అథనాసియస్ గారి జీవిత చరిత్ర
- జననం : ~ క్రీ.శ. 293
- మరణం : క్రీ.శ. 373
- స్వస్థలం : అలెగ్జాండ్రియా
- దేశం : ఈజిప్ట్
- దర్శన స్థలము : ఈజిప్ట్
అరియానిజం. తండ్రియైన దేవుని ద్వారా క్రీస్తుకు దైవత్వం ఇవ్వబడినదే గానీ, ఆయన తండ్రితో సరిసమానుడు కాడు, క్రీస్తు యొక్క సారూప్యం తండ్రియైన దేవుని వంటిది కాదు మొదలగు తప్పుడు సిద్ధాంతములతో కూడిన బోధలతో ప్రారంభ శతాబ్దములలో క్రైస్తవ సంఘములోకి చొరబడి సంఘమును సత్యము నుండి మళ్ళించి తప్పు త్రోవ పట్టించుటకు ప్రయత్నించిన ఒక తప్పుడు బోధన. 4 వ శతాబ్దంలో అరియానిజానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో క్రైస్తవ మూల సిద్దాంతములను సమర్థిస్తూ వాటిని పరిరక్షించుటకు నిలబడినవారిలో ప్రధానమైనవారే ఈ అథనాసియస్. అతను అలెగ్జాండ్రియాలో తత్వ మరియు వేదాంతశాస్త్రములను అభ్యసించారు. అప్పటి అలెగ్జాండ్రియా బిషప్పు అయిన అలెగ్జాండర్ మరణం తరువాత, అథనాసియస్ అలెగ్జాండ్రియా యొక్క బిషప్పుగా నియమించబడ్డారు. క్రీస్తు యొక్క దైవత్వమును గురించిన సిద్ధాంతమును సమర్థించినందుకుగాను నలుగురు రోమా సామ్రాజ్య చక్రవర్తులచే ఐదుసార్లు బహిష్కరించబడ్డారు అథనాసియస్. కాగా అతను అలెగ్జాండ్రియా యొక్క బిషప్పుగా సేవలందించిన నలభైయైదు సంవత్సరాలలో పదిహేడు సంవత్సరాలు బహిష్కరణలోనే గడిపారు.
అరియానిజం ఆవిర్భావానికి కారకులైన అరియస్‌కు వ్యతిరేకంగా క్రీస్తు యొక్క సంపూర్ణ దైవత్వమును వేదాంతపరముగా సమర్థిస్తూ అథనాసియస్ నిలబడడంతో అది ప్రజలలో క్రైస్తవ విశ్వాసం పెంపొందించబడుటకు సహాయపడింది. అరియానిజానికి వ్యతిరేకంగా సంకల్పించిన ఈ పోరాటంలో విజయం సులభంగా లభిస్తుందని అథనాసియస్ ప్రారంభంలో భావించినప్పటికీ, పరిస్థితి బహు క్లిష్టమైనదిగా నిర్ధారితమైంది. తూరు పట్టణ ఆలోచన సభ (కౌన్సిల్ ఆఫ్ తైర్) వివిధ కారణాల వలన పిలువబడింది మరియు కాన్‌స్టాంటైన్ చక్రవర్తి అథనాసియస్‌ను ఉత్తర గౌల్‌కు బహిష్కరించాడు. అపొస్తలుడైన పౌలు జీవితమును జ్ఞప్తికి తీసుకువచ్చే అథనాసియస్ యొక్క ప్రయాణాలు మరియు అతను ఎదుర్కొనిన బహిష్కరణలలో ఈ బహిష్కరణ మొదటిది.
కాన్‌స్టాంటైన్ మరణం తరువాత అతని కుమారుడు అథనాసియస్‌ను తిరిగి బిషప్పుగా నియమించాడు. అయితే ఇది కేవలం ఒక సంవత్సరం మాత్రమే నిలిచింది. ఏలయనగా అరియానిజంను సమర్ధించే బిషప్పుల కూటమి చేత అథనాసియస్ తిరిగి పదవి నుండి తొలగింపబడ్డారు. బహిష్కరణలో ఉన్నప్పుడు అతను రచనలను చేస్తూ తన సమయమును గడిపారు. అతను వ్రాసిన రచనలలో అధిక భాగం క్రైస్తవ సనాతన లేదా మూల సిద్ధాంతములను సమర్థించేవిగా ఉన్నాయి. చివరిగా అతను తిరిగి అలెగ్జాండ్రియాకు వచ్చినప్పుడు శ్రమదినములు మరియు ఈస్టర్ వంటి ముఖ్యమైన పండుగల తేదీలను నిర్ణయించుటకు బిషప్పుగా తన పరిధిలో ఉన్న క్రైస్తవ సంఘములకు లేఖలు వ్రాశారు. ఈ లేఖల ద్వారా క్రొత్త నిబంధనలో ఉండవలసిన పుస్తకములని తాను ఏ పుస్తకములను విశ్వసిస్తున్నారో అది కూడా అతను తెలియచేశారు. మతపరమైన సిద్ధాంతములను సమర్ధిస్తూ, వాటిని నిరూపిస్తూ చేసే రచనలైన అపోలొజెటిక్స్ రచనలకు సంబంధించి రెండు భాగాల రచనలను కూడా అతను ప్రచురించారు. అవేమనగా "ఎగైనెస్ట్ ది హీథన్" (అన్యజనులకు వ్యతిరేకముగా) మరియు "ది ఇంకార్నేషన్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్" (దేవుని వాక్యము యొక్క శరీరధారణ). అతని రచనలు అరియానిజం యొక్క ప్రతి అంశాన్ని వ్యతిరేకించేవిగా ఉన్నాయి.
క్రైస్తవ విశ్వాసమును గురించి మరియు సంఘము కలిగియున్న స్వాతంత్య్రమును గురించి తాను కలిగియున్న అవగాహనను బట్టి విశ్వసించినదానిని పరిరక్షించుటకు అథనాసియస్ తన సంపూర్ణ శక్తిని ఉపయోగించి అలసిపోక చేసిన పోరాటం క్రైస్తవ సంఘ చరిత్రలో అతనికి ప్రముఖ స్థానాన్ని సంపాదించింది.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, మీ విశ్వాసమునకు నమ్మకముగా నిలిచియుండవలెననే పిలుపుకు మీరు ఏ విధముగా స్పందిస్తున్నారు?
ప్రార్థన : "ప్రభువా, అధిగమించుటకు అసాధ్యమనిపించే వ్యతిరేకతను ఎదుర్కొనే సమయాలలో కూడా నా విశ్వాసంలో స్థిరముగా నిలబడుటకు నాకు మీ కృపను అనుగ్రహించుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !
ప్రార్థన :
No comments:
Post a Comment