Search Here

Showing posts with label M. Show all posts
Showing posts with label M. Show all posts

May 14, 2023

Mary Jones | మేరీ జోన్స్

మేరీ జోన్స్  గారి జీవిత చరిత్ర

  • జననం : 16-12-1784
  • మహిమ ప్రవేశం : 28-12-1864
  • స్వస్థలం : నార్త్ వేల్స్, యునైటెడ్ కింగ్‌డమ్
  • దర్శన స్థలము : -

మేరీ జోన్స్ ఆరు సంవత్సరాల పాటు డబ్బును దాచుకొని, తన మాతృభాషలో బైబిలు గ్రంథమును కొనుటకు ఇరవై ఆరు మైళ్ళు నడిచి వెళ్ళిన ఒక బాలిక. ఆమె బాల్యములో తన తల్లితో కలిసి వెల్ష్ గ్రామీణ ప్రాంతములోని ఒక చిన్న కుటీరంలో నివసించేవారు. నేత నేసేవాడైన ఆమె తండ్రి తన కుటుంబమును పోషించుటకు ఎంతో కష్టపడి పనిచేసేవారు. అయితే, మేరీకి నాలుగేళ్ళ వయసు ఉన్నప్పుడు అనుకోని విధంగా ఆమె తండ్రి మరణించారు. కాగా తన భుజములపై పడిన కుటుంబ పోషణ బాధ్యతను నెరవేర్చుటకు ఆమె తల్లి చాలా కష్టపడవలసి వచ్చింది. అటువంటి సమయములో ఎటువంటి సణుగుడు లేకుండా మేరీ ఇంటిలో తన వంతు పనులను చేస్తూ తన తల్లికి సహకరించేవారు.


ఎనిమిదేళ్ళ వయసులో క్రీస్తును తెలుసుకొనిన మేరీకి అప్పటినుండి బైబిలు కథలు చదవడం అభిరుచిగా మారింది. ఆదివారం నాడు ఆమె తమ పాదిరిగారు బైబిలు చదువుచుండగా వినుటకు రెండు మైళ్ళ దూరంలో ఉన్న గ్రామంలోని చిన్న ప్రార్థనా మందిరమునకు కాలినడకన వెళ్ళేవారు. చదువబడుచున్నప్పుడు ఎంతో సుందరమైనవిగా తోచే బైబిలులోని ఆ పదములను బట్టి ఎంతో అచ్చెరువొందే ఆమె, వాటిని తన హృదయములో భద్రపరచుకునేవారు. ఒక ఆదివారం ఉదయం వారి గ్రామంలో ఒక పాఠశాల ప్రారంభించనున్నట్లు ప్రకటించబడగా మేరీ యొక్క ఆనందానికి అవధులు లేవు, ఎందుకంటే తద్వారా బైబిలును ఎలా చదవాలో నేర్చుకొనవచ్చునని ఆమె తలంచారు. చదవడం నేర్చుకొనిన తరువాత తన స్వంత బైబిలును కలిగియుండాలని కోరుకున్నారు మేరీ. అయితే వారి ఆర్థిక పరిస్థితి కారణంగా ఆమె తల్లి దానిని కొనలేక పోయినందున, బైబిలు కొనుటకు తగినంత డబ్బు సమకూర్చుకొనవలెనని ఆమె ఆరు సంవత్సరాలు పలు విధ ఉద్యోగాలు చేశారు.


బైబిలు కొనుటకు వారి గ్రామమునకు సమీపములో ఉన్న ప్రదేశం ఏదనగా అక్కడికి ఇరవై ఆరు మైళ్ళ దూరంలో ఉన్న రెవ. థామస్ చార్లెస్ అనే పాదిరిగారి స్థలం. కాగా బైబిలు కొరకు చెప్పులు కూడా లేకుండా అన్ని మైళ్ళు నడిచివెళ్ళిన ఆమెకు చివరి బైబిలు అప్పటికే అమ్ముడైందన్న వార్త వలన నిరాశే మిగిలింది. ఏదేమైతేనేమి, రెండు రోజుల తరువాత ఆమె తన స్వంత బైబిలు ప్రతిని పొందగలిగారు. కొంతకాలం తరువాత రెవ. చార్లెస్ పాదిరి మేరీతో తనకు కలిగిన అనుభవమును గురించి లండన్‌లో జరిగిన ‘రిలిజియస్ ట్రాక్ట్ సొసైటీ’ సమావేశంలో పంచుకున్నారు. తత్ఫలితంగా, వెల్ష్ బైబిళ్ళను సరఫరా చేయుటకు ఒక క్రొత్త సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ తదుపరి ‘ది బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీ’ గా ఉద్భవించింది. ఇది 1804వ సంll నుండి 700 భాషలలో అర్థ బిలియనుకు పైగా బైబిళ్ళను ప్రచురించింది.


ఒక చిన్న హృదయంలో దేవుని వాక్యం పట్ల ఉన్న లోతైన వాంఛ మరియు తృష్ణ, ప్రపంచ నలుమూలలకు బైబిలు సరఫరా చేయబడుటకు కారణమవుతుందని ఎవరైనా ఊహించగలరా?

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, ఈ రోజు మీరు దేవుని వాక్యమును చదివారా? 

ప్రార్థన :

"ప్రభువా, మీ వాక్యము ద్వారా మిమ్ములను మరింతగా తెలుసుకొనవలెననే తృష్ణ కలిగిన ఆత్మను నాకు అనుగ్రహించుము. ఆమేన్!" 

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Jul 26, 2022

    Margaret Stephen Kennedy | మార్గరెట్ స్టీఫెన్ కెనడీ

    మార్గరెట్ స్టీఫెన్ కెనడీ గారి జీవిత చరిత్ర



    • జననం: 18-01-1814
    • మహిమ ప్రవేశం: 23-05-1891
    • స్వస్థలం: అబెర్డీన్
    • దేశం: స్కాట్లాండు
    • దర్శన స్థలము: భారతదేశం


    మార్గరెట్ స్టీఫెన్ కెనడీ భారతదేశానికి వచ్చి సేవ చేసిన మొట్టమొదటి జెనానా మిషనరీలలో ఒకరు. ఆ కాలంలో బహిరంగ ప్రదేశాలలో కనిపించుటకు గానీ, పురుషులతో మాటలాడుటకు గానీ అనుమతించబడని భారతీయ మహిళల యొద్దకు సువార్తను మోసుకువెళ్ళుటకు ఈ జెనానా పరిచర్య మహిళా మిషనరీలను పంపేది.


    దైవభక్తి కలిగిన ఒక క్రైస్తవ కుటుంబములో జన్మించిన మార్గరెట్, పదమూడేళ్ళు నిండక మునుపే ఆత్మీయ విషయములపై ఆసక్తిని పెంచుకున్నారు. అయితే చర్చికి హాజరుకావడం కంటే ఆత్మీయ సంబంధమైన పుస్తకములతో నిండియున్న తన తండ్రి యొక్క గ్రంథాలయములో సమయమును గడపడమంటే ఆమెకు చాలా ఇష్టం. తన ఈడు అమ్మాయిలకు భిన్నంగా ఉండే ఆమె, నీతి కలిగిన జీవితమును గడుపుటకు ప్రయత్నించారు. అయితే ఒక సంఘ కూడికలో నీతి క్రియలపై ఇవ్వబడిన ఒక ప్రసంగమును ఆమె విన్నప్పుడు, అది ఆమె జీవితమును మార్చివేసింది. తాను ఒక స్వనీతిపరురాలిగా ఉన్నట్లు, రక్షింపబడుటకు తనకు దేవుని కృప అవసరం అన్నట్లు ఆమె వెంటనే గ్రహించారు. తత్ఫలితముగా ఆ రోజున ఆమె తన జీవితమును యేసు క్రీస్తు ప్రభువుకు సమర్పించుకున్నారు.


    భారతదేశంలో మిషనరీ అయిన ఆమె సోదరి ఎలిజా అన్నా నుండి పిలుపును అందుకొనిన మార్గరెట్ 1838వ సంll లో బెనారస్‌కు చేరుకున్నారు. సున్నితమైన శరీరం కలిగిన మార్గరెట్ భారతదేశము యొక్క కఠినమైన వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేక ఎంతో ఇబ్బంది పడ్డారు. కాగా అనారోగ్యం కారణంగా ప్రారంభ దినములను దేవుని కొరకు పనిచేయుట కంటే అధికముగా విశ్రాంతి తీసుకొనుటలోనే గడిపారు. అయితే ఎటువంటి అవరోధాలు గానీ, అనారోగ్యం గానీ మార్గరెట్ యొక్క దృఢమైన మనస్సుకు సరితూగలేదు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తనను అలవరచుకున్న ఆమె, హిందీ భాషను నేర్చుకున్నారు మరియు ప్రారంభములో అనాథ పిల్లల మధ్య పరిచర్య చేసి, వారి కొరకు ఆదివారపు బైబిలు పాఠశాలను (సండే స్కూల్) నిర్వహించారు. జేమ్స్ కెనడీతో ఆమెకు వివాహం జరిగిన తరువాత, కుటుంబముగా వారు అల్మోరా అనే ప్రాంతమునకు తరలి వెళ్ళారు. అక్కడ ఆమె కుష్ఠురోగులకు సేవ చేయుటలో తన సమయమును వెచ్చించి, వారిలో అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించారు.


    భారతదేశములో మార్గరెట్ చేసిన అతి ముఖ్యమైన పరిచర్య జెనానా మిషనరీగా ఆమె జరిగించిన సేవ. వైద్య సేవలను లేదా విద్యను అందించుట కొరకు మాత్రమే భారతీయ మహిళలను కలవడానికి మహిళా మిషనరీలు అనుమతించబడినప్పటికీ, వారిని సందర్శించుట వెనుక ఉన్న మార్గరెట్ ఉద్దేశ్యం వారికి సువార్తను అందించడమై యున్నది. అందును బట్టి ఆమె కొట్టబడవచ్చు లేదా చంపబడవచ్చు. అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య కూడా ఆమె సందర్శించిన స్త్రీలు ఖచ్చితముగా యేసు క్రీస్తును ఎరుగునట్లు ఆమె నిశ్చయపరిచారు. ఆ విధముగా ఆమె ఒక కూర్గి యువరాణిని కూడా క్రీస్తు కొరకు సంపాదించారు.


    వృద్ధాప్య దశలో 1877వ సంll లో మార్గరెట్ భారతదేశాన్ని విడిచి ఈడిన్‌బర్గ్ వెళ్ళారు. అక్కడ వృద్ధులకు, అనారోగ్యముతో ఉన్నవారికి, పేదలకు సేవ చేస్తూ దేవుని సేవలో ముందుకు సాగిపోయిన మార్గరెట్ స్టీఫెన్ కెనడీ, చివరికి 1891వ సంll లో దేవుని కొరకు తాను పడిన కష్టము నుండి పరమ విశ్రాంతిని పొందారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, స్వనీతి నుండి మీరు విడుదల పొందారా? 


    ప్రార్థన :

    "ప్రభువా, స్వనీతి అనే అంధత్వముతో కూడిన పాపము నుండి నన్ను విడిపించుము. ఆమేన్!" 

    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Miles Bronson | మైల్స్ బ్రోన్సన్

    మైల్స్ బ్రోన్సన్ జీవిత చరిత్ర



    • జననం: 20-07-1812
    • మహిమ ప్రవేశం: 09-11-1883
    • స్వస్థలం: న్యూయార్క్
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: ఈశాన్య భారతదేశం


    మైల్స్ బ్రోన్సన్ ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో సేవ చేసిన ఒక అమెరికా మిషనరీ. 1836వ సంll లో పట్టభద్రులైన పిమ్మట అతను బాప్తిస్టు సంఘముచే సేవ కొరకైన నియామక అభిషేకమును పొందారు. వెనువెంటనే అతను భారతదేశంలోని అస్సాంలో సేవ చేయుటకు ‘అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ యూనియన్’ వారిచే నియమించబడ్డారు. 


    తదుపరి బర్మాకు వెళ్ళవలెననే దర్శనంతో మైల్స్ 1838వ సంll లో అస్సాంలోని సాదియాకు వచ్చారు. అయితే అతని పట్ల దేవుని ప్రణాళిక మరొక విధంగా ఉంది. నాతాన్ బ్రౌన్ మరియు ఓ.టి. కట్టర్‌ అనే మరో ఇద్దరు మిషనరీలతో కలిసి అతను అక్కడి స్థానికుల మధ్య సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. తరువాత అస్సాంలో ఉన్న జైపూర్ అనే ప్రాంతమునకు వెళ్ళిన అతను, అక్కడ నోక్టే తెగ యొక్క మాండలికమైన నోక్టే భాషను నేర్చుకున్నారు. నోక్టే తెగవారు అరుణాచల్ ప్రదేశ్ లోని నామ్‌సాంగ్‌లో నివసిస్తున్న ‘నాగ’ తెగ యొక్క జాతికి చెందినవారు. వారు ఉప్పు వ్యాపారం నిమిత్తం అస్సాంలోని జైపూర్‌కు వచ్చేవారు. కాగా క్రీస్తు ప్రేమతో నింపబడిన మైల్స్, ఈ నోక్టే తెగల మధ్య పరిచర్య చేయడం ప్రారంభించారు.


    నామ్‌సాంగ్‌ చేరుకొనుటకు దట్టమైన అడవులు, కొండలు, సెలయేర్లను దాటుకుంటూ ఎన్నో సవాళ్ళతో కూడుకొనిన ప్రమాదకరమైన ప్రయాణాన్ని చేపట్టారు మైల్స్. అతను ఆంగ్లేయుల గూఢాచారి అయ్యుండవచ్చునని స్థానికులు అతనిని పలుమార్లు అనుమానించారు. వారి గ్రామ శివార్లలో రెండు రోజులు గడిపిన తరువాత, వారి భాష నేర్చుకోవాలనే ఆసక్తిని వినయపూర్వకముగా వ్యక్తం చేసిన మైల్స్ చివరకు గ్రామ నాయకుడైన ఖోన్‌బావో యొక్క అభిమానాన్ని చూరగొన్నారు. క్రమక్రమంగా అతను వారికి నిత్య జీవ మార్గమును మరియు నాగరిక జీవితమును బోధించారు. సువార్తకు సంబంధించిన రచనలను నోక్టే భాషలోకి అనువదించిన అతను, స్థానిక పిల్లలకు పాఠశాలలను కూడా స్థాపించారు.


    అంతేకాకుండా అనేక అస్సామీ మాండలికాలకు మైల్స్ గొప్ప సహకారమును అందించారు మరియు వాటికి ఒక రూపమును చేకూర్చి, సాహిత్య వ్యక్తీకరణను అభివృద్ధి పరచారు. అతను మొట్టమొదటి అస్సామీ-ఆంగ్ల నిఘంటువును ప్రచురించారు. అందునుబట్టి అస్సామీలు ఈనాటికి కూడా కృతజ్ఞులైయున్నారు. అంతేకాకుండా అతను అస్సామీ భాషలోనికి బైబిలును అనువదించడం కూడా ప్రారంభించారు.


    కొండ ప్రాంత వాతావరణమును తట్టుకొనుట అతని దేహమునకు ఎంతో కఠినముగా ఉన్నప్పటికీ మరియు దాని కారణముగా అతని సోదరి రోడా మరణించినప్పటికీ వెనుకంజవేయని మైల్స్, 1879వ సంll వరకు కూడా ఈశాన్య భారత పరిచర్యలో ముందుకు సాగిపోయారు. పిమ్మట అమెరికాకు తిరిగి వెళ్ళిన అతను, 1883వ సంll లో ప్రభువునందు నిద్రించారు. అరుణాచల్ ప్రదేశ్ లో అత్యధిక శాతం కలిగియున్న మతముగా క్రైస్తవ మతము మారుటలో మైల్స్ చేసిన పరిచర్య పునాదిగా నిలుస్తుంది. అయితే ఈనాడు అరుణాచల్ ప్రదేశ్‌లో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలు నిషేధించబడినవిగా ఉన్నాయని మీకు తెలుసా?


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, భారతదేశం యొక్క కోత విస్తారముగా ఉన్నది. పనిచేయుటకు మీరు సిద్ధమేనా? 


    ప్రార్థన :

    "ప్రభువా, సువార్త పరిచర్య కొరకై అరుణాచల్ ప్రదేశ్ యొక్క ద్వారములను తెరువుము. ఆమేన్!"  

    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Apr 7, 2022

    Martin Bucer | మార్టిన్ బూసర్

    మార్టిన్ బూసర్ జీవిత చరిత్ర



    • జననం : 11-11-1491
    • మరణం : 28-02-1551
    • స్వస్థలం : ష్లెట్‌స్టాడ్
    • దేశం : -
    • దర్శన స్థలము :  స్ట్రాస్‌బర్గ్, ఫ్రాన్స్


    మార్టిన్ బూసర్ ష్లెట్‌స్టాడ్‌లోని ఒక పేద కుటుంబములో జన్మించారు. అతని తండ్రి పీపాలను తయారుచేసేవారు. అయినప్పటికీ, ప్రతిష్టాత్మక లాటిన్ పాఠశాలలో చదువుకున్న అతను, 15 సంll ల వయస్సులో మతపరమైన విద్యాభ్యాసం కొరకు "డొమినికన్ ఆర్డర్" ‌లో చేరారు. అక్కడ అతను ఒక ఉత్తమ విద్యార్థిగా రాణించగా, వేదాంత విద్యను కొనసాగించుటకు హైడెల్బర్గ్‌కు పంపించబడ్డారు.


    1518వ సంll లో హైడెల్బర్గ్‌లో సిలువను గూర్చిన వేదాంతమును మార్టిన్ లూథర్ వివరించుచుండగా బూసర్ వినడం జరిగింది. ఆ సిలువ సందేశం బూసర్ మనస్సుపై ఎంతో ప్రభావం చూపించగా, వెంటనే అతను తన క్రైస్తవ సన్యాసి జీవితాన్ని విడిచిపెట్టి, వేదాంత సత్యాన్ని వెదుకుటకు పయనమయ్యారు. రెండు సంవత్సరాల పాటు పలు క్రైస్తవ సంస్కరణవాదులతో తీవ్రముగా చర్చించారు. అతను చర్చించిన సంస్కరణవాదులలో మార్టిన్ లూథర్ కూడా ఉన్నారు. అటు పిమ్మట అతను ల్యాండ్‌స్టూల్ మరియు విస్సెంబర్గ్‌లలో సేవ చేయడం ప్రారంభించారు. రక్షణకు ఏకైక ఆధారం బైబిలేనని, ప్రతి ఒక్కరు కూడా వారి స్వరక్షణకు వారే బాధ్యులని అతను బోధించడం ప్రారంభించారు. వారి స్వార్థం కొరకు ప్రజలను సత్యానికి దూరముగా నడిపించిన క్రైస్తవ సన్యాసులను మరియు పోప్‌లను బూసర్ ఖండించారు. తద్వారా కాథలిక్ సంఘ నాయకుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న బూసర్, విస్సెంబర్గ్‌ నుండి బహిష్కరించబడ్డారు.


    ఎటువంటి జీవనాధారం లేకుండా 1523వ సంll లో బూసర్ స్ట్రాస్‌బర్గ్‌కు వెళ్ళగా, అక్కడ హల్డ్రిచ్ జ్వింగ్లీ అతనిని చేర్చుకున్నారు. కొద్ది రోజులలోనే అక్కడ బైబిలు పఠనములను నిర్వహించడం మొదలుపెట్టిన అతను, 1524వ సంll ఆగస్టు నాటికి సెయింట్ అరేలియా పారిష్ యొక్క కాపరిగా నియమించబడ్డారు. అక్కడ 1549వ సంll వరకు సేవలందించిన అతను, అక్కడి నుండే ఐరోపాలోని వివిధ ప్రాంతాలలో సంస్కరణ ఉద్యమానికి నాయకత్వం వహించారు. అతను లూథర్ ఉపన్యాసాల యొక్క లాటిన్ అనువాదాలను ప్రచురించారు. అంతేకాకుండా, బైబిలులోని సువార్త పుస్తకములు, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక, యోహాను వ్రాసిన పత్రిక, జెఫన్యా మరియు కీర్తనలపై తన స్వంత వ్యాఖ్యానములను కూడా వ్రాశారు.


    అప్పటిలో విభజనలతో కూడియున్న ప్రొటెస్టెంట్ సిద్ధాంతాలను ఐక్య పరచడంలో బూసర్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. అంతేకాక అతను మార్టిన్ లూథర్ మరియు హల్డ్రిచ్ జ్వింగ్లీల మధ్య మధ్యవర్తిగా కూడా వ్యవహరించారు. దేవునిలో మన విశ్వాసము చిన్న బిడ్డలను పోలినదై యుండవలసిన ఆవశ్యకతను గురించి అతను విశ్వాసులకు వివరించేవారు. వాక్యములోని సత్యము యొక్క వెలుగులో క్రైస్తవ సంఘమును  ప్రోత్సహిస్తూ మరియు సరిదిద్దుతూ అతను ఐరోపా ఖండమంతటా విస్తృతంగా పర్యటించారు. అతను తన జీవితపు చివరి రోజులను ఇంగ్లాండులో థామస్ క్రాన్మర్‌కు సంస్కరణ సేవలో సహాయం చేస్తూ మరియు క్రీస్తు రాజ్యమును గురించిన తన అద్భుతమైన రచన అయిన ‘డి రెగ్నో క్రిస్టి’ ని రచిస్తూ గడిపారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, దేవునిలో మీ విశ్వాసం చిన్న బిడ్డలను పోలినదై ఉన్నదా?

    ప్రార్థన :

    "ప్రభువా, అన్ని విషయములను సరియైన రీతిలో గ్రహించగల వివేచనను కలిగి ఏది సత్యమో ఏది అసత్యమో గుర్తించగలుగునట్లు, మీ యొక్క వాక్య జ్ఞానములో అభివృద్ధి పొందుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!" 


    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Maharasan Vedamanickam | మహారాజన్ వేదమాణిక్కం

    మహారాజన్ వేదమాణిక్కం జీవిత చరిత్ర



    • జననం : 1763
    • మరణం : 27-01-1827
    • స్వస్థలం : మయిలాడి 
    • దేశం  : భారతదేశం 
    • దర్శన స్థలము : మయిలాడి, భారతదేశం


    వేదమాణిక్కం యొక్క అసలు పేరు మహారాజన్. అతను ట్రావెన్కోర్ రాజ్యానికి చెందిన మొదటి ప్రొటెస్టెంట్ క్రైస్తవుడు. ట్రావెన్కోర్‌లో ఆత్మీయ ఉజ్జీవమే గాక సామాజిక విప్లవమునకునూ మార్గదర్శకులలో ఒకరిగా అతను పరిగణించబడ్డారు. ఎంతో నిష్ఠ కలిగిన శైవ కుటుంబములో జన్మించిన అతను, సనాతన హిందూ మత పద్ధతులతో పెంచబడ్డారు. వ్యవసాయ కుటుంబమైన అతని కుటుంబం మయిలాడిలో వరి పొలాలను కలిగియుండగా, అతను కూడా తల్లిదండ్రులతో కలిసి పంట పొలాలలో పనిచేసేవారు.


    ఆధ్యాత్మికమైన వ్యక్తిగా ఉండే మహారాజన్ క్రమం తప్పకుండా దేవాలయాలను సందర్శించేవారు. అయితే ఏవీ కూడా లోతైన అతని ఆత్మీయ దాహాన్ని తీర్చలేక పోయాయి. కాగా ఒకసారి అతను చిదంబరం అనే ప్రదేశాన్ని సందర్శించినప్పుడు, తన ఆధ్యాత్మిక మార్గములను సరిదిద్దుకొనుటకు ఒక దేవదూత దర్శనం ద్వారా అతను ఒప్పించబడినట్లు చెప్పబడుతుంది. ఆ స్వప్నం ద్వారా మార్గనిర్దేశం చేయబడిన అతను తంజావూరులోని తన బంధువుల యొద్దకు వెళ్ళగా, వారు అతనిని క్రైస్తవ ఆలయమునకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ “యేసు నొద్దకు రండి…. మీకు శాంతి లభిస్తుంది!” అని ప్రసంగిస్తున్న రెవ. కోలాఫ్ యొక్క మాటలు అతని హృదయములో బలముగా క్రియ చేశాయి. తత్ఫలితముగా అతను తన పాపములను ఒప్పుకొని, క్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించారు. పిమ్మట అతను బాప్తిస్మం తీసుకొనగా, అతనికి 'వేదమాణిక్కం' అనే క్రైస్తవ పేరు ఇవ్వబడింది.


    రక్షణానుభవంతో అతని హృదయములో సంతోషం ఉప్పొంగగా, తన స్వంత ఊరైన మయిలాడీకి తిరిగి వెళ్ళి, క్రీస్తు ప్రేమను తన స్వజనులతో పంచుకొనవలెనని వేదమాణిక్కం ఎంతగానో వాంఛించారు. అయితే మొదట అతను ట్రాంక్యుబార్ మిషన్‌కు చెందిన డాll జాన్‌తో కొంత కాలం గడుపగా, జాన్ అతనికి మిషనరీ పరిచర్యను గురించి మార్గనిర్దేశం చేశారు. చివరికి అతను తన గ్రామానికి చేరుకున్నప్పుడు అతని కుటుంబం అతని అంత్యక్రియలను జరిగించడం చూశారు. ఏలయనగా చిదంబరం వెళ్ళిన అతను తిరిగి రావడం బాగా ఆలస్యం కావడంతో అతను మరణించియుంటారని వారు తలంచారు. ఏదేమైనప్పటికీ, అతను వారికి ఆత్మీయ మరణం గురించి మరియు నిత్యజీవము యొక్క మార్గము గురించి వివరించారు. అతని సాక్ష్యం అతని కుటుంబ సభ్యులనే కాదు, ఆ గ్రామంలోని అనేకమందిని క్రీస్తు వద్దకు తీసుకువచ్చింది. రెవ. విలియం రింగెల్టాబ్‌తో అతనికున్న అనుబంధం పరిచర్యను ఫలభరితమైనదిగా చేయడంతో పాటు, మయిలాడిలో మొదటి క్రైస్తవ సంఘ స్థాపనకు దారితీసింది. 1827వ సంll లో మహిమలోకి చేర్చబడే వరకూ అతను గ్రామాలను సందర్శిస్తూ, సువార్త ప్రకటిస్తూ, ప్రార్థనా కూడికలను, క్రమం తప్పకుండా బైబిలు పఠనములను నిర్వహిస్తూ, ఎటువంటి విదేశీ మిషనరీ సహాయం లేకుండా మయిలాడి మిషన్‌ను కొనసాగిస్తూ దేవుని సేవలో ముందుకు సాగిపోయారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీ స్నేహితులు మరియు బంధువులు రక్షింపబడవలెనన్న భారమును మీరు కలిగియున్నారా? 


    ప్రార్థన :

    "ప్రభువా, నా కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రుల మధ్య మీ ప్రేమను గూర్చి ధైర్యముగా సాక్ష్యమిచ్చుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!




  • WhatsApp
  • Jan 6, 2022

    Mary Moffat Livingstone Life History

    మేరీ మోఫాట్ లివింగ్‌స్టన్ గారి జీవిత చరిత్ర



    • జననం: 12-04-1821
    • మహిమ ప్రవేశం: 27-04-1862
    • స్వస్థలం: గ్రిక్వాటౌన్
    • దేశం: ఆఫ్రికా
    • దర్శన స్థలము: ఆఫ్రికా

     దక్షిణాఫ్రికాలోని కురుమన్ అనే ప్రాంతంలో లండన్ మిషనరీ సొసైటీకి చెందిన రాబర్ట్ మోఫాట్ మరియు మేరీ మోఫాట్ బెచువానా ప్రజల మధ్య సేవ చేశారు. ఈ మిషనరీ దంపతుల పెద్ద కుమార్తెయే మేరీ. చిన్నప్పటి నుండీ దేవుని యందలి భయభక్తులతో పెరిగిన మేరీ తాను కూడా ఆఫ్రికాలో మిషనరీగా సేవ చేయాలని ఎప్పుడూ కోరుకునే వారు. ఆమె ఉపాధ్యాయురాలిగా శిక్షణ పొంది, కురుమన్‌లో ఉన్న పాఠశాలలో పని చేశారు. నైపుణ్యం గలిగిన ఉపాధ్యాయినిగా మరియు గృహిణిగా స్థానిక ప్రజల మధ్య ఆమె మంచి గౌరవాన్ని పొందారు.

      1845వ సంll లో ఒక వైద్య మిషనరీ మరియు ఆఫ్రికా ఖండ అన్వేషకుడు అయిన డేవిడ్ లివింగ్‌స్టన్‌తో మేరీ యొక్క వివాహం జరిగింది. తన భర్త చేసే మిషనరీ సేవకు తనను పూర్తిగా అంకితం చేసుకున్న ఆమె లివింగ్‌స్టన్ సేవలో భాగముగా చేసే ప్రతి ప్రయత్నములోనూ అతనికి బలాన్ని మరియు తోడ్పాటును ఇచ్చే మంచి సహచారిణిగా మారారు. సింహాల యొక్క దాడులతో పీడింపబడుతూ, భయాందోళనలతో నిండుకొనియున్న మాబోట్సా అనే గ్రామ నివాసులకు లివింగ్‌స్టన్‌తో కలిసి సువార్త ప్రకటించుటకు ఆమె ధైర్యముగా ముందుకు వచ్చారు. ఒక ఆసక్తి గల అన్వేషకుడైన తన భర్తతో కలిసి ఆమె తన పిల్లలతో పాటు తరచుగా ఆఫ్రికా యొక్క దట్టమైన అడవుల గుండా ప్రయాణిస్తూనే ఉండేవారు. ఎంతో కష్టతరమైన ఆ ప్రయాణాలు ప్రమాదకరమైనవిగా ఉండేవి. కొన్నిసార్లు రోజుల తరబడి నీరు దొరకని పరిస్థితులగుండా కూడా వారు ప్రయాణాన్ని సాగించారు. వారు మొట్ట మొదటిగా తలపెట్టిన ప్రయాణములో మేరీ తీవ్ర అనారోగ్యానికి గురవ్వడమే కాకుండా, క్రొత్తగా జన్మించిన తమ కుమార్తెను కూడా కోల్పోయారు. అనారోగ్యంగానీ, గర్భము దాల్చిన క్లిష్ట పరిస్థితులు గానీ, తన బిడ్డను కోల్పోయిన హృదయ వేదన గానీ, ఏవీ కూడా తన భర్త యొక్క సేవలో సహకరించుటకు ఆమెను అడ్డుకోలేక పోయాయి. నాలుగవ సారి గర్భిణిగా ఉన్నప్పుడు కూడా మకోలోలో ప్రజలకు సువార్తను అందించుటకై 1500 మైళ్ళు కలహారి ఎడారి గుండా తన భర్తతో కలిసి ప్రయాణించుటకు ఆమె వెనుకంజ వేయలేదు. 

      సేవను ప్రారంభించిన తొలి దినములలో తీవ్రమైన పేదరికాన్ని ఎదుర్కొన్నప్పటికీ ఎటువంటి లోటూ తెలియకుండా కుటుంబాన్ని ముందుకు నడిపించిన జ్ఞానవంతురాలు మేరీ. తన పిల్లల యొక్క విద్యాభ్యాసం కొరకు 1852-56 వరకు భర్తను విడిచి ఆమె ఇంగ్లాండు దేశములో గడిపారు. మిషనరీ సేవలో ఆఫ్రికా అడవులలో ప్రయాణాలు కొనసాగిస్తున్న తన భర్త యొక్క యోగ క్షేమాలు తెలియక పోయినప్పటికీ, పిల్లలను పోషిస్తూ, వారిని క్రమశిక్షణలో పెంచుతూ ఆ నాలుగు సంవత్సరాలు ఆమె ఎంతో క్లిష్టమైన సమయాన్ని ఎదుర్కొన్నారు. తన వైవాహిక జీవితములో తాను అనుభవించిన ఒంటరితనాన్ని, ఎన్నో కష్టాలను ఆమె మౌనముగా భరించారు. జాంబెజి నది అన్వేషణలో ఉన్న తన భర్తను చేరుకొనుటకు 1858వ సంll లో ఆమె తిరిగి ఆఫ్రికాకు వెళ్ళారు. అక్కడ షుపాంగా మిషన్ శిబిరంలో మలేరియా బారిన పడిన మేరీ మూడు నెలల తరువాత మరణించారు.

    ప్రియమైనవారలారా, మిషనరీ సేవకు సహకరించుటలో మీ పాత్ర ఏమిటి?

    "ప్రభువా, ప్రపంచ నలుమూలలా జరుగుతున్న మిషనరీ సేవకు సహాయకారిగా ఉండుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Dec 24, 2021

    Maria Dyer Taylor Life History

    మారియా డయ్యర్ టేలర్ గారి జీవిత చరిత్ర



    • జననం: 16-01-1837
    • మహిమ ప్రవేశం: 23-07-1870
    • స్వస్థలం: పెనాంగ్
    • దేశం: మలేషియా
    • దర్శన స్థలము: చైనా

    యాంగ్జౌలోని హడ్సన్ టేలర్ ఇంటిలోనికి గుంపుగా కొంతమంది జనులు చొరబడ్డారు. అక్కడ అనేక మంది మిషనరీలైన యువతులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ప్రాణభయంతో పరుగెత్తగా, ఆరు నెలల గర్భిణిగా ఉన్న ఒక స్త్రీ మాత్రం ఎంతో శాంతియుతంగా ఆ అల్లరి గుంపులో ఉన్నవారితో మాట్లాడడం ద్వారా వారిని ఆపగలిగారు. ఆ విధముగా ఆ రోజున చాలా మంది యువతులను ఆ జనుల గుంపు చేతులలో శ్రమనొంది మరణించకుండా కాపాడిన ఆమె మరెవరో కాదు మారియా జేన్ (డయ్యర్) టేలర్.

    మారియా లండన్ మిషనరీ సొసైటీ యొక్క మిషనరీ అయిన శామ్యూల్ డయ్యర్ యొక్క చివరి కుమార్తె. పదేళ్ళ వయస్సులో తల్లిదండ్రులను కోల్పోయిన ఆమె ఇంగ్లాండులో తన తల్లి యొక్క సోదరుని వద్ద పెరిగారు. తల్లిదండ్రుల ద్వారా ప్రేరణ పొందిన మారియాకు కూడా మిషనరీ పని వైపు మొగ్గు ఉన్నప్పటికీ, ఆమె క్రైస్తవ భక్తి కేవలం లాంఛనప్రాయమైనది. అయితే ఆమెకు 16 సంll ల వయసు ఉన్నప్పుడు చైనా దేశంలోని నింగ్బోలో ఉన్న ఒక బాలికల మిషనరీ పాఠశాలలో పనిచేసే అవకాశం లభించింది. కాగా చైనాకు వెళ్ళే ఆ ప్రయాణంలోనే ఆమె పాపము నుండి విమోచించే రక్షకునిగా క్రీస్తునందు విశ్వాసముంచి, దేవుని సేవ కొరకై తన జీవితాన్ని సమర్పించుకున్నారు.

    చైనా చేరిన తరువాత ఆమె అతి త్వరలోనే చైనా భాషను నేర్చుకుని, నింగ్బో మాండలికంలో నిష్ణాతులుగా మారారు. కాగా తన విద్యార్థులు మంచి గ్రహింపును కలిగి పాఠ్యభాగములను అర్థం చేసుకొనవలెనని ఆమె ఆంగ్లంలో ఉన్న పాఠ్యపుస్తకములను చైనా భాషలోనికి అనువదించారు. తదుపరి 1858వ సంll లో హడ్సన్ టేలర్‌ను వివాహం చేసుకుని, అతనికి ఒక అమూల్యమైన సహచరిణిగాను, మంచి భాగస్వామిగాను మారారు. హడ్సన్ టేలర్ చైనా ఇన్‌లాండ్ మిషన్‌ను  స్థాపించినప్పుడు మారియా ఆ సేవలో కీలక వ్యక్తి అయ్యారు. ప్రార్థన, విశ్వాసాలతో నిండుకొనిన ఆమె యొక్క జీవితం కష్ట సమయాలలో తన భర్తను బలపరిచేదిగా నిలిచింది. ఆమె ఆచరణాత్మక దృక్పథం పరిచర్య మొత్తాన్ని కలిపివుంచే తీగవంటిది. వారి పరిచర్య అభివృద్ధి చెందుతున్నప్పుడు చైనావారి సంస్కృతిని అవలంబించుటకు మిషనరీలైన యువతులకు ఆమె శిక్షణనిచ్చారు.


    ఒకవైపు పరిచర్య ఎంతో తీవ్రముగా కొనసాగుతుంది. అయితే ఆమె తన యొక్క ఎనిమిది మంది పిల్లలలో నలుగురిని కోల్పోయారు. పైగా ఆరోగ్యపరంగా కూడా ఆమె బాగా బలహీనపడ్డారు. అయినప్పటికీ క్రీస్తు సేవ చేయాలనే ఆమె దృఢ నిశ్చయాన్ని ఏదీ కూడా కదల్చలేకపోయింది. మారియా తన పిల్లలలో కూడా మిషనరీ విలువలను ప్రోత్సహించగా, అది వారు కూడా చైనాలో మిషనరీలుగా మారుటకు దారితీసింది. 33 సంవత్సరాల వయస్సులో కలరా వ్యాధితో బాధపడిన మారియా టేలర్ చైనా భూమిలో ఒక గోధుమ గింజ వలె మరణించారు.

    ప్రియమైనవారలారా, మిషనరీలను మరియు వారు చేయు పనిని ప్రోత్సహించుటలో మీ పాత్ర ఏమిటి?

    "ప్రభువా, తరువాతి తరం మిషనరీలను సిద్ధపరచుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • Dec 20, 2021

    Martha Mault Life History

    మార్తా మాల్ట్ గారి జీవిత చరిత్ర





    • జననం: 1794
    • మహిమ ప్రవేశం: 1870
    • స్వస్థలం: హంటింగ్‌డాన్‌షైర్
    • దేశం: ఇంగ్లాండు
    • దర్శన స్థలము: దక్షిణ భారతదేశం

     పులప్పేడి అనేది పూర్వపు కాలంలో కేరళలో ఉన్న ఒక దురాచారం. అదేమంటే తక్కువ కులానికి చెందిన పురుషులు ఉన్నత కులానికి చెందిన ఎవరైనా స్త్రీని చూసినట్లయితే ఆ స్త్రీని సమాజం బహిష్కరిస్తుంది. ఏలయనగా ఆ కులానికి చెందినవారు ఆమెను అపవిత్రురాలిగా పరిగణిస్తారు. కాగా ఆమె అమ్మబడాలి లేదా శిక్షనుండి ఎటువంటి మినహాయింపు లేకుండా తన స్వంత కుటుంబం ద్వారా చంపబడాలి. దాదాపుగా అటువంటి స్త్రీలందరూ బిచ్చగత్తెలుగా లేదా బానిసలుగా మారారు. అటువంటి స్త్రీలకు మార్తా మాల్ట్ తల్లి అయ్యారు.

     మార్తా మాల్ట్ ఒక ఆంగ్లేయ మిషనరీ. నేడు ఆమె ‘ది మదర్ ఆఫ్ ఫిమేల్ ఎడ్యుకేషన్ అండ్ లిబరేషన్ ఇన్ సౌత్ ఇండియా’ గా (దక్షిణ భారతదేశ మహిళా విద్యాభ్యాస మరియు విడుదల యొక్క తల్లి) పేర్కొనబడతారు. 24 ఏళ్ల వయస్సులో ఆమె భారతదేశంలో పరిచర్య చేయుటకు లండన్ మిషనరీ సొసైటీచే నియమించబడిన చార్లెస్ మాల్ట్‌ను వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన ఒక వారంలోగానే ఈ నవ దంపతులు ఐదు నెలల సుదీర్ఘ సముద్రయానమును చేపట్టి 1818వ సంll లో భారతదేశానికి వచ్చారు.

     స్థానిక భాషను నేర్చుకొనుటలో కొంత సమయం గడిపిన తరువాత చివరికి వారు తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోయిల్‌ అనే ఊరిలో పరిచర్య చేయడం ప్రారంభించారు. మార్తా గొప్ప సహనం మరియు మిషనరీకి ఉండే గొప్ప గుణంతో భారతీయ ఉష్ణమండల వాతావరణము యొక్క మిక్కుటమైన వేడికి తనను తాను అలవరచుకున్నారు. బహిష్కరించబడిన మహిళలు కలిగియుంటున్న దుర్భర జీవితాలను చూచి ఆమె ఎంతగానో చలించిపోయారు. కాగా వెంటనే ఆమె తన భర్తతో కలిసి బహిష్కరించబడిన ఈ మహిళలకు విద్య, శిక్షణ మరియు ప్రోత్సాహమును అందించే ఒక గొప్ప పనిని చేపట్టారు.

     1820వ సంll లో ఆమె బహిష్కరించబడిన బాలికలకు చదవడం మరియు వ్రాయడమును నేర్పించుటకుగాను దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి బాలికల బోర్డింగ్ పాఠశాలను స్థాపించారు. ఆర్థిక అవసరతల కొరకు వారు తమ కాళ్ళపైనే నిలబడగలుగునట్లును మరియు వారు కూడా గౌరవించబడగలుగునట్లును చేయుటకు వారికి లేస్ తయారీలో కూడా శిక్షణ ఇవ్వబడింది. ఆ విధంగా వారు సంపాదించిన ధనం వారిని బానిసత్వం నుండి విడిపించి స్వతంత్రులుగా చేయుటకు వినియోగించబడింది. తరువాతి 35 సంవత్సరాల తన పరిచర్యలో ఆమె బాలికల కొరకు మరి 26 గ్రామ పాఠశాలలను స్థాపించగలిగారు. ఆ విధంగా ఆ ప్రాంతంలో ఒక ప్రధాన పరిశ్రమగా మారిన లేస్ తయారీ, నేటికీ అక్కడ కొనసాగుతోంది. అంతేకాదు, కరపత్రాలను పంచిపెట్టుటకును మరియు సువార్త ప్రకటించుటకును ఆమె తన విద్యార్థులకు శిక్షణనిచ్చారు. అది కేరళ అంతర్భాగాలకు క్రైస్తవ మతం వ్యాప్తి చెందుటకు దారితీసింది. 

     మాదిరిగా నిలిచే 35 సంవత్సరాల శ్రేష్ఠమైన పరిచర్య తరువాత 1853వ సంll లో ఆమె ఇంగ్లాండుకు తిరిగివెళ్ళారు. అక్కడ తన తుది శ్వాస వరకు కూడా పరిచర్య కొరకు ఇతరులను ప్రోత్సహించడం కొనసాగించిన మార్తా మాల్ట్, 1870వ సంll లో మహిమలోకి పిలువబడ్డారు.

    ప్రియమైనవారలారా, సమాజం యొక్క అభివృద్ధి కొరకు ఒక క్రైస్తవునిగా మీరు అందిస్తున్న సహకారం ఏమిటి?

    "ప్రభువా, నిజమైన క్రైస్తవ జీవితమును కలిగియుండి సమాజంలో మార్పు తీసుకువచ్చుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Dec 4, 2021

    Mattilona Muthyamalle | మట్టిలోన ముత్యమల్లే

    Mattilona Muthyamalle | మట్టిలోన ముత్యమల్లే

    మట్టిలోన ముత్యమల్లే పుట్టాడురో 
    సందెపొద్దు సూరీడల్లే వచ్చాడురో 
    నింగినేలంతా ఆడి పాడంగా 
    సంబరాలతో సందడాయెగా 

    1. బెత్లహేము ఊరిలో పశువుల పాకలో దీనుడై పుట్టినాడురా - సుఖమే కోరలేదురా 
    ఆ చలిరాత్రిలో చీకటంటి బ్రతుకులో దీపమై వచ్చినాడురా - భేదమే చూపలేదురా

    ఎంతో వింత కాదా దారి చూపే దివ్య తార 
    పాడే దూతలంతా కదిలొచ్చే గొల్లలంతా అంబరాన్నంటే సంబరాలతో సందడే ఇల

    2. వెన్నెలంటి వీధిలో చల్లనైన చూపుతో స్నేహమై చేరినాడురా  - ప్రేమనే పంచినాడురా 
    అంధకార లోయలో అంతు లేని బాటలో మనకై వెదకినాడురా - రక్షణే తెచ్చినాడురా 

    ఎంతో వింత కాదా మరి నిన్నే కోరలేదా 
    రావా యేసు చెంత మనసారా వేడుకోగా
    అంబరాన్నంటే సంబరాలతో సందడాయెగా



  • WhatsApp
  • Dec 2, 2021

    Moses Clark White Life History

    మోసెస్ క్లార్క్ వైట్ గారి జీవిత చరిత్ర




    • జననం: 24-07-1819
    • మహిమ ప్రవేశం: 24-10-1900
    • స్వస్థలం: ఒనిడా కౌంటీ
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: చైనా


     మోసెస్ క్లార్క్ వైట్ అమెరికన్ మెథడిస్టు సంఘము తరఫున చైనాకు వెళ్ళి సేవ చేసిన ఒక మార్గదర్శక వైద్య మిషనరీ. రెవ. స్టీఫెన్ ఓలిన్ చేసిన ఒక ప్రసంగం ద్వారా ప్రభావితులై తన జీవితమును మిషనరీ సేవకై సమర్పించుకొనవలెనని నిర్ణయించుకున్నారు వైట్. 1845వ సంll లో పట్టభద్రులైన తరువాత అతను యేల్‌ అనే ప్రాంతములో రెండు సంవత్సరాల పాటు వైద్యశాస్త్రమును మరియు రెవ. ఓలిన్ యొక్క మార్గదర్శకత్వంలో తత్వశాస్త్రమును అభ్యసించారు. ఆ సమయంలో అతను యేల్‌కు ప్రక్కన ఉన్న మిల్‌ఫోర్డ్‌ పట్టణములో దేవుని వాక్యమును బోధించారు కూడా.


     1847వ సంll మార్చి 13న జేన్‌ను వివాహం చేసుకున్నారు వైట్. జేన్‌ కూడా మిషనరీ సేవకైన పిలుపును కలిగియున్నవారు. వారిరువురు కలిసి 1847వ సంll ఏప్రిల్ 15వ తారీఖున చైనాకు పయనమయ్యారు. ఐదు నెలల పాటు సాగిన కష్టతరమైన సముద్రయానం తరువాత 1847వ సంll సెప్టెంబరు 7వ తారీఖున చైనాలోని ఫూ చౌ ప్రాంతమునకు చేరుకున్నారు ఆ మిషనరీ దంపతులు. అక్కడ మహిళలతో సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలలో ప్రబలంగా ఉన్న నల్లమందు వ్యసనాన్ని చూసి వైట్ ఆశ్చర్యపోయారు. పెరిగిపోతున్న పేదరికం, నేరాలు మరియు అనారోగ్యంతో ఆ భూభాగం ఎంతో దుస్థితిలో ఉంది. అటువంటి పరిస్థితుల మధ్య అక్కడ సువార్తను విస్తరింప చేయడం ప్రారంభించారు వైట్.

     తన వైద్య పరిజ్ఞానమును ఉపయోగించి అతను నల్లమందు ప్రజల ఆరోగ్యముపై చూపిన విష ప్రభావాలకు చికిత్స చేయడం ప్రారంభించారు. మాదక ద్రవ్యాల యొక్క బానిసత్వం నుండి ప్రజల దృష్టిని మరల్చవలెనని అతను ఒక చిన్న పాఠశాలలను ప్రారంభించి ప్రజలకు విద్యను అందించడం మొదలుపెట్టారు. అదే సమయంలో స్థానికముగా మాట్లాడే ఫూ చౌ భాషా మాండలికమును కూడా నేర్చుకొనిన అతను, కొన్ని స్తుతికీర్తనలను ఆ భాషలోనికి అనువదించారు. అంతేకాకుండా మత్తయి సువార్తను కూడా అతను స్థానిక మాండలికంలోకి అనువదించారు.

      క్రమంగా అక్కడ సమాజంలో మార్పు వచ్చినప్పటికీ క్రైస్తవ్యమునకు మారినవారైతే ఎవరూ లేరు. అయినప్పటికీ ఆ ఫలితాలతో నిరాశ చెందక, తాను ఏ పని చేయుటకైతే పిలువబడ్డారో దానిని కొనసాగించారు వైట్. పైగా అతని పరిచర్యకు వ్యతిరేకత కూడా ఎదురయ్యింది. ఒకసారి కొంతమంది గుంపుగా వచ్చి అతనిని తీవ్రంగా కొట్టారు. ప్రజలలో విదేశీయత పట్ల నెలకొనియున్న వ్యతిరేక భావం కారణంగా అతను తాను కొనుగోలు చేసే భూములలో కూడా క్రైస్తవాలయాలు నిర్మించుటకు అనుమతించబడలేదు. చైనాకు వచ్చిన మూడేళ్ళకే అతను తన భార్యను కోల్పోవడం జరిగింది. అయినప్పటికీ, అతను ఏడు సంవత్సరాల పాటు ఫూ చౌలో సేవను కొనసాగించారు.

      అయితే, తన అనారోగ్యం కారణంగా వైట్ న్యూయార్క్‌కు తిరిగి వెళ్ళవలసి వచ్చింది. కానీ అతని కృషి వ్యర్థము కాలేదు. అతని అడుగుజాడలను అనుసరించి మరికొందరు ఫూ చౌకు తమ మార్గమును మళ్ళించినవారై, అక్కడ అతను వేసిన పునాదులపై దేవుని రాజ్యమును నిర్మించారు. న్యూయార్క్‌లో అతను తన వైద్యశాస్త్ర విద్యాభ్యాసమును పునఃప్రారంభించారు మరియు అదే సమయంలో మెథడిస్టు సంఘములో ఒక మతాధికారిగా పనిచేశారు.

    ప్రియమైనవారలారా, మాదకద్రవ్యాలకు మరియు మద్యానికి బానిసలైనవారి రక్షణ కొరకు మీరు ఏమి చేస్తున్నారు?

    "ప్రభువా, ఫలితాలను బట్టి నిరాశ చెందక, మీరు నాకు అప్పగించిన పనిలో నమ్మకముగా ఉండుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Nov 16, 2021

    Madhya Rathri shudda rathri | మధ్య రాత్రి శుద్ధ | Telugu Christmas song

    Madhya Rathri shudda rathri | మధ్య రాత్రి శుద్ధ | Telugu Christmas song

    మధ్య రాత్రి శుద్ధ రాత్రి  

    మహిమతోడ తండ్రి - మహినుద్భవించెను          

    జనితైక కుమారుడు - జనియించెను ధాత్రిని  హోసన్నా(౩) 


     1.పరలోక దూతలు - శరవేగమే ధర నరిగె        

     కరుణాలుని జాడను  - మరి యేసుని గొల్వను      

     పరిశుద్ధత్మతో-నిరుపేద గర్భమున                

     పరమ స్వరూపుడు –నరరూపదారుడై 


     2.పాప ప్రపంచమున –పారద్రోలగ రాత్రి          

     శాపస్రవంతిని-సమృద్ధి జీవముతో                

     పాపగా జనియించెనే  - పాకలో ప్రభు యేసు      

     కాపాడి బ్రోవగ  - కాపరిక్రీస్తు 



    Madhya Ratri Shudha Ratri
    Mahima thoda thandri Mahinudbhavinchenu.. 
     Janitaika kumarudu - janiyinchenudhatrini Hosanna (3) 

    1.Paraloka dhootalu - seravegame dhara narige 
    karunaluni jaadanu - mari yesuni golvanu 
    parishudhatmatho - niru pedha garbhamuna 
    parama swarupudu - nara roopa dharudai 

    2. Paapa prapanchamuna - paaradrolaga ratri 
    shaapa sravanthini - samrudhi jeevamutho 
     papaga janiyinche - paakalo prabhu yesu 
     kaapadi brovaga - kaapari kristhu







  • WhatsApp
  • Mana Yesu Bethlahemulo | మన యేసు బెత్లహేములో | Telugu Christmas song

    Mana Yesu Bethlahemulo | మన యేసు బెత్లహేములో | Telugu Christmas song


    మన యేసు బెత్లహేములో
    చిన్న పశుల పాకలో పుట్టె (2)
    పాకలో పుట్టె పాకలో పుట్టె (2)          ||మన యేసు||

    గొల్లలంతా దూత ద్వారా
    యేసుని యొద్దకు వచ్చియుండిరి (2)
    వచ్చియుండిరి నమస్కరించిరి (2)          ||మన యేసు||

    జ్ఞానులంతా చుక్క ద్వారా
    యేసుని యొద్దకు వచ్చియుండిరి (2)
    వచ్చియుండిరి కానుకలిచ్చిరి (2)          ||మన యేసు||


    Mana Yesu Bethlahemulo
    Chinna Pashula Paakalo Putte (2)
    Paakalo Putte Paakalo Putte (2)           ||Mana Yesu||

    Gollalanthaa Dootha Dwaaraa
    Yesuni Yoddaku Vachchiyundiri (2)
    Vachchiyundiri Namaskarinchiri (2)     ||Mana Yesu||

    Gnaanulanthaa Chukka Dwaaraa
    Yesuni Yoddaku Vachchiyundiri (2)
    Vachchiyundiri Kaanukalichchiri (2)     ||Mana Yesu||


  • WhatsApp
  • Nov 6, 2021

    Midgley John Jennings | మిడ్గ్లీ జాన్ జెన్నింగ్స్

    మిడ్గ్లీ జాన్ జెన్నింగ్స్ | Midgley John Jennings




    • జననం: 08-06-1806
    • మహిమ ప్రవేశం: 11-05-1857
    • స్వస్థలం: స్టీవనేజ్
    • దేశం: ఇంగ్లాండు
    • దర్శన స్థలము: భారతదేశం

     ఈస్ట్ ఇండియా కంపెనీలో చాప్లిన్ అయిన మిడ్గ్లీ జాన్ జెన్నింగ్స్ ఢిల్లీలో తాను చేసిన పరిచర్యకు పేరుగాంచారు. 1832వ సంll లో కాన్పూర్ చేరుకున్న అతను, మొదటిలో బ్రిటిష్ వారి మధ్య మాత్రమే పరిచర్య చేశారు. అయితే, తన స్వజనుల ఆత్మీయ అవసరాలకు మించి పరిచర్య చేయవలెనని క్రీస్తు ప్రేమ అతనిని బలవంతపరచగా, భారతీయ ప్రజల మధ్య పరిచర్య చేయుటకు ఆంక్షలు ఉన్నప్పటికీ, వారి మధ్యకు వెళ్ళి సువార్తను బోధించారు జెన్నింగ్స్.
     కాన్పూర్‌లో 20 సంll ల పాటు పరిచర్య చేసిన తరువాత 1851వ సంll లో అతను ఢిల్లీకి బదిలీ చేయబడ్డారు. ఆ సమయంలో ఢిల్లీ మహమ్మదీయ విశ్వాసానికి బలమైన కోటగా ఉండేది మరియు క్రియాశీలకమైన క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలేవీ అక్కడ లేవు. కాగా ఢిల్లీ ప్రజల ఆత్మలను రక్షించుట కొరకు జెన్నింగ్స్ ఎంతో భారమును పొందారు. అయితే ఎవరి మద్దతు లేకుండా అక్కడ ఒంటరిగా ఉన్న కారణంగా అతను ఢిల్లీ అంతటా ప్రయాణించి, ఆ అన్యజనుల నగరమును దేవుడు దర్శించవలెనని వీధి మూలలలో నిలబడి ప్రార్థించేవారు. త్వరలోనే అతను ఉన్నత కులాలకు చెందిన ఇద్దరు ఉన్నత విద్యావంతులైన భారతీయులను క్రీస్తు కొరకు సంపాదించగలిగారు. వారిలో ఒకరు గణితశాస్త్ర ఆచార్యులు రామ్ చంద్ర, మరొకరు ఢిల్లీ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స నిపుణులైన చిమ్మన్ లై. ఆ విధంగా ఢిల్లీ చర్చి ఉద్భవించింది.
     తదుపరి జెన్నింగ్స్ విజ్ఞప్తి మేరకు ‘సొసైటీ ఫర్ ది ప్రొపగేషన్ ఆఫ్ ది గాస్పెల్ ఇన్ ఫారిన్ పార్ట్స్’ (ఎస్.పి.జి.) అనే సంస్థ అక్కడ పరిచర్యను ప్రారంభించుటకుగాను ఇద్దరు మిషనరీలను పంపి, అవసరమైన నిధులను అందించింది. ఆ విధంగా ఆరంభమైన ఢిల్లీ మిషన్ భారతదేశంలో అత్యంత ఆశాజనకమైన మిషన్ క్షేత్రాలలో ఒకటిగా మారింది.
     అయితే అటు పిమ్మట 1857వ సంll లో భయంకరమైన సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఆ సమయంలో నగరంలో ఉన్న ఐరోపాకు చెందిన ప్రతి ఒక్కరినీ సిపాయిలు నిర్దాక్షిణ్యంగా చంపేశారు. జాన్ జెన్నింగ్స్ అప్పుడు తన చిన్న కుమార్తె అన్నీ జెన్నింగ్స్‌తో కలిసి రెడ్ ఫోర్ట్ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. ఆ అనూహ్యమైన దినాన, ఉగ్రరూపులైన సిపాయిలు అతని నివాసంలోకి దూసుకు వచ్చి తండ్రీకూతుళ్ళను ఇద్దరినీ కత్తులతో చంపేశారు. చిమ్మన్ లై కూడా క్రీస్తుపై తనకున్న విశ్వాసాన్ని తిరస్కరించనందుకుగాను అతని వైద్యశాలలో హత్య చేయబడ్డారు.
     అంతటితో ఢిల్లీ మిషన్ తుడిచి పెట్టుకుపోయిందా? అక్కడ చిందించబడిన ఆ హతసాక్షుల రక్తం వ్యర్థమేనా? లేదు! ఆ తిరుగుబాటు నుండి ఎలాగో తప్పించుకున్న రామ్ చంద్ర ఢిల్లీకి తిరిగి వచ్చి అన్యజనుల మధ్య ధైర్యంగా పరిచర్య చేయడం ప్రారంభించారు. మరింత మంది మిషనరీలు అక్కడికి వచ్చి మిడ్గ్లీ విత్తిన విత్తనానికి నీరు పోయగా, అది తరువాత సమృద్ధియైన ఆత్మీయ పంటను ఇచ్చింది.

    ప్రియమైనవారలారా, మీకు సానుకూలమైన పరిస్థితులకు వెలుపల కూడా సువార్తను ప్రకటించుటకు
    మీరు శ్రమించుచున్నారా?

    "ప్రభువా, నా కుటుంబము, నా ఊరు మరియు నా క్రైస్తవ వర్గానికి వెలుపల వారి కొరకు కూడా భారమును కలిగియుండి, ప్రతి ఒక్కరికీ సువార్తను అందించుటకు నేను శ్రమించులాగున నాకు సహాయము చేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Nov 4, 2021

    Mary Bird | మేరీ బర్డ్

    మేరీ బర్డ్  | Mary Bird




    జననం: 1859
    మహిమ ప్రవేశం: 16-08-1914
    స్వస్థలం: డర్హామ్
    దేశం: ఇంగ్లాండు
    దర్శన స్థలము: జుల్ఫా మరియు ఇస్ఫహాన్, ఇరాన్

    మేరీ రెబెక్కా స్టీవర్ట్ బర్డ్ ఇరాన్‌లో ప్రభువుకు సేవ చేసిన బ్రిటిష్ మిషనరీ. తనకు ఐదేళ్ళ వయస్సు ఉన్నప్పుడు తన తండ్రి యొక్క ఒక మిషనరీ స్నేహితుని ద్వారా ఆఫ్రికా గురించి వినిన మేరీ, ఆ చిన్న ప్రాయంలోనే తన జీవితమును మిషనరీ సేవకై సమర్పించుకున్నారు. ఆనాటి సమర్పణ పట్ల ఆమె ఎంత నమ్మకముగా ఉన్నారంటే దాని కొరకు తాను ఇష్టపడిన వ్యక్తితో వివాహ ప్రతిపాదనను కూడా ఆమె తిరస్కరించారు.

     కొన్ని నెలల పాటు లండన్‌ నగరంలో మిషనరీ శిక్షణ పొందిన పిమ్మట, 1891వ సంll లో పర్షియాకు పయనమయ్యారు మేరీ. అక్కడ ప్రారంభములో కొన్ని రోజులు స్థానిక భాషలను నేర్చుకొనిన ఆమె, త్వరలోనే మహిళలకు వైద్య సహాయం అందించుటకుగాను ఒక చిన్న వైద్యశాలను ప్రారంభించారు. ఇది సువార్త ప్రచారానికి కేంద్రంగా మారింది. ఏ పరిస్థితినైనా సందర్భానుసారంగా సువార్త ప్రకటనకు అవకాశముగా మలచే ఆమె విధానాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.

      1893వ సంll లో ఒకసారి ఒక మహిళ చికిత్స పొందేందుకు తన ఎనిమిదేళ్ళ కుమార్తెతో ఆ ఆసుపత్రికి రావడం జరిగింది. ఆ మహిళ రాత్రి సమయంలో తాను సహాయం కొరకు పిలిచినప్పటికీ తన కుమార్తె స్పందించడం లేదని మేరీకి ఫిర్యాదు చేసింది. తన తల్లికి స్పందించకపోవుటకు కారణమేంటని ఆమె కుమార్తెను మేరీ అడుగగా, ఆ బాలిక చీకటి అంటే తనకు భయంగా ఉండుట వలనని బదులిచ్చింది. వెంటనే మేరీ యేసు క్రీస్తు ప్రభువు ఎల్లప్పుడూ మెలకువగా ఉంటూ, ఆమెకు ఒక స్నేహితునిగా తోడుగా ఎలా ఉంటాడో ఆ బాలికకు చెప్పారు. మరునాటి ఉదయం ఆ మహిళ మేరీని ఎంతగానో ప్రశంసించారు. కోలుకొనిన తరువాత ఆసుపత్రి నుండి వెళ్ళిపోతున్నప్పుడు, ఆమె తన గ్రామంలోని ఇతర పిల్లలకు కూడా యేసు క్రీస్తు స్నేహితునిగా ఉండగలడా అని మేరీని అడిగింది.

      చికిత్స చేసిన తరువాత ప్రతి రోగి కొరకు ప్రార్థించేవారు మేరీ. మేరీ ప్రార్థనల వలన అబ్బాస్ అనే ఒక యుక్తవయస్సు బాలునిలో ఎంత గొప్ప నిరీక్షణ నిండుకొనినదంటే, తాను కోలుకొనిన తరువాత బైబిలు తరగతులను నిర్వహించుటకు అతను తన ఇంటి ద్వారాలను తెరిచాడు. ఒకసారి ఒక ముస్లిం స్త్రీ బైబిలులోని సత్యమును గురించి వారికి చెప్పుటకు ఆమె ముందుగానే ఎందుకు రాలేదని ఆమెను ప్రశ్నించింది. ఇది ముస్లిం దేశాలలో మిషనరీ పనిని చేపట్టులాగున ఇతర దైవభక్తి గల స్త్రీలను ప్రోత్సహించుటకు మేరీని ప్రేరేపించింది.

      ఈ పరిచర్య అంతా స్థానిక ముల్లాల నుండి ఎదురైన తీవ్ర వ్యతిరేకత మరియు బెదిరింపుల మధ్య జరిగించారు మేరీ. విషం ఇచ్చి ఆమెను చంపేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ వెనుకంజ వేయక పర్షియన్ మహిళల మధ్య తన వైద్య సేవను మరియు సువార్త పనిని కొనసాగించారు మేరీ. అక్కడి ప్రజలచే ‘ఖేనుమ్ మరియమ్’ అని ఆప్యాయంగా పిలువబడే మేరీ బర్డ్, టైఫాయిడ్ జ్వరం కారణంగా 1914వ సంll లో తుది శ్వాస విడిచారు.

    ప్రియమైనవారలారా, మీ ప్రభువును సేవించుటకు ఇహలోక సంబంధ ప్రేమాప్యాయతలను త్యాగం చేయుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?

    "ప్రభువా, ఈ లోకములో ఎటువంటి బంధం లేదా అనుబంధము కన్నా మీకు మరియు మీ పనికే నేను ప్రాధాన్యతనిచ్చుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Oct 31, 2021

    Martin Luther | మార్టిన్ లూథర్

    Martin Luther | మార్టిన్ లూథర్



    ఒక్క ఆలోచన ప్రపంచ క్రైస్తవ్యాన్నే మర్చివేసింది,
    ఆ ఆలోచనే క్రైస్తవ్యంలో ప్రొటెస్టెంట్ ఉద్యమానికి నాంది పలికింది, ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని ప్రారంభించిన సంస్కరణోద్యమ నేత–మార్టిన్ లూథర్ (Martin Luther 1483-1546)

    అక్టోబర్ 31 మార్టిన్ లూథర్ గారి జయంతి

    ప్రతి మనిషికి ఓ కథ ఉంటుంది, అలాగే ప్రతి సంఘానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రను రాసే వాళ్లు కొందరైతే దాన్ని తిరగరాసే వాళ్లు మరి కొందరు. కానీ ఆ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోగల వ్యక్తులు బహు కొద్దిమంది మాత్రమే ఉంటారు, అలాంటి వారిలో మార్టిన్ లూథర్ ఒకరు.

    2తిమోతి 3 :16-17 లో ఉన్న విధంగా

    “ దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కర్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును , తప్పు దిద్డుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైయున్నది “.

    16వ శతాబ్దంలో క్రైస్తవ సాధువుగా ఉండి ఆనాటి మత గురువుల వాక్య విరుద్ధ అక్రమాలపై సమరశంఖాన్ని పూరించి, వారి ఆగడాలను అరికట్టి సంఘ చరిత్రలో పెనుమార్పులు తెచ్చిన వ్యక్తి మార్టిన్ లూథర్. నేటి క్రైస్తవులు వెలుగును పొంది ఇంత గొప్ప స్వాతంత్ర్యాన్ని అనుభవించ గలుగుతున్నారంటే అది మార్టిన్ లూథర్ కృషి ఫలితమే. ఈ పోరాటంలో ఆయన ఎంతో చెమటోడ్చి, మరెన్నో ఇబ్బందులను,మరణాపాయాలను ఎదుర్కొని సంస్కరోణోద్యమాన్ని విజయపథం వైపు నడిపించాడు.

    వాడని ఇనుము తుప్పు పడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్దకం మెదడును నిస్తేజం చేస్తుంది. పేదలకు సాయం చేసేవాడు,అవసరంలో ఉన్నవాళ్ళకి అప్పిచ్చేవాడు పాపపరిహార పత్రికల్ని కొనడం కంటే మంచి పని చేస్తున్నాడనే ఆర్థం ఈ సూక్తులు వినగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది మార్టిన్ లూథర్. క్రైస్తవుడైనప్పటికి క్రైస్తవ్యంలో వాక్య విరుద్ధంగా జరుగుతున్న అక్రమాలపై సమర శంఖారావం పూరించిన వ్యక్తిగా మార్టిన్ లూథర్ చరిత్ర పుటల్లో నిలిచారు.

    మతంలో విప్లవాలు, సమాజంలో లిబరల్ భావాలు పెంచడానికి, ప్రజలను ఆలోచింపచేయడానికి గతకాలంలో సంస్కరణోద్యమాలు దోహదకారి అయ్యాయి. జీవితంలో అన్ని రంగాలపై వాక్య విరుద్దంగా మతం కారు మబ్బులాగా కమ్ముకుని ఉన్నప్పుడు మతాధికారులు, వారి వందిమాగదులు ఆడిందే ఆట. పాడిందే పాటగా రాజ్యమేలుతుండేది.

    వారు చేసిన వాక్య విరుద్ధమైన అన్యాయాలు, అక్రమాల వల్ల క్రైస్తవ్యం ప్రతిష్ట అడుగంటింది. ప్రజలు భరించలేనంత దుర్మార్గత్వం ప్రబలినపుడు కొందరు చైతన్య వంతులైన మతాధికారులు, ప్రజలు తిరగబడ్డారు.అలా మతాలలో వచ్చిన తిరుగుబాటులు కాలక్రమేణా మూఢనమ్మకాలను అంతమొందించడానికి, ప్రజల అజ్ఞానాన్ని,నిస్సహాయతను తగ్గించడానికి తోడ్పడ్డాయి.

    మధ్యయుగాలలో క్రైస్తవమార్గాన్ని మతంగా మార్చిన రొమాన్లు యూరప్ లో క్రైస్తవమతంలోని రోమన్ కేథలిక్ పోప్ అధికారం అధికంగా ఉన్నప్పుడు రాజులు సైతం పోప్ కు దాసోహం కావలిసి వచ్చింది. వాక్య విరుద్ధ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు వాటిల్లో ముఖ్యమైనవి క్రైస్తవ మతగురువులు,ముఖ్యంగా రోమన్ కేథలిక్కులు, పెళ్ళి చేసుకోకూడదని నియమం పెట్టారు. కాని, పిల్లల్ని కనకూడదని ఆంక్ష లేదు కనుక, పెద్ద మత గురువుల నుండి చిన్న వారి వరకు అవినీతికి, అక్రమాలకు ఆలవాలమై గంపెడు సంసారంతో ఉండేవారు.మాటలకి-చేతలకి ఎంతో వ్యత్యాసం ఉండేది.

    15 వ శతాబ్దం లో మత యుద్దలైన క్రూసేడ్ లలో చివరికి మహమ్మదీయులదే పైచేయి అయి కాన్ స్టంటి నోపుల్ పట్టణం పతనం కావడంతో ఆధునిక యుగం ఆరంభమయింది.
    దేవుని వాక్యానికి విధేయులై నీతికి నిజాయితీకి,దైవభక్తికి ప్రతీకగా ఉండ వలసిన మతగురువులు స్వార్థ చింతనకు, భోగలాల సత్వానికి, కుట్రలకు,కుతంత్రాలకు, ముఠా తగాదాలకు నిలయాలుగా మారారు.

    మతాన్ని సంస్కరించడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినా, అవినీతి, అక్రమాలు క్రైస్తవ వటవృక్షం వేళ్లు తినడం ప్రారంభించాయి. మతగురువులకు ఎంతోమంది భార్యలు, పిల్లలు, తమ కుటుంబీలకు ఆస్తిపాస్తులు సమకూర్చడానికి వారు పడే తాపత్రయం ఇంతా అంతా కాదు. పోప్ ఇటాలియన్ కావడంతో వివిధ దేశాలలో అధిపతులు ఇటాలియన్లే అయ్యేవారు. వారి పెత్తనం అప్పుడే చిగురిస్తున్న జాతీయభావానికీ, స్వదేశాభిమానానికీ ఇబ్బందిగా మారింది.

    యూరప్ లోని రాజుల నుండి, ధనవంతుల నుండి డబ్బు గుంజి పోప్ అనుచరులు రోమ్ లో అందమైన ఆకాశహర్మ్యాలను నిర్మించుకున్నారు.ఆశకు అంతం ఉండదు కదా. ఇంకా డబ్బు రాబట్టడానికి వాక్య విరుద్ధంగా పాప పరిహార పత్రాలు ప్రారంభించారు.

    ఈనాడు మన రాజకీయ రంగంలో మోసగాళ్లు ప్రవేశించినట్లే, టెడ్జల్ అనే వ్యక్తి జర్మనీ అంతా పాప పరిహార పత్రాలు అమ్మి, మంచినీళ్లప్రాయంగా డబ్బు వసూలు చేసి, పోపుకు ధారాళంగా డబ్బు పంపడం ప్రారంభించాడు. చేసిన పాపం చెబితే పోతుంది అనే నానుడి. దాన్ని సంధర్బానుసారంగా వాడుకోవడానికి టెడ్జల్ ఏజంట్లు తయారయ్యారు చెయ్యబోయే పాపం ముందుగా పోపుకు డబ్బిస్తే పోతుందని అంటూ కొత్త పరిహార పత్రాలను సృష్టించారు. ఇక అక్కడి నుంచి మతంలో భక్తికి,ముక్తికి డబ్బే ప్రధాన సాధనమైంది.

    ప్రజలు దైవ మార్గాన్ని మరిచి మతాంధకారంలో మగ్గిపోతున్న కాలంలో దానిని ఎలుగెత్తి చాటడానికి దేవుడు పంపిన ఓ నిలువెత్తు రూపం భూమి మీద కొచ్చింది. ఆ రూపమే మార్టిన్ లూథర్. వాక్య విరుద్దంగా పతనమవుతున్న మత వ్యవస్థను కళ్లారా చూసి చలించి పోయాడు. మతాధికారుల దుర్మార్గాల నుంచి ప్రజలను చైతన్యం చేసి నిజ దైవ మార్గంలో వాక్యానుసరంగా నడిపించాలని బృహత్తర బాధ్యతను నెత్తిన వేసుకున్నాడు.

    వాక్యా వ్యతిరేక మత మౌడ్యం జడలు విప్పి కాలనాగులా బుసలు కొడుతున్న కాలమది. ఎటుచూసినా మతాధికారుల దౌర్జన్యాలే. వారు చేస్తున్న అరాచకాలే. అలాంటి వాతావరణంలో 514 సంవత్సరాల క్రితం క్రీ. శ 1483 నవంబర్ 10 న జర్మనీలో ఎస్ బ్లేన్ లోని ఒక గని కార్మికుని కుటుంబంలో మార్టిన్ లూథర్ జన్మించారు. ఆయన తండ్రి రాగి గనుల్లో పనిచేసే కార్మికుడే అయినప్పటికీ మార్టిన్ ను ఉన్నత చదువులు చదివించాడు.

    మార్టిన్ క్రీ.శ 1501లో ఎర్బర్ట్ విశ్వ విద్యాలయ విద్యార్థిగా విద్యను అభ్యసించాడు. అక్కడే ఉంటూ గ్రంథాలయంలో ఉన్న “బైబిల్”ను అవసోపన పట్టారు. లూథర్ తన 22వ ఏట ఎర్పర్ట్ లోని అగస్టీనియన్ క్రైస్తవమఠంలో చేరారు. ఆ తర్వాత ఆయన విటెన్ బర్గ్ విశ్వ విద్యాలయంలో చేరి మతధర్మ శాస్ర్తంలో డాక్టరేట్ సంపాదించాడు.
    అ యూనివర్శిటీలోనే ప్రొఫెసర్ గా కొంత కాలం పనిచేశారు.

    కొంతకాలంపాటు లూథర్ భక్తిశ్రద్ధలతో రోమ్ లోని పోప్ దగ్గరకు వెళ్లేవాడు. అయితే లూధర్ తానే దేవుని అనుగ్రహం పొందడానికి అనర్హుడనని భావించారు.కొన్ని సార్లయితే అపరాధ భావంతో నైరాశ్యంలో కుమిలిపోయే వారు.కానీ దేవుడు పాపులను ఎలా సృష్టిస్తాడనే దానిపై బైబిల్ ను ఔపోసన పట్టారు.దేవుని అనుగ్రహం కష్టపడి సంపాదించుకునేది కాదని బదులుగా అది విశ్వసించే వారికి ఉచితంగా కృపతో అనుగ్రహించబడుతుందని లూధర్ గ్రహించారు.

    మతం కుళ్ళు కంపు, ధనదాహం కళ్లారా చూశాడు.పతనమైన మత వ్యవస్థ ను కళ్ళారా చూచిన లూధర్ పాప పరిహార పత్రాలు జర్మన్ రాజులకు,ధనవంతులకు అమ్మడాన్ని ప్రత్యక్షంగా చూచి, వారు చేస్తున్న దుర్మార్గాన్ని సహించ లేక పోయాడు.దేవుడు పాపులను ఎలా దృష్టిస్తాడనే విషయంలో లూథర్ కు కలిగిన అవగాహన రోమన్ క్యాథలిక్ చర్చితో ఆయనకు విరోధాన్ని తెచ్చిపెట్టింది. డబ్బు తీసుకుని పోపు అధికారంతో ఇవ్వబడే పాప పరిహార పత్రాలను అమ్మే దురాచారం మార్టిన్ కు ఆగ్రహం తెప్పించింది. మానవులు దేవునితో బేరసారాలు చేయలేరని చర్చి ఆర్థికంగా,సిధ్దాంత పరంగా,మత పరంగా దురాగతం చేస్తోందని ఆరోపిస్తూ 95 ప్రశ్నలను రూపొందించాడు.

    గుటెన్ బర్గ్ చర్చి గోడపై 95 ప్రశ్నలతో దేవుడు పాపం చేసిన తరువాత క్షమిస్తాడు గాని, చెయ్య బోయే పాపా నికి రక్షణ కల్పించ మని డబ్బు ఇవ్వడమనే ఈ అడ్వాన్సు బుకింగ్ ఏమిటి? అని సూటిగా ప్రశ్నించాడు. రాజుల దగ్గరకు వెళ్లి విడమర్చి చెప్పాడు. పోప్ లూధర్ ను బుజ్జగించడానికి ప్రయత్నించాడు. కాని, దైవ విధేయుడైన లూధర్ ప్రలోభాలకు లోను కాలేదు సరికదా, పోప్ మోసంలో పడవద్దని ఎలుగెత్తి చాటాడు. అప్పుడప్పుడే ప్రబలుతున్న జర్మన్ జాతీయతా భావం లూధర్కు మరింత బలం చేకూర్చింది.

    ★లూధర్ ఆర్థికంగా దెబ్బకొట్టడంతో పోప్ అతనిని మతం నుండి బహిష్కరించాడు. అయినా అంతవరకు దైవాంశ సంభూతునిగా చెలామణి అయిన పోప్ బండారం బయట పడడంతో కథ అడ్డం తిరిగింది. జర్మన్ రాజులు సమావేశమై లూధర్ను మతంనుండి బహిష్కరించడాన్ని వ్యతిరేకించారు.
    ★ ఈ రకంగా పోప్ను ప్రశ్నించిన వారంతా “ప్రొటెస్టాంటులయ్యారు”. దానితో క్రైస్తవ మతంలో పోప్ ఏకఛత్రాధిపత్యానికి గండిపడింది.

    లూధర్ బైబిల్ను స్వయంగా జర్మన్ భాషలోకి అనువదించారు. అంతకుముందు మనదేశంలో మత గ్రంథాలు సంస్కృతంలో ఉన్నట్లే, బైబిల్ ప్రజలకు అర్థంకాని లాటిన్లో ఉండేది. జర్మన్ భాషలో అప్పుడే వచ్చిన ప్రింటింగ్ ప్రెస్లో అచ్చువేసి ఇవ్వడంతో ప్రజలకు బైబిల్లో ఉన్న దేవునివాక్యం అర్ధమయ్యేసరికి పెద్ద విప్లవం వచ్చింది.

    బైబిల్లోని వాక్యం అర్థం చేసుకోవడానికి మార్టిన్ ఓ పెద్ద విప్లవాన్నే సృష్టించాడు. మతాలకు చెందిన ఆస్తులను ప్రభుత్వమే కాపాడాలని పోప్ లు అందులో తల దూర్చరాదని గట్టిగా నొక్కి చెప్పారు.మార్టిన్ లూథర్ మాటలకు జనాలు, రాజులు ఆకర్షితులై ఆయన వెంటే నడిచారు. ఆ దెబ్బతో దైవ అవిధేయుడైన పోప్ తన ఆస్తులను సర్వం కోల్పోయాడు.

    పోప్ విధానాలను వారి ఆగడాలను మార్టిన్ లూధర్ దుయ్యబట్టాడు. రోమన్ కేథలిక్ మతంలో గల ఉపవాసాలు, తీర్థయాత్రలు, దైవదూతలను పూజిం చడం, క్రైస్తవ మాస్ అనవసరం అని లూదర్ ప్రకటించాడు. మత గురువులు పెళ్ళిచేసు కోకుండా ఉండాలనే నియమం తప్పు అన్నాడు. తానే స్వయంగా ఒక నన్ ను పెళ్లిచేసుకున్నాడు.దైవసాక్షాత్కారానికి మతగురువుల మధ్యవర్తిత్వం అక్కరలేదని చెప్పాడు. పోప్ బదులు ఆయా దేశాలలో ప్రభుత్వమే మత ఆస్తులను సంరక్షించాలన్నాడు.

    దానితో రాజులు, ప్రజలు పోప్ ను వదిలి, లూధర్ పక్షాన చేరారు. కొండ నాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడినట్లు లూధర్ను లొంగదీసి అక్రమ సంపాదన పోప్ అనుభవిద్దా మనుకొంటే తన ప్రాబల్యాన్ని, వివిధ దేశాలలో మత ఆస్తులపై పెత్తనాన్ని కూడా పోప్ కోల్పోయాడు. దీనితో పోప్ లూధర్ను సమర్థించే రాజులతో 30 సంవత్సరాలు యూరప్ లో యుద్ధం చేశాడు. రక్తం ఏరులై పారింది.చివరకు రాజు ఏ మతం వాడు అయితే, ప్రజలు కూడా ఆ మతం వారు కావాలని సంధి కుదిరింది.రాజు ప్రొటెస్టాంటు అయితే, ప్రజలు కూడా అంతే కావాలన్నది ఆనాటి నినాదం. యథా రాజా, తథా ప్రజా అన్నది అక్షర సత్యమైంది. జనాన్ని గొర్రెలుగా భావించారు. ప్రజాస్వామ్య భావమే లేని సమాజం అది.

    లూధర్ మాటల నుండి స్ఫూర్తి పొంది, మతం చేసే దారుణ దోపిడీని సహించేదిలేని రైతుల తిరుగుబాటును లూధర్ సమర్థించలేదు. లూధర్ జర్మన్ రాజులకు వత్తాసు పలికాడు.దానితో లక్షలాది మంది తిరుగుబాటుదారులను ఊచకోత కోశారు. మత సంబంధాల విషయంలో లూధర్కు విప్లవ భావాలు ఉన్నా, సామాజిక, ఆర్థిక సంబం ధాల విషయంలో విప్లవాత్మక భావాలు లేవు.

    ఏ చర్చి గోడకైతే 29 సంవత్సరాల క్రితం క్రీ.శ 1517అక్టోబర్ 31 న లూదర్ పోప్ను ప్రశ్నిస్తూ,ప్రశ్నలంటించి క్రైస్తవ మతంలో గొప్ప విప్లవానికి కారకుడయ్యాడో, అదే ఊళ్ళో అంటే విటెన్ బర్గ్ లో క్రీ.శ1540 ఫిబ్రవరి 28 న లూధర్ మరణించాడు. మతం పేరట మారణహోమం లూధర్ అనంతరం కూడా కొనసాగింది. లూధర్ క్రైస్తవ మతంలో ఒక మహా విప్లవానికి కారకుడయ్యాడు. పోప్ ఆధిపత్యం అంతరించి, జాతీయ ప్రభుత్వం సహకారం ప్రొటెస్టాంటు వర్గానికి లభించింది. ఈ విధంగా మతంలో వచ్చిన విప్లవం రానురాను ప్రజాస్వామిక చైతన్యం పెంచడానికి, మత మౌఢ్యం నుండి బయటపడి చివరకు సెక్యులర్ పంథాలో వాక్యానుసరంగా క్రైస్తవ మార్గంలో యూరప్ పురోగమించడానికి మార్గం సుగమం చేసింది.

    లూథర్, కాల్విన్, స్వింగ్లి వంటి వారిచేత పురికొల్పబడిన సంస్కరణ, మతాన్ని ఒక కొత్త కోణంలోంచి చూడడానికి దారి తీసింది, అది ప్రొటస్టెంటిజమ్ అని పిలువబడుతోంది. లూథర్ ప్రొటస్టెంటిజమ్ కు వారసత్వంగా వదిలేసిన గొప్ప ఆస్తి ఏమిటంటే, విశ్వాసం ద్వారా తీర్పుతీర్చబడడం అనే తన ప్రధాన బోధ.జర్మనీలోని ప్రభుత్వాలన్నీ ప్రొటస్టెంటు మతానికి లేదా క్యాథలిక్ విశ్వాసానికి మద్దతుగా నిలబడ్డాయి. ప్రొటస్టెంటిజమ్ వ్యాప్తి చెంది స్కాండినావియా, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్,నెదర్లాండ్స్ లో ప్రజల మద్దతును సంపాదించుకుంది. నేడు దాన్ని అంటిపెట్టుకొని ఉన్నవారు కోట్లలో ఉన్నారు.

    చాలామంది, లూథర్ విశ్వాసాలన్నింటిని విశ్వసించకపోయినా ఆయనను ఎంతో గౌరవిస్తారు.ఐస్లేబన్, ఎర్ఫర్ట్, విట్టెన్బర్గ్, వార్ట్బర్గ్ లో తన సరిహద్దుల్లో ఉన్న పూర్వపు జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ 1983 లో లూథర్ 500 వ జయంతి చేసుకుంది. ఈ సోషలిస్ట్ రాష్ట్రం ఆయనను జర్మనీ చరిత్రలోను సంస్కృతిలోను ఒక విశిష్ఠమైన వ్యక్తిగా గుర్తించింది. అంతేకాదు 1980 లలోని క్యాథలిక్ మత పండితుడు ఒకాయన లూథర్ తర్వాత వచ్చిన వారెవ్వరూ ఆయనకు సాటికాలేకపోయారంటూ ఆయన కీర్తిని చాటి చెప్పారు.

    మార్టిన్ లూథర్ లో నిశితమైన మేధ,అసాధారణమైన జ్ఞాపకశక్తి, పదాలలో ప్రావీణ్యత,అత్యున్నత కార్యశీలత ఉన్నాయి. ఆయనలో ఓర్పులేమి, కొంచెం నిర్లక్ష్యం వంటి లక్షణాలు కూడా ఉండేవి. చిన్నపాటి విషయాన్నిక్కూడా ఒక్కొక్కసారి ఉద్రేకపడేవారంటారు. లూదర్ 1546, ఫిబ్రవరిలో ఐస్లేబన్ లో మరణశయ్యపై ఉన్నప్పుడు, తను ఇతరులకు బోధించిన విశ్వాసాల విషయంలో ఆయన స్థిరంగా ఉన్నాడా అని ఆయన మిత్రులు అడిగితే అందుకాయన ఉన్నాను అని చిరునవ్వుతో సమాధానమిచ్చాడు.
    లూథర్ మరణించినా ఆయన అనుసరించిన విధానాల్ని మాత్రం చాలామంది ఇప్పటికీ ఆనుసరిస్తూనే ఉన్నారు.. ఆచరిస్తూనే ఉన్నారు…

    ఇలాంటి రోషం కలిగిన యవ్వన దైవజనులు నేటితరంలో కూడా అవసరం…

    Source :Truth Research Center of India

  • WhatsApp
  • Oct 22, 2021

    A. Macdonald Westwater | ఎ. మెక్‌డొనాల్డ్ వెస్ట్‌వాటర్

    ఎ. మెక్‌డొనాల్డ్ వెస్ట్‌వాటర్ | A. Macdonald Westwater జీవిత చరిత్ర




    • జననం: -
    • మహిమ ప్రవేశం: -
    • స్వదేశం: స్కాట్లాండు
    • దర్శన స్థలము: ఉత్తర చైనా


    పంతొమ్మిదవ శతాబ్దపు ఆఖరి సంవత్సరాలలో చైనాలో ప్రారంభమైన బాక్సర్ తిరుగుబాటు సమయంలో క్రైస్తవ మిషన్లు మరియు స్థానిక క్రైస్తవులు చైనా సైనికుల కౄరమైన ద్వేషానికి గురయ్యారు. ఈ తిరుగుబాటు క్రమంగా తగ్గుముఖంపడుతుండగా, రష్యావారు తమ సామ్రాజ్యమును విస్తరింపజేసికొనుటకు ఉత్తర చైనాపై దాడి చేశారు. చైనాలో పరిస్థితులు అల్లకల్లోలముగా ఉన్న సమయాలలో అక్కడే ఉండుటకు ఎంచుకున్న అతి కొద్దిమంది మిషనరీలలో డాll ఎ. మెక్‌డొనాల్డ్ వెస్ట్‌వాటర్ ఒకరు.


    స్కాట్లాండుకు చెందిన డాll వెస్ట్‌వాటర్ చైనాలోని మంచూరియన్ ప్రాంతంలో సేవ చేసిన ఒక ప్రెస్బిటేరియన్ వైద్య మిషనరీ. ప్రారంభంలో హైచెంగ్‌లో సేవ చేసిన అతను, తరువాత లియోయాంగ్‌కు వెళ్ళి “ఫ్రీ హీలింగ్ హాల్” (ఉచిత స్వస్థత ప్రాంగణం) అనే ఆసుపత్రిని స్థాపించారు. అక్కడ గ్రుడ్డివారు చూపుపొందారు, కుంటివారు నడవగలిగారు, చెవిటివారు వినికిడి శక్తిని పొందారు, మరియు మంచి విలువలతో జీవించుటకు వారందరికీ సలహాలు, సూచనలు ఇవ్వబడ్డాయి.


    కానీ, బాక్సర్ తిరుగుబాటు వలన అతని పనిని తాత్కాలికంగా నిలిపివేయవలసి వచ్చింది. అయితే, చైనాను విడిచిపెట్టి వెళ్ళుటకు బదులుగా అతను రష్యన్ రెడ్ క్రాస్ సొసైటీలో చేరి, వైద్య సహాయం కొరకు మరింత అవసరతలో ఉన్న చైనా మరియు రష్యా దేశాలకు చెందిన బాధితులకు వైద్య సేవలను అందించారు. లియోయాంగ్ చేరుకున్న రష్యా దళాలు దానిని ధ్వంసం చేయుటకు సిద్ధంగా ఉన్నప్పుడు, డాll వెస్ట్‌వాటర్ జోక్యం చేసుకొని, శాంతియుతంగా లొంగిపోవుటకు లియోయాంగ్ పౌరులను ఒప్పించేందుకు తనను అనుమతించమని రష్యన్ జనరల్‌ని అభ్యర్థించారు. లియోయాంగ్ పౌరులు డాll వెస్ట్‌వాటర్ వచ్చుటను చూసినప్పుడు, శత్రువుల పక్షం వహించినందుకు వారు అతనిపై ఆగ్రహముతో ఉన్నప్పటికీ, గతంలో అతను వారికి చేసిన నిస్వార్థమైన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. కాగా, వారు అతని మాటకు అంగీకరించి రష్యావారికి శాంతియుతంగా లొంగిపోయారు.


    డాll వెస్ట్‌వాటర్ గనుక జోక్యం చేసుకొని యుండకపోయినట్లయితే ఆ రోజున వేలాది మంది ప్రాణాలు కోల్పోయి యుండేవారు. కావున, లియోయాంగ్ పౌరులు అతనిని ‘లియోయాంగ్ యొక్క రక్షకుడు’ అని ప్రశంసించారు. తక్షణమే ఆ పరిస్థితిని ఉపయోగించుకొని, డాll వెస్ట్‌వాటర్, దుర్బలులు మరియు పాపాత్ములైన మానవులకు మరియు న్యాయవంతుడైన దేవునికి మధ్య శాంతిదూతగా యేసు ప్రభువు ఏ విధముగా సమాధానమును ఏర్పరచారో వారికి వివరించారు. తద్వారా అక్కడి చైనీయులు నిజమైన రక్షకుని కనుగొన్నారు మరియు అక్కడ నెలకొనియున్న యుద్ధ వాతావరణం అనేక మందికి రక్షణ దినముగా మారింది.


    తాను కలిగియున్న వైద్య నైపుణ్యం మరియు దేవుని ప్రేమలతో సమాజములో ఉన్నతలైనవారు మరియు డాకోట్‌లనే సాయుధులైన దొంగల సమూహమునకు చెందిన వారితో సహా అనేక మందిని దేవుని యొద్దకు నడిపించారు డాll వెస్ట్‌వాటర్. అటువంటి ఫలవంతమైన పరిచర్య అతని యొక్క ఆరోగ్యముపై తీవ్ర ప్రభావమును చూపింది. కాగా, కోలుకొనుటకు అతను స్కాట్లాండుకి తిరిగి వెళ్ళారు గానీ, 20వ శతాబ్దపు ప్రారంభ సంవత్సరాలలో అతనిని తన పరమ వాసస్థలములో చేర్చుకొనుట దేవుని చిత్తమైయున్నది.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, కనికరముతో కూడిన మీ క్రియల ద్వారా మీ రక్షకుడు మహిమపరచబడుతున్నాడా?

    ప్రార్థన :

    "ప్రభువా, ఇతరులకు మీ శాంతిని అందించే ఒక మాధ్యమముగా నన్ను చేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Margaret Nicholl Laird | మార్గరెట్ నికోల్ లైర్డ్

    మార్గరెట్ నికోల్ లైర్డ్ |  Margaret Nicholl Laird జీవిత చరిత్ర



    • జననం: 31-07-1897
    • మహిమ ప్రవేశం: జూన్ 1983
    • స్వస్థలం: కొలరాడో
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: మధ్య ఆఫ్రికా రిపబ్లిక్‌

    పరిశుద్ధ గ్రంథమైన బైబిలును వివిధ భాషలలోనికి అనువదించుటకు ప్రేరణ కలిగించునవి అనేకం ఉన్నాయి. 25 సంll ల వయసున్న ఒక యువ మిషనరీ మధ్య ఆఫ్రికా రిపబ్లిక్‌లోని బంగాసౌ ప్రజలకు చదవడం మరియు రాయడమును నేర్పిస్తున్నారు. నిర్విరామంగా అలుపులేకుండా సలిపిన ఎంతో కృషి తరువాత ఆమె విద్యార్థులలో ఒకరు యోహాను 3:16వ వచనమును చదవగలిగారు. వెంటనే ఆ విద్యార్థి "కాగితం నాతో మాట్లాడింది!" అని ఆశ్చర్యముతో అరిచారు. అప్పుడు ఆ మిషనరీ "అవును, అది మీ కొరకు దేవుని ప్రేమ సందేశం." అని సమాధానమిచ్చారు. "దేవుడు నా భాషను మాట్లాడుతాడా?" అనేది ఆ విద్యార్ధి తదుపరి ప్రశ్న. బైబిలును సాంగో భాషలోకి అనువదించుటకు ఆ ప్రశ్న ఆమెను ప్రేరేపించింది. యవ్వనస్థురాలైన ఆ మిషనరీ మార్గరెట్ నికోల్ లైర్డ్.


    దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబములో పెరిగిన మార్గరెట్, తాను ఒక వైద్య మిషనరీ కావాలని కోరుకున్నారు. ఆమె డెన్వర్‌లో నర్సింగ్ కోర్సును అభ్యసించారు. విశ్వాసము పైనే ఆధారపడి దేవుని సేవించవలెనని హడ్సన్ టేలర్ నుండి ప్రేరణ పొందినవారై ఆమె బాప్టిస్ట్ మిడ్-మిషన్‌లో చేరగా, ఆ సంస్థ ఆమెను మధ్య ఆఫ్రికాలోని ఉబాంగి-షారీ అనే ప్రాంతమునకు పంపింది. అక్కడ ఆమె మరొక మిషనరీయైన గై లైర్డ్‌ని వివాహం చేసుకున్నారు. ఆ దంపతులిరువురు కలిసి తరువాతి 30 సంll లు బైబిలుని సాంగో భాషలోకి అనువదించారు.


    అప్పటిలో అక్కడ అధికారంలో ఉన్న ఫ్రెంచ్ ప్రభుత్వం ఆ మిషనరీ దంపతుల ధైర్యానికి ముగ్ధులై, ఇప్పీలోని బండా తెగల మధ్య పని చేయమని వారిని అభ్యర్థించింది. బండా తెగలు గతంలో ముగ్గురు ఫ్రెంచ్ మిషనరీలను తినివేసిన కౄరమైన నరమాంస భక్షకులు. అయినప్పటికీ, ఆ కౄర జనుల మధ్య పని చేయుటకు ప్రార్ధనపూర్వకముగా అంగీకరించారు లైర్డ్ దంపతులు.


    ఇప్పీలో మార్గరెట్ యొక్క మొదటి అనుభవం భయానకమైనది. ఆ గ్రామస్థులు తమ నాయకుడిని అతని 300 మంది భార్యలతో పాటు ప్రాణాలతో ఉండగానే సమాధి చేయుటను ఆమె ప్రత్యక్షంగా చూశారు. అయినప్పటికీ, ఆమె నిర్భయముగా ఎంతో ప్రేమతో స్థానికులను తన ఇంటిలోనికి మరియు జీవితంలోనికి ఆహ్వానించారు. ఆమె అనారోగ్యంతో ఉన్నవారికి మరియు చావుబ్రతుకులలో ఉన్నవారికి చికిత్స చేస్తూ వైద్య సహాయం అందించేటప్పుడు తన భద్రత కొరకై ఆమె దేవుని సార్వభౌమత్వ అధికారము పైనే విశ్వాసముంచారు. ఒకసారి ఆమె ఒక గ్రామాధికారికి చికిత్స చేసి స్వస్థత చేకూర్చగా, తదుపరి ఆ అధికారి తన గ్రామస్థులను రక్షణ మార్గములోనికి నడిపించుటలో కీలక పాత్ర పోషించారు.


    ఆ ప్రాంతంలో ఆసుపత్రులు లేకపోవడంతో మార్గరెట్ తన భర్తను కోల్పోయారు. అది ఆమెను నిరాశపరచలేదు కానీ "దేవా, నాకు ఇప్పీలో ఒక ఆసుపత్రిని ఇవ్వండి" అని ప్రార్ధించేలా చేసింది. 40 సంll ల పరిచర్య ముగిసే సమయానికి ఆమె అక్కడ ఒక ఆసుపత్రిని నడపడమే కాదు, ఒక నర్సింగ్ శిక్షణా కార్యక్రమమును కూడా ప్రారంభించారు. తదుపరి 1964వ సంll లో ఆమె అమెరికాకు తిరిగి వచ్చారు. "కోట మామా" (పెద్ద తల్లి) అని తాను సేవ చేసిన ఆఫ్రికా ప్రజలచే ఆప్యాయంగా పిలువబడే మార్గరెట్ నికోల్ లైర్డ్, 1983వ సంll లో ప్రభువునందు విశ్రమించారు.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, దేవుడు మాట్లాడుతున్నాడు! ఇతరులు ఆయన స్వరమును వినగలుగుటకు మీరు సహాయం చేస్తున్నారా? 

    ప్రార్థన

    "ప్రభువా, ఇతరులు మీ మెల్లని స్వరమును వినగలుగుటకు నేను సహాయపడులాగున నాకు కృపననుగ్రహించుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp