Search Here

Showing posts with label C. Show all posts
Showing posts with label C. Show all posts

May 14, 2023

Charles Simeon | చార్లెస్ సిమియన్

చార్లెస్ సిమియన్  గారి జీవిత చరిత్ర

  • జననం : 1759
  • మహిమ ప్రవేశం : 1836
  • స్వస్థలం : బెర్క్‌షైర్
  • దేశం : ఇంగ్లాండు
  • దర్శన స్థలము : యునైటెడ్ కింగ్‌డమ్

చాలా మంది క్రైస్తవ విశ్వాసవీరులు ప్రపంచము యొక్క ఒక చివరి నుండి మరొక చివరికి ప్రయాణించడం ద్వారా వైవిధ్యమును కనుపరచగా, యాభై నాలుగు సంవత్సరాల పాటు ఒకే ప్రదేశంలో సేవ చేసిన చార్లెస్ సిమియన్ మరొక విధమైన వైవిధ్యమును కనుపరిచారు.


క్రైస్తవ కుటుంబంలో జన్మించినప్పటికీ, మొదటి నుండి కూడా సిమియన్‌కు ఏమాత్రం మతపరమైన ఆసక్తి లేదు. అయితే, అతను కింగ్స్ కళాశాలలో చదువుకుంటున్నప్పుడు ‘సొసైటీ ఫర్ ప్రమోటింగ్ క్రిస్టియన్ నాలెడ్జ్’ (క్రైస్తవ జ్ఞానమును అభివృద్ధి పరచు సంస్థ) అని పిలువబడే ఒక క్రైస్తవ సమూహం పట్ల ఆకర్షితులయ్యారు. ఈ సంస్థ ద్వారా సిమియన్‌కు అనేక ఆధ్యాత్మిక పుస్తకములను చదివే అవకాశం  కలుగగా, అది చివరికి 1779వ సంll లో అతను మారుమనస్సు పొందుటకు దారితీసింది. ఆర్ట్స్‌లో పట్టభద్రులైన అతను, తదుపరి ‘చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌’ కు పాదిరిగా నియమించబడ్డారు. సువార్త ప్రకటన గానీ, సువార్తకు సాక్ష్యులుగా ఉన్నవారు గానీ కేంబ్రిడ్జ్ ప్రాంతంలో ఎక్కువగా లేని సమయంలో సిమియన్ అక్కడ బోధించడం ప్రారంభించారు. సెయింట్ ఎడ్వర్డ్ సంఘములో కూడా బోధించిన అతను, పిమ్మట కేంబ్రిడ్జ్ లోని హోలీ ట్రినిటీ సంఘములో పూర్తి సమయం సేవచేయుటకు పాదిరిగా బాధ్యతలు చేపట్టారు. కాపరిగా అతని సంరక్షణలోను మరియు సువార్త కేంద్రబిందువుగా ఉండే అతని బోధనల ద్వారాను అభివృద్ధి చెందిన ఆ సంఘము, సువార్త సాక్ష్యమునకు మరియు ఆత్మీయ జీవితమునకు కేంద్రముగా ఆవిర్భవించింది.


సిమియన్ యొక్క పరిచర్యలో మూడు విషయములు కీలకమైన ప్రాధాన్యతను కలిగియున్నవి. వాటిలో మొదటిది, దేవుని పరిచర్య చేయుటకు మరియు బోధించుటకు యవ్వనస్థులను, మరి ముఖ్యముగా విద్యార్థులను ప్రోత్సహించడం. అతని రెండవ ప్రాధాన్యత మిషనరీ సేవ. అతను శుక్రాదివారాలలో సాయంకాల సమయములో తన గృహమునందు ఏర్పాటుచేసే ‘సంభాషణ సమావేశముల’ ద్వారా అనేక మిషనరీలకు శిక్షణనిచ్చారు. ఈ సమావేశముల ద్వారా ప్రపంచ నలుమూలలకు, బహు దూర ప్రాంతములకు కూడా సువార్తను మోసుకువెళ్ళుటకు ఎంతోమంది యువకులు ప్రోత్సహించబడ్డారు. అంతేకాదు, ‘చర్చి మిషనరీ సొసైటీ’ వ్యవస్థాపకులలో సిమియన్ కూడా ఒకరు. చివరిగా మూడవ ప్రాధాన్యత ఏమంటే, క్రైస్తవ సంఘ సంస్కరణ. నామమాత్రముగా క్రైస్తవ ఆలయమునకు వెళ్ళేవారిని క్రీస్తుకు నిజమైన శిష్యులుగా మార్చుటకై అతను ఎంతో శ్రమించారు.


సిమియన్ ప్రార్థనాపరులు. అతను వేకువనే నాలుగు గంటలకు లేచి ప్రార్థన మరియు వాక్య ధ్యానములలో నాలుగు గంటల పాటు తన సమయమును గడిపేవారు. బోధించడం మరియు ప్రార్థించడం అనునవి అతని జీవితములో రెండు ప్రధానమైన విషయములుగా ఉండేవి. తన స్వంతవారి నుండే శ్రమలు మరియు పోరాటాలు కలిగినప్పటికీ, సహనము పట్టుదల కలిగి ఈ లోకమునందు తన పరుగును విజయవంతముగా కడముట్టించారు చార్లెస్ సిమియన్.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీరు నివసించుచున్న, చదువుకుంటున్న మరియు పనిచేస్తున్న స్థలములలో మీరు ఎటువంటి మార్పును తీసుకువస్తున్నారు? 

ప్రార్థన :

"ప్రభువా, నా జీవితము యొక్క ప్రతి భాగములోను మరియు ప్రతి కోణములోను సువార్తకు విలువైన సాధనముగా నేను ఉండునట్లు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!" 

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Jun 22, 2022

    Claude L. Pickens Jr | క్లాడ్ ఎల్. పికెన్స్ జూనియర్

    క్లాడ్ ఎల్. పికెన్స్ జూనియర్ గారి జీవిత చరిత్ర







    జననం: 20-04-1900

    మహిమ ప్రవేశం: 22-01-1985

    స్వస్థలం: అలెగ్జాండ్రియా, వర్జీనియా

    దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు

    దర్శన స్థలము: చైనా మరియు అరేబియా 


     కొంతమంది ఒక ప్రదేశం కొరకు దర్శనమును కలిగియుంటే, మరి కొంతమంది ఒక జనము కొరకు భారమును కలిగియుంటారు; ఇంకొంతమంది ఒక నిర్దిష్టమైన పని లేదా వృత్తి ద్వారా పరిచర్య చేయుటకు పిలువబడుతారు. వారి మార్గాలు భిన్నంగా కనిపించవచ్చు, కానీ లక్ష్యం మాత్రం ఒకటే! అది “సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి” (మార్కు 16:15) అనునదే!


     ముస్లిం ప్రజలను క్రీస్తు నొద్దకు తెచ్చుటకై పరిచర్య చేసిన మిషనరీలలో క్లాడ్ లియోన్ పికెన్స్ జూనియర్ కూడా ఒకరు. తన యవ్వనదశలో మిషనరీలను సంధించిన అనుభవములు అతనిలో మిషనరీ సేవ కొరకైన ఆసక్తిని రేకెత్తించాయి. కాగా చివరికి 1922వ సంll లో మిచిగాన్‌లో జరిగిన ‘క్రిస్టియన్ కాలింగ్ కాన్ఫరెన్స్‌’ అనే కూడికలలో శామ్యూల్ జ్వెమర్ యొక్క ప్రసంగం వినిన పిమ్మట అతను మిషనరీ సేవకు తనను సమర్పించుకున్నారు. ఒక ఏడాది తరువాత అతను జ్వెమర్ యొక్క కుమార్తెయైన నెల్లీ ఎలిజబెత్‌ను వివాహం చేసుకున్నారు. తదుపరి వారిరువురు కలిసి “ఫారిన్ అండ్ డొమెస్టిక్ మిషనరీ సొసైటీ” (ఎఫ్.డి.ఎమ్.ఎస్.) అనే సంస్థ ద్వారా చైనాకు మిషనరీలుగా పయనమయ్యారు.

    చైనా చేరుకున్నప్పుడు వారు చైనా భాషను అభ్యసించుట కొరకు మొదట నాన్జింగ్ అనే ప్రాంతములో కొంత కాలం గడిపారు. తదుపరి అంతర్గత యుద్ధం కారణంగా వారు అక్కడి నుండి పారిపోయి షాంఘైకు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ “సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ ది మోస్లెంస్ ఇన్ చైనా” (ఎఫ్.ఓ.ఎమ్.) అనే సంస్థతో చేరిన పికెన్స్, ఆ సంస్థ యొక్క కార్యదర్శిగా పనిచేశారు. మరొక వైపు, శిక్షణ పొందిన నర్సు అయిన నెల్లీ, శిశువుల కొరకు ఒక క్లినిక్ నడుపుతూ తన భర్తకు పరిచర్యలో సహాయకారిగా ఉన్నారు. 1937వ సంll వరకు కూడా పికెన్స్ యాంగ్జీ నది వెంబడి ఉన్న నౌకాశ్రయములలోను మరియు సెయింట్ పీటర్స్ చర్చిలో సహాయక పాదిరిగాను పరిచర్య చేశారు.

    పికెన్స్ మరియు మరికొందరు మిషనరీలు కలిసి వాయువ్య చైనా, ఈశాన్య టిబెట్ మరియు ఇన్నర్ మంగోలియాలలోని ముస్లింల మధ్య సంచార పరిచర్య జరిగించారు. చైనాలో చైనా-జపాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఫిలిప్పీన్స్ దీవులలోని జాంబోంగాలో ముస్లింల మధ్య సేవ చేసిన పికెన్స్, 1939వ సంll లో మధ్య చైనాకు తిరిగి వచ్చారు. అక్కడ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో పికెన్స్ మరియు అతని కుటుంబం జపానీయులచే బంధించబడి 1941-1942 వ సంll వరకు చెరసాలలో ఉంచబడ్డారు. విడుదలైన తరువాత అతను తిరిగి అమెరికాకు వెళ్ళి న్యూయార్క్‌లో ఎఫ్‌డిఎంఎస్ సంస్థ తరఫున సేవ చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత తిరిగి చైనాకు వచ్చిన అతను, 1950వ సంll వరకు అక్కడ పరిచర్యను కొనసాగించారు.

    అటు పిమ్మట పికెన్స్ అమెరికాలో విద్యార్థుల మధ్య పరిచర్య చేశారు. తరువాత అతను 1962వ సంll లో అరేబియాకు వెళ్లి అక్కడి అరాంకో కంపెనీ ఉద్యోగుల మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు సేవ చేశారు. చైనాలో ఇస్లాంకు సంబంధించి పికెన్స్ సేకరించిన వెయ్యికి పైగా ఛాయాచిత్రాలు మరియు సాహిత్య రచనలు కేంబ్రిడ్జ్‌లో ఉన్న హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక విలువైన నిధివలె నేటికీ భద్రపరచబడి ఉన్నాయి.


    ప్రియమైనవారలారా, మీ జీవితంలో మీ యొక్క లక్ష్యం ఏమిటి?


    ప్రభువా, ఎక్క డ అవకాశము లభించిననూ, దానిని మీ మహిమార్థమై వాడుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

    *******

    దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • Apr 7, 2022

    Clarinda | క్లారిండా

    క్లారిండా జీవిత చరిత్ర



    • జననం : ~ 1746
    • మరణం : ~ 1806
    • స్వస్థలం : తంజావూరు 
    • దేశం   : భారతదేశం 
    • దర్శన స్థలము : తమిళనాడు, భారతదేశం


    హిందూ కులాలలో సతీసహగమనం అనునది ఒక ఆచారం. అదేమంటే భర్త మరణించినట్లయితే, భార్య తన భర్త శరీరాన్ని దహనం చేసే చితిలో తాను కూడా ప్రాణాలను అర్పిస్తుంది. ఒక వైపు వితంతువులను తృణీకరిస్తున్న సనాతన భారతీయ సమాజం, మరొక వైపు మరణించిన భర్త పట్ల భార్య కలిగియున్న పతిభక్తిని క్రియారూపకముగా కనుపరిచే అత్యున్నతమైన కార్యముగా అది పరిగణించబడినందు వలన వితంతువులకు సతీసహగమనాన్ని ఆచరించడమే ఏకైక పరిష్కారమయ్యింది. అటువంటి అమానుషమైన అనాగరిక చర్య నుండి రక్షించబడిన అతి కొద్దిమంది మహిళలలో క్లారిండా ఒకరు.


    క్లారిండా యొక్క అసలు పేరు కోకిల. ఆమె ఒక ప్రముఖ మరాఠా బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. తంజావూరు రాజ దర్బారులో పనిచేసిన ఆమె భర్త, వారి వివాహం అయిన కొద్దికాలానికే మరణించడం జరిగింది. కాగా ఆమె సతీసహగమనాన్ని ఆచరించబోవుచుండగా, హెన్రీ లిటల్టన్ అనే ఆంగ్ల అధికారి ఆమె దుస్థితిని చూసి సజీవ దహనం కాకుండా ఆమెను రక్షించారు. అతను క్లారిండాను క్రైస్తవ జీవన విధానములోకి నడిపించారు. కాగా తమిళనాడులోని ఆ ప్రాంతాలలో చురుకుగా పరిచర్య చేస్తున్న క్రిస్టియన్ ఫ్రెడరిక్ ష్వార్ట్జ్ ఆమెకు బాప్తిస్మమిచ్చి, క్లారిండా అనే క్రైస్తవ పేరును ఆమెకు పెట్టారు.


    బాప్తిస్మము పొందిన పిమ్మట క్లారిండా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో మిషనరీ సేవ చేయుటకు తనను సమర్పించుకున్నారు. కాగా ఆమె పాలయంకోట్టైలో స్థిరపడి, అక్కడ స్త్రీల మధ్యలో, ముఖ్యంగా వితంతువులు, అనాథలు మరియు అణగారిన నిరుపేదల మధ్యలో పరిచర్య చేశారు. ఒక చిన్న సమాజముగా వారిని కూర్చుటలో విజయవంతురాలైన ఆమె, వారి మధ్య ఆరాధన సేవలను నిర్వహించడం ప్రారంభించారు. ఆ విధంగా ఆమె అక్కడ కైస్తవ సంఘమును ప్రారంభించి కట్టిన ఆలయమును ప్రతిష్ఠించుటకు 1785వ సంll లో, ష్వార్ట్జ్ పాలయంకోట్టైకు వచ్చారు. అతను ఆ సంఘమునకు "క్లారిండా చర్చ్" అని పేరు పెట్టారు. ఆమె పాలయంకోట్టైకు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలను కూడా సందర్శించి, అక్కడ కూడా క్రైస్తవాలయాలను మరియు పాఠశాలలను నిర్మించారు.


    క్లారిండా మంచి ఆత్మీయ గ్రహింపు కలిగియున్న స్త్రీ. ఆదర్శప్రాయమైన మరియు వాస్తవిక జీవితముల మధ్య సమతుల్యతను తీసుకురాగలిగిన ఆమె, ఎటువంటి వివక్ష లేకుండా అందరినీ సమాన భావంతో చూసే క్రైస్తవ సంఘమును స్థాపించుటలో విజయవంతురాలయ్యారు. తన పరిచర్యలో హిందువుల నుండి ఎంతో వ్యతిరేకతను, అసంఖ్యాకమైన ఇబ్బందులను, రాజకీయ అస్థిరతను మరియు సామాజిక అన్యాయాన్ని ఆమె ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వెనుదిరుగక ధైర్యముగా దేవుని సేవలో ముందుకు సాగిపోయారు క్లారిండా.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, సువార్త ప్రకటించుటకై మీరు కులం, మతం, హోదా వంటి సామాజిక అడ్డంకులను అధిగమించారా? 

    ప్రార్థన :

    "ప్రభువా, సువార్త ప్రకటించుటకై సామాజిక మరియు భౌతిక అడ్డంకులను అధిగమించుటకు నన్ను బలపరచుము. ఆమేన్!" 

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Feb 12, 2022

    Chen Dayong Life History

    చెన్ డేయోంగ్  జీవిత చరిత్ర




    జననం: -
    మహిమ ప్రవేశం: 05-06-1900
    స్వస్థలం: బీజింగ్
    దేశం: చైనా
    దర్శన స్థలము: చైనా

    చైనాకు చెందిన చెన్ డేయోంగ్ ఒక మెథడిస్టు సువార్తికులు మరియు చైనా గోడ ఆవల ఉన్న ప్రజల మధ్య మిషనరీ పరిచర్య జరిగించినవారు. యవ్వనప్రాయములో ఉన్నప్పుడు అతను పుస్తకములు చదువుటకు ఎంతో ఆసక్తిని కలిగియుండేవారు. ఒక రోజు అతనికి ఒక క్రైస్తవ పుస్తకం కనిపించగా, అది ఎంతో ఆసక్తికరంగా అతనికి అనిపించింది. ఆ పుస్తకానికి ఎంతగానో మంత్రముగ్ధులైన అతను, లండన్ మిషనరీ సొసైటీ (ఎల్.ఎమ్.ఎస్.) సంస్థవారి క్రైస్తవాలయములో ఆదివారపు సంఘారాధన కూడికకు హాజరయ్యారు. కొన్ని నెలల తర్వాత, తన కుటుంబ అంగీకారమునకు వ్యతిరేకంగా బాప్తిస్మము తీసుకున్నారు చెన్.

    ఆ సమయంలో తన తల్లిదండ్రులు నిర్ణయించిన అమ్మాయితో చెన్‌కు నిశ్చితార్థం అయియున్నది. కాగా అతని కుటుంబ సభ్యులు త్వరగా అతని వివాహమును జరిగించి, తద్వారా అతని యొక్క ఆ నూతన విశ్వాసము నుండి అతని దృష్టి మరల్చవలెనని ప్రయత్నించారు. అయితే క్రైస్తవ వివాహం అయితేనే తాను వివాహం చేసుకుంటానని చెన్ చెప్పడంతో, ఆగ్రహముతో నిండిపోయిన అతని కుటుంబం అతనికి తమకు ఇక ఎటువంటి సంబంధము లేదని అతనిని పూర్తిగా తిరస్కరించింది. ఏదేమైనప్పటికీ, అతనితో నిశ్చితార్థం అయిన ఆ అమ్మాయి చెన్ యొక్క విశ్వాసంలో ఉన్న సత్యాన్ని గమనించి, తన కుటుంబ సభ్యులు వ్యతిరేకించినప్పటికీ అతనితో వివాహమునకు సిద్ధమవ్వగా, చివరికి వారిరువురు వివాహములో జతపరచబడ్డారు.

    అయితే ఈ నూతన క్రైస్తవ దంపతులకు క్రైస్తవ సంఘము తప్ప ఈ లోకములో ఎవరూ లేరు. చెన్ ఎల్.ఎమ్.ఎస్. వారి చర్చిలో కాపలాదారునిగా పని చేయడం ప్రారంభించారు. ఆ అవకాశమును అతను వీధులలో ఇతరులతో సువార్తను పంచుకొనుటకు ఉపయోగించుకున్నారు. చివరికి చైనా గోడ ఆవల ఉన్న ప్రజలను గూర్చిన గొప్ప భారంతో అతను బీజింగ్‌ను విడిచిపెట్టి వెళ్ళి వారి మధ్య పరిచర్య చేయడం ప్రారంభించారు.

    అది చైనాలో బాక్సర్ల తిరుగుబాటు తారాస్థాయికి చేరుకున్న సమయం. ఆ సమయంలో క్రైస్తవులు కనికరం లేకుండా ఊచకోత కోయబడ్డారు. పట్టణవాసులు చెన్‌ను పర్వతాలకు పారిపోమని అభ్యర్థించారు. కానీ, అతను ప్రియమైన తన మందను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళుటకు నిరాకరించారు. తన సంఘ విశ్వాసుల భద్రత కొరకు తగిన ఏర్పాట్లు చేసిన పిమ్మట అతను తిరుగుబాటు తగ్గే వరకు దాగుకొనియుండుటకై యాన్కింగ్ పర్వతాలకు పయనమయ్యారు.

    అయితే, కొంతమంది బాక్సర్ తిరుగుబాటుదారులు చెన్ యొక్క కుటుంబాన్ని పట్టుకొనగా, చెన్ తన భార్యాపిల్లల కళ్ళ ఎదుటనే తల నరికి చంపబడ్డారు. తన తల్లి వెనుక ఏడుస్తూ దాగుకొనియున్న అతని చిన్న కుమార్తె “అయ్యో అమ్మా, ఏం చేద్దాం?” అని అడుగగా, కదిలింపబడని స్థిరమైన విశ్వాసముతో ధైర్యముగా ఆ తల్లి తన బిడ్డను ఓదారుస్తూ, “మనమందరము కలిసి మన పరలోకపు తండ్రి వద్దకు వెళ్తాము!” అని చెప్పారు. ఆమె ఈ మాటలు పలికిన వెంటనే ఆ తల్లీ బిడ్డలు కూడా ముక్కలు ముక్కలుగా నరికి చంపబడ్డారు.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, క్రీస్తు కొరకు మీరు ప్రాధాన్యతనిచ్చేవాటిని, మీకు ఆనందమిచ్చేవాటిని, మీ కుటుంబమును మరియు బంధుమితృలను త్యాగం చేయుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?

    ప్రార్థన :

    ప్రభువా, ఈ దినమున సజీవయాగముగా నా దేహమును మీకు అర్పించుచున్నాను. నేను నా జీవితము, సమయము, ధనము, ఆశయాలు, ప్రణాళికలు, ఆశలు మరియు కోరికలను మీకే సమర్పించెదను. ఆమేన్!

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Nov 18, 2021

    Constant Lievens | కాన్‌స్టాంట్ లీవెన్స్

    కాన్‌స్టాంట్ లీవెన్స్ గారి జీవిత చరిత్ర








    • జననం: 11-04-1856
    • మహిమ ప్రవేశం: 07-11-1893
    • స్వస్థలం: మూర్స్‌లెడ్
    • దేశం: బెల్జియం
    • దర్శన స్థలము: మధ్య భారతదేశం


     “చోటా నాగ్‌పూర్ యొక్క అపొస్తలుడు” అని పిలువబడే కాన్‌స్టాంట్ లీవెన్స్ మధ్య భారతదేశంలో పరిచర్య చేసిన బెల్జియం దేశపు ఒక మిషనరీ. అతను ఒక వ్యవసాయ కుటుంబములో జన్మించినందున పంట భూములలో అతనికున్న అనుభవం మధ్య భారతదేశంలోని గిరిజనుల మధ్య, ప్రధానంగా ముండా, ఉరావ్ మరియు ఖరియా అనే తెగల మధ్య ఏడు సంవత్సరాల పాటు చేసిన పరిచర్యలో అతనికి ఉపకరించింది.
     విదేశాలలో మిషనరీ సేవ చేయవలెనన్న బలమైన కోరికతో ‘సొసైటీ ఆఫ్ జీసస్‌’ అనే సంస్థలో చేరిన లీవెన్స్, బ్రూగెస్‌లో ఆత్మీయపరమైన శిక్షణను ప్రారంభించారు. తదుపరి తన వేదాంత శిక్షణను పూర్తి చేసుకొనుటకుగాను 1880వ సంll లో పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌కు పంపబడ్డారు.
     1885వ సంll లో లీవెన్స్ చోటా నాగ్‌పూర్ పీఠభూమికి పంపబడగా, అక్కడ అతను స్థానిక భాషను మరియు వారి జీవన విధానమును నేర్చుకున్నారు. అటు తరువాత అతను రాంచీకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న టోర్పాలో స్థిరపడ్డారు. అక్కడి పరిస్థితులను కొంచెం పరిశీలించిన పిమ్మట అక్కడి జాగీర్దారులు, జమిందారులు మరియు తికేదారుల నుండి గిరిజనులు ఆర్థికపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారనియు మరియు శారీరకముగా శ్రమపెట్టబడుతున్నారనియు అతను కనుగొన్నారు. కాగా ఆచరణాత్మకమైన సువార్తతో వీరిని చేరుకొనగలిగే ఒక మార్గం వారి దుస్థితి నుండి విడుదల పొందుటకు వారికి సహాయపడుటయని గ్రహించారు లీవెన్స్. అందుకొరకు అతను సంప్రదాయ గిరిజన చట్టాలు మరియు బ్రిటిషువారి చట్టాలను అధ్యయనం చేసి, న్యాయస్థానములలో గిరిజనుల కేసులకు బలమైన మద్దతునిచ్చారు. వారు వారి భూములను తిరిగి పొందేందుకును మరియు వారి హక్కుల కొరకు నిలబడగలుగునట్లును అతను వారికి సహాయం చేశారు. చాలా మంది ఆదివాసులు అతనిని తమకు ఒక ‘రక్షకుని’ గా పరిగణించారు మరియు యేసు క్రీస్తు ప్రభువును తమ స్వరక్షకునిగా అంగీకరించడం ప్రారంభించారు.
     ‘అగ్ని జ్వలించుచుండాలి’ అనే నినాదముతో జార్ఖండ్‌లోని కొండ ప్రాంతాలలో అలుపెరగకుండా ప్రయాణించారు లీవెన్స్. జార్ఖండ్ గిరిజనుల అభివృద్ధి కొరకు నిర్విరామంగా పనిచేసిన అతను, వారికి న్యాయం, విద్య మరియు ఆత్మీయ అభివృద్ధిని సమకూర్చారు. మరికొంతమంది మిషనరీలు కూడా వచ్చి అతనికి సహాయమందించారు. రెండేళ్ళ వ్యవధిలో అక్కడి క్రైస్తవుల సంఖ్య పదిహేను వేలకు పెరిగింది.
     విస్తారమైన పని వలన క్షీణించిపోయిన అతను, 1891వ సంll లో క్షయవ్యాధి బారినపడ్డారు. కాగా కోలుకొనుటకు డార్జిలింగ్‌లో కొంత సమయం గడిపిన తర్వాత, అతను తిరిగి బార్వా ప్రాంతానికి వచ్చి పన్నెండు వేల మందికి బాప్తిస్మం ఇచ్చారు. అయితే వ్యాధి తిరిగి రావడం అతనికి ప్రాణాంతకంగా మారింది. కాగా భారతదేశానికి తిరిగి వస్తానని ఆశిస్తూ, “నేను ఇంకా చాలా చేయాల్సి ఉంది” అని చెప్పి 1893వ సంll లో బెల్జియంకు తిరిగి వెళ్ళారు కాన్‌స్టాంట్ లీవెన్స్. అయితే 1893వ సంll నవంబరు మాసం 7వ తారీఖున తన సేవకుడిని మహిమలోకి పిలవడం దేవుని దృష్టికి మంచిదైయున్నది.

    ప్రియమైనవారలారా, మీలో ఆత్మీయ జ్వాలలు మండుచున్నాయా?

    "ప్రభువా, నీ సేవకులచే అసంపూర్తిగా విడిచిపెట్టబడిన ఏ పరిచర్యనైనా కొనసాగించి సంపూర్తి చేయుటకు నన్ను నేను సమర్పించుకొనెదను. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • Oct 1, 2021

    C. S. Durand | సి. ఎస్. డురాండ్

    సి. ఎస్. డురాండ్ |  C. S. Durand


    • జననం: -
    • మహిమ ప్రవేశం: -
    • స్వదేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: భారతదేశం


    డాll సి. ఎస్. డురాండ్ వైద్యశాస్త్రములో తన చదువును ఇంకా పూర్తిచేయవలసి యుండగానే మిషనరీ సేవకు తనను సమర్పించుకున్నారు. కాగా న్యూయార్క్‌లో వైద్య శాస్త్రములో తన ఉన్నత చదువును (పోస్ట్ గ్రాడ్యుయేషన్) పూర్తిచేసుకొనిన తరువాత అతను తన భార్యతో కలిసి “డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్” (క్రీస్తుని శిష్యులు) అనే మిషన్ తరపున సేవ చేయుటకు భారతదేశానికి పయనమయ్యారు. ఈ దంపతులు తమ వృత్తి పట్ల పూర్తి అంకితభావమును కలిగియున్నారు. అయినప్పటికీ, అనేకమంది ఇతర వైద్యమిషనరీల వలెనే వీరు కూడా తమను కేవలం వైద్యపరమైన సేవలందించుటకే పరిమితం చేసికొనక అన్నివిధములైన మిషన్ కార్యకలాపాలలో పాలుపంచుకున్నారు.


    డురాండ్ మధ్య భారతదేశంలోని హర్దా అనే ప్రాంతములో నియమితులయ్యారు. తనకు భాష తెలియకపోయినప్పటికీ అక్కడ అతను ఒక చిన్న వైద్యశాలను ప్రారంభించారు. అతను సమయమును వృథాగా పోనివ్వక స్థానిక భాషయైన హిందీని నేర్చుకునే సమయంలోనే వైద్య సేవలను అందించడం కూడా మొదలుపెట్టారు. వైద్య సహాయము యొక్క అవసరతలో ఉన్నవారి సంఖ్య అధికమవుతూ వస్తుండడంతో ఒక ఆసుపత్రిని నిర్మించాలనుకున్నారు డురాండ్. కాగా అందుకొరకు ఒక స్థలమును కనుగొనవలెనని అతను ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, అవన్నీ విఫలయత్నాలే అయ్యాయి. ప్రయత్నించీ ప్రయత్నించి చివరికి విసిగిపోయిన అతను ఆసుపత్రి కట్టబడవలెననుకుంటే దేవుడే అందుకొరకు ద్వారములను తెరువవలెనని ప్రార్థించారు. తత్ఫలితముగా ఎంతో అద్భుతకరముగా ఆ మరుసటి దినముననే ఒక వ్యక్తి వచ్చి ఆసుపత్రి కొరకు కొంత భూమిని ఇచ్చాడు. వెంటనే దానిని అంగీకరించిన డురాండ్, వెనువెంటనే ఆసుపత్రిని నిర్మించడం ప్రారంభించారు. అది అన్నింటికీ సరిపోని ఒక చిన్న భవనమే అయినప్పటికీ ఒక గొప్ప మిషనరీ సేవకు నిలయంగా మారింది.


    కుష్టురోగుల మధ్య కూడా పనిచేసిన డురాండ్, వారిని బాగుపరచుటకుగాను ఆ రోగ నివారణల గురించి ఒక ప్రత్యేక అధ్యయనం చేశారు. అతనితో కలిసి పనిచేస్తున్న మరొక మిషనరీయైన వార్టన్ కుష్టు రోగులకు సువార్తను ప్రకటించగా, డురాండ్ వైద్య సేవలను అందించేవారు. అతను పట్టణం శివార్లలో కుష్టురోగుల కొరకు ఒక శరణాలయాన్ని ఏర్పరిచారు. అక్కడ అతను కుష్టురోగులకు ఒక గృహమును ఏర్పరచి, వారి కష్టమును, అనుభవిస్తున్న బాధలను తగ్గించుటకై తాను చేయగలిగినదల్లా చేశారు. డురాండ్ చేసే వైద్య సేవతో సువార్త పరిచర్య కూడా ఎల్లప్పుడూ మిళితమై యుండెడిది. అతను క్రీస్తును అంగీకరించమని తన రోగులకు నేరుగానే విజ్ఞప్తి చేసేవారు.


    మరొకవైపు డురాండ్ యొక్క భార్య బాలుర పాఠశాల బాధ్యతను నిర్వహించేవారు. ఆమె రోజుకు అనేక గంటల పాటు బోధించేవారు. తక్కువ కులలాకు చెందిన పిల్లలు మరియు పెద్దల కొరకు ఆదివారపు బైబిలు పాఠశాల తరగతులను (సండే స్కూల్) నిర్వహించిన ఆమె వారికి బోధించుటలో ఎంతో ఆనందించేవారు. అంతేకాకుండా, ఆమె మహిళలను మరియు బాలికలను వారి గృహములలో సంధించి, వారి మధ్య పరిచర్య చేశారు. కొన్నిసార్లు వైద్యుడు లేనప్పుడు ఆమె వైద్యశాల యొక్క బాధ్యతలను కూడా చేపట్టేవారు.


    ఆ విధంగా భారతదేశంలో ఫలవంతమైన పరిచర్య జరిగించిన తరువాత డురాండ్ దంపతులు స్వదేశమునకు తిరిగి వెళ్ళినప్పటికీ చివరి వరకు దేవుని సేవలో నిలిచియున్నారు.


    ప్రియమైనవారలారా, మీరు మీ వ్యక్తిగత పనులతో సువార్త ప్రకటనను మిళితం చేయుచున్నారా? 


    "ప్రభువా, భారతదేశంలో సువార్తను ప్రకటించుటకు ద్వారములను తెరిచి, మార్గములను సరాళము చేయుము. ఆమేన్!" 


    దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • Sep 26, 2021

    Chacko K Athialy | చాకో కె. అథియాలీ

    చాకో కె. అథియాలీ | Chacko K Athialy


    • జననం: 15-03-1920
    • మహిమ ప్రవేశం: 18-04-2011
    • స్వస్థలం: కేరళ
    • దేశం: భారతదేశం
    • దర్శన స్థలము: నేపాల్ మరియు భారతదేశం

    1919వ సంll లో కేరళలోని మారామణ్ ప్రాంతములో జరిగిన “మారామణ్ కన్వెన్షన్‌” అనే సమావేశాలలో టిబెట్‌లో తన మిషనరీ పని అనుభవాలను గురించి చెప్పిన సాధు సుందర్ సింగ్, మిషనరీల కొరకు నేపాల్‌లో ఉన్న ఆవశ్యకతను గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు. భారతీయులు దేవుని సేవకు తమను తాము సమర్పించుకొనవలెనని ఎంతో తీవ్రతతో అతను ఇచ్చిన పిలుపు అనేకమంది హృదయాలను తాకింది. అక్కడ అది వింటున్నవారిలో ఒకరు అన్నమ్మ. ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉన్నారు. కాగా, ఆమె పుట్టబోయే బిడ్డను దేవుని సేవకు సమర్పించాలని తన హృదయములో నిశ్చయించుకున్నారు. 1920వ సంll మార్చి మాసంలో ఆమె చాకో అథియాలీకి జన్మనిచ్చారు.

     యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ స్వాతంత్ర్య ఉద్యమంలో చేరారు అథియాలీ. అయితే అతను తిరువల్లూరులో జరుగుతున్న ప్రత్యేక సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్ళినప్పుడు అతని ఆత్మీయ జీవితంలో గొప్ప మార్పు కలిగింది. అక్కడ తన జీవితమును దేవుని సేవ కొరకు సమర్పించుకొనిన అతను, అందుకొరకైన శిక్షణ పొందారు. వెంటనే అతను ట్రావన్‌కోర్ జిల్లాలో తీవ్రమైన సువార్త సేవను ప్రారంభించినప్పటికీ, ఏదో ఒకరోజు నేపాల్‌కు వెళ్ళవలెనని ఆకాంక్షించారు.

     1946వ సంll లో భారతదేశం అల్లర్లతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో అథియాలీ అలహాబాద్‌కు పయనమయ్యారు. ఆ ప్రయాణంలో అతను దాదాపు మరణించినంత పరిస్థితులు నెలకొన్నాయి. ఏదేమైనప్పటికీ, దేవునిచే భద్రపరచబడి అలహాబాద్ చేరుకున్న అథిలియా, అక్కడ విద్యార్థుల మధ్య సువార్త సేవ చేశారు. తదుపరి 1948వ సంll లో యూనియన్ బైబిల్ సెమినరీలో శిక్షణ పొందుటకు అతను వెళ్ళగా, అక్కడ అతనికి నేపాల్ కొరకు ద్వారములు తెరువబడ్డాయి. చివరకు 1950వ సంll లో వేసవి సెలవులలో అతను నేపాల్ చేరుకున్నారు. అతనికి ఎటువంటి ఆర్థిక సహాయం గానీ, ఉండుటకు స్థలము గానీ లేదు. అయినప్పటికీ, ఈస్టర్ రోజున ఖాట్మండు వీధులలో బోధించారు అథియాలీ.

      కొంతకాలం భారతదేశమును సందర్శించిన తరువాత, అతను కొద్దిమందితో కలిసి 1952వ సంll లో తిరిగి నేపాల్‌కు వెళ్ళారు. ఈసారి అతను బహదూర్ రాణా అనే ఒక క్రైస్తవుని కనుగొనగా, అథియాలీకు అతను సహచరునిగా మారారు. 1953వ సంll లో అథియాలీ “క్రీస్త శాంత సంఘం” అనే క్రైస్తవ సంఘమును (చర్చి) బహదూర్ ఇంటిలో స్థాపించారు. నమ్మకముగా అతను చేసిన కృషి ఫలితముగా అనేక మంది నేపాలీలకు రక్షణ లభించింది మరియు అతను స్థాపించిన ఆ సంఘము నేడు వేల సంఖ్యలో విశ్వాసులను కలిగియున్నది.

      1986వ సంll లో సేవ నుండి విరమణ పొందిన తరువాత కూడా విశ్రమించుటకు నిరాకరించిన అతను, చత్తీస్‌గఢ్‌లో సత్నామి తెగల మధ్య తీవ్రమైన వ్యతిరేకత మధ్య సేవచేయడం ప్రారంభించారు. వృద్ధాప్యంలో కూడా అతను ఒక సంచి నిండుగా కరపత్రములను తీసుకొని సువార్తను ప్రకటించుటకు వెళ్ళేవారు. అలుపెరుగని దైవ సేవకుడైన చాకో అథియాలీ చివరికి 91 సంll ల మంచి వృద్ధాప్యమందు పరమందు తన ప్రభువును చేరుకొనుటకు ఇహలోకమును విడిచి వెళ్ళారు.

    ప్రియమైనవారలారా, దేవుని యొద్ద మీరు చేసిన తీర్మానములను నమ్మకముగా నెరవేర్చుచున్నారా?

    "ప్రభువా, మీ సేవలో నేను కట్టుబడియున్నవాటిని నమ్మకముగా నెరవేర్చుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక

  • WhatsApp
  • Sep 6, 2021

    William Buck Bagby | విలియం బక్ బాగ్బీ

    విలియం బక్ బాగ్బీ | William Buck Bagby

    • జననం: 05-011-1855
    • మహిమ ప్రవేశం: 05-08-1939
    • స్వస్థలం: కొరియెల్ కౌంటీ
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: బ్రెజిల్


     1884వ సంll లో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో ఒక మిషనరీ దంపతులు కాథలిక్కుల నుండి తీవ్రమైన వ్యతిరేకత నెలకొనియున్న పరిస్థితుల మధ్య దేవుని పరిచర్యను ప్రారంభించారు. ఆ మిషనరీలకు అది ఎంతో నిరాశాజనకమైన ఆరంభముగా ఉంది. ఏలయనగా వారు నిర్వహించే ఆరాధనా కూడికలకు ఎవరూ వచ్చేవారుకాదు. కావున వారు ఆలయమునకు వెలుపల వాయిద్యములను వాయించుచూ పాడటం ప్రారంభించారు. అది చూచిన కొంతమంది ఆసక్తిగలవారు అక్కడ గుమిగూడడం ప్రారంభించినప్పుడు కొంతమంది గుంపుగా వచ్చి దాడిచేసి, అక్కడి సామగ్రిని ధ్వంసం చేశారు. వారిలో ఒకరు బోధకునిపై రాయి విసరగా అతని తలకు గాయమై స్పృహ తప్పి పడిపోయారు. కానీ కొన్ని నిమిషముల తరువాత అతనికి స్పృహ వచ్చినప్పుడు అతను తిరిగి లేచి నిలబడి బోధించడం కొనసాగించారు. ఆ బోధకుడు మరెవరో కాదు, బ్రెజిల్‌లో ప్రారంభక బాప్తిస్టు మిషనరీలలో ఒకరిగాను మార్గదర్శకులుగాను నిలిచిన విలియం బక్ బాగ్బీ.


     వాకో విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన విలియం, పిమ్మట ఒక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. యవ్వనదశలో ఉన్నప్పుడు దక్షిణ అమెరికాలో మిషనరీల కొరకు ఉన్న అవసరతను గురించి వినిన అతనిలో అందుకొరకైన భారం కలిగింది. అతను అన్నే లూథర్‌ను వివాహం చేసుకున్నప్పుడు దక్షిణ అమెరికాలో మిషనరీ సేవ పట్ల అతను కలిగియున్న ఆసక్తి కార్యరూపం దాల్చుటకు పునాదులు పడ్డాయి. అన్నే కూడా మిషనరీ పరిచర్య పట్ల సమర్పణను కలిగియున్నవారు. మరి ముఖ్యముగా దక్షిణ అమెరికాలో సేవ పట్ల అతని వలెనే ఆసక్తిని కలిగియున్నారు. కాగా, మరికొంత మంది ప్రోత్సాహంతో 1880వ సంll లో రియో డి జనీరోలో అడుగుపెట్టారు బాగ్బీ దంపతులు. తరువాత అక్కడ ప్రభుత్వాన్ని నడపడంలో కాథలిక్ సంఘం పాలుపంచుకుంది. అక్కడి కాథలిక్కులు ప్రొటెస్టెంట్ క్రైస్తవుల పట్ల అసహనమును కలిగియుండేవారు. కాగా, పరిచర్య యొక్క ప్రారంభ దశలలో బాగ్బీ అక్కడ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అతను అనేకమార్లు శారీరకముగా దాడి చేయబడ్డారు కూడా. అయినప్పటికీ, ధైర్యవంతుడైన ఈ మిషనరీ కష్టాలు శ్రమల మధ్యలో మరింతగా బలమొందారు. త్వరలోనే, రెండు సంవత్సరాల కాలంలో రియోలో రెండు బాప్తిస్టు సంఘములు ఏర్పరచబడ్డాయి.


     బాగ్బీ తన పరిచర్యను రియో సరిహద్దులను దాటి విస్తరింపచేశారు. అతను బ్రెజిల్ దేశమంతటా పర్యటించి, అన్ని ప్రధాన నగరాలలో క్రైస్తవ సంఘములను స్థాపించారు. బ్రెజిల్‌లో ప్రతిచోటా అతను స్థాపించిన సంఘములు, నిర్మించిన పాఠశాలలు, క్రీస్తు కొరకు అతను సంపాదించిన గొప్ప క్రైస్తవ నాయకులు మరియు వేలాది మంది విశ్వాసుల రూపంలో బాగ్బీ యొక్క పరిచర్య ప్రభావం కనిపిస్తుంది. అతని జీవిత భాగస్వామియైన అన్నే లూథర్ పరిచర్యలో కూడా అతనికి సరిసమానమైన భాగస్వామిగా ఉన్నారు. దేవుని ఆశీర్వాదముతో వారికి తొమ్మిది మంది సంతానము కలుగగా, వారిలో ఐదుగురు దక్షిణ అమెరికాకు మిషనరీలుగా తమ జీవితములను సమర్పించుకున్నారు.


     58 సంవత్సరాల పాటు ఎంతో తీవ్రముగా పరిచర్య జరిగించిన పిమ్మట, తన సేవా ఫలమైన 694 సంఘములను మరియు 53,000 మంది విశ్వాసులను విడిచిపెట్టి 1934వ సంll లో పరమందు తన ప్రభువును చేరుకొన ఇహలోకమును విడిచి వెళ్ళారు విలియం బక్ బాగ్బీ. 


    🚸 *ప్రియమైనవారలారా, కష్టాలు, శ్రమల మధ్యలో మరింతగా దేవునికి సేవ చేయుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?* 🚸


    🛐 *"ప్రభువా, అననుకూల పరిస్థితుల దాడులకు నేను గురై పడిపోయిన ప్రతిసారీ తిరిగి మీ కొరకు నిలబడగలుగునట్లు నన్ను లేవనెత్తుము. ఆమేన్!"* 🛐


    🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏


  • WhatsApp