థామస్ మేహ్యూ సీనియర్ | Thomas Mayhew Sr
- జననం: 31-03-1593
- మహిమ ప్రవేశం: 25-03-1682
- స్వస్థలం: టిస్‌బరీ
- దేశం: యునైటెడ్ కింగ్‌డమ్
- దర్శన స్థలము: మార్తాస్ వైన్‌యార్డ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
థామస్ మేహ్యూ సీనియర్ మిషనరీ వీరుల జాబితాలో చేర్చబడవలసినంత ధైర్యవంతుడు. డెబ్భై ఏళ్ళు పై బడితే సేవ చేయవలసిన తమ సమయం ముగిసిందని కొంతమంది తలంచుతారు. అయితే థామస్ మేహ్యూ అలా కాదు. దాదాపు డెబ్భై ఏళ్ళ వయస్సులో సేవను ప్రారంభించిన అతని మిషనరీ పరిచర్య ప్రారంభమునకు వెనుక ఎంతో ఆసక్తికరమైన నేపథ్యం ఉంది.
1631వ సంll లో అమెరికాకు వెళ్ళి స్థిరపడిన థామస్ సీనియర్, మసాచుసెట్స్‌లో వ్యాపారిగాను మరియు భూస్వామిగాను ఉన్నారు. త్వరలోనే అతను ఎలిజబెత్ దీవులలో భాగమైన మార్తాస్ వైన్‌యార్డుకు గవర్నర్ అయ్యారు. అతని అధికారంలో ఆ దీవులు భౌతిక విషయములలోను మరియు ఆత్మీయపరంగా కూడా అభివృద్ధిని సంతరించుకున్నాయి. థామస్ సీనియర్ అక్కడి వ్యాపార కార్యకలాపాలలో నిమగ్నమవ్వగా, అతని కుమారుడు థామస్ జూనియర్ ఆ దీవులలో నివసిస్తున్న ఆదివాసుల రక్షణ గురించిన చింతను కలిగియుండెడివారు. కాగా అతను స్థానిక తెగల మధ్య ఒక సువార్త మిషన్‌ను ప్రారంభించారు మరియు ఒక చిన్న ఆంగ్లికన్ సంఘమును స్థాపించారు. ఆ మిషన్ వృద్ధి చెందగా త్వరలోనే అక్కడ రెండు వందల ఎనభై రెండు మంది విశ్వాసులు సమకూర్చబడ్డారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు పరిచర్య చేసిన తరువాత థామస్ జూనియర్ మిషనరీ సేవ కొరకు నిధులను సేకరించుటకై ఇంగ్లాండుకు పయనమయ్యారు. అయితే అతను ప్రయాణిస్తున్న ఓడ సముద్రములో మునిగిపోగా, థామస్ జూనియర్ కూడా దానితోనే కనుమరుగయ్యారు.
తన కుమారుడి మరణంతో తీవ్ర మనస్థాపానికి గురైన థామస్ సీనియర్, తన కుమారుడు వదిలిపెట్టిన పరిచర్యను కొనసాగించగల వ్యక్తులను కనుగొనుట కొరకు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఏ క్రైస్తవ పరిచారకునికి కూడా అక్కడి స్థానిక భాష తెలియలేదు సరికదా అటువంటి క్లిష్ట పరిస్థితులలోకి అడుగుపెట్టుటకు ఎవరూ ఇష్టపడలేదు. కాగా, దాదాపు డెబ్భై ఏళ్ళ వయస్సున్న థామస్ సీనియర్ తానే తన కుమారుడి స్థానంలో నిలబడుటకు నిశ్చయించుకున్నారు. కావున అతను స్థానిక భాషను నేర్చుకోవడం ప్రారంభించారు. అతను ప్రతి వారం పలు తోట ప్రాంతాలలో బోధించడం ప్రారంభించారు. స్థానిక తెగల క్రైస్తవ సంఘములను చేరుకొనుటకు కొన్నిసార్లు అడవి ప్రాంతము గుండా ఇరవై మైళ్ళ దూరం కాలినడకన వెళ్ళేవారు థామస్. తరువాతి ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఎంతో మంది జీవితములను తాకిన అతను, అనేక మంది ఆదివాసులను క్రీస్తు వద్దకు నడిపించారు. అతను పరిచర్య జరిగించిన కాలంలో దాదాపు 3000 ఆత్మలు క్రైస్తవ సంఘములో చేర్చబడి దేవుని రాజ్యము విస్తరించింది.
తన తొంభై మూడేళ్ళ మంచి వృద్ధాప్యమందు మహిమలోనికి పిలవబడే వరకు కూడా అలయక తన మిషనరీ సేవను నిరంతరాయంగా కొనసాగించారు థామస్ మేహ్యూ సీనియర్.
🚸 *ప్రియమైనవారలారా, ప్రభువు సేవ చేయడంలో విఫలమైనందుకు మీరు ఏమి సాకులను చూపిస్తున్నారు?* 🚸
*"ప్రభువా, నాకు ఎంత వయస్సు పైబడినప్పటికీ నా జీవితమంతా కూడా నేను మీ సేవ చేయుటకే అర్పిస్తున్నాను. ఆమేన్!"*
🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏
No comments:
Post a Comment