Search Here

Sep 3, 2021

Gladys Staines | గ్లాడిస్ స్టెయిన్స్

గ్లాడిస్ స్టెయిన్స్ | Gladys Staines


ఒరిస్సా రాష్ట్రంలో సజీవదహనం కాబడిన వైద్య మిషనరీ గ్రాహం స్టెయిన్స్ యొక్క సతీమణి


జనవరి 23 ’1999 భారతదేశపు చరిత్రలోనే ఒక చీకటి రోజు . ఆస్ట్రేలియా వైద్య మిషనరీ గ్రాహం స్టెయిన్స్ (1941-1999) మరియు ఆయన ఇద్దరు కుమారులు గిరిజన రాష్ట్రమైన ఒరిస్సా లో సజీవదహనం కాబడ్డారు. ఈ సంఘటన తరువాత గ్రాహం స్టెయిన్స్ సతీమణి గ్లాడిస్ ను ఆమెకు ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్ళిపోయే ఆలోచనలో వున్నారా? అని కొందరు పాత్రికేయులు ఆమెను ప్రశ్నించగా ఆమె “ఎన్నటికీ ఆ ఆలోచన లేదు . నా భర్త మరియు నా ఇద్దరు కుమారులు ఈ దేశానికై తమ ప్రాణాలు సమర్పించారు. ఇండియా నా గృహము . ఇక్కడ నేను సంతోషంగా వున్నాను . నేను మరణించినా ఇక్కడనే సమాధి చేయబడాలని కోరుకుంటున్నా” అని సమాధానం ఇచ్చారు . ఆమె ఇంకా ఇలా అన్నారు “ దేవుడు ఆయన సేవకులైన ప్రతి ఒక్కరు తనకు ఇంపైన సువాసన గల అర్పణగా వారి జీవితాలు వుండాలని పిలిచాడు. నిన్ను ఏ పనికి పిలిచినా అందులో నమ్మకముగా వుండు .’తిరిగి వెళ్ళాలి ‘,’విడిచి వేయాలి’ అను శోధనలకు లొంగిపోకు.శ్రమలు లేక బెదిరింపులు వచ్చినా నీకు ముందుగా వెళ్ళిన ప్రభువు వైపే చూచుచు ముందుకు సాగు . భారతదేశపు ప్రజలకు చెప్పడానికి నా దగ్గర వున్న వర్తమానం ఇదే . నేను ఆ హంతకుల చర్యలను క్షమిస్తున్నాను . వారిపై నాకు కోపం కూడా లేదు. యేసుక్రీస్తు ఒక్కడే వారిని క్షమించగలడు. కాని వారు ఆయనను క్షమాపణ అడగాలి . నాకు ఒక గొప్ప కోరిక “ ఈ దేశం లోని ప్రతి పౌరుడు వారి పాపాల కొరకు తన ప్రాణాన్ని ఇచ్చిన యేసుక్రీస్తు తో వ్యక్తిగత సంబంధం కలిగి వుండాలి.ప్రతి భారతీయుడు యేసు వారిని ప్రేమిస్తున్నాడని తెలుసుకోవాలి.ఆవిధంగా వారు ఆయనను నమ్ముతూ ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మనము ద్వేషాన్ని దహించివేసి ....క్రీస్తు ప్రేమ అనే అగ్నిని వ్యాపింపజేయాలి”.

బాల్యము

 గ్లాడిస్ జనవరి 18 ,1951న ఆస్ట్రేలియా లోని kweensland లోగల ఇప్సివిచ్ నందు ఒక పశుపోషకుల (dairy farmers) ఇంటిలో జన్మించింది. చిన్న ప్రాయం నుండే దైవిక విషయాల పట్ల ఎంతో ఆసక్తి కలిగి వుండేది . ఆమె తల్లిదండ్రులు చిన్నతనం నుండి బైబిల్ తోపాటు అనేక మిషనరీ జీవిత గాధలు ఆమెకు బోధించుటచే , ప్రభువు పరిచర్య చేయాలనే దర్శనం బాల్యం నుండే గ్లాడిస్ కలిగి వుండేది. చిన్నప్పటినుండి ఇప్సివిచ్ నందలి బ్రదరన్ సహవాసంలో చురుకుగా పాల్గొనేది. 1964 సంవత్సరంలో ఆమె ఒక ప్రాంతీయ మిషన్ వారి ఆరాధనా కూడికలో పాల్గొంది. అక్కడ ప్రభువు తనతో బలంగా మాట్లాడుచున్నట్లు గ్రహించింది.అప్పుడు ఆమె వయస్సు 13 సంవత్సరములు. ఆమె తాను యేసు ప్రభువు కొరకే జీవించాలని నిర్ణయించుకుంది. అటు తరువాత బాప్తీస్మం తీసుకుని ఆయన యొక్క బలమైన సాక్షిగా జీవించసాగింది. ఆమె నర్సుగా ఆస్ట్రేలియా లోని అనేక ప్రాంతాలలో పనిచేసింది. ఇప్సివిచ్ జనరల్ హాస్పిటల్ లో జనరల్ నర్సింగ్ చదివింది. అటు తరువాత Launceston లోని క్వీన్ విక్టోరియా హాస్పిటల్ లో మిడ్ వైఫెరి(Midwifery) పూర్తిచేసింది. ఆ తరువాత మాటర్నల్ మరియు చైల్డ్ హెల్త్ లో కూడా కోర్సును చేసింది. ఆమె తన వృత్తి పరంగా సండే స్కూల్ ,యవ్వనస్తుల మధ్య పరిచర్య ఇంకా అనేక క్రైస్తవ సహవాసాలలో పరిచర్యలో పాల్గొనేది. తన 18 వ సంవత్సరంలో ఆమె దేవుడు తనను పూర్తి కాల పరిచర్యకు పిలుస్తున్నట్లు గ్రహించింది.

మిషనరీ పరిచర్య మరియు వివాహం :  

గ్లాడిస్ 1981లో ఆపరేషన్ మొబలైసేషన్ (OM) లో చేరింది. వారితో కలిసి సింగపూర్, మలేసియా, యూరోప్ మరియు ఇండియా దేశాలలో పనిచేసింది. 18 నెలలు ఇండియాలో వున్నపుడు ఆమెను అనేక అనుభవాల ద్వారా తీసుకువెళ్ళాడు. అనేకమార్లు బీహార్ ,ఒరిస్సా ,పంజాబ్ ప్రాంతాలలో వారు తమ వాహనంలో యవ్వన మిషనరీలుగా ప్రయాణాలు చేస్తున్న సమయంలో దేవుని కాపుదలను పొందారు. 1981 లో ఆమె ఒరిస్సా లోని గ్రామాలను దర్శిస్తూ బారిపదకు వచ్చి గ్రాహం స్టెయిన్స్ యొక్క అతిధులుగా వారి గృహంలో వున్నారు. వారి సహ నాయకురాలు గ్లాడిస్ మరియు మిగతా టీమ్ వారికి గ్రాహం స్టెయిన్స్ యొక్క పరిచర్యను వివరించింది.అక్కడ టేబుల్ మీద చదవడానికి ఉంచిన ఒరియా వ్యాకరణం మరియు మయూర్ భంజ్ అనే ప్రాంతం గురించి వున్న పుస్తకాలను ఆమె చదివింది. గ్రాహం కూడా ఆస్ట్రేలియాలోని తాను వుండే ప్రాంతానికి కేవలం 30 కి.మీ దూరంలో వున్న ప్రాంతం నుండి వచ్చాడని తెలుసుకొని ఆశ్చర్యపోయింది. దేవుడు ఒక ప్రణాళిక ద్వారా వారిరువురిని ఇండియా దేశానికి నడిపించాడు.కొంతమంది OMకి సంబంధించిన నాయకులు వారి నిమిత్తమై ప్రార్ధించి ,వివాహ ప్రస్తావన చేసారు. దేవుని చిత్త ప్రకారంగా గ్రాహం మరియు గ్లాడిస్ ల వివాహం ఇప్సివిచ్ చాపెల్ నందు ఆగష్టు 6,1983 లో జరిగింది. ఆ తరువాత ఏప్రిల్ నెలలో గ్రాహం మిషనరీ పరిచర్యకై తిరిగి వెళ్ళగా ,గ్లాడిస్ వీసా నిమిత్తమై 6 నెలలు వేచివుండాల్సి వచ్చింది.వారు బారిపదలో తమ మిషనరీ ప్రారంభించారు. ఒక గొప్ప మిషనరీ మాత్రమే కాకుండా ,ఒక మంచి భర్తగా, తండ్రిగా గ్రాహం వున్నందుకు దేవునిని ఎంతగానో స్తుతించింది.అతని క్రమశిక్షణ గల జీవితం ద్వారా ఆమె ఎంతగానో స్ఫూర్తిపొందింది.


 గ్రాహం క్రీస్తుకు వలెనే దయ మరియు కనికరము మెండుగా కలిగిన వ్యక్తి. పరిచర్యలో అనేక అవసరతలు ఉన్నప్పటికీ ఎన్నడూ దిగులుచెందేవాడు కాదు.ప్రతీ విషయంలో ప్రభువును స్తుతిస్తూ”నేను రాజుల రాజుకు బిడ్డను.నేను ఎందుకు సహాయము కొరకు మానవుల ఆశీర్వాదము కొరకు విజ్ఞాపన చేయాలి? అని పలికేవాడు.వారిరువురూ ఒకే విశ్వాసము ,దర్శనము కలిగి పరిచర్యలోను ఏకంగా వున్నారు. వారు వైద్యము మరియు పునరావాసము (రీహాబిలిటేషన్) నిమిత్తమై 2 సెంటర్లు ప్రారంభించారు.బారిపదకు 2 కి.మీ దూరంలో హాస్పిటల్ మరియు 10 కి.మీ దూరంలో లెప్రసీ రీహాబిలిటేషన్ సెంటర్ వున్నాయి. 

1997 లో స్టెయిన్ దంపతులు ఆస్ట్రేలియాను దర్శించడానికి వెళ్లారు. కాని వారికీ అక్కడ తమ స్వంత గృహము వలె అన్పించలేదు.వారు తమ గృహము ఒరిస్సా ,బారిపద మాత్రమే అని అక్కడి నుండి సంతోషంతో తిరిగివచ్చారు . గ్రాహం తనకు దేవుడు అందమైన భార్య, ప్రేమ కలిగిన ముగ్గురు పిల్లలుమరియుఅనేకులను గౌరవప్రదమైన జీవితంలోకి నడిపించే విధంగా

మిషన్ పరిచర్యను దయ చేసినందుకు ఎంతగానో స్తుతించేవాడు.  


               స్టెయిన్స్ దంపతులు మిషన్ కాంపౌండ్ లోని ఒక పాత ఇంటిలో ఎంతో సాధారణ జీవితాన్ని జీవించారు. దేవుడు వారికి ముగ్గురు సంతానాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు.ఎస్తేర్ (నవంబర్ 7 న,1985), ఫిలిప్ (మార్చ్ 31,1988) మరియు తిమోతి హెరాల్డ్ (మే 4,1992) జన్మించారు. వారిలో ఎస్తేర్ , ఫిలిప్ లను విద్య నిమిత్తమై 2,౦౦౦ కి.మీ దూరంలో గల ఉదకమండలం లోని మిషనరీ పాఠశాలలో చేర్పించారు.వారి పిల్లలకు కూడా పరిచర్య పట్ల ఎంతో ఆసక్తి వుండేది. ఫిలిప్ మిషనరీ మనస్సు కలిగి ఉండేవాడు.ప్రతివారిని ఎంతో ప్రేమగా పలకరించేవాడు.ఎస్తేర్ మరియు ఫిలిప్ లు తమ సెలవు దినాలలో తలిదండ్రుల తో కలిసి పనిచేసేవారు. చిన్నవాడైన తిమోతి ప్రతి కూడిక ముందు కుర్చీలు తానే వేసేవాడు. అవి ఖాళీగా వున్న సమయంలో ప్రసంగ వేదిక వద్దకు వెళ్లి ప్రసంగం చేసేవాడు.సొంతగా పాటలు వ్రాసి వాటిని పాడుతూ ఉండేవాడు. అతడు ఎంతో అందంగా చిత్రాలు వేసేవాడు. అతడు చివరగా వేసిన చిత్రపటము ఇప్పటికి వారి పాఠశాలలో భద్రము చేయబడి వున్నది.

సజీవ దహనం:  

జనవరి 22 ,1999 మనోహర్ పూర్ అనే గ్రామానికి గ్రాహం తన ఇరువురు కుమారులతో కలిసి అక్కడ అడవిలో ప్రతి సంవత్సరం జరిగే కూడిక లో పాల్గొన్నాడు . తమ ప్రియమైన తండ్రితో కలిసి అక్కడికి వెళ్ళుట చిన్నారులకు ఎంతో ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇచ్చింది. అక్కడ యవ్వనస్తులైన కొండజాతి వారు గుంపులుగా నృత్యాలు చేయసాగారు. వారు స్టెయిన్స్ బస చేసిన వాహనానికి 100 మీటర్ల దూరంలో వున్నారు.అప్పుడు సమయం అర్థరాత్రి 12.20 గంటలు. అప్పటికే అక్కడకు రామద (Ramada) అనే ప్రాంతము నుండి దారాసింగ్ మరియు అతని బృందం చేరుకున్నారు. దారాసింగ్ క్రైస్తవులను మరియు క్రైస్తవ మిషనరీలను ఎంతో ద్వేషించేవాడు. వారు 12.20 గంటల ప్రాంతంలో అరుస్తూ కర్రలు , ఆయుధాలు పట్టుకొని స్టెయిన్స్ బస చేసిన వాహనాన్ని సమీపించారు. దారాసింగ్ తన వద్ద వున్న గొడ్డలి తో టైర్లను గాలిపోయే విధంగా చేశాడు.మిగతావారు కిటికీల అద్దాలు పగులకొట్టారు.గ్రాహం స్టెయిన్స్ మరియు పిల్లలను కర్రలతో మోదారు. దారాసింగ్ గడ్డిని తెచ్చి వాహనానికి నిప్పు పెట్టాడు.కొన్ని క్షణాల్లో ఆ వాహనం దగ్ధం కాబడింది.గ్రాహం తన ఇద్దరు కుమారులను పొదివి పట్టుకొని ‘క్ర్రీస్తు ప్రభువా’ అని పెదవులతో పలుకుతూ అగ్నికి ఆహుతి అయ్యాడు. వారు పూర్తిగా కాలిపోయే వరకు దారాసింగ్ మరియు అతని మనుష్యులు అక్కడనే వున్నారు. వారు వెళ్ళిన తరువాత అక్కడ వున్న మిగతా మిషన్ టీం వారు మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు కాని భయపడి దగ్గరకు వెళ్లలేకపోయారు.


స్టెయిన్స్ మరణానంతరం ఆయనకు అంజలి ఘటిస్తూ వేలకొలది ప్రజలు తరలివచ్చారు. బారిపద వాసులంతా సమాధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. లెప్రసీ మిషన్ లోని వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు.గ్లాడిస్ మాత్రమే వారిని ఓదార్చింది. ఎస్తేర్ , గ్లాడిస్ ఆ ముగ్గురి సమాధుల వద్ద కూర్చుని అందరితో కలిసి బైబిల్లోని వాక్యాలను పటించారు.ప్రాంతీయ భాష అయిన సంథాలిలో గీతాలను ఆలపించారు. గ్లాడిస్ ఎంతో ప్రశాంతంగా , స్థిమితంగా కనిపించారు. దేవుడు ఈ పరిస్థితుల ద్వారా వెళ్ళాల్సిఉంటుందని తన మౌన ధ్యాన సమయంలో ముందే ఆమెకు తెలియపరిచాడు.’నా తండ్రి క్రీస్తు కొరకు మరణించడానికి తగినవాడు అని దేవుడు ఎంచినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను’ అని ఎస్తేర్ స్టెయిన్స్ పలికింది.

ముగింపు:  

“కుష్టువ్యాధిగ్రస్తుల మధ్య సేవ చేయడానికి ఎంతో త్యాగ పూర్వకంగా వచ్చిన వ్యక్తికి కృతజ్ఞతలు తెలిపి ఆదర్శమూర్తిగా అభినందించాల్సినదే కాని సహనానికి , అహింసకు పేరుపొందిన భారతదేశంలో జరిగిన ఈ అమానుష చర్య ప్రపంచంలోని చీకటి కార్యాలకు చెందిన నేరము “ అని ఆనాటి భారత రాష్ట్రపతి శ్రీ.కే.ఆర్.నారాయణన్ అన్నారు.2005 లో భారత ప్రభుత్వం గ్లాడిస్ ను ‘పద్మశ్రీ’ బిరుదుతో సత్కరించింది. 

ఎస్తేర్ ఆస్ట్రేలియా లో వైద్య విద్యను పూర్తిచేసి , వివాహం చేసుకొని వైద్యురాలిగా అక్కడనే స్థిరపడినప్పటికి తరచూ భర్త తో కలిసి ఒరిస్సాకు వస్తూ తన తల్లి చేస్తున్న పరిచర్యలోను సహాయసహకారాలు అందిస్తున్నది. వారు నూతనంగా గ్రాహం స్టెయిన్స్ మెమోరియల్ హాస్పిటల్ ను బారిపద లో నిర్మించారు. గ్లాడిస్ ఇప్పటికి లెప్రసీహోం లోని వ్యాధిగ్రస్తుల గాయాలు కడుతూ, అనేకులకు సువార్తను ప్రకటిస్తూ తన పరిచర్యను కొనసాగిస్తున్నది. గ్లాడిస్ ఇలా అంటారు “ నా భర్త ఐదుగురు మనుష్యలు చేసే పనిని ఒక్కడే చేసేవాడు.... కాని నేను ఒక సాధారణ గృహిణిని....నాకు శారీరకంగా ఎన్నో హద్దులు వున్నాయి.....నా ప్రార్ధన ఇది, ప్రభువా నేనుఒక్కదాన్నే ఈ పరిచర్య అంతా చేయలేను......సవాళ్లతో కూడిన ఈ పరిచర్యలో పాలుపొందడానికి నీవు ఏర్పరుచుకొనిన వారిని పంపుము. భారత దేశములోని క్రైస్తవులు లెప్రసీహోం పనికి కొంత సహాయపడటానికి సిద్ధపడివస్తే అది ఎంతో అద్భుతం. దేవుడు నిజంగా పనిచేస్తున్నాడు....మరియు సాతాను ఆ విషయమై ఎన్నడూ సంతోషించడు......మనము ఇంకా ఎక్కువ శ్రమలను మాత్రమే ఊహించవచ్చు.”...


"ఇది హతసాక్షుల రక్తం మీద కట్టబడింది క్రైస్తవ్యం....ఇది యేసయ్య ప్రేమగా కట్టిన సామ్రాజ్యం ...ప్రేమ సామ్రాజ్యం...దీన్ని అంతం చేయడం ఎవరికైనా సాద్యమా......అసాధ్యం....అది మండుచున్న సీనాయి పర్వతం మీద పత్యక్షమైన క్రైస్తవ్యం...ఇది మండుచున్న పొద ఎన్నటకి బూడిద కానే కాదు...పరలోకంవరకు ఇవే జ్వాలలు రేగుతూనే ఉంటాయి.".....ఆమెన్

--------------------------------------------------------------------

పాస్టర్. వరదాన్ దేవదాసి

Source : Facebook

  • WhatsApp
  • No comments:

    Post a Comment