Search Here

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Mar 21, 2022

Bernie May | బెర్నీ మే

బెర్నీ మే జీవిత చరిత్ర



  • జననం: 1932
  • స్వదేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: దక్షిణ అమెరికా


అది క్రిస్మస్‌కు ముందు రోజు. ఒక మిషనరీ విమాన చోదకుడు (మిషనరీ పైలట్) జనసాంద్రతకు దూరముగా ఉన్న ఒక అమెజాన్ గ్రామానికి అత్యవసర వైద్య చికిత్సకు సంబంధించినవాటిని పంపిణీ చేశారు. క్రిస్మస్ రోజుకల్లా తన కుటుంబమును తిరిగి చేరుకొనుటకు అతను ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. అయితే సాయంత్రం పూట చీకటి పడటంతో అతను విమానాన్ని నడపలేకపోయారు. కావున అతను తన భద్రత కొరకు తాత్కాలికమైన ఏర్పాట్లు చేసుకొని అడవిలోనే ఆ రాత్రి గడుపుటకు తల వాల్చారు. కానీ, అప్పుడు వర్షం పడటం ప్రారంభమైంది. ఆ వర్షం క్రిస్మస్ రోజు సాయంత్రం వరకు కొనసాగింది. క్రిస్మస్ రోజున తన కుటుంబము గానీ సంఘ సహవాసం గానీ లేకుండా అడవిలో చిక్కుకుపోయినందుకు ఎంతో నిరాశానిస్పృహలకు గురైన ఆ మిషనరీ, “ఓ దేవా, క్రిస్మస్‌ అంటే ఇలా ఉండకూడదు. నేను సరైన స్థలములో లేను, తప్పు స్థలములో ఉన్నాను” అని విలపించారు.


అతను అక్కడ తాను వేసుకున్న ఊయలలో పడుకుని, కుటుంబము పై ఎంతో దిగులుతో ఉండగా, దేవుడు తన హృదయములో తనతో మాట్లాడుటను అతను విన్నారు. అదేమంటే “నా కుమారుడా, క్రిస్మస్ అంటే ఇదే! యేసు క్రీస్తు పరలోకమును విడిచిపెట్టి క్రిస్మస్ రోజున ‘తప్పు స్థలం’ లో ఆయన మేల్కొన్నాడు. అది బేత్లెహేములోని ఒక పశువుల పాక. క్రిస్మస్ అంటే ఇంటిని వదిలి వెళ్ళడం, ఇంటికి వెళ్ళడం కాదు. నా ఏకైక కుమారుడు క్రిస్మస్ కొరకు ఇంటికి రాలేదు, మీతో ఉండుటకు ఇంటిని విడిచిపెట్టాడు.”


అప్పుడు ఆ విమాన చోదకుని హృదయం ఎంతో కృతజ్ఞతతో నిండిపోయింది. తన కుటుంబము యొద్దకు తిరిగి వెళ్ళుటకు మరికొన్ని రోజులు అతను అడవిలో ఒంటరిగా వేచియున్నారు. అతను ఎవరంటే ‘విక్లిఫ్ బైబిల్ ట్రాన్స్‌లేటర్స్’ (విక్లిఫ్ బైబిలు అనువాదకులు) అనే సంస్థకు మిషనరీ విమాన చోదకుడైన బెర్నీ మే.


1954 వ సంll లో ఒక ఆదివారపు ఆరాధనా కూడికలో అమెజాన్ ప్రాంతాలలో ఉండే తెగలకు మిషనరీ అయిన రేచెల్ సెయింట్ ఒక శక్తివంతమైన ప్రసంగం ఇచ్చిన తరువాత, అరణ్యాలలో మిషనరీ పని కొరకు తనతో చేతులు కలుపమని ప్రజలను కోరారు. ప్రత్యేకముగా ఆమెకు ఒక విమాన చోదకుడు మరియు కార్యదర్శి (సెక్రటరీ) అవసరం. ఆ బాప్టిస్టు చర్చిలో కూర్చొని ఉన్నవారిలో వినోదము కొరకు విమానమును నడిపే బెర్నీ మే మరియు శిక్షణ పొందిన కార్యదర్శియైన అతని భార్య నాన్సీ ఉన్నారు. వెంటనే దేవుడు తమను పిలుస్తున్నాడని వారి హృదయములో వారు గ్రహించారు. తత్ఫలితముగా వారిరువురూ కలిసి తమను దేవుని పరిచర్యకు సమర్పించుకున్నారు.


తరువాతి ఇరవై ఐదు సంవత్సరాల పాటు బెర్నీ మిషనరీలను, మందులను మరియు సువార్త రచనలను రవాణా చేస్తూ మిషనరీ విమాన చోదకునిగా కొన్ని క్లిష్టమైన స్థితిగతుల మధ్య పనిచేశారు. విమానమును నడుపుతున్నప్పుడు ఎన్నిసార్లు అతను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారో అతనికి మరియు దేవునికి మాత్రమే తెలుసు. తదుపరి 1980వ సంll నుండి అతను దక్షిణ అమెరికాలో విక్లిఫ్ బైబిల్ ట్రాన్స్‌లేటర్స్ సంస్థ యొక్క కార్యక్రమానికి నాయకత్వం వహించడం ప్రారంభించి, లక్షల మంది ప్రజలకు బైబిలును అందుబాటులోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, క్రిస్మస్ యొక్క నిజమైన అర్థం ఏమిటో మీకు తెలుసా?


ప్రార్థన :

ప్రభువా, ఆచారబద్ధమైన క్రిస్మస్ నుండి నాకు విడుదల దయచేసి, నిజమైన క్రిస్మస్ యొక్క అర్థమును ఎరిగినవాడనై/ఎరిగినదాననై దేవుని ప్రేమతో నేను ప్రజలను చేరుకొనుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్! 

దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Jan 14, 2022

    Benjamin Hobson Life History

    బెంజమిన్ హాబ్సన్ గారి జీవిత చరిత్ర



    • జననం: 02-01-1816
    • మహిమ ప్రవేశం: 16-02-1873
    • స్వస్థలం: వెల్ఫోర్డ్, నార్తాంప్టన్‌షైర్
    • దేశం: ఇంగ్లాండు
    • దర్శన స్థలము: చైనా

    చాలా మంది క్రైస్తవ మిషనరీలు సువార్త యొక్క ప్రచార సాధనంగా విద్య, వైద్యం మొదలైన సామాజిక సేవలను ఉపయోగించారు. అటువంటి పరిస్థితులలో కొందరు సువార్త ప్రకటన నుండి తొలగిపోయి కేవలం సామాజిక సేవలను అందించుటలో మాత్రమే దృష్టి కేంద్రీకరించారు. అయితే భౌతిక సేవలను అందిస్తూనే సువార్త ప్రకటన పై నుండి తమ దృష్టిని మరల్చని వారు కూడా ఉన్నారు. అటువంటి మిషనరీలలో ఒకరు బెంజమిన్ హాబ్సన్. మన భూసంబంధమైన సేవ క్రీస్తును కేంద్రంగా కలిగియుండాలనునది ఇది తెలియపరుస్తుంది.

    బెంజమిన్ హాబ్సన్ చైనాలో పరిచర్య చేసిన బ్రిటిష్ వైద్య మిషనరీ. వైద్య విద్యను మరియు శిక్షణను పూర్తిచేసుకొనిన తరువాత లండన్ మిషనరీ సొసైటీలో చేరారు హాబ్సన్. 1839వ సంll లో 23 ఏళ్ళ ఈ యువ మిషనరీ తన జీవిత భాగస్వామితో పాటు చైనాలోని మకావో చేరుకున్నారు. మెడికల్ మిషనరీ సొసైటీ పర్యవేక్షణలో ఉన్న మకావోలోని ఒక ఆసుపత్రిలో హాబ్సన్ తన సేవను ప్రారంభించారు. మొదటి ఆంగ్లో-చైనీస్ యుద్ధం (1839-42) సమయంలో ఒక బ్రిటిష్ మిషనరీకి అది ఎంతో ప్రమాదకరం అయినప్పటికీ మకావోలో సేవ చేయడం కొనసాగించి, అతను వైద్య మిషనరీగా తన సమర్పణను కనుబరిచారు. ఆ సమయంలో అతను కరువు, మశూచి, కలరా, కుష్ఠు వ్యాధి మరియు నల్లమందు వ్యసనం కారణంగా బాధపడుతున్న ప్రజలకు సహాయం చేయడంపై తన దృష్టిని కేంద్రీకరించారు.

    ‘మెడికల్ మిషనరీ హాస్పిటల్ హాంకాంగ్‌’ ను స్థాపించుటకుగాను 1843వ సంll లో హాంకాంగ్‌కు వెళ్ళారు హాబ్సన్. తన భార్య అనారోగ్యం కారణంగా 1845వ సంll లో అతను ఇంగ్లాండుకు వెళ్ళుటకు పయనమయ్యారు కానీ, వారు ఇంగ్లాండు చేరుకునేలోపే అతని భార్య మరణించారు. 1847వ సంll లో హాంకాంగ్‌కు తిరిగివచ్చిన హాబ్సన్, 1848వ సంll లో కాంటన్ (ప్రస్తుతం గ్వాంగ్‌జౌ) అనే ప్రాంతమునకు వెళ్ళారు. ఎందుకంటే హాంకాంగ్ కంటే క్రైస్తవ మిషనరీల పట్ల తక్కువ సహనాన్ని కలిగి ఉన్న ప్రదేశమైన కాంటన్‌ అధిక అవసరతలో  ఉందని అతను గ్రహించారు. అయితే రెండవ ఆంగ్లేయ-చైనా యుద్ధం (1856-60) అతని ఆసుపత్రి మూసివేతకు కారణమైంది మరియు అతను కాంటన్ వదిలి వెళ్ళవలసి వచ్చింది. కావున, హాంకాంగ్‌లో ఆశ్రయం పొందిన అతను, తరువాత 1857వ సంll లో షాంఘైకి వెళ్ళారు. అనారోగ్యం కారణంగా 1859వ సంll లో తాను ఇంగ్లాండుకు తిరిగి వచ్చే వరకు కూడా హాబ్సన్ అక్కడ సేవ చేశారు.

    బెంజమిన్ హాబ్సన్ చైనా వైద్య చరిత్రలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలుస్తారు. అనేక పుస్తకాలను రచించిన హాబ్సన్ చైనా భాషలో విజ్ఞాన శాస్త్రం (సైన్స్) గురించి రచనలు చేసిన మొదటి ప్రొటెస్టంట్ రచయిత. అతను అనేక మంది చైనా వైద్య విద్యార్థులకు కూడా శిక్షణనిచ్చారు. అతని రచనలు చైనా వైద్యంలో విప్లవము కలుగుటకు సహాయపడటమే కాక జపనీయుల వైద్యంపై కూడా గొప్ప ప్రభావాన్ని చూపాయి. విజ్ఞాన శాస్త్రంలో అతను అందించిన సేవలన్నింటికీ ఆధారం అతని క్రైస్తవ విశ్వాసమే. సువార్త ప్రకటనపై తాను దృష్టిని కేంద్రీకరించడం ద్వారా వైద్య సేవలను అందించడం అనేది ఆత్మీయ అవసరతలో ఉన్న ప్రజలతో తమ విశ్వాసమును పంచుకొనుటకు ఒక మార్గమని ఎత్తి చూపారు బెంజమిన్ హాబ్సన్.

    ప్రియమైనవారలారా, మీరు ఏ సేవ చేసినా, ప్రజల ఆత్మీయ అవసరతలను తీర్చడంపై మీరు దృష్టి నిలుపుతున్నారా?

    "ప్రభువా, భూసంబంధమైన నా సేవ కూడా క్రీస్తును కేంద్రముగా కలిగియుండునట్లు సహాయము చేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Nov 16, 2021

    Bethlehemulo Sandadi | బెత్లెహేములో సందడి | Telugu Christmas song


    Bethlehemulo Sandadi | బెత్లెహేములో సందడి | Telugu Christmas song


    బెత్లెహేములో సందడి
    పశుల పాకలో సందడి
    శ్రీ యేసు పుట్టాడని
    మహారాజు పుట్టాడని (2)          ||బెత్లెహేములో||

    ఆకాశములో సందడి
    చుక్కలలో సందడి (2)
    వెలుగులతో సందడి
    మిల మిల మెరిసే సందడి (2)     ||బెత్లెహేములో||

    దూతల పాటలతో సందడి
    సమాధాన వార్తతో సందడి (2)
    గొల్లల పరుగులతో సందడి
    క్రిస్మస్ పాటలతో సందడి (2)     ||బెత్లెహేములో||

    దావీదు పురములో సందడి
    రక్షకుని వార్తతో సందడి (2)
    జ్ఞానుల రాకతో సందడి
    లోకమంతా సందడి (2)             ||బెత్లెహేములో||

  • WhatsApp
  • Oct 14, 2021

    Barnabas Shaw | బర్నబాస్ షా

    బర్నబాస్ షా | Barnabas Shaw




    • జననం: 12-04-1788
    • మహిమ ప్రవేశం: 21-06-1857
    • స్వస్థలం: ఎల్లోటన్
    • దేశం: ఇంగ్లాండు
    • దర్శన స్థలము: నమక్వాలాండ్, దక్షిణాఫ్రికా

     బర్నబాస్ షా దక్షిణాఫ్రికాలో సేవ చేసిన ఒక మార్గదర్శక మిషనరీ. నమక్వా తెగల మధ్య తాను చేసిన పరిచర్యకు అతను పేరుగాంచారు. అతను తన తండ్రి యొక్క వ్యవసాయ క్షేత్రంలో గొర్రెలను పెంచుతూ పెరిగారు. ఆదివారపు బైబిలు పాఠశాలలో (సండే స్కూల్‌) క్రీస్తును తన రక్షకునిగా అంగీకరించిన అతను, ఇరవై ఏళ్ళ వయస్సు వచ్చేసరికి బహిరంగంగా ప్రసంగించడం మొదలుపెట్టారు. 1814వ సంll లో జరిగిన ఒక మెథడిస్టు కూడికలో మిషనరీ సేవ కొరకై దేవుడు తనకు ఇచ్చిన ఖచ్చితమైన పిలుపుకు విధేయులయ్యారు బర్నబాస్. భారతదేశంలో సేవ చేయుటకు అతను తనను సిద్ధపరచుకుంటున్నప్పటికీ, వెస్లియన్ మిషనరీ సొసైటీ అతనిని దక్షిణాఫ్రికాలో సేవ చేయుటకు పంపింది.

     ఎంతో ఉత్సాహంతో కేప్ టౌన్‌కు వచ్చారు బర్నబాస్. కానీ, ఆ ప్రదేశం నుండి అందుకున్న ఆహ్వానం ఏదైనా అతని వద్ద ఉంటే తప్ప అక్కడికి వచ్చి సేవ చేయుటకు అనుమతించబడదని ఆ నగర గవర్నర్ అతనిని నిరాకరించారు. ఇప్పుడు ఏమి చేయాలని సందిగ్దములో ఉండిపోయిన బర్నబాస్, తాత్కాలికంగా రెండు ఆంగ్ల సైనిక స్థావరాలలో పరిచర్య చేశారు. అయినా అతను సంతృప్తి చెందలేదు. ఏలయనగా తాను అన్యులైన స్థానిక తెగల మధ్య సేవ చేయుటకు పిలువబడ్డాడని అతను తన హృదయములో ఎరిగియున్నారు. అక్కడి తెగలను కలుసుకొనుటకు అతను చేసిన ప్రయత్నాలన్నీ విఫలయత్నాలుగానే మిగిలిపోయాయి. అయితే, దేవుడు ఎంతో ఆసక్తికరమైన రీతిలో అతనికి మార్గమును తెరిచాడు.

     ఒక రోజు అతను కేప్ టౌన్ వైపుగా బండిలో ప్రయాణిస్తున్నారు. దారిలో అతను అలసిపోయి ఉన్న ఒక ప్రజల గుంపును చూశారు. వారు దక్షిణాఫ్రికాలో ఒక జాతియైన నమక్వా అనే సమూహానికి చెందినవారు. వారిని అతను విచారించగా, వారి నాయకుడు “మేము ‘దేవుని వాక్యం’ గురించి విన్నాము. కాబట్టి, దానిని మాకు వివరించగల వ్యక్తి కొరకు మేము వెతుకుతున్నాము.” అని చెప్పారు. ఆహా! బర్నబాస్ ఆనందంతో బండి నుండి బయటకు దుమికి, యేసు క్రీస్తు ప్రభువు గురించి తాను వారికి బోధించెదనని చెప్పి వెంటనే ముందుకువచ్చారు. వివిధ వ్యక్తుల కోరికలను దేవుడు ఎంత అద్భుతంగా తీర్చగలడు!

     నమక్వా తెగలవారు నాగరికత లేని జనాంగం అయినప్పటికీ, వారు అమాయక ప్రజలు. బర్నబాస్ వారికి ‘దేవుని వాక్యం’ బోధించుటకు ఎంతో సంతోషంగా శ్రమించారు మరియు వారికి నాగరికత కూడా నేర్పించారు. అతను విత్తిన ఆ మంచి విత్తనం సమృద్ధిగా ఫలములను ఇచ్చింది. అతని అభ్యర్థన మేరకు ఇంగ్లాండ్ నుండి మరి ఎక్కువ మంది మిషనరీలు వచ్చారు మరియు వారి పరిచర్య దక్షిణాఫ్రికాలోని అన్ని దిక్కులకు వ్యాపించింది.

     నమక్వా ప్రజల మధ్య 10 సంవత్సరాల పాటు తీవ్రముగా పరిచర్య జరిగించిన తరువాత, ఎంతగానో అలసిపోయి నీరసించిపోయిన బర్నబాస్ ఆ తీవ్రమైన అలసట, బలహీనతల నుండి కోలుకొనుటకు ఇంగ్లాండుకు తిరిగి వచ్చారు. నమక్వాలాండ్‌కు తిరిగి వెళ్ళాలని అతను ఎంతగానో వాంఛించినప్పటికీ, అనారోగ్య కారణాల వల్ల వెళ్ళలేకపోయారు. ఏదేమైతేనేమి, 1857వ సంll లో తాను మరణించే వరకు కూడా ఇంగ్లాండులో పరిచర్య చేస్తూ దేవుని సేవలో ముందుకు సాగిపోయారు బర్నబాస్ షా.

    ప్రియమైనవారలారా, క్రీస్తును గురించి మరింతగా తెలుసుకోవాలని మీ ఆత్మ వాంఛిస్తున్నదా? అన్యులకు క్రీస్తును తెలియజేయుటకు అది తృష్ణ కలిగియున్నదా?

    ప్రభువా, మీ గురించి మరింతగా తెలుసుకొనుటకును మరియు మీ గురించి మరింతగా బోధించుటకును నాకు సహాయము దయచేయుము. ఆమేన్!

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp