Search Here

Apr 7, 2022

Gladys Aylward | గ్లాడిస్ ఐల్వర్డ్

గ్లాడిస్ ఐల్వర్డ్ జీవిత చరిత్ర





  • జననం : 24-02-1902
  • మరణం : 03-01-1970
  • స్వస్థలం : ఎడ్మోంటన్
  • దేశం       : ఇంగ్లాండు
  • దర్శన స్థలము : చైనా


బహు దూర ప్రాంతాలకు మీరు వెళ్ళగలరా?–ఒంటరిగా, ఎటువంటి ఆర్థిక సహాయం లేకపోయినా, తెలియని భాష మాట్లాడే కొత్త ప్రజల మధ్య సేవ చేయుటకు వెళ్ళెదరా? చైనాలో తన అంతిమ గమ్యాన్ని చేరుకొనవలెనని ఎంతో ఆతృతతో ప్రమాదకరమైన మార్గములగుండా దేశం తరువాత దేశాన్ని దాటుకుంటూ ప్రయాణించిన గ్లాడిస్ మే ఐల్వర్డ్, దేవుడు తనకిచ్చిన పిలుపును అందుకొనుటకు ఎంతో శ్రమించారు.


శ్రామిక తరగతి కుటుంబములో జన్మించిన ఐల్వర్డ్, 14 ఏళ్ళ వయస్సులో చదువు మానివేసి, గృహాలలో జీతగత్తెగా పనిచేశారు. ఒకసారి ఆమె సువార్త వినని లక్షల మంది చైనా ప్రజలను గురించి చదవడం జరిగింది. తత్ఫలితంగా ఆమె మిషనరీ శిక్షణ పొంది చైనా వెళ్ళుటకై 'చైనా ఇన్లాండ్ మిషన్'లో చేరారు. అయితే చైనా భాష నేర్చుకోవడంలో ఆమె విఫలమవ్వడంతో మూడు నెలల శిక్షణ తరువాత తిరస్కరించబడ్డారు. ఎదురుపడిన ఈ నిరాశ కలిగించే అనుభవాలు దేవుని సేవకై ఆమెలో మండుచున్న జ్వాలలను ఆర్పలేకపోయాయి.


కాగా చైనా వెళ్ళుటకు కావలసిన ధనమును సమకూర్చుకొనుటకు ఆమె తిరిగి జీతగత్తెగా పనిచేయడం ప్రారంభించారు. 1930వ సంll లో చౌకైన సుదీర్ఘ మార్గంలో చైనాకు తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె, అనేక ప్రమాదాలు మరియు అడ్డంకులను ఎదుర్కొని, ఎలాగైతేనేమి చివరికి చైనాలోని యాంగ్‌చెంగ్ నగరానికి చేరుకున్నారు. అక్కడ స్థానికుల నుండి ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, జీన్నీ లాసన్‌ అనే మరొక మిషనరీతో కలిసి "ఇన్ ఆఫ్ ఎయిట్ హ్యాపీనెసెస్" (ఎనిమిది ఆనందముల సత్రం) అనే సత్రమును ప్రారంభించి, దాని ద్వారా చైనా దేశీయులైన ప్రయాణికులకు సువార్తను అదించడంలో విజయం సాధించారు ఐల్వర్డ్. ఖైదీలు మరియు అనాధల శ్రేయస్సు కొరకు కూడా ఆమె కృషి చేశారు. ప్రభుత్వ ఫుట్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసినప్పుడు, ఆడపిల్లల పాదములు ఎదుగకుండా వాటిని కట్టివేసే పద్ధతిని విడిచిపెట్టుటకు ఆమె చైనా స్త్రీలలో చైతన్యం కలిగించడమే కాకుండా, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారిలో సువార్త విత్తనాన్ని కూడా నాటారు.


1937వ సంll లో చైనా-జపాన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు కూడా, "క్రైస్తవులు ఎన్నడూ వెనుదిరుగరు" అని గట్టిగా విశ్వసించిన ఐల్వర్డ్, చైనాలో తన సేవను కొనసాగించారు. యుద్ధ సమయంలో ప్రమాదకరమైన పరిస్థితులగుండా ఆమె దాదాపు 100 మంది అనాథ పిల్లలను సియాన్‌లోని సురక్షిత ప్రదేశానికి తీసుకువెళ్ళారు. అతి క్లిష్టమైన ఆ ప్రయాణంతో తన శక్తిని పూర్తిగా కోల్పోయిన ఆమె, అక్కడికి చేరిన పిమ్మట సృహ కోల్పోయారు. 1948వ సంll లో కమ్యూనిస్టు ప్రభుత్వం చైనాపై పాలన చేపట్టినప్పుడు మిషనరీలను దేశము నుండి తొలగించుటకు కఠిన చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ చైనాను విడిచి వెళ్ళుటకు ఇష్టము లేకపోయినా, స్నేహితుల యొక్క బలవంతం చేత ఐల్వర్డ్ 17 సంll ల తరువాత తన స్వదేశానికి తిరిగి వెళ్ళారు. అయితే చైనా కొరకైన ఆమె హృదయ భారం వలన అక్కడికి తిరిగి వెళ్ళుటకు ప్రయత్నించారు గానీ, అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం ఆమెను అనుమతించలేదు. కావున హాంకాంగ్ వెళ్లిన ఆమె, చివరకు 1958వ సంll లో తైవాన్‌లో స్థిరపడ్డారు. అక్కడ ఆమె 'గ్లాడిస్ ఐల్వర్డ్ అనాథాశ్రమము' ను స్థాపించి, తన తుది శ్వాస వరకూ కూడా అనాథ పిల్లల మధ్యలో తన పరిచర్యను కొనసాగించారు.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్న మార్గములో కొనసాగుటకు ఎటువంటి శ్రమలనైనా భరించుటకు మీరు సిద్ధముగా ఉన్నారా? 


ప్రార్థన :

"ప్రభువా, నా కొరకైన మీ పిలుపును గ్రహించి, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నా తుది శ్వాస వరకూ కూడా ఆ పిలుపు కొరకై నేను జీవించునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్!" 


దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • No comments:

    Post a Comment