Search Here

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

May 14, 2023

Saint Cyprian | సెయింట్ సైప్రియన్

సెయింట్ సైప్రియన్ గారి జీవిత చరిత్ర


  • జననం : ~ 200-210
  • మరణం : 14-09-258
  • స్వస్థలం : కార్తేజ్, రోమా సామ్రాజ్యం
  • దర్శన స్థలము : కార్తేజ్, రోమా సామ్రాజ్యం


సైప్రియన్ లేదా థాస్సియస్ సిసిలియానస్ సైప్రియానస్ అప్పటిలో రోమా సామ్రాజ్యం క్రింద ఉన్న ఆఫ్రికా ప్రాంతంలో ఒక సంపన్న కుటుంబములో జన్మించారు. వారు అన్యజనులు. కార్తేజ్‌లోని న్యాయవృత్తికి సంబంధించిన వారిలో మంచి మేథస్సు కలిగినవానిగా ఉన్న అతను, ఉపాధ్యాయునిగా మరియు నిర్వాహకునిగా గౌరవప్రదమైన పదవిని కలిగియున్నారు. అయినప్పటికీ, అతను తన యవ్వన జీవితమును వ్యర్థపరచి హృదయ శాంతి కొరకు ఎంతో పరితపించారు. కాగా తనకు సహాయము చేయుమని అతను ఒక పాదిరిని కోరగా, ఆ పాదిరి అతనిని క్రీస్తు నొద్దకు నడిపించి, తద్వారా రక్షణ మార్గములోనికి నడిపించారు. బాప్తిస్మము పొందిన తరువాత అతను తన ఆస్తి అంతటినీ అమ్మి బీదలకు పంచిపెట్టి, పవిత్ర జీవితము జీవించుటకు ఎంచుకున్నారు.


అపారమైన లేఖన జ్ఞానం మరియు అద్భుతమైన వక్తృత్వ నైపుణ్యాలను కలిగియున్న సైప్రియన్, మారుమనస్సు పొందిన రెండేళ్ళ వ్యవధిలోనే పాదిరిగా నియమించబడ్డారు. తదుపరి అతను కార్తేజ్ సంఘమునకు బిషప్పు‌గా అభిషేకం చేయబడ్డారు. ఆ సంఘములో మంచి పేరుపొందిన అతను, పేదల యొక్క అభిమానమును చూరగొన్నారు. అది అక్కడి సమాజము యొక్క ఆత్మీయ అభివృద్ధికి దారితీసింది. క్రైస్తవ సంఘములోను, వివిధ క్రైస్తవ సంఘముల మధ్యను, అదేవిధముగా బిషప్పుల మధ్యను ఐక్యత ఉండవలెనని అతను బలముగా విశ్వసించేవారు. అతను వివిధ సంఘముల దిద్దుబాటు, ఆత్మీయ అభివృద్ధి మరియు ఏకీకరణ కొరకు క్రైస్తవ సంఘము యొక్క రాజ్యాంగ సిద్ధాంతమును అభివృద్ధి చేశారు.


డెసియస్ చక్రవర్తి పాలనలో క్రైస్తవులకు గొప్ప హింస కలుగగా, సైప్రియన్ హతసాక్షిగా మరణించే ఆ మహిమకరమైన భాగ్యమును ఎంచుకొనక, దాగుకొని, తన మందను రహస్యముగా నడిపించుటకు ఎంచుకున్నారు. అయితే, వలేరియన్ చక్రవర్తి పాలనలో మరలా క్రైస్తవులకు హింస కలుగినప్పుడు, అన్యదేవతలకు బలి ఇచ్చుటకు సైప్రియన్ బలవంతపెట్టబడ్డారు. అందుకు అతను నిరాకరించి క్రీస్తు మాత్రమే రక్షకుడని దృఢముగా తెలియపరచినందువలన అతను కురుబిస్‌ పట్టణముకు బహిష్కరించబడ్డారు. అక్కడ నుండి లేఖల ద్వారా విశ్వాసులకు ఆదరణ కలిగించుటకు తన సామర్థ్యం మేరకు అతను ప్రయత్నించారు. శ్రమలలో ఐక్యతను, నిరీక్షణను మరియు దీర్ఘశాంతమును కలిగియుండవలెనని అతను సంఘమును వేడుకున్నారు.


రోమా దేవతలకు బలి ఇచ్చి విడుదల పొందుటకు అతనికి ఇవ్వబడిన మరొక అవకాశమును కూడా అతను తిరస్కరించగా, అతనిని శిరచ్ఛేదనం చేయవలెలని ఆజ్ఞాపించబడింది. ఎంతో ప్రశాంతతతో ప్రార్థన చేయుటకు సైప్రియన్ మోకరిల్లినప్పుడు, ఖడ్గము అతని తలను ఛేదించింది.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, కష్ట సమయములలో క్రీస్తునందున్న మీ సహోదరసహోదరీలను మీరు ఆదరించుచున్నారా? 

ప్రార్థన :

"ప్రభువా, కష్ట సమయములలో నిరీక్షణ కలిగియుండుటకును మరియు క్రీస్తునందు సహోదరసహోదరీలను ఆదరించుటకు యోగ్యమైన పాత్రగా ఉండుటకును నాకు సహాయము చేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Apr 7, 2022

    Saint Polycarp | సెయింట్ పాలికార్ప్

    సెయింట్ పాలికార్ప్ జీవిత చరిత్ర





    • జననం : ~ క్రీ.శ. 65
    • మరణం : ~ క్రీ.శ. 155
    • స్వస్థలం : స్ముర్న (ప్రస్తుత ఇజ్మీర్, టర్కీ) 
    • దర్శన స్థలము : స్ముర్న


    అపొస్తలుల పాదముల వద్ద కూర్చుని,  ఈ లోకములో యేసు క్రీస్తు జీవించినప్పటి విషయములను వారి నోటి నుండే వినడం ఎంత గొప్ప ధన్యత! పాలికార్ప్ తన యవ్వనంలో అటువంటి అనుభవాన్నే కలిగియున్నారు. అతను మొదటి శతాబ్దంలో యేసు క్రీస్తు యొక్క ఆది అపొస్తలుల ద్వారా సువార్త ప్రకటింపబడిన కుటుంబములో జన్మించారు. అంతియొకయకు చెందిన ఇగ్నేషియస్‌తో పాటు అతను కూడా అపొస్తలుడైన యోహాను యొక్క శిష్యునిగా ఉన్నారని చెప్పబడుతుంది. అటు పిమ్మట అతను స్ముర్న సంఘమునకు బిషప్పు‌గా ఆది అపొస్తలుల ద్వారానే నియమించబడ్డారు.


    అపొస్తలులకు ఉన్నటువంటి ఆసక్తితోనే ఒక బిషప్పుగా తనకు అప్పగింపబడిన మందను కూడా అతను ఎంతో నమ్మకముగా నడిపించారు. ఆసియా మైనర్‌లో ఉన్న క్రైస్తవులందరికీ అతను ఒక బలమైన కోటగా మారారు. క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే ప్రభుత్వం క్రింద, అన్యజనుల మధ్య సేవ చేయుటకు ఎంతో ధైర్యం మరియు దేవుని నుండి శక్తితో నింపబడాలి. వాటిని దేవుని మీదనే ఆధారపడి విశ్వాసముతో దేవుని యొద్ద నుండి పొందుకున్నారు పాలికార్ప్. ఆది అపొస్తలుల కాలం ముగిసినప్పుడు అనేక అబద్ధ బోధకులు పుట్టుకువచ్చారు. అంతేకాకుండా సంఘ క్రమమును గూర్చిన వివాదాలు చెలరేగాయి. వాటన్నింటి మధ్యలో ఒకే ఒక్క సమాధానం మాత్రమే పాలికార్ప్ వద్ద ఉంది. అదేమంటే "క్రీస్తును పోలి నడుచుకొనుట". అతను వివిధ అబద్ధ బోధకుల సమూహాలను ఎదిరించి, దేవుని మందను తప్పుడు బోధల నుండి కాపాడుటకు ఎంతో శ్రమించారు. పాలికార్ప్ వ్రాసిన అనేక పత్రికలలో ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక భద్రపరచబడింది. ఆ పత్రికలో అతను సహనం మరియు నిరీక్షణలతో స్థిరులుగా ఉండవలెనని విశ్వాసులకు సూచించారు. 


    రోమా రాజ్య చక్రవర్తిగా మార్కస్ అరేలియస్ సింహాసనాన్ని అధిరోహించినప్పుడు, క్రైస్తవులను హింసించుటకు అతను ఉత్తర్వులు జారీ చేశాడు. కాగా రోమా అధికారులు పాలికార్ప్‌ను బంధించి, తన విశ్వాసాన్ని త్యజించి ప్రాణాలను కాపాడుకొనుమని అతనిని కోరారు. అయితే విశ్వాసంలో స్థిరముగా నిలబడిన పాలికార్ప్, "ఎనభై ఆరు సంవత్సరాలు నేను ఆయనకు సేవ చేశాను. ఏనాడూ ఆయన నాకు కీడు చేయలేదు... అలాంటప్పుడు నా రాజు మరియు రక్షకుడైన ఆయనను నేను ఎలా దూషించగలను?" అని సమాధానమిచ్చారు. ఆ విధంగా పాలికార్ప్ తన విశ్వాసాన్ని విడిచిపెట్టక బహిరంగముగా తెలియపరచగా, అది అతని మరణానికి దారితీసింది. రోమా చక్రవర్తికి ధూపం వేయనందుకుగాను అతనిని స్తంభమునకు కట్టి కాల్చివేయగా, రాజులకు రాజైన తన పరలోక దేవునికి ఇంపైన సువాసనతో కూడిన ధూపముగా మారారు పాలికార్ప్.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, క్రైస్తవులని మిమ్ములను అణచివేయుటకు ప్రయత్నించే ఎటువంటి చర్యనైనా తట్టుకొని, క్రీస్తును ప్రకటించే ధైర్యమును మీరు కలిగియున్నారా? 


    ప్రార్థన :

    "ప్రభువా, నేను స్థిరముగా నిలబడి, నా విశ్వాసమునకు సాక్షిగా ఉండుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Mar 17, 2022

    Saint Timothy Life History

    సెయింట్ తిమోతి జీవిత చరిత్ర






    జననం : ~ క్రీ.శ. 17

    మరణం : ~ క్రీ.శ. 97

    స్వస్థలం : లుస్త్ర (ప్రస్తుత టర్కీలో)

    దర్శన స్థలము : ఎఫెసు


    'దేవునిని ఘనపరచుట' అనే అర్థమిచ్చే పేరుగల తిమోతి, అపొస్తలుడైన పౌలు యొక్క శిష్యుడు మరియు ఎఫెసు సంఘము యొక్క మొట్టమొదటి బిషప్పు. అతని తల్లి ఒక యూదురాలు, తండ్రి గ్రీసు దేశమునకు చెందిన అన్యుడు. చిన్నప్పటి నుండీ తిమోతి తన తల్లియైన యునీకే మరియు అవ్వయైన లోయి మాదిరిగానే దేవునియందు విశ్వాసము కలిగియున్నారు. పౌలు లుస్త్రకు వచ్చి పరిచర్య చేసినప్పుడు తిమోతి యేసు క్రీస్తు యొక్క సువార్తను అంగీకరించి, పౌలు యొక్క శిష్యునిగా మారారు.


    పౌలు యొక్క రెండవ మరియు మూడవ మిషనరీ యాత్రలలో అతనితో కలిసికొనిన తిమోతి, పురాతన పట్టణములైన కొరింథు, థెస్సలొనీక మరియు ఫిలిప్పీలలో క్రైస్తవ సంఘములను స్థాపించుటలో తోడ్పడ్డారు. తిమోతిని తన కుమారుని వలె ప్రేమించిన పౌలు, అతను విశ్వాసములో ఎదిగేకొద్దీ సేవలో ముఖ్యమైన కార్యకలాపాలకు అతనిని నియమించారు. స్థానిక సంఘములను బలపరచుటలో పౌలుతో కూడ నిలిచిన తిమోతిని ప్రభువు ఎంతో బలముగా వాడుకున్నారు. అతను సువార్త యొక్క లోతైన సత్యమును కాపాడుటలో ఎంతో జాగ్రత్త వహించారు. సువార్తను వ్యతిరేకించే వారితో విభేదాలు తలెత్తిన పరిస్థితులలో, అతను తన హృదయములో సత్యమును భద్రపరచుకొని, దానిని అన్వయించుకొని, తన విశ్వాసమును గట్టిగా పట్టుకొని వారిని తీవ్రంగా ఖండించేవారు.


    అతని సమకాలీనులలో తక్కినవారు తమ స్వార్థపూరిత మార్గముల పట్ల వాంఛకలిగియుండగా, తిమోతి మాత్రం విశ్వాసుల పట్ల నిజమైన శ్రద్ధ వహించారు. ఎఫెసు సంఘమునకు పరిచర్య చేయుటకు పౌలు అతనిని నియమించారు. అక్కడ సేవ చేసే సమయములో ఆత్మ ద్వారా నింపబడియున్నామని వంచించే వంచకులను తిమోతి ఎదుర్కొనవలసి వచ్చింది. తాను పొందియున్న ఆత్మ వరములను ప్రజ్వలింప చేయుట ద్వారా తప్పుడు బోధనల మధ్యలో అతను సువార్త సత్యమును స్థిరముగా నిలువబెట్టుటకు తీవ్రంగా ప్రయత్నించారు. శ్రమలు, హింస మరియు వ్యతిరేకతల మధ్యలో తన రక్షకుని గురించి మాటలాడుటకు అతను ఏనాడూ సిగ్గుపడలేదు. సంఘ కాపరిగా తన కర్తవ్యాలను సమర్థవంతముగా నిర్వర్తించిన తిమోతి, దేవుని వాక్య సత్యమును ఎంతో ఖచ్చితముగా వివరించేవారు. తద్వారా అనేకమంది శిష్యులు మరియు విశ్వాసులు లోతైన క్రైస్తవ సిద్ధాంతములను గూర్చిన జ్ఞానమును కలిగియుండగలుగునట్లు నడిపించబడ్డారు.


    యేసు క్రీస్తు యొక్క శిష్యునిగా కొనసాగుటలో తన జీవితములో తిమోతి ఏనాడూ వెనుకంజ వేయలేదు. తత్ఫలితముగా అతను శ్రమలను, హింసను ఎదుర్కొని హతసాక్షిగా మరణించవలసి వచ్చింది. బయలును అనుసరించేవారి దేవత పూజింపబడుటను వ్యతిరేకించినందు వలన ఆ జనసమూహం అతనిని చంపినట్లు చెప్పబడుతుంది. 


    ప్రియమైనవారలారా, తమ స్వప్రయోజనాలనే వెంటాడే మనుష్యులున్న ఈ లోకములో దేవుని పరిచర్య పట్ల నిజమైన భారాన్ని మీరు కలిగియున్నారా?


    "ప్రభువా, తిమోతి వలె నమ్మకమైన పరిచర్య చేయుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!"


    దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • Dec 12, 2021

    Sophia Blackmore Life History

    సోఫియా బ్లాక్‌మోర్ గారి జీవిత చరిత్ర



    • జననం: 18-10-1857
    • మహిమ ప్రవేశం: 03-07-1945
    • స్వస్థలం: గౌల్బర్న్
    • దేశం: ఆస్ట్రేలియా
    • దర్శన స్థలము: సింగపూర్

     దైవభక్తి గల కుటుంబంలో జన్మించిన సోఫియా బ్లాక్‌మోర్ దేవుని యందలి భయభక్తులతోను మరియు ఆత్మీయ క్రమశిక్షణలోను పెరిగారు. కొంతమంది గొప్ప మిషనరీలతో సంబంధం కలిగియున్న సోఫియా యొక్క తల్లిగారు చిరుప్రాయంలో ఉన్న సోఫియాకు చైనాలో వారి సేవను గురించి చెబుతుండేవారు. ఇరవై ఏళ్ళ ప్రాయంలో సోఫియా అమెరికాకు చెందిన ఒక మెథడిస్టు సువార్తికురాలైన ఇసాబెల్లా లియోనార్డ్‌ను కలుసుకొనడం జరిగింది. కాగా క్రీస్తు ఆమె కొరకు ఏమి పొందుపరచి ఉంచాడో వాటన్నింటినీ ఆసక్తితో వెతుకవలెనని ఇసాబెల్లా సోఫియాకు సలహా ఇచ్చారు. ఆ సలహా ఆమెను లోతుగా కదిలించగా మిషనరీగా మారుటకు ఆమె జీవిత ప్రయాణం ప్రారంభమయ్యింది.

     అయితే, అవివాహితలైన స్త్రీలను మిషనరీలుగా పంపుటకు ఆస్ట్రేలియా క్రైస్తవ సంఘం అప్పటిలో మద్దతు ఇవ్వలేదు. కానీ దేవుడు ఇసాబెల్లా ద్వారా సోఫియాకు మార్గమును సరాళం చేశాడు. ఆమె సోఫియాను తన సహాపరిచారకురాలిగా భారతదేశానికి తీసుకువెళ్ళుటకు ముందుకువచ్చారు. దేవుని వాగ్దానాలు మాత్రమే తనకు మద్దతుగా తీసుకొని భారతదేశానికి పయనమయ్యారు సోఫియా. అయితే, ఏదో ఒక రోజున చైనాలో సేవ చేయాలనేది ఆమె దృక్పథం. కానీ ఆమె భారతదేశంలో సేవ చేస్తున్నప్పుడు ఆమె సింగపూర్‌లోని ఆంగ్లో-చైనీస్ పాఠశాలలో పని చేయుటకు ఒక మహిళా మిషనరీ కొరకు వెతుకుతున్న విలియం ఓల్డ్‌హామ్‌ అనే మిషనరీని కలవడం జరిగింది.

     అది దేవుని చిత్తమని ఎరిగినవారై, అప్పటికే తమిళంలో పట్టు సాధించిన సోఫియా మలాయ్ భాషను నేర్చుకొనడం ప్రారంభించారు. దేవుని ఏర్పాటులోను మరియు ఓల్డ్‌హామ్ మార్గదర్శకత్వంలోను 1887వ సంll లో ఆమె సింగపూర్ చేరుకున్నారు. సింగపూర్‌కు వచ్చిన ఒక నెలలోనే అక్కడ ఆమె ఒక తమిళ బాలికల పాఠశాలను ప్రారంభించారు. తరువాత ఆ పాఠశాల ‘మెథడిస్ట్స్ గర్ల్స్ స్కూల్’ (మెథడిస్టువారి బాలికల పాఠశాల) అని పిలువబడింది. త్వరలోనే చైనాటౌన్‌ అనే ప్రాంతంలో ఆమె ఒక మిషన్ కేంద్రమును స్థాపించి, పెరనాకన్ చైనా మహిళలను సందర్శించడం ప్రారంభించారు. అక్కడి స్త్రీలు సత్యమును మరింతగా తెలుసుకొనవలెననే ఆసక్తిని కలిగియున్నవారై యేసు క్రీస్తును గురించి తమ పిల్లలకు బోధించవలసినదిగా ఆమెను కోరారు.

     అంతేకాదు, పిల్లల అక్రమ రవాణా నుండి తప్పించుకున్న బాలికల కొరకు ఒక గృహమును స్థాపించవలసిన ఆవశ్యకతను కూడా సోఫియా గ్రహించారు. ఆ గృహము బాలికలకు ఒక క్రైస్తవ వాతావరణాన్ని కల్పించింది. తమ అవసరతలన్నింటికీ పరలోకపు తండ్రిపైనే ఆధారపడవలెనని వారికి బోధించబడింది. మలాయ్ భాష యొక్క అభ్యాసంలో భాగంగా బాలికలకు మలాయ్‌ భాషలో బైబిలు వచనములను చదవడం, వ్రాయడం మరియు కంఠస్థం చేయుటకు నేర్పించబడింది. ఆమె వారికి నిర్వహించిన సండే స్కూల్ తరగతులు సింగపూర్‌లోని తొలి మెథడిస్టు సంఘములకు పునాదిగా మారాయి.

     సింగపూర్‌లో 40 ఏళ్లపాటు సేవ చేసిన తర్వాత 1928వ సంll లో ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చిన సోఫియా బ్లాక్‌మోర్ 88 ఏళ్ల వయసులో పరమవాసమును చేరుకున్నారు.
    ప్రియమైనవారలారా, దేవుని చిత్త ప్రకారమే మీరు పరిచర్య చేయుచున్నారా?

    "ప్రభువా, నా ఆలోచనలు, ప్రణాళికలను విడిచిపెట్టి, దైవిక నడిపింపు మరియు సంకల్పం ప్రకారమే సేవ చేయుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Dec 6, 2021

    Samanyudavu Kaavu | సామాన్యుడవు కావు

    Samanyudavu Kaavu | సామాన్యుడవు కావు


    హేపీ క్రిస్మస్ హేపీ క్రిస్మస్ హేపీ హేపీ హేపీ క్రిస్మస్ 

    మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2)


    సామాన్యుడవు కావు సృష్టికర్తవు నీవు - బలహీనుడవు కావు బలమైన దేవుడవు (2)

    పాపిని రక్షింప యేసు పరమును వీడావు చీకటి - తొలగించి మాలో వెలుగును నింపావు (2)


    1. ఆదాము హవ్వలు చేసిన పాపం శిక్షను తెచ్చిందీ (2)

    క్రీస్తు చేసిన త్యాగం మనకు రక్షణ నిచ్చింది (2) ||హేపీ క్రిస్మస్||


    2. జ్ఞానులు గొర్రెలకాపరులు ప్రభువుని చూశారు (2)

    దీనులైన వారలకు ఆ భాగ్యం దొరికింది (2) ||హేపీ క్రిస్మస్||


    3. యేసుని నీవు నమ్మినచో శాంతి సమాధానం (2) నిత్యమైన సంతోషం పరలోకమే నీ సొంతం (2) ||హేపీ క్రిస్మస్||






  • WhatsApp
  • Nov 16, 2021

    Sandhadi | సందడి | Joyful Noise | Telugu Christmas song


    Sandhadi (Joyful Noise) Christmas Song

    బెత్లేహేములోనంట సందడి పశువుల పాకలో సందడి
    దూతలు వచ్చేనంట సందడి పాటలు పాడేనంట
    రారాజు బుట్టేనని సందడి మారాజు బుట్టేనని సందడి
    చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి

    Happy happy Christmas Christmas
    Wish you a happy Christmas
    Merry merry Christmas Christmas
    Wish you a merry Christmas

    అర్థరాత్రి వేళలో సందడి దూతాలు వచ్చెనంట సందడి
    రక్షకుడు బుట్టేనని సందడి వార్తను తెలిపేనంట


    ‘’ రారాజు బుట్టేనని’’


    గొల్లలు వచ్చిరంట సందడి మనసార మ్రొక్కిరంట సందడి
    అందాల బాలుడంట సందడి అందరి అందరి దేవుడని సందడి


    ‘’ రారాజు బుట్టేనని’’


    తారను చూచుకుంటూ సందడి జ్ఞానులు వచ్చారంట సందడి
    పెట్టెలు తెచ్చారంట సందడి కానుకలు ఇచ్చారంట సందడి


    ‘’ రారాజు బుట్టేనని’’


  • WhatsApp
  • Oct 22, 2021

    Susan Higgins | సూసన్ హిగ్గిన్స్

    సూసన్ హిగ్గిన్స్  | Susan Higgins జీవిత చరిత్ర




    • జననం: 1842
    • మహిమ ప్రవేశం: 03-07-1879
    • స్వస్థలం: మెయిన్
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: యోకోహామా, జపాన్

    అమెరికాకు చెందిన సూసన్ హిగ్గిన్స్ జపాన్‌లో ఒక ప్రముఖ మహిళా మిషనరీ. క్రైస్తవ బోధకుల కుటుంబంలో జన్మించిన ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన బాలికగా ఎదిగారు. సూసన్ యొక్క చిన్నతనంలోనే మరణించిన ఆమె తల్లియైన శారా హిగ్గిన్స్ ఆత్మీయపరంగా ఆమెకు మాదిరిగా నిలిచారు. "నాకు పదకొండేళ్ళ వయసు ఉన్నప్పుడు నా రక్షకుని గాయపడిన హస్తాలు నా హృదయ ద్వారమును సున్నితముగా తట్టుట నాకు స్పష్టముగా గుర్తుంది" అని తన రక్షణ అనుభవము గురించి వివరిస్తారు సూసన్.


    క్రైస్తవ అనుభవం ప్రారంభంలో ఆమె మిషనరీ సేవ పట్ల ఎంతో ఆసక్తిని కనబరిచారు. పాఠశాల చదువు పూర్తిచేసుకొనిన తరువాత ఆమె ఏదో ఒకరోజున దేవుడు తనను పరిచర్యకై పిలవవచ్చనే ఆలోచనతో ఆనందించేవారు. కొన్నిసార్లు క్రైస్తవాలయంలో కానుకల కొరకు ప్రకటించబడినప్పుడు, ఒక యవ్వన బాలికగా స్వంత డబ్బును కలిగిలేని ఆమె "నన్నే నేను అర్పించుకుంటున్నాను" అని వ్రాసి కానుకల పెట్టెలో వేయవలెనని ఉవ్విళ్ళూరేవారు. అయితే, ఆమె బిడియం మరియు దేవునికి సేవ చేయుటకు తాను అర్హురాలు కాదు అనే భావన మిషనరీ సేవకు సమర్పించుకొనకుండా ఆమెను నిరోధించాయి.


    1878వ సంll లో ఒక రోజు ఆమె ‘ఉమెన్స్ ఫారిన్ మిషనరీ సొసైటీ’ (డబ్ల్యూ.ఎఫ్.ఎమ్.ఎస్. - మహిళా విదేశీ మిషనరీ సొసైటీ) సమావేశానికి హాజరయ్యారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక మహిళ సూసన్ వద్దకు వచ్చి, "మేము నిన్ను కొంతకాలం మిషనరీగా పంపగలమని అనుకుంటున్నాను" అని చెప్పింది. "ఎప్పుడైనా సరే" అనునది సూసన్ యొక్క తక్షణ ప్రతిస్పందన. త్వరలోనే, డబ్ల్యూ.ఎఫ్.ఎమ్.ఎస్. సంస్థ ఆమెను జపాన్‌లోని యోకోహోమాలో పని చేయుటకు నియమించింది. అది క్రైస్తవులకు ఎంతో కష్టమైన ప్రదేశం.


    1878వ సంll నవంబరు మాసంలో యోకోహామా చేరున్నారు సూసన్. వెంటనే ఆమె జపనీస్ భాషను నేర్చుకొనుట ప్రారంభించారు. ఆమె ఆంగ్లమును బోధించే ఉపాధ్యాయురాలిగా పనిచేశారు మరియు పిల్లల కొరకు ఆదివారపు పాఠశాలను (సండే స్కూల్) కూడా నిర్వహించారు. కొన్ని నెలల వ్యవధిలోనే ఆమె జపనీస్‌ భాషలో బైబిలు తరగతులను కూడా నిర్వహించడం ప్రారంభించారు. ఆమె కేవలం క్రీస్తు కొరకు పిల్లలను సంపాదించుట పైనే తన దృష్టిని కేంద్రీకరించలేదు కానీ, వారి గృహములోను మరియు సమాజములోను వారు స్వతహాగా సాక్ష్యులుగా నిలబడుటకు వారిని ప్రేరేపించుట పై కూడా తన దృష్టి సారించారు. ఆమె పాఠశాల ప్రయోజనాల నిమిత్తం సమీప గ్రామాలను సందర్శించేవారు. ఆ సందర్భాలను ఆమె సువార్తను ప్రకటించుటకు అవకాశాలుగా ఉపయోగించుకున్నారు.


    అయితే పరిచర్య చేసిన ఒక సంవత్సర కాలంలోనే ఆమె అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. తన సమయం వచ్చిందని గ్రహించిన ఆమె తన చుట్టూ పిల్లలను సమకూర్చుకొని ఒక పాట పాడమని వారిని అడిగారు. పిల్లలు ఆఖరి చరణమును పాడుచుండగా దేవునిలో శాశ్వత విశ్రాంతిని పొందారు సూసన్ హిగ్గిన్స్.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీ కానుకల కంటే ఎక్కువగా దేవుడు మీ సేవనే కోరుకుంటున్నాడని ఎల్లప్పుడూ మీరు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారా? 

    ప్రార్థన :

    "ప్రభువా, నన్ను నేను మీకు అర్పించెదను. మీ మహిమార్థమై నన్ను వాడుకొనుము. ఆమేన్!" 

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Oct 1, 2021

    C. S. Durand | సి. ఎస్. డురాండ్

    సి. ఎస్. డురాండ్ |  C. S. Durand


    • జననం: -
    • మహిమ ప్రవేశం: -
    • స్వదేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: భారతదేశం


    డాll సి. ఎస్. డురాండ్ వైద్యశాస్త్రములో తన చదువును ఇంకా పూర్తిచేయవలసి యుండగానే మిషనరీ సేవకు తనను సమర్పించుకున్నారు. కాగా న్యూయార్క్‌లో వైద్య శాస్త్రములో తన ఉన్నత చదువును (పోస్ట్ గ్రాడ్యుయేషన్) పూర్తిచేసుకొనిన తరువాత అతను తన భార్యతో కలిసి “డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్” (క్రీస్తుని శిష్యులు) అనే మిషన్ తరపున సేవ చేయుటకు భారతదేశానికి పయనమయ్యారు. ఈ దంపతులు తమ వృత్తి పట్ల పూర్తి అంకితభావమును కలిగియున్నారు. అయినప్పటికీ, అనేకమంది ఇతర వైద్యమిషనరీల వలెనే వీరు కూడా తమను కేవలం వైద్యపరమైన సేవలందించుటకే పరిమితం చేసికొనక అన్నివిధములైన మిషన్ కార్యకలాపాలలో పాలుపంచుకున్నారు.


    డురాండ్ మధ్య భారతదేశంలోని హర్దా అనే ప్రాంతములో నియమితులయ్యారు. తనకు భాష తెలియకపోయినప్పటికీ అక్కడ అతను ఒక చిన్న వైద్యశాలను ప్రారంభించారు. అతను సమయమును వృథాగా పోనివ్వక స్థానిక భాషయైన హిందీని నేర్చుకునే సమయంలోనే వైద్య సేవలను అందించడం కూడా మొదలుపెట్టారు. వైద్య సహాయము యొక్క అవసరతలో ఉన్నవారి సంఖ్య అధికమవుతూ వస్తుండడంతో ఒక ఆసుపత్రిని నిర్మించాలనుకున్నారు డురాండ్. కాగా అందుకొరకు ఒక స్థలమును కనుగొనవలెనని అతను ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, అవన్నీ విఫలయత్నాలే అయ్యాయి. ప్రయత్నించీ ప్రయత్నించి చివరికి విసిగిపోయిన అతను ఆసుపత్రి కట్టబడవలెననుకుంటే దేవుడే అందుకొరకు ద్వారములను తెరువవలెనని ప్రార్థించారు. తత్ఫలితముగా ఎంతో అద్భుతకరముగా ఆ మరుసటి దినముననే ఒక వ్యక్తి వచ్చి ఆసుపత్రి కొరకు కొంత భూమిని ఇచ్చాడు. వెంటనే దానిని అంగీకరించిన డురాండ్, వెనువెంటనే ఆసుపత్రిని నిర్మించడం ప్రారంభించారు. అది అన్నింటికీ సరిపోని ఒక చిన్న భవనమే అయినప్పటికీ ఒక గొప్ప మిషనరీ సేవకు నిలయంగా మారింది.


    కుష్టురోగుల మధ్య కూడా పనిచేసిన డురాండ్, వారిని బాగుపరచుటకుగాను ఆ రోగ నివారణల గురించి ఒక ప్రత్యేక అధ్యయనం చేశారు. అతనితో కలిసి పనిచేస్తున్న మరొక మిషనరీయైన వార్టన్ కుష్టు రోగులకు సువార్తను ప్రకటించగా, డురాండ్ వైద్య సేవలను అందించేవారు. అతను పట్టణం శివార్లలో కుష్టురోగుల కొరకు ఒక శరణాలయాన్ని ఏర్పరిచారు. అక్కడ అతను కుష్టురోగులకు ఒక గృహమును ఏర్పరచి, వారి కష్టమును, అనుభవిస్తున్న బాధలను తగ్గించుటకై తాను చేయగలిగినదల్లా చేశారు. డురాండ్ చేసే వైద్య సేవతో సువార్త పరిచర్య కూడా ఎల్లప్పుడూ మిళితమై యుండెడిది. అతను క్రీస్తును అంగీకరించమని తన రోగులకు నేరుగానే విజ్ఞప్తి చేసేవారు.


    మరొకవైపు డురాండ్ యొక్క భార్య బాలుర పాఠశాల బాధ్యతను నిర్వహించేవారు. ఆమె రోజుకు అనేక గంటల పాటు బోధించేవారు. తక్కువ కులలాకు చెందిన పిల్లలు మరియు పెద్దల కొరకు ఆదివారపు బైబిలు పాఠశాల తరగతులను (సండే స్కూల్) నిర్వహించిన ఆమె వారికి బోధించుటలో ఎంతో ఆనందించేవారు. అంతేకాకుండా, ఆమె మహిళలను మరియు బాలికలను వారి గృహములలో సంధించి, వారి మధ్య పరిచర్య చేశారు. కొన్నిసార్లు వైద్యుడు లేనప్పుడు ఆమె వైద్యశాల యొక్క బాధ్యతలను కూడా చేపట్టేవారు.


    ఆ విధంగా భారతదేశంలో ఫలవంతమైన పరిచర్య జరిగించిన తరువాత డురాండ్ దంపతులు స్వదేశమునకు తిరిగి వెళ్ళినప్పటికీ చివరి వరకు దేవుని సేవలో నిలిచియున్నారు.


    ప్రియమైనవారలారా, మీరు మీ వ్యక్తిగత పనులతో సువార్త ప్రకటనను మిళితం చేయుచున్నారా? 


    "ప్రభువా, భారతదేశంలో సువార్తను ప్రకటించుటకు ద్వారములను తెరిచి, మార్గములను సరాళము చేయుము. ఆమేన్!" 


    దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • Silas Mead | సిలాస్ మీడ్

     సిలాస్ మీడ్ | Silas Mead



    • జననం: 16-08-1834
    • మహిమ ప్రవేశం: 13-09-1909
    • స్వస్థలం: సోమర్‌సెట్
    • దేశం: ఇంగ్లాండు
    • దర్శన స్థలము: ఆస్ట్రేలియా


    ఆంగ్లేయుడైన సిలాస్ మీడ్ ఆస్ట్రేలియాలో సేవ చేసిన ఒక బాప్తిస్టు మిషనరీ. ఒక వ్యవసాయ కుటుంబములో జన్మించిన మీడ్ పారంపర్యంగా వస్తున్న వ్యవసాయమును కొనసాగించుట కంటే దైవిక జీవితము పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగియుండేవారు. 15 సంll ల వయస్సులో బాప్తిస్మం పొందిన అతను, త్వరలోనే వారి నగరంలో సువార్త ప్రకటించడం మరియు క్రైస్తవాలయంలో బోధించడం ప్రారంభించారు. అతను బైబిలు వేదాంతశాస్త్రంలో పట్టా పొందుటకుగాను రీజెంట్స్ పార్క్ కళాశాలలో చేరగా, అక్కడి కళాశాల ప్రిన్సిపాల్ అయిన జోసెఫ్ యాంగస్‌ పరిచర్య యెడల మీడ్ కలిగియున్న అవగాహనా దృష్టిని విస్తరింపచేశారు.


    పట్టభద్రులైన పిమ్మట ‘బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ’ లో చేరుటకు దరఖాస్తు పెట్టుకున్నారు మీడ్. కానీ అతని అభ్యర్థన అంగీకరించబడలేదు. అయితే, ఆస్ట్రేలియాకు చెందిన విశ్వాసుల బృందం వారి మధ్య సేవ చేయుటకు ఒక పాదిరి వారికి కావలెనని కోరినప్పుడు సేవ చేయుటకు అవకాశం అతని తలుపు తట్టింది. యాంగస్ ప్రోత్సాహంతో, మీడ్ వెంటనే ఆ ఆహ్వానమును అంగీకరించి, 1861వ సంll లో ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరమునకు చేరుకున్నారు. అతను బాగా ఆకట్టుకునే బోధకునిగా కనిపించకపోయినప్పటికీ, సువార్త ప్రకటన పట్ల ఎంతో ఆసక్తి ఉత్సాహములతో అతను నిండుకొనియుండెడివారు. స్థానిక ప్రజలను క్రీస్తు వద్దకు తీసుకువచ్చుటకు తన భార్యతో పాటు అతను ఎంతో శ్రమించారు. త్వరలోనే అతను ‘ఫ్లిండర్ స్ట్రీట్ బాప్టిస్ట్ చర్చి’ ని నిర్మించగా, 5 సంll ల లోగానే ఆ సంఘములో 263 మంది సభ్యులు సమకూడారు.


    ఒకవైపు పరిచర్య అభివృద్ధి చెందుతుండగా, మరొకవైపు మీడ్‌కు వ్యక్తిగత జీవితములో నిరాశలు ఎదురయ్యాయి. టైఫాయిడ్ జ్వరం కారణంగా అతని భార్య మరణించగా అతను హృదయ వేదనతో కృంగిపోయారు. ఐదుగురు పిల్లలను పెంచవలసిన బాధ్యత మరియు ఎదుగుతున్న సంఘ బాధ్యత అతని భుజాల పైనే పడింది. అయినప్పటికీ ఏనాడూ వెనుకంజ వేయక పరిచర్యను అడిలైడ్ హద్దులను మీరు విస్తరింపజేయుచూ ముందుకు సాగిపోయారు మీడ్‌. బాప్తిస్టు మిషన్‌ను ఐక్యపరిచి, ఉజ్జీవింపజేసి విస్తరింపజేయుటకుగాను అతను ‘సౌత్ ఆస్ట్రేలియా బాప్టిస్ట్ అసోసియేషన్‌’ ను స్థాపించి నడిపించారు. క్రైస్తవ్యములో ఐక్యత లేకపోవడమే సువార్త వ్యాప్తికి తీవ్రమైన అవరోధముగా ఉన్నదని అతను విశ్వసించారు. ఆత్మీయముగా ఎదిగిన విశ్వాసులు తమ క్రైస్తవ సంఘములను విడిచి మారుమూల ప్రాంతములకు వెళ్ళి నూతన సంఘములను స్థాపించవలెనని వారిని ప్రోత్సహించేవారు.


    భారతదేశంలో కూడా ‘సౌత్ ఆస్ట్రేలియా బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ’ స్థాపించబడటం మరియు ‘ఫ్యూరిడ్‌పోర్ మిషన్‌’ ప్రారంభించబడటం వెనుక మీడ్ క్రియాశీలక వ్యక్తిగా ఉన్నారు. తరువాతి కాలంలో అతని కుమారుడు సిసిల్ మీడ్ అదే మిషన్‌లో సేవ చేయుటకు భారతదేశానికి వచ్చారు. తన వృద్ధాప్యంలో కూడా అలుపెరుగక సేవలో ముందుకు సాగిపోయిన సిలాస్ మీడ్, 1909వ సంll లో మహిమలోకి పిలువబడే వరకు కూడా అనేక క్రైస్తవ సంస్థలను నడిపిస్తూ, సలహాలనిస్తూ దేవునికి నమ్మకమైన దాసునిగా జీవించారు.


    ప్రియమైనవారలారా, మీరు చేసే సేవలో ఈ లోకం క్రీస్తు ప్రేమను చూడగలుగుతుందా?


     "ప్రభువా, నా వ్యక్తిగత జీవితములో నిరాశలు ఎదురైనప్పటికీ, మిమ్ములను సేవించుటలో ఎల్లప్పుడూ ఆనందించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!" 

    దేవునికే మహిమ కలుగునుగాక! 

  • WhatsApp
  • Sep 28, 2021

    Sannuthintuneppudu Yehovanu | సన్నుతింతు నెప్పుడెహోవాను

    "నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును." కీర్తన Psalm 34:1-10


    పల్లవి : సన్నుతింతు నెప్పుడెహోవాను తన కీర్తి నా నోట నుండును

    1. అతిశయింతు నెహోవానుబట్టి
    సంతోషింతురు దీనులు విని || సన్నుతింతు ||

    2.ఘనపరచుడి దేవుని పేరు
    గొప్ప చేయుదము ఏకముగా || సన్నుతింతు ||

    3. తనయొద్ద నే విచారించగా
    తప్పించె నన్ను భయముల నుండి || సన్నుతింతు ||

    4. తనను చూడగ వెల్గు కలిగెను
    తమ ముఖములు లజ్జింపకుండె || సన్నుతింతు ||

    5. యెహోవా భక్తులందరి చుట్టు
    దూత కావలి యుండి రక్షించు || సన్నుతింతు ||

    6. దేవుడుత్తముడని రుచిచూడు
    ధన్యుడు తన్నాశ్రయించువాడు || సన్నుతింతు ||

    7. ఆకలెత్తు సింహపు పిల్లలకు
    ఆశ్రితుల కేమి కొదువలేదు || సన్నుతింతు ||
  • WhatsApp
  • Sep 15, 2021

    Saint Patrick | సెయింట్ పాట్రిక్

     సెయింట్ పాట్రిక్ | Saint Patrick

    • జననం : క్రీ.శ 387
    • మరణం : క్రీ.శ 490
    • స్వదేశం : బ్రిటను
    • దర్శన స్థలం : ఐర్లాండు

    తాను ఏ దేశపు సముద్రపు దొంగల చేత చెరపట్టబడి బానిసగా అమ్మబడ్డారో అదే దేశానికి సేవ చేయుటకు దేవుడు తనను తిరిగి తీసుకువెళ్తాడని పాట్రిక్ అప్పుడు ఎరిగియుండకపోవచ్చు . తన స్వస్థలమునకు దూరముగా , అత్యధికముగా అన్యదేవతలను పూజించే ఆ ఐర్లాండు దేశములో , తన యవ్వన కాలంలో విస్మరించిన మతాన్నే అతను ఎంతో పటిష్టముగా పట్టుకున్నారు . అతని తాతగారు ఒక పాదిరి , తండ్రి ఒక డీకన్ ( క్రైస్తవ సంఘ సేవలో సహాయక పరిచారకులు ) . అయినప్పటికీ , నిజమైన దేవునిని పాట్రిక్ ఎరిగియుండలేదు . అయితే , పరదేశానికి చెరపట్టబడిపోయిన ఆ సమయాన్ని అతనిని విశ్వాస మార్గములోనికి మళ్ళించుటకు దేవుడు వాడుకున్నాడు . ఆరు సంవత్సరాల తరువాత అక్కడి నుండి దేవుడు తనను విడిపించేంత వరకు కూడా , అతను తన సమయమును అత్యధికముగా ప్రార్థనలో వెచ్చించారు .

    ఏదేమైనప్పటికీ , బ్రిటనుకు తిరిగి వచ్చిన తరువాత అతను తిరిగి ఐర్లాండుకు వెళ్ళవలెనని ఒక దేవదూత అతనికి సూచిస్తున్నట్లు ఒక దర్శనము అతనికి కలిగింది . అయితే ఈ సారి చెరపట్టబడినవానిగా కాదు , ఒక మిషనరీగా . కాగా కొన్ని సంవత్సరాల పాటు మతపరమైన శిక్షణ పొందిన పిమ్మట కేవలం దేవుని మీదనే ఆధారపడి పాట్రిక్ ఐర్లాండుకు వెళ్ళారు . విగ్రహాలను మరియు అశుద్ధమైనవాటిని ఆరాధిస్తున్న ప్రజలను సత్యము వైపుకు మళ్ళించవలెనని అలుపెరుగని ఆసక్తితో అతను ఐర్లాండు అంతటా ప్రయాణించి సువార్తను ప్రకటించారు .

    ఐర్లాండులోని తెగల వ్యవస్థను గురించి అతను మునుపు ఎరిగియున్నందున , వారిని క్రీస్తు వైపుకు నడిపించుటకు ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని అవలంబించారు . అదేమనగా , మొదట తెగల నాయకులకు సువార్తను ప్రకటించి , తదుపరి వారి తెగవారిని ప్రభావితం చేయుటకు ఆ నాయకులను ప్రోత్సహించడం . ఈ పద్ధతిని అనుసరించుట ద్వారా అతను ఐర్లాండ్ అంతటా అనేక వేల మందికి బాప్తిస్మమిచ్చుటలో విజయవంతులయ్యారు . ఎంతో ధైర్యమును మరియు దీనత్వమును కలిగిన మిషనరీ పాట్రిక్ . ఆ ఐర్లాండు ద్వీపములో అతని ప్రాణాలకు ఎల్లప్పుడూ ఆపద పొంచియుండేది . అనేకమార్లు అతను అన్యదేవతలను పూజించే తెగ నాయకులచే బంధించబడ్డారు . కాగా ఆ ద్వీపమును విడిచి వెళ్లవలెనని అతనిలో ఎంతో కోరిక కలిగినప్పటికీ , దేవుని యొక్క చిత్తములో నిలిచియున్నట్లయితే ఈ భూమిపై అదే తనకు అత్యంత సురక్షితమైన ప్రదేశమని పాట్రిక్ తన హృదయమును దృఢపరచుకునేవారు . ' ఐర్లాండ్ కు అపొస్తలుడు ' అని పేరొందిన ఈ పాట్రిక్ , దేవుని దృష్టికి తనను దీనునిగా కనుబరుచుకొనినవారై , తన తుది శ్వాస వరకూ ఆ పరమ దర్శనమునకు అవిధేయులు కాలేదు . ప్రియమైన వారలారా , మిమ్ములను బాధించిన వారియొద్దకే తిరిగి వెళ్ళి , క్రీస్తు ప్రేమను వారికి పంచిపెట్టుటకు మీరు సిద్ధముగా ఉన్నారా ?
    " ప్రభువా , దీనత్వమును నాలో కలిగించి , మీ వాక్యమును ప్రకటించుటకు నన్ను బలపరచుము . ఆమేన్ ! "
  • WhatsApp
  • Aug 28, 2021

    Stella Franklin | స్టెల్లా ఫ్రాంక్లిన్

    స్టెల్లా ఫ్రాంక్లిన్  | Stella Franklin


    • జననం: -
    • మహిమ ప్రవేశం: -
    • స్వదేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: భారతదేశం


     1896–97 మధ్య భారతదేశంలో సంభవించిన కరువు ఆ దేశం ఎదుర్కొన్న ఎంతో భయంకరమైన పరిస్థితులలో ఒకటి అని చెప్పవచ్చు. ఒకవైపు ఆకలి బాధతో, మరొకవైపు తెగుళ్ళతో ప్రజల మరణాల రేటు ఎంతో అధికంగా ఉన్న రోజులవి. ఆ సమయంలో సుమారుగా పది లక్షల మంది మరణించినట్లు అంచనా. భారతీయులు శ్రమలలో మునిగిపోయి కొట్టుమిట్టాడుతున్న అటువంటి సమయంలో వారి ఆత్మీయ మరియు భౌతిక అవసరతలను తీర్చుటకు దేవుడు అనేక మంది దైవభక్తి గల స్త్రీ పురుషులను లేవనెత్తాడు. అటువంటి వారిలో ఒకరే స్టెల్లా ఫ్రాంక్లిన్. 


     1895వ సంll లో భారతదేశానికి వచ్చారు స్టెల్లా ఫ్రాంక్లిన్. తన సోదరి జోసెఫా వలెనే తాను కూడా మిషనరీ ఉపాధ్యాయురాలిగా సేవ చేయుటకు స్టెల్లా సిద్ధపడ్డారు. అయితే భారతదేశంలో కరువు యొక్క తీవ్రత ఆమె పని తీరును మార్చివేసింది. అప్పటికే తన సోదరి సేవలందిస్తున్న స్థలములోనే, అక్కడ జరుగుతున్న సహాయక చర్యలలో పాలుపంచుకొనమని స్టెల్లాను కోరారు. కాగా ఆమె ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక అనాథాశ్రమము యొక్క బాధ్యతలు స్వీకరించి, వందలాది మంది పిల్లల సంరక్షణా వ్యవహారాలను చేపట్టారు. అక్కడ ఉన్న పిల్లలలో అనేకమందికి కరువు తీరిన తరువాత తిరిగి వెళ్ళుటకు ఇళ్ళు లేవు. అటువంటి పిల్లలను స్టెల్లా తన రెక్కల క్రిందకు తీసుకొని, వారికి ఆహారమిచ్చి పోషించి, విద్యను నేర్పించడమే కాక ఆత్మీయ ఆహారమును కూడా అందించారు.


     తదుపరి దామో అనే ప్రాంతంలో మహిళల మధ్య సువార్త పనిని ప్రారంభించారు స్టెల్లా. ప్రారంభంలో ఆమె తన అనాథాశ్రమంలోని పిల్లల యొక్క తల్లులను సంధించారు. సువార్త ప్రచారానికి వెళ్లినప్పుడు తాను వెళ్ళిన ప్రదేశంలో గుడారం వేసుకొని నివసించే ఆమె, తన వ్యక్తిగత భద్రతను గానీ లేదా సౌకర్యాన్ని గానీ ఏనాడూ లెక్క చేయలేదు. అటువంటి ఒక పర్యటనలో ఆమె దాదాపు డెబ్భై గ్రామాలను సందర్శించారంటే అది ఆశ్చర్యకరమైన విషయమే! ఆమె దర్శించిన ఆ గ్రామాలలో చాలా వరకు మునుపెన్నడూ ఏ సువార్తికులూ వెళ్ళనివి. ఆమె బైబిలు బోధించే విధానం అన్ని వర్గాల వారికీ వారి పరిస్థితులకు తగినట్లుగాను మరియు ఎంతో స్పష్టముగాను ఉండేది.


     1905వ సంll లో ఆమె విద్యా పరిచర్యను నియంత్రించుటకును మరియు పాఠశాల నిర్వహణను చేపట్టుటకును హర్దాకు వెళ్ళారు. తదుపరి బైబిల్ కళాశాలలో బోధించుటకు జబల్‌పూర్‌కు వెళ్ళిన ఆమె, పిమ్మట 1912వ సంll లో బాలికల బోర్డింగ్ పాఠశాలలో సేవలందించుటకుగాను ముంగేలికి వెళ్ళారు. ఆ పనిలోనే ఆమె తన పరిచర్య యొక్క మిగిలిన సంవత్సరములను గడిపారు. ఆమె ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడి క్రైస్తవ సంఘములకు కావలసిన ఆలోచనలను అందించుటకును మరియు కుటుంబ వ్యవహారాలలో సలహాల కొరకును ప్రజలు ఆమెను ఆశ్రయించేవారు. ఆమె కలిగియున్న అద్భుతమైన బుద్ధిజ్ఞానములు మరియు కనికరముతో ఇతరులను అర్థము చేసుకొనగలిగిన వ్యక్తిత్వము ప్రతి స్థలములోనూ వారు ఆమెను ఆశ్రయించుటకు కారణమయ్యేవి.


    🚸 *ప్రియమైనవారలారా, నశించుచున్న ఆత్మల యొక్క ఆత్మీయ మరియు భౌతిక అవసరతలను తీర్చుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?* 🚸


    🛐 *"ప్రభువా, నేను మీకు సేవ చేయునప్పుడు నా సౌకర్యము కొరకు నేను ఆశించకుండునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్!"* 🛐

    🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏

    *******


  • WhatsApp
  • Aug 26, 2021

    Stanley Dale | స్టాన్లీ డేల్

    Stanley Dale | స్టాన్లీ డేల్

    జననం: -

    మహిమ ప్రవేశం: 1968

    స్వస్థలం: ఆస్ట్రేలియా

    దర్శన స్థలము: పాపువా, ఇండోనేషియా


    న్యూ గినియాలోని పర్వతాలు ఆ ప్రాంతంలోని అత్యంత భయానకమైన తెగలలో ఒకటైన ‘యాలి’ అనే తెగకు నిలయంగా ఉన్నాయి. మూఢనమ్మకాలతో నిండియున్న ఈ తెగవారు నరమాంస భక్షకులు మరియు నరబలిని ఆచరించేవారు. వారిని కలిసినవారిలో అతి కొద్దిమంది మాత్రమే సజీవంగా బయటకు రాగలిగారు. ఇవన్నీ తెలుసుకున్న స్టాన్లీ డేల్ స్నేహపూర్వక స్వభావం లేని ఆ తెగలకు సిలువ సందేశమును తీసుకువెళ్ళవలెనని నిర్ణయించుకున్నారు.


    ఆస్ట్రేలియాకు చెందిన మిషనరీయైన స్టాన్లీ డేల్ మునుపు సైనికుడిగా పనిచేశారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మొట్టమొదటి సారిగా న్యూ గినియా యొక్క ఎత్తైన పర్వత శ్రేణులను చూసిన అతను, ఏదో ఒక రోజు తిరిగి వచ్చి అక్కడి యాలి ప్రజలకు దేవుని ప్రేమాసందేశమును అందించవలెనని నిశ్చయించుకున్నారు. కాగా 1961వ సంll లో తన స్నేహితుడు బ్రూనో డి లీయుతో కలిసి ఆ ప్రజలను చేరుకొనుటకు సుదీర్ఘమైన మరియు అతి క్లిష్టమైన ప్రయాణమును ప్రారంభించారు స్టాన్లీ. మొదటిగా వారు ఒకరితో ఒకరు పోరాడుతున్న యాబీ మరియు కోబాక్ తెగలను కలుసుకున్నారు. ఒకరోజు స్టాన్లీ మరియు బ్రూనో ఆ ఇరుతెగలవారి మధ్య జరుగుతున్న పోరాటంలో చిక్కుకున్నారు. ఇరుతెగలవారు కూడా ఆ వ్యక్తులు తమ శతృ తెగకు చెందినవారని భావించి వారిని చంపుటకు ఆయుధములతో వారి యొద్దకు పరిగెత్తారు. అయితే, అక్కడి పరిస్థితిని శాంతింపజేయుటకు ప్రయత్నిస్తున్న స్టాన్లీ యొక్క ధైర్యమును చూసి ఆ గిరిజనులు ఆశ్చర్యపోయారు. దేవుడు దయచేసిన జ్ఞానముతో ఆ తెగల మధ్య శాంతిని నెలకొల్పారు స్టాన్లీ. ఒకరినొకరు చంపుకొనుటకు సిద్ధముగా ఉన్న ఆ ప్రజలు చివరకు క్షమాపణా భావముతో ఒకరినొకరు కౌగిలించుకున్నారు.


    ఎంతో క్లిష్టమైన అన్వేషణ తరువాత చివరకు స్టాన్లీ మరియు బ్రూనో యాలి తెగలను చేరుకొనగలిగారు. అయితే వారు ఆ తెగవారి భూభాగములో అడుగు పెట్టిన మరుక్షణం బాణాలు వారి పైకి దూసుకువచ్చాయి. తత్ఫలితముగా వారు తిరుగుముఖం పట్టవలసి వచ్చింది. ఏదేమైనప్పటికీ, యాలి ప్రజల జీవితములకు యేసు క్రీస్తు ప్రభువు అవసరమని విశ్వసించిన స్టాన్లీ, 1963వ సంll లో మరికొంతమందితో కలిసి ఆ ప్రాంతమునకు తిరిగి వెళ్ళారు. వారు యాలి భూభాగమును చేరుకున్నప్పుడు ఆ గిరిజనులు తమ గుడిసెలలో నుండి బయటకు వచ్చి, తమ బాణములను ఊపుతూ వారిని భయపెట్టారు. తన సహచరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని భద్రతా స్థలమునకు తిరిగివెళ్ళవలెనని స్టాన్లీ వెనుదిరిగారు. అయితే వారు వెనుకకు తిరుగినప్పుడు వందలాది బాణాలు దూసుకువచ్చాయి. ఆ మొత్తం మిషనరీ బృందం తమ ప్రాణాలను కోల్పోయారు.


    కొన్ని సంవత్సరాల తరువాత స్టాన్లీ రక్తం చిందించిన ఆ భూభాగములోనే సువార్త కూడా వ్యాపించింది. స్టాన్లీ యొక్క కుమారుడు వెస్లీతో సహా ఇతర మిషనరీలు ధైర్యముగా ముందుకు అడుగులువేసి యాలి తెగను చేరుకుని, క్రీస్తు కొరకు వారిని సంపాదించగలిగారు. ఒకప్పుడు భయానకమైన తెగగా ఉన్న యాలి ప్రజలు ఇప్పుడు శాంతిని ప్రేమించే క్రైస్తవ సమాజముగా మారారు!


    🚸 *ప్రియమైనవారలారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి ప్రభువు కార్యాభివృద్ధియందు మీరు ఆసక్తులై యుంటున్నారా?* 🚸


    🛐 *"ప్రభువా, అపాయకరమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చినా సువార్తను ప్రకటించుటకు ముందుకు సాగిపోవుటకు నాకు ధైర్యము దయచేయుము. ఆమేన్!"* 🛐

    *******

    🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏


  • WhatsApp
  • Aug 23, 2021

    Stutinthun stutinthun naa kaalochana | స్తుతింతున్ స్తుతింతున్

    యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయ భాగము నీవే." కీర్తన Psalm 16:3-11

    పల్లవి : స్తుతింతున్ స్తుతింతున్
    నాకాలోచన కర్తయగు దేవుని
    రాత్రివేలలో నా అంతరింద్రియములు నాకు నేర్పున్

    1. నాదు స్వాస్థ్య పానీయ భాగము
    నా యెహోవా నీవే కాపాడెదవు
    మనోహర స్థలములలో పాలుకల్గెను - స్తుతింతున్ || స్తుతింతున్ ||

    2.శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కల్గెను
    సదాకాలము యెహోవాయందు నా
    గురిని నిల్పుచున్నాను గాన నేను - స్తుతింతున్ || స్తుతింతున్ ||

    3. నా కుడి పార్శ్వమందాయన యున్నాడు
    గాన కదల్చబడలేను ఎన్నడు
    అందుచేత నా హృదయ మానిందించును - స్తుతింతున్ || స్తుతింతున్ ||

    4. నా శరీరము సురక్షితంబుగా
    నివసించుచున్నది ఏలననగా
    నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు - స్తుతింతున్ || స్తుతింతున్ ||

    5. జీవముగల నీ మార్గమును
    నీవు నాకిల తెలియ జేసెదవు
    నీవే నా క్షేమాధారమని నిన్ను - స్తుతింతున్ || స్తుతింతున్ ||

    6. సర్వోన్నతుడా నీ సన్నిధిలో
    సంపూర్ణ సంతోష మెంతో గలదు
    నీ కుడిచేతిలో నిత్యసుఖములు గలవు - స్తుతింతున్ || స్తుతింతున్ ||
  • WhatsApp
  • Aug 20, 2021

    Samuel Oughton | శామ్యూల్ ఆటన్

     శామ్యూల్ ఆటన్  | Samuel Oughton 


    • జననం: 1803
    • మహిమ ప్రవేశం: 1881
    • స్వస్థలం: యునైటెడ్ కింగ్‌డమ్
    • దర్శన స్థలము: జమైకా


    శామ్యూల్ ఆటన్ జమైకాలో సేవ చేసిన ఒక బాప్తిస్టు మిషనరీ. మొదట లండన్‌లోని ఇండిపెండెంట్ కాన్గ్రిగేషనల్ సర్రే చాపెల్‌లో సేవలందించిన అతను 1836వ సంll లో మిషనరీగా జమైకాకు వచ్చారు. 1839వ సంll నుండి అతను కింగ్‌స్టన్‌లోని ఈస్ట్ క్వీన్ స్ట్రీట్ చాపెల్‌లో పాదిరిగా పనిచేశారు. ఆ చాపెల్‌లో అధికభాగం ఆఫ్రికన్లు ఉండేవారు. 

    జమైకాలో బానిసత్వాన్ని చట్టబద్ధంగా రద్దు చేసిన తర్వాత కూడా ఆఫ్రికన్లకు అక్కడి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. అప్పటికి కూడా వారు బానిసలుగా చేయబడేవారు మరియు తరచూ వేధింపులకు గురయ్యేవారు. ఆఫ్రికన్లకు మద్దతుగా ధైర్యంగా నిలబడిన కొద్దిమంది మిషనరీలలో ఆటన్ ఒకరు. ఒక క్రైస్తవునిగా మానవులందరు సమానమేనని విశ్వసించే అతను, ఇతరులకు కూడా సమానత్వముతో ఉండాలని సూచించేవారు. అతను నల్లజాతి కార్మికుల హక్కుల గురించి ముక్కుసూటిగా మాట్లాడేవారు మరియు ఆఫ్రికా మహిళలపై అధికారుల దుశ్చర్యలను తీవ్రంగా ఖండించేవారు. దాని ఫలితంగా 1840వ సంll లో జైలు శిక్షను కూడా అనుభవించారు. దేవుని దయ వలన అక్కడి నుండి విడుదల చేయబడిన తరువాత అతను నూతన నిరీక్షణతో తన సంఘమునకు తిరిగి వచ్చి, మరింత ఉత్సుకతతో పరిచర్య చేయడం ప్రారంభించారు.

    తరువాతి ఇరవై సంవత్సరాలు ఈస్టర్ క్వీన్ స్ట్రీట్ చాపెల్‌లో పాదిరిగా సేవలందించిన ఆటన్, ఆ సమయంలో క్రైస్తవ సంఘములో సమానత్వమును నెలకొల్పుటకు అనేక సంస్కరణలు చేశారు. అతను మాజీ బానిసలు మరియు మాజీ యజమానులు అందరికీ వర్తించే నైతిక నియమావళిని అభివృద్ధి పరిచారు. సమాజములోను మరియు క్రైస్తవ సంఘములోను కొంత భాగం అతనిని ద్వేషించినప్పటికీ అతను తన నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉన్నారు. మాజీ బానిసలు తాము పొందిన స్వేచ్ఛను శారీరక క్రియల కొరకు వినియోగించక ఒకరికొకరు పరిచర్య చేసుకొనుటకు మాత్రమే ఉపయోగించాలని అతను వారికి గుర్తు చేసేవారు.


    జమైకాలో ఉన్నప్పుడు అతను బానిసల విడుదల కొరకు మరియు సంఘ సంస్కరణ కొరకు మాత్రమే పనిచేయలేదు, రాజకీయ మరియు సామాజిక విషయాలలో మహిళల యొక్క ప్రమేయాన్ని ప్రోత్సహించడంలో కూడా అతను భాగస్థులయ్యారు. మహిళా విద్యను బలముగా ప్రోత్సహించిన అతను, బానిసత్వాన్ని పూర్తిగా అధిగమించుటకుగాను సమాజంలో విద్యా వ్యవస్థను పటిష్ఠం చేయాలని నొక్కి చెప్పారు.


    మిషనరీగా దేవునికి నమ్మకముగా సేవ చేసిన శామ్యూల్ ఆటన్ 1881వ సంll లో పరమందు తన ప్రభువును చేరుకొన ఇహలోకము విడిచి వెళ్ళారు.


    🚸 ప్రియమైనవారలారా, నిజమైన క్రైస్తవునిగా మీరు అణగారినవారి న్యాయం కొరకు కృషి చేయుచున్నారా? 🚸


    🛐 "ప్రభువా, శారీరక క్రియల నుండి నన్ను రక్షించి, నేను కలిగియున్న స్వేచ్ఛను ఇతరులకు పరిచర్య చేయుటకు నేను వినియోగించునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్!" 🛐


    🙏🙏 దేవునికే మహిమ కలుగునుగాక! 🙏🙏


  • WhatsApp
  • Samuel J. Mills | శామ్యూల్ జె. మిల్స్

     శామ్యూల్ జె. మిల్స్ |  Samuel J. Mills


    • జననం: 12-04-1783
    • మహిమ ప్రవేశం: 16-06-1818
    • స్వస్థలం: కనెక్టికట్
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: అమెరికా సంయుక్త రాష్ట్రాలు


    శామ్యూల్ జాన్ మిల్స్ కనెక్టికట్‌లోని ఒక పాదిరి కుమారుడు. ఒక క్రైస్తవ భక్తురాలైన అతని తల్లి అతనిని దేవుని పరిచర్యకు సమర్పించారు మరియు ఎంతో శ్రద్ధగా అతనిని ఆ దిశలో నడిపించారు. జాన్ ఎలియట్ మరియు డేవిడ్ బ్రెయినర్డ్ జీవితాల నుండి ప్రేరణ పొందిన మిల్స్, మిషనరీ పరిచర్య కొరకై తన జీవితమును సమర్పించుకున్నారు. కాగా పరిచర్య కొరకు సిద్దపడుటకుగాను 1806వ sసంllలో అతను విలియమ్స్ కళాశాలలో చేరారు.


    మిల్స్ ఒక తెలివైన విద్యార్థి, చురుకైనవారు, ఎంతో ఉత్సుకతను కలిగి ఉండేవారు, త్యాగపూరితమైన స్వభావం గలవారు మరియు మంచి పనులు చేయుటకు అంకితభావం గలవారు. ప్రతి శనివారం అతను భక్తి గలిగిన తన నలుగురు స్నేహితులను కళాశాలలోని ఏకాంతముగా ఉండే పొదల మధ్య కలుసుకొని మిషనరీ పనుల కొరకు ప్రార్థించడం ఆనవాయితీ. కాగా అటువంటి ఒక శనివారం వారి కలయికకు ఉరుములు మెరుపులతో కూడిన పెద్ద వర్షం వలన అంతరాయం కలిగింది. అందువలన వారు ఒక గడ్డివాము క్రింద దాగుకొని ప్రార్థించుట కొనసాగించారు. ఆ ప్రార్థన యొక్క ఫలమే విదేశీ మిషన్లను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఏర్పడిన ‘సొసైటీ ఆఫ్ బ్రదరన్’. అనేకమంది విద్యార్థులు ఈ సంస్థలో భాగస్థులయ్యారు. వారిలో శామ్యూల్ న్యూవెల్ మరియు అడోనిరామ్ జడ్సన్ వంటి వారు కూడా ఉన్నారు. 1801వ సంll లో మిల్స్‌తో సహా ఆ సంస్థలోని నలుగురు ‘కాంగ్రెగేషనల్ జనరల్ అసోసియేషన్ ఆఫ్ మసాచుసెట్స్’ ముందు హాజరయ్యి తమను తాము విదేశీ మిషనరీలుగా సమర్పించుకున్నారు. ఆ విధంగా ‘అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమీషనర్స్ ఫర్ ఫారిన్ మిషన్స్’ (ఎ.బి.సి.ఎఫ్.ఎమ్.) ఉనికిలోకి వచ్చింది.


    1812వ సంll లో ‘ఆండోవర్ థియోలాజికల్ సెమినరీ’ నుండి పట్టభద్రులైన పిమ్మట పశ్చిమ మరియు దక్షిణ అమెరికాలో రెండు మిషనరీ పర్యటనలు చేపట్టారు మిల్స్. అతని మిషనరీ పర్యటనల నివేదికలు అమెరికాలోని క్రైస్తవ సంఘముల మేల్కొలుపుకు దారితీయగా, తత్ఫలితముగా చివరికి 1826వ సంll లో ‘అమెరికన్ హోమ్ మిషనరీ సొసైటీ’ ఏర్పడింది. దేశంలో బైబిళ్ళ కొరకు తీవ్ర స్థాయిలో ఉన్న అవసరతలను గుర్తించి, స్వతంత్ర్యముగా ఉన్న బైబిలు సొసైటీలను ఏకం చేయుటకు కృషిచేసిన మిల్స్, 1816వ సంll లో ‘అమెరికన్ బైబిల్ సొసైటీ’ ఏర్పడుటలో కీలక పాత్ర పోషించారు.


    అమెరికాలో తన పరిచర్య ఎంతో తీవ్రముగా ఉన్నప్పటికీ, విదేశాలలో మిషనరీగా సేవ చేయాలనే కోరిక అతనిని ఏనాడూ విడిచిపోలేదు. చివరికి ‘ది అమెరికన్ కాలనైజేషన్ సొసైటీ’ యొక్క మిషనరీ కార్యకలాపాలను పశ్చిమ ఆఫ్రికాలో విస్తరింపజేయుటకు అతను ఎంపికయ్యారు. కాగా ఎంతో సంతోషముతో గమ్యాన్ని చేరుకొనుటకు ఓడలో ప్రయాణిస్తున్న అతను తనకు అప్పగింపబడిన మిషన్‌ను చేపట్టకముందే జ్వరం బారినపడి అనారోగ్యం పాలయ్యారు. ఈ యువ మిషనరీ 1818వ సంll జూన్ మాసం 16వ తారీఖున ఓడప్రయాణంలో ఉండగానే తన చివరి శ్వాస వదిలారు.


    🚸 ప్రియమైనవారలారా, మీరు ఉన్న స్థలములో నిర్విరామముగా దేవునికి మీరు సేవ చేయుచున్నారా? 🚸


    🛐 "ప్రభువా, నేను జ్ఞానము, చురుకుతనము, ఉత్సుకత, త్యాగపూరిత స్వభావము కలిగి సత్క్రియల పట్ల అంకితభావం కలిగియుండునట్లు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!" 🛐


    🙏🙏 దేవునికే మహిమ కలుగునుగాక! 🙏🙏

  • WhatsApp
  • Samuel Henry Kellogg | శామ్యూల్ హెన్రీ కెల్లోగ్

     శామ్యూల్ హెన్రీ కెల్లోగ్ |  Samuel Henry Kellogg


    • జననం: 06-09-1839
    • మహిమ ప్రవేశం: 03-05-1899
    • స్వస్థలం: న్యూయార్క్
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: భారతదేశం


    బాల్యం నుండి కూడా లేఖనములను పఠించుటలో శ్రద్ధగలిగిన విద్యార్థిగా ఉన్నారు శామ్యూల్ కెల్లోగ్. అతను తన విద్యార్ధి దశలో క్రీస్తు తనకు ఏమైయున్నాడో వివరిస్తూ “ఎ లివింగ్ క్రైస్ట్” (ఒక జీవించుచున్న క్రీస్తు) అనే పేరుతో ఒక కరపత్రమును ప్రచురించారు. మిషనరీ ప్రచురణలను చదువుటలోనే అతను ఎక్కువ సమయమును గడిపేవారు. అది మిషనరీ పనిని అతని ఉపాధిగా ఎంచుకోవాలనే ఆలోచనలను అతనిలో కలిగించింది. 1861వ సంll లో ప్రిన్స్‌టన్ కాలేజీ నుండి పట్టభద్రులైన తరువాత అతను భారతదేశంలో తన మిషనరీ అనుభవం గురించి మరియు మిషనరీల కొరకు అక్కడ ఎంతగానో ఉన్న అవసరత గురించి రెవ. హెన్రీ ఎం. స్కడ్డర్ మాట్లాడటం విన్నారు. స్కడ్డర్ యొక్క సాక్ష్యంతో ఎంతగానో కదిలింపబడిన కెల్లోగ్ కూడా భారతీయ ప్రజలకు సేవ చేయుటకు తనను తాను సమర్పించుకున్నారు. 


    భారతదేశానికి మిషనరీగా నియమితులైన తరువాత తన భార్యతో కలిసి 1864వ సంll లో భారతదేశానికి పయనమయ్యారు కెల్లోగ్. అక్కడ సేవ చేసేవారి కొరత కారణంగా త్వరలోనే కలకత్తాలోని ఫరూఖాబాద్ మిషన్ పని యొక్క పూర్తి బాధ్యతలు అతనికి అప్పగింపబడ్డాయి. హిందీ భాషపై పట్టు సాధించిన అతను, త్వరలోనే స్థానిక ప్రజల కొరకు హిందీలోనే ఆదివారపు ఆరాధనా సేవలను నిర్వహించడం ప్రారంభించారు. సువార్తను ప్రకటించడం అతని మొదటి ప్రాధాన్యత. కాగా అతను అలయక నగరంలోనూ నగర పరిసర ప్రాంతములలోనూ  సువార్తను ప్రకటించారు. అయితే, అతని అనారోగ్యం మరియు అతని భార్య మరణం వలన అతను అమెరికాకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ అతను ‘ప్రెస్బిటేరియన్ చర్చ్ ఆఫ్ కెనడా’ అనే సంఘములో చురుకుగా సేవలందించారు మరియు అల్లెఘేనీలోని బైబిలు వేదాంత కళాశాలలో కూడా బోధించారు.


    ఆ సమయంలోనే హిందీభాషలో అతనికున్న ప్రావీణ్యమును బట్టియు మరియు లోతైన లేఖన పరిజ్ఞానమును బట్టియు హిందీ బైబిలును తిరిగి అనువదించుటకు భారతదేశం నుండి అతనికి పిలుపు వచ్చింది. భారతదేశంలో తాను ఇంకా నెరవేర్చవలసిన పని ఉన్నదని ఎరిగియున్న కెల్లోగ్ 1892వ సంll లో అహ్మదాబాద్ చేరుకున్నారు. అతను విలియం హూపర్ మరియు జోసెఫ్ ఆర్థర్ లాంబెర్ట్‌లతో కలిసి 1899వ సంll వరకు హిందీ బైబిలును సవరించారు. త్వరలో తాను భారతదేశాన్ని విడిచిపెట్టవలసి వస్తుందని ఊహించిన కెల్లోగ్, దేశంలోని అనేక ప్రాంతాలకు ప్రయాణించి స్థానిక క్రైస్తవ సంఘములను ఎంతో ఉత్సాహంగా ప్రోత్సహించారు. అతను "వారికను చావనేరరు" (లూకా 20:36) అనే వచనముపై ముస్సోరీలో తన చివరి ప్రసంగమును ఇచ్చారు. ఆ మరుసటి వారమే నిత్యమూ ప్రభు సన్నిధానములో జీవించుటకు ఈ లోకము విడిచి వెళ్ళారు శామ్యూల్ హెన్రీ కెల్లోగ్. సంవత్సరాలను బట్టి లెక్కించినట్లయితే ఈ భూమిపై అతని జీవించిన కాలం సుదీర్ఘమైనది కాదు. అయితే, అతను జీవించిన ఆ కొద్ది జీవితమే ఎంతో అద్భుతరీతిలో ఫలవంతమైనదిగా ఉన్నది.


    🚸 ప్రియమైనవారలారా, మీకు అప్పగింపబడిన పరిచర్యను మీరు సంపూర్ణముగా నెరవేర్చుచున్నారా? 🚸


    🛐 "ప్రభువా, నేను బాధ్యత వహించిన పరిచర్యను సంపూర్తి చేయుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!" 🛐

    🙏🙏 దేవునికే మహిమ కలుగునుగాక! 🙏🙏

  • WhatsApp
  • Samuel Gobat | శామ్యూల్ గోబాట్

    శామ్యూల్ గోబాట్ | Samuel Gobat 


    • జననం: 26-01-1799
    • మహిమ ప్రవేశం: 11-05-1879
    • స్వస్థలం: బెర్న్
    • దేశం: స్విట్జర్లాండ్
    • దర్శన స్థలము: అబిస్నీనియా మరియు యెరూషలేము


    శామ్యూల్ గోబాట్ సి.ఎమ్.ఎస్. (చర్చి మిషనరీ సొసైటీ) తరఫున అబిస్నీనియా మరియు యెరూషలేములలో సేవ చేసిన ఒక మిషనరీ. పారిస్‌లోని బాసెల్ మిషన్ ఇనిస్టిట్యూట్ మరియు ఇంగ్లాండ్‌లో ఉన్న ఇస్లింగ్టన్ (లండన్) లోని సి.ఎమ్.ఎస్. శిక్షణా సంస్థలో చదువుకున్నారు గోబట్. తదుపరి అతను సి.ఎమ్.ఎస్. సంస్థతో కలిసి సేవ చేయుటకు స్వచ్ఛందంగా ముందుకు రాగా, ఆ సంస్థ అతనిని అబిస్నీనియాకు పంపింది.


    అజ్ఞానులై దౌర్భాగ్యమైన జీవితమును గడుపుతున్న అబిస్సీనియన్ల మధ్య ఆరేళ్లపాటు సహనముతో సేవలందించారు గోబాట్. అయితే అక్కడ స్థిరముగాలేని అశాంతియుత రాజకీయ పరిస్థితులు మరియు అతని అనారోగ్య పరిస్థితుల కారణముగా గోబాట్‌ ఐరోపాకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు అతను మాల్టాకు పంపబడ్డారు. 1839 మరియు 1845 సంll ల మధ్యకాలంలో అతను బైబిల్‌ను అరబిక్‌ భాషలోనికి అనువదించుటను పర్యవేక్షించారు మరియు మాల్టా ప్రొటెస్టంట్ కాలేజీకి వైస్ ప్రెసిడెంట్‌గా సేవలందించారు. తదనంతరం, యెరూషలేము యొక్క బిషప్ మరణించగా 1846వ సంll లో ప్రూసియా రాజైన నాలుగవ ఫ్రెడరిక్ విల్హెల్మ్ అతని స్థానంలో గోబాట్‌ను బిషప్‌గా ఎంపిక చేశారు.


    అతను బిషప్‌గా ముప్పై సంవత్సరాలకు పైగా కీలకమైన పరిచర్యను చేశారు. అతను అనేక పాఠశాలలను మరియు ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు సీయోను కొండపై ఒక అనాథాశ్రమమును స్థాపించారు. అతను స్థాపించిన పాఠశాలలలో ఒకటి తరువాతి కాలంలో ప్రసిద్ధ ‘జెరూసలేం యూనివర్సిటీ కాలేజీ’ గా అభివృద్ధి చెందింది. అంతేకాకుండా అతను ఒక హీబ్రూ సెమినరీని మరియు బీదవారు మరియు నిరుపేదలైన యూదులకు హస్తకళలను నేర్పించుటకు ఒక పారిశ్రామిక కేంద్రమును కూడా స్థాపించారు. ఆ సంస్థలను నడిపించుటకు అతను తన స్వంత డబ్బంతటిని కూడా ఖర్చు చేయవలసి వచ్చినప్పటికీ, ఆ సంస్థలు ప్రజలకు ఏ విధంగా ప్రయోజనం చేకూరుస్తున్నాయో చూసి అతను ఎంతో సంతోషించేవారు. నిరక్షరాస్యత మరియు నిరుద్యోగం వంటి సామాజిక సమస్యలను పరిష్కరించుటకు ఈ సంస్థలు పనిచేస్తున్నప్పటికీ వాటి ప్రధాన లక్ష్యం ప్రజలకు సువార్తను చేరవేయుటయే!


    గోబాట్ తన పరిచర్యలో సందర్భానుసారముగా వ్యవహరించుటకు పేరుగాంచారు. అప్పటిలో యెరూషలేములో నెలకొనియున్న గందరగోళ పరిస్థితుల మధ్య అతని భార్యయైన మేరీ గోబాట్ అతనికి బలమైన ఆధారముగా నిలిచారు. క్రిమియన్ యుద్ధ సమయంలో కూడా వారు అల్లర్లు, వివాదాలు మరియు రక్తపాతాల మధ్య దేవుని సేవను కొనసాగించారు. వారు కరువులను మరియు తెగుళ్ళను భరించారు. దేవుని యొక్క ఏర్పాటు ప్రకారం అయన హస్తము గనుక తోడైయుండకపోతే మరియు గోబాట్ యొక్క త్యాగసహితమైన పరిచర్య గనుక లేకపోయినట్లయితే ఆకలి మరియు వ్యాధుల కారణముగా ఎంతోమంది చనిపోయియుండేవారు. నిశ్చయముగా దేవుడు వారిని “వారెరుగని మార్గమున” నడిపించాడు మరియు “వారి సామర్థ్యము కంటే ఎక్కువగా” ఆయన కొరకు పని చేసేలా వారిని వాడుకున్నాడు.


    🚸 ప్రియమైనవారలారా, క్లిష్ట పరిస్థితులలో మీరు మీ కుటుంబానికి బలమైన ఆధారముగా నిలుచుచున్నారా? 🚸


    🛐 "ప్రభువా, కష్టనష్టాలు మరియు అనారోగ్య పరిస్థితులు ఎదురైనప్పటికీ నమ్మకముగా మీ సేవ చేయుటకు నాకు బలము దయచేయుము. ఆమేన్!" 🛐


    🙏🙏 దేవునికే మహిమ కలుగునుగాక! 🙏🙏

  • WhatsApp
  • Samuel Ajayi Crowther | శామ్యూల్ అజాయి క్రౌథర్

    శామ్యూల్ అజాయి క్రౌథర్ |  Samuel Ajayi Crowther



    • జననం: 1809
    • మహిమ ప్రవేశం: 31-12-1891
    • స్వస్థలం: లాగోస్
    • దేశం: నైజీరియా
    • దర్శన స్థలము: నైజీరియా


    చాలా కాలం క్రితం జరిగిన ఒక సంఘటన. నైజీరియాలో సముద్రపు ఒడ్డున ఒక నల్లజాతి బాలుడు ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా ఒక ఓడలో నుండి వచ్చిన అపరిచిత వ్యక్తులు అతనిని పట్టుకెళ్ళి ఒక పోర్చుగీసు బానిస యజమానికి విక్రయించారు. చాలా కాలం క్రితం అటువంటి దుర్మార్గపు పనులు జరిగేవి మరియు నిస్సహాయులైన పేద ఆఫ్రికన్లను బానిసలుగా పట్టుకుని విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించుకునేవారు. ఏదేమైనప్పటికీ కొంత కాలం తరువాత కొంతమంది దయగల వ్యక్తులు అతనిని విడిపించగా పిమ్మట అతను సియెర్రా లియోన్‌కు వెళ్ళారు. అతను చేసిన మొదటి పని ఏమంటే ఒక అర పైసాను భిక్షమడిగి అక్షరమాలను నేర్పుకొనుటకు ఒక పుస్తకమును తన కొరకు కొనుక్కోవడం. మంచి ప్రతిభావంతుడైన పిల్లవాడైన అతను చదవడం నేర్చుకున్నారు మరియు ఐదేళ్లలో కళాశాలలోకి ప్రవేశించగలిగారు. ఆ బాలుడి పేరు శామ్యూల్ అజాయి క్రౌథర్.


    శామ్యూల్ జీవితంలో అత్యంత ముఖ్యమైన సంఘటన ఏమిటంటే అతను ఒక క్రైస్తవునిగా మారి క్రైస్తవ సేవకు తనను తాను సమర్పించుకోవడం. కాలం గడిచేకొద్దీ ఒక శిక్షకునిగా (ట్యూటర్) ఉన్న శామ్యూల్ క్రౌథర్ క్రైస్తవ పరిచారకులు అయ్యారు. పిమ్మట 1864వ సంll లో బిషప్‌గా నియమించబడ్డారు. ఆధునిక కాలంలో ఆఫ్రికాలో నల్లజాతికి చెందిన మొట్టమొదటి బిషప్‌గా అతను నిలిచారు. నైజర్ నది ఒడ్డున మిషన్ స్టేషన్లను స్థాపించారు క్రౌథర్. వివిధ రకాల వ్యక్తులతో వ్యవహరించడంలో అద్భుతమైన జ్ఞానమును మరియు యుక్తిని కలిగియుండే క్రౌథర్ విశేషమైన రీతిలో వారి నమ్మికను గెలుచుకొనగలిగేవారు. అతను చదువుకున్నవారు మరియు సమాజములో గౌరవమును కలిగియున్నవారు అయినప్పటికీ, దేవుని దృష్టిలోను మరియు మనుష్యుల దృష్టిలో కూడా తనను తాను తగ్గించుకునేవారు. బైబిలులోని ఒక భాగమును యోరుబా భాషలోకి అనువదించుటలో కూడా అతను సహాయమందించారు.


    శామ్యూల్ హృదయంలో ఉన్న అత్యంత తీవ్రమైన ఆకాంక్ష ఏమిటంటే తన తల్లిని కనుగొని ఆమెకు యేసు క్రీస్తు ప్రభువును గురించి చెప్పవలెననునదే. అయితే ఆమెను గురించిన సమాచారమేమీ అతనికి లభించకపోగా ఏ విధంగానూ ఆమెను కనుగొనలేకపోయారు శామ్యూల్. అయితే అనుకోకుండా ఒక రోజున ఎంతో అద్భుతమైన సంఘటన జరిగింది. ఏమంటే, బాప్తిస్మము పొందుటకు ఒక స్త్రీ ముందుకు రాగా, అక్కడ బిషప్‌గా ఉన్న శామ్యూల్ ఆమె కేవలం ఒక క్రైస్తవురాలు మాత్రమే కాదు, తన స్వంత తల్లి అని కనుగొన్నారు. ఎంత సంతోషకరమైన దినమది! దేవుని దృష్టిలో అతని జీవితం మరియు అతను చేసిన పరిచర్య ఎంతో ఘనమైనవిగా ఎంచబడ్డాయి. అందువలననే చివరికి అతని హృదయ వాంఛ నెరవేర్చబడింది.


    🚸 ప్రియమైనవారలారా, మీ కుటుంబ సభ్యుల రక్షణ గురించి మీరు భారమును కలిగియున్నారా? 🚸


    🛐 "ప్రభువా, పాపానికి బానిసలుగా ఉన్నవారికి సిలువ సందేశమును మోసుకువెళ్ళే రాయబారిగా నన్ను చేయుము. ఆమేన్!" 🛐


    🙏🙏 దేవునికే మహిమ కలుగునుగాక! 🙏🙏


  • WhatsApp
  • Scott and Jennie Philips | స్కాట్ మరియు జెన్నీ ఫిలిప్స్

    స్కాట్ మరియు జెన్నీఫిలిప్స్ Scott and Jennie Philips


    • జననం: -
    • మహిమ ప్రవేశం: -
    • స్వస్థలం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: ఇండోనేషియా


     లూకా 9:60లో ఈలాగు వ్రాయబడి ఉంది – “... నీవు వెళ్లి దేవుని రాజ్య మును ప్రకటించుము”. ఈ ఆజ్ఞకు లోబడి మిషనరీ దంపతులైన స్కాట్ మరియు జెన్నీ ఫిలిప్స్ ఇండోనేషియాలో ఉన్న దావో అడవిలోని గిరిజన ప్రజలకు యేసుక్రీస్తు సువార్తను అందించుటకుగాను 2003వ సంll లో ఇండోనేషియాకు వెళ్ళారు.


     దేవుని యందు భయభక్తులు గలిగిన క్రైస్తవ తల్లిదండ్రులకు జన్మించారు స్కాట్. యేసుక్రీస్తు తన పాపాల కొరకు సిలువపై మరణించాడని విశ్వసించిన స్కాట్, ప్రభువును తన స్వరక్షకునిగా అంగీకరించారు. అతను బైబిలు కళాశాలలో చదువుకుంటున్న రోజులలో ఒకసారి డన్ గోర్డీ అనే ఒక మిషనరీ వచ్చి “చేరని ప్రాంతాలలో సువార్త ప్రకటన” అనే అంశముపై ఒక వారం పాటు తరగతులను బోధించారు. తద్వారా గిరిజనుల మధ్యలో సేవ చేయుటకు ప్రపంచవ్యాప్తముగా ఉన్న అవసరమును గ్రహించారు స్కాట్. అది ప్రతి విశ్వాసికీ ఇవ్వబడిన దేవుని ఆ గొప్ప ఆజ్ఞను తాను కూడా నెరవేర్చే దిశగా అతను తన జీవితమును నడిపించుటకు దారితీసింది. మిషనరీ పరిచర్య కొరకై అతను కలిగియున్న సమర్పణలో అతని భార్యయైన జెన్నీ తగిన భాగస్వామి అయ్యారు.


    జెన్నీ ఫిలిప్స్ 15 సంll ల వయస్సులో ప్రభువును తన రక్షకునిగా అంగీకరించారు. అప్పటి నుండి కూడా ఆమె తన కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభువు కొరకే తన మిగిలిన జీవితమును జీవించాలని నిర్ణయించుకున్నారు. కాగా ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసుకొనిన తరువాత ఆమె ‘వర్డ్ ఆఫ్ లైఫ్ బైబిల్ ఇన్‌స్టిట్యూట్‌’ లో చేరారు. వైద్య మిషనరీ కావాలనే తన ఆలోచనలను విరమించుకుని, దావో తెగలవారికి దేవుని ప్రేమ మరియు రక్షణను గురించిన సువార్తను వ్యాప్తి చేయుటకు ఆమె తన జీవితమును సమర్పించుకున్నారు. ఆ దంపతులిరువురు కలిసి బాహ్య ప్రపంచముతో సంబంధములు లేకుండా వేరుచేయబడి, ఇంకా సువార్త చేరుకోని మారుమూల ప్రాంతాలలోని ప్రజల మధ్య ఆత్మీయ అభివృద్ధిని తీసుకువచ్చుటకుగాను ‘డి.ఎ.ఓ. మినిస్ట్రీస్’ (‘డిసైరింగ్ అడ్వాన్స్‌మెంట్ ఓవర్‌సీస్’ - విదేశాలలో అభివృద్ధి కొరకు ఆకాంక్ష) అనే సంస్థను స్థాపించారు. 

    దేవుని కృప ద్వారా ఆ మిషనరీ దంపతులు దావో ప్రజలలో అనేక మందిని యేసు క్రీస్తు ప్రభువు నొద్దకు నడిపించగలిగారు. లిపిలేని భాష కలిగియున్న ఆ గిరిజన ప్రాంతములో జెన్నీ క్రొత్త నిబంధనను దావో భాషలోకి అనువదించారు మరియు ప్రస్తుతం పాత నిబంధనను కూడా అనువదించుటను పూర్తి చేసే ప్రక్రియలో ఉన్నారు. అంతేకాకుండా ఇండోనేషియా అడవులలో మరింత లోపలికి వెళ్ళి, అక్కడి ప్రజలకు కూడా సువార్తను చేరవేయుటకుగాను వారు దావో ప్రజలకు శిక్షణ ఇస్తున్నారు.

      

    “మిషనరీ సేవ చేయుటకు ప్రజలకు ప్రత్యేకమైన పిలుపు అవసరం లేదు. బైబిలులో ఆ పిలుపు ఇవ్వబడింది. ప్రజలు చేయవలసింది కేవలం దానికి స్పందించుటయే.” అనునవి స్కాట్ ఫిలిప్స్ యొక్క మాటలు.


    🚸 *ప్రియమైనవారలారా, "... నీవు వెళ్లి దేవుని రాజ్య మును ప్రకటించుము" అను ఆజ్ఞకు మీరు విధేయత చూపించుచున్నారా?* 🚸


    🛐 *"ప్రభువా, మీరు ప్రతి విశ్వాసికీ ఇచ్చిన ఆ గొప్ప ఆజ్ఞను నెరవేర్చుటకు మేము కుటుంబముగా ఒకరికొకరు ప్రోత్సహమును సహాయమును అందిచుకొనునట్లు మాకు సహాయము దయచేయుము. ఆమేన్!"* 🛐

    ******

    🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏

  • WhatsApp