Search Here

Mar 17, 2022

Saint Timothy Life History

సెయింట్ తిమోతి జీవిత చరిత్ర






జననం : ~ క్రీ.శ. 17

మరణం : ~ క్రీ.శ. 97

స్వస్థలం : లుస్త్ర (ప్రస్తుత టర్కీలో)

దర్శన స్థలము : ఎఫెసు


'దేవునిని ఘనపరచుట' అనే అర్థమిచ్చే పేరుగల తిమోతి, అపొస్తలుడైన పౌలు యొక్క శిష్యుడు మరియు ఎఫెసు సంఘము యొక్క మొట్టమొదటి బిషప్పు. అతని తల్లి ఒక యూదురాలు, తండ్రి గ్రీసు దేశమునకు చెందిన అన్యుడు. చిన్నప్పటి నుండీ తిమోతి తన తల్లియైన యునీకే మరియు అవ్వయైన లోయి మాదిరిగానే దేవునియందు విశ్వాసము కలిగియున్నారు. పౌలు లుస్త్రకు వచ్చి పరిచర్య చేసినప్పుడు తిమోతి యేసు క్రీస్తు యొక్క సువార్తను అంగీకరించి, పౌలు యొక్క శిష్యునిగా మారారు.


పౌలు యొక్క రెండవ మరియు మూడవ మిషనరీ యాత్రలలో అతనితో కలిసికొనిన తిమోతి, పురాతన పట్టణములైన కొరింథు, థెస్సలొనీక మరియు ఫిలిప్పీలలో క్రైస్తవ సంఘములను స్థాపించుటలో తోడ్పడ్డారు. తిమోతిని తన కుమారుని వలె ప్రేమించిన పౌలు, అతను విశ్వాసములో ఎదిగేకొద్దీ సేవలో ముఖ్యమైన కార్యకలాపాలకు అతనిని నియమించారు. స్థానిక సంఘములను బలపరచుటలో పౌలుతో కూడ నిలిచిన తిమోతిని ప్రభువు ఎంతో బలముగా వాడుకున్నారు. అతను సువార్త యొక్క లోతైన సత్యమును కాపాడుటలో ఎంతో జాగ్రత్త వహించారు. సువార్తను వ్యతిరేకించే వారితో విభేదాలు తలెత్తిన పరిస్థితులలో, అతను తన హృదయములో సత్యమును భద్రపరచుకొని, దానిని అన్వయించుకొని, తన విశ్వాసమును గట్టిగా పట్టుకొని వారిని తీవ్రంగా ఖండించేవారు.


అతని సమకాలీనులలో తక్కినవారు తమ స్వార్థపూరిత మార్గముల పట్ల వాంఛకలిగియుండగా, తిమోతి మాత్రం విశ్వాసుల పట్ల నిజమైన శ్రద్ధ వహించారు. ఎఫెసు సంఘమునకు పరిచర్య చేయుటకు పౌలు అతనిని నియమించారు. అక్కడ సేవ చేసే సమయములో ఆత్మ ద్వారా నింపబడియున్నామని వంచించే వంచకులను తిమోతి ఎదుర్కొనవలసి వచ్చింది. తాను పొందియున్న ఆత్మ వరములను ప్రజ్వలింప చేయుట ద్వారా తప్పుడు బోధనల మధ్యలో అతను సువార్త సత్యమును స్థిరముగా నిలువబెట్టుటకు తీవ్రంగా ప్రయత్నించారు. శ్రమలు, హింస మరియు వ్యతిరేకతల మధ్యలో తన రక్షకుని గురించి మాటలాడుటకు అతను ఏనాడూ సిగ్గుపడలేదు. సంఘ కాపరిగా తన కర్తవ్యాలను సమర్థవంతముగా నిర్వర్తించిన తిమోతి, దేవుని వాక్య సత్యమును ఎంతో ఖచ్చితముగా వివరించేవారు. తద్వారా అనేకమంది శిష్యులు మరియు విశ్వాసులు లోతైన క్రైస్తవ సిద్ధాంతములను గూర్చిన జ్ఞానమును కలిగియుండగలుగునట్లు నడిపించబడ్డారు.


యేసు క్రీస్తు యొక్క శిష్యునిగా కొనసాగుటలో తన జీవితములో తిమోతి ఏనాడూ వెనుకంజ వేయలేదు. తత్ఫలితముగా అతను శ్రమలను, హింసను ఎదుర్కొని హతసాక్షిగా మరణించవలసి వచ్చింది. బయలును అనుసరించేవారి దేవత పూజింపబడుటను వ్యతిరేకించినందు వలన ఆ జనసమూహం అతనిని చంపినట్లు చెప్పబడుతుంది. 


ప్రియమైనవారలారా, తమ స్వప్రయోజనాలనే వెంటాడే మనుష్యులున్న ఈ లోకములో దేవుని పరిచర్య పట్ల నిజమైన భారాన్ని మీరు కలిగియున్నారా?


"ప్రభువా, తిమోతి వలె నమ్మకమైన పరిచర్య చేయుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!"


దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • No comments:

    Post a Comment