వదేశానికి తిరిగి వచ్చారు. తదుపరి 1886వ సంll లో ఫిజీ దీవులను మరొక పర్యాయం దర్శించారు. తన జీవితాంతం దేవుని సేవలో కొనసాగిన జేమ్స్ కాల్వర్ట్, 1892వ సంll లో తన పరలోకపు వాసస్థలమునకు చేరుకున్నారు.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీరు కలిగియున్న తలాంతులు మరియు నైపుణ్యాలను ఆయన పరిచర్యలో ఉపయోగించుటకు వాటి పట్ల దేవుడు ప్రణాళికను కలిగియున్నాడని మీరు గ్రహించగలుగుతున్నారా?

    ప్రార్థన :

    "ప్రభువా, సమాజములోను మరియు మీ సంఘములోను శాంతిసమైక్యతలను నెలకొల్పుటకు నాకు భారము దయచేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • John de Britto | జాన్ డి బ్రిట్టో

    జాన్ డి బ్రిట్టో జీవిత చరిత్ర



    • జననం : 01-03-1647
    • మరణం : 04-02-1693
    • స్వస్థలం : లిస్బన్
    • దేశం : పోర్చుగల్
    • దర్శన స్థలము : భారతదేశం

    చాలా మంది మిషనరీలు దేవుని సేవ నిమిత్తం స్వదేశాన్ని విడిచిపెట్టారు. కానీ కొద్దిమంది మాత్రమే తమ మాతృభూమిని మాత్రమే కాక, తమ కుటుంబం, సంస్కృతి, ఆహారపు అలవాట్లు మరియు వేషధారణలను కూడా విడిచిపెట్టి, వారు సేవ చేస్తున్న పరదేశానికి అనుగుణంగా వారిని మలుచుకున్నారు. వారు ఆ విధంగా చేసింది ఏదో క్రొత్తదానిని అవలంబించాలన్న ఆకర్షణతో కాదు, అనేకులను లోకరక్షకుని వైపు ఆకర్షించుట కొరకు!

    ఒక గొప్ప కుటుంబంలో జన్మించిన జాన్ డి బ్రిట్టోకు రాజ దర్బారులో ఉజ్వలమైన భవిష్యత్తు ఉండేది. కానీ అతని హృదయం ఇహలోక కీర్తి వెంబడి వెళ్ళలేదు. చిన్న వయస్సులోనే ఫ్రాన్సిస్ జేవియర్ జీవితం అతనిపై లోతైన ముద్ర వేసింది. అది మిషనరీ మార్గాన్ని ఎంచుకొనుటకు అతని అడుగులకు మార్గ నిర్దేశం చేసియుండవచ్చు. కాగా 15 ఏళ్ళ వయసులో అతను "సొసైటీ ఆఫ్ జీసస్" లో చేరారు. చదువు పూర్తయిన తరువాత సెయింట్ ఆంటోనీ కాలేజీలో అతను బోధించడం ప్రారంభించినప్పటికీ, భారతదేశంలో మిషనరీగా సేవ చేయుటకు అంతర్గతంగా అతని ప్రణాళికలు కొనసాగుతున్నాయి. చిన్న వయస్సులోనే తన భర్తను కోల్పోయిన అతని తల్లి, అతనిని ఆపడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ ఏవీ కూడా అతనిని నిర్భధించలేక పోయాయి.



    1673వ సంll లో గోవా చేరుకున్న అతను, అక్కడ కొంతకాలం స్థానిక భాషలను అధ్యయనం చేసిన పిమ్మట, క్లిష్టమైన పర్వతాలు మరియు అరణ్య మార్గాల గుండా మదురాకు కాలినడకన పయనమయ్యారు. అయితే అంతకంటే కష్టతరమైన అవరోధం అతని కొరకు వేచియుంది. అది భారతదేశ కుల వ్యవస్థ! దానిలోకి చొచ్చుకుపోవుటకుగాను అతను దేహానికి కాషాయ వస్త్రాన్ని, తలకు ఒక తలపాగాను మరియు కాళ్ళకు చెక్కతో చేసిన చెప్పులను ధరించి, కఠినమైన శాకాహారిగా మారి, తన పేరును ‘అరుళ్ ఆనందర్’ గా మార్చుకున్నారు. నిష్ఠ కలిగిన జీవితాన్ని జీవిస్తూ తనను ఒక సన్యాసిగా చిత్రీకరిస్తూ, అతను ఉన్నత కులాలకు చెందినవారి ఆత్మలను గెలుచుకోగలిగారు. అయితే అట్టడుగు వర్గాల వారిని ఏనాడూ నిర్లక్ష్యం చేయని బ్రిట్టో, 'పరియా' అనే తక్కువ కులం వారి మధ్య కూడా సేవ చేశారు.



    ఫలవంతమైన పరిచర్యతో పాటు శ్రమలు కూడా పెరిగాయి. ఎంతో గొప్ప హింసను, చిత్రవధలను అనుభవించిన తరువాత అతను భారతదేశం విడిచి వెళ్ళవలసి వచ్చింది. తద్వారా లిస్బన్ నగరానికి తిరిగి వెళ్ళిన అతను, అక్కడ సుమారు రెండు సంll లు గడిపిన పిమ్మట 1690వ సంll లో మరొకసారి తనకు ప్రియమైన దేశానికి ప్రయాణమయ్యారు. ఈ పర్యాయం అతను మరలా తిరిగి వెళ్ళలేదు. రామ్‌నాథ్ (రామనాథపురం) యొక్క రాజు అతనిని బంధించి, అతనికి శిరచ్ఛేదనం చేయబడవలెనని ఆదేశించాడు. 'పోర్చుగీస్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్' అని భారతీయులచే పిలువబడే జాన్ డి బ్రిట్టో, ఆ ప్రజల కొరకే తన ప్రాణాన్ని త్యాగం చేశారు.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

     ప్రియమైనవారలారా, మీ ప్రభువు కొరకు మీరేమి త్యాగం చేశారు? 

    ప్రార్థన :

    "ప్రభువా, సమస్తమును నష్టముగా ఎంచుకొని, మీ ఉన్నతమైన పిలుపును చేరుకొనుటకు గురి యొద్దకే నేను పరుగెత్తునట్లు నాకు కృప దయచేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Apr 7, 2022

    John Wesley | జాన్ వెస్లీ

    జాన్ వెస్లీ జీవిత చరిత్ర




    • జననం : 17-06-1703
    • మరణం : 02-03-1791
    • స్వస్థలం : లింకన్‌షైర్
    • దేశం       : ఇంగ్లాండు 
    • దర్శన స్థలము : ఇంగ్లాండు


    ఆంగ్లేయుడైన జాన్ వెస్లీ ఒక క్రైస్తవ మతాధికారి మరియు సువార్తికుడు. అతను తన సోదరుడైన చార్లెస్ వెస్లీ‌తో కలిసి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో మెథడిస్ట్ ఉద్యమానికి పునాది వేశారు. ఒక దైవభక్తి గల కుటుంబంలో జన్మించిన వెస్లీ, క్రైస్తవ విలువలతో, కఠినమైన క్రమశిక్షణతో పెరిగారు. ఆక్స్‌ఫర్డ్‌లోని ‘క్రైస్ట్ చర్చ్’ నుండి పట్టా పొందిన పిమ్మట 1725వ సంll లో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో డీకన్‌గా నియమితులయ్యారు. ఆక్స్‌ఫర్డ్‌లో ఉన్నప్పుడు అక్కడి ‘హోలీ క్లబ్’ లో చురుకైన సభ్యునిగా ఉన్న వెస్లీ,  ప్రార్థనలు, బైబిలు పఠనాలు మరియు చెరసాల పరిచర్యలో ఉత్సాహంగా పాల్గొనేవారు. అతను 1728వ సంll లో పాదిరిగా నియమించబడి ఉత్తర లింకన్‌షైర్‌లో పరిచర్య ప్రారంభించారు.


    జేమ్స్ ఓగెల్‌థార్ప్ యొక్క అభ్యర్థన మేరకు 1735వ సంll లో అతను న్యూ వరల్డ్ (జార్జియాలో కొత్తగా స్థాపించబడిన కాలనీ) లోని ప్రజలకు సువార్త వెలుగును ప్రసరింపజేయవలెనని ఎంతో ఆసక్తితో బయలుదేరారు. అయితే అక్కడ చేసిన సేవ అతనికి నిరాశను కలిగించింది. ఏదేమైతేనేమి, అక్కడ ఉన్న సమయంలో జర్మనీ దేశానికి చెందిన మొరావియన్ మిషనరీలను కలుసుకున్న అతను, వారిచే తీవ్రంగా ప్రభావితమయ్యారు. వారి యొక్క ఆత్మీయ నిశ్చయత మరియు క్రియారూపకమైన క్రైస్తవ్యం అతనిపై లోతైన ముద్రను వేశాయి.


    ఇంగ్లాండుకు తిరిగి వచ్చిన తరువాత ఒకసారి రోమీయులకు వ్రాసిన పత్రికకు మార్టిన్ లూథర్ వ్రాసిన 'ముందుమాట' చదువబడుచుండగా వినిన వెస్లీ, తద్వారా ఆత్మీయ మారు మనస్సు యొక్క అనుభవంలోనికి వచ్చారు. కాగా నూతనపరచబడిన ఆత్మతో అతను ‘క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారానే రక్షణ’ అను సత్యమును గూర్చి బోధించడం ప్రారంభించారు. ఆ విధంగా ఒక చోటి నుండి మరొక చోటికి ప్రయాణిస్తూ అతను 50 సంll కు పైగా తన పరిచర్యను కొనసాగించారు. క్రైస్తవాలయానికి వెలుపల కూడా బోధించుటకు అతను కలిగియున్న సంసిద్ధత కారణంగా 'చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్' నిర్లక్ష్యం చేసిన జనసమూహాలకు కూడా సువార్త ప్రకటించబడింది. ఒక బలమైన ఉజ్జీవం లేపబడి ఇంగ్లాండు దేశంలో ఆత్మీయ జ్వాలలను రగిలించగా వేలాది మంది యేసు క్రీస్తును అంగీకరించారు. అతను బోధించే వాక్య పరమైన క్రైస్తవ విలువలను అంగీకరించుటకు ఇంగ్లాండులోని క్రైస్తవ సంఘం విముఖత చూపుట వలన అతను వ్యక్తిగత సమాజాలను ఏర్పరచవలసి వచ్చింది. వాటిలో చేరిన వారు ప్రతి వారం క్రమపద్ధతిలో బైబిలు పఠనములకు మరియు ప్రార్థనలకు కూడుకొనెడివారు. అందువలన వారు విమర్శకులచే ‘మెథడిస్టులు’ (నిబద్ధత కలిగినవారు) అని పిలువబడ్డారు. తాను ఎదుర్కొంటున్న వ్యతిరేకతను మరియు శ్రమలను సహిస్తూ జాన్ వెస్లీ ఇంగ్లాండు దేశమంతటా పర్యటించి మెథడిస్టు సమాజాలను స్థాపించారు. అతను 1791వ సంll లో ఈ లోకములో తన పరుగును ముగించేంత వరకు కూడా వ్యక్తిగత క్రమశిక్షణను అవలంబిస్తూ క్రమబద్ధమైన జీవితమును జీవించారు.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీ జీవితం ఎటువంటి నిబద్దత మరియు క్రమశిక్షణ కలిగి ఉంది?

    ప్రార్థన :


    "ప్రభువా, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని జీవిస్తూ, నా తుది శ్వాస వరకు కూడా మీ పరిచర్యలో చురుకుగా పాలుపొందుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!"


    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • George Wishart | జార్జ్ విషార్ట్

    జార్జ్ విషార్ట్ జీవిత చరిత్ర



    • జననం : 1513
    • మరణం : 1546
    • స్వస్థలం : మాంట్రోస్
    • దేశం         : స్కాట్లాండు 
    • దర్శన స్థలము : స్కాట్లాండు


    మాంట్రోస్‌లోని ఒక ఉన్నత కుటుంబములో జన్మించిన జార్జ్ విషార్ట్ మంచి విద్యాభ్యాసాన్ని కలిగియున్నారు. లూవెన్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన అతను, మాంట్రోస్‌లోని ఒక పాఠశాలలో గ్రీకు బోధించడం ప్రారంభించారు. అక్కడ అతను క్రొత్త నిబంధనను గ్రీకు భాషలో చదవమని విద్యార్థులకు బోధించినందుకుగాను తప్పుడు మత విశ్వాసాలను బోధిస్తున్నవానిగా ఆరోపణలు ఎదుర్కున్నారు. కాబట్టి అతను తన దేశమును విడిచి పారిపోయి, ఐరోపా ఖండమంతటా పర్యటిస్తూ ప్రొటెస్టంట్ వేదాంతశాస్త్రం గురించి స్పష్టమైన అవగాహన పొందుటకు ప్రయత్నించారు. 1542వ సంll లో అతను కేంబ్రిడ్జిలోని కార్పస్ క్రిస్టి కళాశాలలో చేరగా, అక్కడ అతను స్విట్జర్లాండు మరియు జర్మనీ దేశాలకు చెందిన క్రైస్తవ సంస్కర్తల బోధనల ద్వారా చాలా ప్రభావితులయ్యారు.


    కాగా సత్యాన్ని బోధించవలెనన్న శ్రద్ధాసక్తులతో అతను 1543వ సంll లో స్కాట్లాండు‌కు తిరిగి వచ్చారు. అది అతని ప్రాణాలకే ప్రమాదకరముగా మారింది. ఒకసారి అతనిపై జరిగిన హత్యాప్రయత్నం నుండి అతను కొద్దిలో తప్పించుకున్నారు. అయినప్పటికీ వెనుకంజవేయక పోప్ యొక్క లోపాలను మరియు క్రైస్తవ సంఘములో నెలకొనియున్న ఆత్మీయ దౌర్భాగ్యమును ఖండిస్తూ అతను స్కాట్లాండు దేశమంతటా పర్యటించారు. ఆర్‌షైర్‌లో పరిచర్య చేస్తున్నప్పుడు డండి అనే ప్రాంతంలో ప్లేగు వ్యాధి వ్యాపిస్తుందని తెలుసుకొనిన జార్జ్, వెంటనే అక్కడికి వెళ్ళారు. ఆ తెగులు దాదాపు పూర్తిగా కనుమరుగయ్యే వరకు కూడా బాధితుల ఆత్మీయ మరియు భౌతిక అవసరతలను తీరుస్తూ అక్కడే ఉన్నారు. ఆ సమయములో అతను ప్లేగు కంటే ప్రాణాంతకమైన పాపమనే తెగులు గురించి వారికి తెలియజేస్తూ, యేసు క్రీస్తు పొందిన గాయముల ద్వారా ఆ తెగులు నుండి ఏ విధంగా స్వస్థత పొందగలరో వారికి బోధించారు.


    డండీలో అతను చేసిన నమ్మకమైన పరిచర్య కారణముగా అత్యాగ్రహులైన కార్డినల్ బీటన్‌, అతనిని చంపుటకు కుట్ర పన్నారు. అటువంటి సమయంలో తరువాతి కాలంలో ప్రొటెస్టంట్ సంస్కరణకు నాయకుడయ్యిన జాన్ నాక్స్ అనే యువకుడు విషార్ట్‌కు అంగరక్షకునిగా సేవలందించాడు. తదుపరి తన పైన మోపబడిన ఆరోపణలన్నింటికీ దేవుని వాక్యములో వ్రాయబడినవి చూపిస్తూ సమాధానమిచ్చినప్పటికీ,  అతనిని బంధించి, మరణశిక్ష విధించారు. అతనిని కాల్చివేసే ముందు, అక్కడ అతను తనను నిందించిన వారి కొరకు ప్రార్థన చేసి, వారి పట్ల తన క్షమాపణను వెల్లడిపరిచారు. సుదీర్ఘ కాలం అతను సువార్త పరిచర్య చేయనప్పటికీ, అతని బోధనలు ప్రజలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపాయి. అవి పదహారవ శతాబ్దపు మధ్యభాగంలో ప్రొటెస్టంట్ సంస్కరణకు పునాది వేశాయి.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీరు తప్పుడు బోధలను ఎదిరించి, సత్య మార్గములోనికి ప్రజలను నడిపిస్తున్నారా? 


    ప్రార్థన :

    "ప్రభువా, తప్పుడు బోధలను ఎదిరించి నిలబడుటకు నాకు వివేకమును మరియు ధైర్యమును దయచేయుము. ఆమేన్!"


    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Johannes Gutenberg | జోహన్నెస్ గుటెన్‌బర్గ్

    జోహన్నెస్ గుటెన్‌బర్గ్ జీవిత చరిత్ర





    • జననం : ~1398
    • మరణం : 1468
    • స్వదేశం : జర్మనీ
    • దర్శన స్థలము : -


    బైబిల్ అంటే దేవునికి మానవాళికి మధ్య ఉన్న అద్భుతమైన ప్రేమకథ అని వర్ణించవచ్చు. ఆ కథను ప్రతి ఒక్కరూ వినడం ఆవశ్యకం! పరిశుద్ధ లేఖనములు దేవుని యొక్క ప్రేరణతో ఇవ్వబడ్డాయి మరియు ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును అవి ప్రయోజనకరమైయున్నవి. అత్యంత శ్రేష్ఠమైన ఈ అద్భుత గ్రంథం ఈ నాడు మన చేతులలో ఉందంటే, దానిని పరిశీలించి, ప్రతులను తయారు చేసి, పురాతన భాషలలో నుండి ఆధునిక భాషలలోనికి అనువదించడంలో ఎంతోమంది దేవుని బిడ్డలు చేసిన త్యాగాలే కారణం. అలాంటి వారిలో ఒకరే జోహన్నెస్ గుటెన్‌బర్గ్.


    జర్మనీ దేశానికి చెందిన జోహన్నెస్ గుటెన్‌బర్గ్ ఒక లోహకారుడు, ముద్రణ లేదా అచ్చువేసేవాడు మరియు ప్రచురణకర్త. అతను 1450వ సంll లో ప్రపంచంలోని మొట్టమొదటి ముద్రణాయంత్రాన్ని కనుగొన్నారు. జర్మనీలోని మెయిన్జ్ నగరంలో జన్మించిన అతను, తన తల్లిదండ్రులు మరియు సంపన్నులైన వారి యొక్క స్నేహితులు కలిగియున్న వ్రాతప్రతు‌లను చదువుటకు ఇష్టపడేవారు. అప్పటిలో పుస్తకములను కలిగియుండటం ధనవంతులకు మాత్రమే సాధ్యమని గ్రహించిన అతను, అందును బట్టి నొచ్చుకున్నారు. కాగా పుస్తకములను ముద్రించుటకు ఏదైనా ఒక సులభమైన మరియు శీఘ్రమైన మార్గాన్ని కనుగొనాలని నిర్ణయించుకున్నారు. కాగా అతను స్ట్రాస్‌బర్గ్‌లో ఒక శిధిలమైన భవనాన్ని అద్దెకు తీసుకొని, ముద్రణాయంత్రాన్ని కనుగొనుటకు పలు విధములైన పద్ధతులను అనుసరించి అక్కడ పరిశోధనలు జరిపారు. తన దగ్గర ఉన్న డబ్బు అయిపోయినప్పుడు, అతను మరొక లోహకారుడైన జోహాన్ ఫస్ట్ వద్ద ధనమును రుణముగా తీసుకున్నారు. ఏదేమైతేనేమి, చివరికి తాను అనుకున్నది సాధించిన గుటెన్‌బర్గ్, తన అద్భుతమైన ఆవిష్కరణను ఉపయోగించి మొదటిగా బైబిలును ముద్రించుటకు ఎంచుకున్నారు. కాగా 1455వ సంll లో ఒక చక్కటి లాటిన్ బైబిల్ రెండు సంపుటాలలో ముద్రించబడింది. వాటిలో ప్రతి సంపుటిలో మూడు వందల పేజీలు ఉన్నాయి. అయితే తాను సాధించిన గొప్ప పని నుండి గుటెన్‌బర్గ్ ఎటువంటి లాభమునూ పొందలేదు. ఎందుకంటే ఆ యంత్రం జోహాన్ ఫస్ట్ యొక్క స్వాధీనంలోకి వెళ్ళింది.


    గుటెన్‌బర్గ్ యొక్క ముద్రణాలయ ఆవిష్కరణ బైబిలు గ్రంథముల ఉత్పత్తిని మరియు సువార్త ప్రచారమును తీవ్రం చేసింది. బైబిలును ముద్రించుటలోనే కాదు, మార్టిన్ లూథర్ మరియు జాన్ కాల్విన్ వంటి వారి రచనలను ముద్రించుటలో కూడా ఆ యంత్రం ఉపయోగించబడి ప్రొటెస్టంట్ ఉద్యమం విజయం సాధించుటలో పాలుపంచుకుంది. అనేకమందికి సరఫరా చేయగలుగునంతగా బైబిలును ముద్రించడం దేవుని వాక్యమును చదువుటకు ప్రతి విశ్వాసిని ప్రోత్సాహపరిచింది. తద్వారా ఇది ప్రతి ఒక్కరూ కూడా తమ రక్షణకు తామే బాధ్యులమనే సత్యాన్ని గ్రహింపునకు తీసుకువచ్చింది. గుటెన్‌బర్గ్ చేసిన కృషి ఫలితముగా క్రైస్తవ్యం అనునది ఆలయ తలుపుల వద్దనే ముగియకుండా, ప్రతి విశ్వాసి యొక్క గృహము కూడా శిక్షణాలయముగా మారుటకు ద్వారం తెరువబడింది.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మానవాళి కొరకైన దేవుని ప్రేమ కథ ప్రతి ఒక్కరూ వినేలా మీరు కృషి చేస్తున్నారా? 


    ప్రార్థన :

    "ప్రభువా, నేను కలిగియున్న బైబిలుకై మీకు వందనములు. మీ యొక్క రాజ్య విస్తరణకై వినూత్నమైన పద్దతుల ద్వారా తోడ్పాటు నందించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • George Uglow Pope | జార్జ్ ఉగ్లో పోప్

    జార్జ్ ఉగ్లో పోప్ జీవిత చరిత్ర




    • జననం : 24-04-1820
    • మరణం : 11-02-1908
    • స్వస్థలం : ప్రిన్స్ ఎడ్వర్డ్ ద్వీపం
    • దేశం       : కెనడా
    • దర్శన స్థలము : భారతదేశం


    జార్జ్ ఉగ్లో పోప్ కెనడాకు చెందిన ఆంగ్ల క్రైస్తవ మిషనరీ. వర్తకుడు అయిన అతని తండ్రి తన వర్తకమును విడిచిపెట్టి కెనడాలోని నోవా స్కోటియాకు మిషనరీగా వెళ్ళారు. తదుపరి వారి కుటుంబం 1826వ సంll లో ఇంగ్లాండు‌కు వెళ్లింది. అక్కడ బరీ మరియు హొక్స్టన్‌లలో ఉన్న వెస్లియన్ పాఠశాలలలో జార్జ్ యొక్క విద్యాభ్యాసం సాగింది. చిన్నతనంలోనే మద్రాసులోని తమిళుల మధ్య జరుగవలసిన పరిచర్యను గురించి ఒక మిషనరీ మాట్లాడుచుండగా జార్జ్ వినడం జరిగింది. వెను వెంటనే అతను తమిళ భాషను నేర్చుకోవడం ప్రారంభించారు. అతను 1839వ సంll లో మద్రాసులోని వెస్లియన్ మిషన్‌లో చేరినప్పుడు అతనికి కేవలం 19 సంవత్సరాలు.


    1841వ సంll లో అతను సొసైటీ ఫర్ ది ప్రొపగేషన్ ఆఫ్ ది గాస్పెల్ (ఎస్. పి. జి.) (సువార్త విస్తరణ సంఘము) లో చేరగా, తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ట్యూటికోరిన్ జిల్లాలోని సాయర్పురం ప్రాంతమునకు అతను మిషనరీగా నియమించబడ్డారు. 1844వ సంll లో పాదిరిగా నియమించబడిన అతను, తదుపరి మిషన్ యొక్క ప్రాంతీయ సూపరింటెండెంట్ (పర్యవేక్షకులు) అయ్యారు. సువార్తను వివిధ ప్రాంతములకు మోసుకువెళ్ళుటకు అతను కలిగియున్న శక్తి సామర్థ్యములు మరియు ప్రేమకు హద్దులు లేవు. కాగా అవి ఎంతో గొప్ప ఫలితములను ఇచ్చాయి. నూతన మిషనరీలకు మరియు సేవకులకు శిక్షణనిచ్చుటకై అతను అక్కడ ఒక సెమినరీని స్థాపించారు. తిరునెల్వేలి ప్రాంతంలో కూడా జార్జ్ పరిచర్య చేశారు. 1845వ సంll లో అతని భార్య మరణించగా, మద్రాసులో కొంతకాలం సేవను కొనసాగించిన పిమ్మట అతను ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళారు.


    1851వ సంll లో భారతదేశానికి తిరిగి వచ్చిన అతను, ఎస్.పి.జి. క్రింద తంజావూరులో పనిచేయుటకు బాధ్యతలు చేపట్టారు. అయితే, శారీరక బలహీనతల కారణముగా ఎస్.పి.జి. నుండి విరమించుకొని, సాయర్పురం, ఉదకమండలం (ఊటీ) మరియు బెంగుళూరులలో పాఠశాలలను స్థాపించడంపై దృష్టి సారించారు. అతను ఆదర్శప్రాయమైన ఉపాధ్యాయుడు మరియు క్రమశిక్షణ గలవారు. కాగా, భారతీయ విద్యావ్యవస్థలో క్రమబద్ధమైన బోధనా పద్ధతులను ప్రవేశపెట్టినవానిగా జార్జ్ ఘనత పొందారు. రచనా సామర్థ్యం కూడా కలిగియున్న అతను, "తిరుక్కురల్" మరియు "తిరువాసగం" వంటి అనేక ప్రాముఖ్యమైన తమిళ సాహిత్య రచనలను ఆంగ్లంలోకి అనువదించారు. 1881వ సంll లో ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళి, అక్కడ ఆక్స్‌ఫర్డ్‌లోని ఒక కళాశాలలో బోధనను కొనసాగించారు. ‘పోప్ అయ్యర్’ అని గౌరవార్థకముగా పిలువబడే జి. యు. పోప్ 88 సంll ల వృద్ధాప్యంలో తన ప్రభువును చేరుకున్నారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, సువార్త ప్రకటించుట కొరకు ఎటువంటి నూతన విధానములను మీరు సాధన చేస్తున్నారు? 


    ప్రార్థన :

    "ప్రభువా, సువార్తను ప్రకటించుటలో నూతన విధానములను అవలంబించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"


    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp