Search Here

Showing posts with label L. Show all posts
Showing posts with label L. Show all posts

May 13, 2023

Luther Rice | లూథర్ రైస్

లూథర్ రైస్ గారి జీవిత చరిత్ర

Pictures shown are for illustration purpose only


  • జననం : 25-03-1783
  • మరణం : 25-09-1836
  • స్వస్థలం : నార్త్‌బరో
  • దేశం : అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము : అమెరికా సంయుక్త రాష్ట్రాలు


కొంతమంది సువార్తను ప్రకటించుటకు మిషనరీలుగా వెళ్తే, మరికొంతమంది లోకమును సువార్త వెలుగుతో నింపుతున్న వారి సేవకు సహకారమందించుటకు తెర వెనుక ఉండి కృషి చేస్తారు. వారు అందుకున్న పిలుపులో వ్యత్యాసము ఉన్నప్పటికీ, వారందరు కూడా తమ పరలోక యజమానునికి సంపూర్ణ సమర్పణతో సేవ చేశారు. మిషనరీ సేవ కొరకైన బూర శబ్దమును ధ్వనింపజేసి, బాప్తిస్టు సంఘమును మేల్కొల్పిన లూథర్ రైస్, పైన చెప్పబడిన రెండు వర్గాలలో రెండవ కోవకు చెందినవారు. విలియం కేరీ ఆధునిక మిషనరీ ఉద్యమాన్ని ఆవిర్భవింపజేసినప్పుడు, ప్రపంచవ్యాప్తముగా మిషనరీ సేవకు సహకారమందించుటకు తమ స్వరములనెత్తి నిలువబడిన అనేకమందిలో రైస్ కూడా ఒకరు.


జాన్ న్యూటన్ యొక్క సాక్ష్యంతో ప్రేరణ పొందిన రైస్, చాలా చిన్న వయస్సులోనే మిషనరీ పని వైపు ఆకర్షితులయ్యారు. కాగా సేవ చేయుటకు తగిన సిద్ధపాటు కొరకై విలియమ్స్ కళాశాలలో చేరిన అతను, మిషన్ సొసైటీలో క్రియాశీల సభ్యులయ్యారు. కాంగ్రిగేషనలిస్టులు, అనగా క్రైస్తవ సంఘములో నిర్ధిష్టమైన పదవీక్రమాన్ని అనుసరించకుండా సమాజముగా కూడుకునేవారి యొక్క సహకారంతో రైస్, అడోనిరామ్ జడ్సన్ మరియు మరికొందరు భారతదేశానికి పయనమయ్యారు. అక్కడ వారు విలియం కేరీని కలుసుకోవడం జరిగింది. అయితే, కాంగ్రిగేషనలిస్ట్ బోర్డు నుండి తగినంత ఆర్థిక సహకారం లేకపోవడంతో వారు భారతదేశంలో తమ సేవను విరమించుకొనవలసి వచ్చింది. కాగా, ప్రపంచవ్యాప్తముగా సువార్త సేవ జరుగుటలో పాలుపంపులు కలిగియుండవలసిన బాధ్యతను కలిగియున్నామని క్రైస్తవ సంఘముకు గుర్తుచేయవలెనన్న దర్శనముతో అమెరికాకు తిరిగివెళ్ళాలని నిర్ణయించుకున్నారు లూథర్ రైస్.


తన స్వదేశాన్ని చేరుకున్న అతను, మిషనరీ పరిచర్యకు సహకారమందించమని బాప్తిస్టు సంఘములను అభ్యర్థిస్తూ గుఱ్ఱము పై లేదా గుఱ్ఱపు బండిపై వేలకొలది మైళ్ళు ప్రయాణించారు. మిషనరీ సేవ పట్ల ఆసక్తి కనుపరిచిన సంఘములను అతను ఏకీకృతం చేశారు. తత్ఫలితముగా 'జనరల్ మిషనరీ కన్వెన్షన్' లేదా 'ట్రైయెన్నియల్ కన్వెన్షన్' అని పిలువబడే క్రైస్తవ సంఘ వర్గము ఏర్పడింది. ఈ కన్వెన్షన్ విదేశాలలో జరిగే మిషనరీ సేవకు సహకారమందించడమే కాకుండా, దేశీయ మరియు విదేశీ సువార్త సేవకై మిషనరీలను కూడా పంపుతుంది. అంతేకాకుండా, మిషన్ సంస్థలను, సండే స్కూళ్ళను (ఆదివారపు బైబిలు పాఠశాలలు) మరియు బైబిలు సంస్థలను కూడా స్థాపించిన సంచార మిషనరీ లూథర్ రైస్, క్రైస్తవ విద్యాభ్యాసము మరియు సేవ కొరకైన శిక్షణ యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పారు.


రైస్ తన పరిచర్యలో బాధలను మరియు వ్యతిరేకతను కూడా ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, మిషనరీ సేవ కొరకైన ఆవశ్యకతను బట్టి సహకారమందించుటకు అతను కలిగియున్న శ్రద్ధాసక్తులు భారతదేశంతో సహా ఆసియా ఖండములోని అనేక దేశాలలో మిషనరీ సేవ యొక్క ద్వారములు తెరువబడుటకు తోడ్పాటునందించాయి. అమెరికాలో బాప్తిస్టు సంఘముల మధ్య ఇరవై మూడు సంవత్సరాల పాటు అతను చేసిన ఫలవంతమైన పరిచర్య ఫలితముగా ఒక నిర్దిష్ఠ క్రమము లేకుండా దేశమంతటా అస్తవ్యస్తముగా ఉన్న సంఘములు ఏకమై సరియైన క్రమములో ఒక క్రైస్తవ సంఘ వర్గముగా ఏర్పడ్డాయి. 

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

 ప్రియమైనవారలారా, సువార్త పరిచర్యలో పాలుపంపులు కలిగియుండుటకు ఇతరులను మీరు ఏ విధముగా ప్రోత్సహిస్తున్నారు?

ప్రార్థన :

"ప్రభువా, మిషనరీ సేవ పట్ల శ్రద్ధాసక్తులు కలిగియుండునట్లు మా సంఘమును మరియు కుటుంబమును ప్రేరేపించుటకు నన్ను వాడుకొనుము. ఆమేన్!" 

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Feb 12, 2022

    Louis Sotelo Life History

    లూయిస్ సోటెలో గారి జీవిత చరిత్ర


    Luis Sotelo, speaking with Hasekura Tsunenaga and other Japanese in Rome. Sala RegiaQuirinal Palace, Rome.

    ©

    Wikipedia

    • జననం: 06-09-1574
    • మహిమ ప్రవేశం: 25-08-1624
    • స్వస్థలం: సెవిల్లా
    • దేశం: స్పెయిన్
    • దర్శన స్థలము: ఫిలిప్పైన్స్ మరియు జపాన్

    ఉత్తర జపాన్‌లో సువార్తను ప్రకటించిన మొట్టమొదటి మిషనరీ లూయిస్ సోటెలో. తాను డిగ్రీ చదువుతున్న సమయంలో అతను సేవ చేయుటకై దేవుడు తనకు పిలుపునిస్తున్నట్లు గ్రహించారు. కాగా అతను ఫ్రాన్సిస్కాన్ సొసైటీచే నియామక అభిషేకం పొందినవారై ఫిలిప్పైన్స్‌కు పంపబడ్డారు. అక్కడ అతను దిలావో అనే ప్రాంతములో స్థిరపడిన జపానీయుల మధ్య సేవ చేయడం ప్రారంభించారు. అయితే, జపానీయులు స్థిరపడిన ఈ ప్రాంతమును 1608వ సంll లో స్పెయిన్ దళాలు ధ్వంసం చేశాయి. అయినప్పటికీ పట్టువదలని సోటెలో, ఎదో ఒకనాడు జపాన్‌లో సేవ చేయాలనే దర్శనము కలిగినవారై మనీల్లాలో జపానీయుల భాషను నేర్చుకొనుటను కొనసాగించారు.

     దేవుని ఏర్పాటుని బట్టి 1612వ సంll లో జపాన్‌లోని ఎడో (ప్రస్తుత టోక్యో) ప్రాంతానికి చేరుకున్నారు సోటెలో. అక్కడి పరిస్థితులు చాలా అనుకూలంగా కనిపించడంతో త్వరలోనే అతను అక్కడ ఒక క్రైస్తవ సంఘమును స్థాపించగలిగారు. అయితే క్రొత్తగా హిడెటాడా తోకుగావా పాలకునిగా పదవిని అధిరోహించడంతో అక్కడి పరిస్థితి మారిపోయింది. క్రైస్తవ విశ్వాసమును అనుసరించుటగానీ, బోధించుటగానీ నిషేధించబడ్డాయి మరియు సోటెలోచే నిర్మించబడిన క్రైస్తవాలయం కూడా 1612వ సంll లో ధ్వంసం చేయబడింది. రాజు యొక్క ఉత్తర్వుల మేరకు క్రైస్తవులను హింసిచుట ప్రారంభమవ్వగా, అది మిషనరీలు జపాన్‌ను విడిచిపెట్టి వెళ్ళుటకు కారణమైంది.

     అయితే శ్రమలు ఎదురైనప్పటికీ దేవునిని సేవించుటకు మీరు నిశ్చయించుకొనినట్లయితే ఆయన అద్భుతమైన రీతిలో ద్వారమును తెరుస్తాడు. అయితే మీకు కావలసినది ఏమంటే సహనం. సోటెలో ఒకసారి దాతే మాసమునే అనే ఒక శక్తివంతమైన భూస్వామి యొక్క భార్యను అద్భుతమైన రీతిలో స్వస్థపరిచారు. కాబట్టి, మాసమునే అతనికి భద్రత కల్పించడంతో సోటెలో సువార్తను బోధించడం మరియు క్రైస్తవ సంఘములను స్థాపించడం కొనసాగించారు. చట్టవిరుద్ధంగా పరిచర్య చేస్తున్నందుకుగాను ఒకసారి సోటెలో చెరసాలలో బంధించబడగా, మాసమునే తానే స్వయంగా సోటెలో కొరకు హామీ ఇచ్చి అతను విడుదలయ్యేలా చేశారు.

     జపాన్‌లో నూతన సంఘములను నిర్మించాలని మరియు సంఘములకు నాయకత్వం వహించుటకు మరింతమంది పాదిరులను నియమించాలనే దర్శనముతో, సోటెలో రోమ్‌కు వెళ్ళారు. అతను నూతన విశ్వాసులైన జపానీయులను కూడా తనతో తీసుకు వెళ్ళి, వారు బాప్తిస్మము పొందులాగున చూసుకున్నారు. అయితే జపాన్‌లో క్రైస్తవులపై పెరుగుతున్న హింసను పరిగణనలోకి తీసుకుని, సంఘ అధికారులు సోటెలోను జపాన్‌కు తిరిగి వెళ్ళకుండా నిరోధించారు. అనేక మార్లు ప్రయత్నించినంతరం 1622వ సంll లో సోటెలో రహస్యంగా జపాన్‌లోకి ప్రవేశించగలిగారు. కానీ, అక్కడికి వెళ్ళిన వెంటనే అధికారులచే అతను పట్టబడ్డారు. తన విశ్వాసమును వదులుకొనుటకు నిరాకరించిన లూయిస్ సోటెలో, 50 ఏళ్ళ వయస్సులో 1624వ సంll ఆగస్టు 25న సజీవ దహనం చేయబడ్డారు.

    ప్రియమైనవారలారా, దేవుడు మీ కొరకు ఒక నూతన ద్వారమును తెరిచే వరకు మీ పిలుపుకు మీరు నమ్మకముగా ఉండి సహనముతో వేచియుండెదరా?

    ప్రభువా, మీరు నా జీవితానికి సరియైన ద్వారమును మరియు అవకాశములను తెరిచే వరకు సహనముతో వేచియుండుటకు నాకు కృపననుగ్రహించుము. ఆమేన్!

      
    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Feb 10, 2022

    లూదియ | Lydia

    లూదియ | Lydia | Blessed Women



    దేవుడు ఏ ఆసియా రాష్ట్రంలో పౌలు ప్రవేశించకుండా చేశాడో ఆ ఆసియాలో లూదియ సొంత ఊరు తుయతైర ఉంది. ఒకవేళ లూదియ తుయతైరలోని యూదుల ద్వారా నిజ దేవుణ్ణి గురించి విని ఆయనను ఆరాధిస్తూ ఉండవచ్చు. ఇప్పుడు దేవుడు క్రీస్తును గురించిన సందేశాన్ని ఆమె విని నమ్మేలా ఆమె హృదయాన్ని తెరిచాడు (లూకా 24:45 పోల్చి చూడండి). ప్రభువు తనమీద నమ్మకం పెట్టసాగిన ప్రతి ఒక్కరికీ ఇలా చేస్తాడు. ఆయనే గనుక మన హృదయాలను తెరవకపోతే అవి ఏ మాత్రం తెరుచుకోవు. చెరసాల తలుపులను తెరవడం ఎంత అద్భుతమో (వ 26; 5:19) మనుషుల హృదయాలను తెరవడం అంత అద్భుతం.

                  లూదియా తుయతైర పట్టణస్థురాలు. మాసిదోనియ ముఖ్య నగరమైన ఫిలిప్పీలో లూదియ నివసించేది. అయితే, ఆమె పశ్చిమ ఆసియా మైనరులోగల లూదియ ప్రాంతంలోని నగరమైన తుయతైరకు చెందినది. ఈ కారణాన్నిబట్టి కొందరు, “లూదియ” అన్నది ఆమెకు ఫిలిప్పీలో ఇవ్వబడిన మారుపేరని అంటారు. వేరే మాటల్లో చెప్పాలంటే, యేసుక్రీస్తు సాక్ష్యమిచ్చిన స్త్రీ “సమరయ స్త్రీ” అని ఎలా పిలువబడగలదో అలాగే ఈమె “లూదియ కాపురస్థురాలు” అని పిలువబడింది. (యోహాను 4:9) లూదియ “ఊదారంగు పొడిని” లేక ఈ అద్దకంతో రంగు వేయబడిన వస్తువులను అమ్మేది. (అపొస్తలుల కార్యములు 16:12, 14) 

                    దేవునిఆరాధించు స్త్రీగా పేర్కొనబడెను. మాదిరికరమైన విధంగా ఆతిథ్యమిచ్చినవారిలో ఒకరు లూదియ. ఫిలిప్పీని సందర్శించడానికి వచ్చిన క్రైస్తవ మిషనరీలను తన ఇంటిలో ఉండమని ఆమె “బలవంతము చేసెను.” (అపొస్తలుల కార్యములు 16:15) లేఖనాల్లో లూదియ క్లుప్తంగా ప్రస్తావించబడినప్పటికీ, ఆమె గురించి చెప్పబడిన ఆ కొంచెమే మనకు ప్రోత్సాహకరంగా ఉండగలదు. 

                లూదియ ‘దైవభక్తిగల స్త్రీ’ కాని, ఆమె బహుశా మత సత్యాన్ని వెదుకుతూ యూదామతంలోకి మారి ఉండవచ్చు. లూదియ ధనాపేక్షగలదికాదు, ఆమె తన సమయాన్ని ఆత్మీయ విషయాల కొరకు కేటాయించేది. లూదియాయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను.ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయతైర పట్నాస్థురాలు .ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను . “ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను” మరియు లూదియ సత్యాన్ని అంగీకరించింది. వాస్తవానికి, ‘ఆమె, ఆమె ఇంటివారు బాప్తిస్మం పొందారు.’—అపొస్తలుల కార్యములు 16:14, 15.

                   దేవుని వాక్యం మన జీవితాల్లో స్థిరపరచబడాలి అంటే హృదయం తెరవబడాలి. చాల మంది దేవుని సన్నిధికి వెళ్లి కూర్చుంటారు కానీ దైవభక్తి కలిగి వాక్యాన్ని వినరు ,మనుషులు దేవుని సన్నిధిలో ఉంటారు కానీ వారి హృదయం మాత్రం ఏవేవో తలంపులతో నిండి ఉంటది. పైన వాక్యాభాగంలో కూడా చాల మంది స్త్రీలు వింటున్నారు కానీ దేవుడు లుథియా హృదయాన్ని మాత్రమే తెరిచాడు,ఎందుకంటే ఆమె భక్తితో వింటూ ఉన్నదీ . దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే శ్రద్ధగా వింటామో ,ఆ వాక్యం హృదయపు అంతరంగలలోనికి వెళ్లి మన స్థితిని మనకు తెలియచేస్తుంది. ఇప్పటి వరకు దేవునితో సమాధానం లేకపోయినా వాక్యంతో హృదయం శోధింప పడిన తర్వాత మన పాపాలు మనం ఒప్పుకుంటాము . ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకుంటామో దేవునికి మనకి మధ్య ఉన్న పాపపు గోడ తొలగిపోయి దేవునితో సంబంధం మొదలవుతుంది. వాక్యం శ్రద్ధగా వినడం ద్వారా హృదయం శోధింపబడి,పాపాలను ఒప్పుకుంటే ,తద్వారా దేవుడు హృదయాన్ని తెరుస్తారు. దేవుని వాక్యాన్ని వింటున్న లుథియా హృదయాన్ని తెరిచిన దేవుడు , ఈ రోజు మందిరానికి వెళ్లి దైవభక్తితో వాక్యాన్ని వింటున్న నీ హృదయాన్ని తెరవడానికి కూడా సిద్ధముగా ఉన్నాడు .

    Author: VijayaRaju Golla


  • WhatsApp
  • Feb 2, 2022

    Lizzie Johnson Life History

    లిజ్జీ జాన్సన్ గారి జీవిత చరిత్ర






    • జననం: 1869
    • మహిమ ప్రవేశం: 14-09-1909
    • స్వస్థలం: కేసీ
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు

    “...బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.” (1 కొరింథీ 1:27). ఈ వచనం లిజ్జీ లారా జాన్సన్ యొక్క జీవితంలో ఎంతో నిజమైనది. పదమూడు సంవత్సరాల వయస్సులో లిజ్జీకి వెన్ను గాయం ఏర్పడగా, అది క్రమంగా తీవ్రమవుతూ, చివరికి ఆమెను పూర్తిగా కదలలేని స్థితికి తీసుకువచ్చింది. ఆ గాయం ఆమె వెన్నుపాము పై తీవ్ర ప్రభావమును చూపగా ఆమె జీవితం ఎంతో బాధాకరంగా మారింది. ఒక్కోసారి చిన్నపాటి శబ్దం కూడా ఆమెకు చాలా బాధను, నొప్పిని కలిగించేది.

    అటువంటి కఠినమైన పరిస్థితిని కలిగియున్నప్పటికీ, ఆమె ఎప్పుడూ ఇతరుల సానుభూతిని కోరుకోలేదు మరియు తన అనారోగ్యం గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఆమె మాట్లాడటానికి ఎంతగానో ఇష్టపడే ఒక విషయం ఏమంటే మిషనరీ సేవ. 1885వ సంll లో ఆమె తండ్రి ఆఫ్రికాలోని విలియం టేలర్ యొక్క మిషనరీ కథను చదివి వినిపించినప్పుడు ఆమెకు మిషన్లపై ఆసక్తి ఏర్పడింది. చీకటి ఖండంలోకి వెళ్ళి సువార్త ప్రకటించాలని ఆమె ప్రగాఢమైన కోరిక. అయితే నిజమైన స్థితి ఏమిటంటే ఆమె తన మంచం మీద నుండి కదలటమే ఎంతో కష్టతరం.

    ప్రేమ ఎల్లప్పుడూ తన వ్యక్తీకరణకు మాధ్యమాన్ని కనుగొంటుంది. అదేవిధంగా నశించుచున్న ఆత్మల పట్ల లిజ్జీకి ఉన్న ప్రేమ కూడా ఒక మార్గమును కనుగొంది! తన చేతులను మాత్రమే కదిలించగల పరిస్థితి ఆమెది. కాగా ఆమె వాటినే దేవుని కొరకు ఉపయోగించడం ప్రారంభించారు. ఒక వైపు శారీరక బాధను భరిస్తూనే ఆరునెలల పాటు ఆమె మెత్తని బొంత కుట్టడం ప్రారంభించారు. దానిని అమ్మి, వచ్చిన  డబ్బును మిషనరీ పనికి ఇవ్వాలని ఆమె భావించారు. కానీ దానిని ఎవరూ కొనలేదు. కొంచెం నిరుత్సాహానికి గురైనప్పటికీ, తిరిగి ఆమె ఆదరణనిచ్చే బైబిలు వచనాలు వ్రాయబడియున్న సిల్క్ పుటసూచీలను (సిల్క్ బుక్‌మార్క్‌లు) తయారు చేయడం ప్రారంభించారు. ఆమె వాటిని ఒక్కొక్కటి పదిహేను సెంట్లకు (ఒక సెంటు ఇంచుమించు డెబ్బై ఒక్క పైసలు) అమ్మి, వచ్చిన మొత్తాన్ని మిషనరీ పనికి కానుకగా ఇచ్చారు. ఆమె హృదయపూర్వక ప్రయత్నాలను దేవుడు ఆశీర్వదించారు. ఆమె తయారుచేసిన పుటసూచీలు అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యాయి.

    భారతదేశానికి వచ్చిన ఒక మిషనరీయైన ఫ్రాన్సిస్ వార్న్ లిజ్జీ యొక్క ప్రయత్నాల గురించి విని, ఆమె కుట్టిన ఆ మెత్తని బొంతను అరువు తెచ్చుకుని, దానితో ప్రపంచమంతటా తిరిగి ఆమె కథను అందరికీ తెలియజేశారు. తద్వారా అతను మిషనరీ పని కొరకు ఒక మిలియన్ డాలర్ల (పది లక్షల డాలర్లు) నిధిని సేకరించగలిగారు. అంతకంటే ముఖ్యంగా అది చాలా మంది భవిష్యత్ మిషనరీలను ప్రేరేపించింది. సేకరించిన నిధులలో కొంత భాగం భారతదేశంలోని కాన్పూర్‌లో ఒక మెథడిస్టు క్రైస్తవాలయమును నిర్మించుటకు ఉపయోగించబడింది. ఆ ఆలయం నేటికీ నిలిచియుంది.

    1909వ సంll సెప్టెంబరు 14న ఈ లోకములో తన జీవితయాత్ర ముగియబోతుందని గ్రహించిన లిజ్జీ జాన్సన్, “ఓ ఎంత మధురం, ఎంత మధురం!” అని పలికి ఎటువంటి ప్రయాస కానీ కష్టం కానీ లేకుండా క్రీస్తునందు నిద్రించారు.

    ప్రియమైనవారలారా, దేవుడు మీకు సంపూర్ణమైన మంచి శరీర భాగాలను ఇచ్చాడు. వాటిని మీరు మిషనరీ పని కొరకు ఉపయోగిస్తున్నారా?

    ప్రభువా, నాలో బలహీనతలు ఉన్నప్పటికీ నన్ను ఎన్నుకున్నందుకు మీకు వందనములు. ఆరోగ్యమైనా అనారోగ్యమైనా మీ కొరకు పని చేయుటకు నేను సిద్ధముగా ఉన్నాను. ఆమేన్!

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Oct 26, 2021

    Liang A-Fa | లియాంగ్ ఎ-ఫా

    లియాంగ్ ఎ-ఫా |  Liang A-Fa


    • జననం: 1789
    • మహిమ ప్రవేశం: 1855
    • స్వస్థలం: గులావో
    • దేశం: చైనా
    • దర్శన స్థలము: చైనా; మలేషియా

     సువార్తికుడైన లియాంగ్ ఎ-ఫా బహుశా అధికారికంగా నియామక అభిషేకం పొందిన మొదటి చైనీయుడు. అతను చైనా మరియు మలేషియాలోని కొన్ని ప్రాంతాలలో తాను చేసిన పరిచర్యకు ప్రసిద్ధి చెందారు. చైనాలో బలమైన విగ్రహారాధికులైన ఒక కుటుంబములో జన్మించిన లియాంగ్ చైనావారి సాంప్రదాయక విద్యాభ్యాసమును అభ్యసించారు. కానీ, కుటుంబ ఆర్థిక పరిస్థితుల వలన అతను అచ్చువేసేవానిగా ఉద్యోగం చేపట్టవలసి వచ్చింది. ఆ సమయంలోనే అతను చైనాలో స్కాట్లాండుకు చెందిన మిషనరీ అయిన రాబర్ట్ మోరిసన్‌ను కలవడం జరిగింది.

    లియాంగ్ క్రైస్తవ మతంలోకి మారడం దేవుని వాక్యం సజీవమైనది మరియు క్రియ చేయగలదు అనుదానికి ఒక ఋజువు. అచ్చువేసేవాడైన అతనిని మోరిసన్ బైబిలు ముద్రించడంలో అతనికి సహాయం చేయుటకు ఉద్యోగమిచ్చి నియమించుకున్నారు. అంతేకాకుండా, చైనా భాషలో లియాంగ్ కలిగియున్న నైపుణ్యాలు కూడా బైబిలు అనువాదాలలో మోరిసన్‌కు సహాయపడ్డాయి. అయితే, చైనా భాషలో బైబిళ్ళను ముద్రించడం చైనా భూభాగంలో నిషేధించబడినందున, మోరిసన్ అతనిని మలక్కాలో సేవ చేస్తున్న బ్రిటిష్ మిషనరీ అయిన విలియం మిల్నే వద్దకు పంపారు. మిల్నే మరియు మోరిసన్‌లు అతనితో సంభాషిస్తూ అతనికి ఆలోచనలను, సలహాలు ఇస్తున్నప్పటికీ, లియాంగ్ తన జీవితంలో సువార్తకు ఏమాత్రం చోటివ్వక, కేవలం ధన సంపాదన కొరకు మాత్రమే వారి యొద్ద పనిచేశారు. అయితే, బైబిలు ముద్రించుటకు అతను అక్షరాలు చెక్కివున్న చెక్క దిమ్మెలను సిద్ధపరుస్తున్నప్పుడు దేవుని వాక్యం క్రమంగా అతని హృదయమును కరిగించడం ప్రారంభించింది. అతను ముద్రించే కొద్దీ దేవుని ప్రేమను మరింత ఎక్కువగా అర్థం చేసుకున్నారు. చివరికి, 1816వ సంll లో వేచియున్న ఆ దినం రానే వచ్చింది. ఆ రోజున అతను మిల్నే వద్దకు వెళ్ళి తనకు బాప్తిస్మము ఇవ్వవలసినదిగా కోరారు.

    నూతన ఆనందసంతోషములతో సువార్త కరపత్రాలను చేతబట్టుకొని తన స్వగ్రామానికి చేరుకున్నారు లియాంగ్. అయితే, అధికారులు అతనిని పట్టుకుని అతని వద్దనున్న కరపత్రాలన్నింటినీ తగులబెట్టారు. అతను తీవ్రముగా హింసించబడి, నలభై రోజుల పాటు చెరసాలలో బంధించబడ్డారు. కానీ, శ్రమల మధ్య కూడా లియాంగ్‌లో ఉప్పొంగుతున్న సంతోషము చాలామందిని ఆశ్చర్యపరిచింది. అతని భార్యతో సహా అతని గ్రామస్థులు కొందరు క్రీస్తును అంగీకరించారు.

    లియాంగ్ ఎక్కువగా తన పరిచర్యను మలక్కా మరియు మకావో ప్రాంతాలలో జరిగించారు. ఒక వైద్య మిషనరీ అయిన పీటర్ పార్కర్‌తో కలిసి పనిచేసిన అతను, పార్కర్‌ యొక్క ఆసుపత్రిలో ప్రార్థనాలయ నాయకునిగా (చాప్లైన్‌) పనిచేశారు. అనారోగ్యం అనేది మనుష్యుల హృదయములను మృదువు పరచుటకు దేవుడు ఏర్పరచిన ఒక మార్గమని విశ్వసించిన అతను, సువార్తను పంచుకొనుటకు రోగులను సందర్శించే అవకాశములను ఎన్నడూ జారవిడువలేదు. ప్రత్యేకముగా చైనావారి సంస్కృతికి తగిన విధముగా విశదీకరించబడిన అతని సువార్త కరపత్రాలకు కూడా లియాంగ్ పేరుగాంచారు. అతను మరణించిన 160 సంవత్సరాల తర్వాత కూడా అతను వ్రాసిన పుస్తకాలు మరియు వ్యాసాలు ఈ నాటికీ చైనీయులను దేవుని వైపుకు నడిపించే బలమైన సాధనాలుగా ఉన్నాయి.

    ప్రియమైనవారలారా, మీరు రోగులను సందర్శించి, వారితో సువార్తను పంచుకుంటున్నారా?

    "ప్రభువా, ప్రజల యొక్క శారీరక మరియు ఆత్మీయ గాయాలను కట్టే మంచి సమరయునిగా ఉండుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Oct 15, 2021

    Leno L. Russell | లెనో ఎల్. రస్సెల్

     లెనో ఎల్. రస్సెల్ | Leno L. Russell జీవిత చరిత్ర




    • జననం: -
    • మహిమ ప్రవేశం: -
    • స్వస్థలం: ఓహియో
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: భారతదేశం
    పరిశుద్ధ గ్రంథమైన బైబిలులోని క్రొత్త నిబంధనలో అపొస్తలుడైన పౌలు వ్రాసిన పత్రికలు ఒక ముఖ్యమైన భాగముగా ఉన్నాయని చెప్పవచ్చు. పరిశుద్ధ జీవితమును జీవించుటకు అవి ఈ నాటికీ క్రైస్తవులను ప్రోత్సహించేవిగా ఉన్నాయి. అదే విధంగా మిషనరీల సాక్ష్యాలు మరియు వారి రచనలు, ముఖ్యంగా వారు వ్రాసిన లేఖలు మిషనరీ భారమును కలిగియుండుటకు ఇతర విశ్వాసులను బహుగా ప్రభావితం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుచున్న మిషనరీ కార్యకలాపాల గురించి క్రైస్తవులకు తెలియపరిచే ‘మిషనరీ టైడింగ్స్’ అనే పత్రిక కూడా మిషనరీ మార్గమును ఎంచుకొనుటకు అనేక మంది విశ్వాసులకు ప్రేరణ కలిగించినదిగా ఉంది. ఆ మిషనరీలలో లెనో రస్సెల్ కూడా ఒకరు.
    ఓహియోలోని కార్బన్ హిల్ అనే ప్రాంతమునకు సమీపంలో ఒక వ్యవసాయ క్షేత్రంలో జన్మించిన లెనో రస్సెల్ యొక్క ఆరంభ జీవితం ఎంతో దీనస్థితిని కలిగినదైయుంది. చాలా చిన్న పాఠశాలలో చదువుకున్న ఆమె, చదువు పూర్తయిన తరువాత బోధించుటకు తిరిగి అదే పాఠశాలకు వచ్చారు. హిరామ్ కళాశాలలో చదువును కొనసాగించుటకు అవసరమైన ధనమును తానే సంపాదించి సమకూర్చుకొని, 1914వ సంll లో ఆ కళాశాల నుండి పట్టభద్రురాలయ్యారు లెనో. తన చిన్నతనంలోనే ఆమె క్రీస్తు సందేశమును తీసుకొని భారతదేశానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. ఆ వయసులోనే మిషనరీ సేవ పట్ల ఆమెకు ఏవిధంగా ఆసక్తి కలిగినదంటే ‘మిషనరీ టైడింగ్స్’ పత్రికను చదువుట ద్వారా. దానిని కార్యరూపము దాల్చుటకై సేవ కొరకైన శిక్షణ కొరకు ఆమె ‘కాలేజ్ ఆఫ్ మిషన్స్’ అనే కళాశాలలో చేరారు.

    1915వ సంll లో భారతదేశానికి చేరుకున్న లెనో రస్సెల్, స్థానిక భాషను నేర్చుకొనుటలో కొంత సమయమును గడిపారు. 1916వ సంll లో ఆమె కుల్పహార్‌కు పంపించబడగా, అక్కడ స్త్రీల మధ్య ఆమె ఎంతో చురుకుగా పరిచర్యను జరిగించారు. ఆమె మరియు మరికొందరు స్త్రీలు కలిసి ప్రతిరోజూ స్థానిక మహిళలను వారి గృహములలో దర్శించి వారికి సువార్తను ప్రకటించారు. తదుపరి బినా అనే ప్రాంతములో అనేక సంవత్సరములు సేవ చేసిన లెనో, అక్కడ కూడా మహిళల మధ్య సువార్త సేవ చేయుటలో నిమగ్నులయ్యారు. అంతేకాకుండా అక్కడి బాలర మరియు బాలికల పాఠశాలలకు నిర్వహణా విధులను కూడా నెరవేర్చారు. తన చివరి నాలుగు సంవత్సరాల పరిచర్యను దామో ప్రాంతంలో జరిగించిన లెనో, అక్కడ విస్తృతమైన సువార్త సేవ మరియు విద్యా సంబంధ సేవలను అందించారు.
    1928వ సంll లో అమెరికాకు తిరిగి వెళ్ళిన ఆమె, అక్కడ వేదాంతశాస్త్రములో వివిధ పట్టాలను సాధించుటలో కొన్ని సంవత్సరాలు గడిపారు. మిషనరీ పరిచర్యకు తిరిగి వెళ్ళవలెనని ఆమె హృదయం ఎంతగానో ఆకాంక్షించిప్పటికీ ఆమె ఆరోగ్యం అందుకు సహకరించలేదు. కాబట్టి అమెరికాలోనే ఉండిపోయిన ఆమె, అక్కడ విద్యార్థులకు మరియు మహిళలకు బోధిస్తూ మరియు ప్రసంగిస్తూ నిర్విరామంగా పనిచేశారు. నేరస్థులైన బాలికల యెడల ఆమె ప్రత్యేకమైన భారమును కలిగియున్నారు. కాగా సువార్తను ప్రకటించి, బైబిలును బోధించుట ద్వారా వారిని నీతివంతమైన మార్గములో నిలబెట్టుటకు ఆమె ప్రయత్నించారు. అక్కడ నిత్య జీవమును కనుగొనుటకు ఆ బాలికలకు సహాయపడుటలో ఆమె సంతోషమును కనుగొన్నారు.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం: 

    ప్రియమైనవారలారా, మీరు మీ సంతోషమును ఎక్కడ కనుగొంటున్నారు?

    ప్రార్థన :

    "ప్రభువా, నేను మిషనరీల గాథలను చదివి వారి వలెనే పని చేయుటకు ప్రేరణ పొందునట్లు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"
    దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • Oct 1, 2021

    Lucile Ford | లూసిల్ ఫోర్డ్

     లూసిల్ ఫోర్డ్  | Lucile Ford


    • జననం: 12-05-1883
    • మహిమ ప్రవేశం: 25-05-1973
    • స్వస్థలం: నెబ్రాస్కా
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: భారతదేశం


    లూసిల్ జెనీవా ఫోర్డ్ ఒక భక్తిగల క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఫ్రెడ్రిక్ ఫోర్డ్ స్థానిక క్రైస్తవ సంఘములో ఆదివారపు బైబిలు పాఠశాల యొక్క నిర్వాహకులుగా (సండే స్కూల్ సూపరింటెండెంట్) ఉండేవారు. 1883వ సంll లో లూసిల్ జన్మించినప్పుడే ఆమె తల్లి మేరీ సలీనా ఆమెను దేవుని సేవకు సమర్పించారు. ఒకవైపు తన చదువును కొనసాగిస్తూనే, ఎప్పటికైనా పరదేశానికి మిషనరీగా వెళ్ళాలనే తన లక్ష్యము పై ఎల్లప్పుడూ ఆమె గురి ఉంచేవారు. అయితే, నెబ్రాస్కాలోని కాట్నర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో ఆమె తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. తత్ఫలితముగా ఆమె శారీరక స్థితి విదేశాలలో సేవ చేయుటకు తగిన స్థితిలో లేనిదిగా భావించారు. కావున ఆమె సెయింట్ లూయిస్‌లోని ఒక క్రైస్తవ ఆసుపత్రిలో పనిచేశారు.


    అటువంటి పరిస్థితులలో ఏ సగటు వ్యక్తి అయినా స్వదేశంలో మంచి జీతంతో కూడిన ఉద్యోగంలో స్థిరపడుటకు కోరుకుంటాడు. కానీ, లూసిల్ ఫోర్డ్ అటువంటి సగటు వ్యక్తి కాదు. తన ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే, ఆమె మిషనరీ శిక్షణ కొరకు ‘కాలేజ్ ఆఫ్ మిషన్స్’ అనే కళాశాలలో చేరారు. తదుపరి ‘యునైటెడ్ క్రిస్టియన్ మిషనరీ సొసైటీ’ తరపున భారతదేశంలో సేవ చేయుటకు ఆమెకు అవకాశం లభించింది. తద్వారా 1915వ సంll లో భారతదేశానికి చేరుకున్న ఆమె, వెంటనే తొంభై ఐదు మంది బాలికలకు వసతి కల్పించే మహోబా బాలికల అనాథాశ్రమము యొక్క నిర్వహణా బాధ్యతలను చేపట్టారు. నాలుగు సంవత్సరాలలో ఆ అనాథాశ్రమం దాదాపు 200 మంది బాలికలకు సంరక్షణ కల్పించేదిగా అభివృద్ధి చెందింది. ఆ అనాథాశ్రమం ఒక పెద్ద కుటుంబమైతే, లూసిల్ దానికి కరుణ, ప్రేమలతో నిండుకొనియున్న తల్లి అయ్యారు. అంతేకాకుండా, అక్కడి బాలికలు సరైన విద్యాభ్యాసమును మాత్రమే కాకుండా, ఆత్మీయపరమైన శిక్షణను పొందేలా చూశారు లూసిల్.


    తదుపరి ఒక సంవత్సరం పాటు హర్దాలో సేవ చేసిన లూసిల్, పిమ్మట కుల్‌పహార్‌కు వెళ్ళారు. మహోబాలో వలెనే తన అద్భుతమైన సేవలను కొనసాగిస్తూ, ఆమె కుల్‌పహార్‌లో మహిళల కొరకు ఏర్పరచబడిన ఒక ధార్మిక గృహము మరియు బాలికల కొరకు ఏర్పరచబడిన శిక్షణా కేంద్రము యొక్క బాధ్యతలను చేపట్టారు. తమ కాళ్లపై తాము నిలబడగలిగినప్పుడే మహిళలు గౌరవించబడతారని ఆమె విశ్వసించారు. ప్లేగు వ్యాధి వ్యాపిస్తున్న సమయంలో, ఆమె అనాథాశ్రమం ఆ పట్టణపు వందలాది మంది ప్రజలకు కులమత బేధాలు లేకుండా ఆశ్రయమిచ్చింది. మరణానికి కులంతో సంబంధం లేదని మరియు యేసు క్రీస్తు ప్రభువు కూడా కులంతో సంబంధం లేకుండా సమస్త మానవాళి కొరకు తన ప్రాణము పెట్టారని ఆ ప్రజలకు బోధించుటకు ఆమె ఆ అవకాశమును సద్వినియోగపరచుకున్నారు.


    1948వ సంll లో ఆమె పదవీ విరమణ పొందారు. అయినప్పటికీ, 1973వ సంll లో తాను మహిమనందు ప్రవేశించు వరకు కూడా కాలిఫోర్నియాలోని స్థానిక క్రైస్తవ సంఘము యొక్క కార్యకలాపాలలో చురుకుగా పాలుపంచుకుంటూ ప్రభువు సేవలో ముందుకు సాగిపోయారు లూసిల్ ఫోర్డ్.


     ప్రియమైనవారలారా, మంచి జీతంతో కూడిన ఉద్యోగములో సౌకర్యముగా ఉంటూ సేవ కొరకైన మీ పిలుపును మీరు మరిచిపోయారా? 


    "ప్రభువా, మిమ్మును సేవించాలనే అంతిమ లక్ష్యముపైనే ఎల్లప్పుడూ నా గురి నిలుపుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"  


    దేవునికే మహిమ కలుగునుగాక! 

  • WhatsApp
  • Sep 25, 2021

    Levi Parsons | లేవి పార్సన్స్

    Levi Parsons | లేవి పార్సన్స్


    • జననం: 18-07-1792
    • మహిమ ప్రవేశం: 10-02-1822
    • స్వస్థలం: మసాచుసెట్స్
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: పాలస్తీనా, ఆసియా మైనర్ మరియు ఈజిప్ట్

     సమూయేలు ప్రవక్త వలెనే లేవి పార్సన్స్‌ని కూడా అతని తల్లి జీవిత కాలమంతా దేవుని సేవ చేయుటకు సమర్పించారు. అతను క్రైస్తవ భక్తితో పెంచబడినప్పటికీ, ఒక వేషధారిగానే జీవించారు. అతను దేవుని వాక్యాన్ని చదివేవారు, దానికి భయపడేవారు కూడా. కానీ, వాక్యానుసారముగా తన జీవితమును మలుచుకొనలేకపోయారు. కాగా, అతను బాధాకరమైన అంతర్గత సంఘర్షణలతో నలిగిపోయారు. ఒకసారి అతను ఒక ఉజ్జీవ కూడికకు హాజరవ్వగా, అక్కడ దేవుడు అతనితో “ఇశ్రాయేలూ, ... నిన్ను నీవే నిర్మూలము చేసికొనుచున్నావు.” (హోషేయ 13:9) అనే వచనం ద్వారా మాట్లాడాడు. వెంటనే తన దుష్ట పాపస్వభావమును బట్టి వేదన చెందిన లేవి, విమోచన కొరకు మొఱ్ఱపెట్టారు. నమ్మకమైన దేవుడు అతనిని తన క్షమహస్తాలతో చేర్చుకున్నాడు.

     పట్టభద్రులైన తరువాత, 1817వ సంll లో అతను ఎవరూ వెళ్ళుటకు సాహసం చేయనటువంటి పాలస్తీనాలో సేవ చేయుటకు తనను తాను సమర్పించుకున్నారు. కాగా తన స్నేహితుడు ప్లినీ ఫిస్క్‌తో కలిసి అతను 1819వ సంll లో స్ముర్నాకు చేరుకున్నారు. ఒకప్పుడు యేసు క్రీస్తు ప్రభువే స్వయంగా లేఖను వ్రాసిన సంఘమును కలిగియున్న ఆ నగరమును చూసి అతను సంతోషముతో ఉప్పొంగిపోయారు. కానీ, అక్కడ క్రైస్తవ్యం కేవలం వేడుకలు మరియు ఆచారాలుగా దిగజారిపోయిన స్థితిని చూసినప్పుడు ఆ సంతోషం దుఃఖంగా మారింది. అబద్ధ ప్రవక్తలు క్రైస్తవ సంఘములను నడిపించుట చూచి అతను ఆత్మలో కలత చెందారు. అప్పుడు పార్సన్స్ అక్కడి పరిస్థితులను సరిచేయటమో లేదా మరణమో అని నిశ్చయించుకున్నారు. మహమ్మదీయులు మరియు కాథలిక్కులు ఇతర క్రైస్తవుల పట్ల కలిగియున్న ద్వేషమును మరియు వారి నుండి పొంచియున్న ప్రాణహానిని విస్మరించి, అతను పునరుత్థానుడై లేచిన క్రీస్తును ధైర్యముగా ప్రకటించారు. అంతేకాకుండా అతను ఆత్మీయముగా అంధులుగా ఉన్న క్రైస్తవ నాయకులను దర్శించి, క్రైస్తవ సంఘములో వారు చేస్తున్న తప్పులను వారు అంగీకరించేలా చేశారు. చాలామంది అతనిని అపహసించినప్పటికీ, తన కర్తవ్యం మీద అతను దృష్టి సారించారే గానీ, దాని ఫలితం పై కాదు. 

     ప్లినీ ఫిస్క్‌తో కలిసి అతను బైబిలులోని ప్రకటన గ్రంథములో పేర్కొనబడిన ఏడు సంఘములకు వెళ్ళారు. అతను ఈజిప్టులో ఒక మిషన్ స్థావరమును (మిషన్ స్టేషన్) కూడా స్థాపించారు. 1820వ సంll ఆఖరిలో అతను యెరూషలేమును సందర్శించి, ఒక రోజున అక్కడ మిషన్ స్థావరమును ఏర్పాటు చేయాలనే నిరీక్షణతో కరపత్రములను మరియు బైబిళ్ళను పంచిపెట్టారు. ఆ పవిత్ర భూమిలో జరిగిన పరిచర్యను గురించిన అతని నివేదికల ద్వారా ప్రోత్సహించబడిన అనేక మంది అమెరికన్లు తరువాత పాలస్తీనాలో సేవచేయుటకు వారి సిలువను ఎత్తుకొని వెళ్ళారు.

     1821వ సంll లో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడిన లేవి పార్సన్స్, మరుసటి సంవత్సరం 29 సంll ల లేత ప్రాయములోనే పరలోకములో తన ప్రభువును చేరుకొన్నారు. 

    ప్రియమైనవారలారా, మీరు ఆచారాలకు వ్యతిరేకంగా నిలబడి క్రైస్తవ సంఘములో దైవిక క్రమమును పునరుద్ధరిస్తున్నారా?

    ప్రభువా, మీ సంఘములో ఉజ్జీవమును తీసుకువచ్చే సాధనముగా నన్ను వాడుకొనుము. ఆమేన్!

    దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • Aug 2, 2021

    Lulu E. Garton | లులు ఇ. గార్టన్

     లులు ఇ. గార్టన్  | Lulu E. Garton 

    • జననం: - 
    • మహిమ ప్రవేశం: -
    • స్వదేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: భారతదేశం

    అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉన్న ‘బ్రాడ్‌వే క్రిస్టియన్ చర్చి’ (‘డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్’) ద్వారా భారతదేశానికి వచ్చి, 1915-21వ సంll ల మధ్య కాలంలో సేవ చేసిన మిషనరీ లులు ఇ. గార్టన్. అలెగ్జాండర్ హామిల్టన్ మరియు మేరీ ఫ్రాన్సిస్ అనే క్రైస్తవ దంపతులకు జన్మించిన లులు, క్రైస్తవ విధానంలో దేవుని యందు భయభక్తులు కలిగి పెరిగారు. చిన్నతనంలో పర్వతారోహణ పట్ల అభిరుచిని కలిగియున్న ఆమె, దేవునితో తన అనుభవమును ఇలా వివరించేవారు, “కొలరాడోలోని సిల్వర్ ప్లూమ్ అనే చిన్న గనుల క్షేత్రంలో, డెన్వర్ ప్రాంతం కంటే ఒక మైలు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న కొండ ప్రాంతము యొక్క అరుదైన వాతావరణంలో మొట్టమొదటిగా నేను దేవుని గాలిని శ్వాసించాను."

     

    ఆమె స్వభావం మరియు ఇంటి దగ్గర ఆమె పొందిన ఆత్మీయ శిక్షణ వలన ఆమె ఒక లోతైన ఆధ్యాత్మికత కలిగిన వక్తిగా ఎదిగారు. కాగా పదమూడేళ్ల వయసులోనే మిషనరీ అవ్వాలని నిర్ణయించుకున్న ఆమె, ఎంతో అవసరతలో ఉన్న ప్రదేశంగా భారతదేశాన్ని అందుకొరకై ఎంచుకున్నారు. ఆమె కళాశాల చదువును ఆరంభించవలసిన సమయంలో ఎటువంటి ధనసహాయం లభించలేదు. అందునుబట్టి ఆమె వారి పాదిరితో చర్చించి, దాని గురించి ప్రార్థించారు. తత్ఫలితముగా విద్యా ఉపకారవేతనం (స్కాలర్‌షిప్) ఆమెకు లభించగా 1907వ సంll లో తన కళాశాల చదువును పూర్తిచేసుకున్నారు లులు. తదుపరి ఆమె అదనపు సమయమును కేటాయించి మిస్సోరీ విశ్వవిద్యాలయంలో ఒక ప్రత్యేక అధ్యయనమును కొనసాగించారు. అంతేకాకుండా ఆమె కెంటకీలోని హజెల్ గ్రీన్‌లో ఉన్న ‘హోమ్ మిషన్స్ మౌంటైన్ స్కూలు’ లో బోధించారు, నర్సుగా శిక్షణను పొందారు మరియు మూడు సంవత్సరాల పాటు ప్రైవేట్ రంగంలో నర్సుగా పనిచేశారు. మిషనరీగా భారతదేశానికి వెళ్ళుటకు ఆమె చేస్తున్న సన్నాహాలు ‘కాలేజ్ ఆఫ్ మిషన్స్‌’ లో పొందిన శిక్షణతో ముగిసాయి. చివరికి 1915వ సంll ఆగష్టు మాసంలో భారతదేశానికి పయనమయ్యారు లులు.


    భారతదేశానికి చేరుకున్న ఆమె, అక్కడ ఆరు సంవత్సరాల పాటు సంతోషంగా పరిచర్య జరిగించారు. ఆమె సేవ చేసిన ప్రదేశాలలో హర్దా, రథ్, బినా, ఝాన్సీ మరియు కుల్పహార్ ఉన్నాయి. దేవుని సేవ చేయుటకు ఆమె తన దేహమును ఎంతో కఠినముగా శ్రమపెట్టారు. కాగా బాగా దెబ్బతిన్న ఆమె ఆరోగ్యం దేవుని సేవలో ముందుకు సాగుటకు ఆమెకు సహకరించలేదు. 1921వ సంll లో ఆమె కొంతకాలం తన స్వదేశానికి తిరిగివెళ్ళగా, అక్కడి నుండి తిరిగి రావడం ఆమెకు అసాధ్యమయ్యింది. అయితే అలుపెరుగని దేవుని పరిచారకులను దేవుని సేవ చేయకుండా ఏదీ కూడా నిరోధించలేదు. కాగా ఆమె దక్షిణ కాలిఫోర్నియాలోని మహిళా మిషనరీ సంస్థల కార్యదర్శిగా ఎనిమిది సంవత్సరాల పాటు సేవలందించారు. తదుపరి వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిని చూసుకోవడానికి తన సమయాన్ని వెచ్చించారు. తన మిగిలిన జీవితమును కాలిఫోర్నియాలో గడిపిన లులు గార్టన్, చివరి వరకు కూడా ఎప్పటిలాగే క్రైస్తవ సంఘము యొక్క మిషనరీ కార్యకలాపాలలో ఆసక్తిని కనుబరచినవారై వాటిలో చురుకుగా పాల్గొనేవారు.


    🚸 ప్రియమైనవారలారా, అలుపెరుగని హృదయముతో దేవుని సేవ చేయకుండా ఏది మిమ్ములను అడ్డుకుంటున్నది? 🚸

    🛐 "ప్రభువా, అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకై అలుపెరుగక సేవ చేయు మనస్సును నాకు దయచేయుము. ఆమేన్!" 🛐

    🙏🙏 దేవునికే మహిమ కలుగునుగాక! 🙏🙏

  • WhatsApp