Search Here

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

May 14, 2023

Peter Percival | పీటర్ పెర్సివల్

పీటర్ పెర్సివల్ గారి జీవిత చరిత్ర

  • జననం : 24-07-1803
  • మరణం : 11-07-1882
  • స్వదేశం : ఇంగ్లాండు
  • దర్శన స్థలము : శ్రీలంక, భారతదేశం

పీటర్ పెర్సివల్ ఒక ఆంగ్లేయ మిషనరీ, భాషావేత్త మరియు ఆంగ్లేయులు పాలించిన కాలంలో శ్రీలంక మరియు భారతదేశంలోని దక్షిణ తమిళనాడులలో విద్యను అందించిన మార్గదర్శకులలో ఒకరు. అతను ‘వెస్లియన్ మెథడిస్ట్ మిషనరీ సొసైటీ’ (డబ్ల్యూఎంఎంఎస్) వారిచే 1826వ సంll లో శ్రీలంకలోని జాఫ్నా ద్వీపకల్పానికి పంపించబడ్డారు. 1829-1832 మధ్య కాలంలోని కొద్ది సంవత్సరములు బెంగాల్ ప్రాంతంలో గడిపినది మినహా 1851వ సంll వరకు కూడా జాఫ్నాలోనే ఉన్న అతను, తన వయోజన జీవితములో అధిక భాగం ఆ ద్వీపకల్పంలోనే గడిపారు. బెంగాల్ లో ఉన్న సమయములో అతను ప్రెస్బిటేరియన్ మిషనరీ అయిన అలెగ్జాండర్ డఫ్ యొక్క విద్యా విధానాల ద్వారా ఎంతో ప్రభావితులయ్యారు. ఫలవంతమైన మిషనరీ కార్యకలాపాలకు విద్యే ఆధారమని అతను గ్రహించారు.


కాగా జాఫ్నాకు తిరిగి వచ్చినప్పుడు అతను అనేక పాఠశాలలను ప్రారంభించారు మరియు అంతకు మునుపు స్థాపించబడిన ప్రాథమిక పాఠశాలలను ఉన్నత శ్రేణికి అభివృద్ధి పరిచారు. అతను ఆ జిల్లాలో పాఠశాలలను స్థాపించుచూ, ఉపాధ్యాయులను నియమించుచూ గ్రామం నుండి గ్రామానికి వెళ్ళారు. ఆ పాఠశాలలు అక్షరాస్యతను మెరుగుపరచడంలో సహాయపడటమే కాకుండా సామాజిక పరిస్థితులను మార్చాయి, మరి ముఖ్యముగా సువార్త ప్రచార మాధ్యమాలుగా పనిచేశాయి. ఆంగ్ల భాషలోనో లేక పోర్చుగీసు భాషలోనో బైబిలు బోధించబడుట కంటే స్థానిక భాషలో బోధించబడవలెనని అతను విశ్వసించారు. కాబట్టి అతను మునుపు తన విద్యార్ధి మరియు తమిళ పండితుడైన ఆరుముగ నావలర్ యొక్క సహకారముతో శ్రీలంక తమిళ మాతృకలోనికి బైబిలును అనువదించారు. తద్వారా తామే స్వయంగా దేవుని వాక్యమును చదివి ఆత్మీయముగా ఎదుగులాగున ప్రజలు ప్రోత్సాహమొందారు. అంతేకాకుండా 1836వ సంll లో జాఫ్నాలో సెయింట్ పాల్స్ ప్రార్థనా మందిరమును కూడా స్థాపించారు పెర్సివల్. ఇది అక్కడ తమిళ భాషలో ఆరాధించే మొదటి క్రైస్తవ ఆరాధనా స్థలమయ్యింది.


1851వ సంll లో ఇంగ్లాండు దేశానికి తిరిగి వెళ్ళిన అతను, అక్కడ డీకనుగా (క్రైస్తవ సంఘ సహాయక పరిచారకునిగా) నియమించబడ్డారు మరియు కొన్ని సంవత్సరాల పాటు కాంటర్బరీలోని సెయింట్ అగస్టిన్స్ కళాశాలలో బోధకునిగా పనిచేశారు. పిమ్మట 1854వ సంll లో తిరిగి భారతదేశానికి వచ్చి మద్రాసులో పరిచర్య చేశారు. అప్పటిలో నూతనముగా స్థాపించబడిన మద్రాస్ విశ్వవిద్యాలయంలో స్థానిక భాషా సాహిత్య ఆచార్యునిగా కూడా అతను నియమితులయ్యారు. అతని బహుళ భాషా నిఘంటువులు మరియు భారతీయ సంస్కృతికి సంబంధించిన పుస్తకములు తరువాత వచ్చిన మిషనరీలు పరిచర్యకు సిద్ధపడి వచ్చునట్లు ఉపకరించాయి. తన చివరి రోజులను తమిళనాడులోని యెర్కాడ్ లో గడిపిన పీటర్ పెర్సివల్, 1882వ సంll లో పరమునందు తన ప్రభువును చేరుకొనుటకు ఈ లోకమును విడిచి వెళ్ళారు.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, క్రొత్త విషయములను నేర్చుకొని, వాటి ద్వారా ప్రభువును సేవించుటకు మీరు అంగీకారయుతమైన మనస్సును కలిగియున్నారా? 

ప్రార్థన :

"ప్రభువా, ఇతరులకు బైబిలు యొక్క సత్యములను అందించే సాధనముగా నన్ను వాడుకొనుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Jul 26, 2022

    Patricia St. John | ప్యాట్రిసియా సెయింట్ జాన్

    ప్యాట్రిసియా సెయింట్ జాన్ జీవిత చరిత్ర



    • జననం: 1919
    • మహిమ ప్రవేశం: 1993
    • స్వదేశం: ఇంగ్లాండు
    • దర్శన స్థలము: మొరాకో


    ప్యాట్రిసియా సెయింట్ జాన్ మొరాకో దేశంలో సేవ చేసిన ఒక మిషనరీ నర్సు. సువార్తను గురించి ఆమె చేసిన రచనలకు కూడా పేరొందారు ప్యాట్రిసియా. ఆమె తల్లిదండ్రులు కూడా మిషనరీలుగా దక్షిణ అమెరికాలో సేవచేసి, 1919వ సంll లో ఇంగ్లాండుకు తిరిగి వచ్చారు. కాగా దైవికమైన పరిస్థితుల మధ్య పెరిగిన ప్యాట్రిసియా చిన్నప్పటి నుండి కూడా మిషనరీ పరిచర్య వైపు మొగ్గుచూపారు. చాలా చిన్న వయస్సులోనే ఆమె యేసు క్రీస్తును గురించి ఇతరులకు చెప్పవలసిన ఆవశ్యకతను మరియు దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు.


    రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో లండన్ నగరంలో నర్సుగా పనిచేశారు ప్యాట్రిసియా. మొరాకోలో జరుగుచున్న వైద్య మిషనరీ పరిచర్యలో తనతో కలుసుకొనుమని ఆమె సోదరుడి నుండి వచ్చిన ఆహ్వానం మేరకు ప్యాట్రిసియా టాంజియర్స్‌కు  వెళ్ళారు. అక్కడ స్థానిక ముస్లిం ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఉన్న పరిస్థితుల మధ్య ఆమె పనిచేశారు. ముస్లిం మహిళలు మగ వైద్యుని యొద్దకు వెళ్ళుటకు అనుమతించబడేవారు కాదు. అందువలన ప్యాట్రిసియా ఆ మహిళలకు సేవలందించుటకుగాను తన స్వంత ఇంటినే చిన్న వైద్యశాలగా ఉపయోగించారు. త్వరలోనే ఆమె స్థానిక మహిళల యొక్క నమ్మకమును సంపాదించుటయే కాక, వారిలో అనేకమంది ఆత్మలను కూడా క్రీస్తు కొరకు సంపాదించారు.


    తమ స్వజనులే క్రీస్తును అంగీకరించుచున్నారని చూసిన ముస్లింలు ఆమెను బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపొమ్మని చెప్పారు. కాబట్టి ఆమె  రువాండాకు వెళ్ళి, అక్కడ కూడా అదే రీతిని పరిచర్య జరిగించారు. అయితే కొంతకాలం తరువాత ఆమె తిరిగి టాంజియర్స్‌కు వచ్చి, అక్కడ ఒక నర్సింగ్ శిక్షణా పాఠశాలను స్థాపించారు. ఒక నిజమైన క్రైస్తవుడు క్రీస్తును గూర్చి సాక్ష్యమివ్వకుండా ఊరకనే కూర్చొనలేడు. అది  ప్యాట్రిసియా విషయంలో కూడా నిజమైంది. అందువలన, మొరాకో ప్రభుత్వం ఆమె సోదరుని ఆసుపత్రిని మరియు ఆమె యొక్క నర్సింగ్ శిక్షణాలయమును రెండింటినీ స్వాధీనం చేసుకొని, వారిరువురూ దేశం విడిచి వెళ్ళవలెనని ఆదేశించింది. 27 సంవత్సరాలు మొరాకోలో సేవ చేసిన పిమ్మట 1975వ సంll లో ఇంగ్లాడుకు తిరిగి వచ్చారు ప్యాట్రిసియా. తరువాత ఆమె బీరుట్ మరియు ఇథియోపియాలోని కొన్ని ప్రాంతములకు వెళ్ళి, బీదల మధ్యను మరియు ఆకలితో అలమటించుచున్న వారికిని చివరి వరకూ సేవలందించారు.


    ప్యాట్రిసియా ఆకట్టుకునే విధముగా కథలు చెప్పగలరు. ఆమె తన రోజువారీ అనుభవాలను చిన్న చిన్న కథలుగా మలిచి, పిల్లలకు మరియు యవ్వనస్థులకు దేవుని ప్రేమను మరియు శక్తిని తెలియజేయుటకు ఉపయోగించేవారు. మిషనరీ పరిచర్యలో కూడా ఆమె మతాధికారుల కొరత వలన క్రొత్తగా జన్మించిన విశ్వాసుల యొక్క ఆత్మీయ అభివృద్ధి దెబ్బతినకుండా చూచుకున్నారు. తానే స్వయంగా బైబిలు యొక్క సత్యాలను సరళముగాను, అదేసమయంలో సమర్థవంతముగాను వారికి నేర్పించారు. ఆమె రచించిన “ట్రెజర్స్ ఆఫ్ ది స్నో” మరియు “ది టాంగిల్‌వుడ్స్' సీక్రెట్” వంటి పుస్తకాలు ఎంతో మంది చిన్నారులను క్రీస్తు వద్దకు నడిపించాయి.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, యేసు క్రీస్తును గురించి ఇతరులకు చెప్పవలసిన ఆవశ్యకతను మరియు దాని ప్రాముఖ్యతను మీరు గ్రహించారా?


    ప్రార్థన :

    "ప్రభువా, ఏమీ చేయకుండా కూర్చునే నా స్వభావమును క్షమించి, చురుకుగా సువార్తను మోసుకువెళ్ళే వ్యక్తిగా ఉండునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Dec 15, 2021

    Patricia Anne Wikinson Life History

    ప్యాట్రిసియా అన్నే వికిన్సన్ గారి జీవిత చరిత్ర







    • జననం: 15-04-1944
    • మహిమ ప్రవేశం: 06-03-2011
    • స్వస్థలం: హర్ట్స్‌విల్లే
    • దేశం: ఆస్ట్రేలియా
    • దర్శన స్థలము: నైజీరియా మరియు ఆస్ట్రేలియా

     ఆస్ట్రేలియాకు చెందిన వైద్య మిషనరీయైన ప్యాట్రిసియా అన్నే వికిన్సన్, నైజీరియాలో అందించిన సేవలకు ప్రసిద్ధి చెందారు మరియు ఆస్ట్రేలియాలో ‘ఉమెన్-చర్చ్ మూవ్‌మెంట్’ (స్త్రీల క్రైస్తవ సంఘ ఉద్యమం) యొక్క నాయకురాలిగా కూడా పేరుగాంచారు. ముగ్గురు కుమార్తెలున్న కుటుంబములో జన్మించిన ప్యాట్రిసియా దేవుని యందలి భయభక్తులతో పెంచబడగా, చిన్నతనం నుండే ఆమెలో మిషనరీ సేవ కొరకైన మనస్సు పెంపొందించబడింది. ఆమె చాలా తెలివైన విద్యార్థిని. బాల్యంలో ఆమె పాఠ్యేతర కార్యకలాపాలపై కూడా ఆసక్తి కలిగియుండేవారు. ఆమె సిడ్నీలో వైద్యశాస్త్రం చదువుటకు కామన్వెల్త్ స్కాలర్‌షిప్‌ను గెలుచుకొనగా, అది నైజీరియా మరియు ఆస్ట్రేలియా దేశాలలో ఆమె యొక్క మిషనరీ సేవకు పునాదిగా మారింది.

     తన ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకొనిన వెంటనే ప్యాట్రిసియా ఆఫ్రికాలో అనేక ఆసుపత్రులను కలిగియున్న ఒక మిషనరీ సంస్థ అయిన ‘సొసైటీ ఇంటర్నేషనల్ మిషనైర్’ (SIM - ఎస్.ఐ.ఎమ్.) తో కలిసి పనిచేశారు. 1968వ సంll లో ఆమె నైజీరియాలోని జోస్‌లో ఉన్న ‘సూడాన్ ఇంటీరియర్ మిషన్ హాస్పిటల్‌’ లో చేరి, వైద్యురాలిగాను మరియు శస్త్ర చికిత్స నిపుణురాలిగాను పని చేయడం ప్రారంభించారు. తదుపరి కొంతకాలం ఆస్ట్రేలియాకు తిరిగివెళ్ళిన ఆమె, ఆ సమయంలో రాబర్ట్ బ్రెన్నాన్‌ను వివాహం చేసుకున్నారు. అటుపిమ్మట త్వరలోనే ఆఫ్రికాకు తిరిగి వెళ్ళారు ప్యాట్రిసియా. అక్కడ ఆమె భర్త విద్యపరమైన పరిచర్యను ప్రారంభించగా, ఆమె వైద్యురాలిగా సేవ చేయుటను కొనసాగించారు. అంతేకాదు, ఆఫ్రికా మహిళల దుస్థితిని చూసి చలించిపోయిన ఆమె, వారికి న్యాయం చేకూర్చుటకు, ప్రత్యేకించి అత్యాచారానికి గురైన వారి పునరావాసం కొరకు మరియు వారిని బలోపేతులను చేయుట కొరకు పనిచేయడం ప్రారంభించారు.

     అమోఘమైన తెలివితేటలు మరియు శక్తి కలిగియుండి ప్రపంచంలో మంచితనం మరియు సత్యం ప్రబలంగా ఉండాలనే ఆకాంక్ష కలిగియున్న ఒక స్త్రీ పాట్రిసియా. ఆ విధంగా ఈ లోకంలో మంచితనం మరియు సత్యం విరాజిల్లుటలో స్త్రీకి ముఖ్యమైన పాత్ర ఉందని ఆమె విశ్వసిస్తారు. కావున, ఆమె వివిధ క్రైస్తవ సంఘములకు చెందిన స్త్రీలను ఏకం చేసి, వారి ఆత్మీయపరమైన స్వేచ్ఛను పెంపొందించడం ప్రారంభించారు. ఆమె కృషి మరియు దర్శన ఫలితముగా ప్రపంచవ్యాప్తంగా 400 మందికి పైగా మహిళలు వివిధ హోదాల్లో పరిచర్య చేస్తున్నారు. ఆమె తనదు ఎనభైల మధ్య సంవత్సరాల నుండి తొమ్మిది పదుల వయస్సు వరకు రేడియో మరియు దూరదర్శిని (టి.వి.) రెండింటిలోనూ ‘ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్’ (ఎ.బి.సి.) యొక్క మతపరమైన ప్రసార బృందముతో కలిసి పనిచేశారు.

     ప్యాట్రిసియా నైపుణ్యం కలిగిన ఒక శస్త్ర చికిత్స నిపుణురాలు, కనికరముతో నిండిన మిషనరీ మరియు ఒక ఆకర్షణీయమైన క్రైస్తవ నాయకురాలు. కొంతకాలం క్లోమ గ్రంథి క్యాన్సర్‌తో బాధపడిన తరువాత 2011వ సంll లో పరమందు తన ప్రభువును చేరుకొన ఇహలోకము విడిచివెళ్ళారు 
    ప్యాట్రిసియా అన్నే వికిన్సన్. 

    ప్రియమైనవారలారా, ప్రపంచంలో మంచితనం మరియు సత్యం ప్రబలంగా ఉండుటకుగాను మీరు మీ నైపుణ్యమును మరియు అనుభవమును ఉపయోగించుచున్నారా?

    "ప్రభువా, బలహీనులను బలపరుచుటకును మరియు విశ్వాసుల ఆత్మీయ స్వేచ్ఛను పెంపొందించుటకును నన్ను ఒక సాధనముగా వాడుకొనుము. ఆమేన్!"


    దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • Nov 16, 2021

    Parama Daivame | పరమ దైవమే | Telugu Christmas song

    Parama Daivame | పరమ దైవమే | Telugu Christmas song

    పరమ దైవమే మనుష్య రూపమై 
    ఉదయించెను నాకోసమే 
    అమరజీవమే నరుల కోసమే దిగివచ్చెను ఈ లోకమే 
    క్రీస్తు పుట్టెను హల్లెలూయా (3)                          ||పరమ|| 

    1.అకార రహితుడు ఆత్మ స్వరూపుడు శరీరముధరియించెను 
    సర్వాధికారుడు బలాడ్యధీరుడు దీనత్వమును వరించెను 
    వైభవమును విడిచెను దాసునిగా మారెను (2) 
    దీవెన భువికి తెచ్చెను – ముక్తి బాటగా                ||పరమ|| 

    2.అనాదివాక్యమే కృపాసమేతమై ధరపై కాలుమోపెను 
    ఆ నీతితేజమే నరావతారమైశిశువై జననమాయెను 
    పాపి జతను కోరెను రిక్తుడు తానాయెను (2) 
    భూలోకమును చేరెను యేసురాజుగా                  ||పరమ|| 

    3.నిత్యుడు తండ్రియై విమోచనార్ధమైకుమారుడై జనించెను 
    సత్య స్వరూపియై రక్షణ ధ్యేయమైరాజ్యమునే భరించెను 
    మధ్య గోడ కూల్చనుసంధిని సమకూర్చను(2) 
    సఖ్యత నిలుప వచ్చెను శాంతి దూతగా               ||పరమ||
  • WhatsApp
  • Sep 28, 2021

    Pillalara Naa Maata Vinudi | పిల్లలారా నా మాట వినుడి

    "విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును." 
    కీర్తన Psalm 34:11-18


    పల్లవి : పిల్లలారా నా మాట వినుడి
    యెహోవా యందు భక్తి నేర్పెదను

    1. బ్రతుక గోరువాడెవడైన కలడా?
    మేలునొందుచు చాలా దినములు || పిల్లలారా ||

    2. కపటమైన చెడుమాటలాడక
    కాచుకొనుము నీదు పెదవులను || పిల్లలారా ||

    3. కీడు మాని మేలునే చేయుము
    సమాధానము వెదకి వెంటాడు || పిల్లలారా ||

    4. యెహోవా దృష్టి నీతిమంతులపై
    కలదు వారి మొఱల వినును || పిల్లలారా ||

    5. దుష్టుల జ్ఞాపకమున్ భూమినుండి
    కొట్టివేయు తన సన్నిధి నుండి || పిల్లలారా ||

    6. నీతిమంతులు మొఱ పెట్టగా
    విని శ్రమల నుండి తప్పించును || పిల్లలారా ||

    7. విరిగినట్టి హృదయములకు
    యెహోవా ఆసన్నుడై యున్నాడు || పిల్లలారా ||

    8. నలుగియున్న వారల నెల్ల
    ఆయనే రక్షించు ప్రేమగల్గి || పిల్లలారా ||
  • WhatsApp
  • Sep 19, 2021

    Peter Johnson Gulick | పీటర్ జాన్సన్ గులిక్

    పీటర్ జాన్సన్ గులిక్ || Peter Johnson Gulick



    • జననం: 12-03-1796
    • మహిమ ప్రవేశం: 08-12-1877  
    • స్వస్థలం: న్యూజెర్సీ
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: హవాయి దీవులు మరియు జపాన్

     అమెరికా ప్రొటెస్టంట్ సంఘము యొక్క విదేశీ మిషనరీ పరిచర్యలలో ‘గులిక్’ బాగా పేరుగాంచిన ఇంటి పేరు. ఆ వంశపువారు చాలామంది హవాయి, స్పెయిన్ మరియు జపాన్ వంటి విభిన్న ప్రదేశాలకు వెళ్ళి సేవచేశారు. గులిక్ వంశములో అటువంటి గొప్ప పారంపర్య మిషనరీ పరిచర్య ప్రారంభమునకు మూలపురుషుడు పీటర్ జాన్సన్ గులిక్. 20 సంll ల వయస్సులో ప్రభువును అంగీకరించిన తరువాత పీటర్ విదేశాలలో దేవుని రాజ్యమును విస్తరింపజేయుటకు తన జీవితమును సమర్పించుకున్నారు.

     1827వ సంll లో ప్రిన్స్‌టన్ థియోలాజికల్ సెమినరీ నుండి బైబిలు వేదాంత శాస్త్రములో పట్టభద్రులైన పీటర్, పిమ్మట ‘అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ ఫర్ ఫారిన్ మిషన్స్’ (ఎ.బి.సి.ఎఫ్.ఎమ్.) అనే మిషనరీ సంస్థలో చేరారు. ఒక నెల తరువాత సేవ చేయుటకు నియామక అభిషేకం పొందిన అతను, తన భార్య ఫాన్నీతో కలిసి బోస్టన్ నుండి శాండ్విచ్ దీవులకు (హవాయి దీవులకు) సముద్ర మార్గము గుండా పయనమయ్యారు. తరువాతి పదిహేను సంవత్సరాలు అతను కౌవై ద్వీపంలో నివసించారు. ఆత్మలను నమ్మే అక్కడి ద్వీపవాసులు దాదాపు ప్రతిదానికీ ఆత్మలపైనే ఆధారపడేవారు. వారు చనిపోయిన హవాయి యోధులను పూజించేవారు మరియు సహాయం కొరకు వారి ఆత్మలను పిలిచేవారు. అందువలన, ముందుగా వారి సామాజిక స్థితిని మెరుగుపరచవలెనని ఆ మిషనరీ దంపతులు వెంటనే స్థానికులకు విద్యను అందించడంపై దృష్టి నిలిపారు. ఫాన్నీ ఆ ద్వీపంలో మొదటి పాఠశాలను ప్రారంభించారు. సాధారణ విద్యాభ్యాసముతో పాటు, ఫాన్నీ మహిళలకు కుట్టుపని మరియు టోపీలు ఎలా చేయాలో నేర్పించగా, పీటర్ పురుషులకు నాగళ్లు మరియు చక్రాల వాహనాలను ఎలా ఉపయోగించాలో నేర్పించారు. పిమ్మట ఆ దంపతులు మోలోకై మరియు ఓహుకు వెళ్ళారు. వారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ పాఠశాలలను స్థాపించారు, క్రైస్తవ ప్రేమతో సమాజాన్ని మార్చారు మరియు అన్నింటికంటే పైగా క్రీస్తు కొరకు అనేక ఆత్మలను సంపాదించారు.

     గులిక్ మరియు అతని భార్య ఇద్దరూ ఎల్లప్పుడూ అనారోగ్యంతో బాధపడేవారు. ఒక వైపు సమస్యలు ఉన్నప్పటికీ వారు వెనుకంజ వేయక ముందుకు సాగిపోయారు. ఆ నమ్మకమైన మిషనరీలను దేవుడు 1836-37సంll ల కాలంలో హవాయి దీవులలో నెలకొన్న గొప్ప ఆత్మీయ ఉజ్జీవములో పాలిభాగస్థులను చేశాడు. పీటర్ మరియు ఫాన్నీ గులిక్‌లు హోనోలులులో తమ జీవితకాలమును గడపాలని తలంచినప్పటికీ, వారి ఆరోగ్య స్థితి అందుకు సహకరించలేదు. కాగా, 1874వ సంll లో వారు అప్పటికే జపాన్‌లో సేవ చేస్తున్న తమ కుమారుని యొద్దకు వెళ్ళవలసి వచ్చింది. ఎనిమిది మంది దైవభక్తిగల పిల్లలను పెంచి, చివరి వరకూ ప్రభువుకు నమ్మకముగా సేవ చేసిన పీటర్, 1877వ సంll లో పరమందు తన ప్రభువును చేరుకొనుటకు ఇహలోకమును విడిచివెళ్ళారు. యెహోషువ 24:15లో యెహోషువ చెప్పినట్లు “నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము” అనే వాక్యమునకు అనుగుణంగా జీవించారు పీటర్ జాన్సన్ గులిక్.

    ప్రియమైనవారలారా, మీరు మీ కుటుంబముతో పాటుగా దేవునికి సేవ చేయుచున్నారా?

    "ప్రభువా, నేను మాదిరికరమైన పరిచర్య చేయుటకును, నా కుటుంబ సభ్యులు కూడా ఆ అడుగుజాడలలో నడుచునట్లు వారిని ప్రోత్సహించుటకును నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక
    *******

  • WhatsApp
  • Sep 11, 2021

    Pliny Fisk | ప్లినీ ఫిస్క్

    ప్లినీ ఫిస్క్ | Pliny Fisk

    • జననం: 24-06-1792
    • మహిమ ప్రవేశం: 23-10-1825
    • స్వస్థలం: మసాచుసెట్స్
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: పాలస్తీనా, ఆసియా మైనర్
     ‘అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ ఫర్ ఫారిన్ మిషన్స్’ (ఎ.బి.సి.ఎఫ్.ఎమ్.) అనే మిషనరీ సంస్థ తరపున పాలస్తీనాలో మొట్టమొదటిగా సేవ చేసిన మిషనరీలలో ప్లినీ ఫిస్క్ ఒకరు. ఫిస్క్ మతపరంగా క్రైస్తవుడే అయినప్పటికీ, అతని హృదయం దేవునికి దూరంగా ఉండేది. అయితే, అతనికి 16 సంll ల వయస్సు వచ్చినప్పుడు, మరణానంతరం ఉండే జీవితము గురించిన ప్రశ్నలు మరియు భయాలు అతనిలో ప్రారంభమయ్యాయి. ఆ స్థితి అతను దేవుని సన్నిధిలో మోకరిల్లేలా చేసింది. తత్ఫలితముగా అతను మారుమనస్సు పొందారు. తిరిగి జన్మించిన తరువాత, ఇతరులను కూడా క్రీస్తు వద్దకు నడిపించాలనే బలమైన వాంఛ అతనిలో కలిగింది. ఆ వాంఛ తదుపరి మిషనరీ సేవ పట్ల ఆసక్తిగా మారింది. కావున, బైబిలు వేదాంత శాస్త్రమును అభ్యసించుటకు ‘ఆండోవర్ థియోలాజికల్ సెమినరీ’ లో చేరిన అతను, అక్కడ పాలస్తీనా మిషన్ వ్యవస్థాపక సభ్యులయ్యారు.

      అప్పటిలో పాలస్తీనాలో కాథలిక్కులు మరియు మహమ్మదీయుల ప్రభావం బలంగా ఉండేది. అనేక ప్రొటెస్టెంట్ సంస్థలు పాలస్తీనాను పరిచర్య ప్రారంభించుటకు ఒక ప్రమాదకరమైన మరియు ఎంతో నిరుత్సాహకరమైన ప్రదేశముగా పరిగణించాయి. కావున, కూలంకుషంగా సుదీర్ఘమైన చర్చలు జరిపిన తరువాత మరియు దేవుని నడిపింపు కొరకు తీవ్రముగా ప్రార్థించిన తరువాత, ప్లినీ ఫిస్క్ మరియు లేవి పార్సన్స్ ఆ పవిత్ర భూమిలో సువార్త ప్రకటించుటకుగాను ఎ.బి.సి.ఎఫ్.ఎమ్. సంస్థతో కలిసి పని చేయుటకు తమను తాము సమర్పించుకున్నారు. తద్వారా 1819వ సంll లో మధ్యప్రాచ్య ప్రాంతానికి (మిడిల్ ఈస్ట్) పయనమైన ఫిస్క్, మొదట స్ముర్నలో స్థిరపడ్డారు. హెబ్రీ మరియు గ్రీకు భాషలను నేర్చుకుంటున్న సమయంలో అతను ఆసియాలోని ఏడు సంఘములకు పర్యటించి, ప్రజల అవసరతలను తీర్చుటకు తనను తాను సిద్ధపరచుకున్నారు. యెరూషలేములో అతను యూదులు, గ్రీకులు, రబ్బీలు మరియు మహమ్మదీయులను యేసు క్రీస్తును గురించిన సత్యమును గురించి ఒప్పింపచేయుటకు వారితో బహుగా చర్చిస్తూ, సువార్త కరపత్రములను పంచుతూ వారి మధ్య సేవ చేశారు. మారుమనస్సు పొందిన వారు ఎవరూ బహిర్గతముగా కనిపించకపోయినప్పటికీ, అక్కడ అతను సువార్త పనిని కొనసాగించారు.

      ఈజిప్టులో పార్సన్స్ ఆకస్మికముగా మరణించడంతో కొంతకాలం ఈజిప్ట్ మిషన్‌ యొక్క బాధ్యతలను చేపట్టిన ఫిస్క్, తదుపరి తిరిగి యెరూషలేమునకు వచ్చారు. భౌతిక దాడులు, క్రైస్తవ రచనలను తగులబెట్టడం మరియు కాథలిక్కులు మరియు మహమ్మదీయులు కుట్రలు చేయటం మొదలగు వాటినన్నింటినీ ఎదుర్కొంటున్నప్పటికీ క్రీస్తు కొరకు ఆ శ్రమలన్నింటినీ సహించడం తగిన కార్యమేనని ఫిస్క్ భావించారు. తదుపరి 1824వ సంll లో ఒక మిషన్ స్టేషన్‌ను స్థాపించుటకు బీరుట్‌కు వెళ్ళిన ఫిస్క్, అక్కడ జ్వరం బారినపడి కేవలం 33 ఏళ్ళ లేత ప్రాయంలోనే తనువు చాలించారు.

      తన జీవితములో తన పరిచర్య ద్వారా మారుమనస్సు పొందినవారిని బహు కొద్దిమందిని మాత్రమే చూడగలిగారు ప్లినీ ఫిస్క్. అయితే ఒక చిన్న నిప్పురవ్వ అడవి మొత్తాన్నీ కాల్చగల అగ్నిజ్వాలలను రేపగలదు. తరువాతి కాలంలో ఎంతోమంది ఫిస్క్ అడుగుజాడలను వెంబడించగా, అది యూదులు నిజమైన మెస్సీయను కనుగొనుటకు కారణమయ్యింది. 

    🚸 *ప్రియమైనవారలారా, ఇతరులను క్రీస్తు నొద్దకు నడిపించవలెననే బలమైన వాంఛ మీలో నున్నదా?* 🚸

    🛐 *"ప్రభువా, నా మిగిలిన జీవితమును నశించుచున్న ఆత్మలను వెదుకుటకు నేను జీవించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"* 🛐

    *******
    🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏l

  • WhatsApp