Search Here

Showing posts with label Missionary Life History. Show all posts
Showing posts with label Missionary Life History. Show all posts

May 13, 2023

Samuel S. Day | శామ్యూల్ ఎస్. డే

శామ్యూల్ ఎస్. డే గారి జీవిత చరిత్ర

Pictures shown are for illustration purpose only



  • జననం : 13-03-1808
  • మరణం : 17-09-1871
  • స్వస్థలం : బాస్టర్డ్ టౌన్‌షిప్, ఓంటారియో
  • దేశం  : కెనడా
  • దర్శన స్థలము : తెలుగు ప్రాంతం, భారతదేశం


"తెలుగు మిషన్" వ్యవస్థాపకుడైన శామ్యూల్ స్టెర్న్స్ డే అమెరికాకు చెందిన ఒక బాప్తిస్టు మిషనరీ. అతను తెలుగు మాట్లాడే ప్రజలకు వెలుగు తీసుకురావలెనని ఎంతో భారం కలిగి ఉన్నవారు. కాగా తన భార్యయైన రొయెన్నాతో కలిసి భారతదేశానికి వచ్చిన అతను, 1836వ సంll లో విశాఖపట్నంలో మిషనరీగా సేవను ప్రారంభించారు. తరువాత శ్రీకాకుళంకు వెళ్ళిన అతను, మరుసటి ఏడాది నాటికి మద్రాసుకు వెళ్ళారు. మద్రాసులో సేవ చేస్తున్న రోజులలో అక్కడి నుండి తెలుగువారి ప్రాంతానికి అనేక మార్లు పర్యటించారు శామ్యూల్. కాగా ఒక కోటికి పైగా ప్రజలు నివసిస్తున్న మద్రాసు మరియు విశాఖపట్నాలకు మధ్య ఉన్న ప్రాంతములో ఒక్క మిషనరీ కూడా లేరని గ్రహించిన అతని హృదయం ఎంతో భారముతో నిండిపోయింది. తత్ఫలితముగా 1840వ సంll లో అతను తెలుగువారి ప్రాంతమైన నెల్లూరుకు వచ్చి, అక్కడ “తెలుగు మిషన్” ను స్థాపించారు. నెల్లూరు ప్రాంతంలో సువార్తను ప్రకటించిన అతను, 1844వ సంll నాటికి కొద్దిమంది విశ్వాసులతో అక్కడ ఒక క్రెస్తవ సంఘమును ప్రారంభించారు. అప్పుడు ఉన్న తెలుగు బైబిలు యొక్క అనువాదాలను మెరుగుపరచడంలో కూడా అతను సహాయమందించారు. ఆ దంపతులిరువురూ కలిసి బాలురు మరియు బాలికల కొరకు పాఠశాలలను కూడా స్థాపించారు. అప్పుడే వికసిస్తున్న మొగ్గగా ఉన్న ఆ పరిచర్య అతి త్వరలోనే అడ్డంకులను ఎదుర్కొంది. ఏలయనగా 1846వ సంll లో అనారోగ్యం కారణంగా ఆ మిషనరీ దంపతులు వారి స్వదేశానికి తిరిగి వెళ్ళవలసి వచ్చింది.


వారు అమెరికాలో ఉన్నప్పుడు, 'మిషనరీ యూనియన్' 'తెలుగు మిషన్' ‌ను వదలివేద్దామా అనే ప్రశ్నను లేవనెత్తింది. అయితే దేవుడు నమ్మకమైనవాడు. ఆ మిషన్ కొనసాగించబడులాగున ఆయన లైమాన్ జ్యూవెట్‌ను లేవనెత్తాడు. తద్వారా 1849వ సంll లో జ్యూవెట్ దంపతులతో కలిసి శామ్యూల్ డే తిరిగి భారతదేశానికి రాగా, నెల్లూరు మిషన్ వద్ద పరిచర్య తిరిగి జీవం పోసుకుంది. ఆ మిషనరీలు అనేక  పాఠశాలలను ప్రారంభించారు, విస్తృతమైన సువార్త సేవ చేశారు. శామ్యూల్ డే ఒక కష్టతరమైన ప్రయాణాన్ని చేపట్టి, పశ్చిమ దిక్కుగా ఉదయగిరి వరకు ప్రయాణించి ఆ మార్గములోని ప్రాంతాలలో సువార్తను ప్రకటిస్తూ వెళ్ళారు. అయితే, క్రైస్తవులుగా మారిన వారి సంఖ్య అంత గణనీయంగా లేని కారణంగా, 1853వ సంll మిషనరీ యూనియన్‌లో  'తెలుగు మిషన్' ‌ను వదలివేద్దామా అనునది మళ్ళీ చర్చనీయాంశమయ్యింది. కానీ, విస్తారమైన ఆ ప్రాంతంలో ఉన్న ఏకైక మిషన్ ఇది మాత్రమే. ఆ సత్యాన్ని ఎత్తి చూపుతూ  'తెలుగు మిషన్' ‌ను ఒక 'ఒంటరి నక్షత్రం' గా వర్ణిస్తూ ఎస్. ఎఫ్. స్మిత్ వ్రాసిన "ది లోన్ స్టార్" అనే కవిత మిషనరీ యూనియన్‌లోని సభ్యుల హృదయాలను కదిలించింది. తత్ఫలితముగా జ్యూవెట్ ద్వారా ఆ మిషన్ కొనసాగించబడుటకు ఆమోదించబడింది. ఆరోగ్యం క్షీణించడం వలన శామ్యూల్ డే 1853వ సంll లో తిరిగి అమెరికాకు వెళ్ళినప్పటికీ, భారతదేశంలోని మిషనరీ సేవల కొరకు నిధులను సేకరించుటకు అతను అమెరికాలో వివిధ ప్రాంతాలకు విస్తృతంగా ప్రయాణించారు.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, వెలుగు లేని ప్రదేశములో మీరు ఒక “ఒంటరి నక్షత్రం” గా ప్రకాశించెదరా?

ప్రార్థన :

"ప్రభువా, ఇంకా అంధకారంలోనే మగ్గిపోతున్న ఆత్మల గురించిన భారం నాలో కలిగించి, వారికి వెలుగును తెచ్చుటకు నేను ప్రకాశించునట్లు సహాయము చేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Jul 26, 2022

    Iris Paul | ఐరిస్ పాల్

    ఐరిస్ పాల్   గారి జీవిత చరిత్ర



    • జననం: 1945
    • స్వస్థలం: తమిళనాడు
    • దేశం: భారతదేశం
    • దర్శన స్థలము: ఒరిస్సా, భారతదేశం


    ఐరిస్ గ్రేస్ రాజకుమారి పాల్ ఒక భారతీయ మిషనరీ. ఆమె ‘రీచింగ్ హ్యాండ్ సొసైటీ’ క్రింద ఒరిస్సాలోని బోండో తెగల మధ్య పరిచర్య చేయుటకు సమర్పణ కలిగియున్నవారు. ఒక సంపన్న క్రైస్తవ కుటుంబములో జన్మించిన ఐరిస్, తిరుగుబాటు ధోరణి మరియు తల బిరుసుతనం కలిగిన బాలికగా ఉండేవారు. అయితే, తన తల్లిదండ్రుల యొక్క భక్తి  శ్రద్ధలు కలిగిన జీవితము ద్వారా ఎంతగానో ప్రభావితులైన ఆమె, చివరికి తన హృదయమును యేసు క్రీస్తు ప్రభునకు సమర్పించారు. కళాశాలలో చదువుకుంటున్న రోజులలో ఆమె ‘యూనియన్ ఆఫ్ ఇవాంజెలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా’ (యు.ఇ.ఎస్.ఐ.) యొక్క పరిచర్యలో చురుకుగా పాల్గొన్నారు. పిమ్మట ఆమె తమిళనాడులో తన వైద్యశాస్త్ర విద్యాభ్యాసమును బంగారు పతకంతో ముగించారు.


    ఆల్బర్ట్ ష్వీట్జెర్ అనే మిషనరీ ఆఫ్రికాలో జరిగించిన మిషనరీ పరిచర్య ద్వారా ప్రేరణ పొందిన ఐరిస్, తాను కూడా దేవుని సేవ చేయుటకు అక్కడికి వెళ్ళాలని కోరుకున్నారు. అయితే, తన స్వదేశంలోనే ఆమెను వాడుకొనుటకు దేవుడు ఆమె పట్ల భిన్నమైన ప్రణాళికలను కలిగియున్నాడు. 1972వ సంll లో ఒరిస్సాలోని బోండో తెగల మధ్య పనిచేస్తున్న డాll ఆర్.ఎ.సి. పాల్ అనే యువ మిషనరీతో ఐరిస్ యొక్క వివాహం జరిగింది. అప్పటిలో బోండో తెగలవారితో బయటివారు అంతగా సంబంధాలు ఏర్పరచుకోలేదు. ఒక విధంగా వారు బయటి ప్రపంచమునకు మరుగైనవారుగా ఉన్నారని చెప్పవచ్చు. దారిద్య్రముతో నిండియున్న నిరక్షరాస్యులైన ఆ ప్రజలలో మరణాల రేటు అధికముగా ఉండేది. అటువంటి పరిస్థితులలో తన భర్తతో కలిసి ఒరిస్సాలోని మల్కన్‌గిరికి వెళ్ళిన ఐరిస్, వెనువెంటనే గిరిజన ప్రజలకు చికిత్స చేయుట కొరకు ఒక చిన్న వైద్యశాలను ప్రారంభించారు. అంతేకాకుండా ఆమె తన భర్తతో కలిసి వైద్య శిబిరాలను కూడా నిర్వహించారు. అదే సమయంలో ఆమె గిరిజనులకు సువార్తను కూడా తెలియపరిచేవారు. క్రమక్రమంగా యేసుక్రీస్తులో సత్యమును కనుగొన్న వేలాది మంది బోండో ప్రజలు, ఆయనను తమ రక్షకునిగా అంగీకరించారు.


    ప్రారంభ సంవత్సరాలలో అనారోగ్యం, ప్రమాదాలు, నిరాశాజనకమైన పరిస్థితులు, తీవ్రముగా కృంగిపోయిన సందర్భములు మరియు ఎంతో బాధను అనుభవించినప్పటికీ, ప్రభువు మీదనే వారి దృష్టిని నిలిపిన ఆ మిషనరీ దంపతులు, నాగటి మీద నుండి వారి చేతులను ఎన్నడూ వెనుకకు తీయలేదు. 1986వ సంll లో ఆమె భర్త చిన్న వయస్సులోనే మరణించినప్పటికీ, ఆమె ఒరిస్సాలోని మారుమూల గ్రామాలలో తన సేవను కొనసాగించారు. ఆమె అనేక మంది అనాథ పిల్లలకు తల్లిగాను మరియు అక్రమమునకు గురికాకుండా అనేక మంది యువతులను కాపాడినవారిగాను ఉన్నారు. అంతేకాకుండా, ప్రజలను క్రీస్తు వద్దకు నడిపించుటకును మరియు గిరిజన ప్రజలకు సమగ్ర అభివృద్ధిని చేకూర్చుటకును పనిచేసే ‘రీచింగ్ హ్యాండ్ సొసైటీ’ అనే సంస్థను కూడా ఆమె స్థాపించారు. గిరిజనుల జీవితములలో భౌతికపరమైన మరియు ఆత్మీయపరమైన మార్పును తెచ్చుటకు తన కుమారుడైన రెమో పాల్ మరియు అతని భార్య డాll సూసన్ రెమో పాల్‌లతో కలిసి ఎంతగానో కృషి చేస్తున్న ఐరిస్ పాల్, ఈ నాటికీ దేవుని సేవలో ముందుకు సాగిపోతున్నారు. 


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీ సమస్యలు మరియు కష్టతరమైన పరిస్థితుల కంటే గొప్పవాడైన ప్రభువుపై మీ కనుదృష్టిని నిలుపుతున్నారా? 


    ప్రార్థన :

    "దేవా నా ప్రభువా, నా కన్నులు నీతట్టు చూచుచున్నవి. నేను నీ శరణుజొచ్చియున్నాను. ఆమేన్!"  

    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • David Wilkerson | డేవిడ్ విల్కర్సన్

    డేవిడ్ విల్కర్సన్   గారి జీవిత చరిత్ర



    • జననం: 19-05-1931
    • మహిమ ప్రవేశం: 27-04-2011
    • స్వస్థలం: పెన్సిల్వేనియా
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: అమెరికా సంయుక్త రాష్ట్రాలు


    పెన్సిల్వేనియాలోని పెంతెకొస్తు బోధకుల కుటుంబములో జన్మించారు డేవిడ్ రే విల్కర్సన్. చాలా చిన్న వయస్సులోనే బాప్తిస్మము తీసుకున్న విల్కర్సన్, పదునాలుగేళ్ళ వయసులోనే దేవుని వాక్యమును ప్రకటించడం ప్రారంభించారు. 1952వ సంll లో సేవ చేయుటకు నియామక అభిషేకం పొందిన పిమ్మట అతను పెన్సిల్వేనియాలోని స్కాట్స్ డేల్ మరియు ఫిలిప్స్‌బర్గ్ అనే ప్రాంతములలో పాదిరిగా పరిచర్య చేశారు. 


    1958వ సంll లో, న్యూయార్క్‌లో యవ్వనస్థులతో కూడిన ఒక ముఠా పాల్పడిన హత్య కేసు గురించి చదివిన విల్కర్సన్, ఆ నగరంలో అటువంటి ముఠాలలో ఉన్నవారికి మరియు మాదకద్రవ్యాలకు బానిసలైనవారికి సహాయం చేయవలెనని దేవుడు తనకు పిలుపునిస్తున్నట్లు భావించారు. కాగా 28 సంll ల వయస్సులో అతను క్రైస్తవ సంఘములో సేవలందిస్తూ ఎంతో సౌకర్యవంతముగా సాగిపోతున్న జీవితమును విడిచిపెట్టి న్యూయార్క్ నగరమునకు వెళ్ళారు. అక్కడ అతను వీధులలో ప్రసంగించారు, కూడికలను, సభలను నిర్వహించారు మరియు మాదకద్రవ్యాల నుండి బయటపడుటకు యవ్వనస్థులు ఆశ్రయించులాగున ఒక గృహమును ఏర్పాటుచేశారు. అతని పరిచర్య మూలముగా ఎంతో మంది ముఠా సభ్యులు బైబిలు కొరకు తమ ఆయుధములను ఇచ్చివేశారు మరియు క్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించుటకు ముందుకు వచ్చారు. అటువంటి వారిలో ఒకరు ‘మౌ మౌ’ ముఠా నాయకుడైన నిక్కీ క్రూజ్.


    ఒక రోజున విల్కర్సన్ నిక్కీని కలుసుకొని అతనితో సువార్తను పంచుకొనగా, నిక్కీ అతని ముఖముపై ఉమ్మివేసి, మరెప్పుడైనా తన దగ్గరికి వస్తే చంపుతానని బెదిరించారు. అందుకు విల్కర్సన్ “మీరు నన్ను వెయ్యి ముక్కలుగా చేసి వీధిలో పారవేసినా, ప్రతియొక్క ముక్క కూడా మిమ్ములను ప్రేమిస్తుంది” అని అతనికి బదులిచ్చారు. ఆ మాటలు నిక్కీని ఎంతోకాలం వెంటాడాయి. చివరికి విల్కర్సన్ యొక్క ఒక కూడికలో నిక్కీ తన జీవితమును యేసు క్రీస్తు ప్రభువుకు సమర్పించారు. అటు పిమ్మట తన ముఠా సభ్యులలో అనేకమందిని క్రీస్తు వద్దకు నడిపించారు నిక్కీ.


    యవ్వనస్థుల మరియు పెద్దవారి యొక్క భౌతిక మరియు ఆత్మీయ శ్రేయస్సు కొరకు అమెరికా, ఐరోపా మరియు ఆసియాలలో అనేక మిషన్లను స్థాపించి తన పరిచర్యను విస్తరింపజేశారు విల్కర్సన్. 1967వ సంll లో “యూత్ క్రూసేడ్స్‌” అను పరిచర్యను కూడా స్థాపించారు. ఇది ప్రధానంగా మాదకద్రవ్యాలు, మద్యం మరియు హింసాత్మక కార్యకలాపాల వైపుకు జారిపోకుండా యవ్వనస్థులను నిరోధించుటకు పనిచేసింది.


    అంతేకాదు, విల్కర్సన్ ‘టైమ్స్ స్క్వేర్ చర్చి’ యొక్క స్థాపకులు కూడా. ఆ సంఘములో అతను నీతిగలిగి జీవించుటకును మరియు దేవునిపై పూర్తిగా ఆధారపడుటకును ప్రోత్సహించేటటువంటి కొన్ని శక్తివంతమైన దైవ వాక్య సందేశములను ఇచ్చారు. నిర్భయుడైన సువార్తికునిగాను, దయాకనికరములు గల పాదిరిగాను మరియు జ్వలించుచున్న నిప్పువంటి బోధకునిగాను కనిపించే డేవిడ్ విల్కర్సన్, 2011వ సంll లో పరమందు తన ప్రభువును చేరుకొన ఇహలోకమును విడిచివెళ్ళారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, ఇతరుల ఆత్మీయ అవసరతలను సంధించుటకు మీరు ఎంతటి దయాకనికరములు కలిగిన హృదయమును కలిగియున్నారు? 


    ప్రార్థన :

    "ప్రభువా, ప్రపంచ నలుమూలలకూ సువార్తను విస్తరింపజేయుటకు విశ్వాసముతో నేను ముందుకు అడుగువేయగలుగునట్లు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Elekana | ఎలెకానా

     ఎలెకానా గారి జీవిత చరిత్ర

    Pictures shown are for illustration purpose only



    • జననం: 19 వ శతాబ్దం
    • మహిమ ప్రవేశం: 19 వ శతాబ్దం
    • స్వస్థలం: మాణిహీకీ
    • దేశం: కుక్ దీవులు
    • దర్శన స్థలము: తువాలు దీవులు


    పసిఫిక్ మహాసముద్రంలోని తువాలు ద్వీపాల ప్రజలకు క్రైస్తవ్యమును పరిచయం చేసిన ఘనత ‘తువాలు యొక్క అపొస్తలుడు’ అని పిలువబడే ఎలెకానాకు దక్కుతుంది. కుక్ దీవులలోని మాణిహీకీలో లండన్ మిషనరీ సొసైటీ యొక్క సహాయక పరిచారకునిగా (డీకనుగా) ఉన్న అతను, ఆ దీవులలో జరుగు పరిచర్యకు నాయకత్వం వహించారు. ఒకసారి ఎలెకానా మరియు మరో ఆరుగురు మిషనరీలు పరిచర్య నిమిత్తం సమీపంలోని రాకాహంగా ద్వీపమునకు వెళ్ళుచుండగా, వారు ప్రయాణించుచున్న పడవ తుఫానులో చిక్కుకుంది. కాగా ఎనిమిది వారాల పాటు సముద్రములో కొట్టుకొనిపోయిన వారు, చివరికి వారి గమ్యమునకు 2700 కి.మీ. దూరంలో ఉన్న తువాలు దీవులలోని ఒక దీవికి చేరుకున్నారు.


    క్రొత్తగా తమ దీవిలో అడుగుపెడుతున్నవారిని చూచుటకై సముద్రపు ఒడ్డుకు పరుగెత్తి వచ్చిన తువాలు ప్రజలు వారిని నిండు హృదయముతో స్వాగతించారు. వారు నివసించుటకై ఆ ప్రజలు గుడిసెలు మరియు గుడారాలను కూడా ఏర్పాటు చేశారు. ఎలెకానా యొక్క గమ్యస్థానం మారినప్పటికీ, అతని లక్ష్యం మాత్రం మారలేదు. అదేమనగా, క్రీస్తు ప్రేమను ప్రకటించడం! కాగా అతను తన చుట్టూ ఉన్న ప్రజలను పోగుచేసి, యేసు క్రీస్తు యొక్క ప్రేమను గురించియు మరియు దేవుడు దయచేసే కాపుదల మరియు భద్రతలను గురించియు వారికి చెప్పడం ప్రారంభించారు. అతను ప్రకటించునది వారికి వింతగా అనిపించినప్పటికీ, ఎంతో ఆసక్తిగా విన్నారు. త్వరలోనే నిజమైన దేవుడు ఎవరనునది అక్కడి స్థానికులు గ్రహించారు. తత్ఫలితముగా వారు తమ పూర్వీకుల కొరకు కట్టిన మందిరములను పడగొట్టి, ఎలెకానా యొక్క నడిపింపులో నిజమైన దేవునిని ఆరాధించడం ప్రారంభించారు. ఈ సంగతులన్నీ కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే జరిగాయంటే ఆశ్చర్యమే!


    తదుపరి ఎలెకానా మరలా తిరిగి వచ్చెదనని వారికి మాట ఇచ్చి ఆ తువాలు దీవికి వీడ్కోలు పలికారు. అటు పిమ్మట సమోవాలో కొన్ని సంవత్సరాల పాటు శిక్షణ పొంది, పరిచర్య చేసిన తరువాత, తాను ఇచ్చిన మాట చొప్పున తువాలు దీవులకు తిరిగివెళ్ళారు ఎలెకానా. అయితే ఈసారి అతను మరొక మిషనరీని వెంటబెట్టుకొని, అనేక సువార్త రచనలను తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడి స్థానికులలో అనేకమంది పురుషులు చెరపట్టబడి బానిసలుగా పెరూ దేశమునకు కొనిపోబడ్డారని అతను తెలుసుకున్నారు. అయినప్పటికీ, ఆ దీవులలో సువార్త సేవను కొనసాగించారు ఎలెకానా.


    పిమ్మట మిషనరీ సేవ చేయుటకై ఆస్ట్రేలియాకు వెళ్ళిన అతను, తన చివరి రోజులను కుక్ దీవులలో గడిపారు. అతని కుమారుడు కూడా మిషనరీగా మారి సేవ చేయుచున్నప్పుడు, పాపువా దీవులలో అతను చంపబడగా, ఎలెకానా వృద్ధాప్యములో ఉన్నప్పటికీ, ఆ ప్రదేశానికి తన కుమారుని స్థానములో మిషనరీగా వెళ్ళుటకు ముందుకు వచ్చారు. దేవుని పట్ల మరియు నశించిపోవుచున్న ఆత్మల పట్ల ఎలెకానాకు ఉన్న ప్రేమ అటువంటిది!


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, దేవుడు మిమ్ములను ఎక్కడికి తీసుకువెళ్ళెదరో ఆ చోటికి వెళ్ళి సేవ చేయుటకు మీరు అంగీకరించెదరా? 


    ప్రార్థన :

    "ప్రభువా, మీరు నన్ను ఎక్కడ ఉంచెదరో ఆ స్థలములో మీకు నమ్మకముగా సేవ చేయుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Elias Riggs | ఎలియాస్ రిగ్స్

    ఎలియాస్ రిగ్స్   గారి జీవిత చరిత్ర



    • జననం: 19-11-1810
    • మహిమ ప్రవేశం: 17-01-1901
    • స్వస్థలం: న్యూజెర్సీ
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: గ్రీసు


    మొదటి నుండి కూడా ప్రతి స్థలములో ఉన్న మనుష్యులందరికీ సువార్తను సమర్థవంతముగా అందించడం అనునది క్రైస్తవ పరిచర్యను ముందుకు నడిపించే శక్తిగా ఉంది. ఈ విషయంలో భాషావేత్తలు ప్రాముఖ్యమైన పాత్రను పోషించారు. వారు తాము కలిగియున్న తలాంతులను దేవుని రాజ్య విస్తరణ కొరకు ఉపయోగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటువంటి అనేకమంది భాషావేత్తలలో ‘అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ ఫర్ ఫారిన్ మిషన్స్’ (ఎబిసిఎఫ్ఎమ్) అనే సంస్థకు చెందినవారైన ఎలియాస్ రిగ్స్ ఒకరు.


    దేవునియందు భయభక్తులు కలిగిన ఒక క్రైస్తవ కుటుంబములో జన్మించారు రిగ్స్. అతనికి 13 సంll ల వయస్సు వచ్చేటప్పటికి అతను హెబ్రీ మరియు గ్రీకు భాషలలో నిష్ణాతులయ్యారు. తదుపరి అమ్హెర్స్ట్ కళాశాలలో చేరిన అతను, అక్కడ చదువుకునే సమయంలో ‘ఫ్రెండ్స్’ అనే సంస్థతో చేరారు. ఒక రహస్య సంస్థయైన ఈ సంస్థ విద్యార్థులలో మిషనరీ సేవ పట్ల ఆసక్తిని రేకెత్తించుటకై పనిచేసేది. అటు పిమ్మట ‘ఆండోవర్ థియోలాజికల్ సెమినరీ’ అనే బైబిలు వేదాంత కళాశాల నుండి పట్టభద్రులైన అతను, విస్తృతమైన తన మిషనరీ పరిచర్యను ప్రారంభించారు.


    22 సంll ల వయస్సులో సేవ చేయుటకు నియామక అభిషేకం పొందిన తరువాత, రిగ్స్ తన భార్యయైన మార్తా జేన్ డాల్జెల్‌ను తీసుకొని గ్రీసు దేశమునకు పయనమయ్యారు. మొదట ఏథెన్స్ నగరములో స్థిరపడిన అతను, అరామిక్ భాషలో వ్రాయబడిన బైబిలులోని భాగములను గ్రీకు భాషలోకి అనువదించుటలో తన సమయమును వెచ్చించారు. అటు పిమ్మట అతను సువార్తను ప్రకటించుచూ, కరపత్రములను పంచుతూ, మరి ముఖ్యముగా అనువాద పరిచర్యలో సహాయం చేస్తూ గ్రీసు దేశములోని అనేక ప్రాంతములను పర్యటించారు. అతను ఏడు పురాతన మరియు 14 ఆధునిక భాషలను నేర్చుకొని, ఆ భాషలలోని అనువాద పనిలో భాగస్థులయ్యారు. వాటిలో అర్మేనియా, బల్గేరియా మరియు టర్కీ భాషలు కూడా ఉన్నాయి. అతను బైబిలును అనువదించే పరిచర్య చేసిన అనువాదకులు మాత్రమే కాదు, వేదాంత శాస్త్రమును బోధించే బోధకులు, ప్రసంగికులు మరియు అనేక ఆత్మీయ పుస్తకములను సవరించినవారు కూడా. అంతేకాకుండా తన భార్యతో కలిసి అర్గోస్‌లో ఒక బాలికల పాఠశాలను కూడా నడిపించారు మరియు పిల్లల మధ్యలో పరిచర్యను జరిగించారు రిగ్స్.


    మిషనరీగా ఎలియాస్ రిగ్స్ యొక్క పరిచర్య 68 సంll ల పాటు జరిగింది. అన్ని సంవత్సరాల కాలంలో అతను ఎటువంటి పనిలేకుండా ఉన్న సందర్భాలు చాలా అరుదు. ఎదురువచ్చిన అడ్డంకులను, కష్టములను సహించిన అతను, తాను కలిగియున్న తలాంతులను దేవుని మహిమార్థమై ఉపయోగించవలెననిన దృఢ నిశ్చయముతో ముందుకు సాగిపోయారు. అతని కుటుంబ సభ్యులు అతని పరిచర్య యొక్క వారసత్వమును  కొనసాగించగా, అతని పిల్లలలో ముగ్గురు కుమారులు దైవసేవకులు అయ్యారు మరియు పదిమంది మనుమలు మనుమరాండ్రు మిషనరీలయ్యారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, దేవుడు మీకు దయచేసిన తలాంతులను మరియు సామర్ధ్యములను మీరు ఆయన కొరకు ఉపయోగించెదరా? 


    ప్రార్థన :

    "ప్రభువా, నాకున్న తలాంతులు మరియు సామర్ధ్యములన్నింటినీ మీ మహిమ కొరకును మరియు మీ రాజ్య విస్తరణ కొరకును ఉపయోగించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!" 


    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Francis Le Jau | ఫ్రాన్సిస్ లే జౌ

    ఫ్రాన్సిస్ లే జౌ  గారి జీవిత చరిత్ర



    • జననం: 1665
    • మహిమ ప్రవేశం: 10-09-1717
    • స్వస్థలం: యాంజియర్స్
    • దేశం: ఫ్రాన్స్
    • దర్శన స్థలము: సౌత్ కరోలినా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు


    'సొసైటీ ఫర్ ది గాస్పెల్ ఇన్ ఫారిన్ పార్ట్స్' (ఎస్.పి.జి. - విదేశీ ప్రాంతాలలో సువార్త సేవ కొరకైన సంస్థ) అనే సంస్థ తరపున దక్షిణ కరోలినాలో సేవ చేసిన తొలి మిషనరీలలో ఫ్రాన్సిస్ లే జౌ ఒకరు. అతను దైవభక్తి కలిగిన ఒక ఫ్రెంచ్ హుగెనాట్ కుటుంబములో జన్మించారు. హుగెనాట్ క్రైస్తవులు అనగా 16, 17వ శతాబ్దములలోని ఫ్రెంచ్ ప్రొటెస్టంట్లకు చెందిన ఒక క్రైస్తవ సమూహం. 16 వ శతాబ్దం చివరిలో హుగెనాట్లకు తీవ్రమైన హింస కలిగినప్పుడు, ఫ్రాన్సిస్ ఇంగ్లాండుకు పారిపోయారు. డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజీ నుండి పట్టా పొందిన పిమ్మట అతను క్రిస్టఫర్ దీవులకు పంపబడ్డారు. స్వల్పకాలం అతను అక్కడి స్థానిక తెగల మధ్య పరిచర్య జరిగించారు.


    1706వ సంll లో మిషనరీ సేవ చేయుటకై దక్షిణ కరోలినాకు పంపబడ్డారు లే జౌ. అక్కడ గూస్ క్రీక్ అనే ప్రాంతములో స్థిరపడిన అతను,  అక్కడి క్రైస్తవ సంఘము అబద్దపు ప్రవక్తలచే తీవ్రముగా తప్పుదారి పట్టించబడినట్లు గ్రహించారు. అంతేకాక, ఆ ప్రాంతమునకు వచ్చి స్థిరపడి నాయకత్వమును చేజిక్కించుకొనినవారు తాము క్రైస్తవులమని  చెప్పుకుంటున్నప్పటికీ, ఏ విధముగానూ వారు క్రీస్తు ప్రేమకు మాదిరిగా జీవించకపోగా కౄరమైన బానిస వ్యాపారములో పాలిభాగస్థులుగా ఉన్నారు. అందువలన అణగారిన స్థానిక అమెరికన్లలో సువార్త ప్రకటించడం ఫ్రాన్సిస్ యొక్క మొదటి ప్రాధాన్యతగా మారింది. అతను కౄరత్వముతో నిండియున్న బానిసల యజమానులకు వ్యతిరేకముగా అలుపెరుగక పని చేశారు మరియు వారి సామాజిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ సువార్తను ప్రకటించారు. తన స్వజనుల నుండే అనేక ఎదురుదెబ్బలను మరియు అవరోధాలను ఎదుర్కొన్నప్పటికీ, వెనుకంజవేయక క్రైస్తవ సంఘము లోపటను వెలుపలను కూడా సమానత్వమును కలిగియుండవలెనని బోధించుటయే కాక దానిని అనుసరించి నడిచే క్రైస్తవ సంఘములను స్థాపించుటకు సమర్పణ కలిగి ముందుకు సాగిపోయారు ఫ్రాన్సిస్.


    క్రియలలో విశ్వాసం కనబడితేనే గాని ఒకనిని క్రైస్తవునిగా పిలవవలెనని ఫ్రాన్సిస్ విశ్వసించారు. ఇతర దైవసేవకులు తమ సంఘముల గురించి స్వయంతృప్తిని కలిగియున్నప్పటికీ, ఫ్రాన్సిస్ మాత్రం తన సంఘము సామాజిక బాధ్యతను స్వీకరించులాగున చేసి, పేదలు మరియు రోగులకు సహాయమును అందించారు. పలు యుద్ధములు నెలకొన్నప్పటికీ కూడా, ఆ క్లిష్ట పరిస్థితులన్నింటి మధ్యలో అతను మిషనరీ సేవ కొరకైన తన పిలుపులో స్థిరముగా నిలబడినవారై, నీగ్రో బానిసల ఆత్మీయ మరియు భౌతిక సంక్షేమం కొరకు శ్రమించారు.


    తన మిషనరీ పరిచర్య ప్రారంభం నుండి కూడా అతను పలుమార్లు మలేరియా బారినపడ్డారు. అందువలన క్రమేపీ అతని శరీరము బలహీనపడింది. దేవుని కొరకు ఎంతో గొప్ప ఆసక్తిని కలిగియుండి, ఎన్నో విజయాలను సాధించిన ఫ్రాన్సిస్ లే జౌ, 1717వ సంll లో తీవ్రమైన మలేరియా జ్వరముతో బాధపడిన తరువాత తన ప్రభువును చేరుకొనుటకు ఈ లోకము విడిచి వెళ్ళారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, కష్టాలు మరియు అననుకూల పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుని సేవించుటకు మీరు సిద్ధమేనా? 

    ప్రార్థన :

    "ప్రభువా, మీ ప్రేమను ఇతరులతో పంచుకునేటప్పుడు భౌతిక పరిస్థితులకు అతీతముగా నేను దూరదృష్టి కలిగియుండగలుగునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Fidelia Fisk | ఫిడేలియా ఫిస్క్

    ఫిడేలియా ఫిస్క్  గారి జీవిత చరిత్ర



    • జననం: 01-05-1816
    • మహిమ ప్రవేశం: 09-08-1864
    • స్వస్థలం: షెల్‌బర్న్, మసాచుసెట్స్
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: ఇరాన్ (పర్షియా)


    పర్షియాలోని ఉర్మియా నగర ప్రజలను “ఫిడేలియా ఫిస్క్ ఎలాంటి వ్యక్తి?” అని అడిగినట్లయితే వారి నుండి వచ్చే సర్వసాధారణమైన సమాధానం “ఆమె యేసును పోలినవారు” అనునదే! పెండ్లికాని యువతిగా అమెరికా నుండి వచ్చి పర్షియాలో పరిచర్య చేసిన మొట్టమొదటి మిషనరీలలో ఒకరు ఫిడేలియా ఫిస్క్. అక్కడ ఆమె పొందిన సాక్ష్యం అటువంటిది.


    మంచి మేధోశ్చక్తి మరియు దైవభక్తి కలిగిన బాలికయైన ఫిడేలియా, చిన్న వయస్సులోనే ఆత్మీయ విషయములపై ఆసక్తిని కనుపరిచారు. పదిహేడేళ్ళ వయసులో ఆమె క్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించారు. 1842వ సంll లో ‘మౌంట్ హోలీక్ సెమినరీ’ అనే బైబిలు వేదాంత కళాశాల నుండి పట్టభద్రురాలైన పిమ్మట, ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ఆమె, తన విద్యార్థులను క్రీస్తు నొద్దకు నడిపించువారిగా పేరొందారు. తన తండ్రి సోదరుడైన ప్లినీ ఫిస్క్ చేసిన మిషనరీ సేవ ద్వారా ప్రభావితమైన ఆమె, ‘అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ ఫర్ ఫారిన్ మిషన్స్’ (ఎబిసిఎఫ్ఎమ్) అనే సంస్థ యొక్క ఆహ్వానమును అంగీకరించి, 1843వ సంll లో పర్షియాకు మిషనరీగా వెళ్ళారు.


    పర్షియా దేశం క్రైస్తవులకు, మరిముఖ్యముగా స్త్రీలకు జీవించుటకు కష్టతరమైన ప్రదేశమై యున్నది. అక్కడి స్థానిక సంస్కృతిపరంగా బాలికలు చదువుకొనుట అవమానకరం. కాగా తల్లిదండ్రులు తమ కుమార్తెలు పాఠశాలకు వెళ్ళవలెనని కోరుకునేవారుకాదు. అయినప్పటికీ, పర్షియాలో మహిళల సామాజిక ప్రమాణాలను మార్చుటకై ఫిడేలియా ఎంతో శ్రమించారు. చిన్న వయసులోనే వివాహం చేయటం మరియు విద్యను నిర్లక్ష్యం చేయటం వంటి వాటికి వ్యతిరేకంగా ఆమె ఎంతో జ్ఞానయుక్తముగా పోరాడారు. దయాహృదయులైన వ్యక్తుల సహాయంతో ఆమె చివరికి బాలికల కొరకు ఒక బోర్డింగ్ పాఠశాలను నిర్మించగలిగారు. క్రమక్రమంగా పర్షియాలోని వివిధ సమాజములవారు తమ కుమార్తెలు చదువుకొనవలసిన ఆవశ్యకతను గ్రహించగా ఆ పాఠశాల అభివృద్ధిని చూరగొంది.


    తన 15 సంవత్సరాల సేవలో తన విద్యార్థులకు తల్లివలె వ్యవహరించిన ఫిడేలియా, ఆ విద్యార్థులలో మూడింట రెండు వంతుల మందిని క్రైస్తవ మార్గములోనికి నడిపించారు. పాఠశాల సెలవు దినములలో ఆమె తన పూర్వపు విద్యార్థుల గృహములకు వెళ్ళి వారిని దర్శించి, స్త్రీల కూడికలను నిర్వహించేవారు. ఆమె రోగులకు సేవలను  అందించారు మరియు తన మిషనరీ పనిని గ్రామీణ ప్రాంతాలకు మరియు కొండ జాతులవారి మధ్యకు విస్తరింపచేశారు. ఆమె పరిచర్య ద్వారా కుర్దిష్ తెగల నాయకులతో సహా ఎంతోమంది ప్రమాదకరమైన వ్యక్తులు క్రీస్తు నొద్దకు నడిపించబడ్డారు.


    అయితే అనేక సంవత్సరాలు ఎడతెగక శ్రమించినందు వలన క్షీణించిపోయారు ఫిడేలియా. కాగా 1858వ సంll లో అనారోగ్యం కారణంగా ఆమె మసాచుసెట్స్‌కు తిరిగివెళ్ళారు. అయినప్పటికీ తిరిగి కోలుకొనలేకపోయిన ఫిడేలియా ఫిస్క్ 1864వ సంll లో పరమందు తన ప్రభువును చేరుకొన ఈ లోకము విడిచివెళ్ళారు. ఆమె మరణించడంతో ఎంతో కృంగిపోయిన ఒక పర్షియా బాలిక ఎబిసిఎఫ్ఎమ్ సంస్థకు ఈ విధంగా లేఖ వ్రాసింది – "మీ దేశంలో మరో మిస్ ఫిస్క్ ఉన్నారా?"


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, ఈ లోకములో మీరు యేసు క్రీస్తు ప్రభుని జీవితమును మీ జీవితము ద్వారా కనుబరచుచున్నారా? 


    ప్రార్థన :

    "ప్రభువా, మీ పోలికలోనికి నన్ను మార్చుము. ఆమేన్!" 


    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Miles Bronson | మైల్స్ బ్రోన్సన్

    మైల్స్ బ్రోన్సన్ జీవిత చరిత్ర



    • జననం: 20-07-1812
    • మహిమ ప్రవేశం: 09-11-1883
    • స్వస్థలం: న్యూయార్క్
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: ఈశాన్య భారతదేశం


    మైల్స్ బ్రోన్సన్ ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో సేవ చేసిన ఒక అమెరికా మిషనరీ. 1836వ సంll లో పట్టభద్రులైన పిమ్మట అతను బాప్తిస్టు సంఘముచే సేవ కొరకైన నియామక అభిషేకమును పొందారు. వెనువెంటనే అతను భారతదేశంలోని అస్సాంలో సేవ చేయుటకు ‘అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ యూనియన్’ వారిచే నియమించబడ్డారు. 


    తదుపరి బర్మాకు వెళ్ళవలెననే దర్శనంతో మైల్స్ 1838వ సంll లో అస్సాంలోని సాదియాకు వచ్చారు. అయితే అతని పట్ల దేవుని ప్రణాళిక మరొక విధంగా ఉంది. నాతాన్ బ్రౌన్ మరియు ఓ.టి. కట్టర్‌ అనే మరో ఇద్దరు మిషనరీలతో కలిసి అతను అక్కడి స్థానికుల మధ్య సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. తరువాత అస్సాంలో ఉన్న జైపూర్ అనే ప్రాంతమునకు వెళ్ళిన అతను, అక్కడ నోక్టే తెగ యొక్క మాండలికమైన నోక్టే భాషను నేర్చుకున్నారు. నోక్టే తెగవారు అరుణాచల్ ప్రదేశ్ లోని నామ్‌సాంగ్‌లో నివసిస్తున్న ‘నాగ’ తెగ యొక్క జాతికి చెందినవారు. వారు ఉప్పు వ్యాపారం నిమిత్తం అస్సాంలోని జైపూర్‌కు వచ్చేవారు. కాగా క్రీస్తు ప్రేమతో నింపబడిన మైల్స్, ఈ నోక్టే తెగల మధ్య పరిచర్య చేయడం ప్రారంభించారు.


    నామ్‌సాంగ్‌ చేరుకొనుటకు దట్టమైన అడవులు, కొండలు, సెలయేర్లను దాటుకుంటూ ఎన్నో సవాళ్ళతో కూడుకొనిన ప్రమాదకరమైన ప్రయాణాన్ని చేపట్టారు మైల్స్. అతను ఆంగ్లేయుల గూఢాచారి అయ్యుండవచ్చునని స్థానికులు అతనిని పలుమార్లు అనుమానించారు. వారి గ్రామ శివార్లలో రెండు రోజులు గడిపిన తరువాత, వారి భాష నేర్చుకోవాలనే ఆసక్తిని వినయపూర్వకముగా వ్యక్తం చేసిన మైల్స్ చివరకు గ్రామ నాయకుడైన ఖోన్‌బావో యొక్క అభిమానాన్ని చూరగొన్నారు. క్రమక్రమంగా అతను వారికి నిత్య జీవ మార్గమును మరియు నాగరిక జీవితమును బోధించారు. సువార్తకు సంబంధించిన రచనలను నోక్టే భాషలోకి అనువదించిన అతను, స్థానిక పిల్లలకు పాఠశాలలను కూడా స్థాపించారు.


    అంతేకాకుండా అనేక అస్సామీ మాండలికాలకు మైల్స్ గొప్ప సహకారమును అందించారు మరియు వాటికి ఒక రూపమును చేకూర్చి, సాహిత్య వ్యక్తీకరణను అభివృద్ధి పరచారు. అతను మొట్టమొదటి అస్సామీ-ఆంగ్ల నిఘంటువును ప్రచురించారు. అందునుబట్టి అస్సామీలు ఈనాటికి కూడా కృతజ్ఞులైయున్నారు. అంతేకాకుండా అతను అస్సామీ భాషలోనికి బైబిలును అనువదించడం కూడా ప్రారంభించారు.


    కొండ ప్రాంత వాతావరణమును తట్టుకొనుట అతని దేహమునకు ఎంతో కఠినముగా ఉన్నప్పటికీ మరియు దాని కారణముగా అతని సోదరి రోడా మరణించినప్పటికీ వెనుకంజవేయని మైల్స్, 1879వ సంll వరకు కూడా ఈశాన్య భారత పరిచర్యలో ముందుకు సాగిపోయారు. పిమ్మట అమెరికాకు తిరిగి వెళ్ళిన అతను, 1883వ సంll లో ప్రభువునందు నిద్రించారు. అరుణాచల్ ప్రదేశ్ లో అత్యధిక శాతం కలిగియున్న మతముగా క్రైస్తవ మతము మారుటలో మైల్స్ చేసిన పరిచర్య పునాదిగా నిలుస్తుంది. అయితే ఈనాడు అరుణాచల్ ప్రదేశ్‌లో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలు నిషేధించబడినవిగా ఉన్నాయని మీకు తెలుసా?


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, భారతదేశం యొక్క కోత విస్తారముగా ఉన్నది. పనిచేయుటకు మీరు సిద్ధమేనా? 


    ప్రార్థన :

    "ప్రభువా, సువార్త పరిచర్య కొరకై అరుణాచల్ ప్రదేశ్ యొక్క ద్వారములను తెరువుము. ఆమేన్!"  

    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Patricia St. John | ప్యాట్రిసియా సెయింట్ జాన్

    ప్యాట్రిసియా సెయింట్ జాన్ జీవిత చరిత్ర



    • జననం: 1919
    • మహిమ ప్రవేశం: 1993
    • స్వదేశం: ఇంగ్లాండు
    • దర్శన స్థలము: మొరాకో


    ప్యాట్రిసియా సెయింట్ జాన్ మొరాకో దేశంలో సేవ చేసిన ఒక మిషనరీ నర్సు. సువార్తను గురించి ఆమె చేసిన రచనలకు కూడా పేరొందారు ప్యాట్రిసియా. ఆమె తల్లిదండ్రులు కూడా మిషనరీలుగా దక్షిణ అమెరికాలో సేవచేసి, 1919వ సంll లో ఇంగ్లాండుకు తిరిగి వచ్చారు. కాగా దైవికమైన పరిస్థితుల మధ్య పెరిగిన ప్యాట్రిసియా చిన్నప్పటి నుండి కూడా మిషనరీ పరిచర్య వైపు మొగ్గుచూపారు. చాలా చిన్న వయస్సులోనే ఆమె యేసు క్రీస్తును గురించి ఇతరులకు చెప్పవలసిన ఆవశ్యకతను మరియు దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు.


    రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో లండన్ నగరంలో నర్సుగా పనిచేశారు ప్యాట్రిసియా. మొరాకోలో జరుగుచున్న వైద్య మిషనరీ పరిచర్యలో తనతో కలుసుకొనుమని ఆమె సోదరుడి నుండి వచ్చిన ఆహ్వానం మేరకు ప్యాట్రిసియా టాంజియర్స్‌కు  వెళ్ళారు. అక్కడ స్థానిక ముస్లిం ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఉన్న పరిస్థితుల మధ్య ఆమె పనిచేశారు. ముస్లిం మహిళలు మగ వైద్యుని యొద్దకు వెళ్ళుటకు అనుమతించబడేవారు కాదు. అందువలన ప్యాట్రిసియా ఆ మహిళలకు సేవలందించుటకుగాను తన స్వంత ఇంటినే చిన్న వైద్యశాలగా ఉపయోగించారు. త్వరలోనే ఆమె స్థానిక మహిళల యొక్క నమ్మకమును సంపాదించుటయే కాక, వారిలో అనేకమంది ఆత్మలను కూడా క్రీస్తు కొరకు సంపాదించారు.


    తమ స్వజనులే క్రీస్తును అంగీకరించుచున్నారని చూసిన ముస్లింలు ఆమెను బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపొమ్మని చెప్పారు. కాబట్టి ఆమె  రువాండాకు వెళ్ళి, అక్కడ కూడా అదే రీతిని పరిచర్య జరిగించారు. అయితే కొంతకాలం తరువాత ఆమె తిరిగి టాంజియర్స్‌కు వచ్చి, అక్కడ ఒక నర్సింగ్ శిక్షణా పాఠశాలను స్థాపించారు. ఒక నిజమైన క్రైస్తవుడు క్రీస్తును గూర్చి సాక్ష్యమివ్వకుండా ఊరకనే కూర్చొనలేడు. అది  ప్యాట్రిసియా విషయంలో కూడా నిజమైంది. అందువలన, మొరాకో ప్రభుత్వం ఆమె సోదరుని ఆసుపత్రిని మరియు ఆమె యొక్క నర్సింగ్ శిక్షణాలయమును రెండింటినీ స్వాధీనం చేసుకొని, వారిరువురూ దేశం విడిచి వెళ్ళవలెనని ఆదేశించింది. 27 సంవత్సరాలు మొరాకోలో సేవ చేసిన పిమ్మట 1975వ సంll లో ఇంగ్లాడుకు తిరిగి వచ్చారు ప్యాట్రిసియా. తరువాత ఆమె బీరుట్ మరియు ఇథియోపియాలోని కొన్ని ప్రాంతములకు వెళ్ళి, బీదల మధ్యను మరియు ఆకలితో అలమటించుచున్న వారికిని చివరి వరకూ సేవలందించారు.


    ప్యాట్రిసియా ఆకట్టుకునే విధముగా కథలు చెప్పగలరు. ఆమె తన రోజువారీ అనుభవాలను చిన్న చిన్న కథలుగా మలిచి, పిల్లలకు మరియు యవ్వనస్థులకు దేవుని ప్రేమను మరియు శక్తిని తెలియజేయుటకు ఉపయోగించేవారు. మిషనరీ పరిచర్యలో కూడా ఆమె మతాధికారుల కొరత వలన క్రొత్తగా జన్మించిన విశ్వాసుల యొక్క ఆత్మీయ అభివృద్ధి దెబ్బతినకుండా చూచుకున్నారు. తానే స్వయంగా బైబిలు యొక్క సత్యాలను సరళముగాను, అదేసమయంలో సమర్థవంతముగాను వారికి నేర్పించారు. ఆమె రచించిన “ట్రెజర్స్ ఆఫ్ ది స్నో” మరియు “ది టాంగిల్‌వుడ్స్' సీక్రెట్” వంటి పుస్తకాలు ఎంతో మంది చిన్నారులను క్రీస్తు వద్దకు నడిపించాయి.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, యేసు క్రీస్తును గురించి ఇతరులకు చెప్పవలసిన ఆవశ్యకతను మరియు దాని ప్రాముఖ్యతను మీరు గ్రహించారా?


    ప్రార్థన :

    "ప్రభువా, ఏమీ చేయకుండా కూర్చునే నా స్వభావమును క్షమించి, చురుకుగా సువార్తను మోసుకువెళ్ళే వ్యక్తిగా ఉండునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Esther Baldwin | ఎస్తేర్ బాల్డ్విన్

    ఎస్తేర్ బాల్డ్విన్  జీవిత చరిత్ర



    • జననం: 08-11-1840
    • మహిమ ప్రవేశం: 26-02-1910
    • స్వస్థలం: న్యూజెర్సీ
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: చైనా


    ‘చైనీస్ ఛాంపియన్’ అని కూడా పిలువబడే ఎస్తేర్ బాల్డ్విన్ చైనాలో సేవ చేసిన ఒక అమెరికా మిషనరీ. ఒక క్రైస్తవ కుటుంబములో జన్మించిన ఆమె, పదేళ్ళ వయస్సులో ప్రభువును తన స్వరక్షకునిగా అంగీకరించారు మరియు స్థానిక సంఘములో చురుకైన సభ్యురాలిగా ఉన్నారు. న్యూజెర్సీలోని పెన్నింగ్టన్ సెమినరీ నుండి పట్టా పొందిన పిమ్మట, ఆమె వర్జీనియాలోని ఒక బైబిలు వేదాంత కళాశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఫుజౌ మిషన్‌లో పనిచేసిన స్టీఫెన్ లివింగ్‌స్టన్ బాల్డ్విన్‌తో వివాహం జరిగిన తరువాత, మిషనరీగా  తన భర్తతో కలిసి పనిచేయుటకుగాను ఆమె 1862వ సంll లో చైనాకు వెళ్ళారు.


    ఫుజౌలో ఆమె తన గృహసంబంధిత బాధ్యతలను నెరవేర్చడంతో పాటు అనేక పాఠశాలలను పర్యవేక్షించారు. అంతేకాకుండా తమ తోటి చైనా మహిళలకు బైబిలు చదివి వివరించునట్లు మరికొంత మంది స్త్రీలకు ఆమె శిక్షణనిచ్చారు కూడా. అక్కడి స్త్రీలు మరియు పిల్లల యొక్క పరిస్థితిని చూసిన ఆమె, చైనాలో క్రైస్తవ వైద్యుల కొరకు ఉన్న అవసరతను గ్రహించారు. వైద్య సేవలను అందించడం అనునది స్థానికుల యొక్క నమ్మకమును పొందుటకు మంచి మాధ్యమమనియు, చైనాలోని అంతర్భాగములకు సువార్తను తీసుకువెళ్ళుటకు ఒక చక్కటి మార్గమనియు ఆమె విశ్వసించారు. కాగా ఫుజౌలో మహిళలు మరియు పిల్లలకు ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేయుటలో ఆమె ఒక కీలక పాత్ర పోషించారు. సంవత్సరములు గడిచే కొద్దీ ఆ ఆసుపత్రి మూలముగా అనేక మంది స్త్రీలు మరియు పిల్లలు క్రీస్తు నొద్దకు నడిపించబడ్డారు. ఆమె సువార్తకు సంబంధించిన రచనలను చైనా భాషలోనికి అనువదించుటలోను మరియు వాటిని సవరించుటలోను కూడా సేవలందించారు.


    తన బాల్యం నుండి కూడా శారీరకంగా బలహీనముగా ఉన్న ఎస్తేర్, చైనాలో ఉన్నంత కాలం అనారోగ్యముతో బాధపడవలసి వచ్చింది. చివరికి, చైనాలో పద్దెనిమిది సంవత్సరాలు పరిచర్య చేసిన తరువాత, తీవ్రమైన అనారోగ్యం కారణంగా ఆమె తన కుటుంబముతో కలిసి అమెరికాకు తిరిగి వెళ్ళారు. అక్కడ ఆమె అమెరికాలో అణచివేతకు మరియు వివక్షకు గురైన చైనా ప్రజల పక్షముగా నిలబడ్డారు. ఆమె తన రచనల ద్వారా అమెరికా చైనా దేశాల మధ్య సన్నగిల్లిపోయియున్న సంబంధాలను చక్కదిద్దుటకు ప్రయత్నించారు మరియు క్రీస్తును సేవించుచున్నప్పుడు జాతికి జాతీయతకు అతీతమైన దృష్టి కలిగియుండవలెనని క్రైస్తవ సమాజమును ప్రోత్సహించారు. అంతేకాకుండా, ‘ఉమెన్స్ ఫారిన్ మిషనరీ సొసైటీ’ అనే మహిళా మిషనరీ సంస్థ యొక్క అధ్యక్షురాలిగా కూడా పనిచేసిన ఎస్తేర్ బాల్డ్విన్, ఎంతో మంది మహిళలను మిషనరీ పరిచర్యలోకి నడిపించడంలో ఒక గొప్ప సాధనమయ్యారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, వివిధ సమాజములవారి మధ్య సన్నగిల్లిపోయియున్న సంబంధములను మీరు క్రీస్తు ప్రేమతో చక్కదిద్దుతున్నారా? 


    ప్రార్థన :

    "ప్రభువా, జాతికి, జాతీయతకు, కులమతాలకు మరియు సంస్కృతికి అతీతముగా నా దృష్టి ఉండునట్లు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • George Grenfell | జార్జ్ గ్రెన్‌ఫెల్

    జార్జ్ గ్రెన్‌ఫెల్ జీవిత చరిత్ర



    • జననం: 21-08-1849
    • మహిమ ప్రవేశం: 01-07-1906
    • స్వస్థలం: సాన్‌క్రీడ్
    • దేశం: ఇంగ్లాండు
    • దర్శన స్థలము: ఆఫ్రికా


    బానిసలైన ఇద్దరు బాలికలు ఒక చెట్టుకు కట్టబడి, తెగ నాయకునిచే హింసించబడబోతున్నారు. ఆ సమయంలో ఒక మిషనరీ అక్కడికి వచ్చి విమోచనా క్రయమును చెల్లించి వారిని రక్షించాడు. అతను వారి గ్రామానికి ఆ అమ్మాయిలను తీసుకువస్తుండగా, ఆ గ్రామస్థులు ఆ అమ్మాయిలను అపహరించిన వ్యక్తి మిషనరీయే అని భావించారు. కాగా అతనిని చంపుటకు ఆ గ్రామం మొత్తం ఈటెలు పట్టుకొని రాగా, ఆ బాలికలలో ఒకరు తన గ్రామస్థులను ఆపి, ఆ మిషనరీ క్రయం చెల్లించి ఎలా వారిని విడిపించి రక్షించారో వారికి వివరించి చెప్పింది. వెంటనే మిషనరీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని, పాపపు బానిసత్వం నుండి వారిని రక్షించుటకు యేసు క్రీస్తు తన ప్రాణాన్నే విమోచన క్రయధనముగా ఎలా చెల్లించారో వారికి తెలియపరిచారు. ఆ రోజున ఆ గ్రామస్థులలో అనేకమంది పాపాంధకారంలో ఉన్న తమ జీవితాలలో సువార్త వెలుగును చూశారు. క్రీస్తుకు ఉన్నటువంటి హృదయమును కలిగియున్న ఆ మిషనరీ మరెవరో కాదు, చీకటిలో ఉన్న ఆఫ్రికాలో సువార్త వెలుగును ప్రసరింపజేసిన జార్జ్ గ్రెన్‌ఫెల్.


    స్థానికులచే ‘టాటా’ (తండ్రి) అని ఆప్యాయంగా పిలువబడిన గ్రెన్‌ఫెల్, మధ్య ఆఫ్రికా యొక్క అన్వేషకునిగా కూడా పేరొందిన ఒక బాప్తిస్టు మిషనరీ. ఒక కంటిని కోల్పోయినప్పటికీ, అతను 24 సంll ల వయస్సులో మిషనరీగా సేవ చేయవలెననిన దేవుని పిలుపుకు విధేయులై 1874వ సంll లో ఆఫ్రికాలోని కామెరూన్‌కు వచ్చారు. అక్కడ అనేక అన్వేషణాత్మక ప్రయాణాలను చేపట్టిన అతను, మిషనరీ సేవ కొరకు విస్తారమైన కాంగో ప్రాంతము యొక్క ద్వారములను తెరిచారు. అప్పటి ఆఫ్రికా ప్రజలలో నిండుకొనియున్న నీచమైన భ్రష్టత్వమును చూసి అతను బాధపడినప్పటికీ, అంధకారం, కౄరత్వం మరియు మరణముతో నిండియున్న ప్రదేశములకు సువార్త వెలుగును తీసుకువెళ్ళడంలో గొప్ప సంతోషమును కనుగొన్నారు. 


    తన పెద్ద కుమార్తెను కోల్పోవడం మరియు అనేక ఇతర భయంకరమైన అనుభవాలను ఎదుర్కొనిన పరిస్థితులలో కూడా, నిజమైన దేవునిని కనుగొన్న ఆఫ్రికా ప్రజలను చూచి అతను ఓదార్పును మరియు సంతృప్తిని పొందారు. వారి ప్రాణాత్మలను ఎలా శుభ్రపరచుకొనవలెనో వారికి నేర్పించుటయే కాక, వారి భౌతిక జీవితాలలో కూడా నాగరికతను తీసుకువచ్చుటకు ప్రయత్నించారు గ్రెన్‌ఫెల్. నరమాంస భక్షకులు, హంతకులు, బానిస వ్యాపారులు మరియు మాంత్రికవిద్యలను అభ్యసించే ఆ ప్రజల జీవితాలను మార్చుటకు దేవుడు అతనిని ఒక శక్తివంతమైన సాధనముగా ఉపయోగించుకున్నాడు.


    మండుచున్న క్రొవ్వొత్తి తాను ప్రకాశిస్తున్న అదే సమయంలో కరుగుతుంది కూడా! అయినప్పటికీ, రక్షణ సువార్త యొక్క వెలుగును అంధకారమయమైన కాంగోలోకి తీసుకువెళ్ళుటకు, ప్రకాశించుచున్న క్రొవ్వొత్తి వలె గ్రెన్‌ఫెల్ కూడా తన సమస్తమునూ క్రీస్తుకు సమర్పించి, తాను కరిగిపోయారు. బ్లాక్ ఫీవర్ అనే జ్వరముతో తీవ్రముగా బాధింపబడిన తరువాత, 1906వ సంll లో తన ప్రభువు సన్నిధానమునకు చేరుకున్నారు జార్జ్ గ్రెన్‌ఫెల్.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, అంధకారమయమైన ఈ లోకములో మీరు మండుచూ ప్రకాశించుచున్న వెలుగువలె నున్నారా? 

    ప్రార్థన :

    "ప్రభువా, నన్ను విరుగగొట్టుము, కరిగించుము, మీ మహిమ నిమిత్తం నన్ను మలుచుము. ఆమేన్!" 

    దేవునికే మహిమ కలుగునుగాక! ఆమేన్ !


  • WhatsApp
  • Gordon Hall | గోర్డాన్ హాల్

    గోర్డాన్ హాల్ జీవిత చరిత్ర

    Pictures shown are for illustration purpose only



    • జననం: 08-04-1784
    • మహిమ ప్రవేశం: 20-03-1826
    • స్వస్థలం: కనెక్టికట్
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: భారతదేశం


    గోర్డాన్ హాల్ ‘అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ ఫర్ ఫారిన్ మిషన్స్’ (ఎబిసిఎఫ్ఎమ్) అనే సంస్థ యొక్క వ్యవస్థాపకులలో ఒకరు మరియు భారతదేశంలో అమెరికన్ ప్రొటెస్టంట్ మిషన్లకు మార్గదర్శకులు. ఒక పేద రైతు కుటుంబములో జన్మించిన గోర్డాన్, మిషనరీ సేవ పట్ల ఎంతో శ్రద్ధాసక్తులను, ఉత్సాహమును కలిగియున్న ఒక యువకునిగా ఉన్నారు. అతను ఆండోవర్ థియోలాజికల్ సెమినరీలో చేరగా, అక్కడ అన్యజనుల దేశాలకు సువార్తను తీసుకువెళ్ళుటకు అత్యుత్సాహముతో ఉన్న అడోనిరామ్ జడ్సన్ మరియు మరికొందరిని కలుసుకొనడం జరిగింది. కాగా వుడ్‌బరీలో ఉన్న ఆర్థికముగా గొప్పదైన ఒక క్రైస్తవ సంఘములో పాదిరిగా సేవ చేయుటకు అతనికి అవకాశం లభించినప్పటికీ, ఆ ప్రతిపాదనను తిరస్కరించిన గోర్డాన్ ఈ విధముగా పలికారు – “నేను నేలమీద పడుకోగలను, ఆకలి బాధను మరియు కష్టములను భరించగలను; అన్యజనుల యొద్దకు వెళ్లుటకై దేవుడు నన్ను పిలుస్తున్నాడు; అయ్యో, అన్యజనులకు నేను సువార్తను ప్రకటించకపోతే అది నాకు ఎంతటి దుఃఖం!”


    తత్ఫలితముగా, 1812వ సంll లో భారతదేశానికి పయనమై బొంబాయి (ముంబై) నగరంలో ‘అమెరికన్ మరాఠీ మిషన్’ లేదా ‘బొంబాయి మిషన్’ ను స్థాపించారు గోర్డాన్. ఎంతో శ్రద్ధగా మరాఠీ భాషను నేర్చుకొని, వెనువెంటనే మత్తయి సువార్తను మరాఠీలోకి అనువదించడం ప్రారంభించారు. దేవాలయాలు, అంగడి ప్రదేశాలు మరియు ఇతర బహిరంగ ప్రదేశాలలో అతను సువార్తను ప్రకటించేవారు. అతను చెప్పునది కొందరు శ్రద్ధగా ఆలకించగా మరికొందరు అతనిని అపహాస్యం చేశారు. ఏదేమైనప్పటికీ, ఎవరైనా వింటున్నారా లేదా విస్మరిస్తున్నారా అనునది మనస్సునకు తెచ్చుకొనక ప్రజలకు క్రీస్తును తెలియపరచుటలో గోర్డాన్ స్థిరముగా ముందుకు సాగిపోయారు. అతని ప్రసంగాలు విన్న చాలా మంది స్థానికులు క్రీస్తును అంగీకరించారు మరియు సంఘ సహవాసములోనికి చేర్చబడ్డారు.


    ప్రజల సామాజిక శ్రేయస్సు గురించి కూడా చింతను కలిగియున్నారు గోర్డాన్. కాగా అతను పాఠశాలలను స్థాపించారు మరియు పాఠ్యాంశాలను కూడా తయారుచేశారు. ఆ పాఠ్యాంశాలలో  బైబిలలోని విలువలు, సూత్రాలు మిళితమై ఉన్నాయి. ప్రతి పాఠశాల స్థానిక ప్రార్థనాలయముగా కూడా పనిచేసింది. ఏలయనగా అక్కడ అతను చుట్టుప్రక్కల ఉన్నవారికి బైబిలు పఠనములను నిర్వహించేవారు. అంతేకాకుండా అతను స్థానికులకు వైద్య సేవలను కూడా అందించారు. 1826వ సంll లో నాసిక్‌లో కలరా వ్యాధి వ్యాపించినప్పుడు, అవసరతలలో ఉన్నవారికి వైద్య సహాయం అందించుటకు వెంటనే అప్రమత్తమైన గోర్డాన్, పరుగున అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడి నుండి తిరిగి వస్తున్నప్పుడు అతను కూడా కలరా వ్యాధి వలన అనారోగ్యానికి గురయ్యారు. కాగా ప్రక్కన ఉన్నవారు అతనికి సహాయం చేయుటకు త్వరపడగా, తన సమయం ఆసన్నమైనదని గ్రహించిన గోర్డాన్, తన చుట్టూ గుమిగూడిన ప్రజలకు తన శక్తికొలదీ చెప్పగలిగినంత శబ్దముతో సువార్తను ప్రకటించారు. తదుపరి అతను నేలమీద పడుకుని, తన ఆత్మను ప్రభువు చేతులకు అప్పగించారు. అతను మరణిస్తున్నప్పుడు అతని పెదవులపై మెదిలిన చిరు ప్రార్థన  –  "ఓ దేవా, నీకు మహిమకలుగునుగాక!"


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, అన్యజనులకు సువార్తను తీసుకువెళ్ళమని దేవుడు మిమ్ములను పిలుచుచున్నాడు. అందుకు మీ స్పందన ఏమిటి? 


    దేవునికే మహిమ కలుగునుగాక! ఆమేన్ !


  • WhatsApp
  • Guido Fridolin Verbeck | గైడో ఫ్రిడోలిన్ వెర్బెక్

    గైడో ఫ్రిడోలిన్ వెర్బెక్  జీవిత చరిత్ర




    • జననం: 23-01-1830
    • మహిమ ప్రవేశం: 10-03-1898
    • స్వస్థలం: జీస్ట్
    • దేశం: నెదర్లాండ్స్
    • దర్శన స్థలము: జపాన్


    ఒకసారి జపాన్ దళాలన్నింటికీ పైన అత్యున్నత అధికారంలో ఉన్న సేనాధిపతి నీటిలో తేలియాడుతున్న ఒక పుస్తకమును చూశాడు. దానిని తీసుకొనిరమ్మని అతను ఒకనిని పంపి దానిని తెప్పించి చూసినప్పుడు, ఆ పుస్తకం క్రొత్త నిబంధన ప్రతి అని గ్రహించాడు. దానిని గురించి వివరంగా తెలుసుకోవాలనుకున్న అతనిని అతని తోటి అధికారి జపాన్‌లో ఉన్న ఏకైక మిషనరీ యొద్దకు నడిపించాడు. ఆ మిషనరీ  మరెవరో కాదు, తీవ్రమైన వ్యతిరేకత మధ్య ఆ దేశంలో ధైర్యముగా సేవను కొనసాగిస్తున్న గైడో ఫ్రిడోలిన్ వెర్బెక్. అతను ఆ సేనాధిపతికి క్రీస్తు ప్రేమను వివరించి, అతను నిజమైన దేవునిని కనుగొనుటకు సహాయం చేశారు.


    పంతొమ్మిదవ శతాబ్దపు మధ్యభాగంలో జపాన్‌లో సేవచేసిన డచ్ మార్గదర్శక మిషనరీ వెర్బెక్. తన ఇంజనీరింగ్ చదువును పూర్తి చేసుకొనిన తరువాత, అతను ఒక లోహపు కర్మాగారంలో పని చేయుటకు అమెరికా వెళ్ళారు. అక్కడ పనిచేస్తున్న సమయంలో, కలరా కారణంగా అతను మరణిస్తారేమో అన్నటువంటి పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చింది. ఆ సమయంలో అతను నేను బాగుపడితే మిషనరీ అవుతానని దేవునికి మాట ఇచ్చారు. ఆనాడు తాను చేసిన ప్రమాణమును బట్టి అతను న్యూయార్క్‌లోని ఒక బైబిలు వేదాంత కళాశాలలో చేరారు. 

    డచ్ రిఫార్మ్డ్ చర్చి యొక్క ఆహ్వానాన్ని అంగీకరించి, వెర్బెక్ మరియు అతని భార్యయైన మారియా మేనియన్ 1859వ సంll లో మిషనరీలుగా జపాన్ దేశములోని నాగసాకీకి వెళ్ళారు. అప్పటిలో క్రైస్తవ మతాన్ని ప్రకటించడం జపాన్‌లో నిషేధించబడినందున అతను మొదటి రెండు సంవత్సరములు పరిచర్య కొరకు తనను సిద్ధపరుచుకొనుటలో సమయమును వెచ్చించారు. అతను ఒకవైపు జపానీయుల భాషను నేర్చుకుంటూనే, ఆసక్తిగల స్థానిక విద్యార్థులకు ఆంగ్లమును నేర్పించారు. యేసు క్రీస్తును జపానీయులకు పరిచయం చేయుటకు ఇది ఒక సూక్ష్మమైన మాధ్యమంగా మారింది. వారి మనసు మంచిదే అయినప్పటికీ, తమ సంస్కృతిని బట్టి గర్వించే జపానీయులు క్రైస్తవ మతం బోధించబడుటను సహించలేకపోయారు. దాని కారణంగా, ప్రమాదకరమైన షిమాజు తెగవారి చేతులలో చంపబడకుండా తప్పించుకొనుటకు వెర్బెక్ తరచుగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశమునకు వెళ్ళవలసి వచ్చింది.


    ఒకవైపు పాశ్చాత్యులను వ్యతిరేకిస్తూ తిరుగుబాట్లు చెలరేగుతున్నప్పటికీ, మరొకవైపు జపానీయులలో ఎటువంటి మార్పు కనబడకపోయినప్పటికీ, జపాన్‌లో తన పరిచర్యను కొనసాగించారు వెర్బెక్. పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రమును మరియు భాషలను విద్యార్థులకు నేర్పించుటకు అతనికి ఉన్న సామర్థ్యమును బట్టి అతను జపాన్ ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని సంపాదించి వారికి సలహాదారునిగా మారారు. నలభై సంవత్సరాల పాటు జపాన్ దేశంలో ప్రొటెస్టంట్ మిషన్ యొక్క పురోగతికి నాయకత్వం వహించిన గైడో ఫ్రిడోలిన్ వెర్బెక్, ఆ దేశంలో సువార్త ద్వారములు తెరువబడుటలో కీలక పాత్ర పోషించారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీరు దేవునికి చేసిన ప్రమాణములను నెరవేర్చితిరా? 


    ప్రార్థన :

    "ప్రభువా, నా అవిశ్వాస్యతను మన్నించుము. నేను మీకు చేసిన నా ప్రమాణములన్నింటినీ నేను నెరవేర్చెదను. ఆమేన్!" 

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Egerton Ryerson Young | ఎగర్టన్ రైర్సన్ యంగ్

    ఎగర్టన్ రైర్సన్ యంగ్ జీవిత చరిత్ర


    • జననం: 07-04-1840
    • మహిమ ప్రవేశం: 05-10-1909
    • స్వస్థలం: క్రాస్బీ
    • దేశం: కెనడా
    • దర్శన స్థలము: కెనడా


    మిషనరీ పరిచర్యలో ఎదురుపడే లెక్కకు మించిన సవాళ్ళు మరియు కష్టాలలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనడం కూడా ఒకటి. తీవ్రమైన శీతోష్ణములను, సవాళ్ళతో కూడిన భౌగోళిక స్థితిని కలిగినదైన ఉత్తర కెనడా జీవనం సాగించుటకు ఒక క్లిష్టమైన ప్రదేశమని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ అక్కడి ప్రజలు కూడా నిజమైన దేవుని తెలుసుకొనుటకు అర్హులైయున్నారు. అందుకొరకు దేవుడు మాధ్యమముగా వాడుకొనిన వ్యక్తి ఎగర్టన్ రైర్సన్ యంగ్. కెనడాకు చెందిన అతను అన్ని అవరోధములను ధైర్యముగా ఎదుర్కొని అనేకమంది ఉత్తర కెనడా స్థానికులను దేవుని యొద్దకు నడిపించిన ఒక మార్గదర్శక మిషనరీ.


    సువార్తను ప్రకటించే స్థితిగతుల మధ్య పెరిగిన ఎగర్టన్, మొదటి నుండీ కూడా నశించుచున్న ఆత్మల కొరకు భారమును కలిగియున్నారు. వృత్తి రీత్యా ఉపాధ్యాయులైన అతను, పాఠశాలలో దాదాపు అన్ని విభాగాల పాఠ్యాంశములను బోధించగలిగే సామర్థ్యం ఉన్నవారు. 1867వ సంll లో వెస్లియన్ మెథడిస్ట్ చర్చి చేత సేవ చేయుటకు నియామక అభిషేకం పొందిన తరువాత, ఒక మిషనరీగా రూపర్ట్స్ ల్యాండ్ అనే ప్రాంతములో స్థానికుల మధ్య సేవ చేయుటకు పంపబడ్డారు. కాగా ఇంటి వద్ద లభించే సౌఖ్యములను విడిచిపెట్టి, తన భార్యయైన ఎలిజబెత్ బింగ్‌హామ్ మరియు మరికొందరు మిషనరీలతో కలిసి కెనడా యొక్క ఉత్తర భాగమునకు పయనమయ్యారు ఎగర్టన్. ఒక భయానకమైన మరియు ప్రమాదకరమైన ప్రయాణమైన ఆ ప్రయాణములో వారు కాలినడకన అనేక నదులు, కొండలు మరియు ప్రమాదకరమైన అరణ్యాలను దాటవలసి వచ్చింది. 


    రెండున్నర నెలల పాటు సాగిన ఆ కష్టతరమైన ప్రయాణం తరువాత చివరికి తన గమ్యాన్ని చేరుకొనగలిగారు ఎగర్టన్. అక్కడ అతను ఒక గ్రామము నుండి మరొక గ్రామమునకు ప్రయాణిస్తూ, స్థానికులను వారి గృహములలో సంధించి వారికి నిత్యజీవ మార్గమును బోధించారు. సువార్తను ప్రకటించుట కొరకు చేసిన తన ప్రయాణాలలో అనేక ఘోరమైన ప్రమాదాలను మరియు ఇబ్బందులను అతను ధైర్యముగా ఎదుర్కొన్నారు. -60 డిగ్రీలకు పడిపోయే శీతల వాతావరణం నుండి తనను తాను రక్షించుకొనుటకు అతను నేలలో బొరియలను త్రవ్వి వాటిలో నిద్రపోయేవారు. మంచు మీద పడి మెరుస్తూ అంధత్వానికి కూడా దారితీసేటువంటి మిరుమిట్లు గొలిపే సూర్యకాంతి వలన పగటిపూట ప్రయాణించడం అసాధ్యకరమైనటువంటి పరిస్థితులు తరచుగా ఎదురుపడేవి. కావున అతను రాత్రి సమయములో మాత్రమే ప్రయాణించేవారు. అటువంటి కఠినమైన వాతావరణం కారణంగా కొన్నిసార్లు అతని చర్మం పగిలి చీరుకుపోయినట్లు అగుట వలన అతని ముఖం మరియు కాళ్ళ నుండి రక్తం కారేది. ఒకవైపు అటువంటి ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చినప్పటికీ, స్థానికులకు సువార్తను చేరవేయుటకు తన మిషనరీ ప్రయాణములో వెనుదిరుగక ముందుకు సాగిపోయారు ఈ నిజమైన మిషనరీ.


    ఎగర్టన్ పరిచర్య మూలముగా అనేక మంది స్థానికులు క్రీస్తును అంగీకరించారు. అటువంటి వారిలో కౄరస్వభావులైన ఆటవికులు సున్నిత మనస్కులుగా మారారు మరియు భయమును కొల్పేవిగా ఉండే వారి విగ్రహాలను వారు తీసివేశారు. మిక్కుటమైన క్లిష్ట పరిస్థితుల మధ్య నశించుచున్న ఆత్మలను వెదుకుకుంటూ వెళ్ళిన ఎగర్టన్ రైర్సన్ యంగ్, తదుపరి అమెరికా, గ్రేట్ బ్రిటన్ మరియు ఆస్ట్రేలియా దేశాలను పర్యటించి మహిమకరమైన మిషనరీ మార్గమును ఎంచుకొనుమని విశ్వాసులను ప్రోత్సహిస్తూ తన జీవితపు చివరి సంవత్సరాలను గడిపారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీరు దేవుని సేవ చేస్తున్నప్పుడు కలిగే అసౌకర్యాల గురించి ఫిర్యాదు చేసేవారిగా ఉన్నారా?


    ప్రార్థన :

    "ప్రభువా, మీ సేవ చేస్తున్నప్పుడు నేను సణిగిన సణుగులను మన్నించి, ఎదురుపడే ఇబ్బందులను సంతోషముతో నేను ఎదుర్కొనగలుగునట్లు నన్ను బలపరచుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Hattie Judson | హ్యాటీ జడ్సన్

    హ్యాటీ జడ్సన్  జీవిత చరిత్ర

    Pictures shown are for illustration purpose only




    • జననం: -
    • మహిమ ప్రవేశం: 1897
    • స్వస్థలం: డాన్విల్లే, కనెక్టికట్
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: భారతదేశం


    కీర్తనలు 116:15 లో బైబిలు ఇలా చెబుతోంది, “యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది.” వారి త్యాగపూరితమైన జీవితముల ద్వారా యేసు క్రీస్తు ప్రభువు మహిమపరచబడ్డారు మరియు క్రైస్తవ సంఘము అభివృద్ధి చెందింది. వారు ఎదురొంటున్న సవాళ్ళకు, పరీక్షలకు మరియు అనుభవిస్తున్న శ్రమలకు, కష్టాలకు మరణం ముగింపు తెచ్చినప్పటికీ, వారు చేసిన పరిచర్య మాత్రం ఈ లోకములో జీవించుచునే యున్నది. దేవుని పరిచర్య చేస్తూ ఆయన రాజ్యం నిమిత్తం మరణించిన అటువంటి మిషనరీలలో హ్యాటీ జడ్సన్ ఒకరు. 


    హ్యాటీ జడ్సన్ ప్రసిద్ధ మిషనరీయైన అడోనిరామ్ జడ్సన్ యొక్క దూరపు బంధువు. 1892వ సంll లో భారతదేశానికి చేరుకున్న హ్యాటీ, మధ్యప్రదేశ్‌లోని హర్దాలో తన మిషనరీ పనిని ప్రారంభించారు. ప్రారంభంలో ఆమె ఆ ప్రాంతంలోని ఒక బాలికల పాఠశాలకు పర్యవేక్షకురాలిగా పని చేశారు. అలుపెరుగని ఆమె శ్రమ కారణంగా ఆమె సంరక్షణలో ఆ పాఠశాల ఎంతో అభివృద్ధి చెందింది. అప్పటిలో ప్రబలంగా ఉన్న భారతీయ ఆచారాల ప్రకారం తల్లిదండ్రులు సాధారణంగా చాలా చిన్న వయస్సులోనే తమ కుమార్తెలకు బలవంతముగా వివాహం చేసేవారు. అయితే వారికున్న అటువంటి మనస్తత్వాన్ని మార్చుటకు హ్యాటీ ఎంతగానో ప్రయత్నించారు మరియు వారి కుమార్తెలు మంచి భవిష్యత్తును కలిగియుండునట్లు వివాహానికి ముందు వారు వారి చదువును పూర్తి చేయుటకు అనుమతించవలెనని ఆమె భారతీయులను ప్రోత్సహించారు. ఆమె కనుపరిచే ఉత్సాహం మరియు ఆమె శ్రమ వారి కుమార్తెలను పాఠశాలకు పంపునట్లు అనేక కుటుంబాలను ప్రోత్సహించడంతో త్వరలోనే ఆ పాఠశాలలోని విద్యార్థినీల సంఖ్య 10 నుండి 37 కి పెరిగింది.


    కనికరము కలిగిన వ్యక్తిగాను మరియు ఎల్లప్పుడూ సంతోషమును కనుపరిచేవారిగాను పేరుపొందిన హ్యాటీ, తన సంరక్షణలో ఉంచబడిన ప్రభుని మందను భద్రపరచుటకు త్యాగపూరితమైన జీవితమును జీవించారు. 1897వ సంll లో మధ్య భారతదేశంలో భయంకరమైన కరువు కలిగింది మరియు తెగులు వ్యాపించింది. ఆ సమయములో సహాయ చర్యలను చేపట్టిన వారికి సహాయమందించుటకుగాను ఆమె మహోబా అనే ప్రాంతమునకు వెళ్ళారు. అక్కడ ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నవారికి మరియు పేదలకు ఆహారమందించుటలో తన శక్తినంతటినీ ఉపయోగించారు. ప్రజలు బ్రతుకుటకుగాను తన సంపాదన మొత్తాన్ని కూడా మిషన్ పనికి ఇచ్చారు హ్యాటీ. మహోబాలో ఆమె ఎంతగానో శ్రమించి సేవలను అందించగా, దాని వలన ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది. తత్ఫలితంగా ఆమె టైఫాయిడ్ జ్వరముతో బాధపడి, చివరికి 1897వ సంll లో పరమందు తన ప్రభువును చేరుకొనుటకు ఈ లోకమును విడిచి వెళ్ళారు. అనారోగ్యముతో బాధపడుతున్న సమయములో కూడా లేచి పిల్లలకు సంరక్షణ నందించవలెననునది ఆమెలో ఉన్న నిరంతర వాంఛ.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీ సంరక్షణలో ఉంచబడిన ఆత్మల యొక్క ఆత్మీయ ప్రయోజనం కొరకు మీరు త్యాగపూరితమైన జీవితమును జీవించుచున్నారా?

    ప్రార్థన :

    "ప్రభువా, పరిశుద్ధమును మీకు అంగీకారయుతమునైన త్యాగపూరితమైన జీవితమును జీవించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!" 

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Jul 25, 2022

    Hana Catherine Mullens | హనా కాథరిన్ ముల్లెన్స్

    హనా కాథరిన్ ముల్లెన్స్ జీవిత చరిత్ర

    Pictures shown are for illustration purpose only



    • జననం: 01-07-1826
    • మహిమ ప్రవేశం: 21-12-1861
    • స్వస్థలం: కలకత్తా
    • దేశం: భారతదేశం
    • దర్శన స్థలము: భారతదేశం


    ఐరోపా ఖండమునకు చెందినవారైన హానా కాథరిన్ ముల్లెన్స్, జెనానా మిషన్లకు మార్గదర్శకురాలిగా పరిగణించబడే మిషనరీ. ఈ జెనానా పరిచర్య బహిరంగంగా కనిపించుటకు అనుమతించబడని అప్పటి భారతీయ మహిళలకు సువార్తను అందించుటకు మహిళా మిషనరీలను పంపేదిగా ఉంది. హానా ఒక పరిష్కారమును కనుగొనేంత వరకూ బంధకాలలో ఉన్నటువంటి ఈ మహిళలను చేరుకోవడం మిషనరీలకు జవాబు దొరకని ఒక గొప్ప చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది.


    కలకత్తాలోని ఒక మిషనరీల కుటుంబంలో జన్మించిన హానా, ఆమె తల్లిదండ్రుల పరిచర్య ద్వారా ప్రేరణ పొందారు. మంచి తెలివితేటలు గలిగిన ఆమె, పన్నెండేళ్ళ వయసుకు ముందే తరగతులు నిర్వహించుటలో తన తల్లికి సహాయం చేసేవారు. ఆమె పదిహేనేళ్ళ ప్రాయంలో యేసు క్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించారు మరియు తన ఇంటిని సందర్శించిన ప్రతి ఒక్కరితో ఎంతో ఆసక్తి ఉత్సాహములతో సువార్తను పంచుకునేవారు. అవిశ్వాసులను క్రీస్తు వద్దకు తీసుకురావడంలో ఇతర ప్రసంగాల కంటే వారితో ఆమె కలిగియుండే సంభాషణలే వారిని బహుగా ప్రభావితం చేసివి. 19 సంll ల వయసులో రెవ. డాక్టర్ ముల్లెన్స్‌తో ఆమెకు వివాహం జరుగగా, వారిరువురు కలిసి బెంగాల్‌లో సంతోషముతో ప్రభువుకు సేవ చేశారు. బెంగాలీ భాషలో మంచి వాక్పటుత్వము కలిగియున్న ఆమె, స్థానిక మహిళల కొరకు క్రైస్తవ రచనలనలు వ్రాశారు మరియు అనువదించారు. ఆమె వ్రాసిన పుస్తకాలలో ఒకటి భారతదేశంలోని పన్నెండు భాషా మాండలికాలలో ప్రచురించబడింది. 


    భారతీయ మహిళలు దయనీయమైన స్థితిలో అజ్ఞానులుగాను, ఒంటరిగా ఏ పనీ లేకుండా, సంతోషము లేక యున్నారని ఎరిగియున్న హానా, వారి కొరకు ఏమైనా చేయాలని ఎల్లప్పుడూ కోరుకునేవారు. అటువంటి అవకాశం అనుకోని విధంగా ఆమె తలుపు తట్టింది. ఎంబ్రాయిడరీ మరియు కుట్టుపనిలోని అల్లికలలో నైపుణ్యము కలిగియున్న హానా, ఒకసారి ఒక జత చెప్పుల పై అల్లిక పని చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి దానిని చూచి ఆశ్చర్యముతో "నా భార్య కూడా అటువంటి పనిని నేర్చుకోవాలని కోరుకుంటున్నారు" అని అన్నాడు. హానా వెంటనే ఆ అవకాశమును అందిపుచ్చుకొని, కావాలంటే ఆ పనిని అతని భార్యకు నేర్పించగలనని చెప్పారు. ఆ విధంగా, భారతీయ మహిళలకు అటువంటి నైపుణ్యాలను నేర్పించుటకే కాక, ఆత్మీయ విషయములను కూడా వారికి నేర్పించుటకు వారిని కలుసుకొనగలుగునట్లు ద్వారములు తెరువబడ్డాయి. త్వరలోనే ఆమె అటువంటి మహిళలను అనేకమందిని కలుసుకుంటూ, సువార్తను చెప్పి వారిని క్రీస్తు వద్దకు నడిపించారు.


    అయితే 35 సంll ల లేత వయస్సులోనే హానా ఈ లోకమును విడిచి వెళ్ళవలసి వచ్చింది. అయినప్పటికీ, ఆమె చేతి వ్రేళ్ళతో నిరంతరాయంగా పనిచేసిన కుట్టు సూది జెనానా పరిచర్యకు ద్వారములు తెరిచింది. అనేకమంది ఇతర మహిళా మిషనరీలు పరిచర్య చేయుటకు ఆమె అవలంబించిన పద్ధతులను అనుసరించారు. తత్ఫలితముగా వేలాది మంది భారతీయ మహిళలు నిజమైన దేవుని యొద్దకు నడిపింపబడ్డారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీకు కలిగిన అవకాశములను సువార్త పంచుకొనుటకు ఎంత బాగా మీరు ఉపయోగించుకుంటున్నారు? 


    ప్రార్థన :

    "ప్రభువా, నా విశ్వాసమును చురుకుగా ఇతరులతో పంచుకొనుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"


    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp