జాన్ వెస్లీ జీవిత చరిత్ర
- జననం : 17-06-1703
- మరణం : 02-03-1791
- స్వస్థలం : లింకన్‌షైర్
- దేశం : ఇంగ్లాండు
- దర్శన స్థలము : ఇంగ్లాండు
ఆంగ్లేయుడైన జాన్ వెస్లీ ఒక క్రైస్తవ మతాధికారి మరియు సువార్తికుడు. అతను తన సోదరుడైన చార్లెస్ వెస్లీతో కలిసి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో మెథడిస్ట్ ఉద్యమానికి పునాది వేశారు. ఒక దైవభక్తి గల కుటుంబంలో జన్మించిన వెస్లీ, క్రైస్తవ విలువలతో, కఠినమైన క్రమశిక్షణతో పెరిగారు. ఆక్స్‌ఫర్డ్‌లోని ‘క్రైస్ట్ చర్చ్’ నుండి పట్టా పొందిన పిమ్మట 1725వ సంll లో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో డీకన్‌గా నియమితులయ్యారు. ఆక్స్‌ఫర్డ్‌లో ఉన్నప్పుడు అక్కడి ‘హోలీ క్లబ్’ లో చురుకైన సభ్యునిగా ఉన్న వెస్లీ, ప్రార్థనలు, బైబిలు పఠనాలు మరియు చెరసాల పరిచర్యలో ఉత్సాహంగా పాల్గొనేవారు. అతను 1728వ సంll లో పాదిరిగా నియమించబడి ఉత్తర లింకన్‌షైర్‌లో పరిచర్య ప్రారంభించారు.
జేమ్స్ ఓగెల్‌థార్ప్ యొక్క అభ్యర్థన మేరకు 1735వ సంll లో అతను న్యూ వరల్డ్ (జార్జియాలో కొత్తగా స్థాపించబడిన కాలనీ) లోని ప్రజలకు సువార్త వెలుగును ప్రసరింపజేయవలెనని ఎంతో ఆసక్తితో బయలుదేరారు. అయితే అక్కడ చేసిన సేవ అతనికి నిరాశను కలిగించింది. ఏదేమైతేనేమి, అక్కడ ఉన్న సమయంలో జర్మనీ దేశానికి చెందిన మొరావియన్ మిషనరీలను కలుసుకున్న అతను, వారిచే తీవ్రంగా ప్రభావితమయ్యారు. వారి యొక్క ఆత్మీయ నిశ్చయత మరియు క్రియారూపకమైన క్రైస్తవ్యం అతనిపై లోతైన ముద్రను వేశాయి.
ఇంగ్లాండుకు తిరిగి వచ్చిన తరువాత ఒకసారి రోమీయులకు వ్రాసిన పత్రికకు మార్టిన్ లూథర్ వ్రాసిన 'ముందుమాట' చదువబడుచుండగా వినిన వెస్లీ, తద్వారా ఆత్మీయ మారు మనస్సు యొక్క అనుభవంలోనికి వచ్చారు. కాగా నూతనపరచబడిన ఆత్మతో అతను ‘క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారానే రక్షణ’ అను సత్యమును గూర్చి బోధించడం ప్రారంభించారు. ఆ విధంగా ఒక చోటి నుండి మరొక చోటికి ప్రయాణిస్తూ అతను 50 సంll కు పైగా తన పరిచర్యను కొనసాగించారు. క్రైస్తవాలయానికి వెలుపల కూడా బోధించుటకు అతను కలిగియున్న సంసిద్ధత కారణంగా 'చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్' నిర్లక్ష్యం చేసిన జనసమూహాలకు కూడా సువార్త ప్రకటించబడింది. ఒక బలమైన ఉజ్జీవం లేపబడి ఇంగ్లాండు దేశంలో ఆత్మీయ జ్వాలలను రగిలించగా వేలాది మంది యేసు క్రీస్తును అంగీకరించారు. అతను బోధించే వాక్య పరమైన క్రైస్తవ విలువలను అంగీకరించుటకు ఇంగ్లాండులోని క్రైస్తవ సంఘం విముఖత చూపుట వలన అతను వ్యక్తిగత సమాజాలను ఏర్పరచవలసి వచ్చింది. వాటిలో చేరిన వారు ప్రతి వారం క్రమపద్ధతిలో బైబిలు పఠనములకు మరియు ప్రార్థనలకు కూడుకొనెడివారు. అందువలన వారు విమర్శకులచే ‘మెథడిస్టులు’ (నిబద్ధత కలిగినవారు) అని పిలువబడ్డారు. తాను ఎదుర్కొంటున్న వ్యతిరేకతను మరియు శ్రమలను సహిస్తూ జాన్ వెస్లీ ఇంగ్లాండు దేశమంతటా పర్యటించి మెథడిస్టు సమాజాలను స్థాపించారు. అతను 1791వ సంll లో ఈ లోకములో తన పరుగును ముగించేంత వరకు కూడా వ్యక్తిగత క్రమశిక్షణను అవలంబిస్తూ క్రమబద్ధమైన జీవితమును జీవించారు.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, మీ జీవితం ఎటువంటి నిబద్దత మరియు క్రమశిక్షణ కలిగి ఉంది?
ప్రార్థన :
"ప్రభువా, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని జీవిస్తూ, నా తుది శ్వాస వరకు కూడా మీ పరిచర్యలో చురుకుగా పాలుపొందుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment