Search Here

Showing posts with label E. Show all posts
Showing posts with label E. Show all posts

Jul 26, 2022

Elekana | ఎలెకానా

 ఎలెకానా గారి జీవిత చరిత్ర

Pictures shown are for illustration purpose only



  • జననం: 19 వ శతాబ్దం
  • మహిమ ప్రవేశం: 19 వ శతాబ్దం
  • స్వస్థలం: మాణిహీకీ
  • దేశం: కుక్ దీవులు
  • దర్శన స్థలము: తువాలు దీవులు


పసిఫిక్ మహాసముద్రంలోని తువాలు ద్వీపాల ప్రజలకు క్రైస్తవ్యమును పరిచయం చేసిన ఘనత ‘తువాలు యొక్క అపొస్తలుడు’ అని పిలువబడే ఎలెకానాకు దక్కుతుంది. కుక్ దీవులలోని మాణిహీకీలో లండన్ మిషనరీ సొసైటీ యొక్క సహాయక పరిచారకునిగా (డీకనుగా) ఉన్న అతను, ఆ దీవులలో జరుగు పరిచర్యకు నాయకత్వం వహించారు. ఒకసారి ఎలెకానా మరియు మరో ఆరుగురు మిషనరీలు పరిచర్య నిమిత్తం సమీపంలోని రాకాహంగా ద్వీపమునకు వెళ్ళుచుండగా, వారు ప్రయాణించుచున్న పడవ తుఫానులో చిక్కుకుంది. కాగా ఎనిమిది వారాల పాటు సముద్రములో కొట్టుకొనిపోయిన వారు, చివరికి వారి గమ్యమునకు 2700 కి.మీ. దూరంలో ఉన్న తువాలు దీవులలోని ఒక దీవికి చేరుకున్నారు.


క్రొత్తగా తమ దీవిలో అడుగుపెడుతున్నవారిని చూచుటకై సముద్రపు ఒడ్డుకు పరుగెత్తి వచ్చిన తువాలు ప్రజలు వారిని నిండు హృదయముతో స్వాగతించారు. వారు నివసించుటకై ఆ ప్రజలు గుడిసెలు మరియు గుడారాలను కూడా ఏర్పాటు చేశారు. ఎలెకానా యొక్క గమ్యస్థానం మారినప్పటికీ, అతని లక్ష్యం మాత్రం మారలేదు. అదేమనగా, క్రీస్తు ప్రేమను ప్రకటించడం! కాగా అతను తన చుట్టూ ఉన్న ప్రజలను పోగుచేసి, యేసు క్రీస్తు యొక్క ప్రేమను గురించియు మరియు దేవుడు దయచేసే కాపుదల మరియు భద్రతలను గురించియు వారికి చెప్పడం ప్రారంభించారు. అతను ప్రకటించునది వారికి వింతగా అనిపించినప్పటికీ, ఎంతో ఆసక్తిగా విన్నారు. త్వరలోనే నిజమైన దేవుడు ఎవరనునది అక్కడి స్థానికులు గ్రహించారు. తత్ఫలితముగా వారు తమ పూర్వీకుల కొరకు కట్టిన మందిరములను పడగొట్టి, ఎలెకానా యొక్క నడిపింపులో నిజమైన దేవునిని ఆరాధించడం ప్రారంభించారు. ఈ సంగతులన్నీ కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే జరిగాయంటే ఆశ్చర్యమే!


తదుపరి ఎలెకానా మరలా తిరిగి వచ్చెదనని వారికి మాట ఇచ్చి ఆ తువాలు దీవికి వీడ్కోలు పలికారు. అటు పిమ్మట సమోవాలో కొన్ని సంవత్సరాల పాటు శిక్షణ పొంది, పరిచర్య చేసిన తరువాత, తాను ఇచ్చిన మాట చొప్పున తువాలు దీవులకు తిరిగివెళ్ళారు ఎలెకానా. అయితే ఈసారి అతను మరొక మిషనరీని వెంటబెట్టుకొని, అనేక సువార్త రచనలను తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడి స్థానికులలో అనేకమంది పురుషులు చెరపట్టబడి బానిసలుగా పెరూ దేశమునకు కొనిపోబడ్డారని అతను తెలుసుకున్నారు. అయినప్పటికీ, ఆ దీవులలో సువార్త సేవను కొనసాగించారు ఎలెకానా.


పిమ్మట మిషనరీ సేవ చేయుటకై ఆస్ట్రేలియాకు వెళ్ళిన అతను, తన చివరి రోజులను కుక్ దీవులలో గడిపారు. అతని కుమారుడు కూడా మిషనరీగా మారి సేవ చేయుచున్నప్పుడు, పాపువా దీవులలో అతను చంపబడగా, ఎలెకానా వృద్ధాప్యములో ఉన్నప్పటికీ, ఆ ప్రదేశానికి తన కుమారుని స్థానములో మిషనరీగా వెళ్ళుటకు ముందుకు వచ్చారు. దేవుని పట్ల మరియు నశించిపోవుచున్న ఆత్మల పట్ల ఎలెకానాకు ఉన్న ప్రేమ అటువంటిది!


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, దేవుడు మిమ్ములను ఎక్కడికి తీసుకువెళ్ళెదరో ఆ చోటికి వెళ్ళి సేవ చేయుటకు మీరు అంగీకరించెదరా? 


ప్రార్థన :

"ప్రభువా, మీరు నన్ను ఎక్కడ ఉంచెదరో ఆ స్థలములో మీకు నమ్మకముగా సేవ చేయుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Elias Riggs | ఎలియాస్ రిగ్స్

    ఎలియాస్ రిగ్స్   గారి జీవిత చరిత్ర



    • జననం: 19-11-1810
    • మహిమ ప్రవేశం: 17-01-1901
    • స్వస్థలం: న్యూజెర్సీ
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: గ్రీసు


    మొదటి నుండి కూడా ప్రతి స్థలములో ఉన్న మనుష్యులందరికీ సువార్తను సమర్థవంతముగా అందించడం అనునది క్రైస్తవ పరిచర్యను ముందుకు నడిపించే శక్తిగా ఉంది. ఈ విషయంలో భాషావేత్తలు ప్రాముఖ్యమైన పాత్రను పోషించారు. వారు తాము కలిగియున్న తలాంతులను దేవుని రాజ్య విస్తరణ కొరకు ఉపయోగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటువంటి అనేకమంది భాషావేత్తలలో ‘అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ ఫర్ ఫారిన్ మిషన్స్’ (ఎబిసిఎఫ్ఎమ్) అనే సంస్థకు చెందినవారైన ఎలియాస్ రిగ్స్ ఒకరు.


    దేవునియందు భయభక్తులు కలిగిన ఒక క్రైస్తవ కుటుంబములో జన్మించారు రిగ్స్. అతనికి 13 సంll ల వయస్సు వచ్చేటప్పటికి అతను హెబ్రీ మరియు గ్రీకు భాషలలో నిష్ణాతులయ్యారు. తదుపరి అమ్హెర్స్ట్ కళాశాలలో చేరిన అతను, అక్కడ చదువుకునే సమయంలో ‘ఫ్రెండ్స్’ అనే సంస్థతో చేరారు. ఒక రహస్య సంస్థయైన ఈ సంస్థ విద్యార్థులలో మిషనరీ సేవ పట్ల ఆసక్తిని రేకెత్తించుటకై పనిచేసేది. అటు పిమ్మట ‘ఆండోవర్ థియోలాజికల్ సెమినరీ’ అనే బైబిలు వేదాంత కళాశాల నుండి పట్టభద్రులైన అతను, విస్తృతమైన తన మిషనరీ పరిచర్యను ప్రారంభించారు.


    22 సంll ల వయస్సులో సేవ చేయుటకు నియామక అభిషేకం పొందిన తరువాత, రిగ్స్ తన భార్యయైన మార్తా జేన్ డాల్జెల్‌ను తీసుకొని గ్రీసు దేశమునకు పయనమయ్యారు. మొదట ఏథెన్స్ నగరములో స్థిరపడిన అతను, అరామిక్ భాషలో వ్రాయబడిన బైబిలులోని భాగములను గ్రీకు భాషలోకి అనువదించుటలో తన సమయమును వెచ్చించారు. అటు పిమ్మట అతను సువార్తను ప్రకటించుచూ, కరపత్రములను పంచుతూ, మరి ముఖ్యముగా అనువాద పరిచర్యలో సహాయం చేస్తూ గ్రీసు దేశములోని అనేక ప్రాంతములను పర్యటించారు. అతను ఏడు పురాతన మరియు 14 ఆధునిక భాషలను నేర్చుకొని, ఆ భాషలలోని అనువాద పనిలో భాగస్థులయ్యారు. వాటిలో అర్మేనియా, బల్గేరియా మరియు టర్కీ భాషలు కూడా ఉన్నాయి. అతను బైబిలును అనువదించే పరిచర్య చేసిన అనువాదకులు మాత్రమే కాదు, వేదాంత శాస్త్రమును బోధించే బోధకులు, ప్రసంగికులు మరియు అనేక ఆత్మీయ పుస్తకములను సవరించినవారు కూడా. అంతేకాకుండా తన భార్యతో కలిసి అర్గోస్‌లో ఒక బాలికల పాఠశాలను కూడా నడిపించారు మరియు పిల్లల మధ్యలో పరిచర్యను జరిగించారు రిగ్స్.


    మిషనరీగా ఎలియాస్ రిగ్స్ యొక్క పరిచర్య 68 సంll ల పాటు జరిగింది. అన్ని సంవత్సరాల కాలంలో అతను ఎటువంటి పనిలేకుండా ఉన్న సందర్భాలు చాలా అరుదు. ఎదురువచ్చిన అడ్డంకులను, కష్టములను సహించిన అతను, తాను కలిగియున్న తలాంతులను దేవుని మహిమార్థమై ఉపయోగించవలెననిన దృఢ నిశ్చయముతో ముందుకు సాగిపోయారు. అతని కుటుంబ సభ్యులు అతని పరిచర్య యొక్క వారసత్వమును  కొనసాగించగా, అతని పిల్లలలో ముగ్గురు కుమారులు దైవసేవకులు అయ్యారు మరియు పదిమంది మనుమలు మనుమరాండ్రు మిషనరీలయ్యారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, దేవుడు మీకు దయచేసిన తలాంతులను మరియు సామర్ధ్యములను మీరు ఆయన కొరకు ఉపయోగించెదరా? 


    ప్రార్థన :

    "ప్రభువా, నాకున్న తలాంతులు మరియు సామర్ధ్యములన్నింటినీ మీ మహిమ కొరకును మరియు మీ రాజ్య విస్తరణ కొరకును ఉపయోగించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!" 


    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Esther Baldwin | ఎస్తేర్ బాల్డ్విన్

    ఎస్తేర్ బాల్డ్విన్  జీవిత చరిత్ర



    • జననం: 08-11-1840
    • మహిమ ప్రవేశం: 26-02-1910
    • స్వస్థలం: న్యూజెర్సీ
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: చైనా


    ‘చైనీస్ ఛాంపియన్’ అని కూడా పిలువబడే ఎస్తేర్ బాల్డ్విన్ చైనాలో సేవ చేసిన ఒక అమెరికా మిషనరీ. ఒక క్రైస్తవ కుటుంబములో జన్మించిన ఆమె, పదేళ్ళ వయస్సులో ప్రభువును తన స్వరక్షకునిగా అంగీకరించారు మరియు స్థానిక సంఘములో చురుకైన సభ్యురాలిగా ఉన్నారు. న్యూజెర్సీలోని పెన్నింగ్టన్ సెమినరీ నుండి పట్టా పొందిన పిమ్మట, ఆమె వర్జీనియాలోని ఒక బైబిలు వేదాంత కళాశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఫుజౌ మిషన్‌లో పనిచేసిన స్టీఫెన్ లివింగ్‌స్టన్ బాల్డ్విన్‌తో వివాహం జరిగిన తరువాత, మిషనరీగా  తన భర్తతో కలిసి పనిచేయుటకుగాను ఆమె 1862వ సంll లో చైనాకు వెళ్ళారు.


    ఫుజౌలో ఆమె తన గృహసంబంధిత బాధ్యతలను నెరవేర్చడంతో పాటు అనేక పాఠశాలలను పర్యవేక్షించారు. అంతేకాకుండా తమ తోటి చైనా మహిళలకు బైబిలు చదివి వివరించునట్లు మరికొంత మంది స్త్రీలకు ఆమె శిక్షణనిచ్చారు కూడా. అక్కడి స్త్రీలు మరియు పిల్లల యొక్క పరిస్థితిని చూసిన ఆమె, చైనాలో క్రైస్తవ వైద్యుల కొరకు ఉన్న అవసరతను గ్రహించారు. వైద్య సేవలను అందించడం అనునది స్థానికుల యొక్క నమ్మకమును పొందుటకు మంచి మాధ్యమమనియు, చైనాలోని అంతర్భాగములకు సువార్తను తీసుకువెళ్ళుటకు ఒక చక్కటి మార్గమనియు ఆమె విశ్వసించారు. కాగా ఫుజౌలో మహిళలు మరియు పిల్లలకు ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేయుటలో ఆమె ఒక కీలక పాత్ర పోషించారు. సంవత్సరములు గడిచే కొద్దీ ఆ ఆసుపత్రి మూలముగా అనేక మంది స్త్రీలు మరియు పిల్లలు క్రీస్తు నొద్దకు నడిపించబడ్డారు. ఆమె సువార్తకు సంబంధించిన రచనలను చైనా భాషలోనికి అనువదించుటలోను మరియు వాటిని సవరించుటలోను కూడా సేవలందించారు.


    తన బాల్యం నుండి కూడా శారీరకంగా బలహీనముగా ఉన్న ఎస్తేర్, చైనాలో ఉన్నంత కాలం అనారోగ్యముతో బాధపడవలసి వచ్చింది. చివరికి, చైనాలో పద్దెనిమిది సంవత్సరాలు పరిచర్య చేసిన తరువాత, తీవ్రమైన అనారోగ్యం కారణంగా ఆమె తన కుటుంబముతో కలిసి అమెరికాకు తిరిగి వెళ్ళారు. అక్కడ ఆమె అమెరికాలో అణచివేతకు మరియు వివక్షకు గురైన చైనా ప్రజల పక్షముగా నిలబడ్డారు. ఆమె తన రచనల ద్వారా అమెరికా చైనా దేశాల మధ్య సన్నగిల్లిపోయియున్న సంబంధాలను చక్కదిద్దుటకు ప్రయత్నించారు మరియు క్రీస్తును సేవించుచున్నప్పుడు జాతికి జాతీయతకు అతీతమైన దృష్టి కలిగియుండవలెనని క్రైస్తవ సమాజమును ప్రోత్సహించారు. అంతేకాకుండా, ‘ఉమెన్స్ ఫారిన్ మిషనరీ సొసైటీ’ అనే మహిళా మిషనరీ సంస్థ యొక్క అధ్యక్షురాలిగా కూడా పనిచేసిన ఎస్తేర్ బాల్డ్విన్, ఎంతో మంది మహిళలను మిషనరీ పరిచర్యలోకి నడిపించడంలో ఒక గొప్ప సాధనమయ్యారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, వివిధ సమాజములవారి మధ్య సన్నగిల్లిపోయియున్న సంబంధములను మీరు క్రీస్తు ప్రేమతో చక్కదిద్దుతున్నారా? 


    ప్రార్థన :

    "ప్రభువా, జాతికి, జాతీయతకు, కులమతాలకు మరియు సంస్కృతికి అతీతముగా నా దృష్టి ఉండునట్లు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Egerton Ryerson Young | ఎగర్టన్ రైర్సన్ యంగ్

    ఎగర్టన్ రైర్సన్ యంగ్ జీవిత చరిత్ర


    • జననం: 07-04-1840
    • మహిమ ప్రవేశం: 05-10-1909
    • స్వస్థలం: క్రాస్బీ
    • దేశం: కెనడా
    • దర్శన స్థలము: కెనడా


    మిషనరీ పరిచర్యలో ఎదురుపడే లెక్కకు మించిన సవాళ్ళు మరియు కష్టాలలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనడం కూడా ఒకటి. తీవ్రమైన శీతోష్ణములను, సవాళ్ళతో కూడిన భౌగోళిక స్థితిని కలిగినదైన ఉత్తర కెనడా జీవనం సాగించుటకు ఒక క్లిష్టమైన ప్రదేశమని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ అక్కడి ప్రజలు కూడా నిజమైన దేవుని తెలుసుకొనుటకు అర్హులైయున్నారు. అందుకొరకు దేవుడు మాధ్యమముగా వాడుకొనిన వ్యక్తి ఎగర్టన్ రైర్సన్ యంగ్. కెనడాకు చెందిన అతను అన్ని అవరోధములను ధైర్యముగా ఎదుర్కొని అనేకమంది ఉత్తర కెనడా స్థానికులను దేవుని యొద్దకు నడిపించిన ఒక మార్గదర్శక మిషనరీ.


    సువార్తను ప్రకటించే స్థితిగతుల మధ్య పెరిగిన ఎగర్టన్, మొదటి నుండీ కూడా నశించుచున్న ఆత్మల కొరకు భారమును కలిగియున్నారు. వృత్తి రీత్యా ఉపాధ్యాయులైన అతను, పాఠశాలలో దాదాపు అన్ని విభాగాల పాఠ్యాంశములను బోధించగలిగే సామర్థ్యం ఉన్నవారు. 1867వ సంll లో వెస్లియన్ మెథడిస్ట్ చర్చి చేత సేవ చేయుటకు నియామక అభిషేకం పొందిన తరువాత, ఒక మిషనరీగా రూపర్ట్స్ ల్యాండ్ అనే ప్రాంతములో స్థానికుల మధ్య సేవ చేయుటకు పంపబడ్డారు. కాగా ఇంటి వద్ద లభించే సౌఖ్యములను విడిచిపెట్టి, తన భార్యయైన ఎలిజబెత్ బింగ్‌హామ్ మరియు మరికొందరు మిషనరీలతో కలిసి కెనడా యొక్క ఉత్తర భాగమునకు పయనమయ్యారు ఎగర్టన్. ఒక భయానకమైన మరియు ప్రమాదకరమైన ప్రయాణమైన ఆ ప్రయాణములో వారు కాలినడకన అనేక నదులు, కొండలు మరియు ప్రమాదకరమైన అరణ్యాలను దాటవలసి వచ్చింది. 


    రెండున్నర నెలల పాటు సాగిన ఆ కష్టతరమైన ప్రయాణం తరువాత చివరికి తన గమ్యాన్ని చేరుకొనగలిగారు ఎగర్టన్. అక్కడ అతను ఒక గ్రామము నుండి మరొక గ్రామమునకు ప్రయాణిస్తూ, స్థానికులను వారి గృహములలో సంధించి వారికి నిత్యజీవ మార్గమును బోధించారు. సువార్తను ప్రకటించుట కొరకు చేసిన తన ప్రయాణాలలో అనేక ఘోరమైన ప్రమాదాలను మరియు ఇబ్బందులను అతను ధైర్యముగా ఎదుర్కొన్నారు. -60 డిగ్రీలకు పడిపోయే శీతల వాతావరణం నుండి తనను తాను రక్షించుకొనుటకు అతను నేలలో బొరియలను త్రవ్వి వాటిలో నిద్రపోయేవారు. మంచు మీద పడి మెరుస్తూ అంధత్వానికి కూడా దారితీసేటువంటి మిరుమిట్లు గొలిపే సూర్యకాంతి వలన పగటిపూట ప్రయాణించడం అసాధ్యకరమైనటువంటి పరిస్థితులు తరచుగా ఎదురుపడేవి. కావున అతను రాత్రి సమయములో మాత్రమే ప్రయాణించేవారు. అటువంటి కఠినమైన వాతావరణం కారణంగా కొన్నిసార్లు అతని చర్మం పగిలి చీరుకుపోయినట్లు అగుట వలన అతని ముఖం మరియు కాళ్ళ నుండి రక్తం కారేది. ఒకవైపు అటువంటి ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చినప్పటికీ, స్థానికులకు సువార్తను చేరవేయుటకు తన మిషనరీ ప్రయాణములో వెనుదిరుగక ముందుకు సాగిపోయారు ఈ నిజమైన మిషనరీ.


    ఎగర్టన్ పరిచర్య మూలముగా అనేక మంది స్థానికులు క్రీస్తును అంగీకరించారు. అటువంటి వారిలో కౄరస్వభావులైన ఆటవికులు సున్నిత మనస్కులుగా మారారు మరియు భయమును కొల్పేవిగా ఉండే వారి విగ్రహాలను వారు తీసివేశారు. మిక్కుటమైన క్లిష్ట పరిస్థితుల మధ్య నశించుచున్న ఆత్మలను వెదుకుకుంటూ వెళ్ళిన ఎగర్టన్ రైర్సన్ యంగ్, తదుపరి అమెరికా, గ్రేట్ బ్రిటన్ మరియు ఆస్ట్రేలియా దేశాలను పర్యటించి మహిమకరమైన మిషనరీ మార్గమును ఎంచుకొనుమని విశ్వాసులను ప్రోత్సహిస్తూ తన జీవితపు చివరి సంవత్సరాలను గడిపారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీరు దేవుని సేవ చేస్తున్నప్పుడు కలిగే అసౌకర్యాల గురించి ఫిర్యాదు చేసేవారిగా ఉన్నారా?


    ప్రార్థన :

    "ప్రభువా, మీ సేవ చేస్తున్నప్పుడు నేను సణిగిన సణుగులను మన్నించి, ఎదురుపడే ఇబ్బందులను సంతోషముతో నేను ఎదుర్కొనగలుగునట్లు నన్ను బలపరచుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Jul 25, 2022

    Ella Marie Maddock | ఎల్లా మేరీ మడాక్

    ఎల్లా మేరీ మడాక్  జీవిత చరిత్ర

    Pictures shown are for illustration purpose only



    • జననం: 1865
    • మహిమ ప్రవేశం: 1909
    • స్వస్థలం: ఓహియో
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: భారతదేశం


    మిషనరీ నర్సుగా అర్హత పొందిన మొట్టమొదటి నుర్సులలో ఒకరైన ఎల్లా మేరీ మడాక్ 'డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్' (క్రీస్తుని శిష్యులు) అనే సంస్థ తరపున భారతదేశంలో సేవచేశారు. ఆమె ఒక ఆదర్శప్రాయమైన క్రైస్తవ కుటుంబములో జన్మించారు. స్థానిక క్రైస్తవ సంఘములో క్రియాశీలక సభ్యులుగా ఉండే ఎల్లా మరియు ఆమె సోదరి మేరీ వివిధ పరిచర్యలలో నాయకత్వ పాత్రను పోషించేవారు. అయితే ఎల్లా యొక్క చిన్నతనంలోనే ఆమె తండ్రి మరణించుట వలన కుటుంబ బాధ్యత ఇంటిలో పెద్ద కుమార్తె అయిన ఆమె భుజాలపై పడింది. ఆమె తన ఉన్నత పాఠశాల విద్యను ముగించుకొని నర్సింగ్ కోర్సును అభ్యసించారు. తదుపరి అర్హత మరియు అనుమతి కలిగిన నర్సుగా ఓహియోలో పనిచేశారు.


    చాలా సంవత్సరాలు నర్సుగా వృత్తిలో కొనసాగిన తరువాత, ఆమె చికాగోలోని మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్‌లో చేరి క్రియారూపకముగా మిషనరీ పని చేశారు. పిమ్మట ఆమె మిషనరీగా విదేశాలకు వెళ్ళి సేవ చేయుటకు దరఖాస్తు పెట్టుకొనగా, భారతదేశంలో, మరి ముఖ్యముగా భారతీయ మహిళల మధ్య మిషనరీ సేవను జరిగించుటకు ఆమె నియమించబడ్డారు. తద్వారా 1898వ సంll లో మధ్యప్రదేశ్‌లోని బినా అనే ప్రాంతమునకు చేరుకున్న ఎల్లా, అక్కడ స్థానిక భాషను అధ్యయనం చేస్తూ కొంత కాలం గడిపిన తరువాత, బిలాస్‌పూర్‌కు వెళ్ళి నర్సుగా సేవలందించారు. ఆ తర్వాత ఆమె ఒరిస్సాలోని హిందూ పుణ్యక్షేత్రమైన దేవ్ ఘడ్‌కు వెళ్ళి మహిళ మధ్య ఎంతో శ్రద్ధాసక్తులతో సేవ చేశారు. అక్కడ ఆమె వారికి వైద్య సేవలను అందించారు, కుష్ఠురోగుల కాలనీను బాధ్యతగా చూసుకున్నారు మరియు చిన్నపిల్లలు క్రీస్తులో ఎదుగుటకు సహాయపడ్డారు. అంతేకాకుండా దేవ్ ఘడ్‌ నగరానికి తీర్థయాత్రకు వచ్చే భక్తులతో సంభాషించి, సువార్తను పంచుకొనుటలో ప్రత్యేక శ్రద్ధ కనుబరిచారు. 


    ఎంతో ఉత్సాహముతో పనిచేసే ఎల్లా, సాధారణముగా ఆమె శక్తికి మించి పనిచేసేవారు. కాగా ఆమెకు అననుకూలముగా ఉన్న వాతావరణ పరిస్థితులు మరియు శక్తికి మించిన శ్రమ వలన ఆమె శరీరం కృశించిపోయింది. ఒక ప్రాణాంతక వ్యాధి కారణంగా అనారోగ్యానికి గురైన ఆమె, చివరికి 1909వ సంll లో ప్రభువునందు నిద్రించారు. తన సోదరి ఎల్లా యొక్క పరిచర్య నుండి ప్రేరణ పొందిన మేరీ కూడా భారతదేశానికి వచ్చి కొంతకాలం మిషనరీ సేవను జరిగించారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీ జీవితం మీ సోదరీసోదరులను దేవుని సేవ కొరకై ప్రేరేపించేదిగా ఉన్నదా? 


    ప్రార్థన :

    "ప్రభువా, ఇతరులకు ఆశీర్వాదకారముగాను మరియు ప్రేరణగాను ఉండునట్లు నా జీవితమును మార్చుము. ఆమేన్!" 

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Jul 4, 2022

    Eleanor Chesnut Biography

    ఎలెనోర్ చెస్నట్  గారి జీవిత చరిత్ర


    జననం: 08-01-1868

    మహిమ ప్రవేశం: 29-10-1905

    స్వస్థలం: అయోవా

    దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు

    దర్శన స్థలము: చైనా 


     "ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము." అని 1 యోహాను 3:16లో వ్రాయబడిన రీతిని దైవ ప్రేమను రుచిచూచిన ఎలెనోర్ చెస్నట్ క్రీస్తు అడుగుజాడలను అనుసరించి చైనా ప్రజల కొరకు తన ప్రాణమునే కోల్పోయారు.


     అమెరికాకు చెందిన ఎలెనోర్ చెస్నట్ చైనాలో సేవ చేసిన ఒక వైద్య మిషనరీ. బాల్యములోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమె, తన యొక్క బంధువుల యొద్ద పెరిగారు. ఆమె చదువు కొరకు సహాయం చేసెడివారెవరూ లేకపోవడంతో, తానే స్వయంగా పనిచేసి డబ్బు సంపాదించుకొని చదువుకున్నారు చెస్నట్. ఆ విధంగా ఆమె చికాగోలోని 'ఉమెన్స్ మెడికల్ కాలేజీ' (మహిళా వైద్య కళాశాల) నుండి పట్టభద్రురాలయ్యారు. పిమ్మట ఆమె మిషనరీ సేవ కొరకు సిద్ధపడుటకుగాను 'మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్' లో చేరారు.


     1894వ సంll లో చైనాకు ప్రయాణించిన ఆమె, లియాన్‌జౌలో క్రొత్తగా ప్రారంభించబడిన మహిళా ఆసుపత్రి యొక్క బాధ్యతలు చేపట్టారు. కాగా ఆ ఆసుపత్రి యొక్క అభివృద్ధి కొరకు ఆమె తన సమస్తమునూ ధారపోశారు. గుర్రముపై ఆమె పొరుగు గ్రామాలకు ప్రయాణించి అనారోగ్యముతో ఉన్నవారికి వైద్యం అందించారు మరియు స్థానిక మహిళలకు నర్సులుగా శిక్షణ ఇచ్చారు. అంతేకాకుండా మత్తయి సువార్తతో పాటు పలు పుస్తకములను ఆమె లియాన్‌జౌ మాండలికంలోనికి అనువదించారు. ఆమె కలిగియున్న దయాకనికరములను బట్టి ఆమె ఎంతగానో ప్రేమించబడ్డారు.


     1900వ సంll నాటి "బాక్సర్ తిరుగుబాటు" ప్రారంభమైనప్పుడు వేలాది మంది మిషనరీలు మరియు చైనా క్రైస్తవులు తమ ప్రాణములను కోల్పోతున్నప్పటికీ, చెస్నట్ తన యొక్క పిలుపులో స్థిరముగా నిలబడ్డారు. రాజకీయ అశాంతి పెరగుతుండడంతో ఆసుపత్రి పనితీరుకు భంగం కలిగించే పరిస్థితులను నివారించుటకు ఆమె తగిన జాగ్రత్తలను తీసుకున్నారు. అయితే, 1905వ సంll అక్టోబరు మాసం 29వ తారీఖున ఆసుపత్రి ప్రాంగణంలో అల్లర్లు చెలరేగాయి. మిషనరీలను వీధులలోకి లాక్కొనివచ్చి కొట్టారు. చెస్ట్నట్‌కు తప్పించుకొని వెళ్ళుటకు అవకాశం ఉన్నప్పటికీ, ఆ అల్లర్లలో గాయపడిన పిల్లలకు చికిత్స చేస్తూ ఆమె అక్కడే ఉండిపోయారు. చివరికి డాll ఎలెనోర్ చెస్నట్‌ కూడా పొలములో పనిచేయుటకు ఉపయోగించే త్రిసూలం వంటి పంగలకర్రతో (పిచ్‌ఫోర్క్‌) కొట్టబడి చంపబడ్డారు. ఆమెతో పాటు మరో ముగ్గురు మిషనరీలు మరియు పదేళ్ల చిన్నారి కూడా చంపబడ్డారు.


     చెస్నట్ యొక్క ధైర్యం, విశ్వాసముతో ముందడుగు వేసి చైనాలోను మరియు ఇతర ప్రాంతములలోను సువార్త సేవ కొరకై జీవించునట్లు అనేక మంది యువ మిషనరీలను ప్రేరేపించింది.


    ప్రియమైనవారలారా, మీ దైనందిత జీవితములలో మీరు క్రీస్తు యొక్క త్యాగసహితమైన ప్రేమను కనుబరచుచున్నారా?


    "ప్రభువా, మీరు సిలువపై చూపించిన ఆ త్యాగసహితమైన ప్రేమను అనుభవించిన నేను, అటువంటి ప్రేమతో ఇతరులను ప్రేమించగలుగునట్లు సహాయము దయచేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • Apr 7, 2022

    Eric Henry Liddell | ఎరిక్ హెన్రీ లిడెల్

    ఎరిక్ హెన్రీ లిడెల్  జీవిత చరిత్ర




    • జననం : 16-01-1902
    • మరణం : 21-02-1945
    • స్వదేశం : చైనా
    • దర్శన స్థలము : చైనా


    ఎరిక్ హెన్రీ లిడెల్ చైనాలో స్కాట్లాండుకు చెందిన మిషనరీ దంపతులకు జన్మించారు. మొదటిగా  లండన్‌ నగరంలోని ఎల్తామ్ కళాశాలలో చదువుకొనుటకు పంపబడిన అతను, తదుపరి  స్కాట్లాండ్‌లోని ఈడెన్‌బర్గ్  విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు. అక్కడ అత్యుత్తమ క్రీడాకారునిగా ఎదిగిన ఎరిక్, స్కాట్లాండ్‌లో అత్యంత వేగంగా పరుగెత్తే ఆటగానిగా మారారు. కాగా 1924వ సంll లో పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌ క్రీడలలో బ్రిటన్‌ తరఫున 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనుటకు అతను ఎంపికయ్యారు. అయితే ఆ పోటీ ఆదివారం రోజున నిర్వహించబడుతుండటంతో అతను అందులో పాల్గొనుటకు నిరాకరించారు. ఏమనగా ప్రభువు కొరకు మాత్రమే కేటాయించబడిన పరిశుద్ధ దినముగా అతను ఆదివారమును పరిగణించారు. అయితే అందుకు బదులుగా మరొక రోజు నిర్వహించబడే 400 మీటర్ల పందెంలో పాల్గొనుటకు నిశ్చయించుకున్నారు. అందుకొరకు సరియైన శిక్షణ మరియు సిద్ధపాటు లేనప్పటికీ అతను ఆ పందెములో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. తనను ఘనపరిచిన వారిని దేవుడు నిశ్చయముగా ఘనపరుస్తాడనే సత్యమునకు ఇది ఒక మచ్చు తునక.

    లిడెల్ తాను క్రీడలలో సాధించిన ఘనతను సువార్తను పంచుకొనుటకు ఒక అవకాశముగా భావించారు. తద్వారా అనేకమంది యవ్వనస్థులను క్రీస్తు యొక్క వెలుగు వైపుకు నడిపించారు లిడెల్. నమ్రత కలిగిన యువ క్రీడకారుడైన అతను, ప్రఖ్యాతిని ఘనతను పొందుకున్నప్పటికీ, ఆ అద్భుతమైన భవిష్యత్తును విడిచిపెట్టి, చైనాలో మిషనరీగా సేవలందించుటకు అతని తల్లిదండ్రుల అడుగుజాడలను అనుసరించారు. చైనాకు వెళ్ళే ముందుగా ఈడెన్‌బర్గ్‌లోని 'స్కాటిష్ కాంగ్రిగేషనల్ కాలేజ్' లో సేవ కొరకైన శిక్షణ పొందారు.

    1925వ సంll లో చైనాకు వచ్చిన అతను, టియెంట్సిన్‌లోని  'ఆంగ్లో-చైనీస్ క్రిస్టియన్ కాలేజ్' లో విజ్ఞానశాస్త్రం, ఆంగ్లం మరియు క్రీడలను బోధించారు. ఒక దేశాన్ని మార్చాలంటే పాశ్చాత్య విజ్ఞానం మరియు క్రైస్తవ విలువలతో కూడిన ఒక విద్యార్థుల తరమును లేవనెత్తవలెనని అతను విశ్వసించారు. 1941వ సంll లో జపాన్ దళాలు చైనాపై దాడి చేసినప్పుడు, ఆంగ్లదేశ పౌరులు చైనా విడిచి వెళ్ళవలెనని ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. అయినప్పటికీ, లిడెల్ తన కుటుంబాన్ని మాత్రం పంపించి, తాను చైనాలోనే ఉండిపోయారు. తత్ఫలితంగా జపాన్ సైనికులకు పట్టుబడ్డారు. ఆ యుద్ధ సమయంలో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, సరియైన ఆహారం లేకపోయినప్పటికీ, అతను చైనావారికి సేవలందించుటకు కాలినడకన మరియు సైకిల్‌పై ప్రయాణించేవారు. ఒకసారి 'ఖైదీల మార్పిడి' పధ్ధతి ప్రకారం లిడెల్‌కు చైనాను విడిచి వెళ్ళే అవకాశం దొరికింది. అయితే అతను తన స్థానాన్ని మరొక గర్భిణీ స్త్రీకి ఇచ్చి తాను బంధీగానే ఉండిపోయారు. అతను తన మిగిలిన జీవితమంతా యుద్ధ శిబిరాలలో ఆదివారపు కూడికలను నిర్వహిస్తూ గడిపారు. తీవ్రమైన పోషకాహార లోపం కారణంగా ఎంతో బలహీనపడిపోయిన ఎరిక్ లిడెల్, 1945వ సంll లో ఈ ప్రపంచ యుద్ధములను విడిచిపెట్టి పరలోకములో తన సృష్టికర్తతో కలిసి నిత్య శాంతిలో జీవించుటకు వెళ్ళారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీకు ముఖ్యమైనది ఏది–క్రైస్తవునిగా గుర్తింపు పొందడమా లేక ప్రాపంచిక ఘనత పొందడమా?


    ప్రార్థన :

    "ప్రభువా, లిడెల్ వలెనే శ్రమలను సహించి, ఓర్పుతో మరియు ధైర్యముతో విశ్వాస పరుగులో ముందుకు సాగుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Feb 12, 2022

    Eleanor Ardel Vietti Life History

    ఎలియనోర్ ఆర్డెల్ వియెట్టి  జీవిత చరిత్ర




    • జననం: 05-11-1927
    • మహిమ ప్రవేశం: తెలియదు
    • స్వస్థలం: ఫోర్ట్ వర్త్
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: దక్షిణ వియత్నాం

    ఎలియనోర్ ఆర్డెల్ వియెట్టి అమెరికాకు చెందిన మిషనరీ. ఆమె వియత్నాం యుద్ధం యొక్క అత్యంత క్లిష్టమైన సమయంలో వియత్నాంలో ప్రభువుకు సేవ చేశారు. ఆమె యొక్క యుక్తవయస్సులో ఒక తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ నుండి దేవుడు ఆమెను అద్భుతముగా స్వస్థపరచగా, దేవుని కేవలం ఆరాధించుట కంటే మరి అధికముగా ఆయనకు చేయుటకు తాను పిలువబడుతున్నట్లు ఆమె గ్రహించారు. ఆమె కళాశాలలో చదువుకుంటున్నప్పుడు ఆసుపత్రి భోజనశాలలో మధ్యాహ్న భోజనం చేయుటకు ముందు ఆహారము కొరకు ప్రార్థిస్తున్న ఒక యువతుల గుంపును ఆమె చూశారు. వారితో ఆమె ఏర్పరచుకున్న అనుబంధం ‘క్రిస్టియన్ అండ్ మిషనరీ అలయన్స్ చర్చ్‌’ అనే సంఘములో ఆమె సహవాసం కలిగియుండుటకు దారి తీసింది. ఆ చర్చిని సందర్శించే అనేక మంది మిషనరీల సాక్ష్యాలను వినిన వియెట్టి కూడా తన వైద్యశాస్త్ర చదువును పూర్తి చేసుకొనిన తరువాత మిషనరీ సేవకు తనను సమర్పించుకున్నారు.


    కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత ఎదురైనప్పటికీ, దేవుని పిలుపు యొక్క నిశ్చయతతో డాll ఎలియనోర్ వియత్నాంకు పయనమయ్యారు. ఆ సమయంలో వియత్నాం దేశంలో రాజకీయ అస్థిరత నెలకొనియుంది. అక్కడ ఆమె ‘బాన్ మీ థౌట్’ అనే ఆసుపత్రిలో ముదిరిన దశలో ఉన్న కుష్ఠు రోగులకు చికిత్స చేయడం ప్రారంభించారు. అమెరికా వారికి వ్యతిరేకంగా ఉన్న గెరిల్లాలు కూడా ఆమె యొక్క ప్రేమా సంరక్షణలను పొందుకున్నారు. తన యొద్దకు వచ్చే రోగులను వారి మూఢ నమ్మకాల నుండి ఆమె సువార్త సహాయంతో విడిపించగలిగారు. ప్రజలకు ప్రాథమిక దశలోనే కుష్ఠు వ్యాధిని నిర్ధారించి, వారికి బాగుపడే అవకాశాలను మెరుగుపరచుటకు ఇంటింటిని దర్శించవలెనని ఆమె అరణ్యాలను దాటుకుంటూ ప్రయాణించారు. ఆమె ఆసుపత్రి ఆవరణలో ప్రార్థనా సమావేశాలు మరియు కూడికలు కూడా నిర్వహించారు.


    1962వ సంll ఏప్రిల్ మాసంలో ఆమె అమెరికాలోని తన కుటుంబమును స్వల్ప సమయం సందర్శించి, ఒక నెలలోగానే మిషన్ కేంద్రమునకు తిరిగి వచ్చారు. 1962వ సంll మే 30 తారీఖున, ‘వియెట్ కాంగ్’ అనే ఒక విప్లవాత్మక రాజకీయ సంస్థ ఆమె పనిచేస్తున్న ఆసుపత్రిపై దాడి చేసి దానిని దోచుకున్నారు. వారు బైబిళ్ళను ధ్వంసం చేశారు. తుపాకీతో బెదిరించి వారు ముగ్గురు మిషనరీలను తమతో తీసుకువెళ్ళారు. ఆ ముగ్గురిలో డాll ఎలియనోర్ ఆర్డెల్ వియెట్టి ఒకరు.


    ఆమె అపహరించబడినప్పుడు వియెట్టి వయస్సు కేవలం 34 సంవత్సరాలు. అప్పటి నుండి ఆమె ఆచూకీ గురించి ఎటువంటి సమాచారం లేదు. 40 సంవత్సరాల పాటు శోధించిన తరువాత, 1991వ సంll లో అమెరికా ప్రభుత్వం ఆమెను “చనిపోయినట్లుగా భావించబడింది” అన్న జాబితాలో ఆమెను చేర్చింది.


    కొన్నిసార్లు దేవుడు తన ప్రియమైన సేవకులైన వారి అంతం ఏమైనదని ప్రపంచానికి తెలియజేయడు. అటువంటివారు ఆనాటి హనోకు, మోషే మరియు ఆధునిక కాలంలో ఎలియనోర్ ఆర్డెల్ వియెట్టి అని చెప్పవచ్చునేమో!

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 


    ప్రియమైనవారలారా, భోజనం చేయుటకు ముందు మీరు ఆహారము కొరకు చేసే చిన్న ప్రార్థన కూడా ఒక వ్యక్తిని దేవుని వైపుకు నడిపించగలదని మీకు తెలుసా?

    ప్రార్థన :


    ప్రభువా, ఎటువంటి పరిస్థితులలో అయినా ప్రజలలో బహిరంగముగా ధైర్యముతో ప్రార్థించగలుగునట్లు నాకు కృపననుగ్రహించుము. ఆమేన్!

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Eliza Davis George Life History

    ఎలిజా డేవిస్ జార్జ్ జీవిత చరిత్ర



    • జననం: 1879
    • మహిమ ప్రవేశం: 1979
    • స్వస్థలం: టెక్సాస్
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: లైబేరియా


    ఎలిజా డేవిస్ జార్జ్ ఒక ఆఫ్రికన్-అమెరికన్ మిషనరీ. ఆమె లైబేరియాలో తాను చేసిన పరిచర్యకు పేరుగాంచారు. గతంలో బానిసలుగా ఉన్న తల్లిదండ్రులకు జన్మించిన ఎలిజా, తన పదహారేళ్ల వయసులో క్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించారు. సెంట్రల్ టెక్సాస్ కళాశాల నుండి పట్టభద్రులైన పిమ్మట ఆమె అదే కళాశాలలో బోధించడం ప్రారంభించారు.

    1911వ సంll లో ఎలిజా ఒక క్రైస్తవ కూడికకు హాజరవ్వడం జరిగింది. అక్కడ ఆమె వినిన ప్రసంగం దేవునికి పరిచర్య చేయుట గురించి సవాలు చేసేదిగా ఉంది. అటు తరువాత ఒకసారి ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దర్శనమును చూశారు. ఆ దర్శనములో ఆఫ్రికా ప్రజలు క్రీస్తు న్యాయసింహాసనము ఎదుట నిలువబడి, “కానీ, మా కొరకు నీవు చనిపోయావని ఎవరూ మాకు చెప్పలేదు.” అని చెబుతూ విలపిస్తున్నారు. వెంటనే ఎలిజా ఆఫ్రికాలో సేవ చేయమని దేవుడు తనను అడుగుతున్నాడని తన హృదయమందు గ్రహించారు.

    తాను ఆఫ్రికాకు వెళ్ళాలనుకుంటున్నట్లు ఆమె తెలియపరచినప్పుడు ఆమెకు ఎంతో వ్యతిరేకత ఎదురయ్యింది. “అమెరికాలో చేయవలసినది ఇంకా చాలా ఉంది.” అని ఇతరులు ఆమెను నిరుత్సాహపరిచారు. అయినప్పటికీ, తన మిషన్‌కు మద్దతును పొందేందుకు ఆమె రెండు సంవత్సరాల పాటు పట్టుదలతో వేచియున్నారు. తనను వ్యతిరేకించేవారికి ఆమె ఇచ్చే సమాధానం “దేవుడు వెళ్ళు అని చెప్పినప్పుడు మీరు ఉండిపోమని చెబుతారా?”

    చేతిలో ఉన్న కొద్దిపాటి నిధులతో 1914వ సంll లో లైబీరియాలోని మోన్రోవియా చేరుకున్నారు ఎలిజా. తరువాత సినో కౌంటీలోని అంతర్గత భాగాలకు వెళ్ళిన ఆమె, అక్కడ బోధించడం మరియు సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. పిల్లలకు బైబిలు చదవడంతోపాటు కొన్ని జీవన నైపుణ్యాలను నేర్పించేందుకు ఆమె ‘బైబిల్ ఇండస్ట్రియల్ అకాడమీ’ అనే పాఠశాలను స్థాపించారు. ఆమె చేసిన గ్రామ పరిచర్య అభివృద్ధి చెందగా ఒక ఏడాదిలోగానే వెయ్యి మంది ప్రజలు క్రీస్తును అంగీకరించారు.

    నిధుల కొరత కారణంగా 1919వ సంll లో బాప్తిస్టు చర్చి ఆమె మిషన్‌ను రద్దు చేసింది. కాగా తాను అక్కడ నుండి వెళ్లిపోవాల్సి వస్తుందని ఎలిజా భయపడుతున్న సమయంలో, బ్రిటిష్ మిషనరీయైన డాll చార్లెస్ జార్జ్ ఆమెను వివాహం చేసుకొనుటకు ముందుకువచ్చారు. కాగా 1939వ సంll లో చార్లెస్ మరణించే వరకు కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ మిషనరీ దంపతులు లైబేరియాలో పరిచర్యను కొనసాగించారు. అయితే, అతని మరణం తరువాత కూడా 33 సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోయిన ఎలిజా, 27 క్రైస్తవ సంఘములను స్థాపించారు మరియు వందలాది మంది యవ్వనస్థులకు పరిచర్య కొరకైన శిక్షణనిచ్చారు.

    91 సంవత్సరాల వయస్సులో ఉష్ణమండల క్యాన్సర్ కారణంగా ఆమె సరైన చూపు లేక మరియు సరిగా నడవలేకయున్నప్పుడు కూడా ఆమె తన చేతి కర్ర సహాయముతో వెళుతూ దేవుని వాక్యము నుండి ప్రజలకు ఆలోచన చెబుతూ ఉండేవారు. చివరికి ఈ లోకంలో తన పరుగును విజవంతముగా కడముట్టించి వంద సంవత్సరాల నిండు వృద్ధాప్యమందు ప్రభు సన్నిధానమును చేరుకున్నారు ఎలిజా డేవిస్ జార్జ్.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 


    ప్రియమైనవారలారా, వెళ్ళి సేవ చేయమని దేవుడు మిమ్ములను పిలువగా మీరు ఇంకా వెళ్ళక నిలిచియుంటున్నారా?

    ప్రార్థన :


    ప్రభువా, నా హృదయ కాఠిన్యమును క్షమించి, అవసరతయున్న స్థలమునకు నన్ను పంపుము. ఆమేన్!

    దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • Dec 4, 2021

    Eduru Chusina Kaalam | ఎదురుచూసిన కాలం

    Eduru Chusina Kaalam | ఎదురుచూసిన కాలం


    ఎదురుచూసిన కాలం - ప్రత్యక్ష పరిచెను దైవం ప్రవక్తల ప్రవచన సారం - నెరవేరిన వైనం 

    Happy happy Christmas 

    Mery mery Christmas ||ఎదురు||


    రక్షకుడు పుట్టినాడు బెత్లహేములో - రక్షించు దేవుడండి

    రక్షకుడు పుట్టినాడు బెత్లహేములో - హల్లెలూయా 


    కన్య మరియ గర్భం - పరిశుద్దాత్మ ప్రభావం దావీదు సింహాసనం - అధిష్టించే ప్రభు నీ జననం (2) 

    Happy happy Christmas 

    Mery mery christmas ||ఎదురు||

    సంతోషమే సమాధానమే - ఈ మనుష్యులందరికి ఆనందమే ఉత్సాహమే - రక్షణ సంతోషమే (2)


    కన్య మరియ గర్భం - పరిశుద్దాత్మ ప్రభావం దావీదు సింహాసనం - అధిష్టించే ప్రభు నీ జననం (2) 

    Happy happy Christmas 

    Mery mery christmas ||ఎదురు||


    యేసు సార్ధక నామధేయం- ఇమ్మానుయేలు ప్రత్యక్షం అనాది సంకల్పం నెరవేరిన శుభసమయం(2) 

    Happy Happy christmas 

    Mery mery christmas (2) ||ఎదురు||


    దేవ దేవుని ప్రభోదం - దివ్య మహిమ ప్రకాశం ధరణిపై దేవదూతల గానం - శాంతి సమాధానం (2)

    Happy Happy christmas 

    Mery mery christmas (2) ||ఎదురు||

    సంతోషమే సమాధానమే - ఈ మనుష్యులందరికి ఆనందమే ఉత్సాహమే - రక్షణ సంతోషమే (2)


    లోక రక్షకుని జననం - లోకమంత వెలుగు ప్రకాశం పాపశాప భారం - భరియించే ఆశ్రయ దుర్గం (2) 

    Happy happy Christmas 

    Mery mery Christmas (2) ||ఎదురు||

    రక్షకుడు పుట్టినాడు బెత్లహేములో - రక్షించు దేవుడండి

    రక్షకుడు పుట్టినాడు బెత్లహేములో - హల్లెలూయా


    పరమ పవిత్రం - పరిశుద్దని జననం 

    పరమ గురువుని దర్శనం - జనులందరి భాగ్యం (2)

    Happy Happy christmas 

    Mery mery christmas ||ఎదురు||



  • WhatsApp
  • Nov 16, 2021

    Entha deenathi Deenamo | ఎంత దీనాతి దీనమో | Telugu Christmas Song

    Entha deenathi Deenamo | ఎంత దీనాతి దీనమో | Telugu Christmas Song


    ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా (2) 

    నీ జనన మెంత దయనీయమో తలచుకుంటె 

    నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది 


     1.నీ సృష్టిలో ఈ లోకమే నీవు 

    మాకు ఇచ్చినా సత్రమయ్యా (2) 

    ఆ సత్రములో ఓ యేసయ్యా 

    నీకు స్థలమే దొరకలేదయ్యా (2) ||ఎంత|| 


     2.నిండు చూలాలు మరియమ్మ తల్లి 

    నడువలేక సుడివడి పోయేనయ్యా (2) 

    దిక్కుతోచక ఓ యేసయ్యా 

    పశువులపాకలో ప్రసవించెనయ్యా (2) ||ఎంత|| 


     3.చల్లగాలిలో చాటు లేక 

    నలుమూలలా చలిపుట్టెనయ్యా (2) 

    పసికండువై ఓయేసయ్యా తల్లి 

    ఒడిలో ఒదిగినావయ్యా (2) ||ఎంత|


  • WhatsApp
  • Nov 10, 2021

    Elka of Wai Wai | వైవైకు చెందిన ఎల్కా

    వైవైకు చెందిన ఎల్కా | Elka of Wai Wai 





    • జననం: 1933
    • మహిమ ప్రవేశం: -
    • స్వస్థలం: కనాషెన్
    • దేశం: గయానా
    • దర్శన స్థలము: గయానా మరియు బ్రెజిల్

     అమెజాన్ అరణ్యాలలో నివసించే వై వై అనే ఒక క్రూరమైన తెగ యొక్క నాయకుడైన ఎల్కా, బ్రెజిల్ అడవులలోని అనేక తెగల ప్రజలను క్రీస్తు నొద్దకు నడిపించినవానిగా పేరుగాంచారు. వై వై తెగవారు మూఢ నమ్మకాలు కలిగినవారై అడవులలోని ఆత్మలకు భయపడుతుండెడివారు. మంచి శరీర దారుఢ్యం కలిగి శక్తిశాలిగా ఎంచబడిన ఎల్కా రెండు పదుల వయస్సులోనే ఆ తెగకు నాయకుడయ్యారు. అయినప్పటికీ, మాంత్రిక వైద్యునిగా మారుటకు ఆత్మలు తనను పిలుస్తున్నాయనే నమ్మకం అతనిలో కలిగింది. కాగా అతను అడవులలోని మంత్రతంత్రాలను నేర్చుకుని, ఆత్మలను పిలుచుట ద్వారా ప్రజల రోగాలను చాకచక్యంతో ఏదో ఒకవిధంగా నయం చేసేవారు. అయితే, మరణం తరువాత ఏమి సంభవించునోయనే భయము ఎల్లప్పుడూ అతనిని వెంటాడుతుండెడిది. దాని నుండి తనకు తాను విడుదలనొందలేకపోయారు ఎల్కా.
     శ్వేతజాతీయుల పట్ల ద్వేషాన్ని కలిగియున్నారు ఎల్కా. కావున అతను వారిని చిరునవ్వుతో ఆహ్వానించి, వారికిచ్చే పానీయాలలో విషం కలిపి, వారిని కొట్టి చంపేవారు. అయితే, ఒక రోజు నీల్ మరియు బాబ్ హాకిన్స్ అనే మిషనరీలు వారితోపాటు బహుమతులను తీసుకొని అక్కడికి వచ్చారు. వారు యేసు క్రీస్తు ప్రభువు వై వై ప్రజలను ప్రేమిస్తున్నాడనియు ఆ ప్రేమను బట్టి ఆయన వారి కొరకు మరణించాడనియు వారికి చెప్పారు. ప్రతిఫలము కొరకు మాత్రమే ప్రేమను కనుపరిచే వై వై ప్రజలకు ఈ విధమైన ప్రేమ ఎంతో క్రొత్తగా తోచింది. ఎల్కా వారిని మొదట పరిహసించారు కానీ మరణం తరువాత ఉన్న నిరీక్షణను గురించి వారు చెప్పినది విని సంతోషించారు.
     తదుపరి బహుమతుల పొందుట కొరకు బైబిలు గ్రంథమును స్థానిక భాషలోకి అనువదించడంలో సహాయం చేయుటకు ఎల్కా అంగీకరించారు. అందులో భాగంగా ఒక రోజు అతను "ప్రేమలో భయముండదు; అంతేకాదు; పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును; ...ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము." (1 యోహాను 4:18,19) అనే వచనభాగాలను తర్జుమా చేస్తున్నప్పుడు అందులో వ్రాయబడిన మాటలు అతని హృదయాన్ని కదిలించాయి. తద్వారా అతను తన పాపాలను ఒప్పుకొని, తనను ఒక నూతన వ్యక్తిగా మార్చమని దేవునిని వేడుకొన్నారు. అతను ఆ విధంగా మారుటను గూర్చి అతని కుటుంబ సభ్యులు అతనిని అపహసించినప్పటికీ, త్వరలోనే వారు ఎల్కా యొక్క మారిన జీవితమును గ్రహించగలిగారు. త్వరలోనే ఆ తెగ మొత్తమూ యేసు క్రీస్తు ప్రభువును తమ రక్షకునిగా అంగీకరించింది.
     హాకిన్స్ సోదరులలో ఒకరు స్వరాన్ని కోల్పోయినప్పుడు అతనికి బదులుగా ఎల్కా బోధించడం ప్రారంభించారు. త్వరలోనే ఇతర తెగలకు క్రీస్తును ప్రకటించాలనే భారం అతనిలో కలిగింది. తత్ఫలితంగా అతను గయానాలో చుట్టుప్రక్కల ఉన్న అడవులకు వెళ్ళి తమతో వైరం కలిగియున్న తెగల వారికి కూడా సువార్తను ప్రకటించారు. క్రీస్తును గూర్చిన సువార్త ఒక మాంత్రిక వైద్యుని మిషనరీగా మార్చటమే కాక, అతని ద్వారా అనేక తెగల వారి జీవితాలలో వెలుగును నింపింది.

    ప్రియమైనవారలారా, మరణానంతరం ఉండే నిత్యజీవము యొక్క ఆ దీవెనకరమైన నిరీక్షణ మీరు కలిగియున్నారా?

    "ప్రభువా, క్రీస్తులో ఉండే నిత్యజీవము యొక్క ఆ దీవెనకరమైన నిరీక్షణ యొద్దకు ఇతరులను నడిపించు భారమును నాకు దయచేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Nov 9, 2021

    Edward Winter Clark | ఎడ్వర్డ్ వింటర్ క్లార్క్

    ఎడ్వర్డ్ వింటర్ క్లార్క్ | Edward Winter Clark


    • జననం: 05-02-1830
    • మహిమ ప్రవేశం: 24-06-1913
    • స్వస్థలం: డచెస్ కౌంటీ, న్యూయార్క్
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: నాగాలాండ్, భారతదేశం

     అస్సాంలోని సిబ్‌సాగర్‌లో ఉన్న ఒక ప్రదేశంలో స్థానికులు ఒక యువ మిషనరీకి – ఒంటరిగా నిలిచియున్న నిలువుగా ఉండే ఒక పెద్ద బండరాయి లోపల ఒక ఆత్మ ఉందని, కాబట్టి ఎవరూ ఆ దారిలో వెళ్ళలేరని చెప్పారు. అయితే వారిని ఆశ్చర్యపరిచేలా ఆ యువ మిషనరీ ఆ బండ అంచుల వరకు వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చారు. ఆ విధంగా ఆత్మలకు భయపడే, శతృవుల తలలను తమ వద్ద ఉంచుకునే మరియు జంతువులను బలి ఇచ్చే వ్యక్తుల మధ్య సువార్తను వ్యాపింపజేసిన అమెరికాకు చెందిన ఆ యువ బాప్తిస్టు మిషనరీ ఎడ్వర్డ్ వింటర్ క్లార్క్. 

    14 సంll ల వయస్సులో బాప్తిస్మం తీసుకున్న ఎడ్వర్డ్ వింటర్ క్లార్క్, 1859వ సంll లో బోధకునిగా నియమితులయ్యారు. 1869వ సంll మార్చి మాసంలో అతను తన భార్యతో పాటు అస్సాంలోని సిబ్‌సాగర్‌కు చేరుకున్నారు. అక్కడ పరిచర్య చేయడం ప్రారంభించినప్పుడు అతను మైదాన ప్రాంతాలలో వ్యాపారం చేయుటకు పర్వత ప్రాంతాల నుండి అక్కడకు వచ్చిన అయో నాగ అనే తెగవారిని సంధించడం జరిగింది. ఈ తెగలకు సువార్త ప్రకటించుటకు అతనికి ఎంతో భారం కలిగింది. అయితే, బ్రిటిషువారు విధించిన ఆంక్షల కారణంగా నాగ కొండలలోకి ప్రవేశించడం అతనికి సాధ్యపడలేదు. 

    బ్రిటిషు వారి అనుమతి కొరకు వేచియున్న సమయంలో అతను గోధులా రూఫస్‌ అనే ఒక స్థానిక సువార్తికుడిని నాగ ప్రాంతంలోకి పంపగా, ఆ సువార్తికుడు క్రీస్తును అంగీకరించిన తొమ్మిది మందిని తనతో పాటు తిరిగి తీసుకువచ్చారు. ఈ పరిణామాల ఆధారంగా, చివరకు 1872వ సంll డిసెంబరు 18వ తారీఖున నాగా వారి భూభాగంలోకి ప్రవేశించిన క్లార్క్, అక్కడి స్థానికుల మధ్య పరిచర్య చేయడం ప్రారంభించారు. అతను వారి స్థానిక భాషను, స్వభావమును మరియు వైద్యమును నేర్చుకొనుటకు తన సమయాన్ని మరియు శక్తిని అంకితం చేశారు. అది అందరితో సంబంధాలను ఏర్పరచుకొనుటకును మరియు సువార్తను ప్రకటించుటకును అతనికి మార్గమును ఏర్పరచింది. త్వరలో అతను మొలుంగ్కిమోంగ్‌లో 15 మందితో కూడిన చిన్న సమాజంతో ఒక క్రైస్తవ సంఘమును స్థాపించారు.

    నూతన విశ్వాసులు తమ పాత నమ్మకాలు మరియు ఆచారాలను విడిచిపెట్టడం ప్రారంభించడంతో, నాగ గ్రామాలలో పెద్ద వివాదం తలెత్తింది. ఎంతో వ్యతిరేకత మధ్య, మంచి సంస్కృతి కలిగియుండుటకు స్థానికులను ఒప్పించేందుకు ఎంతో జాగ్రత్తతోను మరియు ప్రార్థనతోను నడుచుకున్నారు క్లార్క్. మునుపు అక్కడ ప్రబలంగా ఉన్న శతృవుల తలలను తమ వద్ద ఉంచుకొనుట, జంతుబలులు, పోరాటాలు, మద్యపానం వంటి నాగావారి జీవనవిధానాలు క్రమక్రమంగా ఆగిపోయాయి. గిరిజనుల సామాజిక స్థితిగతులను మెరుగుపరచుటకు నాగాలాండ్‌లోని అనేక ప్రాంతాలలో పాఠశాలలు మరియు క్రైస్తవాలయములను కూడా అతను స్థాపించారు. 1905వ సంll లో నూట తొంభై మంది నాగ ప్రజలు బాప్తిస్మం తీసుకున్నప్పుడు గొప్ప ఆత్మీయ ఆశీర్వాదం అక్కడ కనిపించింది.

    భారతదేశంలో నేడు క్రైస్తవ మతాన్ని అధికారిక మతంగా కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం నాగాలాండ్ కావడం ఎడ్వర్డ్ వింటర్ క్లార్క్ యొక్క నాలుగు దశాబ్దాల పరిచర్య ఫలముకు నిదర్శనముగా నిలుస్తుంది. ఆ దైవసేవకుడు 1913వ సంll లో తన పరమ యజమానుని చేరుకొన ఇహలోకమును విడిచి వెళ్ళారు.

    ప్రియమైనవారలారా, ప్రతిరోజూ మీరు సంధించే ప్రజలకు సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మీరు కలిగియున్నారు కారా?

    "ప్రభువా, మీ పరిశుద్ధ గ్రంథములో ఇవ్వబడిన మంచి సంస్కృతిని మరియు నడవడికను అవలంబించుటకు ఈ లోకమును ఒప్పించగలుగుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Oct 1, 2021

    Harry Schaeffer and Emma Sorgen | హ్యారీ షాఫెర్ మరియు ఎమ్మా సోర్గెన్

    హ్యారీ షాఫెర్ మరియు ఎమ్మా సోర్గెన్ |  Harry Schaeffer and Emma Sorgen


    • జననం: -
    • మహిమ ప్రవేశం: -
    • స్వదేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: భారతదేశం 

    ఎమ్మా సోర్గెన్ స్విట్జర్లాండ్‌లోని ప్రసిద్ధ నగరమైన బెర్నే నుండి పదిహేడు మైళ్ల దూరంలో జన్మించారు. ఆమెకు రెండు సంll ల వయస్సు ఉన్నప్పుడు, ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వెళ్ళారు. తదుపరి ‘చర్చ్ ఆఫ్ క్రైస్ట్’ సంఘములో సభ్యురాలుగా చేరిన ఎమ్మా, తాను ఒక మిషనరీ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆమె హీరామ్ కళాశాలలో చదువుకున్నారు మరియు చికాగోలోని పెస్టలోజీ-ఫ్రోబెల్ కిండర్‌గార్టెన్ కళాశాల నుండి పట్టభద్రురాలయ్యారు. పిమ్మట రెండేళ్ళపాటు అధ్యాపకురాలిగా పనిచేసిన ఆమె, ఆపై మిషనరీగా భారతదేశానికి వెళ్ళేందుకు సిద్ధపడుటకుగాను ‘కాలేజ్ ఆఫ్ మిషన్స్’ అనే కళాశాలలో చేరారు.


    ఓహియోకు చెందిన హ్యారీ షాఫెర్ తన ఉన్నత విద్యను పూర్తిచేసుకొనిన పిమ్మట ‘కాలేజ్ ఆఫ్ మిషన్స్’ కళాశాలలో చేరారు. అక్కడ అతను ఎమ్మా సోర్గెన్‌ను కలవడం జరిగింది. వారిరువురు కూడా భారతదేశానికి వెళ్ళుటకు ఎంతో అత్యాసక్తితో ఉన్నారు. 1913వ సంll జూన్ మాసంలో ఓహియోలోని కెంటన్‌లో వారిరువురికి వివాహం జరిగింది. అదే సంవత్సరం శరదృతువులో వారు భారతదేశానికి పయనమయ్యారు.


    భారతదేశంలో వారి మొదటి కొన్ని నెలలు లక్నోలోని యూనియన్ లాంగ్వేజ్ స్కూలులో గడిపారు. తరువాత వారు రథ్ ప్రాంతములోను, పిమ్మట పెండ్రా రోడ్‌లోను సువార్త పరిచర్యను జరిగించారు. వారు గ్రామం నుండి గ్రామానికి వెళ్ళి గుడారాలలో నివసిస్తూ, అనేకమందికి సువార్తను ప్రకటించారు. కొంతకాలం సెలవు తీసుకొనిన పిమ్మట, 1920వ సంll ప్రాంతంలో, ఆ మిషనరీ దంపతులు బిలాస్‌పూర్‌కు తరలి వెళ్ళారు. అక్కడ షాఫెర్ స్థానిక సంఘము యొక్క బాధ్యతలను చేపట్టారు, గ్రామాలలో సువార్త పరిచర్యను మరియు బాలుర పాఠశాలలను పర్యవేక్షించారు మరియు ఆ పెద్ద మిషన్ స్టేషన్ యొక్క నిర్వాహక బాధ్యతలను కూడా చూసుకున్నారు. అంతేకాదు, ‘జాక్మన్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ నర్స్ ట్రైనింగ్ స్కూల్’ (జాక్మన్ స్మారక ఆసుపత్రి మరియు నర్సుల శిక్షణ పాఠశాల) మరియు తరువాత బాలికల కొరకు ఏర్పరచబడిన ‘బర్గెస్ మెమోరియల్ హై స్కూల్’ (బర్గెస్ స్మారక ఉన్నత పాఠశాల) యొక్క భవన నిర్మాణాలను కూడా పర్యవేక్షించారు. 1926వ సంll లో వారి సెలవు దినములు ముగిసిన తరువాత, వేరొక సంస్థ తరపున కాక, వారు స్వతంత్ర మిషనరీలుగా భారతదేశానికి తిరిగి వచ్చి, బిలాస్‌పూర్‌లో ఉన్నారు.


    1946వ సంll ఏప్రిల్ మాసంలో కలకత్తా నగరంలో షాఫెర్ మరణించే వరకు కూడా వారు స్వతంత్య్రముగానే బిలాస్‌పూర్‌లో మిషనరీ సేవను కొనసాగించారు.

    ప్రియమైనవారలారా, మీ హృదయ వాంఛ ఏమిటి? దేవుని రాజ్యము కొరకు పని చేయవలెననా లేదా మీ స్వంత అవసరతల కొరకు పని చేయవలెననా? 


    "ప్రభువా, నేను ఉంచబడిన స్థలములో మీకు నమ్మకముగా సేవ చేయుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"దేవునికే మహిమ కలుగునుగాక! 

  • WhatsApp
  • Sep 24, 2021

    Emma Cushman | ఎమ్మా కుష్మన్

    ఎమ్మా కుష్మన్ | Emma Cushman


    Emma Cushman


    • జననం: 1863
    • మహిమ ప్రవేశం: 1931
    • స్వస్థలం: బర్లింగ్టన్, న్యూయార్క్
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: కొనియా, ఆసియా మైనర్


     మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన అర్మేనియన్ మారణహోమం ప్రపంచ చరిత్రలో అత్యంత కౄరమైన సంఘటనలలో ఒకటి అని చెప్పవచ్చు. టర్కీవారు దాదాపు పది లక్షల మంది అర్మేనియన్లను చంపి, స్త్రీలను మరియు పిల్లలను బలవంతముగా ఇస్లాం మతంలోకి మార్చారు. వేలాది మంది క్రైస్తవులు తమ ప్రాంతాలను విడిచిపెట్టి వెళ్ళవలసిన పరిస్థితులు నెలకొనగా, వారు ఎడారి గుండా నడిచీ నడిచి తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే, అటువంటి ద్వేషం మరియు కౄరత్వంతో నిండినవారికి కూడా తనను సేవించే మిషనరీల ద్వారా తన పరమ ప్రేమను కనుపరచటం దేవుని దృష్టిలో యుక్తమైనదిగా కనబడింది. అందుకొరకై ఆయన ఎన్నుకొనినవారిలో ఎమ్మా కుష్మన్ ఒకరు.


     అమెరికాకు చెందిన నర్సు అయిన ఎమ్మా డార్లింగ్ కుష్మన్ ఆసియా మైనర్‌లోని గొప్ప నగరమైన కొనియాలోని ఒక ఆసుపత్రిలో సేవచేశారు (ఈ నగరం అపొస్తలుడైన పౌలు కాలంలో ఉన్న ‘ఈకొనియ’ నగరం). అక్కడి ఆసుపత్రిలో హెడ్ నర్సుగా ఉన్న ఆమె, అమెరికన్లను మరియు అర్మేనియన్లను ద్వేషించే అదే టర్కులు గాయపడియున్నప్పుడు వారికి పరిచర్య చేశారు. ఒకసారి గాయపడిన ఒక టర్కీ వ్యక్తి ఆమె పనిచేస్తున్న ఆసుపత్రిలో చేర్చబడ్డాడు. అతను అక్కడ గోడపై వ్రేలాడుతున్న యేసుక్రీస్తు చిత్రపటమును తీసివేయాలని పట్టుబట్టాడు. అప్పుడు కుష్మన్ "కుదరదు, అది యేసు యొక్క చిత్రపటం. ఆయన దేవుడు ప్రేమయైయున్నాడని జనులకు బోధించిన గొప్ప వైద్యుడు... ఆయన దానిని నాకు బోధించడం వలనను మరియు ఆయన అడుగుజాడలను అనుసరించి ఆయనను వెంబడించమని నన్ను పిలుచుట వలననే మీరు స్వస్థతనొందునట్లు సహాయపడుటకు నేను ఇక్కడ ఉన్నాను." అని నిక్కచ్చిగా సమాధానమిచ్చారు. కావున, తాను స్వస్థత పొందిన తరువాత ఆ చిత్రపటం సంగతి గురించి ఆలోచించవచ్చునని ఆ వ్యక్తి తలంచాడు. అయితే, ఆసుపత్రిలో గడిపిన సమయంలో అతను కుష్మన్ మరియు ఇతర అర్మేనియన్ నర్సులలో క్రీస్తు ప్రేమను చూశాడు. కాగా అతను ఆసుపత్రి నుండి వెళ్ళిపోయే సమయం వచ్చేటప్పటికి అతని హృదయం పూర్తిగా మారిపోయింది. అంతటి ధైర్యవంతురాలు మరియు ప్రేమ నిండిన హృదయం గలిగిన స్త్రీ కుష్మన్!


     మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భయంకరమైన మారణహోమం నెలకొనియున్న పరిస్థితుల మధ్య, కుష్మన్ మరియు ఆమె యొక్క నర్సుల బృందం గాయపడిన టర్కులకు మరియు అర్మేనియన్లకు సేవ చేశారు. ఒకవైపు ఆమె ప్రాణాలే మరణచ్ఛాయలో ఉన్నటువంటి పరిస్థితులలో ఆమె ఎంతోమంది అర్మేనియా బాలబాలికలను మరణపుటంచులలో నుండి వెలికితీసి రక్షించారు. యుద్ధ సమయంలో అనాథలైన అనేక మంది పిల్లల సంరక్షణా బాధ్యతలను చేపట్టిన ఆమె వారికి చదవడం, రాయడం నేర్పించడమే కాక వారు తమ కాళ్ళ మీద తాము నిలబడగలుగునట్లు కుట్టుపని మరియు తోలు కత్తిరించడం వంటి ఇతర నైపుణ్యములను నేర్చుకొనుటకు కూడా వారికి సహాయపడ్డారు. ఆ విధముగా తన సేవలో ఇతరులకు దేవుని ప్రేమను కనుపరిచిన ఎమ్మా కుష్మన్, చివరి వరకు కూడా తన యొక్క మిషనరీ పిలుపులో నమ్మకముగా నిలిచారు.


    ప్రియమైనవారలారా, మీరు మీ శతృవులను ప్రేమించుచున్నారా?


    ప్రభువా, మీ కొరకు నేను ధైర్యముగా నిలబడగలుగునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్!"


    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Sep 2, 2021

    Evalyn Gordon | ఇవాలిన్ గోర్డాన్

    ఇవాలిన్ గోర్డాన్ | Evalyn Gordon

    • జననం: - ----
    • మహిమ ప్రవేశం: 1935
    • స్వస్థలం: కలకత్తా
    • దేశం: భారతదేశం
    • దర్శన స్థలము: భారతదేశం


     మిషనరీ పరిచర్య జరింగించిన అనుభవం ఉన్న కుటుంబములో జన్మించారు ఇవాలిన్ ఎమ్. గోర్డాన్. అతని తల్లి యొక్క తండ్రిగారు సెరాంపూర్‌లో విలియం కేరితో కలిసి సేవ చేశారు. సెరాంపూర్‌ కళాశాలలో తన విద్యాభ్యాసమును పూర్తి చేసుకొనిన గోర్డాన్, పిమ్మట ‘బాంబే గార్డియన్’ అనే వార్తాపత్రికలో పనిచేయడం ప్రారంభించారు. అక్కడ మోర్టన్ ఆడమ్స్ అనే అమెరికాకు చెందిన ఒక మిషనరీని గోర్డాన్ కలవడం జరుగగా, అతను ఇచ్చిన ప్రేరణ మూలముగా 1892వ సంll లో ‘డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్’ (క్రీస్తుని శిష్యులు) అనే సంస్థలో చేరారు గోర్డాన్.


     వెంటనే అతను ముంగేలిలో నివాసం ఏర్పరచుకొని, అక్కడ నుండి అనేక ఇతర గ్రామాలకు వెళుతూ సువానుర్త ప్రకటించారు. అతను చత్తీస్‌గఢ్ యొక్క మాండలికంలో క్రీస్తు జీవితమును క్లుప్తంగా వ్రాశారు. అది దానిని చదివిన వ్యక్తులను ఎంతగానో ప్రభావితం చేసింది. ఎంతగానో ప్రయత్నించిన తరువాత చివరకు హీరా లాల్ అనే అన్యుడిని క్రీస్తు కొరకు సంపాదించగలిగారు గోర్డాన్. హీరా లాల్ తన కుటుంబము నుండి కలిగిన అడ్డంకులను ఎలా అధిగమించి క్రీస్తుపై తన విశ్వాసమును చాటిచెప్పాడో చూసిన చాలా మంది తమ విశ్వాసమును బహిరంగముగా అంగీకరించడం ప్రారంభించారు.


     ఆ విధంగా అప్పుడే విచ్చుకుంటున్న మొగ్గ వలె ఉన్న పరిచర్యను చేస్తున్నటువంటి సమయములో తనకు తగిన సహాయమును అన్నా డన్‌ ద్వారా పొందగలిగారు గోర్డాన్. 1896వ సంll లో వారిరువురికి వివాహం జరిగింది. ఔషధ శాస్త్రములో శిక్షణ పొందిన అన్నా డన్‌, ముంగేలిలో జరుగుచున్న పరిచర్యలో ప్రధానంగా ప్రజలకు వైద్య సహాయం అందించడం ద్వారా గోర్డాన్‌కు తోడ్పడ్డారు. ఆమె ప్రేమ, సహనం మరియు వైద్య సేవలను అందించడంలో నైపుణ్యం అనేక మందిని క్రీస్తు వైపుకు ఆకర్షించాయి. ఒకసారి ప్రాణాంతక కణితి ఉన్న ఒక యువతి అన్నా యొక్క ఆసుపత్రిలో చేరగా, అన్నా యొక్క సేవలో క్రీస్తు ప్రేమను చూసిన ఆ యువతి తల్లిని సేవలో ఆమె చూపిన శ్రద్ధ ఎంతగానో ఆకట్టుకుంది. తద్వారా ఆమె ఒక క్రైస్తవురాలిగా మారింది. హీరా లాల్‌తో పాటు అనేక మంది యువతులకు నర్సుగా సేవలందించుటకు అన్నా శిక్షణనిచ్చారు. ప్రతిదినము ఉదయమున వైద్య సేవలను ప్రారంభించే ముందు సువార్త ప్రకటించబడేలా ఆమె చూసుకునేవారు.


     భయంకరమైన కరువు సంభవించిన సమయంలో గోర్డాన్ దంపతులు వందలాది మంది పిల్లల ప్రాణాలను కాపాడారు. పరిచర్య చేసిన కాలంలో వారు అనాథాశ్రమాలను, కుష్ఠురోగులకు గృహాలను, శిక్షణ కేంద్రాలను మరియు ఆదివారపు బైబిలు పాఠశాలలను (సండే స్కూల్స్) స్థాపించారు. పరిచర్య అభివృద్ధి చెందగా మిషన్ యొక్క సరిహద్దులు విస్తరించాయి. భారతదేశంలో మంచి పరిచర్య జరిగించిన తరువాత ఈ మిషనరీ దంపతులు 1908వ సంll లో అమెరికాకు వెళ్ళిపోయారు. తమ మిగిలిన జీవితమును క్రైస్తవ సంఘము యొక్క పరిచర్యలో చురుకుగా పాలుపంచుకుంటూ గడిపిన గోర్డాన్ దంపతులు, చివరి వరకూ దేవుని సేవలో ముందుకు సాగిపోయారు.


    🚸 *ప్రియమైనవారలారా, మీరు చేసే సేవలో ఈ లోకం క్రీస్తు ప్రేమను చూడగలుగుతుందా?* 🚸


    🛐 *"ప్రభువా, ప్రతి పరిస్థితిలోను మరియు జీవితము యొక్క ప్రతి భాగములోను నేను క్రీస్తు ప్రేమను ప్రతిబింబించేలా నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"* 🛐


    🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏

    *******


  • WhatsApp