Search Here

Mar 21, 2022

Darlene Rose | డార్లీన్ రోజ్

డార్లీన్ రోజ్ జీవిత చరిత్ర





జననం: 17-05-1917

మహిమ ప్రవేశం: 24-02-2004

స్వస్థలం: అయోవా

దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు

దర్శన స్థలము: పాపువా న్యూ గినియా


దేవుని వాగ్దానాలపై స్థిరమైన విశ్వాసమును కలిగి పాపువా న్యూ గినియాలో తాను చేసిన పరిచర్యకు పేరుగాంచిన ఒక అమెరికా మిషనరీ డార్లీన్ డీబ్లెర్ రోజ్. క్రైస్తవ కుటుంబంలో జన్మించిన ఆమె చిన్నతనం నుండే లేఖనములను కంఠస్థం చేసేవారు. 13 ఏళ్ళ వయసులో ఒక ఉజ్జీవ కూడికలో తన జీవిత లక్ష్యములను ఆయన కొరకు అంకితం చేయమని దేవుడు తనను కోరుతున్నట్లు ఆమె గ్రహించారు. కొన్ని సంవత్సరాల తరువాత ఆమె శిక్షణ కొరకు 'క్రిస్టియన్ అండ్ మిషనరీ అలయన్స్‌' లో చేరారు. తదుపరి పాపువా న్యూ గినియాలోని వివిధ ప్రాంతాలలో మిషనరీ సేవ యొక్క ఆరంభకులలో ఒకరైన రస్సెల్ డీబ్లర్‌తో 1937వ సంll లో ఆమెకు వివాహం జరిగింది. కాగా తన భర్తతో కలిసి పాపువా న్యూ గినియాలో మిషనరీగా పనిచేయుటకు బయలుదేరినప్పుడు ఆమెకు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. మంచి భాషా నైపుణ్యంతో అశీర్వదించబడిన డార్లీన్ అక్కడి స్థానికులను క్రీస్తు వైపుకు నడిపించుటకు మిగుల ఆసక్తితో పనిచేశారు.


ఆ ప్రాంతంలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు కూడా ఆ మిషనరీ దంపతులు అక్కడే ఉండి సేవను కొనసాగించుటకు నిశ్చయించుకున్నారు. తద్ఫలితముగా వారు జపాన్ సైన్యానికి బందీలుగా మారారు. స్త్రీపురుషులను వేరు వేరుగా ఖైదీల శిబిరాలకు తీసుకొని వెళ్ళడముతో డార్లీన్ తన భర్త నుండి వేరుచేయబడ్డారు. ఆ ఎడబాటును భరించవలసి రావడమే కాకుండా, జపాన్ వారి నిర్బంధ శిబిరంలో ఆకలి, బలవంతముగా చాకిరీ చేయడం, ఏకాంత నిర్బంధము, హింస మరియు అమానుషమైన చర్యలను కూడా భరించవలసి వచ్చింది. అయితే అన్ని పరిస్థితులలో కూడా దేవుని కృప వలన నిలబడగలిగిన ఆమె యొక్క విశ్వాసం స్థిరమైనదిగా ఉంది.


తన భర్త మరణం గురించి విన్నప్పుడు డార్లీన్ రెండు పదుల వయస్సు యొక్క ప్రారంభదశలో ఉన్నారు. వెనువెంటనే ఆమె ఒక గూఢచారి అన్న ఆరోపణలతో ఏకాంత నిర్బంధంలో ఉంచబడ్డారు. కౄరంగా హింసించబడినప్పటికీ, అనారోగ్యంతో మరియు పోషకాహార లోపంతో ఉన్నప్పటికీ అన్ని శ్రమలలోనూ క్రీస్తు నిమిత్తం ఒంటరిగా పోరాడారు డార్లీన్. బందీగృహంలోని ఆ గదిలో ఒంటరితనంతో గడపవలసిన ఆ సమయంలో ఆమె పూర్వము కంఠస్థం చేసిన లేఖనముల యొక్క విలువను గ్రహించారు. అవి ఆమెకు కావలసిన ఆదరణనిచ్చాయి. ఒకసారి గూఢాచారిగా ఉన్నందుకుగాను కొన్ని క్షణాలలో శిరచ్ఛేదం చేయబడతారన్న పరిస్థితులలో అద్భుతకరమైన రీతిలో ఆమె ఆ ఏకాంత నిర్బంధంలో నుండి మునుపు ఉన్న అసలు జైలు శిబిరానికి తీసుకువెళ్ళబడ్డారు. అన్ని పరిస్థితులలోనూ ఆయన చాలినవాడని దేవుడు ఆమెకు నిరూపించాడు. అమెరికాకు తిరిగి వచ్చిన తరువాత కూడా మిషనరీ సేవ కొరకైన జ్వాలలు ఆమెలో రగులుతూనే ఉన్నాయి. కాగా 1949వ సంll లో ఆమె పాపువా న్యూ గినియాకు తిరిగి వచ్చారు. అక్కడ నలభై సంవత్సరాలకు పైగా ప్రభువుకు నమ్మకముగా సేవ చేసిన డార్లీన్ రోజ్ 2004వ సంll లో మహిమలో ప్రవేశించారు.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, ఎటువంటి శ్రమలు బాధలలోనైనా మీ విశ్వాసం కదలనిదై స్థిరమైనదిగా ఉన్నదా?


ప్రార్థన

ప్రభువా, మీకు నమ్మకముగా సేవ చేయుటకును, అన్ని పరిస్థితులలోనూ మీరు నాకు చాలినవారని అనుభవించి ఎరుగుటకును నాకు సహాయము చేయుము. ఆమేన్!


దేవునికే మహిమ కలుగునుగాక!



  • WhatsApp
  • No comments:

    Post a Comment