విలియం బక్ బాగ్బీ | William Buck Bagby
- జననం: 05-011-1855
- మహిమ ప్రవేశం: 05-08-1939
- స్వస్థలం: కొరియెల్ కౌంటీ
- దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
- దర్శన స్థలము: బ్రెజిల్
1884వ సంll లో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో ఒక మిషనరీ దంపతులు కాథలిక్కుల నుండి తీవ్రమైన వ్యతిరేకత నెలకొనియున్న పరిస్థితుల మధ్య దేవుని పరిచర్యను ప్రారంభించారు. ఆ మిషనరీలకు అది ఎంతో నిరాశాజనకమైన ఆరంభముగా ఉంది. ఏలయనగా వారు నిర్వహించే ఆరాధనా కూడికలకు ఎవరూ వచ్చేవారుకాదు. కావున వారు ఆలయమునకు వెలుపల వాయిద్యములను వాయించుచూ పాడటం ప్రారంభించారు. అది చూచిన కొంతమంది ఆసక్తిగలవారు అక్కడ గుమిగూడడం ప్రారంభించినప్పుడు కొంతమంది గుంపుగా వచ్చి దాడిచేసి, అక్కడి సామగ్రిని ధ్వంసం చేశారు. వారిలో ఒకరు బోధకునిపై రాయి విసరగా అతని తలకు గాయమై స్పృహ తప్పి పడిపోయారు. కానీ కొన్ని నిమిషముల తరువాత అతనికి స్పృహ వచ్చినప్పుడు అతను తిరిగి లేచి నిలబడి బోధించడం కొనసాగించారు. ఆ బోధకుడు మరెవరో కాదు, బ్రెజిల్‌లో ప్రారంభక బాప్తిస్టు మిషనరీలలో ఒకరిగాను మార్గదర్శకులుగాను నిలిచిన విలియం బక్ బాగ్బీ.
వాకో విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన విలియం, పిమ్మట ఒక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. యవ్వనదశలో ఉన్నప్పుడు దక్షిణ అమెరికాలో మిషనరీల కొరకు ఉన్న అవసరతను గురించి వినిన అతనిలో అందుకొరకైన భారం కలిగింది. అతను అన్నే లూథర్‌ను వివాహం చేసుకున్నప్పుడు దక్షిణ అమెరికాలో మిషనరీ సేవ పట్ల అతను కలిగియున్న ఆసక్తి కార్యరూపం దాల్చుటకు పునాదులు పడ్డాయి. అన్నే కూడా మిషనరీ పరిచర్య పట్ల సమర్పణను కలిగియున్నవారు. మరి ముఖ్యముగా దక్షిణ అమెరికాలో సేవ పట్ల అతని వలెనే ఆసక్తిని కలిగియున్నారు. కాగా, మరికొంత మంది ప్రోత్సాహంతో 1880వ సంll లో రియో డి జనీరోలో అడుగుపెట్టారు బాగ్బీ దంపతులు. తరువాత అక్కడ ప్రభుత్వాన్ని నడపడంలో కాథలిక్ సంఘం పాలుపంచుకుంది. అక్కడి కాథలిక్కులు ప్రొటెస్టెంట్ క్రైస్తవుల పట్ల అసహనమును కలిగియుండేవారు. కాగా, పరిచర్య యొక్క ప్రారంభ దశలలో బాగ్బీ అక్కడ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అతను అనేకమార్లు శారీరకముగా దాడి చేయబడ్డారు కూడా. అయినప్పటికీ, ధైర్యవంతుడైన ఈ మిషనరీ కష్టాలు శ్రమల మధ్యలో మరింతగా బలమొందారు. త్వరలోనే, రెండు సంవత్సరాల కాలంలో రియోలో రెండు బాప్తిస్టు సంఘములు ఏర్పరచబడ్డాయి.
బాగ్బీ తన పరిచర్యను రియో సరిహద్దులను దాటి విస్తరింపచేశారు. అతను బ్రెజిల్ దేశమంతటా పర్యటించి, అన్ని ప్రధాన నగరాలలో క్రైస్తవ సంఘములను స్థాపించారు. బ్రెజిల్‌లో ప్రతిచోటా అతను స్థాపించిన సంఘములు, నిర్మించిన పాఠశాలలు, క్రీస్తు కొరకు అతను సంపాదించిన గొప్ప క్రైస్తవ నాయకులు మరియు వేలాది మంది విశ్వాసుల రూపంలో బాగ్బీ యొక్క పరిచర్య ప్రభావం కనిపిస్తుంది. అతని జీవిత భాగస్వామియైన అన్నే లూథర్ పరిచర్యలో కూడా అతనికి సరిసమానమైన భాగస్వామిగా ఉన్నారు. దేవుని ఆశీర్వాదముతో వారికి తొమ్మిది మంది సంతానము కలుగగా, వారిలో ఐదుగురు దక్షిణ అమెరికాకు మిషనరీలుగా తమ జీవితములను సమర్పించుకున్నారు.
58 సంవత్సరాల పాటు ఎంతో తీవ్రముగా పరిచర్య జరిగించిన పిమ్మట, తన సేవా ఫలమైన 694 సంఘములను మరియు 53,000 మంది విశ్వాసులను విడిచిపెట్టి 1934వ సంll లో పరమందు తన ప్రభువును చేరుకొన ఇహలోకమును విడిచి వెళ్ళారు విలియం బక్ బాగ్బీ.
🚸 *ప్రియమైనవారలారా, కష్టాలు, శ్రమల మధ్యలో మరింతగా దేవునికి సేవ చేయుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?* 🚸
🛐 *"ప్రభువా, అననుకూల పరిస్థితుల దాడులకు నేను గురై పడిపోయిన ప్రతిసారీ తిరిగి మీ కొరకు నిలబడగలుగునట్లు నన్ను లేవనెత్తుము. ఆమేన్!"* 🛐
🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏
No comments:
Post a Comment